రొమాంటిక్ డే

ఒక రొమాంటిక్ మూమెంట్ కావాలంటే పెద్ద హంగామా అక్కర్లేదు. కేవలం ఒక గులాబీ చాలు. గుండెల్లో దిగబడిపోయేంత ప్రేమను గమ్మత్తుగా, అంతే నిశ్శబ్దంగా ప్రసరించేలా చేస్తుంది గులాబీ. ముఖ్యంగా అమ్మాయిలకు, ప్రేమకు, గులాబీ కి ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు.  చాలామందికి గులాబీల దినోత్సవం అనగానే ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే సందర్భం గుర్తొస్తుందేమో కానీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 ను ప్రపంచ గులాబీల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రపంచ గులాబీల దినోత్సవం ఎలా పుట్టింది?? ఈ గులాబీ రోజు ప్రత్యేకత ఏమిటంటే….. గులాబీల దినోత్సవం గులాబీల దినోత్సవం అనగానే చాలామంది ప్రేమ దోమ అనుకుంటూ హార్ట్ బీట్ పెంచుకుంటూ ప్రపోజ్ చేయడానికి పరిగెడతారేమో అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కెనడాలో మొట్టమొదటిసారిగా కాన్సర్ పేషెంట్ లు తొందరగా కోలుకోవాలని వాళ్లకు ఆహ్లాదాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి గులాబీ పూలను ఇచ్చారట. పువ్వులు అంటేనే ఆశకు, మానసిక పరిపక్వతకు సూచిక. అలాంటి పువ్వులను అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వడం వల్ల వారిలో నూతనోత్తేజం ఉత్పన్నమవుతుందని నమ్మకం. అలా కెనడా లో పుట్టిన ఈ అలవాటు అన్ని దేశాలకు విస్తరించింది. అదే ప్రస్తుతం అన్ని చోట్లా కూడా ఎవరైనా అనారోగ్యానికి గురైనపుడు వారిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు గులాబీ పువ్వులను తీసుకెళ్లడంలో అంతార్థం. చాలామందికి ఈ విషయం తెలియకపోయినా ఒక ఫార్మాలిటీగా అలా ఫాలో అయిపోతుంటారు.  ఇక ఈ గులాబీలు మాత్రమే ఎందుకు ఇచ్చారు ఇన్ని పువ్వులు ఉండగా అనే ప్రశ్న కూడా చాలమందిని తొలిచేస్తూ ఉంటుంది కాబోలు. ఈ గులాబీ చరిత్ర తెలిస్తే దాన్ని ఇలా వాడటం సబబే అనిపిస్తుంది. దాదాపు 35 మిలియన్ సంవత్సరాల కిందటే గులాబీలు ఉన్నాయినంటే ఆశ్చర్యం వేస్తుంది.  ఈజీపు మహారాణి క్లియోపాత్ర కాలంలో ఈ గులాబీ ప్రేమకు ప్రతిరూపంగా వాడటం మొదలుపెట్టారు.  గులాబీలను మనం అలంకరణ కోసం లేదా తలలో పెట్టుకోవడానికి లేదా ఎవరికైనా ఇవ్వడానికి ఇలా మాత్రమే వాడతాం. అందుకే మనకు గులాబీల రహస్యం తెలియదు. పాశ్చాత్య దేశాల్లో గులాబీ రేకులతో టీ చేసుకుని తాగుతారు. ఆయుర్వేదపరంగా ఇది ఎంతో మంచిది. పంచదార, గులాబీరేకులు కలిపి తయారు చేసే గుల్కండ్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్వచ్ఛమైన రోజ్ సిరప్ వంటివి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో దోహాధం చేస్తాయి. ఇవే కాకుండా గులాబీలను సౌందర్య సాధనంగా విరివిగా ఉపయోగిస్తారు. సౌందర్య ఉత్పత్తులలో అగ్రస్థానం గులాబీలదే. మగువ అందాన్ని, మగువకు సరితూగే మనోహరాన్ని గులాబీల మాత్రమే చూడగలం అంటే అతిశయోక్తి కాదు.  అంతేకాదండోయ్ గులాబీ ఏ విధంగా చూసినా నెంబర్ వన్ గా దూసుకుపోతుంది. సాహిత్యంలో కవులకు గులాబీ ఒక స్వర్గ ద్వారం లాంటిదంటే వారి మనసులో దాని స్థానం ఏమిటో అర్థం చేసుకోండి. పాశ్చాత్యులకు, ప్రణయ కథకులకు, ప్రేమకు, పరామర్శకు  ఇలా ప్రతి దానికీ గులాబీకి ఓట్ వేసేవారు ఎక్కువ. అయితే అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటు ఈ గులాబీ కూడా కొత్త సొబగులు అద్దుకుని నిత్యవసంతంలా తయారైపోతుంది ఎలా అంటే….. ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో  అందాలు…. రంగులు రంగుల పువ్వులు, అందులో ఒకే పువ్వు రంగులు మాత్రం అబ్బో ఎన్నో….  ఇంద్రధనస్సును కూడా చిన్న బుచ్చుకునేలా చేస్తాయి ఈ గులాబీ కుసుమాలు. అయితే ఈ గులాబీలలో ఒకో రంగు పువ్వుకు ఒకో ప్రత్యేకత, అందులో నిఘూడార్ధం ఉన్నాయి. రంగుల్లో రహస్యం ఎరుపు : ఎరుపు గులాబీ ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరి నుండి అయినా అందుకున్నా అది నిజమైన  ప్రేమకు చిహ్నం. దీన్ని ఎక్కువగా ప్రేమికులు వాడేస్తుంటారు. పసుపు : ఈ పాసులు రంగు గులాబీకి ఎక్కువ గుణాలు ఇచ్చేసారు రంగుల గూర్చి విశ్లేషించిన వాళ్ళు. ఆనందం, స్నేహం, సంతోషం, జ్ఞాపకం మొదలైనవాటిని వ్యక్తం చేసేటపుడు పసుపు గులాబీ ఉపయోగించాలట. తెలుపు :  తెలుపు అంటే ఒక శాంతి, స్వచ్ఛత,  పవిత్రత.  అలాంటి సందర్భాలలో తెలుపు గులాబీ వాడాలి. ముదురుగులాబీ : ఏవరైనా మనకోసం ఏదైనా చేసినపుడు వారికి  కృతజ్ఞతా పూర్వకంగా ముదురు గులాబీని ఇవ్వచ్చు. నారింజ : ఈ గులాబీ తమలో ఉన్న ఉత్సుకతను తెలిపే సందర్భంలో, తమ మనసులో చోటు చేసుకున్న ఊహ ప్రపంచానికి గుర్తుగా వాడుతుంటారు. ఎరుపు-పసుపు మిశ్రమం : సాదారణంగా కలయిక అనేదే సంతోషం కలిగించేదిగా భావిస్తారు. అలాగే ఎరుపు-పసుపు రంగుల గులాబీని సంతోషం వ్యక్తం చేసే సందర్భాలలో ఉపయోగిస్తారట ముధుర గోధుమ-ఎరుపు : ఈ రెండిటి కలయికలో ఉన్న గులాబీ ఆనందాన్ని కోరుకోవడం, లేదా వ్యక్తం చేయడం కోసం ఉపయోగిస్తారు. ఎరుపు-తెలుపు : ఇవి రెండు రంగులు ఐకమత్యంను తెలుపుతాయి. అందుకే మరి మనుషుల మధ్య ఐకమత్యం పెంపొందాలి. ఈ ఎరుపు తెలుపుల విరబూయాలి. లేత పసుపుపచ్చ : ఇది చాలా రొమాంటిక్. మనసులో కోరికను వ్యక్తం చేయడానికి ఈ లేత పసుపుపచ్చ గులాబీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఈ లేత పసుపు గులాబీ ఎక్కువగా తిరుగుతుంటుంది. గులాబీ వెనుక, ఈ ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక, గులాబీ రంగుల వెనుక ఇంత కథ ఉందన్న మాట. అందరికీ ఎరుపు-తెలుపు గులాబీలతో ప్రపంచ గులాబీల దినోత్సవ శుభాకాంక్షలు. ◆ వెంకటేష్ పువ్వాడ

ఆలోచనలు మారాలి !

పిల్లలు ఇంట్లో తిరగాడుతుంటే ఆ కళ వేరు. పిల్లల ముద్దు పలుకులు చూస్తే ఆ సంతోషం వేరు. కానీ ఈ మధ్య పిల్లలు విగతజీవులు అయిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా ఘోరం గా తయారవుతోంది ఈ సమాజం. నెలల పసికందు అయినా పండు ముసలి అయినా కామంతో రగిలే మగాడి కంట పడితే ఇక జీవితం ముగిసినట్టే అవుతోంది పరిస్థితి. ఇట్లా ప్రవర్తించేవాళ్ళు అసలు అలా ఎలా చేయగలుగుతారు అనేది అందరూ వేసే ప్రశ్న. ప్రతిసారి ఇట్లాంటివి జరిగినపుడు ప్రశ్నలు గుప్పించడం. తరువాత కొన్ని రోజులకు అన్ని మర్చిపోవడం. తప్పు చేసినా వాళ్లను శిక్షించినా తరువాత మళ్ళీ ఏదో ఒక రోజు, ఎక్కడో ఒకచోట ఉలిక్కిపడేలా మళ్ళీ దారుణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అసలు సమస్య ఎక్కడుంది??  వస్త్రధారణ అని చాలా మంది అంటారు మరి నెలల పసిబిడ్డలు, పదేళ్లు కూడా నిండని బుజ్జి తల్లులు ఎలాంటి బట్టలు వేసుకోవాలి?? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పెంపకంలో తప్పుందా?? ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను ఉత్తమంగా ఉండేలానే పెంచుతారు. ఎవరు కూడా తమ బిడ్డలు తప్పులు చేసి జైలు కు వెళ్లాలని, పసిబిడ్డల ప్రాణాలు, ఆడపిల్లల మానాలు తీసేట్టు ప్రేరేపించి పెంచరు. మరి ఎక్కడుంది అసలు సమస్య అంటే….. సమాజంలో ఉంది. ఇప్పటితరం పిల్లలకు సెక్స్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. నెట్ సెంటర్ లలో విచ్చలవిడిగా బ్లూ ఫిల్మ్ వీడియోస్ చాలా తక్కువ ధరకు మొబైల్ లో ఎక్కించేస్తారు. వయసుతో తేడా లేకుండా పిల్లలు కూడా వాటిని చూస్తారు. ఒక తండ్రి తన మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ పెట్టుకుంటే కొడుకు ఏదో అవసరానికి మొబైల్ తీసుకుని పొరపాటున వాటిని ఓపెన్ చేయచ్చు, ఒక ఉపాధ్యాయుడు పిల్లలను పనికిమాలిన విషయాలకు ఉపయోగించుకుంటే తద్వారా ఆ విద్యార్థి పెద్దవుతూ పనికిమాలినవాడిగానే ఎదుగుతాడు. ఒకచోట దారుణం జరుగుతూ ఉన్నపుడు ఎవరూ స్పందించకుండా మాకెందుకు లెమ్మని ఉంటే, అక్కడున్న ఏ పిల్లవాడో ఒక బాధ్యతారహితమైన వాడిగా రూపాంతరం చెందవచ్చు. ఒకమనిషి ఒక పెద్ద తప్పు చేసాడు అంటే దానికి మూలమైన విత్తనం ఎక్కడో ఎప్పుడో ముందే పడింది అని అర్థం. 90% ఆ విత్తనం సమాజం నుండి రాలిపడినదే అని అర్థమవుతుంది కూడా. ఎందుకంటే ఎదిగే పిల్లల మీద కుటుంబంతో పాటు  సమాజం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడేం చేయాలి?? ప్రతిసారి ఏదో జరిగిపోయాక ఆవేశంతో ఊగిపోవడం, తప్పు చేసినవాళ్లను శిక్షించాలని డిమాండ్ చేయడం, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ఉద్యమాలు వంటివి చేసెబదులు  ఎవరికి సాధ్యమైనంత మేరకు వారి చుట్టూ వాతావరణాన్ని కాస్త మార్చగలిగేలా ముందగుడు వేయాలి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? ప్రతి తల్లిదండ్రి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇష్టమొచ్చినట్టు ఉండి, పిల్లలను సరైన  దారిలో ఉండమంటే అది జరగదు. అక్కడే పిల్లల్లో విరుద్ధ భావాలు మొదలవుతాయి. పిల్లలు ఏమి చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. స్నేహితులను, ఉపాధ్యాయులను కలుస్తూ వారితో మాట్లాడుతూ పిల్లల గురించి తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలతో స్నేహంగా ఉండాలి. నిజానికి పిల్లలతో తల్లిదండ్రులమనే అధికారంతో కంటే స్నేహితుల్లా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే బయట స్నేహాలకు అంత తొందరగా లొంగిపోరు పిల్లలు.  "మగపిల్లాడు వాడికేం దర్జాగా బతుకుతాడు. వాడి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు" ఇది చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. సరిగ్గా ఈ అభిప్రాయమే ఆ పిల్లలు దారితప్పడానికి కారణం అవుతోంది.  మగవాళ్ళు తమ ఇంట్లో ఉన్న మహిళకు గౌరవం ఇస్తూ ఆ మహిళ అభిప్రాయాలకు స్వేచ్ఛ ఇస్తూ, వారిని గుర్తిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బయట సమాజంలో స్త్రీల పట్ల కూడా గౌరవం కలిగివుంటారు. కాబట్టి ఇంటి నుండి మొదలవ్వాలిది. ఇక సమాజంలో జరుగుతున్నవాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలావరకు ఘోరాలు మద్యం మత్తులోనూ, బ్లూ ఫిల్మ్ లు, రొమాంటిక్ వీడియో లు చూడటం ద్వారావచ్చే ఉద్రేకాన్ని ఆపుకోలేక చేస్తున్నవే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలో అందరి మీద ఉంది. మీ చుట్టూ ఉన్న నెట్ సెంటర్లు, మీ ఇంట్లో ఉన్న మొబైల్ హిస్టరీ వంటివి గమనిస్తూ ఉండాలి. పిల్లలకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం, క్రమశిక్షణ అలవాటు చేయాలి పిల్లల దృష్టిలో జీవితాన్ని గొప్పగా వర్ణించాలి. ఆ దిశగా వాళ్ళను నడిపించాలి.  ఎప్పుడూ చట్టాన్ని, ధర్మాన్ని, ప్రభుత్వాన్ని నిందించకుండా మీ వంతు ఏమి చేస్తున్నారో ఆలోచించుకుని చూడండి. అలాంటపుడే సమాజంలో జరుగుతున్నవాటిని కొంత అయినా కట్టడి చేయగలం. మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి కదా!! ◆ వెంకటేష్ పువ్వాడ

