బతికున్న గొర్రె–మేకల రక్తంతో అక్రమ వ్యాపారం
హైదరాబాద్ నగరంలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాఫియా వ్యవహారం వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేపుతుంది. జంతు హింసతో పాటు డ్రగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లోని ఒక ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ కంపెనీపై విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించగా, భారీగా రక్త నిల్వలు బయటపడ్డాయి.
కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు, హైదరాబాద్ పోలీసులు, స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి కాచిగూడలోని CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారుల కంటపడిన దృశ్యాలు విస్మయానికి గురి చేశాయి. గోదాములలో ప్యాకెట్ల రూపంలో భారీగా గొర్రె, మేక రక్తాన్ని నిల్వ చేసి ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు. సుమారు వెయ్యి లీటర్లకు పైగా రక్తంను ప్యాకెట్లలో భద్రపరిచి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా ఈ రక్తాన్ని నిల్వ చేయడం, తరలించడం పూర్తిగా అక్రమమని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. రక్తానికి సంబంధించిన అన్ని ప్యాకెట్లను సీజ్ చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో ఈ రక్తాన్ని హర్యానాలోని పాలీ మెడికూర్ అనే కంపెనీకి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంపోర్ట్–ఎక్స్‌పోర్ట్ పేరుతో రక్తాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిస్తూ, ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు అధికారులు అనుమాని స్తున్నారు. అసలు గొర్రె, మేకల రక్తాన్ని ఏ అవసరానికి వినియోగిస్తున్నారన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే, ఈ రక్తాన్ని క్లినికల్ ట్రయల్స్, ఔషధ తయారీ లేదా బయో–మెడికల్ ప్రయోగాల కోసం అక్రమంగా ఉపయోగిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు అనుమానిస్తూ దర్యాప్తు కొనసాగించారు.
దీనికి సంబంధించిన పత్రాలు, లైసెన్సులు ఏవీ కంపెనీ వద్ద లభించలేదు. CNK ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీ లో ఉన్నాడు. గత రెండు రోజులుగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నికేష్‌ను అదుపులోకి తీసుకుంటే రక్తం సేకరణ, నిల్వ, సరఫరా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కీసర ప్రాంతంలోని నిర్మానుష ప్రాంతాల్లో గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం లభించింది. ఎలాంటి వెటర్నరీ పర్యవేక్షణ లేకుండా, జంతువులకు తీవ్ర హింస చేస్తూ ఈ రక్తాన్ని సేకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది జంతు సంక్షేమ చట్టాలకు పూర్తి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు
ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో కేంద్ర డ్రగ్ కంట్రోల్‌తో పాటు ఇతర కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశ ముంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, జంతు హింస నిరోధక చట్టం, అక్రమ రవాణా నిబంధనల కింద కేసులు నమోదు చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ అక్రమ రక్త వ్యాపారం వెనుక మరిన్ని కంపెనీలు, వ్యక్తులు ఉన్నారా? దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడికి ఈ రక్తాన్ని సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసా గుతోంది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదు నగరంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో జంతు ప్రియులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు... అసలు ఈ రక్తంతో ఏం చేస్తున్నారనే పూర్తి వివరాలు నిందితుల అరెస్టులతోనే వెలుగులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు