తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ల లేని భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 83,380 మంది స్వామివారిని దర్శించుకోగా 32,275 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.71 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.  తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సీఎం చంద్రబాబు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం నా అదృష్టమని పేర్కొన్నారు.  శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారు. భక్తులకు టీటీడీ అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో తెలిపారు  

ఉన్నతాధికారుల సత్వర స్పందన.. మహిళకు పునర్జన్మ

ఉన్నతాధికారులు సమష్టిగా సత్వరం స్పందించడంతో ఓ మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన విజయవాడలో శనివారం (అక్టోబర్ 4) చోటు చేసుకుంది. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు  ఆ సందర్భంగా జరిగిన సభలో విజయవాడ వాంబే కాలనీకి చెందిన నాగజ్యోతి అనే మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె ఆ సభకు మానసిక వికలాంగురాలైన తన ఐదేళ్ల కుమార్తెకు ప్రభుత్వ సాయం అర్థించడానికి వచ్చింది. అయితే సభ జరుగుతుండగా ఆమె ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. నాగజ్యోతి ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం గమనించిన పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా వెళ్లి అంబులెన్స్ తీసుకు వచ్చారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత ఆమెకు సపర్యలు చేశారు. అరికాళ్లపై గట్టిగా రుద్దుతూ ఆమె శరీరం చల్లబడిపోకుండా చర్యలు తీసుకున్నారు. సభలోనే ఉన్న డీఎంహెచ్ ఓ సుహాసిని పరుగు పరుగున బాధితురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె నాడి అందకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని గ్రహించారు. నాగజ్యోతి సెరిబ్రల్ ఎనాక్సియాకు గురైనట్లు గుర్తించి వెంటనే ఆమె కాళ్లను తన భుజంపైకి పెట్టుకుని మెదడుకు ఆక్సిజన్ అందేలా చేశారు. దీంతో బాధితురాలిలో నాడీ స్పందనలు మొదలయ్యాయి.   వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం నాగజ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉంది.  హోదాలను పక్కన పెట్టి ఉన్నతాధికారులు సమష్టిగా సత్వరమే స్పందించి నాగజ్యోతికి పునర్జన్మ ప్రసాదించారంటూ ప్రజలు అధికారులను ప్రశంసిస్తున్నారు.   

కెప్టెన్స్ అంటే వీళ్లేరా!