అదృష్టం కావాలా నాయనా??

సాధారణంగా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా వినే మాట. అదృష్టం లేదురా!! దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని.  ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినపుడు చివరలో అది తమకు కాకుండా పోయినప్పుడు, ఏవైనా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అనే ఆశతో ఉన్నపుడు అది లాభాన్ని ఇవ్వనపుడు ఇట్లాంటి పెద్ద విషయాల నుండి, నచ్చిన కలర్ డ్రెస్ దొరకనపుడు, తినాలని అనుకున్నది తినలేకపోయినపుడు, విచిత్రంగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్ వెనుకబడ్డపుడు ఇవి మాత్రమే కాకుండా ఈ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. అదృష్టం అంటే లాభం చేకూర్చేది అని.  కానీ మనుషులు ఎందుకు ఇలా అనుకుంటున్నారు?? ఒక వ్యక్తి ప్రమోషన్ వస్తుందని ఆశ పడతాడు. అతను మంచి ఉద్యోగస్తుడే కావచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండచ్చు, కానీ అతనికి ప్రమోషన్ రాకపోతే అదృష్టం లేదనుకునేస్తారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, అతనికంటే మంచి ఉద్యోగస్తుడు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దానికి ఎంపిక చేయబడ్డాడు ఏమో!! ఇలా ప్రతి చోట కూడా మనకు ఏదైనా దక్కకపోతే మన ఆలస్యమో, లేక మనకంటే మెరుగ్గా ఉన్నవారు అవకాశాన్ని అందుకుని ఉండచ్చని అనుకోవచ్చు  కదా!! కానీ ఎవ్వరూ ఇలాంటివి ఆలోచన చేయరు.  [[ అదృష్టం అంటే ఏమిటి?? ]] చాలా మందికి అదృష్టం అంటే కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నప్పుడు తమదగ్గరకు వెతుక్కుంటూ వచ్చే ఒకానొక తాత్కాలిక సంతోషం. వందమంది పేర్లు కొన్ని చిన్న కాగితాలలో రాసి ఒక గాజు సీసాలో వేసి వాటిలో ఒక్కటి బయటకు తీస్తే అందులో ఉండే పేరును అదృష్టం అంటారు. దాని మీద ఆశ అనేది ఉండకూడదు. ఎందుకంటే మందలో మెరుపు ఎక్కడో ఎవరికి తెలుసు. కానీ అందరూ ఏమి చేస్తారు తమ పనులు వదులుకుని మరీ ఆ వచ్చే కాగితంలో తమ పేరు ఉంటుందని మానసికంగా ఫిక్స్ అయిపోయి ధీమాగా ఉంటారు. తమ పేరు రాకపోయేసరికి అదృష్టం లేదు అనుకుంటారు. చాలా ఫ్యూలిష్ గా అనిపించడం లేదూ ఈ ప్రవర్తన. మనకు దక్కకుండా మరొకరికి దక్కితే మనది అదృష్టం కాదు, మరి అవతలి వారిది అదృష్టమేనా?? లేక వారి కష్టపలమా. ప్రతి మనిషి ప్రతివిషయంలో తన పూర్తి శక్తి సామర్త్యాలు ఉపయోగించే అడుగేస్తే ఫలితం ఎట్లా ఉంటుంది?? ప్రతి మనిషి చేయబోయే పని గురించి పూర్తిగా తెలుసుకుని, బాగా ఆలోచించి ప్రణాళిక వేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది. అన్ని జీవులలోకి ఎంతో ఆలోచనా పరులు అయిన మనుషులే ఈ విషయాన్ని విస్మరించి చెట్టు కొమ్మ చివరి అంచున వాలిన పక్షి లాంటి అదృష్టం కోసం చెట్టెక్కితే ఎలా?? కదలికకు ఆ పక్షి ఎగిరిపోయినట్టే, తగినంత కష్టం లేక మన ఫలితం కూడా దూరమైపోదా?? అదృష్టం ఎక్కడుంది?? నిజానికి మనిషి రోజులో కనీసం ఒక్కసారి అయినా అదృష్టం గురించి అనుకుంటారు.  నిజానికి ఇలా అదృష్టం గూర్చి అనుకునేవాళ్లకు స్వశక్తి మీద తమ సామర్థ్యం మీద నమ్మకం లేని వాళ్లేమో అనిపిస్తుంది.  కొందరు పేరులో అదృష్టం అంటారు కొందరు సంఖ్యలలో అదృష్టం అంటారు కొందరు జాతకంలో అదృష్టం అంటారు కొందరు రంగులో అదృష్టం అంటారు కొందరు దిక్కులో అదృష్టం అంటారు. వీటన్నిటి కోసం ఎంతో ధనం వృథా చేస్తారు  కానీ కష్టే ఫలి అన్న పెద్దల మాటలు తెలిసిన తెలియనట్టే చేస్తారు. వెర్రి వేయి విధాలు అన్నట్టు వస్తుందో రాదో, మనది అవుతుందో లేదో అనే మీమాంసలో ఉన్న విషయం పట్ల ఎందుకింత ఆసక్తి మనుషులకు. నిజమైన అదృష్టం  నిజనికి మనిషి ధీమాగా బతకడానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఇలా శరీర అవయవాలు అన్ని సక్రమంగా ఉండి ఉంటే చాలదూ.  కష్టపడాలి, సంపాదించుకోవాలి, బుద్ధి ఉపయోగించాలి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి.  మనిషి పూర్తి ఆరోగ్యస్తుడిగా ఉండటమే గొప్ప అదృష్టమని, అదే నిజమైన అదృష్టమని తెలుసుకుంటే మనిషి జీవితం కొత్త మలుపు తిరగడం ఖాయం మరి. ◆ వెంకటేష్ పువ్వాడ

డ్యూటీ విత్ డెమోక్రసి

సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఈ ప్రజాస్వామ్యం అనే పదంలోనే ప్రజలు ఇమిడిపోయి ఉన్నారు.  ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారని అబ్రహం లింకన్ నిర్వచించారు. అట్లాగే భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే ప్రజలు మాత్రం దానికి అనుగుణంగా ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే మరి.  ప్రజల చేత…. ప్రజల కొరకు… ప్రజలే ఎన్నుకోవడం…… పై మూడు పదాలను మళ్ళీ మళ్ళీ చెడితే అర్ధమయ్యే విషయం ప్రజలకు దేశం గూర్చి బాధ్యత ఉండాలని. కానీ ఈ దేశంలో బాధ్యాతాయుత పౌరులు ఎందరు అన్నది ప్రశ్నార్థకం. ఇది ఒక మనిషినో, ఒక సమూహన్నో, ఒక సంఘాన్నో, ఒక సమాజాన్నో కాకుండా యావత్ భారతీయులందర్ని అడగాల్సిన ప్రశ్న మరి.  అసలు బాధ్యత అంటే ఏమిటి?? ఇల్లు, ఇంట్లో కుటుంబ సభ్యులు. వాళ్ళు అందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు, అలా ప్రతి రోజు పనులు చేస్తూ ఉంటారు. అమ్మ వంట చేస్తుంది, నాన్న సంపాదించుకొస్తాడు, పిల్లలు చదువుకుంటారు, ఆడపిల్లలు ఇంట్లో పనులు చేస్తుంటారు, మగపిల్లలు బయటకెళ్లి చేయాల్సిన పనులు చేస్తారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతారు. ఇదంతా ఇంట్లో ఉన్న మనుషుల బాధ్యత. మరి ఇలాంటి బాధ్యత సమాజం విషయంలో, దేశం విషయంలో అక్కర్లేదా?? రోజు ఇంట్లో పనులు చేస్తుంటే పడక గది నుండి, వంట గది దాకా అన్ని చోట్లా నుండి చెత్త పొగవుతుంది. పొడి చెత్త తడి చెత్త కూడా. వాటిని అట్లాగే రోజుల తరబడి ఇంట్లో ఉంచుకుంటే ఇల్లంతా దుర్గంధమే. ఈ విషయం మనకు తెలుసుం అందుకే చక్కగా దాన్ని తీసుకుపోయి ఇంటికి అవతల లేదా వీధి చివర వేస్తాం. దాన్ని అక్కడ శుభ్రం చేయకపోతే వీదంతా కంపు గొడుతుంది. కానీ నాకెందుకు అని పట్టించుకోమ్. అట్లాంటి బాధ్యత రహితాలే క్రమంగా  పెరిగి దేశం పట్ల కూడా బాధ్యతా రహితంగా ఉంటున్నారు నేటి జనం.  మనిషి తన పని కోసం ఎంత నిజాయితీగా, క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తాడో అలాగే తనకున్న బాధ్యత విషయంలో సమాజం పట్ల, దేశం పట్ల కూడా స్పందించగలగాలి.  కేవలం ప్రభుత్వ విషయానికే ప్రజాస్వామ్యం అనేది వర్తిస్తోందని అనుకోవడం మూర్ఖత్వం. దేశం మీద ప్రజలకు ఉన్న బాధ్యతను గుర్తు చేసుకుంటే దేశంలో ఎన్నో పరిస్థితులలో మార్పులు చాలా సులువు అవుతాయి. ప్రజాస్వామ్యం గురించి తమ బాధ్యతల గురించి ప్రతి మనిషి తమలో తాము డెమో నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని గ్రహించి ఇప్పుడే మొదలుపెడితే. ముందు వచ్చేది ఆరోగ్యకరమైన మార్పే!! అదే అసలైన ప్రజాస్వామ్యం అవుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఫ్రెండ్షిప్ చేద్దాం!!

