కిలో నెయ్యికి పాతిక రూపాయల కమిషన్.. చిన్న వెంకన్న రిమాండ్ రిపోర్ట్
posted on Oct 31, 2025 6:58AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో అరెస్టయిన తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. ఆయన రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలను ప్రస్తావించారు. జగన్ హయాంలో తిరుమలకు సరఫరా అయిన నకిలీ నెయ్యి వెనుక చిన్న అప్పన్నదే కీలక పాత్ర అని గుర్తించారు. తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చేందుకు భోలేబాబా సంస్థ నుంచి చిన్న అప్పన్న కిలో నెయ్యికి పాతిక రూపాయలు కమిషన్ కోరినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న సమయంలో చిన్న అప్పన్న టీటీడీ వ్యవహారాలన్నీ తానై నడిపించాడని కూడా సిట్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసినట్లు చెబుతున్నారు. చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో సీట్ కీలక అంశాలను పేర్కొంది.
చిన్న అప్పన్న వైవీసుబ్బారెడ్డి హయాంలో టీటీడీ బోర్డును సైతం ప్రభావితం చేశాడనీ, భోలేబాబా సంస్థ కిలో నెయ్యికి పాతిక రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి నెయ్యి కాంట్రాక్ట్ నుంచి బోలేబాబా సంస్థను తప్పించడంలో చిన్న అప్పన్నదే కీలక పాత్ర అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అంతే కాకుండా ప్రీమియర్ అగ్రిఫుడ్ సంస్థకు నెయ్యి కాంట్రాక్ వచ్చేలా కూడా చిన్న అప్పన్న చక్రం తిప్పారని పేర్కొంది. ఆ సంస్థ ఎక్కువ మొత్తంలో కోట్ చేసి.. కమీషన్లు ఇచ్చేందుకు అంగీకరించడమే అందుకు కారణమని సిట్చిన్న అప్పన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.