  భార‌త కెప్టెన్సీ శ‌కం మొద‌లైంది.. క‌పిల్ దేవ్ నుంచి. ఆయ‌న 1983లో అబేధ్య‌మైన వెస్టిండీస్ జ‌ట్టు నుంచి వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్పు ఎప్పుడు కైవ‌సం  చేస్కున్నారో.... ఆనాటి నుంచి కెప్టెన్సీ అనేది ఒక‌టుంద‌న్న విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా  తెలిసి రావ‌డం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచానికి తెలిసింది ఒకే ఒక్క‌ క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీ మాత్ర‌మే. క్లైవ్ లాయ‌డ్ వ‌రుస క‌ప్పులు కొట్ట‌డం వెన‌క ఆయ‌న నాయ‌క‌త్వ చిట్కాలే ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌న్న‌ది అప్ప‌టి వ‌ర‌కూ  ఉన్న కెప్టెన్సీ కామెంట్. కావాల‌ని కొంద‌రి క్యాచ్ లు జార‌విడ‌వ‌డం వంటివి లాయిడ్ చేసేవార‌నీ.. ద‌టీజ్ కెప్టెన్సీ అంటూ ఆహా ఓహో అంటూ ఆయ‌న గురించి ఊద‌ర‌గొట్టేవారు. క్లైవ్ లాయిడ్ త‌ర్వాత ఆ కెప్టెన్సీ గ్రేట్ నెస్ త‌న పేరిట లిఖింప చేసుకున్న‌ది మాత్రం భార‌త క్రికెట్ ఫ‌స్ట్ లెజండ్, హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ మాత్ర‌మే. ఒక స‌మ‌యంలో జ‌ట్టు ఇక ఓడిపోతుంద‌న్న స‌మ‌యంలో 175 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. వ‌న్డే హ‌య్య‌స్ట్ స్కోర్ వ‌ర‌ల్డ్ రికార్డ్ స్థాపించ‌డంతో క‌పిల్ పేరు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైంది. ఇక ఆనాటి వ‌ర‌ల్డ్ క‌ప్ సైతం సాధించ‌డంతో.. ప్ర‌పంచ క్రికెట్ చరిత్ర‌లోనే  కెప్టెన్సీ ఇన్నింగ్స్ అన్న‌దొక ఎరా మొద‌లైంది. ఒక అండ‌ర్ డాగ్ టీమ్.. కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ కొల్ల‌గొట్ట‌గ‌ల‌ద‌న్న ఇన్ స్పిరేష‌న్ వ‌చ్చిందే క‌పిల్ నుంచి. ఈ ప్ర‌భావంతోనే ఇమ్రాన్ ఖాన్- పాకిస్థాన్, ఆపై అర్జున ర‌ణ‌తుంగ‌- శ్రీలంక‌కు క‌ప్పులు సాధించి పెట్టారంటే అతిశ‌యెక్తి కాదేమో.  త‌ర్వాత భార‌త జ‌ట్టు వ‌రుస వ‌ర‌ల్డ్ క‌ప్పులు ఆడుతూ వ‌చ్చింది. కానీ అజ‌ర్ వంటి వారు అప్ప‌టి భార‌త‌ జ‌ట్ల‌కు కెప్టెన్ గా ప‌ని చేసిన పేరే గానీ.. సార‌ధ్యం అంటే ఇది, కెప్టెన్సీ అంటే ఇదీ అన్న పేరొచ్చింది మాత్రం.. గంగూలీ నుంచి మొద‌లైంద‌ని చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కెప్టెన్సీని త‌న ప‌ర్స‌న‌ల్ ఇష్యూ గా గంగూలీ తీస్కుని లార్డ్స్ లో చొక్కా ఎగ‌రేశారో ఆనాటి నుంచి మ‌న వాళ్ల కెప్టెన్సీలో ఒక జోష్ వ‌చ్చిందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ త‌ర్వాత మ‌న‌కు ధోనీ రూపంలో ఒక కంప్లీట్ కెప్టెన్ దొరికాడ‌నే చెప్పాలి. ఈ రాంచీ రాక్ స్టార్.. ఇటు 2007 టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్, ఆపై 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్, అటు పిమ్మ‌ట టెస్ట్ చాంపియ‌న్ షిప్ సైతం సాధించి.. ఇటు క‌పిల్ కి కూడాలేని అరుదైన రికార్డు త‌న పేరిట లిఖింప చేస్కుని ఆల్ టైం గ్రేటెస్ట్ ల‌లోనే టాప్ మోస్ట్ గా నిలిచాడు. ఆపై కోహ్లీ వంటి వారు కెప్టెన్సీ చేసినా.. అదేమంత రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. రోహిత్ శ‌ర్మ సార‌ధ్యంలోని భార‌త జ‌ట్టు తొలినాటి వెస్టిండీస్ జ‌ట్టులా త‌యారైంది. అయితే ఇక్క‌డ ఆస్ట్రేలియా ప్ర‌స్తావ‌న కొంత చేయాల్సి ఉంటుంది. అలెన్ బోర్డ‌ర్, రికీపాంటింగ్, పాట్ క‌మిన్స్ వీరంతా కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ కెప్టెన్సే. వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ కెప్టెన్సే ఎందుకు ప్రామాణికం అంటే  అవి వారి వారి కెప్టెన్సీకి గీటురాళ్లు కాబ‌ట్టి. మ‌న ద‌గ్గ‌ర కెప్టెన్సీ ఎఫెక్ట్ ఆన్ టీం మొద‌లైందే.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి కాబ‌ట్టి.. దీన్ని మ‌నం ప‌రిగ‌ణ‌లోకి తీస్కోవల్సి వ‌స్తోంది.  అయితే ప్ర‌పంచ క్రికెట్ జ‌ట్ల‌న్నీ వేరు వేరు. ఆస్ట్రేలియా మాత్ర‌మే వేరు వేరు. కార‌ణం ఏంటంటే.. ఆస్ట్రేలియా జ‌ట్టు అన్న‌ది కేవ‌లం కెప్టెన్సీ మీద ఆధార‌ప‌డ్డ జ‌ట్టు కాదు. అస‌లా బోర్డే సూప‌ర్ డూప‌ర్ బోర్డు. అక్క‌డ ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు క్రికెట్ ఆడ‌రు. ఆ బోర్డు వారి చేత ఆడిస్తుంది. క‌మిన్స్ లాంటి బ‌ల‌హీనులున్నా కూడా క‌ప్పు కొల్ల‌గొట్ట‌డం ఖాయం. ఇలా ఎందుకు అనాల్సి ఉంటుందంటే.. ఇదే క‌మిన్స్ హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ కూడా. మ‌రి పోయిన ఐపీఎల్ లో ఆయ‌న కెప్టెన్సీ పెర్ఫామెన్స్ ఏపాటిదో మ‌న‌మంతా చూసే ఉంటాం. దీన్నిబ‌ట్టీ చూస్తే.. కెప్టెన్లంటే ఆస్ట్రేలియ‌న్లు ఈ కోవ‌లోకి రారని చెప్పాల్స ఉంటుంది.  ఈ లెక్క‌న మ‌నం క‌పిల్ త‌ర్వాత పాత త‌రంలో ఇమ్రాన్, ర‌ణ‌తుంగ‌నైనా కెప్టెన్లుగా అంగీక‌రించ‌వ‌చ్చుగానీ  వ‌ర‌ల్డ్ క‌ప్ విన్న‌ర్ల‌యిన బోర్డ‌ర్, పాంటింగ్, క‌మిన్స్ ని ఊహించుకోలేం. వీరిలో పాంటింగ్ ఒక‌టిక‌న్నా ఎక్కువ క‌ప్పులు కొల్ల‌గొట్టిన కెప్టెన్. అయినా స‌రే ఆయ‌న‌కంటూ ఆ కిరీటం పెట్ట‌డానికి వీల్లేదంటాఉ క్రికెట్ క్రిటిక్స్.  కార‌ణం ఏంటంటే వారి టీమే అల్టిమేట్ గా ఉంటుంది. రిజ‌ర్వ్ బెంచ్ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే టీముల్లోనే నెంబ‌ర్ వ‌న్ ఆసీస్ కావ‌డం వ‌ల్ల‌.. వారికంటూ ప్ర‌త్యేక కెప్టెన్సీ కెపాసిటీని ఆపాదించ‌లేం. సో.. త‌ర్వాతి కాలంలో టీమిండియా కెప్టెన్సీల్లోనే బాగా పేరు ప‌డింది.. మాత్రం రోహితే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా ఎన్నో టైటిళ్లు.. అన్ డిఫీట‌బుల్ గా కొల్ల‌గొట్టింది. ఆ మాట‌కొస్తే గ‌త వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ కెప్టెన్సీలో మ‌న వాళ్లు ఫైన‌ల్లో త‌ప్ప మరే మ్యాచ్ లోనూ ఓడి పోలేదు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్2024 కూడా ఇలాగే ఎక్క‌డా ఓడిపోకుండా గెలిచింది రోహిత్ నాయ‌క‌త్వంలోని టీమిండియా. ఈ లెక్క‌న చూస్తే భార‌త బెస్ట్ కెప్టెన్స్ వ‌రుస‌ ఒక‌సారి చూసుకుంటే మొట్ట మొద‌ట క‌పిల్ ద ఫ‌స్ట్ లెజండ‌రీ కెప్టెన్ కాగా, సెకండ్ వ‌న్- ధ‌నా ధ‌న్ ధోనీ. ఆ మ‌ధ్య కాలంలో సౌర‌వ్ గంగూలీ. ఆ త‌ర్వాత మాత్రం రోహిత్ శ‌ర్మగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ఎనీహౌ కంగ్రాట్స్ రోహిత్! వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ!! థాంక్యూ థాంక్యూ వెరీ మ‌చ్ ఫ‌ర్ యువ‌ర్ మెమ‌ర‌బుల్ కెప్టెన్సీ నాక్స్ ఎట్ ఆల్!!! అన్న‌ది స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కామెంట్ గా తెలుస్తోంది.  

ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

  హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగన  ఛార్జీలు ఈ నెల 6నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.మొదటి 3 స్టేజీల వరకు రూ.5 పెంపు 4 స్టాపుల తరువాత రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. ఆర్డినరీ బస్సులో 1 నుండి 3 స్టాపుల వరకు రూ.5 పెంచారు.    మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. నగరంలో దశలవారీగా హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ లోపల రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులను దశల వారీగా డీజిల్‌ బస్సుల స్థానంలో ప్రవేశ పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.

మావోయిస్టులకు అమిత్ షా హెచ్చరిక

  మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ కగార్‌లో మావోలతో ఎలాంటి చర్చలు ఉండవని తెలిపారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తాం అని పేర్కొన్నారు. లొంగిపోయిన వారందరికీ పునరాసం కల్పిస్తామని తెలిపారు.శనివారం ఆయన ‘బస్తర్ దసరా లోకోత్సవ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం లేదని స్పష్టం చేశారు.  మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి. బస్తర్ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి నక్సలిజమే. బస్తర్ శాంతికి భంగం కలిగిస్తే భద్రతా బలగాలు తగిన రీతిలో సమాధానం చెబుతాయంటూ అమిత్‌ షా హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి రూ. 4 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. మావోయిజం వల్ల తప్పుదారి పట్టినవారు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలంటూ అమిత్‌ షా పిలుపునిచ్చారు.దారి తప్పిన మావోయిస్టులను తిరిగి జనజీవన స్రవంతిలోకి రప్పించేందుకు ప్రజలు కృషి చేయాలని అమిత్ షా  పిలుపునిచ్చారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 4.40 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశామని, దీని ఫలితంగా నూతన పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఏర్పాటయ్యాయని వివరించారు. నక్సల్ హింస బాధితుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15,000 ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు.గడిచిన నెలలోనే 500 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన పేర్కొన్నారు. ఏదైనా గ్రామం నక్సల్ రహితంగా మారితే, దాని అభివృద్ధికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయలు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.   

ర‌ష్మిక మంథాన‌కు విజ‌య్‌తో... ఇది ఎన్నో నిశ్చితార్ధ‌మో తెలుసా!