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో  భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మనదేశం సర్వమతాలకు నిలయం. ఇలాంటి దేశంలో ఒకోప్రాంతంలో ఒకో రకమైన పండుగలు జరుపుకుంటారు. కానీ దేశం యావత్తు జరుపుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో వినాయక చవితి కూడా ఒకటి.  మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో దుర్గ నవరాత్రుల కంటే గొప్పగా వినాయక నవరాత్రులు జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయకుణ్ణి తొమ్మిదిరోజుల పాటు అలంకారాల మధ్య, పూజలతో ముంచెత్తుతారు.  అయితే ఏ మతంలో అయినా, సంప్రదాయం అయినా, పండుగ అయినా అది ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేశారు పెద్దలు. కానీ ప్రకృతి కాస్త వికృతి అయినట్టు నేటి మన తరాల పండుగలు అన్ని పర్యావరణానికి శత్రువులుగా మారి కూర్చున్నాయి. సమస్య ఎక్కడుంది?? సమస్య మొత్తం మనుషులు చేస్తున్న అతిలోనే ఉంది. ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసుకున్న పండుగను అత్యుత్సాహంతో రానురాను సాంప్రదయాన్నే వేలెత్తి చూపే విధంగా తయారు చేసుకుంటున్నారు.  అసలు ఏది సాంప్రదాయం?? సంప్రదాయం అంటే మతాన్నో, కులాన్నో సపోర్ట్ చేసేది అంటే అసలు ఆమోదించకూడదు. సంప్రదాయం అంటే జీవితాన్ని, మన పర్యావరణాన్ని, ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకునేదిగా ఉండాలి. చాలామంది పండుగ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని అంటుంటారు, అసలు పండుగే తప్పని, పండుగ మూర్ఖత్వమని అంటుంటారు. అయితే ఈ పండుగలు అన్ని ఏర్పాటయిన కాలంలో ఇప్పటిలా వీధి వీధికి ఒక పది అడుగుల విగ్రహం, ఊరు ఊరుకు యాభై అడుగుల విగ్రహం, రాష్ట్రానికొక వంద అడుగుల విగ్రహం లాంటివి లేవు. అప్పుడంతా స్వచ్ఛమైన బంకమన్ను చెరువు ప్రాంతాల నుండి తెచ్చి సొంతంగా వినాయకుని విగ్రహాలు చేసి, పూజ చేసుకుని తిరిగి ఆ  మట్టి గణపతిని చేరువుల్లోనే నిమజ్జనం చేసేవారు. కానీ ఇప్పుడు అలా ఎక్కడుంది?? ఎక్కడ చూసినా రసాయనాలతో చేసిన పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు, వాటికి రసాయనాల పూతల రంగులు, అవి కూడా పూర్తిగా భక్తితో కాదు ఈ వీధికి, పక్క వీధికి మధ్య పోటీగా పెడుతున్నారు. అవన్నీ తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తే ఏర్పడేది కాలుష్యమే.  మరేం చేయాలి??  వినాయక పూజలో ఉపయోగించే పత్రి ఎంతో శక్తివంతమైనది. ఆషాఢమాసం ముగిసి శ్రావణం  మొదలవ్వగానే వర్షాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆ వర్షాల వల్ల జరిగే నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ వినాయక పూజలో ఉపయోగించే పత్రి ఎంతగానో దోహదపడుతుంది. నీటిని శుద్ధి చేసే ఔషధ గుణం పత్రిలో ఉంటుంది. కానీ ప్రస్తుతం పెద్ద వినాయక విగ్రహాల వల్ల కలుషితం బాగా పెరిగిపోతోంది. పైగా ఫ్యాక్టరీలు  విడుదల చేసే రసాయనాలు కూడా కలుషితనికి దోహాధం చేస్తాయి.  ఇప్పుడందరూ చేయాల్సింది ఒకటే. వీలైనంతలో ప్రకృతి సహజంగా సొంతంగా మట్టి వినాయకుణ్ణి తయారు చేసుకోవడం. గొప్పలు పోకుండా పెద్ద వినాయకుళ్లను తగ్గించడం. దీనివల్ల ఎవరికి వారు ప్రకృతిని కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన కర్తవ్యం కూడా.  ప్రస్తుతం ప్రకృతి మరియు పర్యావరణ స్పృహ పెరిగి చాలామంది ఎకో ఫ్రెండ్లీ గణపతి వైపు మొగ్గు చూపుతున్నారు.  ఒకవేళ మీరు బయట నుండి కృత్రిమ రసాయనాలు వాడిన వినాయకుణ్ణి తీసుకురావాలి అనుకునేముందు  ఒక్కసారి ప్రకృతి గురించి ఆలోచించి ప్రకృతికి మేలు చేసే మార్గాలలో పండుగ చేసుకునేవైపు ఆలోచించండి.  వినాయకుడికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావసంబందం చాలా గొప్పది సుమా!! అందుకే మరి ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఫ్రెండ్షిప్ చేద్దాం. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ◆ వెంకటేష్ పువ్వాడ

దొంగిలించబడని ఆయుధాన్ని దర్జాగా చేతబట్టాలి!

యుద్ధమూ శాంతి, రెండు విరుద్ధమైన విషయాలు. కానీ జీవితంలో యుద్ధమూ, శాంతి రెండూ ఎంతో ప్రాధాన్యత గల విషయాలు. మనిషి జీవితం నిరంతరం యుద్ధమే. తనతో తను, సమాజంతోనూ, ఎన్నో విషయాలతోనూ. కానీ ఎక్కువ మంది యుద్ధం చేసేది పేదరికంతోనూ, ఆకలితోనూ. ఇది జగమెరిగిన వాస్తవం. కలలు, కోర్కెలు, అందని తీరాలను అందుకోవాలనే ఆరాటాలు ఇవన్నీ సగటు మనిషి జీవితంలో ఉన్నా వాటిని నెరవేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు అడ్డొస్తూ ఉంటాయి. ఇలా అడ్డొచ్చే వాటిలో చాలా వరకు పేదరికం, ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి.  అయితే చాలామంది వాటన్నిటినీ అందని ద్రాక్షగానే చూస్తారు. అందుకోవాలనే ప్రయత్నాలు చేసినా అవన్నీ ఇతరుల సహాయంతోనో, లేక ఎవరో ఒకరు దయతలచి వాటిని అందుకుని తమకు ఇస్తారనో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సహాయాలు అన్ని తాత్కాలికమైనవే అనే విషయం వాళ్లకు భోధపడదు. ఎందుకంటే జీవితానికంటూ సరైన లక్ష్యం, జీవితం మీద సరైన అవగాహన అసలు ఉండటం లేదు ఎవరికి.  మనిషి ఎంత శారీరకంగా కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎన్ని భవంతులు కట్టినా చెడ్డ కాలం వస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ఇక్కడ చెడ్డ కాలం అంటే ఏ గ్రహాలో శాపాలు పెట్టడం కాదు. చేసే వ్యాపారం, ఆర్థికపరమైన కార్యకాలాపాలలో ఘోరమైన నష్టాలు రావచ్చు అని అర్థం. అలాంటివి ఎదురైతే మళ్ళీ చేసేది ఏంటి?? శారీరక కష్టం నుండి మొదలు పెట్టడమా??  కష్టం మంచిదే మనిషికి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతుంది. కానీ కష్టానికి తోడు ఒక ఆయుధం కావాలి. ఎవ్వరూ దొంగిలించని ఆయుధం కావాలి. బుద్దికి పదును పెట్టి కష్టాన్ని తగ్గించి సులభ సాధ్యమయ్యే దారులవైపు అందర్నీ నడిపించే ఆయుధం కావాలి.  దొరలు దోచలేరు దొంగ లెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల. ప్రముఖ రచయిత, కరుణశ్రీ గా పేరొందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతకంలో ఇలా చెబుతారు….. విద్య అనే సంపదను దొరలు అంటే ధనవంతులు, చాకిరీ చేయించుకునేవాళ్ళు దోచుకోలేరు, దొంగలు కూడా దొంగలించలేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చి దాన్ని ఆస్తిని పంచినట్టు  పంచుకోరు. అలా ఎవ్వరికో దాసోహం కాకుండా మనవెంటే ఉండి మనతో ఉండేది కేవలం విద్య మాత్రమే. ఈ  ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది కూడా విద్య మాత్రమే! ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో మనిషిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగేది, ఆలోచనా పరంగా మనిషి స్థాయిని పెంచి గొప్ప శక్తిగా ఎదగడానికి తోడ్పడేది కేవలం విద్య  మాత్రమే. ధనిక పేద తారతమ్యాలు విద్యను అభ్యసించడానికి ఖర్చు చేయడంలో ఉంటుందేమో కానీ, ప్రస్తుతం ఉంటున్న విద్యావకాశాలతో పేదవాడు కూడా సువర్ణాక్షరాలతో ఈ చరిత్రలో లిఖించబడే విధంగా ఖచ్చితంగా తయారవగలడు. కావలసిందల్లా సంకల్ప బలం.  ఆ సంకల్ప బలంతో విద్య అనే ఆయుధాన్ని చేత బడితే జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకు అయినా సవాల్ విసరచ్చు!! సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ సందర్బంగా అక్షరాన్ని ఆయుధం చేసుకునే వారి సంఖ్య పెరగాలని, అందుకు అందరమూ తగిన కృషి చేయాలని కోరుకుంటూ……  అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ◆ వెంకటేష్ పువ్వాడ

రాశి ఫలాలు కాదు - మన రాత మన చేతుల్లోనే !

