కలుషిత ఆహారం.. ధర్మవరం బీసీ హాస్టల్ లో విద్యార్థులకు అస్వస్థత

కలుషిత ఆహారం కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  ఎర్రవల్లి మండలం ధర్మవరంలోని బీసీ హాస్టల్ లో నిన్న   రాత్రి భోజనం వికటించి 53 మంది విద్యార్థులు ఆస్వస్థతకు గురికావడంతో వారిని గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతంనిలకడగా ఉందని, ఆందోళన అవసరం లేదనీ అధికారులు వెల్లడించారు. ధర్మవరం బీసీ హాస్టల్‌లో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా, శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనం చేసిన తర్వాత  వీరిలో   చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. 53 మంది వాంతులు, విరోచనాలతో బాధపడటంతో వారికి గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.  వైద్యులు వారికి తక్షణమే చికిత్స అందించారు.  ఫుడ్ పాయిజన్ కారణంగా 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని జిల్లా కలెక్టర్ ధృవీకరించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, ఆందోళన అవసరంలేదనీ తెలిపారు. ఫుడ్ పాయిజినింగ్ కు కారణాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. 

కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్ గ్రేషియా రూ.2లక్షలు

కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్క్ గ్రేషియా ప్రకటించింది. కాగా కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. అలాగే క్షతగాత్రులకు రూ. 50 వేలు నష్టపరిహారం ప్రకటించింది. కార్తిక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి పది మంది మరణించిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.   క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా  స్పందించారు. తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ,  మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.  మరో వైపు కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన స్వయంగా కాశీబుగ్గకు బయలుదేరారు. ఇప్పటికే అక్కడకు పలువురు మంత్రులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.   మరోవైపు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఘటనాస్థలికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరారు.   మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పర్యటిస్తుండగా ఆయన స్వంత జిల్లా శ్రీకాకుళంలో జరిగిన ఈ సంఘటన సమాచారం తెలిసింది. వెంటనే తన పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని కాశీబుగ్గకు పయనమయ్యారు. ఇలా ఉండగా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణకు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత . వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని శ్రీకాకుళం పయనమయ్యారు. హోంమంత్రి అనిత శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై  సమగ్ర విచారణకు ఆదేశించారు.  

ధర్మేంద్రకు తీవ్ర అస్వస్థత

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. శుక్రవారం (అక్టోబర్ 31) రాత్రి ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ముంబై లోని బ్రీచ్ కాండి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ధర్మేంద్ర అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలిసి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.   ధర్మేంద్ర ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదనీ, ఆయనను ఆదివారం లేదా సోమవారం డిశ్చార్జ్ చేస్తామనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

సుంకేసుల బ్యారేజీలో భారీ లీకేజీ

  కర్నూలు జిల్లా సుంకేసులలో ఉన్న తుంగభద్ర బ్యారేజీలో భారీ లీకేజీ సంభవించింది. 12వ గేట్ వద్ద భారీగా నీరు లీకవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనివల్ల తుంగభద్ర నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. బ్యారేజీ నుండి భారీగా నీరు విడుదల అవుతుండటంతో, పరిసర గ్రామాల ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.  భారతదేశంలోనే పురాతనమైన ఈ సుంకేసుల బ్యారేజీ 1858లో నిర్మాణం ప్రారంభమై 1861లో పూర్తయింది. మొత్తం 30 గేట్లు కలిగిన ఈ బ్యారేజీలో 12వ గేట్ వద్ద ప్రస్తుతం లీకేజీ నమోదైంది. ఇంజనీరింగ్ బృందం అత్యవసర మరమ్మతు పనులు చేపట్టింది.నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ అవసరమైతే అదనపు నీటి విడుదల చేపట్టనున్నట్లు తెలిపారు.  

