లోకేష్.. బ్రేకింగ్ బౌండరీస్!
posted on Oct 7, 2025 @ 1:16PM
మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా క్రికెటర్లలో స్ఫూర్తి నింపే లక్ష్యంతో విశాఖలోని క్రికెట్ స్టేడియంలో రెండు స్టాండ్ లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ కు చెప్పారు. దీంతో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఆ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నంలోని వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండు స్టాండ్లకు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెటర్ రవికల్పన పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటి వరకూ ఒక స్టేడియంలో స్టాండ్ లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టిన సందర్భం లేదు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ తొలి సారిగా ముందుకు అడుగు వేసి ఇద్దరు మహిళా క్రికెటర్ల పేర్లను విశాఖ స్టేడియంలోని స్టాండ్ లకు పెట్టింది. ఇందుకు చొరవ చూపి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆ మేరకు ప్రకటించేలా చర్యలు తీసుకోవడం ద్వారా లోకేష్ తాను బౌండరీలను బ్రేక్ చేయడానికి సదా సిద్ధంగా ఉంటానని నిరూపించుకున్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లోకేష్ ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో బ్రేకింగ్ బౌండరీస్ అనే చర్చా కార్యక్రమంలో లోకేష్ కు స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా దేశంలోని క్రికెట్ స్టేడియంలలో స్టాండ్ లకు పురుష దిగ్గజ క్రికెటర్ల పేర్లే ఎందుకు ఉంటాయి, మహిళలకు గుర్తింపు ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం చెప్పారు లోకేష్. ఆగస్టులో స్మృతి మంధానా దేశంలో మహిళా క్రికెటర్లకు గుర్తింపు ఏది? అన్న ప్రశ్నకు నెల తిరగకుండా లోకేష్ సమాధానం ఇచ్చారు.
మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 12న విశాఖ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ సందర్భంగా విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్ లకు మిథాలీరాజ్, రవి కల్పనల పేర్లు పెడుతూ ఆ ఇద్దరు క్రికెటర్లనూ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సన్మానించనుంది. స్టేడియంలో ఒక స్టాండ్ కు మిథాలీరాజ్, ఒక గేటుకు రవి కల్పనల పేర్లు పెట్టడం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటనగా చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లలో వరుస విజయాలతో జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ చొరవతో ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత మహిళా క్రికెటర్లలో జోష్ మరింత పెరిగే అవకాశం ఉందని క్రీడా పండితులు చెబుతున్నారు.
భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాట్స్ విమెన్ మిథాలీ రాజ్ ఆమె తన కెరీర్ లో సాధించిన విజయాలు భారత్ లో మహిళా క్రికెట్ కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయనడంలో సందేహంలేదు. తన కెరీర్ లో మిథాలీ భారత్ తరపున 300 పైచిలుకు మ్యాచ్ లు ఆడి, పది వేల పరుగులకు పైగా సాధించారు. ఇక భారత మహిళా క్రికెట్ జట్టుకు సౌకర్యాలు, ప్రాధాన్యత, పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ పీజు వంటివి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక రవి కల్పన ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్. ఆమె రాష్ట్ర క్రికెట్ నుండి భారత జట్టు వరకు ఎదిగిన ప్రయాణం అనేక మంది యువ మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఇరువురినీ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సన్మానించి, గౌరవించడం ముదావహం.