దాదాపు చాలా మందికి ఓ అలవాటు ఉంటుంది. ప్రతి వారం ఆదివారం రాగానే సండే బుక్స్ లోనో, లేక టీవీ లో స్వామిజీలు చెప్పేవో లేక మొబైల్ లోనే లభ్యమయ్యే బోలెడు మ్యాగజైన్ లలోనో రాశి ఫలాలు చూసుకోవడం. అందులో తమ రాశి ఫలం ఎలా ఉందో చూసుకుని ఆ వారానికి మంచిగా ఉంటే ఇక ఉల్లాసంగా మారిపోవడం. ఏదైనా నష్టమో, అనారోగ్యమో కలుగుతుందని ఉంటే ఇక నిరాశ పడిపోయి, పరిహారాల కోసం, అవి ఇవి చేయించడానికి అంటూ ఖంగారు పడిపోతూ ఉంటారు.  నమ్మకాలు మంచివే కావచ్చు కానీ మరీ ఇలా ప్రతి వారం వారం, బి అలర్ట్ అన్నట్టు ఠంచనుగా వాటిని చెక్ చేసుకొని ఉన్న ఉత్సాహాన్ని నీరు గార్చుకోవడం అవసరమా??  రోజులు మారినా, కాలం మారినా, గ్రహాలు మారినా మనిషి దృఢసంకల్పం అలాగే ఉండాలి కానీ, ముఖ్యమైన దృఢసంకల్పం మారిపోతే రాశి ఫలాలు మాత్రమే కాదు, జాతకాలు, గండాలు, సుడిగుండాలు అన్ని కూడా కట్టకట్టుకుని మీ మీదకు వచ్చినట్టు ఉంటాయి. అవునా??  కాదా?? ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే!! ఏదైనా సమస్య వస్తేనో, లేక ఇబ్బందులు ఎదురైతేనో వెంటనే రాశి ఫలాలు, గ్రహాల తీరు చూస్తూ కూర్చుంటారు చాలా మంది. మరికొందరేమో ఏకంగా ఎక్కడో ఉన్న స్వామిజీలకు ఫోన్ లు చేసి పరిస్థితులు చెప్పుకుని జేబులు ఖాళీ చేసుకుంటారు. ప్రశ్నాపత్రం చేతిలో ఉంటే మీరు రాయాల్సింది జవాబులు మాత్రమే కాదు  మొదట ప్రశ్నను అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు మీ స్థితి గతులను మీరు ప్రశ్నించుకుని వాటిని అర్థం చేసుకుంటే సమాధానం కూడా చాలా సులువుగా దొరుకిపోదూ!! అందరూ అంటూ ఉంటారు ఏది ప్లాన్ చేసినట్టు జరగదు అని. కానీ ఎందుకు జరగదు?? అసలు ఎప్పుడైనా ఒక్కరోజును అయినా ప్లాన్డ్ గా మలిచి చూసారా??  ఉదయం లేవగానే ఈ రోజు ఈ పనులు చేయాలి అని ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టు సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాగితే ఆ రోజు నిద్రపోయే ముందు మీరోజు గడిచిన విధానాన్ని చూస్తే కచ్చితంగా కళ్ళలో మెరుపు మెరవడం ఖాయం!! పూర్తి కాకపోయినా 90 శాతం మీ ప్రాణాలిక అమలవుతుంది. ఒకవేళ మొదటిసారి ఫెయిల్ అయ్యారా?? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కాలంతో ప్రయాణం చేయడం ఎంతో మంది చేస్తారు కానీ, ఒక్కసారి కాలాన్ని గుప్పెట్లో పెట్టుకుని దాన్ని శాసించడం నేర్చుకుంటే జీవితాన్ని నచ్చినట్టు మలచుకోవచ్చు.  రాశి ఫలాలు, రంగులు, అనుకూల దిశ ప్రయాణాలు, రాహు కాలం, యమగండం ఇవన్నీ నమ్మచ్చు, నమ్మక పోవచ్చు కానీ జీవితం మీద,  ముఖ్యంగా  భవిష్యత్తు మీద వీటి ప్రభావం ఎంత అంటే, వాటి పేరుతో ఎవరికి వారు చేసే నిర్లక్ష్యం, కాలయాపన, అన్నిటికి మించి అతి విశ్వాసం, వీటి వల్ల ఎన్నో కలల పార్శ్వాలు అంచుల నుండే జారిపోతాయి. అందుకే మరి రాశిఫలాల రాతలు వదిలి ఎవరి పలితాలు వారు రాసుకోవడానికి ప్రయత్నించండి. జీవితం ప్రశ్నలు సందిస్తూనే ఉంటుంది మరి!! ◆  వెంకటేష్ పువ్వాడ  

క్యాలెండర్ కోసం లక్షల్లో ఉద్యోగం వదిలేసిన షణ్ముఖ

ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అక్కడ జరిగే మానవాభివృదికి సాహిత్యం మరకతమణి కిరీటం లాంటిది. అందులో భాగమైన కథ, కవిత్వం, నవల, జానపదం ఇలా అనేక సాహిత్య ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేసి జన జాగృతికి అపార అక్షర సంపదను ఇచ్చి వెళ్లిన మహానుభావులను ప్రస్తుతం యువత ఎంతమంది గుర్తుపట్టగలరు అంటే వేళ్లపై లెక్కపెట్టవచ్చు. మన అడుగుజాడ గురజాడ, అక్షరాలను నిప్పులు చేసి దోసిల్లో ఆడుకున్న శ్రీశ్రీ, భావ కవిత్వం దేవులపల్లి ఇంకా ఎందరో మహానుభావులు ఎన్నో రచనలు చేసి సమాజం మనో ఫలకం పై చెరగని చైతన్యపు సంతకం చేసి వెళ్లారు. విశాలమైన సాహితీ వనంలో పూలై విరాజిల్లుతున్నారు. అనంతపురం కదిరికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు సున్నపురాళ్ల శ్రీనివాస్, ధర్మపత్నీ యశోద వారి కుమారులు షణ్ముఖ ముగ్గురూ కలిసి రేపటి తరం కోసం ప్రముఖ రచయితల ముఖచిత్రాలతో " తెలుగు సాహితీ కాల చక్రం" పేరుతో క్యాలెండర్ (కాలమాని) ని ముద్రించి నేటి సమాజం నిత్యం వారిని దర్శించే మహత్తర కర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ మహాప్రస్థానమైనా ఆటుపోటులతోనే ప్రారంభం అవుతుంది. అలాగే వీరి ప్రయాణం కూడా అంతే! మీకెందుకు ఖర్చు? ప్రభుత్వాలకే పట్టకుంటే సొంత ఖర్చులతో ఇలా చేయడం కరెక్ట్ కాదని బంధువులు స్నేహితులు చెప్పారు. కొంతమంది నిందించారు. కానీ వారు వెనకడుగు వేయలేదు. మహా సంకల్పంతో ముందుకు కదిలారు. *తల్లిదండ్రుల బాటలో కుమారుడు షణ్ముఖ ముఖ్యంగా వారి కుమారులు షణ్ముఖ గురించి చెప్పాలి. ఎం బి ఏ పట్టభద్రుడు. బెంగళూర్ లో లక్షల జీతాన్నీ, విలాసవంతమైన జీవితాన్నీ వదిలేసి గత మూడు నాలుగేళ్లుగా ఇదే కార్యక్రమంలో అంకితమయ్యారు అంటే వారి కృషి అనిర్వచనీయం అని చెప్పాలి. క్యాలెండర్ లను ముద్రించడం ఒక ఎత్తయితే  పరమపదించిన రచయితల నిజ సమాచార సేకరణ ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అరుదైన వారి చిత్రాలు, రచనల సేకరించడంలో కుమారుడు షణ్ముఖ చేసిన చేస్తున్న కృషి అద్భుతం.  * సాహితీ కాలమానం క్యాలెండర్ వీరి కృషి వలన గోడకు వేలాడే క్యాలెండర్ సాహితీమూర్తుల చిత్రాలతో కొత్తగా అలంకరించుకుంది. ఈ క్యాలెండర్ లో ప్రతి నెల పేజీ లో ఆ నెలలో జన్మించిన మరియు మరణించిన తెలుగు రచయితల చిత్రాలు జనన మరణ తారీకుల్లో అందంగా ఆకర్షణీయంగా ముద్రించబడ్డాయి. తేదీలకు ఒకవైపు మహోదయం పేరిట ఆ నెలలో పుట్టినవారిని, మరోవైపు మహాస్తమయమని చనిపోయినవారివి ఉన్నాయి. ఇలా ఈ క్యాలెండర్ లో 160 మంది రచయతల్ని పరిచయం చేస్తూ సాహితీ కాలమానం క్యాలెండర్ రూపుదిద్దుకుంది. దీని మూలంగా నేటి తరానికి మన రచయతులెవరో తెలిసే అవకాశం ఉంది. ఈ క్యాలెండర్ మన విద్యాలయాల్లో గ్రంధాలయాల్లో, వసతి గృహాల్లోనే కాదు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఇలా ఉండటం వలన ఏదొక సందర్భంలో మన రచయితల గురించి వారి రచనల గురించి చర్చకు వస్తుంది. తద్వారా సాహిత్యం ప్రాధాన్యత పెరిగి మాతృ బాష యొక్క విలువ ఏంటో నేటి టెంగ్లీష్ యువజనానికి తెలుస్తుంది.   *ఉపరాష్ట్రపతి ప్రశంసలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు కానీ ప్రస్తుతము దేశభాషలందు తెలుగు లెస్సు అనేలా ఉంది పరిస్థితి అని ఒక సందర్భంలో బాధపడ్డారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అయితే శ్రీనివాస్ భార్య యశోద కుమారులు షణ్ముఖ త్రయం చేస్తున్న సాహిత్య కృషి,బాషాభివృద్ది గురించి తెలుసుకొని సంతోషించి అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపారు ఉపరాష్ట్రపతి. *ఆదర్శనీయం ఇష్టమైన పనిని చేసుకు వెళ్తుంటే ఆ ప్రయాణంలో దొరికే ఆ సంతృప్తి వేరు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగే వారి విజయాలు ఎంత కష్టాన్నైనా కరిగిస్తాయి. తెలుగు సాహితీ సేవలో కొత్త కోణాన్ని ఎంచుకున్న ఈ ఉపాధ్యాయ కుటుంబం అందరికీ ఆదర్శనీయం. ముఖ్యంగా కుమారుడు షణ్ముఖ కృషి అనిర్వచనీయం. వీరు సేకరించిన సమాచారం తెలుగు జాతికి, భాషకు ఎంతో విలువైనది. ఏదొక రూపంలో అది ప్రతి ఇంటికీ చేరాల్సిన అవసరముంది. ముగ్గురు వ్యక్తుల స్తోమతకు, శ్రమకు మించిన కార్యక్రమం ఇది. ఈ మహా సంకల్పం నిర్వఘ్నంగా సాగాలంటే బాషాప్రేమికులు,సాహితీ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు కలిసి తోడు నిలవాల్సిన సమయం ఇది. ఇప్పటికే కొంతమంది ముందుకొచ్చి బాధ్యతగా తాము చదువుకున్న లేదా సొంతూరు పాటశాల కు ఈ క్యాలెండర్స్ ని బహుకరిస్తున్నారు. తెలుగు సాహితీ కాలచక్రం క్యాలెండర్ కావాలని తలిచినవారు 9492087089 కి కాల్ చేసి షణ్ముఖను సంప్రదించండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఒక్కో నీటిబొట్టు వందేళ్ల జీవితం

