స‌నాత‌న ధ‌ర్మం ఎంత ప‌ని చేసిందో చూశారా!?

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ అన్న‌ది నేడు ఒక జాతీయ హీరోయిజం కింద మారిపోయింద‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. సుప్రీం చీఫ్ జ‌స్టిస్ గ‌వాయ్ పై సీనియ‌ర్ లాయ‌ర్ రాకేశ్ కిశోర్ దాడి యత్నం ఘ‌ట‌న‌  ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా  చ‌ర్చ‌కు దారి తీసింది. సాధార‌ణంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, న్యాయ‌వాది మ‌ధ్య ఎంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంటుంది. మాములుగా  న్యాయ‌మూర్తి ప‌ట్ల‌ న్యాయ‌వాదులు ఎంతో గౌర‌వ భావంతో, భ‌య‌భ‌క్తుల‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అలాంటిది ఒక న్యాయ‌వాది.. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ పై ఇలా దాడికి ప్రయత్నించడం వెనుక ఉన్న వెన్ను ద‌న్ను.. స‌నాత‌న ధ‌ర్మ‌మేనంటారు పరిశీలకులు. ఇంత‌కీ ఈ లాయర్ ఎందుక‌ని ఒక చీఫ్ జ‌స్టిస్ దాడి చేయాలనుకున్నారంటే.. ఇటీవ‌ల జ‌స్టిస్ గ‌వాయ్ విష్ణుమూర్తిపై చేసిన కామెంట్లే కారణమని  భావిస్తున్నారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ఖ‌జ‌ర‌హో- జ‌వారీ ఆల‌యంలోని విష్ణుమూర్తి విగ్ర‌హం మొఘ‌లాయిల‌ కాలంలో ధ్వంసమైంది.  ఈ విగ్ర‌హాన్ని పునః ప్ర‌తిష్ట‌ చేయాలంటూ  పిటిష‌న్ దాఖలైంది. ఆ కేసు విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ గ‌వాయ్.. మీరు విష్ణు భ‌క్తులు క‌దా? అయితే ఆ విష్ణుమూర్తినే వేడుకోండి! అంటూ  కామెంట్ చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా ఇది ప్ర‌జా వాజ్యం కాదు.. ప‌బ్లిసిటీ స్టంట్ లో భాగం అంటూ ప‌రుషంగా మాట్లాడ్డం  లాయ‌ర్ రాకేశ్ కిశోర్ కోపానికి కారణమైంది. ఆ కారణంగానే లాయర్ రాకేష్ కిషోర్   జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి ప్రయత్నించాడని అంటున్నారు. ఈ దాడి యత్నం తరువాత న్యాయవాది రాకేష్ కిషోర్ ను అరెస్టు చేయలేదు..   మూడు గంట‌ల పాటు విచారించి ఆయ‌న గవాయ్ పైకి విసరబోయిన బూటు ఆయ‌న‌కిచ్చి వ‌దిలేశారు.  అయితే బార్ కౌన్సిల్ స‌భ్య‌త్వం తాత్కాలికంగా ర‌ద్దు చేసి, ఆపై దేశంలో ఎక్క‌డా వాదించ‌కుండా ఆదేశాలు జారీ  చేశారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే ఒక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై దాడి చేయబోయిన లాయర్ రాకేష్ కిషోర్ పై   కేసు న‌మోదు చేయ‌డానికి రిజిస్ట్రార్ సైతం ఒప్పుకోక పోవ‌డం. గ‌తంలో ప్ర‌శాంత్ భూష‌ణ్ అనే లాయ‌ర్ పై కూడా సుప్రీం కోర్టు ఇలాగే ఒక్క రూపాయ ఫైన్ వేసింది. అది భావ‌ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన విష‌యం కాగా, ఇది సీజేఐపైనే  దాడి య‌త్నం చేసిన ఘ‌ట‌న‌.  వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తుంటే స‌నాత‌న ధ‌ర్మం అండ‌తో సుప్రీం చీఫ్ జ‌స్టిస్ అని కూడా చూడ‌కుండా దాడియత్నానికి తెగ‌బ‌డుతున్నారంటే దేశంలో సనాత‌న ధ‌ర్మం ఇస్తోన్న దైర్యం ఏపాటిదో అర్ధం చేసుకోవ‌చ్చంటున్నారు సామాజిక‌వేత్త‌లు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. మంగళవారం (అక్టోబర్ 7) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్  గంగమ్మ ఆలయం వరకూ సాగింది. ఇక టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది.  300 రూపాయల  ప్రత్యేక దర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక సోమవారం శ్రీవారిని మొత్తం 76 వేల 733 మంది దర్శించుకున్ు. వారిలో 29,100 మంది భక్తులు  తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  రూ.4.16 కోట్లు వచ్చింది. 

అమెరికాకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి... ఎందుకంటే?

  ఏపీ లిక్కర్ స్కామ్‌లో  బెయిల్ పొందిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితి  సమావేశాలకు వెళ్లే భారత పార్లమెంట్ సభ్యుల బృందంలో మిథున్ రెడ్డికీ అవకాశం లభించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన తన పాస్‌పోర్టు విడుదల కోసం కోర్టును ఆశ్రయించారు. ఐక్యరాజ్య సమాఖ్య జనరల్ అసెంబ్లీ  80వ సెషన్ అక్టోబర్ 27 నుంచి న్యూయార్క్‌లో ప్రారంభమవనుంది. ఈ సమావేశానికి భారత్ తరపున మొత్తం 16 మంది ఎంపీలు హాజరుకానున్నారు. వీరిలో తెలుగు దేశం పార్టీ నుంచి ఎవరూ లేరు, కానీ వైసీపీకి చెందిన మిథున్ రెడ్డిని ఎంపిక చేశారు. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరి ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. అందుకే మరో ఎంపీకి అవకాశం ఇవ్వలేదని సమాచారం. UNGA సమావేశాలు సెప్టెంబర్ 9న ప్రారంభమవుతాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ సెప్టెంబర్ 27న ప్రధాన ప్రసంగం చేస్తారు. అక్టోబర్ 27 నుంచి జరిగే పార్లమెంటరియన్ల స్పెషల్ డెలిగేషన్‌లో మిథున్ రెడ్డి కూడా ఉంటారు. ఈ బృందం పోస్ట్-హై లెవల్ ఈవెంట్స్‌, సైడ్‌లైన్ మీటింగ్స్‌, దౌత్య చర్చల్లో పాల్గొంటుంది. ఇదే సమయంలో, మిథున్ రెడ్డి తన పాస్‌పోర్టు విడుదల కోసం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు

హైదరాబాద్‌లో ఎకరం రూ.177 కోట్లు

  హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ  నిర్వ హించిన రాయదుర్గం భూవేలంలో ఎకరానికి రూ.177 కోట్లు పలకడంతో కొత్త రికార్డు నమోదైంది. మొత్తం 7.67 ఎకరాల భూమిరూ.1357.59 కోట్లకు అమ్ము డైంది.ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రికార్డు స్థాయి ధర. గతంలో కోకాపేట నియో పోలిస్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఎ నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికిన రికార్డును రాయదుర్గం భూ వేలం పాట బద్దలు కొట్టింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు..ఈ వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్లు భారీగా పాల్గొన్నారు. ఇది హైదరాబాద్ స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ పారదర్శక విధానాలు, నాలెడ్జ్ సిటీ మధ్యలో ఉన్న రాయదుర్గం వ్యూహాత్మక ప్రాధాన్యం — అన్నీ కలిపి పెట్టుబడి దారుల విశ్వాసాన్ని ప్రతిబింబించింది.ఈ సందర్భంగా TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక, IAS మాట్లాడుతూ...రాయదుర్గం వేలం విజయం తెలంగాణ కు గర్వకారణమని అన్నారు. ఎకరానికి రూ.177 కోట్ల రికార్డు ధర పలకడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. .. హైదరా బాద్ యొక్క దీర్ఘకా లిక సామర్థ్యాన్ని, తెలంగాణ రైజింగ్–2047 దిశగా రాష్ట్రం సాగుతున్న దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మద్దతుతో, పారదర్శకమైన, వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ప్రభుత్వ దార్శనికత కు ఇది నిదర్శన మని పేర్కొన్నారు. భూమి విలువ పెరుగుదలలో ఇది ఒక కొత్త మైలు రాయి అని అన్నారు.  2017లో రాయదుర్గం 2.84 ఎకరాలు ఎకరానికి రూ.42.59 కోట్లు పలికాయి. 2022లో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికాయి.2025లో రాయదుర్గం ఎకరానికి రూ.177 కోట్లు పలకడం ద్వారా నాలుగు రెట్ల వృద్ధి సాధించింది. వేలం విజయ వంతం కావడంలో కీలక పాత్ర పోషించిన TGIIC బృందం, JLL మరియు MSTC సభ్యులకు శశాంక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారం, బిడ్డర్లు చూపిన విశ్వాసమే ఈ చారిత్రాత్మక ఫలితానికి కారణమని ఆయన పేర్కొన్నారు.  