  సినీ జంట‌ల మ‌ధ్య పెళ్లిళ్లు ఈనాటివి కావు. కృష్ణ విజ‌య‌నిర్మ‌ల‌, జీవిత రాజ‌శేఖ‌ర్, స‌మంత నాగ‌చైత‌న్య‌, ఇప్పుడు చూస్తే గీత గోవిందం జంట‌.. ర‌ష్మిక మంథాన‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన కులాలు, ప్రాంతాలు వేర్వేరు. విజ‌య్ సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ‌.. ఇండ‌స్ట్రీని ఏలేయ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చారు.  ఇక  దేవ‌ర‌కొండ ప్రొఫైల్ ఏంటో చూస్తే.. ఆయ‌న 1989, మే 9న హైద‌రాబాద్ లో గోవ‌ర్ధ‌న్, మాధ‌వి దంప‌తుల‌కు పుట్టారు. వీరి స్వ‌స్త‌లం తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా, తుమాన్పేట్ గ్రామం. తండ్రి వ‌ర్ధ‌న్ దేవ‌ర‌కొండ‌కు సినిమాల‌పై ఉన్న మ‌క్కువ కార‌ణంగా విజ‌య్ పుట్ట‌క ముందే హైద‌రాబాద్ వ‌చ్చారు. సినిమా న‌టుడ‌వ్వాల‌నుకున్నారు. కానీ అది కుద‌ర‌క ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేశారు. డీడీ వంటి ప‌లు టీవీ చానెళ్ల‌లో డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్ లో ప‌ని చేసి సీరియ‌ల్స్ లో చేస్తూ వ‌చ్చారు.  ఇక విజ‌య్ విద్యాభ్యాసం మొత్తం అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి శ్రీస‌త్య‌సాయి ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగింది. ఇక్క‌డే విజ‌య్ కి క‌థార‌చ‌న‌, న‌ట‌న పై మ‌క్కువ ఏర్ప‌డిన‌ట్టు  చెబుతారు విజ‌య్. ఆపై ఇంట‌ర్ హైద‌రాబాద్ లిటిల్ ఫ్ల‌వ‌ర్ కాలేజీలో, బ‌దృకా కాలేజ్ ఆఫ్ కామ‌ర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేశారు విజ‌య్.  ఆ త‌ర్వాత నాట‌కాల్లో రాణించిన విజ‌య్.. నువ్విలా సినిమాలో చిన్న పాత్ర‌తో తెరంగేట్రం చేశారు. 2012లో వ‌చ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లోనూ ఒక పాత్ర పోషించారు. 2015లో విడుద‌లైన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యంలో చేసిన రిషి కేరెక్ట‌ర్ తో బాగా గుర్తింపు వ‌చ్చింది. ఇక 2016లో విడుద‌లైన పెళ్లిచూపులు సినిమాలో హీరో పాత్ర ద్వారా ఆయ‌న న‌ట‌న‌కు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లందాయి. ఇది విజ‌య్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచింది. 2017లో ద్వారక‌, అంత‌గా విజ‌యం సాధించ‌లేదు. అదే సంవ‌త్స‌రం విడుద‌లైన అర్జున్ రెడ్డితో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విజ‌య్ దేవ‌ర కొండ క‌ల్ట్ క్లాసిక్, మాస్ ర్యాంపేజ్, ట్రెండ్ సెట్ట‌ర్ వంటి ప‌దాల‌కే కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. ఈ న‌ట విశ్వ‌రూపానికి విజ‌య్ స్టార్ డ‌మ్ ఆకాశానికి అంటింది. 2018 తొలినాళ్ల‌లో వ‌చ్చిన ఏ మంత్రం వేసావెతో మన ముందుకు వచ్చి ఆ సినిమా తో నిరాశ పరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విజ‌య్. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చ‌వి చూసాడు. ఆ తర్వాత 2018లో  టాక్సీవాలాతో మ‌రో చ‌క్క‌టి విజ‌యం న‌మోదు చేశాడు. తాను వివాహ‌మాడ‌బోతున్న ర‌ష్మిక మంథాన‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన చివ‌రి సినిమా మాత్రం 2019లో వ‌చ్చిన డియ‌ర్ కామ్రెడ్. త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య మూవీ లేదు. కానీ వీరికి గీత గోవిందంలో క‌ల‌సి న‌టించ‌డం ద్వారా చిగురించిన ప్రేమ ప‌రిణ‌యానికి దారి తీసిన‌ట్టు తెలుస్తోంది.  అదే ఇప్పుడు వివాహ నిశ్చితార్ధం వ‌ర‌కూ వ‌చ్చింది. ర‌ష్మికా మంథాన 1996 ఏప్రిల్ 5న క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లాలోని విరాజ్ పేట్ లో జ‌న్మించారు. కూర్గ్ ప‌బ్లిక్ స్కూల్లో చ‌దివిన ర‌ష్మిక  M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుంచి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిట‌రేచ‌ర్ లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించారు. 2016లో ఆమెకు 24వ స్థానం లభించగా, 2017లో తొలిస్థానంలో నిలిచారు.. కిరాక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ర‌ష్మిక అంచెలంచెలుగా ఎదిగి నేష‌న‌ల్ క్ర‌ష్ అంటూ అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకునే స్థాయికి చేరారు. 2024 అక్టోబ‌ర్ లో ర‌ష్మిక‌ను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్- I4C కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితుల‌య్యారు.   ఇక్క‌డ మ‌రో ట్విస్ట్  ఏంటంటే.. ర‌ష్మిక త‌న తొలి చిత్రం కిరాక్ పార్టీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ర‌క్షిత్ శెట్టి ప్రేమ‌లో ప‌డ్డారు.  2017 జూలైలో వీరి నిశ్చితార్ధం కూడా జ‌రిగింది. త‌ర్వాత ఏమైందో ఏమో వారి మ‌ధ్య అనుబంధం చెడిన‌ట్టుగా క‌నిపిస్తోంది. దానికి తోడు ర‌ష్మిక క‌ర్ణాట‌క బోర్డ‌ర్ దాటి, ఛ‌లోతో తెలుగులోకి ప్ర‌వేశించి ఆపై గీత గోవిందంగా మేడం అనిపించుకుని అటు పిమ్మ‌ట డియ‌ర్ కామ్రెడ్ ద్వారా కామ్రెడ్ బిరుదాంకితురాలై స‌రిలేరు నీకెవ్వ‌రులో అర్ధ‌మ‌వుతోందా! అంటూ ప్రేక్ష‌కుల‌ను చ‌క్కిలిగింత‌లు పెట్టి.. ఇలా చెప్పుకుంటూ పోతే చావాతోనూ నేష‌న‌ల్ వైడ్ పాపుల‌ర్ కావ‌డంతో.. ఆమె నెక్స్ట్ లెవ‌ల్ అన్న పేరు సాధించారు. అలాంటి ర‌ష్మిక‌తో లైగ‌ర్, కింగ్ డ‌మ్ వంటి విరుస ప‌రాజ‌యాలు ఎదుర్కుంటున్న ఈ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ తో నిశ్చితార్ధం వ‌ర‌కూ వ‌చ్చింది ఆమె ప్రేమ వ్య‌వ‌హారం. ఈ నిశ్చితార్ధ‌మైనా ర‌ష్మిక జీవితంలో క‌ళ్యాణ  గ‌డియ‌లు తీస్కురావాల‌ని.. పీపీపీ డుండుండుం మోత మోగించాల‌ని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ విజ్-ర‌ష్. పెయిర్.. హ్యాపీ మేరీడ్ లైఫ్!!!

