స్థానిక ఎన్నికలకు బ్రేక్.. రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

  స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.9ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. అనంతరం ఎన్నికల నోటిఫికేషన్, జీవోలపై స్టే ఇస్తూ 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం కోర్టు విచారణకు మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ నాలుగు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.  

జగన్ కు నర్సీపట్నంలో నిరసనల సెగ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం పర్యటన రసాబాసగా మారింది. ఆయన   పర్యటన సందర్భంగా నర్సీపట్నం వ్యాప్తంగా దివంగత డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు ఆయనకు స్వాగతం పలికాయి. కరోసా సమయంలో డాక్టర్లకు కనీసం మాస్కు కూడా ఇవ్వలేకపోయిందంటూ అప్పటి జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన కారణంగా దళితుడైన  డాక్టర్ సుధాకర్ పై  అప్పటి జగన్ సర్కార్ అత్యంత అమానుషంగా వ్యవహరించింది. ఆయన విమర్శలను సాకుగా చూపుతూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిది. అంతటితో ఆగకుండా సుధాకర్ ను విశాఖలోని పోర్టు ఆస్పత్రి జంక్షన్ వద్ద మండుటెండలో అర్థనగ్నంగా మోకాళ్లపై కూర్చోపెట్టి చేతులు, కాళ్లకు తాళ్లు కట్టి మరీ పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతే కాకుండా ఆయనపై పిచ్చివాడన్న ముద్ర వేశారు. దీనిపై అప్పట్లో ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అనంతరం డాక్టర్ సుధాకర్ మరణించారు. వైసీపీ వేధింపుల కారణంగానే సుధాకర్ మరణించినట్లు ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశాయి.  ఇప్పుడు ఇన్నేళ్లకు జగన్ మెడికల్ కాలేజీ సందర్శన అంటూ నర్సీపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంగా దళిత సంఘాలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించాయి. జగన్ గోబ్యాక్ అని నినదిస్తూ నర్నీపట్నంలో మానవహారంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాయి. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను అన్యాయంగా చంపేశారంటూ విమర్శలు గుప్పించాయి. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పి నర్సీపట్నంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశాయి.  ఓ వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు, మరో వైపు దళిత సంఘాల నిరసనలతో వైసీపీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి. మరో వైపు నర్సీపట్నం వ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలు వెలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  అప్పట్లో డాక్టర్ సుధాకర్ ను నడిరోడ్డుపై అర్ధనగ్నంగా కూర్చోపెట్టిన దృశ్యాలను మరో సారి నెట్టింట పోస్టు చేస్తూ నెటిజనులు జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు... 9 దుంగలు స్వాధీనం

  అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ ఒక స్మగ్లరును అరెస్టు చేసింది. టాస్క్ ఫోర్స్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు  కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్  ఆధ్వర్యంలో డీఎస్పీ  ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ వినోద్ కుమార్ టీమ్ బుధవారం అన్నమయ్య జిల్లా పుల్లంపేట నుంచి కూంబింగ్ చేపట్టింది.  అక్కడ ఏం.బావి పారెస్టు బీటు పరిధిలోని రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఒక వ్యక్తి కనిపించాడు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా, వెంబడించి పట్టుకున్నారు. అతనిని విచారించగా పొదల్లో దాచిన ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిలో ఉపయోగించినవి 6 ఉండగా, మూడు కొత్తవి ఉన్నాయి. అతనిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఇతనిని అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి గా గుర్తించారు. అతనిని డీఎస్పీ వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్ లు విచారించారు. సీ ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభం

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ పునఃప్రారంభమైంది. నిన్న జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వ పిటిషనర్ల వాదనలు విని కోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ క్రమంలో ఇవాళ జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టుకు మంత్రి వాకిటి శ్రీహరి  హాజరైరు.  బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్న వాదనలు సాగాయి.  ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. అన్ని పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.ఈ సందర్భంగా సీజే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం హైకోర్టుకే ఉందని, ఈ విషయమై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే డిస్మిస్‌ చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ గుర్తు చేశారు.ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌లు సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే.    