హైడ్రాను అభినందించిన హైకోర్టు

  భూ కబ్జాదారులపై కొరడా ఝళిపిస్తూ చెరువులను రక్షించ డమే కాకుండా వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించడం, వరదల్లో చిక్కు కున్న వారిని రక్షించడం ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్న హైడ్రాను హైకోర్టు ప్రశంసిం చింది. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధి ని ఓ య‌జ్ఞంలా చేస్తోంద‌ని కితా బిచ్చింది. అందుకు న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్య మ‌ని పేర్కొంది.  మ‌రీ ముఖ్యంగా బ‌తుక‌మ్మ‌కుంట అభివృద్ధిని చూస్తే ముచ్చ‌టేస్తోందని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి ప్రశంసించారు. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై చెత్త‌కుప్ప‌లా, పిచ్చిమొక్క‌ల‌తో అటువైపు చూడాలంటేనే భ‌యంగా ఉన్న ప్రాంతాన్ని సైతం చెరువుగా అభివృద్ధి చేసిన తీరు హ‌ర్ష‌ణీయం అంటూ అభినందించారు.  బ‌తుక‌మ్మ‌కుంట స‌ర్వాంగ సుంద‌రంగా మారి.. ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో నివసించే ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తోంది. బతుకమ్మ కుంట ను అభివృద్ధి చేయడంతో అక్కడ నివసించే ప్రజలు ఆనందం అంతా ఇంతా కాదు... ఆ ప‌రిస‌ర ప్రాంతా ల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పించ‌డ‌మే కాకుండా.. భూగ‌ర్భ జ‌లాల‌ను కూడా పెంచింది. గ‌చ్చిబౌలి లోని మ‌ల్కం చెరువును చూసినా కూడా  ఎంతో ఆహ్లా దంగా క‌నిపిస్తోంది.న‌గ‌రంలో ఇలాగే మ‌రో 5 చెరువుల అభివృద్ధి జ‌రుగుతోంది. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్ల ప‌రిధిలో ఎవ‌రివైనా ఇంటి స్థ‌లాలు, భూములు ఉంటే టీడీఆర్ (ట్రాన్స‌ఫ‌ర‌బుల్ డెవ‌ల‌ప్‌మెంట్ రైట్స్‌) కింద వారికి స‌రైన న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి. ప్ర‌భుత్వం ఇందుకోసం స‌రైన విధానాన్ని తీసుకురావాలని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌ సేన్‌రెడ్డి సూచించారు. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట చెరువు ప‌రిధిలోని రెండు ఎక‌రాల‌కు సంబంధించిన టీడీఆర్ కేసు విచార‌ణ‌లో హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్ సేన్ రెడ్డి ఈరోజు సోమ‌వారం ఈ వ్యాఖ్య‌లు చేశారు.  టీడీఆర్ విష‌ యంలో ప్ర‌భుత్వం స‌రైన విధానాన్ని పాటిస్తే.. చెరువుల అభివృద్ధికి ఎటువంటి ఆటంకం ఏర్ప‌డ‌దని అన్నారు. టీడీఆర్ కేసును వాదిస్తున్న సీనియ‌ర్ న్యాయ‌వాది ఎస్ శ్రీ‌ధ‌ర్  కూడా జ‌స్టిస్ విజ‌య్‌సేన్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ఏకీభావించారు. బ‌తుక‌మ్మ కుంట ప్ర‌స్తావ‌న తీసుకు వ‌చ్చి హైడ్రా ప‌నితీరుకు ఇది నిద‌ర్శ‌న‌మంటూ న్యాయవాది శ్రీ‌ధ‌ర్ కితాబు ఇచ్చారు. త‌మ్మిడికుంట‌లో భూములు కోల్పోయిన వారికి స‌రైన టీడీఆర్ అందించాలంటూ న్యాయవాది శ్రీధ‌ర్‌ విజ్ఞ‌ప్తి  చేశారు. హైడ్రా ఒకవైపు చెరువులను అభివృద్ధి చేస్తూనే ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారని న్యాయ‌మూర్తి జ‌స్టిస్ విజ‌య్‌ సేన్‌రెడ్డి అన్నారు.

