ఏపీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగురు సజీవదహనం
posted on Oct 8, 2025 @ 2:43PM
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మందుగుండు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా సంభవించిన భారీ పేలుడు ధాటికి షెడ్డు గోడ కూలిపోగా, శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ స్పందిస్తూ, వారం క్రితమే స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే అగ్నినివారణ పరికరాలు సక్రమంగా వినియోగించారా లేదా అనే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలు, వైద్యసాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు.
ఇదే విషయంపై హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆమె మాట్లాడి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.