పేలుళ్లు: హోం మంత్రి పర్యటన ముగిసిందలా..
posted on Feb 22, 2013 @ 1:03PM
నిన్న హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరిగిన వెంటనే, ఇదివరకెన్నడు చూడని విధంగా, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, అయన అనుచర మంత్రి ఆర్.కె.సింగ్, కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చాల మంది వచ్చి హైదరాబాదులో వాలిపోయారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నపటికీ, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే రావడం విశేషమే అని చెప్పాలి.
ఇదివరకు కూడా హైదరాబాదులో అనేక సంఘటనలు జరిగినప్పటికీ, డిల్లీ నుండే ఖండనలు, సంతాపాలు ప్రకటించే ఆ ఆనవాయితీని కాదని, ఇంత హడావుడిగా రాత్రికి రాత్రి కేంద్ర హోం మంత్రి షిండే హైదరాబాద్ చేరుకోవడమే కాక, దుర్ఘటన జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించిన తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులను కూడా ఆయన పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున తన వద్ద ప్రత్యేక సమాచారం ఏమి లేదని, ఏ సంగతయినా ప్రాధమిక విచారణ ముగిసిన తరువాతనే చెప్పగలనని అన్నారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న వివరాలను, తానూ స్వయంగా చూసి తెలుసుకొన్న విషయాలను, ఈ రోజు పార్లమెంటులో సభ్యులకు తెలియజేస్తానని ఆయన అన్నారు.
డిల్లీ నుండి హైదరాబాదుకి బయలుదేరేముందు “ఇటువంటి ఘటనలు జరుగవచ్చునని కేంద్ర ఇంటలిజెన్స్ నివేదికలను రాష్ట్రానికి రెండు రోజుల ముందే అందజేశామని” చెప్పిన ఆయన, ఇక్కడకి వచ్చాక మాట మార్చుతూ “ఇంటలిజెన్స్ నివేదికలను ప్రత్యేకంగా మన రాష్ట్రానికే కాక మరికొన్నిఇతర రాష్ట్రాలకు కూడా పంపామని, అందులో హైదరాబాదులో ఇటువంటి ఘటన చోటు చేసుకోవచ్చునని తామేమి ప్రత్యేకంగా హెచ్చరించలేదని అన్నారు. పత్రిక సమావేశం ముగియగానే, ఆయన మళ్ళీ డిల్లీ వెళ్ళిపోయారు.
ఆయన మాటలను బట్టి అర్ధం అవుతున్న విషయం ఏమిటంటే, ఈ రోజు నుండి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలలో ఎలాగు ఈ సంఘటనపై ప్రతిపక్షాలు నిలదీస్తాయి కనుక, తానూ స్వయంగా హైదరాబాద్ వెళ్లి రావడం ద్వారా, తాము ఈ సంఘటనను ఉదాసీనంగా తీసుకోలేదని నిరూపించుకోవడం కోసమే ఆయన వచ్చినట్లున్నారు. ఇప్పటికే ‘అగస్టా హెలికాప్టర్ల కుంభకోణాలను' నిలదీసేందుకు సిద్దంగా ఉన్న ప్రతిపక్షాలకు, ఇప్పుడు ఈ బాంబు ఘటన కూడా మరో కొత్త ఆయుధం అందించడంతో, వారి దాడినుండి తమ యు.పీ.యే. ప్రభుత్వాన్ని రక్షించుకోవాలంటే, సభలో వారికి దీటుగా జవాబు చెప్పే అర్హత ముందు సంపాదించుకోవాలి, కనుక, తానూ వచ్చి చేసేదేమీ లేకపోయినా ఆయన హైదరాబాదులో వాలిపోయి విషయ సేకరణ చేసారు. కేంద్ర హోం మంత్రిగా ఆయన స్వయంగా ఈ సంఘటనను పరిశీలించేందుకు హైదరాబాదు వచ్చారు గనుక, కేంద్రం ఈ విషయంలో చాల సీరియస్ గా ఉన్నట్లు ఉభయ సభలలో సభ్యుల ముందు దైర్యంగా నిలబడి మాట్లడవచ్చును. ఇక, ఈ కేసు విషయం రాష్ట్ర పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాలు ఎలాగు చూసుకొంటాయి గనుక, ఆ సంఘటన గురించి ప్రత్యేకంగా ఆయన ఆలోచించవలసింది ఏమి లేదు.