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు.. తప్పేంటన్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధంగా ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలను పీపీపీ విధాంలో అభివృద్ధి చేసేందుకు గత నెల 9న ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వసుంధర దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన హైకోర్టు థర్మాసనం గురువారం విచారణ జరిపింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల టెండర్ల ఖారారుపై స్టే ఇవ్వడానికి  నిరాకరించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, రాజ్యాంగం లేదా చట్టాన్ని ఉల్లంఘించే నిర్ణయాల్లో తప్ప న్యాయస్థానం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. అయినా పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం కాకుండా  ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చనీ, అది తప్పెలా అవుతుందని ప్రశ్నించింది.  గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకు 5వేల 800 కోట్ల రూపాయల అంచనాతో పాలనపరమైన అనుమతులు ఇచ్చారన్న పిటిషనర్ తరఫున్యాయవాది మాటలపై స్పందించిన ధర్మాసనం.. పాలనపరమైన అనుమతులిస్తే సరిపోతుందా? నిధులు విడుదల చేయాలి కదా అని నిలదీసింది. నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చని, అది తప్పెలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.   నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలూ నిలిచిపోయాయని గుర్తు చేసింది. నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ సీఎస్,  వైద్యఆరోగ్య ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్యసేవలు, మౌలికాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ వైద్య విద్య, పరిశోధన సంస్థ ఎండీకి నోటీసులు జారీచేసింది. త దుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

విజయ్ నివాసానికి బాంబు బెదరింపు

ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం  అధినేత విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది.  ఇటీవల కరూర్‌లో విజయ్ నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట సంభవించి 41 మంది మరణించిన విషాద ఘటన తర్వాత ఈ బెదిరింపు రావడం ఆందోళన రేకెత్తించింది. విజయ్ భవిష్యత్తులో మరోసారి బహిరంగ సభలు పెడితే ఆయన ఇంటిని బాంబుతో పేల్చివేస్తామంటూ  ఓఆగంతుకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ కాల్  కన్యాకుమారి నుంచి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ బెదరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ నివాసం వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. విజయ్ నివాసంలో అణువణువూ తనిఖీ చేసి బాంబు లేదని తేల్చారు.   ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి గుర్తింపు కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా ఉండగావిజయ్ నివాసంలో బాంబు పెట్టామంటూ బెదరింపు కాల్ రావడం ఇదిరెండో సారి.  

బీసీసీఐ అంటే.. బీజేపీ కంట్రోల్డ్ క్రికెట్ ఇన్ ఇండియా అనాలా?

బీసీసీఐ అంటే మామూలుగా బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. కానీ ఇప్పుడు బీసీసీఐని బీజేపీ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా అని పిలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రాల క్రికెట్ సంఘాలన్నీ బీజేపీ అగ్రనేతలు, కీలక నేతల పుత్రరత్నాల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఒక సారి ఆ వివరాలేంటని పరిశీలిస్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పుత్రర‌త్నం జై షా ఐసీసీ చైర్మ‌న్ గా ఉన్నారు? ఇక డిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ  కుమారుడు రోహ‌న్ జైట్లీ. అంతే కాదు.. మధ్య ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరని చూస్తే ఆయన కూడా బీజేపీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా కుమారరత్నం మహార్యమాన్ సింధియా. ఈ జాబితా ఇక్కడితో ఆగలేదు. బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే.. బీజేపీ నాయకుడు రాకేష్ తివారీ కుమారుడు  హర్షవర్ధన్  తివారీ. ఈయన అతి పిన్న వయస్సులోనే..అంటే 24 ఏళ్లకే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడయ్యారు. ఇది బీసీఏ చరిత్రలోనే ఓ రికార్డ్.  అలాగే  రాజ‌స్థాన్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్యక్షుడు ధ‌నంజ‌య్ సింగ్   రాజ‌స్థాన్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌ని చేసిన గ‌జేంద్ర సింగ్ త‌న‌యుడు. రాజ‌వంశీయుడు. ఈయ‌న కూడా బీజేపీ లీడ‌రే. గ‌త మూడు ప‌ర్యాయాలుగా బీజేపీ కేంద్రంతో పాటు ప‌లు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో.. క్రికెట్ లోనూ వంశ‌పారంప‌ర్య ఆధిప‌త్యం అమ‌ల‌వుతూ వ‌స్తోంది. అందుకే  బీసీసీఐని బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా అని అన‌డం క‌న్నా బీజేపీ  కంట్రోల్డ్ క్రికెట్ అసోసియేష‌న్ గానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. అంత‌గా బీసీసీఐని బీజేపీ నేత‌లు, వారి కుమారులు ఆక్ర‌మించేశారంటున్నారు పరిశీలకులు