సతీసమేతంగా లండన్ పర్యటనకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనకు బయలుదేరారు. శనివారం (నవంబర్ 1) ఆయన తన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ పర్యటనకు బయలు దేరారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెప్పవచ్చు. లండన్ లో భువనేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి డిస్టింగ్విష్ డ్ ఫెలో షిప్ అవార్డు అందుకోనున్నారు. తన సతీమణి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆమెతో కలసి చంద్రబాబు లండన్ పర్యటనకు బయలు దేరారు.   ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ అయిన భువనేశ్వరి  ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ, సామాజిక సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగా   'ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' అవార్డు అందుకోనున్నారు. అంతే కాకుండా ఇదే వేదికగా హెరిటేజ్ ఫుడ్స్  సంస్థకు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అందుకోనున్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు కూడా లండన్ పర్యటనకు వెళ్లారు. పనిలో పనిగా అక్కడ పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖ వేదికగా జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా ఆహ్వానించే అవకాశం కూడా ఉంది. 

ప్రతి పక్షం రోజులకూ అమరావతి పనుల పురోగతి సమీక్ష

నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యాన్ని సహించబోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన నిర్దుష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా అంశాలలో అమరావతి, పోలవరం ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పురోగతి విషయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అమరావతి పనులతో జాప్యం జరగడానికి ఎంత మాత్రం అంగీకరించనన్న ఆయన అవసరమైతే.. అదనపు సిబ్బందినీ, యంత్రాలనూ ఉపయోగించాలని సూచించారు. ప్రధాని  మోదీకి ఇచ్చిన హామీ మేరకు పనుల్లో వేగం పెంచాలని ఆయన గుత్తేదారులకు కూడా ఈ సందర్భంగా సూచించారు. అక్కడితో ఆగకుండా.. ఇక నుంచి ప్రతి పక్షం రోజులకు ఒక సారి అమరావతి పనుల పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు.  

లక్షన్నర కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో భారీ ఉక్కు పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. లక్షన్నర కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లికి సమీపంలో భారీ ఉక్కుకర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ ఉక్కు కర్మాగారానికి ఈ నెల 14, 15 తేదీలలో విశాఖ వేదికగా జగరనున్న సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ వేదికగా భూమి పూజ జరగనుంది. లక్షన్నర కోట్ల భారీ వ్యయంతో  ఏర్పాటు కానున్న ఈ భారీ ఉక్కుకర్నాగారాన్ని అర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ కర్మాగారానికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు క్లియర్ అయ్యాయి.   దీంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు కర్మాగారం ఏపీలో ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైంది.   కాగా  తొలి దశలో  8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో  ఈ ఉక్కుకర్మాగారం ఏర్పాటు కానుంది. ముందు ముందు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 24 మిలియన్ టన్నులకు విస్తరించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.  అత్యాధునిక సాంకేతికతతో, పర్యావరణ హితంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ఉక్కుకర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు పనులకు అవసరమైన అన్ని అనుమతులూ వాయువేగంతో కేవలం 14 నెలల వ్యవధిలోనే లభించడం విశేషం.  ఇది చంద్రబాబు పని తీరుకు మచ్చుతునకగా, ఆయన తరచూ చెప్పే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిలువెత్తు ప్రత్యక్ష తార్కాణంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.    మంత్రి నారా లోకేశ్‌  గత ఏడాది ఆగస్టులోఅర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ప్రతినిథులతో చర్చలు జరిపారు. ఆ తరువాత మూడు నెలలలోనే ఉక్కుకర్మాగారం కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   భూమి కేటాయించింది.   ఆ సందర్భంగా ఆర్సెలర్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ,   కోరిన వెంటనే భూమి కేటాయించి, అనుమతులు మంజూరు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మేం ఇక్కడ ఏర్పాటు చేయబోయేది కేవలం ఉక్కు కర్మాగారం కాదు..  ఇన్నోవేషన్స్, సస్టెయినబులిటీ, ఎంప్లాయిమెంట్ ఆపర్ట్యునిటీస్ సెంటర్ గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు.   కాగా అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు రావడం ప్రభుత్వ పారదర్శకతకు, సమర్థతకు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో  ఏపీలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి అయ్యిందనడానికి ఈ ప్లాంట్ కు సత్వరం అనుమతులు క్లియర్ అవ్వడమే నిదర్శనమంటున్నారు. ఈ ఉక్కుకర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

