రావ‌ణుడ్ని కాల్చ‌వద్దంటూ...రోడ్డెక్కిన బ్రాహ్మ‌ణులు!

 

దేవుడా ఈ స‌మాజాన్నినువ్వే కాపాడాలి? అయినా ఎటు పోతోందీ స‌మాజం? ఏంటీ వైప‌రీత్యం.. నువ్వే మాకు ర‌క్ష అంటూ ప్రార్ధించాల్సి వ‌స్తోంది చూస్తోంటే.. తాజాగా కొంద‌రు బ్రాహ్మ‌ణులు.. ఒక కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు.. అదేంటంటే  రావ‌ణుడు బ్రాహ్మ‌ణుడు ఆయ‌న్ను ద‌స‌రా సంద‌ర్భంగా కాల్చ‌వ‌ద్దంటూ డిమాండ్ చేశారు.

ఇప్ప‌టికే ద‌ళితులు రావ‌ణుడు, న‌ర‌కాస‌రుడు మా వాళ్లు. వాళ్ల‌ను అవ‌మానించ‌వ‌ద్ద‌న్ని వీరి వాద‌న‌గా ఉంటూ వ‌చ్చింది ఇన్నాళ్లు. ఇప్పుడీ వాద‌న కాస్తా బ్రాహ్మ‌ణులు అందుకున్నారు.

దీంతో రావ‌ణుడు ఎవ‌ర‌న్న చ‌ర్చ‌కు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. బేసిగ్గానే రావ‌ణుడ్ని పిలవ‌డ‌మే రావ‌ణ బ్ర‌హ్మ అంటారు. అలాంటి రావ‌ణ బ్ర‌హ్మ బ్రాహ్మ‌ణుడ‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి పురాణాలు తిర‌గ‌వేయ‌క్క‌ర్లేదు.

ఇక న‌ర‌కాస‌రుడు కూడా రాక్ష‌సుడేం కాదు.. మ‌హా విష్ణువు వ‌రాహ అవ‌తారంలో భూమిని కాపాడిన‌పుడు జ‌రిగిన సంయోగం ద్వారా పుట్టిన వాడు. అత‌డి పుట్టుక‌కు బీజం వేసిన వేళా విశేషం.. రాక్ష‌స ల‌క్ష‌ణాలు అల‌వ‌డ్డాయి. దీంతో.. అత‌డు జ‌న‌పీడితుడ‌య్యాడు. ఈ విష‌యం గుర్తించిన భూదేవి మ‌హా విష్ణువును ఒక వ‌రం అడిగింది. త‌నే స్వ‌యంగా త‌న పుత్రుడ్ని క‌డ‌తేర్చుతాన‌ని కోరారామె. అందులో భాగంగానే ద్వాప‌ర యుగంలో స‌త్య‌భామ‌గా న‌ర‌కాసుర వ‌ధ చేశారు. అదే మ‌న‌కు దీపావ‌ళి అయ్యింది.

ఈ ఇరువురు రాక్ష‌సుల‌కు ద‌ళితుల‌కు సంబంధమే లేదు. బ్ర‌హ్మ రాక్ష‌సుడు అన్న ప‌దంలో శూచించే బ్ర‌హ్మ శ‌బ్ధం కూడా ఇదే. పాండిత్య శోధ‌న‌లో.. ఒక్కోసారి త‌ప్పులు దొర్లి వారికంటూ ఆ జ‌న్మ శాపంగా ల‌భిస్తుంది. దీంతో వారు బ్ర‌హ్మ రాక్ష‌సులై జ‌న‌కంట‌కుల‌వుతారు.

అయితే ఇక్క‌డ రావ‌ణాసురుడి విష‌యంలో బ్రాహ్మ‌ణులు తెలుసుకోవ‌ల్సినదేంటంటే అస‌లు దేవ‌త‌ల్లో కూడా బ్రాహ్మ‌ణులు ఎవ‌రూ ఉండ‌రు. శివుడు ఏకంగా జంగ‌మ‌య్య‌, స్మ‌శాన  వాసి. ఆపై ద‌శావ‌తారాల్లో ప‌రుశురామ‌, వామ‌న అవ‌తారాలు త‌ప్ప మిగిలినవ‌న్నీ బ్రాహ్మ‌ణేత‌ర అవ‌తారాలే. బ్రాహ్మ‌ణ అవ‌తారాలైన ప‌రుశురామ‌, వ‌రాహ మూర్తుల‌కు అస‌లు పూజ‌లు, అర్చ‌న‌లే పెద్ద‌గా ఉండ‌వు.

