నార్కో టెర్రర్ కేసులో ఎనిమిది మందిపై ఎన్ఐఏ చార్జిషీట్
లష్కరే తోయిబాతో లింకులు ఉన్న నార్కో టెర్రర్ కేసులో ఎనిమిది మందిపై చార్జీషీట్ దాఖలు అయ్యింది. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా గుజరాత్ తీరానికి డ్రగ్స్‌ను తరలించి, స్మగ్లింగ్ చేసిన అంతర్జాతీయ నార్కో టెర్రర్ నెట్‌వర్క్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 8 మందిపై చార్జీషీట్ దాఖలు చేసింది. నిందితులు ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కార్యకలాపాలకు నిధులుగా వినియోగించినట్లు ఎన్ఐఏ విచారణ లో తేలింది.ఈ కేసులో ఇది ఎనిమిదవ అనుబంధ చార్జీషీట్. ఇటలీకి చెందిన సిమ్రంజీత్ సింగ్ సంధు, ఆస్ట్రేలియా కు చెందిన తన్వీర్ సింగ్ బేడీ, భారత్‌కు చెందిన అంకుష్ కపూర్ లు ఈ నార్కో టెర్రర్ కుట్రకు సూత్రధారులుగా ఎన్ఐఏ నిర్ధారించింది. డిజిటల్, టెక్నికల్, డాక్యుమెంటరీ ఆధారాలతో సహా అహ్మదాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ చార్జీషీట్ దాఖలు చేసింది.
ఈ ముగ్గురితో పాటు పాకిస్తాన్ కు చెందిన తారిక్ అలియాస్ భాయ్‌జాన్, గగన్‌దీప్ సింగ్ అరోరా, తమన్నా గుప్తా, సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ హ్యాపీ, అన్వర్ మసీహ్ లను కూడా ఎన్ఐఏ చార్జిషీట్ లో నిందిుతులుగా పేర్కొంది. నిందితులు పాకిస్తాన్ నుంచి 500 కిలోల హెరాయిన్‌ను గుట్టు చప్పుడు కాకుండా గుజరాత్ సముద్ర తీరానికి అక్రమంగా రవాణా చేసి అనంతరం పంజాబ్‌కు తరలించినట్లు పేర్కొంది. ఆలా డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలోసంపాదించిన సొమ్మును లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ నార్కోటెర్రర్ నెట్‌వర్క్ గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్‌లలో మాత్రమే కాకుండా ఇటలీ, ఆస్ట్రేలియా, యూఏఈ, పాకిస్తాన్, ఇరాన్, థాయిలాండ్ లకు కూడా విస్తరించి ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
భారతదేశంలో అంకుష్ కపూర్ ప్రధాన పాత్ర పోషించి, పంజాబ్‌లో ఈ నెట్‌వర్క్ కార్యకలాపాలను సమన్వయం చేశాడు. డ్రగ్స్ నిల్వ, రవాణా, పంపిణీ, అలాగే దేశీయంగా, విదేశాల్లో నిధుల మళ్లింపులో అతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సిమ్రంజీత్ సింగ్ ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ కు సూత్రధారి కాగా, అక్రమంగా డ్రగ్స్ రవాణా, నిల్వ, ప్రాసెసింగ్, ఉగ్ర నిధుల సేకరణలో కూడా కీలకపాత్ర పోషించాడు.
ఇక తారిక్ అలియాస్ భాయ్‌జాన్ పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ రవాణా చేయడం, దాని పంపిణీ, లష్కరే తోయిబా ఆపరేటివ్‌లకు నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఆస్ట్రేలియాలో ఉన్న తన్వీర్ బేడీ అంతర్జాతీయ హవాలా మార్గాల ద్వారా డ్రగ్ డబ్బులను లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాలకు చేరవేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. త గుజరాత్ ఏటీఎస్ ఈ కేసులో తొలి చార్జీషీట్ దాఖలు చేయగా, ఎన్ఐఏ ఇప్పటివరకు ఏడు సప్లిమెంటరీ చార్జీషీట్లు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ 26 మందిని అరెస్ట్ చేయగా, ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.