కాశీబుగ్గ తొక్కిసలాట..ఆలయ నిర్వాహకుల వైఫల్యమే కారణం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో  మృతుల సంఖ్య పదికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలోని రెయిలింగ్ కూలిపోవడంతోనే ప్రమాదం జరిగింది. కాగా కేవలం ఐదువేల మంది మాత్రమే కెపాసిటీ ఉన్న ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి సందర్భంగా పాతిక వేలకు మందికి పైగా భక్తులు తరలిరావడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. ఇలా ఉండగా ఈ ఆలయ నిర్వహణ ప్రభుత్వ అధీనంలో లేదని ఏపీ దేవాదాయ శాఖ తెలిపింది. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు చెందినదని పేర్కొంది. ఏడాది కిందట ఈ ఆలయ నిర్మాణం జరిగిందనీ,   ఈ ఆలయాన్ని పది కోట్ల రూపాయల వ్యయంతో  ఐదెకరాల స్థలంలో పండా అనే భక్తుడు నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ ఆలయం ప్రారంభమైన తరువాత ఇదే తొలి కార్తీక మాసం కావడం గమనార్హం. . కాగా ఆలయానికి భక్తులు భారీగా వస్తారన్న సమాచారం ఆలయ నిర్వాహకులు ప్రభుత్వానికి ఇవ్వలేదని తెలిసింది. ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు.  ఇలా ఉండగా సంఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష్ చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారును ఆదేశించారు.   కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా పది మంది మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.  మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్ వారికి ప్రభుత్వం అండగా ఉంటుం దన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.  

టీమ్ స్పిరిట్ అంటే ఇదీ!

మొంథా తుఫాన్‌ను టీమ్ స్పిరిట్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు.  శనివారం  (నవంబర్ 1) తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మొంథా  తుపాన్ ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రిపాల్గొన్నారు.   మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రదానం చేశారు.  ప్రతీ సంక్షోభాన్నీ అవకాశంగా తీసుకోవాలన్న ఆయన మొంథా తుపాను నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడంలో విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రజల తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా చెప్పారు.  ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భతంగా పనిచేశారన్నారు.  మొంథా తుపానును ఎదుర్కొన్న అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్‌గా రూపొందిద్దామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి  నిదర్శనమే మొంథా తుఫాన్ నష్టాన్ని భారీగా తగ్గించిన మనపనితనమని చంద్రబాబు అన్నారు.    రాష్ట్రానికి  రాయలసీమకు కరువు,   కోస్తాంధ్రకు తుఫాన్లు రెండు ప్రధాన సమస్యలన్న చంద్రబాబు.. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో  రాయలసీమలో కరువు అనేది లేకుండా చేయగలిగామనీ,    ఈసారి మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్‌ ను సిద్ధం చేశామనీ, ఆ బృందం అద్భుతంగా పని చేసిందనీ చెప్పారు. అధికారులకు సాంకేతిక సపోర్టును ఇచ్చామనీ,   ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫానును సమర్ధవంతంగా ఎదుర్కొన్నామనీ చంద్రబాబు పేర్కొన్నారు. మోనిటరింగ్, అలెర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ.., ఇలా  ఫైవ్ పాయింట్ ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామన్నారు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైమ్‌లోనే హెచ్చరికలు పంపించామన్నారు. వర్ష ప్రభావం, గాలులు తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామనీ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పిన ఆ్యన అతి పెద్ద తుఫాన్‌ను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చేయడంలో విజయం సాధించామన్నారు.    డ్రోన్ల ద్వారా తుఫానులో చిక్కకున్నవారి ప్రాణాలు కూడా కాపాడామనీ,  పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న షేక్ మున్నా అనే వ్యక్తిని,  ఓ ప్రార్ధనామందిరంలో చిక్కుకున్న 15 మందిని కూడా కాపాడగలిగామనీ చెప్పారు  సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్న చంద్రబాబు  శాటిలైట్లు, డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి అలెర్టులు పంపించామన్నారు. ముందస్తు జాగ్రత్తగా కాలువల పూడికలు, అడ్డంకులు తొలగించడంతో  భారీ వర్షాలు కురిసినా నీరు అంతా కిందికి సులువుగా ప్రవహించి వరద ముప్పు తగ్గిందన్నారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్ర స్థాయిలో అందరినీ అప్రమత్తం చేసి రక్షణగా నిలిచారని కితాబిచ్చారు. సీఎస్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ అంతా కలిసి ప్రజలను కాపాడటంలో సఫలీకృతమయ్యారని అభినందించారు. ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు అందరూ బాగా పని చేశారని ప్రశంసించారు.  అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చేసి చూపించాం. బాగా పనిచేసిన వారిని గుర్తించి అందరికీ స్పూర్తిని చాటాలనే ఈ కార్యక్రమం నిర్వహించామని చంద్రబాబు చెప్పారు.  ప్రజలు కూడా ఈ స్పూర్తిని అందిపుచ్చుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు.   అలాగే, గతంలో ఏ అంశం చెప్పాలన్నా గ్రామాల్లో టాంటాం వేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆర్టీజీఎస్ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మైకుల ద్వారా హెచ్చరికలు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో రాజధాని నుంచే గ్రామ స్థాయి వరకు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, మంత్రులు అనిత, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