బ్రాహ్మ‌ణుల వైదీక‌మంతా న‌డిచేది క్ష‌త్రియ రామ‌, యాద‌వ కృష్ణ‌, ఆపై అర్ధ‌న‌రులైన న‌ర‌సింహ వంటి అవ‌తారాల‌కే. ఇందులోని అర్ధ‌మేంటంటే.. స‌త్య‌భామ‌లా మ‌న‌మూ వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌ద‌ని. త‌ప్పు చేసిన వాడు ఎవ‌రైనా స‌రే స‌మ‌న్యాయం పాటించాలి. 

కుల‌మ‌త వ‌ర్గ వైష‌మ్యాల‌కు, రాగ ద్వేషాల‌కు తావు లేద‌న్న ధ‌ర్మం పాటించ‌డంలో భాగంగా.. బ్రాహ్మ‌ణుడైనా.. రావ‌ణుడు త‌ప్పే అన్న‌ది ఎప్ప‌టి నుంచో ఈ బ్రాహ్మ‌ణీకం ఆచ‌రిస్తూ వ‌చ్చిన ఆచారం. ఆపై న‌ర‌కాసురుడి విష‌యంలోనూ ఇదే నియమం. వారు ఆది నుంచీ పాటిస్తూ వ‌స్తున్నారు. ధ‌ర్మ నిబ‌ద్ధులు, బ్ర‌హ్మ జ్ఞానులైతే త‌ప్ప‌క ఆద‌రించాల‌న్న‌ ఆలోచ‌న‌ల్లోంచి పుట్టుకొచ్చిందే రామ‌కృష్ణ‌నార‌సింహ వంటి బ్రాహ్మ‌ణేత‌ర దేవుళ్ల ఆరాధ‌న‌. కాబ‌ట్టి ఈ విష‌యం తెలుసుకోకుండా ఇలా రోడ్లు ఎక్క‌డం స‌రికాదంటారు చాగంటి, గ‌రిక‌పాటి వంటి  పండితోత్త‌ములు!


 

షూటింగ్ జాతీయ కోచ్‌పై లైంగిక వేధింపుల కేసు.. సస్పెన్షన్ వేటు

  కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఫరీదాబాద్ లోని ఓ హోటల్ గదిలో తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు జాతీయ స్థాయి షూటర్‌ అయిన 17 ఏళ్ల బాలిక ఆరోపించడంతో ఆయనపై ఈ వేటు పడింది. ఈ నేపథ్యంలో అంకుశ్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు.  బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. హోటల్ గదిలో జరిగిన సంఘటనల గురించి సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన ఆటతీరు సమీక్షించాలనే సాకుతో ఫరీదాబాద్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌కు పిలిచి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెబితే కెరీర్‌ను నాశనం చేస్తానని కోచ్ బెదిరించాడని తెలిపింది. హోటల్ నుంచి బయటకు వెళ్లిన బాధితురాలు కుటుంబసభ్యులకు జరిగిన దారుణం గురించి చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జాతీయస్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా షూటర్‌పై ఈ లైంగిక దాడి జరిగింది. అంకుశ్‌ భరద్వాజ్‌పై పోక్సోసహా పలు సెక్షన్ల కింద ఫరీదాబాద్ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణలను ధృవీకరించడానికి సంఘటన జరిగిన రోజు హోటల్‌లోని అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను వెంటనే భద్రపరిచి తమకు అందజేయాలని నిర్వాహకులను కోరామని పోలీసులు తెలిపారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించిన 13మంది జాతీయ షూటింగ్ కోచ్‌ల్లో అంకుశ్‌ ఒకరు. లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో విచారణ ముగిసేవరకూ అంకుశ్ భరద్వాజ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు.     