పిఠాపురంలో పవన్ పర్యటన నేడు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం (అక్టోబర్ 9)న తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.  ఈ సందర్భంగా ఆయన భాగంగా ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకుంటారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు చాలా కాలంగా సముద్ర కాలుష్యం వల్ల జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు పవన్ కల్యాణ్ దృష్టికి కూడా తీసుకువచ్చారు. దీంతో ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు  పవన్ కల్యాణ్, అధికారులతో కలిసి పడవలో సముద్రంలో ప్రయాణించి కాలుష్య ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు.   తరువాత ఆయన ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్యంపై మత్స్య కారుల ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ  పర్యటనలో ఆయన  పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.  

ఆరులేన్లుగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి విస్తరణ

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన  హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 విస్తరణ పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. ఈ జాతీయ రహదారిని ఆరు లేన్ల రహదారిగా విస్తరించేందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)  నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియ ముగించి నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.  తెలంగాణలోని దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరణ జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.10,391.53 కోట్లు వ్యయం అవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తంలో  నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు, భూసేకరణ తదితర అవసరాలకు రూ.3,616.06 కోట్లుగా చెబుతున్నారు.    ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా 162 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనికి సుమారు రూ.1,414 కోట్లు అవసరమని అధికారులు అంచనావేశారు. భూసేకరణ, ఇతర అడ్డంకులపై చర్చించేందుకు   ఎన్‌హెచ్‌ఏఐ, రోడ్లు-భవనాల శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. డీపీఆర్‌ను ఖరారు చేసేందుకు వీలుగా రహదారి మార్గంలోని విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర నిర్మాణాల వివరాలను ఈ నెలాఖరు నాటికి  సేకరించి..  తుది డీపీఆర్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 

రంజీ ట్రోఫీకి హైదరాబాద్ క్రికెట్ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ

ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మను హైదరాబాద్ రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ ఇండియా స్టార్ బౌలర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఈ రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నారు. సిరాజ్ కు దేశవాళీ క్రికెట్ నుంచి విశ్రాంతి ఇచ్చారు.   ఆస్ట్రేలియా పర్యటన, సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ల నేపథ్యంలో సిరాజ్ కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. దీంతో సిరాజ్ రంజీట్రోఫీకి అందుబాటులో  ఉండడు. దీంతో తిలక్ వర్మకు హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రంజీ ట్రోఫీకి 15 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. హైదరాబాద్ జట్టులో సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్, అభిరత్ రెడ్డి, హిమ‌తేజ, తనయ్ త్యాగరాజన్, రోహిత్ రాయుడు, నిశాంత్, అనికేత్ రెడ్డి, కార్తికేయ, అలీ కాచి డైమండ్, రాహుల్ రాదేశ్ తమ స్థానాలను తిరిగి నిలబెట్టుకున్నారు. గత సీజన్‌లో ఎలైట్ గ్రూప్-బిలో ఆడిన హైదరాబాద్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ లలో కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది.  దీంతో లీగ్  దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.  ఈ సారి తిలక్ వర్మ కెప్టెన్సీలో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందన్న ఆశాభావం హైదరాబాద్ క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.  

కేటీఆర్, హరీష్ రావు హౌస్ అరెస్టు

హైదరాబాద్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ సీటీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ గురువారం (అక్టోబర్ 9) చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు సిటీ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో బస్ భవన్ కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను పోలీసులు నిలువరిస్తున్నారు. కాగా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  కోకాపేట‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులను మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.హరీష్ రావు మెహదీపట్నం బస్టాప్ నుంచి, కేటీఆర్ రేతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ కు చేరుకోవాల్సి ఉండగా పోలీసులు వారిని వారి వారి ఇళ్లల్లోంది బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. గురువారం (అక్టోబర్ 9) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం (అక్టోబర్ 8)  శ్రీవారిని మొత్తం 74,861 మంది దర్శించున్నారు. వారిలో 31,802 మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  3కోట్ల 93 లక్షల రూపాయలు వచ్చింది.  

వైజాగ్‌లో సముద్రం వెనక్కి వెళ్ళింది

  విశాఖలో సముద్రం వెనక్కి వెళ్ళింది తీరం నుంచి సముద్రం దాదాపు 150 నుంచి 200 మీటర్లు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి తేలి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సముద్రపు అలలతో దూరంగా కనిపించే బండరాళ్లు బయటకు వచ్చే వీటిపై నిలబడి సందర్శకులు సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు. ఇంతకీ వెనక్కి వెళ్లిన సముద్రం తిరిగి ముందుకు వస్తుందా అసలు సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది తెలుసుకుందాం   సాధారణంగా తుఫాన్లు సునామీలు వచ్చినప్పుడు సముద్రపు అలల రాకపోకల్లో  మార్పు వస్తుంది. కానీ ఇప్పుడు తుఫాను సునామి లేని కాలంలో కూడా సముద్రం వెనక్కి వెళ్ళింది. నిజానికి తీరంలో ఆటుపోట్లు అలల ఎత్తు పొలాలు వేగంలో తేడాతో ప్రతిరోజు సముద్రం కొంత వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం జరుగుతుంది అలా రోజులు రెండుసార్లు కచ్చితంగా సముద్రం కొంచెం వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు వస్తుంది. ఇది రోజు బీచ్ పరిశీలించే మత్స్యకారులకు తెలుస్తుంది కానీ ఇప్పుడు చూస్తే సముద్రం చాలా వరకు దూరంగా వెళ్లడంతో రాళ్లు పైకి కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులతో కూడా అలల