ఆస్తినష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక.. అధికారులకు చంద్రబాబు ఆదేశం

మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ తదనంతర చర్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం (అక్టోబర్ 31)  టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారం (నవంబర్ 1) కల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవవర్గాల వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి... ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడకి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి పరిస్థితిని మెరుగుపరచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందరూ కలిసి సమన్వయంతో పని చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో  మంచి ఫలితాలు రాబట్టాలని   సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని,  పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా   చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60 శాతం మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి పొలాల్లో నీటి నిల్వలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.   మొంథా తుఫాన్‌తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెను వెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలనీ, తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని  సూచించారు. ఈ విషయమై తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు.   

క‌ప్పు ల‌క్కును ఈసారైనా మార్చ‌గ‌ల‌దా?

విమెన్స్ వన్డే వరల్డ్ కప్ -2025  విన్నర్స్ జట్టుకు భారీ  ప్రైజ్ మ‌నీ దక్కనుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుకు  39.7 కోట్ల  రూపాయ‌ల‌ ప్రైజ్ మనీ దక్కనుంది. అదే ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన జ‌ట్టుకు 19.8 కోట్లు దక్కుతాయి. ఈ వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.  ఈ సారి టోర్నీలో ఏ జట్టు విజేతగా నిలిచినా ఆ జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సారి విశ్వవిజేతగా నిలవనున్న జట్టే ఏదన్న ఉత్కంఠ నెలకొంది.   విమెన్స్ వరల్డ్ కప్ టోర్నీని ఇంత వరకూ ఏడు సార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇంగ్లాండ్ కూడా టెటిల్ విన్నర్ గా గతంలో నిలిచింది.  ఈ సారి ఆ రెండు జట్లూ కూడా సెమీస్ తోనే టోర్నీ నుంచి వైదొలిగాయి.   సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆసీస్ పై అద్భుతమైన విజ‌యాన్ని  సాధించి స‌గ‌ర్వంగా  ఫైన‌ల్స్ లో అడుగు పెట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ లో జెమీ మారోడ్రిగ్స్ రికార్డు సెంచరీతో చెల‌రేగ‌గా.. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సూప‌ర్భ్ ఆఫ్ సెంచురీతో రాణించింది.  దీంతో గ‌త కొన్నేళ్లుగా అజేయంగా ఉన్న ఆస్ట్రేలియాను  మట్టి కరిపించి మరీ ఫైనల్ లోకి అడుగుపెట్టింది టీమ్ ఇండియా.   భార‌త్- ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య ఆదివారం(నవంబర్ 2) ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కు వేదిక సెమీస్ జ‌రిగిన న‌వీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం కావ‌డం టీమిండియాకు క‌లిసి వ‌చ్చే అంశంగా చెప్పవచ్చు. సెమీస్ చూపిన జోరును ఫైన‌ల్స్ లోనూ మ‌న విమెన్ క్రికెట‌ర్లు కొన‌సాగించాలని యావత్ భారత్ కోరుకుంటోంది.  భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం (న‌వంబ‌ర్ 2) మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా ఎలా ఫెర్ఫార్మ్ చేస్తుంది అన్న చర్చ కూడా క్రికెట్ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.   బిగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లలో చతికిల పడటం దక్షిణాఫ్రికా కు అలవాటేననీ,  ఈ సారైనా ఆ ఒరవడిని దక్షిణాఫ్రికా మహాళల క్రికెట్ జట్టు ఫుల్ స్టాప్ పెడుతుందా అన్న డిబేట్ క్రికెట్ అభిమానుల్లో జరుగుతోంది. మరో వైపు భారత విమెన్స్ టీమ్ కూడా ఇప్పటి వరకూ మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరినా కప్ మాత్రం అందుకోలేకపోయింది.  ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే క్రికెట్ లో ఆ జట్టును అది మహిళల జట్టైనా, పురుషుల జట్టైనా మోస్ట్ అన్ లక్కీయెస్ట్ జట్టుగా చెబుతుంటారు.  దీంతో ప్ర‌స్తుత  2025 విమెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ లోనైనా ఈ జ‌ట్టును అదృష్టం వరిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. అలాగే గతంలో ఫైనల్ లో  చతికిలబడినట్లుగా కాకుండా టీమ్ ఇండియా విమెన్స్ జట్టు ఈసారి విజేతగా నిలవాలని భారత్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందనేది లేలాలంటే.. ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.  

కాశీబుగ్గలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో శనివారం (నవంబర్ 1) జరిగిన తొక్కిసలాటలో 9 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీక మాసం కావడం అందునా ఏకాదశి కూడా అవ్వడంతో శనివారం   పెద్ద సంఖ్యలో భక్తులు  వేంకటేశ్వరాలయానికి పోటెత్తారు.అంచనాలకు అందనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో  తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. ఈ ఘటనలో 9 మంది ఘటనాస్థలంలోనే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చి,  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తొక్కిసలాట ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.    

కృష్ణమ్మకు కార్తీక హారతి

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుగుతున్నాయి. వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైల క్షేత్రంలో గత నెల  22 నుంచి ప్రారంభమైన కార్తిక మాసోత్సవాలు ఈ నెల  21వ తేదీ వరకు జరుగుతాయి.   కార్తీకమాసం రెండవ శుక్రవారం (అక్టోబర్ 31) సందర్భంగా ఆ రోజు సాయంత్రం పాతాళగంగ వద్ద  కృష్ణమ్మ హారతి కార్యక్రమం పండితుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య వైభవంగా జరిగింది. పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణమ్మతల్లి విగ్రహానికి పూజాదికాలు, వస్త్ర సమర్పణ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాతాళగంగ ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజాదికాలు, దశహారతులు నదీమతల్లికి సారెను ఆలయ అధికారులు సమర్పించారు. నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి,నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచ హారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులు ఇచ్చారు. లోకకల్యాణార్థమై ప్రతీ సంవత్సరం కార్తికమాసంలో నదీమతల్లికి హారతులను సమర్పించడం జరుగుతోందని దేవస్థానం ఈవో   తెలిపారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమాన్ని యాత్రికులు ఎంతో భక్తితో వీక్షించారు.

మహిళా రైతు తారవ్వకు పౌరసరఫరాల శాఖ అండ!

వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేయా లని  గురువారం నాడు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రోదించిన తారవ్వ అనే మహిళకు పౌరసరఫరాల శాఖ అండగా నిలిచింది. మొంథా తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు తన పంట మొత్తం వరద పాలైందని రోదిస్తూ తారవ్వ అనే మహిళా రైతు బుట్టతో కాలువలో పడిపోయిన వడ్డు తీస్తూ భోరున ఏడుస్తూ, వర్షాల నష్టాల పరిశీలనకు ఆ సమయంలో అక్కడకు వచ్చిన కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోవడానికి సంబంధించిన దృశ్యం సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తారవ్వకు జరిగిన పంట నష్టంపై  సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. తారవ్వకు ఎటువంటి నష్టం కలగకుండా ఆమె పంటను కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఆఘమేఘాలపై  సిద్దిపేటకు చెందిన  తారవ్వ పంట మొత్తాన్ని కొనుగోలు చేయ డమే కాకుండా 24 గంటల తిరగకుండా అందుకు సంబంధించిన సొమ్మును కూడా ఆమె ఖాతాలో డిపాజిట్ చేశారు.  అంతే కాక పౌర సరఫరాల సంస్థ తారవ్వ తోపాటు 106 మంది రైతుల పంటను సైతం కొనుగోలు చేశారు.  ఈ సందర్భంగా తారవ్వ మాట్లాడుతూ... తన పంట నష్టపోయిం దంటూ నిన్న కలెక్టర్ కాళ్లు పట్టుకొని ఏడ్చిన తనతో పాటు రైతులందరికీ ప్రభుత్వం సహాయం చేసిందని.... ఈ సహాయం చేసిన కమిషనర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఒకవైపు అల్లుడు చనిపోయాడన్న బాధ మరోవైపు వర్షాల కారణంగా దాన్యం మొత్తం నష్టపోయానన్న బాధ ఈ బాధలో ఉన్న తనను ప్రభుత్వం ఆదుకుందన్నారు.  

ఏపీలో బెగ్గింగ్ పై బ్యాన్

ఏపీలో యాచ‌క వృత్తిని  నిషేధిస్తూ తెలుగుదేశం కూటమి జీవో  పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ఇక‌పై ఏపీలో ఎవ్వ‌రూ అడ్డుకోడానికి వీల్లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే బెగ్గింగ్ మాఫియా ఒక రేంజ్ లో చెల‌రేగిపోతోంది. బెగ్గింగ్ మాఫియా ఇందులోకి పిల్ల‌లు, వృద్ధులు, మ‌హిళ‌లను దించుతూ అరాచకాలకు పాల్పడుతోంది.  అంతే కాదు ఇటీవ‌లి కాలంలో  ఈ మాఫియా మ‌రో భ‌యంక‌ర‌మైన దోపిడీకి కూడా తెర‌లేపింది.   కార్ల‌కు ఉండే, ఫాస్ట్ టాగ్ స్టిక్క‌ర్ల నుంచి కూడా వీరు దోపిడీ మొద‌లు పెట్టేశారు. జంక్ష‌న్ల‌లో వాహ‌నాలు ఆగిన‌పుడు ఆయా  కార్ల‌కున్న ఈ ఫాస్ట్ టాగ్ స్టిక్క‌ర్ ను త‌మ స్కానర్ ద్వారా లాగేసుకుని.. వారి అకౌంట్లో ఆ మొత్తం ప‌డిపోయేలాంటి కొత్త టెక్నిక్ వాడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా  ఇక బెగ్గింగ్ మాఫియా కారణంగా  కొన్ని వేల మంది చిన్నారులు బ‌ల‌వుతున్నారు. కొంద‌రు జంక్ష‌న్ల‌లో అది ప‌నిగా  బిచ్చ‌గాళ్ల వేషం వేసుకుని, ఆపై త‌మ‌కు ఎలాంటి వైక‌ల్యం లేకున్నా  ఉన్న‌ట్టు న‌టిస్తూ వీరు చేసే యాక్టింగ్  మరో లెవెల్ కు చేరింది. ఇంకొందరు త‌మ‌కెన్ని ఆస్తిపాస్తులున్నా స‌రే.. గుడులు గోపురాల ద‌గ్గ‌ర  యాచిస్తూ.. బాగానే వెన‌కేస్తున్నారు.  బెంగ‌ళూరు వంటి ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ జాబ్స్ వ‌దిలి యాచ‌క వృత్తిలోకి వెళ్లిన వారున్నారంటే అతిశ‌యోక్తి కాదు. కార‌ణ‌మేంటంటే వారికి ఆ ఉద్యోగంలో ముప్పై నుంచి న‌ల‌భై వేలు మాత్ర‌మే వ‌స్తుంటే ట్రాఫిక్ పోల్స్ ద‌గ్గ‌ర రోజంతా అడుక్కుంటే 80 వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కూ వ‌స్తుండ‌టంతో వారీ  ప‌నిలోకి దిగుతున్న‌ట్టు అప్ప‌ట్లో ఒక వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. అలాంటి యాచకవృత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. దీనిని ఒక ఆత్మగౌరవ చర్యగా చెప్పాలి. అన్నిటికీ మించి  ప్ర‌భుత్వం ఇన్నేసి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇస్తుంటే ఇక  యాచించ‌డం అవ‌స‌రం లేద‌న్న‌ది  కూడా ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. 

