శ్రీశైలం ఘాట్ లోవిరిగిపడిన కొండ చరియలు!

శ్రీశైలం పాతాళగంగలో రోప్ వే వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలి కాలంలో ఎడతెరిపి లేకుండా కురినిస భారీ వ ర్షాల కారణంగా ఇక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ కారణంగా ఆ దారిలో వచ్చే భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  తాజాగా బుధవారం (నవంబర్ 5) తెల్లవారు జామున ఈ మార్గం గుండా హైదరాబాద్ వెళ్లే రహదారిపై లింగాలగట్టు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అసలే కార్తీక మాసం, అందులోనూ కార్తీకపౌర్ణమి కావడంతో శ్రీశైలం క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండ చరియలు విరిగిపడిన ఘటన తెల్లవారు జామున జరగడంతో పెను ప్రమాదం తప్పిందనీ, అదే కొద్ది సమయం తరువాత ఈ ఘటన జరిగి ఉంటే.. ఊహించడానికే భయం వేసేంత విపత్తు సంభవించి ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఆ  మార్గం గుండా రాకపోకలను నిలిపివేసి, కొండ చరియలు తొలగిస్తున్నారు.  

సమస్యల పరిష్కారానికి టెక్నాలజీయే దిక్సూచి.. చంద్రబాబు

రేపటి తరం భవిష్యత్ కోసం  పాలకులు,  పారిశ్రామిక వేత్తలు సరైన సరైన వేదికలను సిద్దం చేయాలనీ, అది బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.  ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రెండు పురస్కారాలతో సత్కరించిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు తన ప్రసంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నందుకుఅభినందించారు.  ప్రతిష్టాత్మక సంస్థగా ఐవోడీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందనీ, అటువంటి సంస్థ తన సతీమణి నారా భువనేశ్వరి సేవలను గుర్తించి అవార్డు ప్రదానం చేయడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని చంద్రబాబు అన్నారు.     ప్రపంచంలో  వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు, సంస్థలు  తమ తమ ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలన్న చంద్రబాబు. భౌగోళిక, రాజకీయ మార్పులతోపాటు వాతావరణ సంక్షోభాలను అధిగమించాలనీ, ఇందుకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. 1990లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుపై సందేహాలు ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను బిల్ గేట్స్ ను ఆహ్వానించి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ను స్థాపించేందుకు చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. ఇప్పుడు, భారతీయులు, ప్రత్యేకించి తెలుగు వారు గ్లోబల్ ఐటీ రంగంలో  కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఇందుకు నాడు తాను వేసిన పునాదే దోహదం చేసిందని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు  ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  వేగంగా విస్తరిస్తోందన్న ఆయన భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయన్నారు. అందుకు అనుగుణంగా  ఆలోచనలు చేయాలనీ, ఏపీలో తాము ఆ దిశగానే విధానాలను... ప్రణాళికలను రూపొందించుకుంటున్నామని చెప్పారు. గూగుల్ తన అతిపెద్ద ఏఐసెంటర్ ను అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందన్న ఆయన ఇది ఏపీలో ఇన్నోవేషన్స్, రీసెర్చ్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.   టెక్నాలజీతో ప్రజలకు  మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వాలు ముందుకు సాగాలనీ, ఏపీలో తాము అదే చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను బెంబేలెత్తించిన మొంథా తుపానును సాంకేతికత సహకారంతోనే దీటుగా ఎదుర్కొని, నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని వివరించారు.  పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా 700కు పైగా పౌర సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిచనట్లు చెప్పారు.  ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ క్లైమేట్ ఛేంజ్ అన్న చంద్రబాబు దీనిని సమష్టిగా ఎదుర్కొవాలన్నారు.  

వైభవంగా బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ

ఇంద్రకీలాదిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ బుధవారం (నవంబర్ 5) తెల్లవారు జామును అత్యంత వైభవంగా జరిగింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ గిరి ప్రదక్షిణకు ముందు ఆలయ ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ  కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేలాది మంది భక్తులతో గిరిప్రదక్షిణ జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  తెల్లవారు జామునే వేలాది మంది భక్తులు అమ్మవారి గిరిప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  కార్తీక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖసంతోషాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.  