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్‌

  తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టుకు చేరింది.  రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ  వంగ గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి సెప్టెంబరు 29న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈనెల 6న పిటిషన్‌పై విచారణ జరపనుంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ప్రతివాదులుగా చేర్చారు.  రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దంటూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పును పొందుపరిచారు. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తోంది. దీనిపై 8న తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొన్నాది  

వ‌న్డే కెప్టెన్సీ నుంచి...రోహిత్ ఔట్!

  రోహిత్ శ‌ర్మ‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డంపై పెద్ద ఎత్తున ర‌చ్చ న‌డుస్తోంది. ఒక స‌మ‌యంలో ఆయ‌న ఫ్యాన్స్ భారీ  ఎత్తున సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ఫైర్ అవుతున్నారు. కార‌ణం 2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ రోహిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాకు కోల్పోయాక‌.. ఎలాగైనా స‌రే ఆయ‌న సార‌ధ్యంలోని భార‌త జ‌ట్టు ఈ సారిక క‌ప్పు  కొల్ల‌గొట్టాల‌న్న‌ది ఫ్యాన్స్ డిజైర్, డ్రీమ్, డెస్టినీ, ఎగ్సెట్రా, ఎగ్సెట్రా, ఎగ్సెట్రా. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించి.. ఆ బాధ్యత‌ల‌ను ఇంగ్లండ్‌తో  జ‌రిగిన‌ పీట‌ర్సన్- టెండూల్క‌ర్ సీరీస్ డ్రా చేసిన గిల్ కి అప్ప‌గించారు. ఏది ఏమైనా.. రోకో జంట‌(రోహిత్- కోహ్లీ) ద్వారా వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకోవాల‌న్న‌ది అభిమానుల చిర‌కాల కోరిక‌. ఈ క‌ల నెర‌వేర‌కుండానే.. బీసీసీఐ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీ పై వేటు వేయ‌డం ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక పోతున్నారు. అప్ప‌టికీ రోహిత్ ఈ మ‌ధ్య తాను అత్యంత క‌ష్ట‌మైన ఫిట్ నెస్ టెస్టు సైతం పాస‌య్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌నే వ‌న్డే కెప్టెన్ అనుకున్నారంతా. ఈలోగానే భార‌త్ క్రికెట్ బోర్డు.. రోహిత్ ను సార‌ధ్య బాధ్య‌త‌ల నుంచి  త‌ప్పించ‌డంతో.. ఇదీ ప‌రిస్థితి. ఏది ఏమైనా బీసీసీఐ చెప్ప‌క చెప్పిన విష‌య‌మేంటంటే.. రోహిత్ శ‌ర్మ కెరీర్ దాదాపు ముగిసింద‌ని. ఈ లెక్క‌న రోహిత్ మ్యాజిక‌ల్ ఇన్నింగ్స్ ఇక‌పై మ‌నం చూడ్డం ఒక‌ర‌కంగా చెబితే, అసాధ్యం.  ఒక వేళ ప్లేయ‌ర్ గా ఆయ‌న ఏదైనా మెరుపు ఇన్నింగ్స్ ఆడితే దాంతో స‌రిపుచ్చుకోవ‌ల్సిందే త‌ప్ప‌.. వేరే దారి లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు. బ్యాడ్ ల‌క్ ఫ్యాన్స్. యువ‌ర్ ఆల్ టైం గ్రేట్ కెప్టెన్సీ ఇక దాదాపు క‌నుమ‌రుగే.రోహిత్ ఆల్ టైం గ్రేట్స్ లో ఒక‌రిగా ఎందుకంటారంటే.. మ‌న‌కు వ‌ర‌ల్డ్ క‌ప్పులు అందించిన కెప్టెన్లు ముగ్గురే ముగ్గురు. వారు ఒక‌రు క‌పిల్ కాగా, మ‌రొక‌రు ధోనీ. ఇక మూడో కెప్టెన్ గా వీరి స‌ర‌స‌న  నిలిచిన ఏకైక కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒక్క‌డే. వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ తృటిలో చేజారినా.. ఎట్ట‌కేల‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అయితే సాధించి భార‌తీయుల మ‌న‌స‌సు చూర‌గొన్నాడు రోహిత్. ఇక‌పై అభిమానులు ఆ స్థాయి విధ్వంస‌క‌ర ఓపెనింగ్ స్టైల్ ని అభిషేక్ లో చూసుకోవ‌ల్సిందేన‌ని నిరాశ వ్య‌క్తం చేస్తోంది యావ‌త్ క్రిక‌ట్ ప్రేమికుల ప్ర‌పంచం.  

ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

  ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వారు తెలిపారు.విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం,   అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నాది.  ఇప్పటికే భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు వణికిపోతున్నాయి. వంశధార, నాగవళి నదులు పొంగి పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది నిరాశ్రయులు అయ్యారు. తాజాగా హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని  ఐఎండీ  తెలిపింది.

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దారుణ హత్య

  అమెరికాలోని టెక్సాస్ లో గుర్తు తెలియని ఓ వ్యక్తి జరిపిన కాల్పులలో తెలుగు యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ యువ కుడి ఇంట్లో విషాదఛా యలు అలుముకున్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న పోలే జగన్ మోహన్ కుమారుడు పోలే చంద్రశేఖర్(27)... ఇతను 2023లో అమెరికాలోని టెక్సాస్ లో డెంటల్ సర్జరీ లో మాస్టర్స్ చదువుకోడానికి వెళ్ళాడు. చంద్రశేఖర్ డెల్టన్ లో గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్నాడు.  అయితే ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో గుర్తు తెలియని నల్ల జాతీయుడు తన వాహనంలో గ్యాస్ నింపుకోవడానికి వచ్చి ఒక్కసారిగా చంద్రశేఖర్ పై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. ఈ కాల్పుల దాడిలో చంద్రశేఖర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. సమా చారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చంద్రశేఖర్ మృతదేహాన్ని హాస్పిటల్ కి తర లించారు.. కొడుకు మరణించాడన్న వార్త వినగానే తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.  ఈ విషయం తెలుసుకున్న వెంటనే సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో కలిసి మృతుడి తండ్రి జగన్ మోహన్ ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేశారు ‌. తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకి తీసుకు వచ్చేందుకు సహా యం చేయాలని హరీష్ రావును కోరారు.  వీలైనంత త్వరగా మృతదే హాన్ని భారతదే శానికి తీసుకువస్తా మని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.  

అరకు కాఫీకి బిజినెస్ లైన్ అవార్డు.. అభినందించిన చంద్రబాబు

చంద్రబాబు అరకు కాఫీకి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని అరకు ప్రాంతంలో  సాగయ్యే ఈ కాఫీ రుచిలో మేటి అని గుర్తించిన చంద్రబాబు ఈ కాఫీకి అంతర్జాతీయంగా మంచి  బ్రాండ్ గా గుర్తింపు పొందేలా ప్రోత్సాహం అందించారు. ఒక దశలో ఆయనే స్వయంగా అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దాదాపు ప్రతి వేదికపైగా ఈ కాఫీ విశిష్ఠతను వివరించారు. తన సతీమణి  నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటనలో భాగంగా అరకు వెళ్లినప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా ఆమెకు ఫోన్ చేసి మరీ అరకు కాఫీ తాగాలని సూచించారు. అప్పట్లో ఈ విషయాన్ని భువనేశ్వరి స్వయంగా మీడియాకు చెప్పి.. తాను అరకు కాఫీ తాగుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లో ఈ ఫొటో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేనా అరకు కాఫీ విశిష్ఠతను చంద్రబాబు మోడీకి వివరించి, ఆ కాఫీ రుచి చూపించారు. దీంతో మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ కాఫీ గురించి ప్రస్తావించారు. ఈ కాఫీ సాగుద్వారా అరకు గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగిన విషయాన్ని వివరించారు. ఆ విధంగా అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు అరకు కాఫీని ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఆ అరకు కాఫీకి  ప్రతిష్ఠాత్మక బిజినెస్ లైన్ పురస్కారం దక్కింది. ఈ నేపథ్యంలో గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పన కుమారి, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సుధారాణి శనివారం (అక్టోబర్ 4) ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠాత్మక  బిజినెస్ లైన్ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ ఫర్మేషన్ విభాగంలో పురస్కారం దక్కడంపై వారిని చంద్రబాబు అభినందించారు.  అవార్డును, ప్రశంసా పత్రాన్ని   పరిశీలించారు. జీఐ ట్యాగ్ పొందిన తర్వాత అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ బ్రాండ్ గా మారిందని చంద్రబాబు చెప్పారు. గిరిజన ప్రాంతంలో  సేంద్రియ విధానంలో సాగు అవుతున్న అరకు కాఫీ స్వచ్ఛత, సువాసనలతో పాటు ప్రత్యేక రుచి కూడా కలిగి ఉంటుందన్నారు. ఆ కారణంగానే అరకు కాఫీకి మంచి బ్రాండ్ అనే పేరు వచ్చిందన్న సీఎం.. కాఫీ సాగు ద్వారా అరకులోని గిరిజనుల జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు.  

గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి!

