మొంథా తుపాను నష్టం రూ.5, 265 కోట్లు
posted on Oct 31, 2025 @ 10:55AM
మొంథా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో 5 వేల 265 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుపాను నష్టం, కష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (అక్టోబర్ 30) రోజంతా వివిధ సాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తుపాను ప్రభావానికి గురైన ప్రతి ప్రాంతం, మండలం, గ్రామం నుంచి సమాచారం రాబట్టారు. మొంథా తుపాను కారణంగా పంటలకు, రహదారులకు జరిగిన నష్టంపై పూర్తి వివరాలు సేకరించారు.
అనంతరం తుపాను కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టం విలువ 5 వేల 265 కోట్ల రూపాయలుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సమీక్షల అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... తుపానును ఆపలేం కానీ, స్పష్టమైన విజన్ తో, ముందు జాగ్రత్తలు తీసుకుంటే భారీ నష్టం వాటిల్లకుండా నివారించవచ్చునని నిరూపించామని చెప్పారు. తుపాను కారణంగా ప్రాణనష్టం వాటిల్లకుండా రాష్ట్రప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. తుపాను నష్టం ఎంతన్నది ప్రాథమిక అంచనా వేశామనీ, ఎన్యుమరేషన్ జరిగిన తరువాత పూర్తి నష్టం ఎంతన్నది తేలుతుందని వివరించారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామన్న చంద్రబాబు కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.
తుపాను సమయంలో అధికారలు, సిబ్బంది చాలాబాగా పని చేశారనీ, తుపాను ప్రభావిత ప్రాంతాలలో ప్రతి ఇంటినీ జియో ట్యాగ్ చేయడం ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశామనీ వివరించారు. ఆ కారణంగానే ప్రాణనష్టం లేకుండా చేయగలిగామనీ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా చేయగలిగామనీ అన్నారు. ఇక పంట నష్టపోయిన రైతులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామన్నారు. పాడైన రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తామని చెప్పారు.