విత్ మై ఓల్డ్ ఫ్రండ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు దశాబ్దాల నాటి తన పాత స్నేహితుడి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ స్నేహితుడు.. చంద్రబాబు సహాధ్యాయో, చిన్న నాటి స్నేహితుడో అనుకునేరు.. కానే కాదు.. ఆయన దాదాపు మూడు దశాబ్దాలు పాటు ఉపయోగించిన అంబాసిడర్ కారు గురించి, ఆ కారుతో తనకు ఉన్న అనుబంధం గురించి స్మరించుకున్నారు. గుర్తు చేసుకున్నారు.   ఏపీ 09 జి 393 నెంబరుతో ఉండే ఆ అంబాసిడర్ కారు చంద్రబాబు నాయుడి సొంత వాహనం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబాసిడర్ కాన్వాయిలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు గుర్తింపు పొందింది. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు... భధ్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నా... ఆయన తన సొంత వాహనమైన  ఏపీ 09 జి 393  నంబర్ గల అంబాసిడర్ ను ఇప్పటికీ అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాదులో ఉన్న ఈ కారు ఇప్పడు అమరావతిలోని  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంచారు. శుక్రవారం (అక్టోబర్ 31) పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు..  తిరిగి వెళ్తున్న సమయంలో ఆ అంబాసిడర్ కారును పరిశీలించారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులను గుర్తు చేసుకున్నారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేసి ఆ కారుతో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.  

ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితులు ఆస్తుల అటాచ్ కు కోర్టు అనుమతి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.  నిందితల ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముడుపుల సొమ్ముతో నిందితులు  కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలంటూ ప్రభుత్వం  జీవో నంబర్ 111, జీవో నంబర్ 126 జారీ చేసింది. ఆ జీవోల మేరకు  నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు  111, 126లలోని ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి కోరుతూ సీటి్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు అందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తులను సిట్ జప్తు చేయనుంది.  కాగా మద్యం కుంభకోణంలో కోట్లది రూపాయల అక్రమ సంపాదనతో ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మాచ్ పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సిట్ ఆధారాలతో సహా కనుగోంది. ఇప్పుడు సిట్ ఆ ఆస్తులను అటాచ్ చేయనుంది.   కాగా వైసీపీ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు 16 మందిని అరెస్టు చేశారు. మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు.    వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి సహా పలువురు నిందితులు పస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

  తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 8 మంది ఐఏఎస్‌ల అధికారుల స్థానం చలనం చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్/సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ కొనసాగనున్న సవ్యసాచి ఘోష్, రవాణా శాఖ కమిషనర్‌గా కే.ఇలంబర్తి/పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు, గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు, సీఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలు, జీఏడీ కార్యదర్శిగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డి/ఎస్సీ సహకార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు  ఉత్తర్వులు జారీ చేశారు.