తాకిడిలో మార్పు  సముద్రపు ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు సముద్ర ప్రవాహ దిశ ఒక దిశ నుంచి మరో దిశకు మారే సమయంలో కూడా సముద్రం ముందుకు వెళ్లడం వెనక్కి రావడం జరుగుతుంది . ఈ పరిస్థితి ఎక్కువగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో కనిపిస్తుంది ఆ సమయంలో సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయి గాలులు బలంగా తీరానికి సమాంతరంగా వెళ్ళినప్పుడు సముద్రపు ఉపరితలంపై ఉండే నీటిని స్థానభ్రంశం చెందిస్తూ తీరం నుంచి వెనక్కి తీసుకు వెళుతుంది. అప్పుడు సముద్రం వెనక్కి వెళ్లినట్టు స్పష్టంగా కనిపించడం కాక అప్పటివరకు నీటిలో ఉన్న బండ రాళ్లు ఇతర వస్తువులు మనకి కనిపిస్తాయి.  అయితే ఇది మళ్లీ బలమైన గాలులు వ్యతిరేక దిశలో వస్తే నీరు ముందుకు వస్తుంది. ఇది ఒకరోజులో మారవచ్చు కొన్నిసార్లు మూడు నాలుగు రోజులు పాటు కూడా ఉంటుంది ఇదంతా వాతావరణ పరిస్థితిలపై ఆధారపడి జరుగుతుందని సముద్ర వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు . ఇప్పుడు కూడా సముద్ర ఉపరితలం మీదుగా వీచే గాలుల కారణంగా సముద్రం వెనక్కి వెళ్లి ఉంటుందని ఓషినో గ్రఫీ అధికారులు చెప్తున్నారు. సందర్శికులు ఏమంటున్నారు   గడిచిన రెండు రోజులుగా సముద్రపు నీరు వెనక్కి వెళ్లడంతో సందర్శిక్కుల్లో సందడిగా అనిపిస్తుంది ఆర్కే బీచ్. వద్ద సముద్రం వెనక్కి వెళ్లడంతో తేలిన బండరాళ్లపై నిలబడి సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు ఇది ఒక రకంగా సందర్శకుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు చిన్నప్పుడు నుంచి గమనిస్తున్నావని స్థానిక మత్స్యకారులు ఏ ఎస్ ఆర్ తెలిపారు. ఎక్కువగా తుఫాన్లు సునామి వచ్చినప్పుడు సముద్రం ఇలా వెనక్కి వెళ్లి చాలా వరకు ముందుకు వచ్చిందని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే సముద్రం వెనక్కి వెళ్లిన పరిస్థితుల్లో మళ్లీ ఏదో ఒక రోజు ముందుకు వస్తుంది అది కొన్నిసార్లు ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సముద్రంలో ఫోటోలు దిగడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా నీరు వెనక్కి వచ్చి స్థిరంగా నిలబడినట్లైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ఇప్పటికే లైఫ్ గార్డ్ సిబ్బంది పర్యాటకులకు చెబుతున్నారు. కానీ చల్లగా అందంగా వాతావరణం మారడం సముద్రం చాలా లోతుగా వెనక్కి వెళ్లడంతో ఇతరుల హెచ్చరికలు పట్టించుకునే స్థితిలో పర్యాటకులు కనిపించడం లేదు. అయితే ఈ పరిస్థితి మరో రెండు రోజుల్లో మారే అవకాశం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