నారా భువనేశ్వరికి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడి  సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. లండన్ లోని మే ఫెయిర్ హాలు వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు హాజరయ్యారు.  ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో భువనేశ్వరి డిస్టింగ్విష్ డ్ ఫఎలోషిప్ అవార్డును అందుకున్నారు.  సామాజిక ప్రభావం, ప్రజాసేవ అంశాలలో విశిష్ఠ సేవలు అందించినందుకుగాను  అత్యంత ప్రతిష్ఠాత్మక  సామాజిక సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.  అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్స్ లెన్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంగా గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ హోదాలో అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఎఫ్ఎంసీజీ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ ను ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు గోల్డెన్ పీకాక్ అవార్డుకు ఐఓడి సంస్థ. ఎంపిక చేసింది. నారా భువనేశ్వరి ప్రజాసేవ, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.  ఆమె సేవలకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో  అగ్రగామిగా నిలుస్తున్న తీరు పట్ల గర్వంగా ఉందని అన్నారు. అలాగే   ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న తన సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. 

కాల్పులు జరగలేదు...పోలీసుల క్లారిటీ

  హైదరాబాద్‌లో ఎటువంటి  కాల్పులు జరగలేదని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కాల్పుల ఘటనపై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చింది.  ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి పంచాయితి జరగిందని పేర్కొన్నారు. స్థలం విషయంలో  కేఈ ప్రభాకర్, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య మంగళవారం మణికొండలోని పంచవటి కాలనీలో ఘర్షణ జరిగింది.  తనపై గన్‌ పెట్టి అల్లుడు అభిషేక్ గౌడ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అల్లుడు అభిషేక్‌పై అక్టోబర్ 25వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందేశ్వర్ గౌడ్ కుమారుడే ఈ అభిషేక్ గౌడ్ కావడం విశేషం.  ప్రస్తుతం ఈ కాల్పులపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. కేఈ ప్రభాకర్  కూతురుతో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడుతో14 ఏళ్ల క్రితం పెళ్లయింది, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ జంట ఒక సంవత్సరం నుండి విడివిడిగా నివసిస్తున్నారు. ఓ ఇంటి అగ్రిమెంట్ విషయంలో విభేదాలు వచ్చాయి ఈ ఘటన చోటుచేసుకుంది.  

సోలార్ ప్రాజెక్ట్ మోసం కేసులో ఈడీ చార్జిషీట్

  ఎస్‌బీఐ బ్యాంకును మోసం చేసిన పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కీలక చర్యలు చేపట్టింది. సంస్థతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బైర్రాజు శ్రీనివాస రాజుపై ఈడీ తాజాగా చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ సంస్థ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో ఎస్‌బీఐ నుంచి ₹4.5 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందింది. ఇందుకోసం కంపెనీ అకౌంట్లలో ₹30.5 కోట్ల తప్పుడు లాభాలు ఉన్నట్లుగా చూపించి వివరాలను తారుమారు చేశారు.  ఈ తప్పుడు వివరాల ఆధారంగా ఎస్‌బీఐ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం మంజూరు చేసింది.అయితే, ఆ నిధులను ఉద్దేశించిన పనులకు వినియోగించకుండా శ్రీనివాస రాజు తన సోదరి ఖాతాలకు మళ్లించి... అనంతరం ఆ నగదును విత్‌డ్రా చేసుకు న్నట్లుగా ఈడీ విచారణలో తేలింది.  ఎస్బిఐ ఇచ్చే ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని పొందేం దుకు తప్పుడు లాభాలు చూపారని గతంలో  ఎసీబీ, సీబీఐ కేసులు నమోదు చేసుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులను ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ కోణంలో ఈడి మరో కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. గతంలోనే ఈడీ శ్రీనివాస రాజుకు చెందిన ₹3.81 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇప్పుడుతాజాగా దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ, పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు సంస్థ ఎండీ బైర్రాజు శ్రీనివాస రాజుపై చార్జిషీట్ దాఖలు చేసింది.  

సిగాచీ బాధితులకు పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు : హైకోర్టు

  పటాన్‌చెరులోని సిగాచీ కంపెనీ ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 54 మంది మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో ఆలస్యంపై విచారణ జరుగింది. కంపెనీపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఏఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఇప్పటి వరకు రూ. 25 లక్షలు మాత్రమే చెల్లించారని తెలిపింది.  మిగతా పరిహారం ఎప్పుడు అందిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యాక్టరీ ఎండీకి నోటీసులు జారీ చేసింది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఇండస్ట్రీస్‌ పేలుడు ఘటనలో 54 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే.  

