అవినీతికి నీతి పాఠాలు చెప్పాలిప్పుడు!!
posted on Dec 20, 2021 @ 9:30AM
ప్రస్తుత సమాజంలో ప్రతి పని కొన్ని నిర్ణీత షరతులకు లోబడి జరుగుతుంది. అయితే ఆ పనిని అదే షరతులతో జరపకుండా లేదా జరగనివ్వకుండా వక్ర మార్గంలో స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్టు చేసే వాళ్ళు ప్రస్తుతం బోలెడు మంది ఉన్నారు. పేరుకే రాజ్యాంగం, అందులో చట్టాలు. వాటిని కచ్చితంగా పాటిస్తూ ఉన్నవాళ్లు ఏ కొద్దీ మందో. ఆ కొద్దీ మందిని తప్పిస్తే మిగినవాళ్ళు అందరూ తమంతకు తాము కొత్త నియమాలను సృష్టించినట్టు దౌర్జన్యంతో బతికేస్తుంటారు. చట్టంలో కొన్ని పనులను చేయకూడదు అనే నియమాలు ఉంటాయి.
కానీ వాటిని చేస్తూ ఆ చట్టాన్ని వెక్కిరించే ఉద్దండులు ఎందరో. ప్రస్తుత భారతదేశంలో అవినీతి వేళ్ళూనుకుపోయింది. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంతగా. అన్ని రంగాలలో, అన్ని కార్యకలాపాలలో, అన్ని విధాలుగా ఈ అవినీతి జరుగుతూనే ఉంది, ముఖ్యంగా ఈ అవినీతి ఉక్కు పిడికిలిలో ఇరుక్కుపోయేది చిన్న స్థాయి, పేద, మధ్య తరగతి ప్రజలు. తమ జీవితాలకు, తాము పొందవలసిన ఎన్నింటినో అవినీతి మూలంగా కోల్పోతున్నారు. దీని వెనుక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు ఎన్నో ఉండచ్చు.
అర్హత కలిగిన పథకాలు పొందలేకపోవడం!!
సగటు మనిషికి ప్రభుత్వం కొన్ని పథకాలు నిర్దేశించింది. అవి ఆహార భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఇలా జీవితంలో సగటు మనిషికి అవసరమైనవి అన్నీ. కానీ ఇక్కడ రాజకీయ కోణాలు ప్రభావం చూపిస్తాయి. ఆ పథకానికి పౌరుడు అర్హుడా, కాదా అని విషయం కాకుండా పార్టీ, నాయకుడి కోణంలో వాటిని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా పౌరుడు నష్టపోతాడు.
లంచాల పరంపర!!
ప్రస్తుత కాలంలో లంచం ఒక సాధారణ విషయం అయిపోయింది. ఉద్యోగస్తుల బల్ల కింద, గోడల చాటున కరెన్సీ చేతులు మారడం పరిపాటి. మండల ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు వంటి చోట్ల ఈ లంచం లేకుండా పని జరగడం అంటూ ఉండదు. ఒకవేళ అది లేకుండా పని జరుగుతుంది అంటే అది ఏ రాజకీయ నాయకుడి రికమెండషనో అయి ఉంటుంది. ఇలా సాధారణ వ్యక్తి లంచాలు ఇచ్చుకుంటూనో, రాజకీయ నాయకుల దయాదక్షిణ్యాల వల్లనో బతుకుసాగిస్తూ ఉంటాడు. ఇది ఒక విషయం అయితే రెండోవైపు ఇంకో విషయం ఉంటుంది. అర్హత లేకపోయినా పలుకుబడితో, రాజకీయ అండతో సామాన్యులకు వెళ్లాల్సిన లబ్ధిని కాజేసేవారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు, పెన్షన్లు, ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాలు దోచేసేవాళ్ళు. అక్రమంగా స్థలాలు కబ్జా చేసి రాజకీయ అండతో పెత్తనం చేలాయించే వాళ్ళు. పేదవాళ్ళ కడుపు కొట్టి దోపిడీ చేసేవాళ్ళు. వాళ్ళను మోసం చేసేవాళ్ళు.
ఇక విద్యార్థుల జీవితాలతో కులం పేరుతోనూ, రిజర్వేషన్ల పేరుతోనూ పై స్థాయి చదువులు చదవలేక పోతున్నవాళ్ళు. అధికారుల సంతకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నవాళ్లు. స్కాలర్షిప్పులు, రియింబర్స్మెంట్ లు రావడానికి చేతులు తడపాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్లు. ప్రతిభ ఏమీ లేకున్నా ప్రభా పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందేవాళ్ళు. వీటి వల్ల నిజమైన ప్రతిభ ఉన్నవారు ఎందరో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇదంతా సాధారణ అవినీతి అయితే రాష్ట్రాలు, దేశాల మధ్య దొంగ రవాణా, స్మగ్లింగ్, దొంగ నోట్లు, సైబర్ నేరాలు, డబ్బు అడ్డు పెట్టుకుని ఘోరమైన తప్పులకు శిక్షలు తప్పించించజకునే మహానుభావులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ కూడా సగటు సాధారణ పౌరుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
కానీ సిగ్గు పడాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఈ అవినీతి కార్యకలాపాలను చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుంది. అందుకే సగటు పౌరుడు అవినీతికి వ్యరేకంగా మాట్లాడినా ఆ పౌరుడే మళ్ళీ శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి అవినీతి అనేది పైనేక్కడో పెద్ద పెద్ద వేర్లతో విస్తరించుకుంది. అది కూకటివేర్లతో సహా పెకించుకుని నేల కూలిపోవాలి. కనీసం రేపటి పౌరులను అయినా అవినీతికి వ్యతిరేకంగా పెంచితే రేపటి భారతంలో కాసింత నీతిమాలిన జీవితాలు కనబడతాయేమో. అందుకే అవినీతికి నీతి పాఠాలు చెప్పాలి!!
◆ వెంకటేష్ పువ్వాడ