భారత రక్షణ రంగంలో మరో యాంటి సబ్ మెరైన్ యుద్ధ నౌక

  భారత రక్షణ రంగంలో మరో శక్తివంతమైన యుద్ధనౌక చేరింది.  80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యద్ద నౌక శత్రు దేశాల సబ్ మెరైన్లను సమర్ధవంతంగా ఎదుర్కోగల సాంకేతిక సామర్థ్యంతో రూపొందించారు . వార్ ఫేర్ సబ్మెరైన్ హంటర్ వాటర్ క్రాఫ్ట్ సిరీస్ రెండు  తరహా కు చెందిన ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనే ఈ యుద్ధ నౌకను తూర్పు నౌకాదళ  కేంద్రం విశాఖలో ప్రారంభించడం జరిగింది. తూర్పునౌకదల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెన్దర్కర్ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 77 మీటర్ల పొడవు 1500  బరువుతో రూపొందించిన ఈ యాంటి సబ్మెరైన్ షిప్ కు లక్షద్వీప్ లోని ఒక ఐలాండ్ పేరు ఆండ్రోత్ గా పెట్టారు. ఈ యుద్ధనౌక జల ప్రవేశంతో తూర్పు తీరంతో పాటు భారత రక్షణ రంగం మరింత సమర్థవంతంగా మారినట్టు అయింది

మావోయిస్టు నాయకుడు మల్లోజుల సంచలన ప్రకటన

  మావోయిస్టు పోలీస్ బ్యూరో సభ్యుడు మల్లోజుల సంచలన ప్రకటన చేశారు. తాను ఇకపై పార్టీలో కొనసాగబోనని, అనివార్య కారణాల వల్ల పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆయుధాలను విడిచి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మరోసారి ప్రకటించారు. ఈ మేరకు ఆయన 22 పేజీల లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మల్లోజుల మాట్లాడుతూ – “చేసిన తప్పులకు, ఉద్యమాన్ని ఓటమి పాలవకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ మీ అందరికి క్షమాపణలు చెబుతున్నాను. ఇంతటి నష్టాలకు దారి తీసిన విప్లవోద్యమానికి నేను నాయకత్వం వహించాను. ఇకపై ఈ బాధ్యతల్లో కొనసాగడానికి నేను అర్హుడిని కాను” అని పేర్కొన్నారు.  “పార్టీ అత్యంత క్లిష్టమైన సమయంలో ఈ నిర్ణయం సరైంది కాదని మీరు భావించవచ్చు. కానీ పార్టీని కాపాడుకోవడానికి, సరైన నాయకత్వాన్ని కేడర్లు ఎంచుకోవడానికి ఇది అవసరం. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను,” అని పేర్కొన్నారు. మల్లోజుల తన లేఖలో పార్టీ కేంద్ర కమిటీలోని అంతర్గత విషయాలను కూడా ప్రస్తావించారు. “సుదీర్ఘకాల విప్లవాచరణలో చేసిన తప్పుల మూలంగా మన ఉద్యమం దెబ్బతింది. ఇప్పటివరకు నేను క్రమశిక్షణతోనే పార్టీ చర్చల్లో పాల్గొన్నాను, కానీ ఇప్పుడు నా నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు వెల్లడించక తప్పదు,” అని తెలిపారు.   – “విప్లవోద్యమం ఏండ్ల తరబడి తప్పిదాల వల్ల దెబ్బతింటోంది. మన పంథా సరిగా ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, అది ఉద్యమ పురోగతికి ఎందుకు దోహదం కావడంలేదని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. తప్పులను గుర్తించి సరిదిద్దుకోవడమే విప్లవ చైతన్యానికి మార్గం. గతపు తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తులో విజయాలు సాధించగలుగుతాం,” అని మల్లోజుల పేర్కొన్నారు. “ఇప్పుడైనా మనకు సానుకూల మార్పు అవసరం. ఉద్యమాన్ని కాపాడుకోవడం, కేడర్లను రక్షించుకోవడం మన మొదటి కర్తవ్యం. అనవసర త్యాగాలకు ముగింపు పలుకుదాం. కొత్త దారుల్లో ముందుకు సాగుదాం. చివరికి విజయం ప్రజలదే,” అని తన లేఖను ముగించారు.