  బ్యాంకు అకౌంట్లు తెరిచి ఇస్తే డబ్బులు ఇస్తాం.... బ్యాంక్ అకౌంట్లు ఇస్తే మనకెందుకు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు.. కానీ ఇది నిజం ..కుబేర సినిమా తరహాలోనే  సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్ప డుతున్నారు.. ఈ సైబర్ నేరగాళ్లు అడ్డ మీద ఉన్న కూలీలను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బుల ఎరగా వేసి బ్యాంకు అకౌంట్లను  తెరిపిం చుకుంటున్నారు. కొంతమంది వ్యక్తులు అయితే నేరుగా కూలీలు ఉండే అడ్డా వద్దకు వెళ్లి అక్కడ ఉన్న కూలీలతో మాటామంతి కలుపుతారు. బ్యాంకు అకౌంటు తెరిచి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇందు కొరకు మీ ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్తారు... వారి మాటలు నమ్మిన కూలీలు డబ్బుల కోసం బ్యాంకు అకౌంట్లు తెరిచేం దుకు సిద్ధమవు తారు.   ఆధార్ కార్డు తీసుకొని వచ్చిన  కూలీలను నేరుగా బ్యాంకుకు తీసు కెళ్ళి బ్యాంకులో అకౌంట్ ని తెరిపి స్తారు.ఆ తరువాత ఈ ముఠా బ్యాంకు పాస్ బుక్కు, ఏటీఎం కార్డులు రాగానే వీటన్నిటిని కలెక్ట్ చేస్తారు... ఈ తతంగమంతా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది... అవునండోయ్ ఇది నిజం... ఇలా కుబేర సినిమా తరహాలో మోసాలకు పాల్పడుతున్న నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న కూలీలే టార్గెట్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అడ్డా మీద ఉన్న కూలీలను టార్గెట్ గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బ్యాంకు అకౌంట్లను తెరిపి స్తున్నారు.ఆ తర్వాత పాస్ బుక్, ఏటీఎం కార్డులను నేరుగా కర్ణాటక కు పంపిస్తారు ..అది కూడా కేవలం  బస్సులోనే పంపిస్తారు. ఎవ్వరి కి కూడా ఇక అకౌంట్లు తెరిపిం చినట్లు తెలియదు.బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇచ్చినందుకు ఈ మూట కూలీలకు డబ్బులు ఇస్తుంది. ఇక్కడతో వీళ్ళ పని అయిపోతుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది.  ఆ ముఠా నేరుగా ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోని ఈ బ్యాంకు అకౌంట్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ బ్యాంకు అకౌంట్లుల న్నింటినీ కూడా బెట్టింగ్ యాప్లకు కనెక్ట్ చేస్తారు.. ఈ బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు వచ్చిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత డబ్బు తీసుకొని వెళ్ళిపో తారు.. సైబరాబాద్ లోని ఎస్వోటీ పోలీసులకు వచ్చిన పక్కా సమాచారం తో కర్ణాటకలో ఉన్న ముఠాపైన నిఘా పెట్టారు. ఈ ముఠా నేరుగా ఒక కాల్స్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోనీ దాని ద్వారా బెట్టింగ్ యాప్స్ నిర్వహి స్తుంది  ..బెట్టింగ్ యాప్ ల ద్వారా వచ్చే డబ్బులన్ని టిని కూడా అడ్డా మీద కూలీల ద్వారా ఓపెన్ చేయించిన అకౌంట్లోకి మళ్ళీ స్తారు ..ఆ అకౌంట్లోకి డబ్బులు రాగానే వీటిని క్లోజ్ చేస్తారు అయితే ఇప్పుడు వరకు దాదాపు ఒక సైబరాబాద్ పరిధిలోనే వందల కొద్దీ నకిలీ బ్యాంకు అకౌంట్లు తెరిపిం చినట్లుగా పోలీ సులు గుర్తించారు. నకిలీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫా రమ్‌ల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న దొప్పలపూడి నవీన్‌ కుమార్‌, వంకద్రి సందీప్‌ కుమార్‌, చింతల పాటి ప్రుధ్వి రామ రాజు,చింతల పాటి పవన్‌ వెంకట నాగ భారద్వాజ్‌, మామిడి శెట్టి రామాంజనేయులుఅనే ఐదుగురు నిందితులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.సైబర్‌ క్రైమ్‌ పోలీసులు, ఎస్ఓటీ సిబ్బంది సంయుక్తం గా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. నిందితులు నకిలీ గేమింగ్‌ యాప్‌లను రూపొందించి, ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ బాధితులను మోసగించేవారని అధికారులు తెలిపారు.  ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలు, సిమ్‌ కార్డులు సైబర్‌ గ్యాంగ్‌కు సరఫరా చేసినట్లు విచారణ లో వెల్లడైంది.ఈ గ్యాంగ్‌ టెలిగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా 120 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించి నకిలీ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వీరు సత్యనారాయణ వర్మ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పని చేసేవారని.... “Dodge book777” అనే గేమింగ్‌ పోర్టల్‌ ద్వారా డబ్బులు మళ్లించారని అధికారులు వెల్లడించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 ల్యాప్‌టాప్‌లు, 30 మొబైల్‌ ఫోన్లు, 32 చెక్‌ బుక్స్‌, 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్‌ కార్డులు, 14 లక్షల నగదు , సంబంధిత ఖాతాలను సీజ్‌ చేసినట్లు అధికా రులు తెలిపారు.ప్రజలు తమ OTPలు, PINలు, బ్యాంక్‌ వివరాలను ఎవరికీ ఇవ్వకూ డదని, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్‌లను ఉప యోగించకుండా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.    

