సాఫ్ట్ వేర్ రంగంలో సంక్షోభం.. కారణమదేనా?
posted on Oct 6, 2025 @ 11:11AM
పాతికేళ్లుగా దేశంలో దినదినప్రవర్ధమానంగా పెరిగిన ఐటీ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. దేశంలో నియో మిడిల్ క్లాస్ కు పునాది వేసిన ఐటీ రంగం దేశ ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదం చేసింది. ఈ నియో మిడిల్ క్లాస్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అదెలా అంటే.. ఈ వర్గమే కొనుగోళ్లకు ముందు వెనుకలాలోచించకుండా ముందుకు దూకుతుంది. తద్వారా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఐటీ రంగంలో పని చేసే వారికి లక్షల్లో వేతనాలు రావడంతో.. వారు కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. ఇలా ఐటీ రంగం విస్తృతితో సమాజంలో కొత్తగా ఆవిర్భవించిన ఈ నియో మిడిల్ క్లాస్.. ఇప్పుడు ఐటీ రంగం సంక్షోభంలో పడటంతో నియో పూర్ గా మారే అవకాశం ఉంది. అంటే సొంత ఇల్లు, లావిష్ ఫర్నిచర్, కార్లు అన్ని ఉండి కూడా కనీస అవసరాలు తీర్చుకునేందుకు సొమ్ములు లేని వర్గం అన్నమాట.
ఇప్పుడీ సంక్షోభానికి కారణమేంటని ఆలోచిస్తే.. ఐటీ ఉద్యోగాలలో మంచి వేతనాలు, జీవనస్థాయి పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఇంజినీరింగ్ విద్యపై మక్కువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు పుంఖాను పుంఖాలుగా వెలిశాయి. ప్రతిభా, సామర్ధ్యం, జ్ణానం వంటి వాటితో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ పట్టభద్రులయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో అత్యధికులు సాఫ్ట వేర్ ఇంజినీరింగ్ కోర్సుల పట్లే మక్కువ చూపి చేరడంతో గత కొన్నేళ్లుగా ఈ రంగంలో మాంద్యం ఏర్పడింది. కొత్త ఉద్యోగాల కల్పన మందగించింది. పలు ఐటీ కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం అటుంచి.. ఉన్నవారిని తొలగించే చర్యలు ప్రారంభించాయి. ఉదాహరణకు టీసీఎస్ గత రెండేళ్లుగా వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఆ ఉద్వాసనల పర్వం ఈ ఏడు కూడా కొనసాగుతుందని ప్రకటించింది కూడా.
ఉద్వాసన పలికే ఉద్యోగికి రమారమి రెండేళ్ల వేతనం ఇచ్చి సాగనంపుతోంది. అలాగే మైక్రోసాఫ్ట్ లో కూడా ఉద్వాసనల పర్వం మొదలైంది. ఆ కంపెనీ ఇంచుమించు 15 వేల మందిని సాగనంపింది. ఇంకా అమెజాన్, ఇన్ఫోసిస్, డెలాయిట్ ఐబీఎం వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు లేఫ్స్ ప్రకటిస్తున్నాయి.
వాస్తవానికి ఐటీ కంపెనీలలో ఉద్వాసనకు గురౌతున్న వారంతా టెక్నికల్ గా అప్ డేట్ కానివారేనని అంటున్నా.. అది పూర్తిగా వాస్తవం కాదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ కు మించి అభ్యర్థులు అందుబాటులో ఉండటంతో.. నైపుణ్యం ఉన్నా హై సాలరీడ్ ఉద్యోగులకు ఇంటి దారి చూపడానికే ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని చెబుతున్నారు. అన్నిటికీ మించి ఏఐ, క్యాంటమ్ కంప్యూటింగ్ కూడా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటివల్ల భవిష్యత్లో ఐటీ ఉద్యోగాలలో మరిన్ని భారీ కోతలు అనివార్యమని అంటున్నారు.