రెండు ఇళ్ళు పక్కపక్కనే. ఒకటి పెద్ద మేడ, మరొకటి రెండు గదుల చిన్న ఇల్లు. ప్రతిరోజు రెండు ఇళ్లలో నీటి వాడకం మాములే, కానీ వాడే విధానం, వాడుతున్న పరిమాణం పోలిస్తే ఎంతో తేడా!! నీటిని కొంటున్నామనో, కరెంట్ బిల్ కడుతున్నామనో కారణాలు మరెన్నో కావచ్చు కానీ వ్యర్థం చేస్తున్న నీటిని తిరిగి ఉత్పత్తి చేయగలమా?? నీరు ప్రాణాధారమైనది. అన్ని జీవరాశులకు ఎంతో ముఖ్యమైనది. మనిషి జీవితంలో ప్రతి సందర్భంలో నీటి అవసరం ఎంతో ఉంటుంది. తినేటప్పుడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఇంటి పనుల కోసం ఇలాంటి వాటి నుండి, అందరికి అవసరమైన ఆహార ధాన్యాలు, పంటలు పండించడానికి, పెద్ద పెద్ద భవంతులు, నిర్మాణాలకు కూడా నీరు ఎంతో అవసరం. ఒకప్పుడు………. కొన్ని సంవత్సరాల కిందట గ్రామాలు, బావులు, చెరువులు ఇవన్నీ నీటితో, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక, నీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నవారు కిలో మీటర్ల కొద్దీ కాలి నడకన వెళ్లి బావులలో నీటిని తెచ్చుకునేవారు. వాటినే తాగడానికి నిత్యావసరాలకు కూడా ఉపయోగించుకునేవారు. బహుశా ఆ కాలంలో నీటిని తెచ్చుకోడానికి పడే ఇబ్బందుల పరిష్కారం వైపు ఆలోచన మరియు అభివృద్ధి వెంట పరుగులు పెట్టిన మేధస్సు అన్ని కలసి ఈరోజును సమస్యగా నిలిపిందేమో అనిపిస్తుంది. ఎందుకలా??..... పట్టణీకరణ పెరిగినకొద్ది ప్రకృతి తగ్గిపోతూ వస్తోంది అన్నమాట నిజం. ప్రతి ఇంట్లో ఎక్కడిక్కడ వాటర్ సప్లై, కష్టపడక్కర్లేకుండా కుళాయి తిప్పితే దూసుకువచ్చే జలధార. పది నిమిషాలు మోటార్ వేస్తే నీటి ట్యాంకులు నిండిపోతాయి. కిచెన్ లో కుళాయి ఆన్ లో పెట్టి అంట్లు తోముతూ ఉంటే ఎన్ని నీళ్లు డ్రైనేజీ పైపులలోకి వెళ్లిపోతున్నాయో!! బట్టలు ఉతికడానికి ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్. దానికి ఎన్ని నీళ్లు ఖర్చవుతున్నాయో!! పెద్ద పెద్ద ఇళ్ళు, పని మనుషులు, ప్రతి రోజు ఇల్లంతా తుడవడాలు, షవర్ స్నానాలు, నిత్య జీవితంలో మన శ్రమను తగ్గించే ఇలాంటివి ఎంత నీటిని వృధా చేస్తున్నాయో!! వేసవి వస్తే నీటి ఎద్దడి అనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో!! కాలంతో, ఋతువుతో సంబంధం లేకుండా నీటి కొరతతో కటకటలాడుతున్న ప్రాంతాలు ఎన్నో!! కానీ కొన్ని ఇళ్లకు ఎద్ద కష్టం అనిపించకుండా నీటి వసతి బాగానే ఉంటుంది. అలాంటి వారు మాకేం సమస్య లేదు అనుకుంటారు. కానీ ఆలోచించట్లేదు సుమా!! రేపటి తరానికి నీటి చుక్కను ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తెస్తున్నారేమో అనిపిస్తుంది. ఏం చేయాలిప్పుడు?? చిన్న పిల్లల దగ్గరకు వెళ్లి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఠక్కున వచ్చే సమాధానం. కుళాయి లో నుండి అని, అబ్బే అది కూడా కాదు లెండి టాప్ ఆన్ చేస్తే వస్తాయి అంటారు. అంటే వాళ్లకు నీళ్లు టాప్ లో వస్తాయని తెలుసు కానీ భూగర్భ జలాల గూర్చి తెలియదు. వర్షాలు పడినా నీటి కొరత ఏమిటో అర్థం కాదు. భూమిని మొత్తం సిమెంటు తో కప్పేసి, వర్షాన్ని భూమిలో ఇంకకుండా చేసి భూగర్భ జలాలు తగ్గిపోవడానికి కారకులం అవుతున్నాం. కానీ ఆ విషయాన్ని ససేమిరా ఒప్పుకొము. ఎందుకంటే మనుషులం మరి.  పుస్తకాలలో పాఠ్యాంశాలు, వాటి విశ్లేషణ కేవలం తరగతి గదులకు, నోటు పుస్తకాల్లో పేజీలకు పరిమితం అయిపోతుంటే పిల్లలకు ఎలా అర్థమవుతుంది మరి. బిజీ బిజీ బతుకుల్లో అవన్నీ చెప్పడం ఎలా కుదురుతుంది అనుకునేవాళ్ళు కొందరైతే, డబ్బు పోస్తున్నాం కాబట్టే వాడుకుంటున్నాం అని సమర్థించుకునేవాళ్ళు కూడా కొందరు.  జనాభా పెరిగేకొద్దీ ఆవాస ప్రాంతాల విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తోంది. ఎన్నెన్నో వ్యవసాయ భూములు మేడలుగా మారిపోతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. మనిషి శరీరంలో 60 నుండి 70% నీరు ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. నీటి శాతం తగ్గిందంటే ఎన్నో అనారోగ్యాలు మొదలవుతాయి, ప్రాణానికి ప్రమాదం కూడా. మరి భూమి విషయంలో ఎవరైనా ఆలోచించారా?? కనీసం ఎప్పుడైనా ఈ విషయం బుర్రలో మెదిలిందా?? అయినా కూడా ఈ భూమి మనల్ని మోస్తూనే ఉంది. తన శక్తి మేర పంటల్ని ఇస్తూనే ఉంది. కానీ మనం ఏమి చేస్తున్నాం?? భూమి సారం అవుతుందని, పంటలు బాగా పండుతాయని రసాయనాలు చల్లుతున్నాం. దానివల్ల ఇంకా చిక్కి శీల్యమయ్యి చివరకు బీడు భూమిగా మారిపోతోంది. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరగాలో అన్ని రకాలుగా జరిగిపోతోంది. అందరి సహకారం ఇప్పుడే అవసరం. ఇది నిజం సుమా!! నీరు, భూమి పరస్పర సంబంధం కలిగివున్న వనరులు.  ◆ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవలసిన అవసరం కొందరిది. ◆అడవులను నరికి వర్షపాత సాంద్రత తగ్గడానికి కారణం కాకుండా ఉండాల్సిన బాధ్యత మరి కొందరిది ◆వీలున్న ప్రతి  వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందేందుకు కృషి చేయవలసిన బాధ్యత కొందరిది. ◆చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత, మన దగ్గర ఉన్న నీటిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తించడం అందరి సమిష్టి బాధ్యత. అందుకే నీటి బొట్టు కోసం కాస్త ఆలోచన చేయండి. ఆలోచనతో ఆగిపోక ఆచరణలో ముందుకెళ్లండి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి

నాలుగు రోడ్ల కూడలి. సాయంత్రం ఐదు ఆరు అవుతుంది. పనులు ముగించుకొని అందరూ ఇంటికెళ్లే సమయం. కానీ ట్రాఫిక్ జామ్. నగరాల్లో ప్రతిరోజు కనిపించే చిత్రం ఇది. ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు. ట్రాఫిక్ పోలీస్ లేడు. బహుషా ఉన్నా గానీ అత్యవసరం అయ్యి ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చు. ఆ కీకరబాకర వలయంలో ఎవరి గోల వారిది. ఎవరూ పట్టించుకోకుంటే ఎంత సేపు అయినా అదే పరిస్థితిలా అనిపించింది. చిన్న సందు దొరికినా దూరిపోయే చాకచక్యం అందరికీ ఉంది కానీ సమస్య పరిస్కారం గురించి ఎవరూ ఆలోచించరు. నేను కూడా ఆ గుంపులో ఒకన్ని కానీ బండి దిగి మనమే కాసేపు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తే సమస్య తీరిపోతుందేమో అనే ఆలోచన వచ్చినా గానీ ఎదో సంకోచం వెనక్కు లాగుతుంది. నాకే కాదు అక్కడ ఉన్న తకిమా యువకులు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ కొంతమంది బిడియంతో ఆగి ఉంటారు. మరి కొంతమంది హా మనకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటారు . ఉన్నట్లుండి ఆ ట్రాఫిక్ వలయంలోకి అంబులెన్స్ వచ్చింది. ఎవరికి వాళ్లు గాబరా పడిపోతున్నారు. ముందు అంబులెన్స్ కి దారి ఇద్దాము అని. అప్పటికే ఒకరి వెనుకాల ఒకరు వాహనాలను ఇరికిచ్చేయడంతో ఎటూ కదలలేని పరిస్థితి. అప్పుడే నా వెనుకనుంచి ఒక పెద్దావిడ బండి దిగి సర్కిల్ సెంటర్ లో నిల్చొని వాహనాలను వరుస క్రమంలో పంపిస్తుంది. ముందు అంబులెన్స్ ఉన్న లైన్ ని పంపారు. ఆమెను చూసి ఇంకో ఇద్దరు తోడుగా వెళ్లారు. ట్రాఫిక్ అయిదు నిమిషాల్లో క్లియర్ అయింది. నిజానికి ఆ సమయంలో స్పందించాల్సింది అక్కడ ఉన్న యువత. సమాజంలో ఎవరూ మనకి ఫలానా మంచి పని చేయమని ఉద్భోధించరు సందర్భానుసారం సొంత నిర్ణయం తీసుకొని ముందుకు కదలాలి.  ఇలాంటి సమయాల్లో చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అంటే కర్ర పెత్తనం కాదు. భాధ్యతను నిర్వర్తించడం.ఆ సమయానికి ఆ పెద్దావిడ నాకు ఒక హీరో లా అనిపించారు. ఇక నుంచి ఇలాంటి సమస్య ఎక్కడ ఎదురైనా యువత స్పందిస్తే బాధ్యతాయుత సమాజాన్ని చూడగలం. ◆ వెంకటేష్ పువ్వాడ    

ఎలాంటి ధైర్యం కావాలి?

గాంధీజీకి, సుభాష్ చంద్రబోస్ కి చాలా ధైర్యం. బ్రిటిష్ వాళ్లను ఎదిరించి పోరాడి స్వాతంత్రం సిద్ధింపచేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి వెళ్లగొట్టారు.. మరి ధైర్యం అనేది మంచిదే కదా అనుకుంటున్నారా? కానీ ఒసామా బిన్ లాడెన్ హిట్లర్ లాంటి వాళ్లను గమనిస్తే, ఇలాంటి వాళ్లకు కూడా చాలా ధైర్యం ఉంది. కానీ వాళ్ల వల్ల దేశానికి అప్రతిష్ఠ వచ్చింది. ఎన్నో మారణహోమాలు చేశారు. ఎందరో కన్నీటికి కారణమయ్యారు. మరి అలాంటి ధైర్యం మంచిదా? అసలు ధైర్యం అంటే ఏంటి?? మీరు ఒక ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. ఆఫీస్ కి టైం అవుతుంది. దాంతో మీరు సిగ్నల్ క్రాస్ చేసి పోలీస్ ముందు నుండి వెళ్లిపోయారు. మీరు చాలా ధైర్యవంతులు. మీరు ఇంకొక సందర్భంలో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో కూడా రెడ్ లైట్ చూసి దాని అతిక్రమించ లేదు. ఆగి వెళ్లారు. దీనికి కూడా ధైర్యం ఉండాల్సిందే. ఏమంటారు? ఈ రెండు సందర్భాల్లో ఏ సమయంలో మీకు ధైర్యం ఎక్కువగా ఉంది? ఆలోచించి చెప్పండి .. ఎటువంటి ధైర్యం మీకు రాత్రిపూట మనశ్శాంతిగా నిద్రపోయే అవకాశాన్ని ఇస్తుంది? కచ్చితంగా మొదటిది అయితే కాదు.  మీరు ఒక సినిమాకి వెళ్లారు.. అందులో విలన్ కి కూడా ధైర్యం ఉంటుంది. హీరో కూడా చాలా ధైర్యవంతుడు. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు హీరోనా ?విలనా? ఖచ్చితంగా హీరోయే అందరికీ నచ్చుతాడు అవునా? ఒక్కోసారి మనం నో అని చెప్పడానికి కూడా సంకోచిస్తాము. ఈ మధ్యనే నేను నో చెప్పడం అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా మనకి బాగా పరిచయస్తులకి ,సన్నిహితులకు నో చెప్పడం చాలా కష్టం. వారిని నొప్పించకుండా నో అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నా స్నేహితుడు ఒకరు నాతోపాటు చదువుకుంటాను అని కంబైండ్ స్టడీస్ పేరుతో రోజంతా నాతో గడిపేవాడు. ఆ రోజులో చదువు కన్నా మా మధ్య వేరే సంభాషణలే ఎక్కువగా ఉండేవి. రోజంతా ఇలా గడిపేసాక, అయ్యో అని బాధపడడం తప్ప నేను చేసేది ఏమీ ఉండేది కాదు. అతనికి రావద్దు నన్ను ఒంటరిగా చదువుకోని అని చెప్పాలంటే ఎక్కడ ఫీల్ అవుతుందేమోనని నాలో తెలియని భయం. ఇలా కొన్ని రోజులు గడిచాక నేను అందుకోవలసిన టార్గెట్ అందుకోలేక పోయాను. సిలబస్ కంప్లీట్ అవలేదు. అలాంటప్పుడు ఓ రోజు ధైర్యం చేసి అతనికి రావద్దని మెల్లగా చెప్పాను. అదేంటో అతను కూడా "నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం కలుస్తుంటే మాటలు ఎక్కువగా దొర్లుతున్నాయి. నేను రాను అని చెప్తే నువ్వు బాధపడతావ్ ఏమోనని చెప్పలేకపోయాను. మనం ఒంటరిగానే చదువుకుందాం. ఆదివారం పూట మనం వారమంతా ఏం చదివామో చర్చించుకుందాం" అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. నేను కొద్దిగా ధైర్యం చేసి ఈ విషయం ముందే అతనికి చెప్పి ఉంటే ఇన్ని రోజులు వృధా అయ్యేవి కాదేమో అనిపించింది. మీకు మొదటిసారి సిగరెట్ తాగాలన్నా లిక్కర్ తాగాలన్న ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యమే మీ పతనానికి దారి తీస్తుంది అయితే మీ జీవితాన్ని నిర్మిస్తున్నదో అటువంటి ధైర్యం నీలో పెంపొందించుకోవాలి. కాలేజీ కుర్రాళ్ళ ని చూస్తూ ఉంటాను. అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటారు. బైక్ మీద విన్యాసాలు చేస్తారు పెద్దవాళ్ళను ప్రొఫెసర్లను ఎగతాళి చేస్తారు. వీటన్నిటికి కూడా ధైర్యం కావాలి. కానీ బాధ్యతాయుతమైన ధైర్యం మాత్రం వీళ్లలో మచ్చుకైనా కనిపించదు. ఇటువంటి సాహసపరులలో ఎంతమంది ఇది దేశ రక్షణలో భాగస్వాములై ఒక సైనికుడిలా సన్మార్గంలో నడుస్తారో వేళ్ళతో లెక్కించవచ్చు. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం కాదు. భయంతో పాటు పయనించడం. మీరు కొత్తగా ఆఫీస్ లో చేరారు కొద్దిగా భయం ఉంటుంది అయినా భయాన్ని చిరునవ్వుల దాచేస్తూ మీ కొలీగ్స్ తో సత్ సంబంధాలు ఏర్పరుచుకుని హాయిగా జీవితాన్ని నిర్మించుకుంటున్నారు అంటే మీరు కూడా ధైర్యవంతులే. గొప్ప గొప్ప సాహసాలు చేస్తేనే సాహసవంతులు గారు. మిమ్మల్ని ఎవరూ చూడకపోయినా మీరు మీలా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే మీరు ధైర్యవంతులు. బాధ్యతాయుతమైన ధైర్యంతో , మీ సాటి వారికి మార్గదర్శనం ఇస్తారో, లేదా బాధ్యత లేని ధైర్యంతో ఒక వార్నింగ్ లాగా మిగులుతారో మీరే నిర్ణయించుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ  