ప్రధాని ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

  ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.  ఈ క్రమంలో అమరావతి, విశాఖల్లో ప్రధాని పాల్గొన్న కార్యక్రమాలను మించిన స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తన పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరు కానున్నారు.  కేంద్రం తెచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది. ఈ సభ నిర్వహాణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని... ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని... సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని.. పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

  స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌‌కు లైన్ క్లియర్ అయ్యింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు పిటిషన్‌పై విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే సమయంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకుండా స్టే ఇవ్వాలని వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఎన్నికల సంఘం దూకుడు పెంచింది.  ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.  రేపు ఉదయం 10.30 గంటల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే, పిటిషనర్‌ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు..సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు.   రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు  అక్టోబర్‌ 9 నుంచి తొలివిడుత నామినేషన్లు అక్టోబర్‌ 13 నుంచి రెండో విడుత నామినేషన్లు  అక్టోబర్‌ 23న మొదటిదశ ఎన్నికల పోలింగ్‌  అక్టోబర్‌ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్‌  

డ్రైవర్ల సమ్మెతో నిలిచి పోయిన అద్దె బస్సులు

    కడప జిల్లా దవ్వూరులో ఆళ్లగడ్డ డిపో  డ్రైవర్ పై ప్రయాణీకుడి దాడికి నిరసనగా  కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ఆర్టీసీ డిపోలలో విధులు నిర్వహించే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె నిర్వహించారు. దీంతో ప్రయాణీకులు బస్సు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  ఈ సందర్బంగా పలువురు ఆర్టీసీ  అద్దె బస్సు డ్రైవర్లు మాట్లాడుతూ ఆళ్లగడ్డ  ఆర్టీసీ డిపోకు చెందిన అద్దె బస్సు ఆళ్లగడ్డ నుంచి మైదుకూరుకు బయలు దేరిందన్నారు. మార్గమద్యంలో 120 మంది ప్యాసింజర్లు వున్న బస్సు ఆపలేదన్నారు. దీంతో  దువ్వూరు వద్ద కడపకు చెందిన హేమవర్థన్ తన కుటుంబ సభ్యులతో కలసి బస్సులో వున్న డ్రైవర్ పై దాడికి పాల్పడడంతో తల పగిలిందన్నారు.  బస్సులో పరిమితికి మంచి ప్రయాణీకులను ఎక్కించుకున్నా కూడ బస్సు ఆపలేదని  డ్రైవర్ ను క్రిందకు లాగి కొట్టారన్నారు. ఈ విధంగాఇష్టాను సారంగా ప్రయత్నిస్తున్నారన్నారు.  డ్యూటీ చేయాలంటే కష్టతరంగా వుందన్నారు. అదే విధంగా ప్రయాణీకులు ఎక్కపడితే అక్కడ ఆపటం చేస్తున్నారన్నారు. ఒక ఊరికి ఒక స్టేజ్ కాకుండా ఇంటి దగ్గర ఆపుకుంటున్నారన్నారు.  ప్యాసింజర్స్ కు కండక్టర్ సపోర్టు చేసి డ్రైవర్ పై రెచ్చగొట్టిస్తున్నారన్నారు. తమ పై జరుగుతున్న దాడులను అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేక పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  పరిమితి మంచి ప్యాసింజర్లను ఎక్కించటం ఆపాలని, ఇష్టాను సారంగా ఎక్కడ పడితే అక్కడ ఆపటం సరికాదన్నారు. అద్దె బస్సు డ్రైవర్స్ అంటే అధికారులకు చులకనగా వుంటోందన్నారు. తమ పై ప్యాసింజర్స్ వల్ల ఎటువంటి సమస్య జరిగినా అధికారులు పరిష్కరించాలని వారు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.  ఈ విషయమై స్పందించిన రాష్ర్ట రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రాసద్ రెడ్డి ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించి ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.

భక్తులకు అందుబాటులో టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు

  శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలెక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది.  ముఖ్యంగా తిరుమల, తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా సేల్స్ సెంటర్, శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం సమీపంలోని ధ్యానమందిరం, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లోనూ, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌లలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక  విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయం, జూబ్లీహిల్స్ లోని ఎస్వీ ఆలయం, బెంగళూరు,  న్యూఢిల్లీ, ముంబై, వేలూరులతో పాటు రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరులోని కళ్యాణమండపాల్లో 2026 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టిటిడి డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టిటిడి క్యాలెండర్ లు, డైరీలను టిటిడి వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో పొందవచ్చు.