హీరో విజయ్ దేవరకొండకు తృటిలో తప్పిన ప్రమాదం

    హీరో విజయ్ దేవర కొండకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మొన్నటికి మొన్న హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. కానీ ఈ ప్రమాదంలోహీరోకు ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకు న్నారు.  హీరో విజయ్ దేవరకొండ తన తల్లితో కలిసి తన కారులో పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయం లో జోగులాంబ గద్వాల జిల్లా ఎన్ హెచ్ 44 పై ఉండవెల్లి స్టేజ్ సమీపానికి రాగానే హీరో విజయ్ దేవర కొండ ప్రయాణి స్తున్న కారును వెనుక నుండి ఓ బొలేరో వాహనం స్వల్పంగా ఢీ కొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రమాదవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.  ఈ ఘటన అనంత రం విజయ్ దేవర కొండ వెంటనే తన తల్లిని తీసుకొని మరో కారులో హైద రాబాద్ బయలుదేరి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకున్నారు. సమాచారం అందు కున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించడమే కాకుండా బొలేరో వాహన యజమాని పైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.అయితే రోడ్డు ప్రమాదంలో తమ హీరో విజయ్ దేవరకొండకు ఎటు వంటి గాయాలు కాలేదని,  తృటిలో  ప్రమాదం తప్పిందని తెలియగానే అభి మానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సూపర్ జీఎస్టీతో ప్రజలకు ఎంతో మేలు : పీవీఎన్ మాధవ్

  సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్  కర్నూలు లో తెలిపారు. బీజేవైయం రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కర్నూలుకి చెందిన సునీల్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.  ఈకార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు మాదవ్, మాజీ ఎంపీ టీజీ. వెంకటేష్,ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మాదవ్ మాట్లాడుతూ యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో అన్ని రంగాల్లో ముందుకు పోతుందన్నారు. ఈనెల16న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రజలు ఘనస్వాగతం పలకాలని కోరారు. సుపర్ జీఎస్టీ పై కర్నూలు లో ప్రధాని బహిరంగ సభలో పాల్గొననున్నారు.