Lesser known facts about Independence

People often won’t recognise the value of freedom unless they lose it! So Independence day is not just a celebration, but also stands as a reminder of the struggle we have mad t achieve it. On such occasion let’s gather some lesser known facts regarding our days of Independence... First Independence Day - 1930 Since the 18th century, many movements and agitations were run to achieve freedom from the British rule. Most of us are even aware of the Sepoy Mutiny that took place in 1857. But the call for complete sovereignty was on rise by 1920’s. The congress had to join the call and demand for `Purna Swaraj’ in 1929 at a session in Lahore. It even had announced that from there on, January 26th would be celebrated as an Independence Day. Till 1947, January 26th was indeed observed as Independence Day to invoke pride among the Indians.   Why was August 15 chosen? England was fed up with the rebellions in India and exhausted from the Second World War. It has no other way than to grant Independence for India. So it has sent Lord Mountbatten to wrap up the issue. Though everything was resolved by the July of 1947, Mountbatten has chosen to wait till August 15. The reason! It was the second anniversary of Japan's surrender to Allied Forces in World War II. (Britain was a part of those Allied Forces)   565 states! There were around 565 princely states in India at the time of Independence. They were ruled by various rulers. Each ruler acted as if his kingdom is unique and independent from the neighbouring territories. Bringing all such Princely states under the control of Indian Government was a Hercules task. The first Deputy Prime Minister of India- Sardar Vallaabhai Patel achieved such task. Through pampering and threatening... Patel saw that states were dissolved into one single nation. That is the reason why his birthday is being celebrated as Ekta Diwas!   Operation Polo It was a code name given to the military operation on Hyderabad! As the princely states began to join the Indian nation one by one... a few states dreamt of being independent forever. Hyderabad was one such state. Osman Ali Khan, the Nizam of Hyderabad by that time has not only resisted joining the nation but also started a private militia named Razakars. After the failure of diplomatic process, Indian government has led its military over Hyderabad on 13th September 1948. After five days of military action, Nizam had to accept his defeat and join the nation and that was 18th September. Controversy of National Anthem Everyone is aware of `Jana Gana Mana’ to be our national anthem. It was written a long ago in 1911 and was sung at the Congress session of Calcutta on 27th December 1911. Many critics began to blame that the words "Bharat Bhagya vidhata" and "Adhinayaka Jayahe" were used to praise the then visiting ruler of England - Geroge V. But Tagore has categorically denied this again and again. He once said- `That Lord of Destiny, that Reader of the Collective Mind of India, that Perennial Guide, could never be George V, George VI, or any other George’. On 24th January 1950, Jana Gana Mana was adopted as the National Anthem by the Constituent Assembly.     - Nirjara.

డబ్బే కాదు... సమయం కూడా కావాలి!

ఈ రోజుల్లో చాలామందిది ఒకటే బాధ! ఖర్చుపెట్టుకోవడానికి కావల్సినంత డబ్బు ఉంది. కానీ గడపడానికి సమయమే ఉండటం లేదు. ఈ మాటలు వింటున్న కొందరు పరిశోధకులకి ఓ అనుమానం వచ్చింది. మనిషి దేనివల్ల సంతోషంగా ఉంటాడు? డబ్బు వల్లా! కాలం వల్లా! ఈ విషయాన్ని తేల్చుకునేందుకు వారు ఒక ఆరు పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా 4,600 మంది అభ్యర్థుల ఆలోచనా తీరుని గమనించారు.   లక్షలకొద్దీ జీతంతో ఎక్కువసేపు ఉద్యోగం చేయడం కంటే, కాస్త తక్కువ జీతంతో తక్కువ పనిగంటలు చేస్తేనే సుఖంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. కుర్రవాళ్లు కాస్త అటూఇటూగా మొగ్గుచూపారు కానీ, వయసు మీరుతూ జీవితం తెలిసొస్తున్న కొద్దీ.... డబ్బుకంటే సమయమే ముఖ్యం అనేవారి సంఖ్యే ఎక్కువగా ఉందట. అంతేకాదు! ఇంటిపని, పెరడు పని చేసేందుకు పనివాళ్లని పెట్టుకున్నప్పుడు కూడా ఇదే తరహా సంతోషం కనిపించింది. ఆ సంతోషం తన పని వేరొకరు చేయడం వల్ల కాదు, జీవితాన్ని ఆస్వాదించే సమయం దక్కినందువల్లే అని తేల్చారు!   పైన చెప్పుకొన్న పరిశోధన జరిగి ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలకి మరో సందేహం వచ్చింది. మన డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఎంతో కొంత తృప్తి ఉంటుంది. అదే సమయాన్ని కొనుక్కుంటే! అదేనండీ... ఆ డబ్బుతో మన పనిభారం తగ్గించుకుంటే మరింత తృప్తి ఉంటుందా! అన్న ఆలోచన వచ్చింది. వెంటనే కొంతమందికి తలా 40 డాలర్లు ఇచ్చి చూశారు. ఈ డబ్బుని మీకు తోచిన రీతిలో ఏదన్నా కొనుక్కోమని చెప్పారు. సహజంగానే చాలామంది తమకి ఇష్టమైన వస్తువులని కొనేసుకున్నారు. అతికొద్ది మంది మాత్రమే... తమకి కాలం కలిసొచ్చేలా వేరొకరి సేవల కోసం ఈ డబ్బుని వినియోగించుకున్నారు. వస్తువులని కొన్నవారితో పోలిస్తే సమయాన్ని కొనుక్కున్నవారే ఎక్కువ తృప్తి పడినట్లు తేలింది.   ఈ పరిశోధనలతో రెండు విషయాలు స్పష్టం అయిపోతున్నాయి. ఒకటి- జీవితంలో డబ్బు ఎంత అవసరమో, సమయం అంతే అవసరం. ఈ రెండింటి మధ్యా సమన్వయం లేకపోతే మనసుకి లోటు తోచడం ఖాయం. రెండు- ప్రతి పైసా కూడపెట్టాలన్న తపనకి పోకుండా, అవసరం అయినప్పుడు సేవల కోసం కూడా కాస్త డబ్బుని ఉపయోగించుకోవడం మంచిది. అలా కలిసొచ్చే కాలం మనం వదులుకునే డబ్బుకంటే విలువైనది! - నిర్జర.  

సాంబార్ ఇడ్లీ సూత్రంతో సమస్యల పరిష్కారం

కొన్ని సందర్భాల్లో ఒకే సమస్య పదే పదే ఎదురవుతుంది. యాంత్రికమైన జీవితంలో ఆ సమస్యను విశ్లేషించుకొని సరిదిద్దుకునే ఓపిక ఎవరికీ లేదు. అసలు అంత దూరం ఆలోచించే విచక్షణ ఎంతమందికి ఉంటుంది. ముఖ్యంగా యువకులు కొన్ని ఒత్తిడులకు లోనవుతుంటారు. సమస్య పరిస్కారానికి కొన్ని అంశాలను చెప్తాను. 1 మూలం  2  సమస్య పునరావృత్తం 3 నివారణ ఏదైనా సమస్యను విశ్లేషించుకున్నప్పుడు పై మూడింటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని చమత్కారంగా సాంబార్ ఇడ్లి అనే సూత్రంతో వివరించడానికి ప్రయత్నిస్తాను. ◆సాంబార్ ఇడ్లి సూత్రం మనం ఒక హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ సర్వర్ తో మనకి పదే పదే గొడవ అవుతుంది. కారణం ఏంటంటే మనం ఆర్డర్ చేసిన సాంబార్ ఇడ్లి లో సాంబార్ చల్లగా ఉండటంతో ఆ సర్వర్ పై కొపగించుకుంటాము. హోటల్ లో కస్టమర్లు నిండుగా ఉంటారు. అతని పనిలో అతను ఉంటాడు. తిరిగి సర్వర్ ని పిలిచి సాంబార్ తీసుకు రమ్మని చెప్పినప్పుడు అతను మళ్లీ చల్లగా ఉండే సాంబార్ నే తీసుకొస్తాడు. మొదటిసారి జరిగిన పొరపాటే మళ్లీ జరుగుతుంది. తిరిగి ఆ సర్వర్ పై కేకలు వేస్తాము. సఖ్యత చెడి ప్రశాంతంగా తిని వెల్దాము అని వచ్చినవాడివి అనవసర ఆవేశానికి లోనై ప్రశాంత కోల్పోతాము. వాస్తవానికి అక్కడ ఉన్న రద్దీకి ఎన్ని సార్లు సాంబార్ తీసుకు రమ్మని చెప్పినాగానీ చల్లగా నే టేబుల్ పైకి వస్తుంది. ఇందులో సర్వర్ పై కోపడ్డం వలన లాభం లేదు. ఉదాహరణకు ఈ సమస్యనే విశ్లేషించుకుంటే సమస్య మూలం ఇక్కడ సాంబార్. దానివలనే ముందుగా మనం అసహనానికి లోనయ్యాము. తిరిగి అదే సాంబార్ వలన కోప్పడ్డాము. అంటే సమస్య పునరావృత్తం అయింది. ఇది గ్రహించి అంతటితో సాంబార్ ని నిలిపేసి  నివారణ గురించి ఆలోచిస్తే సమస్య తీవ్ర రూపం కాకుండా ఉంటుంది. ఇక్కడ సమస్యకి మూలం సాంబార్, సమస్య పునరావృత్తం కారణం సాంబార్ అలాంటప్పుడు దాన్ని గ్రహించి దాని ప్లేస్ లో మరో ఆప్షన్ ని చూసుకొని ఆర్డర్ చేస్తే సమస్య సాల్వ్ అవుతుంది. తేలికగా తమాషాగా అర్ధమయ్యేలా వివరించడానికి ఈ సాంబార్ ఇడ్లి సూత్రం చెప్పాను అంతే! ముగింపు చిన్న చిన్న సమస్యలకు ఎక్కువ స్పందించి మానసిక అనారోగ్యం తెచ్చుకుంటారు. అలాంటివారు కాస్త వివేకంతో ఆలోచిస్తే సమస్య నివారణ బోధపడుతుంది. యువత ఈ సాంబార్ ఇడ్లి సూత్రం ఫాలో అయితే చాలు. ◆ వెంకటేష్ పువ్వాడ  

కరోనాతో కొత్త లైఫ్ స్టైల్!