పోలవరం పనులు ఇక రాకెట్ వేగంతో సాగనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు నిర్దుష్ట గడువు నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు శుక్రవారం (అక్టోబర్ 3) అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పనులు పూర్తి కావాలనీ, అందుకు అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా అధికారులు పనుల వేగం పెంచాలని ఆదేశించారు. అదే సమయంలో పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. అవసరమైన అనుమతులను  కేంద్ర జలసంఘం, నిపుణుల కమిటీ నుంచి   తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు.  డయాఫ్రం వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గానూ 37,302 క్యూబిక్  మీటర్ల మేర పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. బట్రస్ డ్యామ్ పనులు వందశాతం పూర్తి అయినట్టు తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74శాతం మేర పూర్తయినట్లు సీఎంకు తెలియ చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈఏడాది డిసెంబరు  నాటికి డయాఫ్రం వాల్ పనులు పూర్తి కావాలన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల్ని నవంబరు 1 నుంచి  ప్రారంభించాలని.. 2027 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేయాలని చంద్రబాబు అధికారులకు డెడ్ లైన్ విధించారు. అలాగే.. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి వన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.  దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం వద్ద పర్యాటకులను ఆకర్షించేలా నిర్మాణాలు ఉండాలన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నుంచి భద్రాచలం, పాపికొండలు, దిగువన ధవళేశ్వరం వరకూ వివిధ ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు కనెక్టివిటీ కింద ఐకానిక్ రోడ్డు నిర్మించాలని స్పష్టం చేశారు. దీనిని జాతీయ రహదారికి అనుసంధానించేలా చూడాలన్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా అఖండ గోదావరి ప్రాజెక్టును చేపట్టాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని ఎప్పటి కప్పుడు తెలుసుకునేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్ కు అనుసంధానించాలని సూచించారు 

ఆసీస్ సిరీస్‌కు కెప్టెన్‌గా శుభమన్ గిల్

  టీమిండియా వన్డే కెప్టెన్‌గా  శుభమన్ గిల్‌కు బీసీసీఐ  బాధ్యతలు అప్పగించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు  జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ చోటు దక్కింది. జస్ప్రీత్ బూమ్రాకు రెస్ట్ ఇచ్చారు. గాయం కారణంగా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య దూరమయ్యారు. అయితే.. కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ మేరకు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మరోవైపు.. మార్చిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరూ మళ్లీ కనబడలేదు. ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే సిరీస్‌లో ఇద్దరికీ స్థానం కల్పించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో 19 రోజుల వ్యవధిలో భారత్‌ ఎనిమిది మ్యాచ్‌లు (3 వన్డేలు, 5 టీ20లు) ఆడనుంది. అక్టోబరు 19న వన్డే సిరీస్‌ ఆరంభమవుతుంది. వన్డే జట్టు : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ద్రువ్ జురేల్, యశస్వి జైశ్వాల్. ట్వీ20 జట్టు : సూర్య కుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

కన్నతల్లినే కడతేర్చాడు!

కనీ పెంచిన తల్లిని కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో వలసిన కొడుకు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో   కల కలం రేపింది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన  మానుపాటి ఐల్లమ్మ(50) ను ఆమె కుమారుడే దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి.  మానుపాటి ఐల్లమ్మ  కుమా రుడు శ్రీకాంత్(37)   మద్యానికి బానిసై నిత్యం తల్లితో డబ్బుల కోసం గొడవపడేవాడు.     ఇదే క్రమంలో శ్రీకాంత్   మద్యం సేవించి ఆ మత్తులో ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వ మంటు తల్లితో గొడవపడ్డాడు. దుర్భాషలాడాడు. అయినా ఐలమ్మ మాత్రం కుమారుడికి డబ్బులు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో ఆగ్రహం పట్టలేని  శ్రీకాంత్ తన తల్లి ఐల్లమ్మ తలపై సుత్తితో గట్టిగా  కొట్టి.... పదునైన చాకుతో ఇమె మెడలో పొడిచి పారిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి,  రక్తపు మడుగులో పడి ఉన్న ఐల్లమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.   కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఆటో నారాయణ!

ఆటో డ్రైవర్ల కష్టాన్ని సీఎం చంద్రబాబు దగ్గరగా చూశారనీ, అందుకే వారి కష్టాలను తీర్చేందుకే  ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి  పొంగూరు నారాయణ అన్నారు.  స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నామంటూ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి అండగా నిలిచేందుకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారని వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలు చేయడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడనుందని వివరించారు. స్త్రీ శక్తి పథకం వల్ల జీవనోపాధి ఇబ్బంది ఎదురైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం చేసి సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారని మంత్రి నారాయణ కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న చంద్రబాబు నాయుడు,  ఆటో డ్రైవర్ల కోసం కూడా నూతన పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే ఆటో యజమానుల కోసం ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్‌ను కుదించిందని, రూ.20 వేలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అందే సహాయం వాహన రిపేర్లు, కుటుంబ అవసరాలు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సీఎం చంద్రబాబుని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు.  ఇక పోతే ఆటో డ్రైవర్ల సేవలో పథకం శనివారం (అక్టోబర్ 4) నుంచి ఆరంభమైన సందర్భంగా  ఒంగోలులో జరిగిన ఆటో డ్రైవర్ల భారీ ర్యాలీలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పారు. 

