అలయ్ బలయ్ ఐక్యతకు ప్రతీక : వెంకయ్యనాయుడు
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతు వేషభాషలు వేరయిన వేరయినా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని వెంకయ్యనాయుడు అన్నారు.“
అలయ్ బలయ్ అసలైన ఉద్దేశం ఐక్యత, కలిసి ఉండడమే” అని అన్నారు. గత ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయ కృషిని ఆయన ప్రశంసించారు. కులం, మతం, వర్ణం, వర్గం, జాతి పేర్లతో ప్రజలను విభజించే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని స్పష్టం చేశారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా భారతీయులమనే బంధంతో అందరం కలిసే ఉంటామన్నారు. అలయ్ బలయ్ వంటి వేడుకల ద్వారా ఐక్యతా సందేశం వ్యాప్తి చెందడం ఆనందకరమని పేర్కొంటూ, దత్తాత్రేయ, విజయలక్ష్మిలను వెంకయ్యనాయుడు అభినందించారు.
ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ థీమ్‌తో స్టేజ్‌తో ఏర్పాటు చేశారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీపీఐ నేత నారాయణ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.