రజనీకాంత్ కూతురు నోటి దురద!
posted on Jun 12, 2014 @ 4:29PM
రజనీకాంత్ కూతురు సౌందర్యకి నోటి దురద కాస్త ఎక్కువలా వుంది. అలాగే దారిన పోయే తద్దినాలని నెత్తినపెట్టుకునే రకంలా కూడా కనిపిస్తోంది. కాస్త పైత్యం లక్షణాలు కూడా ఆమెలో కనిపిస్తున్నాయి. లేకపోతే ఏంటండీ? పెట్టుకోక పెట్టుకోక శింబుతోనే గొడవ పెట్టుకుంది. అవనసరంగా లేనిపోని కామెంట్స్ చేసింది. ఆ ఇష్యూ ఇంటర్నెట్‌లో పెద్దదయ్యేసరికి నాలుక్కరుచుకుని ఏదో సరదాగా కామెంట్ చేశానని సర్దిచెబుతోంది.
అసలింతకీ ఏంజరిగిందంటే, సౌందర్య దర్శకత్వం వహించగా రూపొందిన ‘కొచ్చాడియాన్’ చిత్రం మొన్నీమధ్య విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా చూసిన శింబు సోషల్ నెట్‌వర్క్‌లో సినిమా చాలా బాగుందని, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌కు అభినందనలు. చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు దీటుగా లేకపోయినా ఆమె ప్రయత్నం భేష్ అని కామెంట్ పెట్టాడు. సాధారణంగా ఈ కామెంట్‌కి ఎలా స్పందిస్తారు? ‘‘థాంక్యూ శింబూ’’ అని స్పందిస్తారు.
అయితే సౌందర్య మాత్రం శింబుకి థాంక్స్ చెబుతూనే, ఈ ఇష్యూతో అసలు సంబంధం లేని కామెంట్ చేశారు. తానేగనుక ఒక పత్రికా విలేకరినయితే శింబు ఇకపై పాడటాన్ని నిలిపి వేయాలని చెబుతానని సౌందర్య సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఇది చూసి జనం ఇదేంట్రా దేవుడా అనుకున్నారు. శింబు ఫ్యాన్స్ అయితే సౌందర్య మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్‌లో కామెంట్ల మీద కామెంట్లు చేసి ఇష్యూని హాట్ హాట్ చేసేశారు. దీంతోపాటు శింబు, సౌందర్య మధ్య ఇంటర్నెట్ వేదిక మీద మాటల యుద్ధం కూడా జరిగింది. చివరికి సౌందర్య తన తప్పు తెలుసుకుందో, రజనీకాంత్ ఏంటీ న్యూసెన్స్ అని వార్నింగ్ ఇచ్చాడోగానీ శింబుకి ఇంటర్నెట్‌లోనే సారీ చెప్పింది. శింబుపై సరదాగానే కామెంట్ చేశానని, శింబు తన చిన్నప్పటి ఫ్రెండ్ కావడంతో సరదాగా కామెంట్లు పోస్టు చేశానని, దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. దానికి శింబు నెట్‌లోనే ప్రతిస్పందిస్తూ, విమర్శించే హక్కు, భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆమె తన స్నేహితురాలేనని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశాడు. దీంతో ఈ గొడవ సర్దుమణిగింది.