మొన్న ఉల్లి... నేడు టమోటా

  మొన్నటిదాకా ఉసురుమనిపించిన ఉల్లి, నేడు బోరుమనిపిస్తున్న టమోటా- ఏ పంట పండించిన ఏడుపు మాత్రమే మిగిల్చుకుంటున్న రైతు. నిన్న మొన్నటి దాకా ఉల్లి ధరలు పతనమై రైతుల కంట్లో కన్నీరు మిగిల్చాయి. ఉల్లితో వచ్చిన నష్టాన్ని టమోటాతో పూడ్చూకుందామంటే టమోటా కూడా నిరాశ మిగిల్చింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో టమోటా పంటకు మదనపల్లి మార్కెట్ తర్వాత అంత పెద్ద మార్కెట్ కర్నూలు జిల్లా పత్తికొండలో ఉంది.  పత్తికొండ, ఆలూరు, కోడుమూరు తదితర ప్రాంతంలో 60 శాతానికి పైగా పంట భూముల్లో టమోటాను రైతులు సాగు చేస్తుంటారు. ఏడాది పొడవునా మంచి ధర ఉంటూ నిత్యం డిమాండ్ ఉండే టమోటా ఇక్కడి రైతులకు పంట చేతికి వచ్చినప్పుడు మాత్రమే ధర పతనమవుతూ రైతులను అప్పుల ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తుంది.  పత్తికొండ మార్కెట్లో నిన్న టమోటా ధరలు పూర్తిగా పతనమై, రైతులు తాము పండించిన పంటను రోడ్లపై పారబోసి ఆందోళన చెప్పటాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల క్రితం దాకా కిలో  5 నుంచి పది రూపాయలు దాకా పలికిన టమోటా ధర ఒక్కసారిగా కిలో రూపాయికి దిగజారింది. దీంతో రైతులు తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదని, వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మార్కెట్కు తీసుకువచ్చిన టమాటాను రోడ్లపైన, పశువులకు మేతగా వేసి ఆందోళన బాట పట్టారు.  రైతులు ఆందోళనలతో గుత్తి నుంచి మంత్రాలయం వెళ్లే రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులకు సర్ది చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రతి ఏడాది టమోటా నమ్ముకున్న రైతులు అప్పుల ఊబిలోకి కూరుకపోతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా గతంలో అనేకం జరిగాయి. రైతుల ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకుని గతంలో ప్రభుత్వం టమోటా కు కేజీకి ఎనిమిది రూపాయలు చొప్పున మద్దతు ధరను ప్రకటించింది.  అయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకు కొంటూ అదే మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. అలాగే బహిరంగ మార్కెట్లో కిలో 25 నుంచి 30 రూపాయలు దాకా అమ్ముతూ రైతుల పొట్ట కొడుతున్నారు.  గత 30 సంవత్సరాలుగా పత్తికొండ మార్కెట్లో ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలలో కానీ, పాలకుల తీరులో కానీ ఎటువంటి మార్పు రావటం లేదు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టమోటా రైతుల సమస్యల శాశ్వత నివారణ కోసం పత్తికొండ పరిసరాల్లో టమోటా ప్రాసెసింగ్ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగింది. వాటి పనులు మందకోడిగా కొనసాగుతూ రైతులకు అందుబాటులోకి రాకపోవడంతో రైతుల కష్టాలు అలానే ఉండిపోయాయి. ఇప్పటికైనా అధికారులు మేలుకొని టమోటా కు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతుల కోరుకుంటున్నారు.

విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

    ఏపీలో విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధుల  కోసం సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఎలాంటి పరిమితులు లేకుండా, ఎంతమంది విద్యార్ధులకైనా చదువుకునే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం నీట్ వంటి ఉన్నత విద్య చదవాలనుకునే వారికి కూడా ఈ పథకం వర్తింప చేయాలని పేర్కొన్నారు. ఇందులో 4 శాతం వడ్డీకే బ్యాంకు రుణాలు ఇవ్వడంతో పాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 14 ఏళ్లలో రుణాన్ని చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. అటు బీసీ విద్యార్ధులు ఐఐటీ, నీట్‌లో కోచింగ్ కోసం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

  తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ నూతన  లోగోను ఆవిష్కరించారు. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది.  తెలంగాణలో సమాచార హక్కు కమిషన్‌లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ సర్కార్ ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు.

