రచయిత అంటే సినిమా రంగంలో చిన్నచూపు...

  భారతీయ సినిమా రంగంలో రచయితలంటే చిన్నచూపు అని ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, రచయిత రమేష్ అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకి సంబంధించినంత వరకు రచయితే ఆద్యుడని, అయితే చిన్నచూపును, నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా రచయితేనని ఆయన అన్నారు. దర్శకులు సినిమాకి సంబంధించిన క్రెడిట్ మొత్తం తమ ఒక్కరికే దక్కాలని ఆలోచిస్తూ వుండటం వల్ల రచయితకు గౌరవం దక్కడం లేదని ఆయన అన్నారు. సినిమా రచయితకు గౌరవంతో పాటు డబ్బు కూడా సరిగా దక్కడం లేదని ఆయన అన్నారు. ‘‘మన దగ్గర మంచి రచయిత ఉంటే అతడికి రాసే అవకాశం ఇవ్వాలి. నాలుగు రూపాయల కోసమో, కీర్తి కోసమో వాళ్ల అవకాశాలు లాక్కోవడం సరికాదు. నేనెప్పుడూ ఇతరుల శాఖల్లో వేలుపెట్టను అని రమేష్ అరవింద్ చెప్పారు.

మహేష్ అంటే బోలెడు ఇష్టం: దీపికా పదుకోన్

  తనకు తెలుగులో ఏ హీరో ఇష్టమో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకోన్ చెప్పేసింది. దీపికా పదుకోన్ లాంటి హీరోయిన్‌కి నచ్చేసే హీరో మహేస్ బాబు కాకుండా మన టాలీవుడ్‌లో ఇంకెవరున్నార్లెండి. అర్జున్ కపూర్ హీరోగా, దీపికా పదుకోన్ హీరోయిన్‌గా హోమీ అదాజానియా దర్శకత్వంలో రూపొందిన ‘ఫైండింగ్ ఫెనీ’ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం హైదరాబాద్‌కి వచ్చిన దీపిక మహేష్ బాబు మీద తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టింది. ‘‘తెలుగులో నాకు ఇష్టమైన హీరో మహేష్ బాబు. తెలుగు సినిమాలలో నటించాలని నేను గతంలో ఎంతో ఎదురుచూశాను. అయితే అప్పుడు నాకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు నాకు తెలుగు సినిమాల్లో నటించాల్సిందిగా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సమయం చిక్కడం లేదు’’ అని దీపిక ఈ సందర్భంగా చెప్పింది.

తమన్నాకి కుక్క దొరికింది

  ప్రపంచ ప్రజలకు ఒక విజ్ఞప్తి. హీరోయిన్ తమన్నాకి రోడ్డు మీద ఒక ఖరీదైన కుక్క దొరికింది. ఆ కుక్కకు సంబంధించిన వారు వచ్చి సదరు కుక్కను తీసుకెళ్ళగలరు. అవును.. ముంబై సబర్బన్‌లోని దక్షిణ ఖార్‌లో తమన్నాకు తప్పి పోయిన ఓ పెంపుడు కుక్క కనిపించింది. అది చాలా ఖరీదైన స్పానియల్ జాతికి చెందిన కుక్క. తమన్న ఆ కుక్కను చేరదీసింది. ఇంటికి తీసుకెళ్ళింది. ఆ కుక్కను దాని యజమాని దగ్గరకు చేర్చడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ఎవరిదో పెంపుడు కుక్క తప్పిపోయింది... దాని యజమాని గుర్తించినట్లయితే సంప్రదించాలని సదరు కుక్క ఫొటో, ఫోన్ నెంబర్‌తో ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేసింది.

