తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోం మంత్రి అనిత

 

అనకాపల్లి  జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో  హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. వరద భాదితులను రాష్ట్ర ప్రభుత్వం  అన్ని విధాలా  ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.  శుక్రవారం  పాయకరావుపేట నియోజకవర్గం యస్. రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి, ప్రజల యోగక్షేమాలు మంత్రి  అడిగి తెలుసుకున్నారు.  తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు.  బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్ళు మరియు ఐదు సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో భర్త మృతిచెందిన  మైలిపల్లి సత్తియ్యమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి అనిత  సొంత నిధులతో ఆర్థిక సహాయం అందజేసారు. 

బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తియ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను మంత్రి  ఆదేశించారు.  ఎన్.ఎ.ఒ.బి.  ప్రహారి గోడ వలన ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలుపగా తక్షణమే ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను హోం మంత్రి  ఆదేశించారు.

ఈ సంధర్బంగా హోం మంత్రి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి  నారా లోకేష్  తుఫాన్ నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్దంచేయడంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగినట్లు తెలిపారు. 15 రోజుల్లో బంగారమ్మపాలెం గ్రామంలో రోడ్డు వేయడం జరుగుతుందని, మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పాటు ఇతర కులాల వారికి కూడా తుఫాను ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు. 

గ్రామంలో  సోలార్ ఫ్యానల్ ద్వారా  చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, డ్వాక్రా మహిళలతో ఫైలట్ ప్రాజెక్ట్ గా సోలార్ ఫ్యానల్ ద్వారా చేపల ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు.  తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న   ఇళ్ళకు తక్షణమే  పక్కా గృహాలు మంజూరుకు  అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరుగుతుందన్నారు. బంగారమ్మపాలెం గ్రామంలో ఉన్న చిన్న,చిన్న సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

చంద్రబాబు రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ప్రతిష్ఘాత్మక అవార్డు వరించింది. ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఏటా ప్రదానం చేసే  బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఈ సారి చంద్రబాబుకు దక్కింది.  ఆంధ్రప్రదేశ్ లో ఆయన అమలు చేస్తున్న  వ్యాపార అనుకూల విధానాలు, పారిశ్రామిక సంస్కరణలు,  అలాగే పెట్టుబడుల ఆకర్షణకు గానూ ఆయనకీ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ గురువారం (డిసెంబర్ 18) ప్రకటించింది.   వచ్చే ఏడాది మార్చిలో  నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.  రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి 10.7 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షించి, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేసిన చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఈ అవార్డుకు చంద్రబాబును  దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్,  జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి ప్రముఖులు   ఉన్నారు. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సలహాదారుగా వ్యవహరిస్తోంది. ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్ , నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ వంటి వారు అందుకున్నారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడంపై ప్రముఖులు, మంత్రి వర్గ సహచరులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

కింజరాపు రామ్మోహన్ నాయుడికి మోడీ, చంద్రబాబు బర్త్ డే విషెస్

కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా రామ్మోహన్ నాయుడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ..    పౌర విమానయాన రంగంలో సంస్కరణల కోసం రామ్మోహన్ నాయుడు విస్తృతంగా కృషి చేస్తున్నారంటూ  ప్రశంసల వర్షం కురిపించారు.  రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.   రామ్మోహన్ నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రిగా ఆయన ఏపీలో విమానయానరంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నారని కొనియాడారు. రామ్మోహన్ నాయుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రామ్మోహన్ నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  కాగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ రామ్మోహన్ నాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియ సోదరుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేస్తూ రామ్మోహన్ నాయుడి నిబద్ధత, పనితీరును దగ్గర నుంచి చూశాననీ,  భారత విమానయాన రంగాన్ని తీర్చిదిద్దుతున్న తీరు అద్భుతమనీ పేర్కొన్నారు.  

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లూ కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం (డిసెంబర్ 18) తెల్లవారు జామున ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. అటవీ ప్రాంతంలోని పల్లెపల్లెనూ జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పులలో ముగ్గురు మరణించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.  

తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించనున్న రైతు బిడ్డ

ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. అందులోనూ రైతుకు అయితే ఉన్న ఊరే కాదు.. తాను సాగు చేసే భూమి కన్నతల్లి కంటే ఎక్కువే. రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని పోల్చడానికి ఏ బంధమూ సరిపోదు.  రైతు బిడ్డ ఏ దేశమేగిగా, ఎందు కాలిడినా సొంత గడ్డ, తాను సాగు చేసిన పొలం మీదే ధ్యాస ఉంటుంది. ఎక్కడా ఇమడ లేడు. ఎప్పుడెప్పుడు వచ్చి సొంత ఊర్లో, సొంత భూమిలో సాగు చేసుకుందామా అని తహతహలాడుతుంటాడు. అదిగో అచ్చం అలాంటి పదహారణాల రైతు ఉదంతమిది. భూమితో ఉన్న అనుబంధానికి తార్కానంగా తన సొంత భూమిలో తాను బతికుండగానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. వివరాల్లోకి వెడితే.. కళ్లెం నరసింహారెడ్డి పదహారణాల రైతు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు.  ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. భూమిపై అనురక్తి తగ్గలేదు. సొంత ఊరు, దేశం వదిలి మూడు దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నా.. ఆయన వ్యాపకం వ్యవసాయమే.  అమెరికాలో ఐదువేల ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి  ఉత్తమ రైతు అవార్డు  కూడా అందుకున్నారు. అయితే మాతృభూమిపై మమకారం తీరలేదు. అందుకే స్వదేశానికి, అందులోనూ సొంతగడ్డ తెలంగాణకు వచ్చేశారు.  చిలుకూరు సమీ పంలో తన పేరుమీద అంటే కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు.  ఎన్నో సాగు పద్దతులతో  పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు...చెట్లు పెంచిప్రకృతి లోనే జీవితం గడుపుతున్నారు. నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలో కలియదిరగందే, ఆయనకు రోజు గడవదు, నిద్రపట్టదు. తొమ్మది పదులకు చేరువ అవుతున్న ఈ వయస్సులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు.   తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు నేల తల్లితో తన మమకారాన్ని వినూత్నంగా చాటి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. తన వ్యవసాయ క్షేత్రంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణించిన తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరణించిన తరువాత తాను తన భూమాతతో అనుబంధం కొనసాగుతుందని చాటారు.   తన భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (డిసెంబర్ 19)న ఈ విగ్రహాలను ఆవిష్కరిం చనున్నారు. అంతే కాకుండా భార్య మరణానంతరం కూడా ఆమెకు తోడుగా తాను ఉన్నానని కూడా ఈ విగ్రహాల ఏర్నాటు చేసినట్లు ఆయన చెబుతారు. ఈ విగ్రహాలను కళ్లెం నరసింహారెడ్డి స్వయంగా శుక్రవారం (డిసెంబర్ 19) ఆవిష్కరించనున్నారు.  ఆమె  ఓంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో తన విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరిస్తారు.

వల్లభనేని వంశీ.. వెంటాడుతున్న గత పాపాలు.. తాజాగా మరో కేసు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కేసులు వదలడం లేదు. ఇప్పటికే ఆయనపై దాడి, దౌర్జన్యం, భూ కబ్జా ఇలా పలు కేసులు నమోదై ఉన్నాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు.   వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే వంశీ  మొత్తం 11 కేసులలో నిందితుడిగా ఉన్నారు.   ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. వంశీ తన అనుచరులతో కలిసి తనపై గత ఏడాది జులైలో దాడికి పాల్పడ్డారంటూ సునీల్ అను వ్యక్తి ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై తాజాగా మాచవరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.    జగన్ హయాంలో   దాడులు, దౌర్జన్యాల, కబ్జాలు, అనుచిత వ్యాఖ్యలతో దూషణలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంటైపోయారు. కేసుల భయంతో వణికిపోయి దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు కూడా జంకుతున్న పరిస్థితి.  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? అసలు రాజకీయాలలో ఉన్నారా? అంటూ వైసీపీ శ్రేణులే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి.  కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నా  వైసీపీ నేతలను, కార్యకర్తలను కలవడం లేదు. వారిని కనీసం తన ఇంటి ఛాయలకు కూడా రానీయడం లేదంటున్నారు.  కానీ ఇదే వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.  ఇప్పుడు సైలెంటైపోయినంత మాత్రాన కర్మ వదులుతుందా?  అంటే వదలదని ఆయనపై నమోదైన కేసులు చెబుతున్నాయి. తాజాగా  వంశీపై మరో కేసు నమోదైంది.   

అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఈఐఎల్ ఫౌండేషన్

  అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్దితో పాటు, ఎం ఎన్ జె కాన్సర్ ఆసుపత్రి  అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణనిస్తున్నదని,  అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము  నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  నిమ్స్ ఆసుపత్రిలో  క్యాన్సర్ బ్లాక్ ను ఎలా అయితే అభివృద్ధి చేసామో అలానే ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.   ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని  ఆ అవసరాలను తీరుస్తామన్నారు. ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో   బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని  బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఎమ్ ఎన్ జె కాన్సర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు,   , మూసాపేటలోని సాయి  సేవా సంఘ్ లో  విద్యను అభ్యసించే వారికి  బ్లాంకెట్స్ ను సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు.  నగరంలోని సాయి సేవా సంఘ్   విద్యా మందిర్ లో   ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ  పై చదువుల తరువాత  తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.   ఈ సంస్థ కొన్ని వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోందని, వాటికి అదనంగా తమ సంస్థ తరపున అదనపు  కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  చిన్న పిల్లలతో గడపడం వల్ల వచ్చే సంతోషం వేరే కార్యక్రమాల వల్ల తనకు రాదన్నారు. అందుకే తాను చిన్న పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.  తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు. తానూ చిన్నగా ఉన్నపుడు కొన్ని అంశాలను ఆమె ద్వారా  స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.  చిన్నపుడు తీసుకునే సరైన నిర్ణయాలు అందరి జీవితాలను ఒక మలుపు తిప్పుతాయని, అందువల్లే ప్రతి ఒక్కరు చిన్న వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.   ప్రస్తుతం ప్రతి ఒక్కరు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందుల నుంచి బైట పడేసేందుకు తమ  ఫౌండేషన్ల తరఫున సాయం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, దీన్ని విస్తరిస్తామని తెలిపారు   చలికాలంలో  అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు.  ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి  బ్లాంకెట్స్,   పండ్లు పంపిణీ చేశారు. తాము అక్షయ పాత్ర ద్వారా క్యాన్సర్ రోగులకు కొని సంవత్సరాల నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత పరుస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ్ ప్రతినిధులు, ఎం ఎన్  జె క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.  

ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడకు రావడం గర్వంగా ఉంది : హీరో నాగార్జున