వీధికుక్కల దాడిలో విదేశీ కోచ్ కు గాయాలు

దేశంలో మరీ ముఖ్యంగా దేశరాజధాని నగరంలో వీధికుక్కల బెడద మరో సారి దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విదేశీ కోచ్ లపై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయి. ఆ స్టేడియంలో పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కెన్యా కుచెందిన కోచ్ పై స్టేడియం ప్రాంగణంలో వీధికుక్కలు దాడి చేశాయి.  దీంతో ఈ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, సహాయక సిబ్బంది భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.  కెన్యా స్ప్రింట్స్ కోచ్  డెన్నిస్ మరాగియా మ్వాన్జో శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం వార్మప్ ట్రాక్‌పై తమ అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.  ఈ దాడిలో ఓ కుక్క కోచ్ కులికాలి పిక్కపై గట్టిగా కరిచింది.   అక్కడే ఉన్న మెడికల్ టీమ్ స్పందించి ఆయనకు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు   యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే పటిష్ఠ భద్రత ఉన్న స్టేడియం ప్రాంగణంలోనే వీధికుక్కలు ఓ విదేశీ కోచ్ పై దాడి చేసి గాయపరిచన సంఘటన భీతిగొల్పుతోందని పారా అథ్లెట్లు అంటున్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

కొండాపూర్ లో కూల్చివేతలు.. ఆక్రమణలను తొలగించిన హైడ్రా

హైడ్రా ఆక్రమణలపై మరోసారి కొరడా ఝుళిపించింది. కొండాపూర్ లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించింది.  కొండాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని కొందరు షెడ్లు వేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వీరంతా చిరు వ్యాపారులే అయినా.. వారు ఆక్రమించి షెడ్లు వేసుకున్న భూమి విలువ 3600 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. హైడ్రా సిబ్బంది శనివారం ఈ ఆక్రమణలను తొలగించారు.  వ్యాపారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, వారిని భూమి ఖాళీ చేయమని ఆదేశించారు. కూల్చివేతల సమయంలో ఎవరూ అడ్డు రాకుండా ఆ ప్రదేశానికి రెండు కిలోమీటర్ల దూరంలో బ్యారికేడ్లు నిర్మించి నిలిపివేశారు.  ఈ స్థలంపై కోర్టు వివాదాలన్నీ తేలిపోయి.. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో హైడ్రా శనివారం ఆక్రమణలను తొలగించింది.  

పీవోకేలో ప్రజా తిరుగుబాటు?

ఆర్థికంగా, రాజకీయంగా, సామిజికంగా ఏడు దశాబ్దాలుగా వివక్షకు గురౌతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.  పీవోకే)లో స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఆందోళనకు దిగారు. పాకిస్థాన్ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చారు.  ప్రజల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి పాకిస్థాన్ సైన్యాన్ని రంగంలోకి దింపింది. దీంతో ప్రజాందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సైన్యాన్ని రంగంలోకి దింపి తమ ఆందోళనను అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పీవోకే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆందోళనకారులతో చర్చలకు పాకిస్థాన్ ప్రభుత్వం కమిటీని నియమించింది. అయితే ఆందోళనకారులతో ఆకమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆందోళనలను అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  అయితే ఆందోళన కారులు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఈ ప్రజాందోళనకు అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకత్వం వహిస్తున్నది. పీవోకేకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తిన ఏఏసీ.. పాకిస్థాన్ ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది.  పీవోకే అసెంబ్లీలో పాకిస్థాన్‌లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కోరుతోంది. ఈ 12  స్థానాల వల్ల  స్థానిక ప్రజల ప్రాతినిథ్య హక్కుకు భంగం వాటిల్లుతోందని ఏసీసీ చెబుతోంది.  అలాగే గోధుమ పిండిపై సబ్సిడీ, మంగ్లా జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ చార్జీలను తగ్గించాలనీ కూడా ఏసీసీ డిమాండ్ చేస్తున్నది. ఏడు దశాబ్దాలుగా ప్రాథమిక హక్కులకు కూడా నోచుకోకుండా సాగుతున్న పరిస్థితి ఇంకానా ఇకపై కుదరదంటూ ఏసీపీ కుండబద్దలు కొట్టినట్లు చెబుతోంది. ప్రజాగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే.. పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నది.  అయితే ఈ ప్రజాందోళనను ఉక్కుపాదంతో అణచివేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది.  వేల మంది సైనికులు, పోలీసులను మోహరించింది. ఈ ఆందోళనను అణచివేయడానికి  పంజాబ్ ప్రావిన్స్ నుంచి కూడా పోలీసులను తరలించి ఇక్కడ మోహరించింది.  ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది.  

ఆటో సేవలో పథకం లబ్ధిదారులు ఎందరంటే?

రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఈ రోజు నుంచి ప్రారంభమైంది.  రాష్ట్రంలో స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆదాయం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా  నిలిచే లక్ష్యంగా ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త పథకానికి  రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఆటో, క్యాబ్ డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు.  మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు ఆదాయం గణనీయంగా తగ్గిపోయి, కుటుంబ పోషణ కష్టంగా మారిందన్న  ఆటో, క్యాబ్  ట్యాక్సీ డ్రైవర్ల ఆవేదనను పరిగణనలోనికి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆదుకునేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకానికి  శుక్రవారం (అక్టోబర్ 3) జరిగిన కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం పట్టాలెక్కింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఈ పథకం కింద రా ష్ట్ర వ్యాప్తంగా  2,90,669 మంది డ్రైవర్లు లబ్ధి పొందుతారు.