ఆహార సంక్షోభం ముంగిట అగ్రరాజ్యం
posted on Oct 31, 2025 @ 9:53AM
షట్‌డౌన్ ఎఫెక్ట్ తో అమెరికా తీవ్ర ఆహార సంక్షోభం ముంగిట నిలిచింది. అమెరికా ప్రభుత్వం ప్రకటించిన షట్ డౌన్ కారణంగా ఆహార సాయం నిలిచిపోనున్న నేపథ్యంలో న్యూయార్క్ రాష్ట్రం ఎమర్జెన్సీ ప్రకటించింది. అత్యవసర ఆహార సహాయం కోసం రాష్ట్రం తరఫున 65 మిలియన్ డాలర్ల నిధులను విడుదల చేస్తున్నామని న్యూయార్క్ మేయర్ ప్రకటించారు.
ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికాలో అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ఏపీ) ప్రయోజనాలు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత కారణంగా నవంబర్ నెల ఎస్ఎన్ఏపీ ప్రయోజనాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిలిపివేయాలని అమెరికా వ్యవసాయ శాఖ రాష్ట్ర ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. షట్ డౌన్ కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకుం టున్నాయి. లూసియానా గవర్నర్ గత వారమే అత్యవసర పరిస్థితి ప్రకటించి, ఎస్ఎన్ఏపీ లబ్ధి దారులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర నిధులు కేటాయించారు.
అదే విధంగా వెర్మంట్ రాష్ట్రం వచ్చే నెల 15 వరకు నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. న్యూ మెక్సికో 30 మిలియన్ డాలర్ల అత్యవసర ఆహార సహాయాన్ని ప్రకటించింది. షట్ డౌన్ నేపథ్యంలో అమెరికాలోని పాతిక రాష్ట్రాలకు చెందిన డెమోక్రటిక్ గవర్నర్లు అత్యవసర నిధులు వినియోగించే అధికారం తమకు లేదంటున్న ప్రజలకు ఆహార సాయం కొనసాగించేందుకు కాంగ్రెస్ ఆమోదించిన నిధులను వెంటనే విడుదల చేయాలని వారా దావాలో కోరారు.