పవన్ కళ్యాణ్ నా గురువు: రేణూ దేశాయ్

  పవన్ కళ్యాణ్ తనకు విడాకులు ఇచ్చినప్పటికీ రేణూ దేశాయ్‌కి పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ తగ్గినట్టుగా లేదు. ఈమధ్యకాలంలో ఆ ప్రేమ మరింతగా పెరిగినట్టు అనిపిస్తోంది. అందుకే పవన్‌కి టచ్‌లోకి రావడానికి రేణూ దేశాయ్ ప్రయత్నాలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్‌ని తన గురువుగా పేర్కొంటూ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పోస్ట్ చేసింది. ‘‘సినిమా నిర్మాణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నా గురువుంది. నా జీవితంలో పవన్ కళ్యాణ్‌ని మించిన టీచర్ మరొకరు లేరు. నేను చిత్ర నిర్మాణంలో పరిపూర్ణతను సాదించడానికి సహకరించిన పవన్ కళ్యాణ్‌కి రుణపడి వుంటాను. నేను తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ట్రైలర్ని వాస్తవానికి ఆగస్టు 26న విడుదల చేయాలి. అయితే అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. ఆరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడం యాదృచ్ఛికం. నాకు సినిమా మేకింగ్ విద్యని నేర్పిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు నా సినిమా ట్రైలర్ విడుదల విడుదల చేయడం భతవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను’’ అన్నారు.

పూనమ్‌ పాండేకి ఫేస్‌బుక్ షాక్....

  ఇంతకాలం ఫేస్‌బుక్‌లోని తన పేజీలో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా నానా అల్లరీ చేసిన పూనమ్ పాండేకి ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. పూనమ్ పాండే పేజీని ఫేస్‌బుక్ నిర్దాక్షిణ్యంగా తొలగించింది. అందాలు ఆరబోయడంలో సిద్ధహస్తురాలైన పూనమ్ పాండే ఫేస్ బుక్‌లో తన పేరిట ఒక పేజీని ఏర్పాటు చేసింది. అందులో తాను తీయించుకున్న మసాలా ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ వచ్చింది. పూనమ్ పాండే ఉదారంగా పోజులిచ్చిన ఫొటోల పుణ్యమా అని ఆమె ఫేస్ బుక్ పేజీకి ఫాలోవర్లు బాగా పెరిగిపోయారు. ఎంత పెరిగిపోయారంటే, ఫాలోవర్ల సంఖ్య రెండు లక్షలు దాటిపోయింది. తన అందాలు ఎంతోమందికి చేరువ అవుతున్న ఆనందంలో పూనమ్ పాండే మరిన్ని ‘మంచి’ ఫొటోలను, వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వచ్చింది. ఇంతకాలం పూనమ్ పాండే‌ అందాలను మోసిన ఫేస్ బుక్ ఇక చాల్లేమ్మా అనుకుందో ఏమోగానీ, ఆమె పేజీని ఫేస్ బుక్ నుంచి తొలగించింది. తన సరికొత్త ఫొటోలను అప్ లోడ్ చేయాలని ప్రయత్నించిన పూనమ్ పాండే చివరకు తన పేజీయే గల్లంత్ అయ్యేసరికి గాబరా పడింది. ఆ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇంతకాలం తనను ఫాలో అవుతున్న అభిమానులకు ఎలా న్యాయం చేయాలో అర్థం కావడం లేదంటూ వాపోయింది. తాను ఏం చేస్తే ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ వెనక్కి వస్తోందో చెప్పండి అంటూ రిక్వెస్ట్ చేస్తోంది.

మంచు లక్ష్మి కూతురికి జమున ముద్దులు

  ‘కలెక్షన్ కింగ్’ మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇటీవల సరోగసి వైద్య పద్ధతి ద్వారా పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ పాప పుట్టిన దగ్గర్నుంచి మంచువారి ఇంటిలో సందడే మారిపోయింది. మంచు కుటుంబం మొత్తం ఈ పాపే ప్రపంచంగా వున్నారు. మంచు లక్ష్మి అయితే రోజుల పాప, తాను, తన భర్తతో ఫొటో షూట్ కూడా చేయించి తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టింది. ముద్దులొలికేలా వున్న మంచు లక్ష్మి కూతుర్ని చూసి అందరూ ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇదిలా వుంటే, మంచు లక్ష్మి కూతుర్ని చూసి ముద్దాడటానికి సీనియర్ నటి జమున మంగళవారం నాడు మోహన్‌బాబు ఇంటికి వచ్చింది. పాపని చాలాసేపు ఎత్తుకుని ముద్దాడింది. ఈ సందర్భంగా మోహన్ బాబు కుటుంబానికి జమున అభినందనలు తెలిపారు. సీనియర్ నటి జమున తమ పాపను ముద్దాడటానికి రావడంతో మంచు లక్ష్మి, ఆమె భర్త ఆనందంతో పొంగిపోతున్నారు.