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డులు

  2025 సంవత్సరానికి వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ అవార్డులు లభించాయి.  రోగ నిరోధక శక్తికి సంబంధించిన పరిశోధనకు గాను మేరీ బ్రన్కో (అమెరికా), ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌ (అమెరికా), షిమన్ సకాగుచి (జపాన్)లకు నోబెల్ ప్రైజ్‌లు వచ్చాయి. మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణాలు, అవయవాలపై దాడి చేయకుండా ఎలా నియంత్రించబడుతుందనే అంశంపై కీలక రహస్యాన్ని వీరు ఛేదించారు. ఈ విప్లవాత్మక ఆవిష్కరణకు గాను నోబెల్ బహుమతిని అందుకున్నారు. వీరి పరిశోధనలు ‘పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్  అనే విధానంపై దృష్టి సారించాయి. ఈ ప్రక్రియలో, నియంత్రిత టీ కణాలు అని పిలువబడే ప్రత్యేక రోగనిరోధక కణాలు శరీరంలో ఆటోఇమ్యూన్ వ్యాధులను అడ్డుకునే రక్షకులుగా వ్యవహరిస్తాయని వారు నిర్ధారించారు. ఈ కణాలు శరీరానికి వ్యతిరేకంగా దాడి చేసే ఇతర ఇమ్యూన్ కణాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక నోబెల్ కమిటీ ప్రకారం, అక్టోబర్ 6 నుంచి 13 వరకు వివిధ విభాగాల విజేతలను ప్రకటించనున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభాగాలతో ప్రారంభమై, అక్టోబర్ 9న సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి విజేతను స్టాక్‌హోమ్‌లో ప్రకటిస్తారు. అనంతరం అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును వెల్లడించనున్నారు.

అగ్ని ప్రమాద బాధితులకు మంత్రి నారాయణ భరోసా

  అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్‌ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ  పరిశీలించారు. దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేనున్నానంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు.            ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్‌లో అగ్నిప్రమాద విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని తెలిపారు. వ్యాపారులకు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పానని... ప్రమాదానికి గురైన షాపులను ఆయన పరిశీలించినట్లు తెలిపారు.  వచ్చే సోమవారంలోపు  రెన్యువేషన్ పనులను పూర్తి చేయాలని మంత్రి  అధికారులను ఆదేశాలు జారీ చేశారు.. బాధితులకు చెప్పిన విధంగా నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామని మంత్రి తెలిపారు. 2014లో సంతపేట మార్కెట్ ను అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అయితే 90 శాతం పనులు కూడా పూర్తి చేసామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రారంభించలేదని మండిపడ్డారు.. మార్కెట్ వ్యాపారస్తులందరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని  భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, రాష్ట్ర వేర్ హోసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పిటిసి విజేతారెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు, నగర మహిళా అధ్యక్షులు కపిర రేవతి, కార్పొరేటర్లు ,డివిజన్  ప్రెసిడెంట్లు ,టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకున్న న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ.. పవన్ కల్యాణ్

జస్టిస్ గోపాల గౌడ్ నేటి తరానికి రూల్ ఆఫ్ లా స్థాపనలో దారి చూపాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  అన్నారు. కర్ణాటక చిక్కబళ్లాపూర్‌ జిల్లా చింతామణిలో సోమవారం (అక్టోబర్‌ 6) సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాల  అమృతమహోత్సవ (80వ జన్మదిన) వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన భాష, ప్రాంతాలూ వేరు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్, కర్నాటక మధ్య సాంస్కృతి, సంప్రదాయాల విషయంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు.  కోలార్, చిక్కబళ్లాపుర్‌ ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల మధ్య సహకార గురించి ఉదాహరణలుగా పవన్ కల్యాణ్  ఏపీలో ఏనుగుల దా డిలో పంటపొలాలు నాశనం కాకుండా కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులు ఇచ్చి  కర్ణాటక ప్రభుత్వం సహకరించిందనీ,  శ్రీశైలం దేవస్థానానికి వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాల విషయంలో  ఏపీ సానుకూలంగా ఉందనీ చెప్పారు.  ఇక జస్టిస్ గోపాల్ గౌడ గురించి మాట్లాడుతూ, ఆయన తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకులకు అంకితం చేశారని అన్నారు. 2019 ఎన్నికలలో తాను పరాజయం పాలైన సమయంలో తనకు ధైర్యం చెప్పిన వ్యక్తి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ అని పవన్ కల్యాణ్ చెప్పారు. న్యాయమూర్తిగా ఆన ఎన్నో చరిత్రాత్మక తీర్పులు ఇచ్చి జస్టిస్‌ గోపాల గౌడ వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేసుకున్నారని పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేశారు. ఆయన ఇచ్చిన ఎన్నో కీలక తీర్పులు చరిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. భూ ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినా అడ్డుకున్నారని అన్నారు.  అలాగే జస్టిస్ గోపాలగౌడ మాట్లాడుతూ..  పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ధృక్పథం తనకు ఇష్టమన్నారు.   