మనిషి జీవన గమనాన్నే మార్చేసిన కరోనా వైరస్ ఎప్పుడు, ఎక్కడ,ఎలా పుట్టిందో లేక ఏ ఆధిపత్య విషపు కోరల్లోంచి ఊడిపడిందో కాలమే సమాదానం చెప్తుంది.దాని గురించి మనం ఆలోచించడం కాలం వృదా పనే అవుతుంది. అయితే ఈ మహమ్మారి మనకేం నేర్పించిది. దానినుంచి మనమేమి తెలుసుకోబోతున్నాము అనేదానిమీద మన భవిష్యత్ ఆదునిక జీవన విదానం ఆదారపడబోతుంది. ఆలోచిస్తే మన గత జీవనం, వర్తమాన వైభవం ఒకే స్ట్రైట్ లైన్ లా బాగానే వుంది. కానీ కరోనా గీసిన అడ్డగీతతో వెర్రితలలేస్తున్న మనిషి స్వార్దానికి బ్రేకులుపడ్డాయనేది కాదనలేని వాస్తవం. ఈ స్థితిలో ప్రపంచ జీవన విదానంలో వచ్చే పెను మార్పేమిటి, అందులో బాగంగా మన దేశ జీవన గమనం ఎలా వుండబోతుందనేది ఆశక్తి కలిగించే అంశం . ఇన్ని రోజులూ మన విద్య, వైద్యం, వ్యాపారం, మార్కెటింగ్, సభలూ,సమావేశాలు, వినోదాలూ, వేడుకలూ ఇలా అన్నీ ప్రపంచీకరన నీడలో గ్లోబల్ స్టాండర్డ్స్ లో వుండాలని ఆలోచించాము. అది ఇకనుంచి కొరోనా స్టాండర్డ్స్ లోకి మారబోతుందనేది పచ్చి నిజం. ఒకరకంగా ఇది మనకు మంచి విషయమనే చెప్పాలి.ఎందుకంటే మిడి మిడి జ్ఞానంతో విరుద్ద వాంచలతో ప్రకృతితో మిళితమైన జీవన విదానానికీ, జీవ వైద్యానికీ దూరమైన మనం ఈ కొరొనా తెచ్చిన కొత్త రూల్స్ తో మల్లీ క్రమశిక్షణ కలిగిన కొత్త జీవనానికి స్వాగతం పలకబోతున్నాము. ◆జనగణమన శుభ్రతే మన దేశ సౌభాగ్యం : 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో అందునా ఒక చదరపు కిలోమీటర్ కి వేలల్లో జన నివాసముండే మన మెట్రో నగరాల్లో భౌతిక దూరం సాద్యమేనా? అంటే సాద్యమైంది. మన ఉరుకులు పరుగుల జీవనంలో పెద్దగా ప్రాదాన్యమివ్వని వ్యక్తిగత శుభ్రతకి మన ప్రజలు పెద్ద పీట వేస్తున్నారు. కారణం ప్రాణం పై తీపి ఒక్కటే కాదు మనతో పాటు మన చుట్టూ వుండే వాళ్ళకీ మన వలన ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఆరోగ్యకరమైన సామాజిక స్పృహ కలగడం కూడా ఒక కారణం. ఇది మంచి శుభపరిణామం అనే చెప్పాలి. చేతులను ఒకటికి పది సార్లు శుబ్రం చేసుకోవడం, మాస్కులు దరించడం, తుమ్మినప్పుడు మన తుంపర్లు ఎదుటవారిపై పడకుండా మోచేతిని అడ్డుపెట్టుకోవడం, తరుచూ వేడినీల్లని తీసుకోవడం లాంటి జాగ్రత్తలు కొరొనా కి ముందు మన దేశంలో ఎంతమంది పాటిస్తున్నారు. అసలు ఎంతమందికి తెలుసు అంటే మనదగ్గర సమాదానం లేదు. అయితే ప్రస్తుతం ఈ జాగ్రత్తల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. మన దేశంలో కుప్పలు తెప్పలుగా జన సమీకరణాలతో జరిగే పెళ్లిళ్లు, విందులు, వినోదాలు, సమావేశాలకు కరోనా షరతులతో కూడిన కొత్త నియమావళి అమల్లోకి రావాలని ఆశిద్దాం. దీని ప్రకారం చాలా పరిమిత సంఖ్యలో జనాలు ఆయా వేడుకలకు హాజరు కావాల్సి వుంటుంది. ఇది ఒకరకంగా మంచి విషయంగానే చెప్పాలి ఎందుకంటే అనవసరపు ఆర్భాటాలకి పోయి దుబారాగా చేసే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అలా ఈ మహమ్మారి వచ్చి, మర్చిపోయిన మన ప్రాదమిక ఆరోగ్య నీయమాలని గుర్తుచేయడమే కాకుండా ఖచ్చితంగా ఆచరించేలా చేసింది. ఏది ఏమైనా ఈ మార్పుని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్ లో ఆరోగ్యమైన సమాజంతో పాటు వైవిద్యమైన జీవన విదానం మనముందు సాక్షాత్కరిస్తుంది. ◆అగ్రతాంబూలం కాబోతున్న ప్రజా ఆరోగ్యం : తమ స్థూల జాతియోత్పత్తిలో 5 శాతం ప్రజా ఆరోగ్యానికి ఖర్చు పెట్టే అగ్ర దేశాలే ఈ కొరోనా బారిన పడి అతలాకుతలం అవుతున్నది మనం చూస్తున్నాం. కానీ మన దేశం ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు కేవలం 1 శాతం. ఇదంతా గతం. కానీ కొరొనా వలన కలిగిన అనుభవంతో భవిష్యత్ లో ఖచ్చితంగా ఎక్కువ కేటాయింపులు వుంటాయని అందరూ బావిస్తున్నారు. అలా కాకుంటే మాత్రం మల్లీ ఇలాంటి మహమ్మారి పుడితే మనం కూడా ఎవర్ని బ్రతికించుకోవాలి,ఎవర్ని చంపుకోవాలి అంటూ వయసుని బేరీజు వేసుకొని వైద్యం అందించే పరిస్థితి వచ్చే ప్రమాదం వుంది. అంతే కాదు గ్రామాలల్లో ఉణికి లేకుండా వున్న ప్రభుత్వ వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికీ ఆరోగ్య భద్రత , భరోశా ఇవ్వాల్సిన అవసరముంది. వీలైతే ఇంటింటికీ సాద్యమైతే ప్రతి మనిషికీ హెల్త్ ప్రొఫైల్ వుండేలా చర్యలు తీసుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్య భారతావనిని మనం చూడగలం.  ◆కొరోనా స్టాండర్డ్స్ లోకి మారనున్న మన విద్యా విదానం: కొరోనా కండీషన్స్ లో ముఖ్యమైన తప్పక పాటించాల్సిన నియమం భౌతిక దూరం. కానీ అలా విద్యార్దులని దూర దూరంగా వుంచి తరగతులు నిర్వహించే శక్తి నిజంగా మన విద్యా వ్యవస్థకి వుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితిని అదిగమించడానికి ఆన్ లైన్ క్లాస్ లు కొంత దోహద పడుతున్నాయి . అయితే పూర్తిగా మౌఖిక విద్యాబోధనకి అలవాటైన మన వ్యవస్థలో ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే 75 శాతం మౌఖికంగాను మరో 25 శాతం ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని యూజీసీ కొన్ని సూచనలు కూడా చేసింది. ఇదిలా ఉంటే గాలి కూడా ఆడని గదుల్లో విద్యార్థులను గుంపులు గుంపులుగా పోగేసి క్లాసులు చెప్పే కోచింగ్ సెంటర్ల స్వరూపం రానున్న రోజుల్లో మారనుంది. కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిన పరిస్థితుల్లో దానికి అనుగుణంగా తరగతి గదుల్ని పెంచుకోవాల్సి వస్తుంది. దీనితో ఆయా సంస్థలు కోర్సుల  ఫీజులు పెంచే ప్రమాదం లేకపోలేదు. ఇది మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక శిరోభారం అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా క్లాసులు పెంచి షిఫ్ట్ ల వారీగానైనా బోధన సాగించాల్సి ఉంటుంది. ఇంకో మార్గం 75 శాతం డిజిటల్ అండ్ ఆన్ లైన్ విద్యా విధానం, అయితే ఇది ఇప్పట్లో అమలు సాధ్యం కాదనేది కొంతమంది అభిప్రాయం. కారణం మన దేశంలో చాలా మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన ల్యాప్టాప్ లు, దానికి తగ్గ ఇంటర్ నెట్ సౌకర్యం కలిగినవాళ్ళు చాలా తక్కువమంది వున్నారు. భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే ఆ దిశగా సమస్య పరిస్కారానికి ఖచ్చితమైన కసరత్తు జరిగితేనే పూర్తి స్థాయి డిజిటల్ విద్యా విధానం అమలుకి సాధ్యం అవుతుంది. ◆కొరోనా తెచ్చిన ఆర్ధిక క్రమశిక్షణ: అయితే ఈ మహమ్మారి ప్రపంచానికి గొప్ప గుణపాటమే నేర్పిందని చెప్పాలి.  లాక్ డౌన్ వేల దిగువ మద్యతరగతి కుటుంబాల ఆర్ధిక స్థితిగతుల బలహీనతల్ని ప్రపంచానికి అద్దం పట్టి చూపించాయి. ఎవరూ ఊహించని,ఎప్పుడూ ఊహించని ఉపద్రవం ఇది. ఒక అంటు వ్యాధి కారణంగా ప్రపంచమంతా దేశాలకి దేశాలు కంచెలేసుకొని లాక్ డౌన్ లోకి వెళ్ళిపోతుంది అని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అసంఘటిత కార్మికులు పనులు కోల్పోయారని ఇంటర్ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెపుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్ధికంగా బాగా స్థిరపడినవాడు బాగానే వున్నాడు, అంతో ఇంతో చాలీ చాలని ఆదయాలతో బ్రతుకీడ్చే మధ్యతరగతి వాడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ఇక వలస కూలీల పరిస్థితి వర్ణనాతీతమనే చెప్పాలి. కాలంతో పాటు జీవన వ్యయం కూడా పెరగడంతో ఇన్నాళ్లూ వీళ్లంతా పొదుపు గురించి పెద్దగా పట్టించుకుంది లేదు. పది రూపాయలు ఆదాయం వస్తే సరిపోక కొంత అప్పు చేసి జీవనం సాగించే పేద ప్రజలు వున్నారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు పొదుపుపై దృష్టి పెట్టబోతున్నారు. ఈ విషయంలో ముఖ్యంగా వలస కూలీల విషయంలో ఈ రకమైన ఆర్ధిక క్రమశిక్షణ గురించి వారికి అవగాహన కల్పించి పొదుపుని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకొని కొంత ఆర్ధిక భరోసా కల్పించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఈ కరోనా తర్వాత ప్రతి కుటుంబంలో పరిణితి చెందిన ఆర్ధిక క్రమశిక్షణని చూడబోతున్నాం. ఇది మనిషి బలమైన ఆర్ధిక ప్రగతికి పునాదిగా మనం భావించాలి. ◆కొస మెరుపు : మంచో చెడో ఒక మహమ్మారి కారణంగా మన శక్తేమిటో, మన బలహీనతలేమిటో బేరీజు వేసుకొనే అవకాశం వచ్చిందనే మనమందరం భావించాలి. ఇక మీదట ఇలాంటి మహమ్మారి రాకపోదు అన్న గ్యారంటీ లేదు. అయితే కరోనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో విద్య, వైద్య ఆర్ధిక రంగాలలో బలపడాల్సిన అవసరముంది. ఆవిధంగా అడుగులు పడాల్సిన అవసరముంది. ఎంత సంక్షోభమైనా అందులోoచే అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లడం మనిషికి కొత్తేమీ కాదు, సోదాహరణ గా చూస్తే గత అనుభవాలే దీనికి నిదర్శనం. అంతిమంగా మనిషిదే విజయం. - వెంకటేష్ పువ్వాడ   