బంగారు బికినీల్లో బాలీవుడ్ భామలు

  సమాజంలో వుండే అంశాలనే తన కథాంశాలుగా తీసుకునే బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ ఇప్పుడు కేలండర్ గర్ల్స్ చుట్టూ తిరిగే కథతో ‘కేలండర్ గర్ల్స్’ అనే చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కేలండర్ గర్ల్స్.గా నటించే ఐదుగురు బాలీవుడ్ హీరోయిన్లతో ఆల్రెడీ ఫొటో షూట్ కూడా నిర్వహించేశాడు. తాజాగా ‘కేలండర్ గర్ల్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో బంగారు వన్నె బికినీలు ధరించి, వన్నెచిన్నెలు ఆరబోసిన ఆ ఐదుగురు బాలీవుడ్ భామల ముఖాలు కనిపించకుండా టోపీలు అడ్డుపెట్టడంతో వారెవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సినిమా పూర్తయ్యేంత వరకు వారెవరనేది గోప్యంగా ఉంచాలని భండార్కర్ భావిస్తున్నట్లు సమాచారం.

సరికొత్త ‘శంకరాభరణం’

  అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌ సృష్టి ‘శంకరాభరణం’ సరికొత్త హంగులతో విడుదల కాబోతోంది. ‘శంకరాభరణం’ విడుదలై ఇప్పటికి 35 సంవత్సరాలు దాటుతోంది. ఈ సినిమాని డిజిటలైజ్ చేసి, సరికొత్త సౌండ్ ‌సిస్టమ్‌తో మ్యూజిక్‌ని సాంకేతికంగా అప్‌గ్రేడ్ చేశారు. కలర్ కరెక్షన్ చేసి, అంతకుముందు 35 ఎంఎంలో వున్న సినిమాని సినిమా స్కోప్‌లోకి మార్చారు. రీ-రికార్డింగ్ కూడా కొత్త ఫార్మాట్‌లో చేశారు. ‘శంకరాభరణం’ సినిమాని నేటి సాంకేతిక సదుపాయాలకు అనుగుణంగా మార్చడానికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఒక కళాఖండమైన ఈ సినిమా ఇప్పుడు సాంకేతికంగా కూడా నేటి తరం కూడా ఇష్టపడేలా వుంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాని తమిళనాడులో విడుదల చేయబోతున్నారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన‘శంకరాభరణం’ తెలుగు వెర్షనే తమిళనాడులో సిల్వర్ జూబ్లీ ఆడింది. ఏడిద నాగేశ్వరరావు ఈ డిజిటల్ వెర్షన్‌ని తెలుగులో కూడా విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

సౌత్ హీరోయిన్ పెళ్ళి అయిపోయింది...

  తమిళంలో విజయం సాధించిన ‘నేరం’ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చకున్న నజ్రియా ఇంకా బోలెడంత కెరీర్ ముందు వుండగానే పెళ్ళి చేసేసుకుంది. కాకపోతే అలాంటి ఇలాంటి వాడిని కాకుండా ఏకంగా మలయాళ దర్శకుడు ఫాజిల్ కొడుకు, మలయాళ నటుడు పాహత్ ఫాజిల్‌నే పెళ్ళి చేసుకుంది. వీళ్ళిద్దరి పెళ్ళి గురువారం నాడు కేరళలో వైభవంగా జరిగింది. బుధవారం నాడు తిరువనంతపురం సమీపంలోని ఓ స్టార్ హోటల్‌లో మెహందీ వేడుక జరిగింది. వధూవరుల బంధుమిత్రులతోపాటు కావ్యా మాధవన్, మీరానందన్, మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం పాహత్ ఫాజిల్, నజ్రియాల వివాహం ముస్లిం సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈమధ్యకాలంలో హీరోయిన్లు కెరీర్‌ ఉజ్వలంగా ఉండగానే పెళ్ళి చేసేసుకుంటున్నారు. మొన్నీమధ్యే అమలాపాల్ కూడా పెళ్ళి చేసుకుంది.

రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్?

