మహిళలూ మీరు క్రికెట్ మహరాణులు!
ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పగూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్ అభిమానులకు.. గురువారం (అక్టోబర్ 30) జరిగిన మ్యాచ్ అందుకు పూర్తి భిన్నమైన సీన్ చూశారు గురువారం రాత్రి ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య విమెన్స్ వరల్ట్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇప్పటికే 7 సార్లు ప్రపంచ కప్ గెలిచిన బలమైన ఆసీస్ జట్టు అంత సులభంగా చేజింగ్ టీమ్ కి విజయాన్ని కట్టబెడుతుందని ఎవరిలోనూ ఏ కోశానా నమ్మకం లేదు. అటువంటి పరిస్థితుల్లో భారత మహిళలు అద్భుతం సృష్టించారు.
ఎన్నడూ లేనివిధంగా మూడో స్థానంలో ఆడాలని మ్యాచ్ కు అయిదు నిమిషాలకు ముందు టీమ్ యాజమాన్యం చెబితే మైదానంలోకి వచ్చిన ముంబై ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్... కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి గట్టి పునాది వేయడమే కాకుండా కెప్టెన్ అవుట్ అయిన తర్వాత ఆమె చేయవలసిన స్కోర్ ను కూడా తానే చేస్తానని, చివరి బంతి వరకు నిలిచి పోరాడతానన్న సంకల్ప బలంతో ముందుకు సాగింది. 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టే క్రమంలో ఎన్నిసార్లు ఆమె అలసిపోయిందో.. కొండలా కనబడుతున్న స్కోరు వణికిస్తున్న క్షణాల్లో కూడా నిలబడు, గట్టిగా నిలబడు నీకు దేవుడు సహాయం చేస్తాడు అంటూ తనకు తాను చెప్పుకుని స్ఫూర్తి పొందిందో మహిళా క్రికెట్ చరిత్రలో, వన్ డే ప్రపంచ కప్ చరిత్రలో కనివిని ఎరుగని చిరస్మరణీయ విజయాన్ని ఇండియా జట్టుకు కట్టబెట్టిన క్షణాల్లో సింహనాదమూ, పెనురోదనా కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి నిన్న కళ్లకు కట్టింది.
తోటి బ్యాటర్ అమన్ జీత్ విజయానికి అవసరమైన చివరి ఫోర్ సాధించాక స్టేడియంలో జేమీమా రోడ్రిగ్స్ కుప్పగూలి విలపించడం, స్టేడియంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతిమంథానా, సహచర క్రీడాకారిణులు కోచ్‌ని, సహాయక సిబ్బందిని గట్టిగా కౌగలించుకుంటూ రోదించడం. ఒక విన్నింగ్ జట్టు శక్తినంతా కూడదీసుకని అద్బుతాన్ని సృష్టించామన్న భావనతో ఆనంద భాష్పాలను ఒలికించడం... తమ కళ్ల ముందు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే భారత మహిళల జట్టు విజయాన్ని సాధించడం చూసి అంత మేటి క్రీడాకారులున్న ఆసీస్ మహిళా జట్టు షాకై పోయి చూస్తూ కన్నీరు కార్చింది.
మైదానంలోని ఇరు జట్లూ విజయ పరాజయాలను పక్కనబెట్టి విలపిస్తుంటే స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు మోదమో ఖేదమో తెలీని స్థితిలో తాము సైతం కన్నీళ్లు పెట్టడం.. నభూతో నభవిష్యతి అనడం అతిశయోక్తి కాదేమో.
గత వరల్ట్ కప్ లో జట్టులో స్థానం కోల్పోయి షాక్ కి గురైన జేమీమా.. ఈ సారి వరల్డ్ కప్ జట్టుకు ఎంపికై కూడా చివరి 11 మంది జట్టులో ఆడతానా లేనా.. అనే అందోళతోనే గడిపిన జెమీమా భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని హీరో చితమైన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా బైబిల్ లోని నువ్వు గట్టిగా నిలబడు జీసస్ నీకు సాయం చేస్తాడు అన్న మాటలతో తనలో తనే స్ఫూర్తి పింపుకుంటూ ఆమె సాగించిన పోరాటం, అనితర సాధ్యమన్న బ్యాటింగ్ ప్రదర్శన జెనీమా జన్మ ధన్యం అని చెప్పవచ్చు.
ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ రికార్డు ఛేజింగ్ స్కోర్‌ను బద్దలు గొట్టిన ఘటన కావచ్చు. అంతకుమించి 338 పరుగుల భారీ స్కోరును చూసి ఓటమి తప్పదనుకుంటున్న అభిమానులు, ప్రేక్షకుల హృదయాలు ఉప్పొంగేలా మన మహిళా జట్టు చేసిన విజయనాదం. కీలక మ్యాచ్ లలో వెనుకంజ వేస్తూ తలదించుకుంటున్న క్షణాలను పక్కనబెట్టి.. ఇది నేను సాధించిన ఫిప్టీ, హండ్రెడ్ కాదు, నా ఘనత కానే కాదు ఇది జట్టు విజయం కోసం ఆడుతున్న అత్యుత్తమ ఆట, జట్టును గెలిపించాలని పడుతున్న తపన అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని జెమిమా ఆడిన ఆట ఇది.
ఏ క్రీడలో అయినా ఆనంద భాష్పాల స్థితిని ఈ స్థాయిలో ప్రపంచం ఎన్నడూ చూసి ఉండదు. గెలిచిన జట్టు, ఓడిన జట్టు కూడా విలపించడం ఎన్నడూ చూసి ఉండం. రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ఆడి 2017 మహిళా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఓటమి చవిచూసి చేష్ట్యలుడిగిన స్థితిలోనూ నిబ్బరంగా తేరుకుని నిలిచి ప్రెస్ మీట్‌లో విషాదపు క్షణంలోనూ హుందాగా మాట్లాడిన మిథాలీ రాజ్ గుండె నిబ్బరాన్ని ప్రపంచమంతా చూసిందప్పుడు. కంటి చుక్క బయటకు రాకుండా విషాదాన్ని కళ్లలో దాచుకుని నిబ్బరానికి నిర్వచనంగా నిలిచిన మిథాలీని ఆనాడు చూశాం. అది ఆమెకే చెల్లు అనుకున్నాం.
కానీ ఈ 2025 అక్టోబర్ 30న ఒక రివర్స్ అద్భుతం క్రీడా ప్రపంచాన్ని కమ్మేసింది. గెలుపు ఓటములను సమాన స్థితిలో చూడాలని బయటకు అందరం చెప్పవచ్చు.. కానీ మైదానంలో అతి పెద్ద స్కోరును ఛేదించాకా.. దాన్ని నిలబెట్టుకోవాలని చూసిన జట్టుకు, ప్రాణాలొడ్డి దాన్ని ఛేదించిన జట్టుకు ఒకేలాంటి స్థితి కనిపించడం అరుదు. ఎనీ హౌ కంగ్రాట్స్ జమీమా. ఆల్ ద బెస్ట్ ఫర్ బెటర్ ఫ్యూచర్. అండ్ వన్స్ అగైన్ కమాన్ ఇండియా. ఈ సారి కప్పు మనదే కావాలని కోరుతోంది.. సమస్త భారతీయం