ఫ్రాన్స్ ప్రధాని రాజీనామా

  ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సెబాస్టియన్ నియమించిన కేబినేట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌కు సెబాస్టియన్ రాజీనామా అందించగా దాన్ని ఆమోదించారు. ఫ్రాన్స్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆదివారం నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సెబాస్టియన్‌ కూర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు. అధ్యక్షుడు మెక్రాన్‌ ఆ రాజీనామాను ఆమోదించారు. బడ్జెట్‌ సంక్షోభం, ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా విధానాలతో ఏర్పడ్డ అంతర్జాతీయ గందరగోళం కారణంగా ఫ్రాన్స్‌ ఇప్పటికే కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇవన్నీ కలసి దేశంలో రాజకీయ అనిశ్చితి పెరగడానికి దారి తీశాయి. గడచిన రెండేళ్లలో సెబాస్టియన్‌తో కలిపి ఐదుగురు ప్రధానులు రాజీనామా చేయడం విశేషం.

సీఆర్డీయే ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం 13న

ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (సీఆర్డీయే) ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీంతో ఇంకా అరకొరగా మిగిలి ఉన్న పనులను అక్టోబర్ 13 ముహూర్తం నాటికి పూర్తిచేయడానికి అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.  తొలుత ఈ కార్యాలయాన్ని స్వాతంత్ర్యదినోత్సవం నాడు అంటే ఆగస్టు 15న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే దానిని వాయిదావేసి దసరాకు ప్రారంభించాలని తేదీ ప్రకటించారు. అయితే అప్పట్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, నాణ్యతా పరీక్షలలో జాప్యం  కారణాలతో వాయిదా పడింది.  ఇప్పుడు తాజాగా అక్టోబర్ 13న ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేశారు.   అమరావతి నిర్మాణం, ప్రణాళిక విభాగాలు, మునిసిపల్, హెవోడీ కార్యాలయాలూ అన్ని ఒకే చోటనిర్మాణం, ప్రణాళిక అన్నీ ఈ సీఆర్డీయే కార్యాలయ భవనంలోకి వచ్చేస్తాయి.  3లక్షల చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంవిస్తీర్ణంలో ఉంది. వాస్తవానికి ఈ కార్యాలయ భవనం 2014-2019 మధ్యలోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కాలేదు. జగన్ హయాంలో ఈ నిర్మాణ పనులు మూలన పడేసింది. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాతనే సీఆర్డీయే ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం జోరందుకుంది. ఈ కార్యాలయం కేంద్రంగానే  కమాండ్ కంట్రోల్ రూమ్ సహా రాజధాని ప్రాంతంలోని అన్ని కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టుల పర్యవేక్షణా సాగుతుంది. 

తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు

  ఏపీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీసులకు మెయిల్ పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఆ బెదిరింపు ఈమెయిల్ లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. కాలేజి వద్ద హెలిప్యాడ్ పరిసరాల్లో అణువణువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  ఓ ఫ్యామిలీ ప్రోగ్రాం కోసం ముఖ్యమంత్రి కుటుంబం స్వగ్రామం నారావారిపల్లె వస్తున్నారు. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనుండగా... సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి వస్తున్నారు. ఆయన రాక కోసం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.   

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు శుభ పరిణామం : డిప్యూటీ సీఎం భట్టి

  బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంలో విచారణ సందర్బంగా ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి  సుప్రీం కోర్టులో ఉన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి  మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉందని భట్టి తెలిపారు. కొందరు దురుద్దేశంతో కావాలనే బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని  డిప్యూటీ సీఎం దీమా వ్యక్తం చేశారు.  మరోవైపు  పీసీసీ చీప్ మహేష్ గౌడ్ స్పందిస్తూ.. సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని మహేష్ గౌడ్ అన్నారు.