  ఇప్పటికై సరైన హిట్లు లేక బేర్‌మంటున్న తెలుగు సినిమా పరిశ్రమకి కొత్త కష్టం వచ్చిపడింది. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తామని తెలుగు సినిమా కార్మికుల సమాఖ్య ‘ఫిలిం ఫెడరేషన్’ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, సినిమా రంగానికి మధ్య వారధిగా వుండే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి నోటీసు ఇచ్చింది. తమకు సరైన వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఫిలిం ఫెడరేషన్ బంద్ పిలుపు ఇచ్చింది. ఫెడరేషన్ చెప్పినట్టుగా వేతనాలను సవరింకపోతే రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు నిలిచిపోయే అవకాశం వుంది. దాంతో ఇప్పటికే మూలిగే నక్కలా వున్న సినిమా పరిశ్రమ నెత్తిన బంద్ రూపంలో తాటికాయ పడే ప్రమాదం వుంది. అయితే సినిమా కార్మికులు బంద్ చేయకుండా చూడటానికి సినిమా పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఐదు రోజుల్లో వంద కోట్లు... అబ్బ....

  అజయ్ దేవ్గణ్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ‘సింగం రిటర్న్స్’ కళ్ళు తిరిగే రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. సినిమా విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి అబ్బ అనిపిస్తోంది. ఈ సినిమా ప్రీక్వెల్ ‘సింగం’ ఇప్పటివరకూ సాధించిన కలెక్షన్ల కంటే ఇది ఎక్కువ అని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలీవుడ్లో చాలా సినిమాలు వందకోట్ల వసూళ్లు సాధించాయి. అయితే కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఫీట్ సొంతం చేసుకున్నది మాత్రం సింగం రిటర్న్స్ మాత్రమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇన్స్పెక్టర్ బాజీరావు సింగం పాత్రలో నటించిన అజయ్ దేవ్గణ్.. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమాతో ఒక్కసారిగా మళ్లీ తారాపథానికి దూసుకెళ్లాడు.

శ్రుతిహాసన్‌కి ఎక్కడెక్కడో టాటూలు

శరీరం మీద ఎక్కడెక్కడో టాటూలు ముద్రించుకునే సంస్కృతి విదేశాలలో బాగా వుంది. ఈ సంస్కృతి ఈమధ్యకాలంలో మన దేశంలో కూడా వ్యాపిస్తోంది. తాజాగా కమల్ హాసన్ కూతురు, హీరోయిన్ శ్రుతీ హాసన్ ఈ టాటూల సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేసేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ టాటూలు ముద్రించుకుంటోంది. ఈ మధ్య కాలంలో హిట్ల మీద హిట్లతో మంచి ఊపు మీద వున్న ఈ భామ మొన్నామధ్య మణికట్టు మీద ఒక చిన్న టాటూ వేయించుకుంది. ఆ తర్వాత ఆ చిన్న టాటూ కనిపించకుండా వుండటం కోసం దానిమీద పువ్వు లాంటి ఒక పెద్ద టాటూ పొడిపించుకుంది. ఇప్పుడు తాజాగా శ్రుతీహాసన్ తన వీపుమీద తన పేరును తమిళ భాషలో టాటూగా వేయించుకుంది. అలాగే తన పాదాల మీద ‘రైజ్’ అనే పదాన్ని టాటూ వేయించుకుంది. తాను వేయించుకున్న టాటూలతో ఫొటోలు కూడా దిగుతోంది. శ్రుతీ హాసన్ వరస చూస్తుంటే భవిష్యత్తులో ఇంకొన్నిచోట్ల కూడా టాటూలు వేయించుకునేట్టు కనిపిస్తోంది. అమ్మా శ్రుతీహాసన్... నువ్వు ఎక్కడైనా టాటూ వేయించుకోగానీ, ముఖం మీద మాత్రం వేయించుకోకమ్మా.. ప్లీజ్!!

‘గీతాంజలి’... నా కెరీర్‌లో మైలురాయి: అంజలి

  తన కెరీర్‌లోనే ‘గీతాంజలి’ సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోతుందని కథానాయిక అంజలి చెప్పారు. కోన వెంకట్ సమర్పణలో రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఎమ్.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ‘గీతాంజలి’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సమర్పకుడుకోన వెంకట్ మాట్లాడుతూ -‘‘అంజలి ఒప్పుకోకపోయుంటే మేం ఈ సినిమానే చేసి ఉండేవాళ్లం కాదు. హారర్ కామెడీ కథ ఇది. నా ప్రతి సినిమాలోనూ బ్రహ్మానందంగారికి ఓ స్పెషల్ రోల్ ఉంటుంది. ఇందులో ఆయన ఓ మంచి రోల్‌తో పాటు, ఓ స్పెషల్ సాంగ్ చేశారు. రాజకిరణ్ అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు.