సా...గుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణం.. బెజవాడను వీడని ట్రాఫిక్ కష్టాలు
కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మిస్తున్న జాతీయ రహదారి, విజయవాడ వెస్ట్ బైపాస్ కొన సా,,,గుతూనే ఉంది. గత వైసీపీ హయాంలో ఈ బైపాస్ నిర్మాణం 80 శాతం పూర్తయ్యిందని చెప్పుకుని తమ భుజాలను తామే చరిచేసుకున్న కాంట్రాక్టర్లు.. ఇప్పుడు మిగిలిన 20 శాతం పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి 80శాతం పూర్తయ్యిందంటూ గతంలో వారు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమనీ, బిల్లులు వసూలు చేసుకుని పనులను పక్కన పెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇతర ప్రాంతాలలో కనెక్టివిటీ కి ఈ బైపాస్ నిర్మాణం నత్తనడకను గుర్తు చేస్తుండటంతో... అవరోధాలు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తొలగడం లేదు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో.. బెజవాడ నగరం నడిబొడ్డు నుంచే భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో బెజవాడ నగరం నిత్యం ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది.
కృష్ణాజిల్లా చిన్న అవుట్ పల్లి నుండి, గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు.. దాదాపు 47.8 కిలోమీటర్ల మేర విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం 2021 లో ప్రారంభమైంది. ఇది పూర్తయితే.. కోల్ కతా, ఒరిస్సా విశాఖ ల నుండి వచ్చే భారీ వాహనాలు, హైదరాబాద్ చెన్నై వంటి నగరాలకు బెజవాడలోకి రావలసిన పని ఉండది. చెన్నై, కోల్ కతాలకు వెళ్లే, వచ్చే భారీ వాహనాలు ఇటు గన్నవరం సమీపంలోని చిన్న ఔట్ పల్లి, అటు మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ చేరుకుంటాయి. దీంతో బెజవాడకు ట్రాఫిక్ భారం తొలగిపోతుంది.
ఇక హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి జంక్షన్ వద్ద డైవర్ట్ అవుతాయి. వెస్ట్ బైపాస్ జాతీయ రహదారిపై అమరావతి గుండా ప్రయాణం చేసి , మూడు కిలోమీటర్ల పైగా నిర్మించిన కృష్ణ వారధిని దాటుకుంటూ వాహనాలు చెన్నై హైదరాబాద్ కోల్ కతా వంటి నగరాలకు చేరుకునేందుకు జాతీయ రహదారిపైకి నేరుగా చేరుకుంటాయి. అంతే కాదు ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే.. గుంటూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణంలో దాదాపు గంట సమయం ఆదా అవుతుంది. ఈ బైపాస్ పూర్తై.. బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తీరే రోజెప్పుడొస్తుందా? అని జనం ఎదురు చూస్తున్నారు.