ప్రపంచ కుబేరుడు థాయ్‌లాండ్ రాజు... రూ.4.5 లక్ష కోట్ల ఆస్తులు

  ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ.. ఏ వ్యాపార సామ్రాజ్యంతో సంబంధం లేకుండా.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తులు, వాటిని తెలివిగా పెట్టుబడులు పెట్టి ఒక రాజు ఏకంగా రూ. 4.5 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆయనే థాయ్‌లాండ్ రాజు మహా వజ్రాలాంగ్‌కోర్న్ ( కింగ్ రామ 10). ఆయన తన తండ్రి కింగ్ భూమిబోల్ అదుల్యాడేజ్ (కింగ్ రామ 11) మరణం తరువాత 2016లో సింహాసనాన్ని అధిష్టించారు. 2019లో అధికారికంగా పట్టాభిషేకం జరిగింది.  ఆయనకు ఉన్న ఇళ్లల్లో రోజుకో ఇంటికి వెళ్లి బస చేసినా.. తిరిగి మొదటి ఇంటికి చేరుకునేందుకు 47 ఏళ్లు పడుతుందట.  థాయ్‌లాండ్ రాజు సంపద అక్షరాలా 50 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఆయన విలాసవంతమైన లైఫ్‌స్టైల్ చూస్తే ప్రపంచంలో ఉన్న కుబేరులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు పేరు మీద థాయ్‌లాండ్‌లో వేల సంఖ్యలో భవనాలు, రాజప్రాసాదాలు ఉన్నాయి.   ఇక థాయ్‌లాండ్ రాజు వద్ద 38 ప్రైవేట్ జెట్‌లు, విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 300కు పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అయిన రోల్స్ రాయిస్, బెంట్లీ వంటివి ఉన్నాయి. ఆయన వద్ద పడవలు కూడా ఉన్నాయి. మొత్తం 52 బంగారు పూత పూసిన పడవలు ఉన్నాయంటే ఆయన సంపద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రం అయిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వద్దే ఉండటం విశేషం. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు ఆదాయానికి ప్రధాన వనరు థాయ్‌లాండ్ దేశంలోని భూములేనని సంబంధిత వర్గాలు చెబుతాయి.  థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఆయన ఆధీనంలో సుమారు 16 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క బ్యాంకాక్‌ నగరంలోనే 17 వేలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ఏటా వేల కోట్ల రూపాయలు ఆయన సంపదలోకి వచ్చి చేరతాయి. కార్పొరేట్ పెట్టుబడుల ద్వారా కూడా థాయిలాండ్ రాజు ఆస్తులు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని అతిపెద్ద బ్యాంక్ అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వాటాలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ సియామ్ సిమెంట్‌లో కూడా 33 శాతం వాటాలు ఈయనకే ఉన్నాయి.     

టీ20 వరల్డ్ ముందు భారత్‌కు షాక్...కీలక ప్లేయర్ దూరం

  ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  జట్టులో మంచి ఫాంలో ఉన్న యువ బ్యాట్స్‌మన్ తిలక్‌వర్మకు పొట్ట కింద భాగంలో గాయమవ్వడంతో అతనికి ఆపరేషన్ చేశారు. తిలక్ కోలుకోవడానికి కొన్ని వారాలు పడుతుందని వైద్యులు వెల్లడించారు.   ఆ క్రమంలో ఈ నెల 21 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టీ 20 సిరీస్‌‌కు ఆ హైదరాబాదీ క్రికెటర్ దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్  హజారే ట్రోఫీలో హైదరాబాద్ మ్యాచ్‌లు రాజ్‌కోట్‌లో జరుగుతున్నాయి. హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా ఇటీవల అతనికి పొట్ట కింద భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే స్కానింగ్ చేయించారు. డాక్టర్ల సూచన మేరకు తిలక్‌కు తక్షణం సర్జరీ చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే 3, 4 వారాలు ఆటకు దూరమవ్వనున్నాడు. ఫలితంగా కివీస్‌తో సిరీస్‌కు ఆ యువ బ్యాట్స్‌మాన్ అందుబాటులో ఉండడు. అతడి స్థానంలో ఇప్పటివరకు మరొకరికి జట్టులోకి తీసుకోలేదు. ఏదేమైనా కొంతకాలంగా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న తిలక్ టీ20 ప్రపంచ కప్ ముందు గాయపడటం టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ. అతడు వరల్డ్ కప్‌లో ఆడినా ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. పాకిస్థాన్‌తో జరిగిన 2025 ఆసియా కప్ ఫైనల్లో ఈ హైదరాబాదీ బ్యాటర్ అదరగొట్టాడు. 53 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో బ్రేక్‌ఫాస్ట్ : సీఎం రేవంత్ రెడ్డి

  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ మొద‌టి విడ‌త‌లో పూర్త‌య్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న మూడేళ్ల‌లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒకొక్క‌టి చొప్పున వైఐఐఆర్‌ ఎస్ ల నిర్మాణాలు పూర్తి చేయాల్సిందేన‌న్నారు. ప్ర‌స్తుతం బాలిక‌ల‌కు స్కూల్స్ కేటాయించిన నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాల‌న్నారు.  విద్యా శాఖ‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో  ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. వైఐఐఆర్‌సీలో సోలార్ కిచెన్ల నిర్మాణాన్ని పీఎం కుసుమ్‌లో చేప‌ట్టే అవ‌కాశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. వైఐఐఆర్ ఎస్ ల నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు.  త‌గినంత స్థ‌లం, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తే ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని అక్ష‌య‌పాత్ర ప్ర‌తినిధులు సీఎంకు తెలియ‌జేశారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థ‌లం కేటాయింపు లేదా 99 సంవ‌త్స‌రాల‌కు లీజు  తీసుకునే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని  ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుకు ముఖ్య‌మంత్రి సూచించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నాటికి అందుబాటులోకి రావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  బాచుప‌ల్లి పాఠ‌శాల స్థ‌లం కేవ‌లం అర ఎక‌రం మాత్ర‌మే ఉండ‌డంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎక్క‌డైనా పాఠ‌శాల‌కు క‌నీసం ఎక‌రంన్న‌ర స్థ‌లం ఉండాల‌ని, బాచుపల్లి ప్ర‌స్తుతం ఉన్న స్థ‌లం స‌మీపంలో ఎక‌రంన్న‌ర ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాల‌ని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆయన సూచించారు.  పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాల‌ని  ఆదేశించారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న ఉండాల‌ని సీఎం అన్నారు.  ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు కే. కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ కార్య‌ద‌ర్శి యోగితా రాణా, రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ‌దేవ‌సేన‌, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య‌, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ న‌వీన్ నికోల‌స్‌, ఉస్మానియా విశ్వ విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ ప్రొఫెస‌ర్‌ మొలుగారం కుమార్‌, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ వి.ఎల్‌.వి.ఎస్‌.ఎస్‌.సుబ్బారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.     

సరస్ మేళా 2026ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు  దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. గుంటూరులో సరస్ మేళా 2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు.  అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ...డ్వాక్రా సంఘాలను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై సొంతగా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 ఏళ్ల క్రితం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చాను. ఆనాడు డ్వాక్రా మహిళలు మీటింగుల కోసం బయటకు వస్తే ఎంతోమంది ఎగతాళి చేశారు. కానీ నేడు డ్వాక్రా సంఘలు తిరుగులేని వ్యవస్థగా దేశంలోనే రికార్డు సృష్టించాయి. డ్వాక్రా, మెప్నా సంఘాలు నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. రాష్ట్రంలో కోటీ 13 లక్షలమంది డ్వాక్రా మహిళలు రూ. 26 వేల కోట్ల నిధిని, రూ. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం.  2024-25లో డ్వాక్రా సంఘాలు రూ. 46,590 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసిన  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను అభినందిస్తున్నాను. ఈ ఎక్స్‌పోను చూస్తుంటే మినీ ఇండియాను తలపిస్తోంది. అంతటా పండుగ వాతావరణం నెలకొంది.  సరస్ మేళా సంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్ తీసుకురావడంతో పాటు మార్కెట్ లింకేజీ సదుపాయాన్ని కల్పిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.  ఆడబిడ్డలతో ప్రత్యేక అనుబంధం ఆడబిడ్డలతో తెలుగుదేశం పార్టీ అనుబంధం ఈ నాటికి కాదు. ఆనాడు ఎన్టీఆర్ మగవారితో సమానంగా మహిళలకు ఆస్తిహక్కు కల్పించారు. మహిళల కోసం తిరుపతిలో పద్మావతీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళకు ఆర్థిక భరోసా కల్పించాను. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల్లో 89 లక్షలమంది, మెప్నా సంఘాల్లో 24 లక్షల మంది సభ్యులున్నారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తాయని నేను చెప్పిన మాటను పొదుపు మహిళలు తూచా తప్పకుండా పాటించి ఆర్థిక ప్రగతి సాధించారు.  2024-25లో రూ. 46 వేల 590 కోట్ల రూపాయి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు.  నేనిచ్చిన ఐటీ పిలుపుతో ఎంతోమంది దేశ విదేశాల్లో ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడ్డారు. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 93 వేలమంది మైక్రో, ఎంఎస్ ఎంఈ ఎంట్రప్రెన్యూర్లు అయ్యారు.  డ్వాక్రా మహిళలు విదేశాలు కూడా వెళ్లి ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలను మరింత సమర్థవంతంగా తయారుచేసే బాధ్యత నాదని సీఎం చంద్రబాబు అన్నారు.  ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు ముఖ్యమంత్రి అంటే పెత్తందారు కాదు. ప్రజా సేవకుడు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోంది. తల్లికి వందనం కింద ఏడాదికి రూ.10,090 కోట్లు 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నాం.  ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం స్త్రీ శక్తి పథకం తీసుకువచ్చాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరుల వద్దకే ప్రభుత్వ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.  సంజీవని కార్యక్రమం ద్వారా ఐదు కోట్ల ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నాం. పేదరికం లేని రాష్ట్రం లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు స్త్రీ నిధి పథకం కింద డ్వాక్రా సంఘాలకు రుణంగా రూ.1,375 కోట్ల చెక్కును సీఎం అందించారు. సెర్ప్ నుంచి రూ.2171 కోట్లను పొదుపు సంఘాలకు రుణంగా అందించారు. చేనేత వస్త్ర స్టాళ్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరికి చీరను కొనుగోలు చేశారు.  భర్తకు ఆరోగ్యం బాగోలేదని తన దృష్టికి తీసుకొచ్చిన పొదుపు మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.6 లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంజూరు చేశారు.     