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : జగన్‌

  కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన పంటలను మాజీ సీఎం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిందన్నారు.15లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. మోంథా తుపాను 25జిల్లాల్లో ప్రతీకూల ప్రభావం చూపిందని జగన్ అన్నారు.ఇన్‌పుట్‌ సబ్సీడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఉచిత భీమా అడిగితే ధాన్యం కొనరట. సాయం చేయకపోగా రైతులను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు పొలంలోకి అడుగు పెట్టకుండానే ఎన్యూమరేషన్ అయిపోయిందంటున్నారు అంటు మండిపడ్డారు.  అనంతరం రైతులతో జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ కాన్వాయ్‌ కారణంగా పెనమలూరులో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉయ్యూరులోనూ పలుచోట్ల ట్రాఫిక్‌‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు  

ఛత్తీస్ గఢ్ లో రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఛత్తీస్ గఢ్ లో రైలు ప్రమాదం జరిగింది.  బిలాస్పూర్ స్టేషన్ సమీపంలో  ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రెయిన్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయకార్యక్రమాలను చేపట్టారు.  పలుబోగీలు పట్టాలు తప్పాయి. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అత్యంత బిజీగా ఉండే బిలాస్ పూర్ -హౌరా మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.  

హిందూజా గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత

  హిందూజా గ్రూప్ ఛైర్మన్  గోపీచంద్ పి.హిందూజా (85) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న హిందూజా లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతు కన్నుమూశారు. హిందుజా ఫ్యామిలీలో రెండో తరానికి చెందిన గోపీచంద్‌ 2023లో గ్రూప్‌ సంస్థలకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్‌ మరణానంతరం ఆ బాధ్యతలు స్వీకరించారు.  గోపీచంద్‌ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజయ్‌, ధీరజ్‌, కుమార్తె రీతా ఉన్నారు.ఇండో- మిడిల్‌ ఈస్ట్‌ ట్రేడింగ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించే సంస్థను అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలపడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎనర్జీ, ఆటోమోటివ్‌, మీడియా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యాపారాలను ప్రస్తుతం హిందూజా గ్రూప్‌ నిర్వహిస్తోంది  

జైలు నుంచి ఆస్పత్రికి చెవిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. తన ఆరోగ్యం బాగా లేదంటూ చెవిరెడ్డి చెప్పడంతో వైద్య పరీక్షల కోసం ఆయనను మంగళవారం (నవంబర్ 4) మంగళగిరిలోని ఎయిమ్స్ కు తరలించారు. 3 వేల 200 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ వేగం పెంచిన సంగతి తెలిసిందే. ఈ కేసులో  చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి,  వెంకటేష్ నాయుడు, బాలాజీ, నవీన్ లపై రెండో చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  మద్యం కుంభకోణం ద్వారా వైసీపీ నాయకులు నెలనెలా 60 నుంచి 70 కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారని పేర్కొంది.  అలాగే 250 నుంచి 350 కోట్ల రూపాయల వరకూ గత ఎన్నికలలో  చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పార్టీ అభ్యర్థుల ప్రచారానికి వినియోగించారనీ సీట్ తన చార్జిషీట్ లో పేర్కొంది.   ఈ మొత్తం వ్యవహారం అంతా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కనుసన్నలలో జరిగిందని సిట్ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా మద్యంముడుపుల సొమ్ములు చెవిరెడ్డికి చేరినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే సిట్ అధికారులు తమను వేధిస్తున్నారంటూ చెవిరెడ్డి గన్ మెట్లు మదన్ రెడ్డి, గిరి చేసిన ఆరోపణలను సిట్ రాజకీయప్రేరిపితమైనవిగా కొట్టి పారేశారు.  

చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న హెచ్‌ఆర్సీ

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులు ప్రమాదానికి గల కారణాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక డిసెంబర్ 15వ తేదీ ఉదయం 11 గంటలలోపు సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది.  ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమని స్థానికులు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బస్సుపైకి దూసుకొచ్చిన టిప్పర్ బోల్తా పడటంతో.. దాంట్లో ఉన్న కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో అందులో కూరుకుపోయి 24 మంది ప్రాణాలు కోల్పోయాన సంగతి విధితమే  

రేపు మహిళ ప్రపంచ కప్ విజేతలకు ప్రధాని ఆతిథ్యం

  ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో విజయాన్ని సాధించిన భారత ఉమెన్ క్రికెట్ జట్టుకు ప్రధాని మోదీ అతిథ్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి బీసీసీఐకి ఆహ్వానం అందింది. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సమావేశం కానున్నారు.ఆదివారం జరిగిన  ప్రపంచకప్‌-2025 ఫైనల్లో భారత్‌ జట్టు దక్షిణాప్రికాపై విజేతగా  నిలిచిందన సంగతి తెలిసిందే.  ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది.  

అమ్మబాబోయ్ ఎంత పొడుగు!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సోమవారం (నవంబర్ 3) తిరుమలకు వచ్చిన ఓ మహిళ అందరి దృష్టినీ ఆకర్షించుకుంది. ఆమెను తిరుమల ప్రాంగణంలో అందరూ ఆసక్తిగా చూశారు. ఇంతకీ ఆమె అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణం ఆమె పొడుగు. ఏడడుగుల పొడుగున్న ఆమె తిరుమలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీలు పడ్డారు. ఇంతకీ ఆమె ఎవరంటే శ్రీలంక  జాతీయ నెట్ బాల్ జట్టులో మాజీ క్రీడాకారిణి.  పేరు తర్జని శివలింగం.  వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలోని భక్త బృందంతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు అడుగుల ఎత్తుతో ఉన్న ఆమె ఉన్నంత సేపు ఆలయ పరిసరాలలో సందడి వాతావరణం నెలకొంది. చాలా మంది భక్తులు ఆమెను పరిచయం చేసుకుని వివరాలడిగి తెలుసుకోవడం కనిపించింది.  

అంబర్‌పేట్‌ కిడ్నాప్‌ కేసులో 10 మంది అరెస్ట్‌

  ఎవరికీ ఎటువంటి అనుమానం కలగకుండా.. సుపారి గ్యాంగ్ చేత భర్తనే కిడ్నాప్ చేయించి... కోట్లలో డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేయడమే కాకుండా అమలు కూడా చేసింది ఓ ఇల్లాలు... కానీ భర్త తప్పించుకుని పారిపోవడం తో .... అసలు విషయం బయట పడింది. దీంతో ఆ ఇల్లాలు శ్రీ కృష్ణ జన్మస్థానానికి చేరుతుంది. అంబర్‌పేట్‌ డీడీ కాలనీలో గత నెల 29వ తేదీన జరిగిన కిడ్నాప్‌ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు.  ఈస్ట్‌ జోన్‌ డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం....ప్రధాన నిందితురాలు మాధవీలత అనే మహిళ అమెరికాలో నివాసం ఉంటున్నది. అయితే మాధవీలత... శ్యామ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. కుటుంబ కలహాలతో  మూడేళ్లకే విడిపోయింది. అనంతరం శ్యామ్‌ తన పేరును ‘అలి’గా మార్చుకుని ఫాతిమా అనే మహిళను రెండోవ వివాహం చేసు కున్నాడు. ఈ తరుణంలోనే శ్యామ్‌ తన తండ్రి నుంచి వచ్చిన సుమారు రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించాడు.  అయితే ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య మాధవీలత ఎలాగైనా సరే భర్త నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్ చేసింది.తన భర్త శ్యామ్ ను కిడ్నాప్ చేయడానికి  రామ్ నగర్‌కు చెందిన సాయి, ప్రీతి,సరిత ఈ సుపారి గ్యాంగ్ కు డబ్బులు ఇచ్చింది. జీ.ప్రీతి లేడీ బౌన్సర్‌గా పనిచేస్తుంది...ఇక ఎల్‌.సరిత అనే మరో మహిళ.... బాధితుడు శ్యామ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే రెండు రోజుల ముందు అద్దెకు దిగి.... అతని కదలికలపై నిఘా పెట్టింది.అదును చూసి ఈ సుపారి గ్యాంగ్ బాధితుడు శ్యామ్ ను కిడ్నాప్ చేసి...బాధితుడిని చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు  ఆ సమయంలో శ్యామ్‌ తన స్నేహితుడికి ఫోన్‌ చేయగా, ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం శ్యామ్‌ ఎంతో చాకచక్యంగా వారి నుంచి తప్పించు కుని పోలీసులకు వివరాలు ఇచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాధవీలత తో పాటు ప్రధాన సూత్రధారి రామనగర్‌కు చెందిన సాయి అని పోలీసులు గుర్తించారు.  అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని 10 మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు .మంత్రిశ్యామ్‌ అనే వ్యక్తిని అపహరించి రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఆరుగురు నిందితులు రెంట్‌ కార్లను ఉపయోగించి శ్యామ్‌ను కిడ్నాప్‌ చేసినట్లు విచా రణలో తేలింది. కేసులో మిగిలిన నలుగురిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.   

ఒకదానికొకటి గుద్దుకున్న జగన్ కాన్వాయ్ కారులు.. పలువురికి గాయాలు

వైసీసీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి జగన్  కృష్ణ జిల్లా పర్యటనలో  అపశ్రుతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన కారణంగా ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ఎటువంవటి ప్రమాదం జరగలేదు.    జగన్  మొంథా తుపాను ప్రభావంతో  సంభవించిన పంట నష్టాన్నిపరిశీలించేందుకు మంగళవారం (నవంబర్ 4) తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన పర్యటన పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాలలో సాగాల్సి ఉంది. అయితే ఉయ్యారు మండలం,  గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.  కాగా జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనకు కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించారు.   ఈ పర్యటనలో జగన్ కాన్వాయ్‌లో 10 వాహనాలకు మించి ఉండరాదని, మొత్తం 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు కండీషన్ పెట్టారు. నిబంధనలను అతిక్రమించి, పరిమితికి మించి జనాన్ని లేదా వాహనాలను సమీకరించినా, అనుమతిని దుర్వినియోగం చేసినా పర్యటనను తక్షణమే రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

మ‌న శ్రీచ‌ర‌ణి.. ఉప్పొంగె ధ‌ర‌ణి

అది ఏపీలోని క‌డ‌పజిల్లాలోని, య‌ర్రంప‌ల్లె అనే ఒక మారుమూల గ్రామం. అలాంటి గ్రామం నుంచి పుట్టుకొచ్చిందో భార‌త క్రికెట్ క్రీడా కుసుమం. ఆమె పేరే శ్రీచ‌ర‌ణి. శ్రీచ‌ర‌ణి  పూర్తి పేరు న‌ల్ల‌పురెడ్డి శ్రీచ‌ర‌ణి.  21 ఏళ్ల ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్ధోడాక్స్ స్పిన్న‌ర్ శ్రీచ‌ర‌ణికి  అంత‌ర్జాతీయ క్రికెట్ లో తొలి అడుగులివి. ఈ ఏడాది ఏప్రిల్ లో శ్రీలంక‌పై వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆమె ప్ర‌పంచ క‌ప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం అద‌ర‌క బెద‌ర‌క సత్తా చాటింది. తన తొలి ప్రపంచ కప్‌ టోర్నీలోనే జ‌ట్టులో కీలక పాత్ర పోషించిన ఈ కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది.  ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ 22 వికెట్ల‌తో రాణించి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో నిల‌వ‌గా.. ఆ త‌ర్వాత అత్య‌ధికంగా అంటే 13 వికెట్లు తీసి సెకండ్  బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది క‌డ‌ప బిడ్డ శ్రీచ‌ర‌ణి. త‌న క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ తో ప‌రుగులు పెద్ద‌గా ఇవ్వ‌కుండా,అత్యంత ఎకనామిక్ గా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌పై ఒత్తిడి పెంచింది. ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత సెమీ పోరులో భార‌త బౌల‌ర్లు అప‌రిమితంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటుంటే శ్రీచ‌ర‌ణి మాత్రం త‌న ప‌ది ఓవ‌ర్ల స్పెల్ లో   4. 9 ఎకాన‌మీతో కేవ‌లం 49 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు కీల‌క వికెట్లు ప‌డ‌గొట్టింది.  త‌న‌దైన‌ బౌలింగ్  శైలితో ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసి, భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించింది శ్రీ చ‌ర‌ణి. ఇక ఫైనల్ మ్యాచ్​లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్​లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి  ఒక వికెట్ సైతం తీసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది.  తమ  బిడ్డ ప్ర‌పంచ మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ లో కీల‌క పాత్ర పోషించ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్ర‌శంస‌లు పొందడం   అదృష్టంగా చెబుతున్నారు ఆమె త‌ల్లిదండ్రులు న‌ల్ల‌పురెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి,  రేణుక.   శ్రీచ‌ర‌ణి చిన్న‌ప్పుడు ఖోఖో, బ్యాడ్మింట‌న్ ఎక్కువ‌గా ఆడేద‌ని చెప్పిన త‌ల్లిదండ్రులు. ఆరో త‌ర‌గ‌తి వరకూ ఈ క్రీడ‌లు ఆడిన శ్రీచ‌ర‌ణి క‌రోనా టైంలో క్రికెట్ పై మ‌క్కువ పెంచుకుంది. మేన‌మామ కిషోర్ కుమార్ రెడ్డి స‌హ‌కారంతో.. హైద‌రాబాద్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది. శ్రీచ‌ర‌ణి ప్రైమ‌రీ ఎడ్యుకేష‌న్.. వీరపునాయునిపల్లె, ఆర్టీపీపీ డీఏవీ పాఠశాలలో సాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో చదివింది. వీరపునాయునిపల్లె- వీఆర్ఎస్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది శ్రీచరణి. క్రికెట్​లో ముందుగా ఫాస్ట్ బౌలింగ్​పై దృష్టి పెట్టిన ఈ మ‌ట్టిలో మాణిక్యం ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్​గా రూపాంత‌రం చెందింది. మంచి టెక్నిక్​తో ఆఫ్ స్పిన్నర్ గా రాణించడంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. 2024 డిసెంబర్​లో  విమెన్ ప్రీమియర్ లీగ్ వేలంపాటలో ఢిల్లీ కేపిటల్ ప్రాంచైజీ శ్రీ చరణిని  55 లక్షల రూపాయలకు దక్కించుకుంది.  శ్రీచరణి 2025లో తన తొలి ఫస్ట్ క్లాస్ట్ క్రికెట్ టోర్నీలో  ఫైవ్ వికెట్ హాల్ తీసి అందరి దృష్టిని ఆక‌ట్టుకుంది. 2022లో  శ్రీచ‌ర‌ణి ఆంధ్రా విమెన్స్ క్రికెట్ టీమ్ తరపున ఆడింది. క్రికెట్​లో బాగా రాణిస్తున్న శ్రీచరణికి ఇంట‌ర్నేష‌న‌ల్ వన్డే విమెన్స్ క్రికెట్ టోర్నీలో అడుగు పెట్టే అవకాశం ల‌భించింది. 2025 ఏప్రిల్ 27న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్​లో శ్రీచరణి అరంగేట్రం చేసింది. 2025 జూన్ 28న ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్​లకు ఎంపికైంది. ఇప్పటివరకు 18 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్​లు ఆడిన శ్రీచరణి 23 వికెట్లు పడగొట్టింది. 5 టీ20 మ్యాచ్​లు ఆడిన మ‌న‌ తెలుగమ్మాయి 10 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచ‌ర‌ణిది చాలా చాలా సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. యర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో చిరు ఉద్యోగిగా పనిచేస్తున్నారు శ్రీచరణి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి. అక్కడి ప్రాజెక్ట్ క్వార్టర్​లో నివాసం ఉంటున్నారు. క‌డ‌ప జిల్లా నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఒక క్రికెట‌ర్ ఎద‌గ‌డం ఇదే తొలిసారి అంటూ ఈ ప్రాంత వాసులు సంబ‌ర‌ప‌డిపోతున్నారు. విమెన్స్ ఇండియా జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ కొల్ల‌గొట్ట‌డంతో ఇక్క‌డి వారి  ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోతోంది.

ఇది బ‌స్సు ప్ర‌మాదాల సీజ‌నా ఏంటి?

ఒక్కో టైంలో ఒక్కో సీజ‌న్ న‌డుస్తుంది. కొన్నాళ్ల క్రితం ఎయిరిండియా విమానం లండ‌న్ కి వెళ్ల‌బోతూ.. గాల్లోకి ఎగిరిన‌ట్టే ఎగిరి.. ఆపై వెంట‌నే నేల‌కొరిగడంతో వంద‌లాది మంది  ప్రాణాలు పోయాయి. అప్ప‌టి  నుంచీ వ‌రుస విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌లు లేదా వాటికి సంబంధించిన  వార్త‌లు వెలుగు చూశాయి. మొన్న క‌ర్నూలు జిల్లా బ‌స్సు ద‌గ్ధం దుర్ఘ‌ట‌న మ‌రువ‌క ముందే నిన్న చేవెళ్ల‌లో.. ఒక బ‌స్సు టిప్ప‌ర్ లారీ ఢీ కొట్ట‌డంతో మొత్తం 19 మంది  ప్రాణాలో కోల్పోయారు. ఆపై అదే రోజు రాత్రి ఏలూరులో బ‌స్సు బోల్తా  ప‌డ్డంతో రెండు ప్రాణాలు పోయాయి. ఈ మ‌ధ్య కాలంలో కేవ‌లం బ‌స్సు దుర్ఘ‌ట‌న‌ల కార‌ణంగా తెలుగు రాష్ట్రాలలో  దాదాపు 40 మంది మృత్యువాత పడ్డారు.  చేవెళ్ల ఘ‌ట‌న జ‌రిగిన రోజు నే రాజ‌స్థాన్ లో మ‌రో ఘోర ప్ర‌మాదం జ‌ర‌గ్గా అక్క‌డ కూడా 19 మంది మరణించారు.  ఇక చేవెళ్ల ప్ర‌మాద కార‌ణాలేంటి? ఆ వివ‌రాలు ఎలా ఉన్నాయో చూస్తే.. మొత్తం ఏడు కార‌ణాల వ‌ల్ల ఈ బ‌స్పు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌టి  టిప్ప‌ర్ ఓవ‌ర్ లోడ్, స్పీడ్ తో రావ‌డం, ఆపై ఆర్టీసీ బ‌స్సు సైతం ఓవ‌ర్ లోడ్ స్పీడ్ తో ఉండ‌టం, కంక‌ర‌పై టార్పాలిన్ ప‌ట్టా క‌ప్ప‌క పోవ‌డం, కాంట్రాక్ట్ బ‌స్సు డ్రైవ‌ర్ కి డ‌బుల్ డ్యూటీ, ఇరుకైన రోడ్డు, గుంతలుండ‌టం,  50 మంది ఎక్కాల్సిన బస్సులో 72 మందిని ఎక్కించ‌డం,  అనుమతి లేకున్నా టిప్పర్ వెళ్లడం వంటివి ప్ర‌ధాన  కార‌ణాలుగా అంచ‌నా వేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో ప్ర‌యాణికులు బ‌స్సులు ఎక్కాలంటే భ‌య‌ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా ఒక ఇంట్లో అయితే ముగ్గురు ఆడ‌పిల్ల‌ల దుర్మ‌ర‌ణం అత్యంత విషాదం వీరికి ఎంత ఎక్స్ గ్రేషియా ఇచ్చినా కూడా ఆయా కుటుంబాల్లోని విషాదాన్న‌యితే ఎవ్వ‌రూ చెరిపివేయ‌లేర‌న్న మాట వినిపిస్తోంది.

పగబట్టిన ఆవు!

సాధారణంగా పాములు పగపడతాయని విన్నాం. పాములు పగబడతాయనడానికి శాస్త్రీయ ఆధారం ఏమీ లేకపోయినా.. పాము పగ అన్నది ఒక నానుడిగా మారిపోయింది. కానీ ఒక ఆవు పగపట్టినట్లుగా వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓ ఆవు పగబట్టినట్లుగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు భయం గొల్పుతున్నాయి.   ఓ వ్యక్తి సోమవారం (నవంబర్ 3) అర్ధరాత్రి సమయంలో తన ఇంటి ముందుకు వచ్చి బైక్ పార్క్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆవు అతనిపై దాడి చేసింది.  ఆవు నుండి తప్పించుకునేందుకు అతను విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేదు... ఆవు అతనిపై దాడి చేస్తుండగా... గట్టి గట్టిగా ఆర్తనాదాలు చేశాడు. అటువైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహన దారుడు ఆవును తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మరి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆవును తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఆవు మాత్రం తన దాడిని ఆపలేదు. చివరకు ఓ వ్యక్తి పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఆవుపై అమాంతం దాడి చేయడంతో ఆవు బాధితుడిని అక్కడే వదిలేసి  పారిపోయింది. ఈ ఘటనలో ఆవుదాడికి గురైన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.  కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు... ఆవుదాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.