నీట మునిగిన పంట పొలాలను గుర్తించండి : సీఎం చంద్రబాబు
posted on Oct 31, 2025 @ 5:54PM
మొంథా తుఫాన్‌తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన కాపాడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ తదనంతర చర్యలపై శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారం కల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గం వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి... ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడకి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు.
అందరూ కలిసి సమన్వయంతో పని చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని... పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా తగు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60 శాతం మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని విన్నవించారు.
కేంద్రాన్ని తక్షణ సాయం కోరండి
మొంథా తుఫాన్‌తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని సీఎం చెప్పారు.
అలాగే కృష్ణా నదిలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ఆయన అధికారులకు నిర్దేశించారు. శనివారం ఉదయం 10 గంటలకు సుమారు 100 మందిని గౌరవించుకునేలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.