కళ కోసం ఓ సినిమా !!
posted on Dec 14, 2021 @ 9:30AM
భర్తృహరి అద్భుత పద్యం కళాతపస్వి అద్భుత దృశ్యకావ్యం!!
【శ్లోకం:- జయంతి తే సుకృతినో |
రససిద్ధాః కవీశ్వరాః ||
నాస్తి తేషాం యశః కాయే |
జరామరణజం భయమ్ ||
సిద్ధౌషధ సేవవల్ల ముసలితనాన్ని – మరణాన్ని సైతం అతిక్రమించవచ్చు ! అయితే – అది ఇట్టి ఔషధం యోగులకు మాత్రమే అందుబాటులో ఉండి, వారే సేవించగలుగుతారు. విద్వాంసులైన వారికి ‘ కీర్తి ‘ రూపంలో మరణానంతరం కూడ జీవం ఉండి, సిద్ధౌషధంలా వారిని జీవింపచేస్తుంది. ఇటువంటి ధన్య జీవులు ఎవరు ? కవులు – పండితులు వీరు సద్ధౌషధం సేవించిన యోగులవంటివారు.】
పై పద్యం భర్తృహరి రచించిన నీతి శతకంలోనిది. ఆ పద్యాన్ని, దాని భావాన్ని వివరంగా పరిశీలిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే కళ ఎంత గొప్పదో అర్థమవుతుంది. కవులు, పండితులు సిద్దౌషధం సేవించినటువంటి వారని ఆయన అంటాడు. ఇంతకు సిద్ధ ఔషధం ఏమిటి అంటే ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలాంటిది శక్తివంతమైన వైద్యం సిద్దవైద్యం కూడా. సిద్ధులు శైవ భక్తులు, వీరు పద్దెనిమిది మంది ఋషులు. ఆయుర్వేదాన్ని ఎలాగైతే ధన్వంతరీ మహర్షి అభివృద్ధి చేశారో అలాగే సిద్ధులు కూడా సిద్దవైద్యాన్ని అభివృద్ధి చేశారు. ఈ సిద్ధులలో అగస్త్య మహర్షి ముఖ్యమైనవాడు. ఇక విషయంలోకి వెళ్తే ఆ సిద్ధ ఔషధం అమృతంతో సమనమైనది. దాన్ని తీసుకున్నవాడు మరణాన్ని జయిస్తాడు. అయితే అది సాధారణ మనుషులకు అందుబాటులో ఉండదు. యోగులు, ఋషులకు అందుబాటులో ఉండి వాళ్ళు మాత్రమే దాన్ని సేవించగలుగుతారు.
కానీ….. విద్వాంసులు అంటే కవులు, పండితులు, కళలలో నైపుణ్యం సంపాదించినవారు. వీళ్ళందరూ సాధారణ మనుషుల్లోనే ఉన్నా, వీళ్ళు మరణించినా వారిలో ఉండే కళ, దాని నైపుణ్యం కారణంగా వాళ్ళు అందరి మనసులలో జీవించే ఉంటారు. అంటే భౌతికంగా మరణించినా, మానసికంగా అందరి మనసులలో బతికే ఉండటం. ఇలాంటి వాళ్ళు సిద్ధ ఔషధం స్వీకరించిన యోగులు, ఋషుల వంటి వారు. మనుషుల్లో ఉన్న గొప్పవాళ్ళు వీళ్ళు. దీని వల్ల కళ గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, విశిష్ట ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పైన భర్తృహరి చెప్పినట్టు అమృతంతో సమానమైన ఔషదాన్ని సేవించినవాళ్ళ లాంటి వారే.
ఇక ఈ పద్యం ముఖ్యంగా భర్తృహరి నీతి పద్యంగానే కాకుండా కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం సాగరసంగమంలో ఈ పద్యాన్ని ప్రస్తావిస్తారు. అంటే ఆ సినిమాలో కూడా కళ గురించి తపించిన వారు కళను ప్రేమించి, ప్రతిభ ఉన్నవారికి భౌతికంగా మనరణం సంభవించినా మానసికంగా మరణం అనేది ఉండదనే విషయాన్ని అందులో చెప్పారు.
కాబట్టి కళను గౌరవించి, ప్రేమించాలి. ముఖ్యంగా నేటితరం సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి.
◆ వెంకటేష్ పువ్వాడ