ధర్మాన కూడా కావూరి రూటే
posted on Feb 21, 2013 @ 6:13PM
సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ, వాటి ప్రభావం మాత్రం రాజకీయ నాయకుల మీద బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంత కాలం దిక్కార స్వరం వినిపిస్తూ, పార్టీని విమర్శిస్తున్న నేతల గొంతుల్లోంచి, ఇప్పుడు పార్టీకి అనుకూలమయిన మాటలు వినిపిస్తున్నాయి. తమకు పదవులు వెంట్రుక ముక్కతో సమానం అంటూ, రాజీనామాలు విసిరికొట్టిన వారే ఇప్పుడు వాటిని ఆమోదించవద్దని పార్టీ కాళ్ళు పట్టుకొని మరీ వేడుకొంటున్నారు. ఇంత కాలం రాజీనామాల పేరుతో, తమ బాధ్యతల నుండి తప్పించుకు తిరుగుతూ జీత భత్యాలు మాత్రం బహు చక్కగా స్వీకరించిన వారు మళ్ళీ సచివాలయాన్ని వెతుకొనివస్తున్నారు.
ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకొని, పార్లమెంటు సమావేశాలకు హాజరు కాగ, ఇక్కడ రాష్ట్రంలో రెవెన్యు మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు కూడా ఈరోజే సచివాలయంలో తన విధులకు హాజరవడం కాకతాళీయంగా జరిగింది.
బహుశః రాహుల్ గాంధీ యువమంత్రమే వారిని భయపెట్టి విధులకు హాజరయ్యేలా చేసింది అని చెప్పవచ్చును. క్రిందటి నెలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణాపై తీవ్రంగా కసరత్తు చేస్తున్న తరుణంలో, రాజీనామాలు చేస్తామని బెదిరించిన కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకి “పార్టీలో ఉంటే ఉండండి పోతే పొండి, మీరు పోతే కొత్తవారితో పార్టీని ముందుకు తీసుకుపోతాము,” అని గట్టిగా చెప్పడం కూడా అనేక మంది నేతలకు కనువిప్పు కలిగించిందని చెప్పవచ్చును. కాంగ్రెస్ సంస్కృతికి అలవాటుపడిన ప్రాణాలు వేరే చోట ఇమడలేవనే సంగతి, సదరు నేతలే కాక, పార్టీ అధిష్టానానికి కూడా అర్ధం అయినందువల్లే, కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు కనబడుతున్నాయి.