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగుల ఆందోళన

  జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అశోక్‌నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులు, నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు  రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలతో ఆశోక్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.  అభ్యర్థులను చెదరగొట్టిన పోలీసులు.. కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే వారందరినీ విడుదల చేసి, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని   తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా  నిరుద్యోగులకు కవిత సంఘీభావం తెలిపారు

కేసీఆర్‌ను కలిసిన మహిళా మంత్రులు...ఎందుకంటే?

  మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు మంత్రులు ఆయన నివాసాన్ని సందర్శించారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆకాంక్షరెడ్డి కలిసి కేసీఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానాలు అందజేసినప్పటికీ కేసీఆర్‌ను ఎదురుగా కలుసుకునే అవకాశం రాలేదని మంత్రి సీతక్క అన్నారు. అందుకే ప్రత్యేకంగా ఆయన వద్దకు వచ్చి సాంప్రదాయబద్ధంగా ఆహ్వానం ఇచ్చామని తెలిపారు. ఆదివాసుల గౌరవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర అయిన మేడారం మహాజాతరకు తప్పకుండా రావాలంటూ కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మకు ఆహ్వానం అందజేశారు. తల్లుల బంగారం, వస్త్రాలను అందించి గౌరవించారు. మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించడంతో ఆనందంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాజకీయాలకది సమయం కాదని, రాష్ట్ర పండుగగా జరుపుకునే ఈ జాతరకు ప్రతి ఒక్కరూ రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కేసీఆర్ కూడా మేడారం మహాజాతరకు వచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు.  

పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

  తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనం పరిధిలోకి వస్తారని పేర్కొంది. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని , ఈ వ్యవహారంలో టీటీడీ, అధికారులకు నిబంధనలు పాటించలేదని తప్పుబట్టింది. బాధ్యలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఛార్జిషీటు వేసే వరకు కేసును స్వయంగా పర్యవేక్షిస్తామని స్ఫష్టం చేసింది.టీటీడీలో భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలను లెక్కించే విభాగమైన పరకామణి లో రవికుమార్ అనే పెదజీయర్ మఠం ఉద్యోగి చోరీ చేశాడు.   అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో పనిచేసే కొందరు సిబ్బంది, ఇతర వ్యక్తులతో కలిసి హుండీ నగదును అపహరిస్తూ దొరికపోయారు. అప్పట్లో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే  టీటీడీ విజిలన్స్ సిబ్బంది రాజీ చేసుకుని అతను ఇచ్చిన ఆస్తులను టీటీడీపై బదిలీ చేశారు. ఇలా దొంగ దొరికిపోతే రాజీ చేసుకోవడం.. ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అతనికి అంత పెద్ద మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయి.. దొంగతనం ఎంత కాలం జరుగుతోందన్న అంశంపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు పోలీసుల పాత్ర కూడా బయటపడింది

దేశవ్యాప్తంగా సమగ్ర జనగణనకు కేంద్రం నోటిఫికేషన్

  దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి దశగా ఇళ్ల గణన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం(8-1-26) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై.. సెప్టెంబర్ 30వ తేదీతో ఈ ప్రక్రియ ముగియనుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం 30 రోజులపాటు ఈ ప్రక్రియను నిర్వహించనుంది. హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, భవనాలు, నిర్మాణాల వివరాలను సేకరించనున్నారు.  దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన నిర్వహిస్తుస్తారు. కానీ కొవిడ్ కారణంగా.. ఈ ప్రక్రియను వాయిదా వేశారు. తాజాగా ఈ జనన గణన ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. ఇక రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.  అందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేయనుంది. ఈ జనగణనతోపాటే కులగణనను సైతం చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి.. పూర్తి చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపడుతుందంటూ మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.