  నాన్న ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన సంస్థలు తనకు ఎప్పుడు ప్రత్యేకమేనవేనని నాగార్జున తెలిపారు ... ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం రూ.2కోట్ల రూపాయలను ప్రకటించారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు వేడుకల్లో సినీ హీరో అక్కినేని నాగార్జున, హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా నాగార్జున సభా వేదిక మీదకు చేరుకోగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.  అనంతరం హీరో నాగార్జునకు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాలువా, పుష్పగుచ్చం అందిస్తూ  గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద... కళాశాల విద్యార్థుల  స్కాలర్షిప్ కోసం... కుటుంబం తరఫున రూ.2కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందనీ నాగార్జున పేర్కొన్నారు. మనుషులు శాశ్వతం కాదనీ వారు చేసే పనులే శాశ్వతమని,తాను చదువుకోలేక పోయినా...వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం  నాగేశ్వరరావు కళాశాల స్థాపించారనీ ,రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు...చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు. సినిమాకు రూ. 5వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో.... లక్ష రూపాయలు కళాశాలకు విరాళంగా ఇచ్చారనీ, ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ,విదేశాల్లో, ఎంతో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషకరమన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున... ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందిస్తామన్నారు. కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధికి... రేపు వేడుకల్లో పాల్గొనే మంత్రి లోకేష్ సహకరించేలా ఎమ్మెల్యే రాము కృషి చేయాలని నాగార్జున కోరారు. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు.. చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. నన్ను కింగ్, మన్మధుడు, మాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారని... నేను అక్కినేని నాగేశ్వరావు  అబ్బాయి నాగార్జున అంటేనే ఇష్టమన్నారు. నాగార్జున మాట్లాడుతున్నంతసేపు  అభిమానులు..విద్యార్థులు కేరింతలు కొట్టారు. హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ...మహోన్నత ఆలోచనతో ఏర్పడిన ఏఎన్ఆర్ కలశాల ఎందరికో మంచి భవిష్యత్తు అందించడమే కాక, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందన్నారు. ఈ కళాశాలలో చదివే నేను... హైకోర్టు జస్టిస్ స్థాయికి ఎదిగాననీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... నేడు నాగార్జున రావడంతో గుడివాడలో ఎప్పుడూ లేనంత సందడి నెలకొందన్నారు. నేను కళాశాల చదివే రోజుల్లో నాగార్జునకు  ఫ్యాన్స్ క్రేజీ చెప్పలేనంత ఉందన్నారు.  ప్రపంచం గర్వించదగ్గ నటుడుగా ఎదిగిన అక్కినేని మన గుడివాడ వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. గుడివాడ ప్రజలందరూ చదువుకోవాలని ఎంతో గొప్ప ఆశయంతో కళాశాల స్థాపించారనీ కొనియాడారు. చదువు అంటే ఎంతో ఇష్టపడే అక్కినేని... అనేక యూనివర్సిటీలకు చెప్పలేనన్నీ గుప్త దానాలు చేశారన్నారు. ఆయన చేసిన సేవలను చూస్తుంటే, చదువు అంటే అక్కినేనికు ఎంత మమకారమో అర్థం అవుతుందన్నారు.  కళాశాలకు డబ్బు మాత్రమే కాకుండా ఆయన పేరు కూడా అందించారన్నారు. అంతటి మహనీయుడు కుటుంబ సభ్యులతో కలిసి వేదికను పంచుకోవడం ఆనందదాయకం అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుడివాడ అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ పుట్టిన గడ్డ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన నాగార్జునకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు చెప్పారు. నాడు ఏఎన్ఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు ఏ విధంగా సద్వినియోగం అయ్యాయో... నేడు విద్యార్థుల భవిష్యత్తు కోసం నాగార్జున ఇచ్చిన రెండు కోట్లను అదేవిధంగా సద్వినియోగం చేస్తామని సభా వేదికగా పేర్కొన్నారు.  నాగార్జున వస్తున్నారని తెలిసి నేను 18 కిలోలు తగ్గిన... ఆయన ముందు ఏమాత్రం అనడం లేదని ఎమ్మెల్యే రాము అన్న మాటలకు సభా అంత నవ్వుకున్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని  అక్కినేని నాగార్జున, ఎమ్మెల్యే రాము ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, అక్కినేని కుమార్తె సుశీల, ఏఎన్ఆర్ కళాశాల కమిటీ పెద్దలు, వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  

డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు

  జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరల గడువు  మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫీకేషన్‌పై దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశించింది.  పిటిషనర్ పునర్విభజనపై సమాచారం అందించలేదని జనాభ, సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. గ్రేటర్ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి  

మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం

  ఉమెన్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ‌ ఉండవల్లిలోని తన నివాసంలో  మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు. ఈ నగదు బహుమతితో పాటు విశాఖలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.  ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.

ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటే వాహనాలకు ఆయిల్

  దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూపోతోంది. జనం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అల్లాడిపోతున్నారు. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా రికార్డు అయింది. దీంతో ‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా బొగ్గు, వంట చెరుకుతో తయారు చేసే తందూరీ రోటీలపై బ్యాన్ విధించింది. డీపీసీసీ నిర్ణయం ప్రకారం సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు, తిను బండారాలు అమ్మే షాపులు తందూరీ రోటీలను తయారీ కోసం గ్యాస్ లేదా కరెంట్‌ను మాత్రమే వాడుకోవాలి. కాలుష్య నివారణలో భాగంగా వాహనాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు. పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్‌లలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అమ్మరని తేల్చి చెప్పారు. జీఆర్ఏపీ 3, 4 సందర్బంగా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ కలిగిన వాహనాలు ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ .. ఆన్ గ్రౌండ్ చెక్స్ ద్వారా వాహనాలకు సంబంధించిన పీయూసీసీ స్టాటస్, ఎమిషన్ క్యాటగిరీ చెక్ చేస్తాం. పీయూసీసీ సర్టిఫికేట్ లేని వారు.. బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ వాహనాలను వాడుతున్న వారు పెట్రోల్ బంకుల దగ్గర, సరిహద్దు అధికారులతో గొడవలకు దిగవద్దు. గురువారం నుంచి కొత్త రూల్ అమల్లో ఉంటుంది. గత నవంబర్ నెలలో ఏక్యూఐ 20 పాయింట్లు తగ్గింది. గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు. 9 నుంచి 10 నెలల్లో గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన పని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కాలుష్యమనే రోగం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రజలకు క్షమాపణ చెప్పారు.