మనసే గ్రంధాలయం

ఒక పుస్తకం వందమంది స్నేహితులతో సమానం అంటారు. అలాంటి పుస్తకాలను అమితంగా ప్రేమించే వ్యక్తి వరంగల్ కి చెందిన కాసుల రవి కుమార్. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. రచన ప్రవృత్తి. చదువే మనిషిని వెలిగిస్తుంది. అయితే పుస్తకాలు అందుబాటులో లేక, సరైన మార్గ నిర్దేశం చేసేవారు లేక పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ డిజిటల్ రోజుల్లో చిల్డ్రన్స్ లీడ్ లైబ్రరీని స్థాపించి ఇంటినే గ్రంధాలయంగా చేసి గ్రామీణ విద్యార్థులకు పుస్తక పఠనం పై మక్కువ పెంచుతున్నారు. అదే ధ్యాసగా, శ్వాసగా నిరంతరం లైబ్రరీ కోసం పుస్తకాలు సేకరిస్తూ చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు వర్క్ షాప్ లు నిర్వహిస్తూ  లైబ్రరీని మరింత దగ్గర చేస్తున్నారు. ఇప్పటివరకూ 6000 పైగా పుస్తకాలను లైబ్రరీకి సేకరించారు. రవి కుమార్ నేపథ్యం నర్సంపేట టౌన్ లో రవికుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించారు.తండ్రి నరేంద్రా చారి ఆటో డ్రైవర్, తల్లి సరళాదేవి బీడీ కార్మికురాలు. అయితే ఆర్ధిక కష్టాలతో చదువుని మధ్యలో ఆగిపోయినా చదువుపై మక్కువతో కష్టపడి చదివి ఎంఏ ఇంగ్లీష్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత ఎడ్ సెట్ లో రెండో ర్యాంక్ సాధించారు. బీఈడీ పూర్తి చేసి  ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. గవర్నమెంట్ మోడల్ స్కూల్ జవహర్ నగర్ లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.     లీడ్ గమనం 2007 లో దీన్ని స్థాపించారు.లీడ్ అంటే  నాయకత్వం, చదువు, లక్ష్యసాధన, గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి దారి చూపే వేదిక. కేవలం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మాత్రమే కాదు, హైస్కూల్ నుంచి కళాశాల విద్యార్థుల వరకు 15 ఏళ్ళ నుండి ప్రతి వేసవిలో ఉచిత ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి కావాల్సిన మెటీరియల్ ఉచితంగా అందిస్తున్నారు. ఎవరైతే మారుమూల గ్రామాల్లోని పేద విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి తగిన విధంగా పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంలో లీడ్ ఎంతో కృషి చేస్తుంది. రవి కుమార్ కేవలం లైబ్రరీని మొదలు పెట్టి కూర్చోలేదు. దానిని విద్యార్థులకు, విజ్ఞులకు మరింత చేరువ చేయడం కోసం మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేసి ఇంటింటికీ గ్రంధాలయాన్ని నడిపిస్తున్న ఋషి అని చెప్పాలి. పుస్తకాన్ని ,సమాజాన్ని ఎంతో ప్రేమిస్తే గానీ  ఇది సాధ్యం కాదు.  రవి కుమార్ పుస్తక యజ్ఞంలో భాగం అవుదాము. మనం కూడా లైబ్రరీకి పుస్తకాలు సమకూర్చుదాము. వీలయితే ఇంకా నాణ్యమైన నిర్వహణకు మనవంతు సహాయం చేద్దాము. రవికుమార్ ఫోన్ నెంబర్ 9908311580 /7981068048 ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ చిన్న చిట్కాతో ఆరోగ్యం బాగుపడుతుంది!

  రోజుల్లో మన జీవితాలు ఎలా గడుస్తున్నాయో చెప్పనవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచీ, రాత్రి పడుకునే దాకా అంతా కూర్చునే బతుకుని వెళ్లదీస్తున్నాం (sedentary lifestyle). టీవీ ముందరా, కంప్యూటర్‌ ముందరా, డైనింగ్‌ టేబుల్‌ ముందరా కూర్చుని కూర్చుని ఒంట్లో కొవ్వుని పెంచేసుకుంటున్నాం. రేపటి నుంచి వాకింగ్ చేద్దాం, వచ్చేవారం షటిల్‌ ఆడతాం అనుకోవడమే కానీ... రోజువారీ హడావుడిలో పడి అలాంటి నిర్ణయాలు ఏవీ పాటించలేకపోతున్నాం. అయితే గుడ్డిలో మెల్లగా దీనికో పరిష్కారం ఉందంటున్నారు.   ఫిన్లాండుకి చెందిన కొందరు పరిశోధకులు... కూర్చునీ కూర్చునీ ఉండే జీవిత విధానంలో ఏదన్నా మార్పు తీసుకురావడం సాధ్యమా అని ఆలోచించారు. ఇందుకోసం ఓ 133 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరి జీవిత విధానాన్ని గమనించిన పరిశోధకులకు... వాళ్లంతా రోజుకి ఇదున్నర గంటలు ఆఫీసులోనూ, నాలుగు గంటలు ఇంట్లోనూ కూర్చునే గడిపేస్తున్నారని అర్థమైంది. ఇలా కూర్చుని ఉండే సమయంతో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందేమో చూడమని సదరు అభ్యర్థులందరికీ సూచించారు.   పరిశోధకుల సూచన మేరకు అభ్యర్థులంతా తమ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసే ప్రయత్నం చేశారు. పని మధ్యలో కాస్త లేచి అటూఇటూ పచార్లు చేయడం, ఇంట్లో చిన్నాచితకా పనులలో పాల్గొనడం, పిల్లలతో కాసేపు ఆడుకోవడం లాంటి ప్రయత్నాలు చేశారు. ఇలా నెలా రెండు నెలలు కాదు.. దాదాపు ఏడాది పాటు ఈ ప్రయత్నం సాగింది.   ఏడాది తర్వాత సదరు అభ్యర్థులు జీవితాలని మరోసారి గమనించారు పరిశోధకులు. ఆ సందర్భంగా వారు కూర్చుని ఉండే సమయం, ఓ 21 నిమిషాల పాటు తగ్గినట్లు గ్రహించారు. ఓస్‌ ఇంతే కదా! 20 నిమిషాల తగ్గుదలతో ఏమంత మార్పు వస్తుంది అనుకునేరు. ఈ కాస్త మార్పుతోనే షుగర్‌ లెవెల్స్ అదుపులోకి రావడం గమనించారు. కాలి కండరాలు కూడా మరింత బలంగా మారాయట. గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్లు బయటపడింది.   అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఓ పడీపడీ వ్యాయామాలే చేయనవసరం లేదు. ఎప్పుడో అప్పుడు వ్యాయామం చేయవచ్చు కదా అని నిర్లక్ష్యం చేసేలోగా పరిస్థితి అదుపు తప్పిపోతుంది కదా! అందుకని ఉన్నంతలోనే కాస్త కాలుని కదిపే ప్రయత్నం చేయమని ఈ పరిశోధన సూచిస్తోంది. అంతేకాదు! ఇంట్లో పెద్దలు కనుక ఇలా చురుకుగా ఉంటే... వారిని చూసి పిల్లలు కూడా కాస్త చురుకుగా మెదిలే ప్రయత్నం చేస్తారట. - నిర్జర.  

కాళ్లకు చెప్పులు లేకుండా ఫోర్డ్ కంపెనీకి వెళ్లిన కుర్రాడు

రాజస్థాన్,ఉదయపూర్ కి చెందిన "భవేష్ లోహార్" కి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు. అనే మాట సరిగ్గా సరిపోతుంది. "మనం నిద్రలో కనేది కాదు కల-మనకు నిద్రలేకుండా చేసేది కల" అని అబ్దుల్ కలాం చెప్తారు. భవేష్ జీవితం ఈ మాటలకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.  తన లక్ష్యం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని జయించాడు.సాధారణమైన గృహ నిర్మాణ పనులకు వెళ్లే కార్మికుడి యొక్క కొడుకు భవేష్. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబ నేపధ్యం. కానీ తన ఆర్ధిక పరిస్థితి కి కుంగిపోలేదు. కష్టపడి చదివాడు. గెలిచాడు. ఫోర్డ్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు. ఈ ప్రయాణంలో  వెన్నంటే ఉండి ప్రోత్సహించి స్నేహితులకు, తన కోసం ఎంతో త్యాగం చేసి కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్లిన తల్లికి, సోదరిమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవేష్ "లింక్డ్ ఇన్" అనే సామాజిక మాధ్యమంలో తన విజయనందాన్ని క్లుప్తంగా చెప్తూ పోస్ట్ చేసాడు. ఇది బాగా వైరల్ అవుతుంది.  భవేష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భోపాల్ లో ఇంజినీరింగ్ విద్యార్థి. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ కష్టపడి కొడుకుని చదివించారు. కరోనా మహమ్మారి కష్టకాలంలో హాస్టల్ మూసేయడంతో భవేష్ చేసేదేమీ లేక ఇంటికొచ్చాడు. ఒకే ఒక గది కలిగిన రూమ్. తనతో చేర్చి ఆరేడుగురు కలిసి ఆ ఇంట్లో ఉండాలి. అయితే అందులోనే తనకి ప్రత్యేకమైన గదిని తనకి అనుకూలంగా తయారు చేసుకొని పట్టుదలగా చదివాడు. ఆ చిన్న గదినుంచే ఆన్లైన్ ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నాడు. ఆ చిన్న గదినుంచే ఎన్నో ఆన్లైన్ పరీక్షలు రాసాడు. చివరకి తనకి ఎంతో ఇష్టమైన ఫోర్డ్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాడు. ◆భవేష్ ఏం చెప్పాడు.. చిన్నపుడ ఎండకు కాలిపోయే హైవే వెంట నడుచుకుంటూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేవాన్ని. దారి వెంట వెళ్లేటప్పుడు కనిపించే కార్లని చూసి స్నేహితులతో పెద్దయ్యాక గొప్ప ఉద్యోగం సాదించాక  పెద్ద కార్  తీసుకోవాలి అని, అలా కార్లమీద ప్రేమని పెంచుకొన్నాను. అప్పట్లో వార్తా పత్రికల్లో వచ్చే ఫోర్డ్ కంపెనీ కార్ల ప్రకటనలు ఎంతో ఆకర్షించేవి.ఆ రోజులు మర్చిపోను. ఎపుడూ గుర్తుపెట్టుకుంటాను. నా తల్లి ఏరోజు కోసం ఎదురు చూసిందో ఆరోజు వచ్చింది. ఈరోజు నేను ఫోర్డ్ మోటార్ కంపెనీ లో ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాను. నా ప్రయాణంలో అనుక్షణం వెన్నంటే ఉండి, తమ సొంత కలల్ని త్యాగం చేసి నేను ఈ స్థాయికి రావడానికి కారకులైన అక్కలకు నా కృతజ్ఞతలు. చిన్నపుడు ఏడు ఎనిమిది వేల జీతంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉన్న రోజుల్లో అమ్మ ఇళ్ల పనికి వెళ్లి కుటుంబానికి, నా కళాశాల చదువుకు ఆసరాగా నిలబడింది. పెద్దయ్యాక నేను ఉద్యోగంలో చేరితే నీకు పని చేసే అవసరం ఉండదు అని చెప్పిన మాటలు ఈరోజు నిజమయ్యాయి.  కళాశాల విద్య కోసం కొన్ని రోజులు పార్ట్ టైం ఉద్యోగం చేసాను. ఆ సమయాల్లో కళాశాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నా జీవితంలో ఈ పోరాటాలన్నీ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కష్టాలన్నీ నన్ను మరింత రాటు తేల్చాయి అనుకుంటున్నా. ఇంతకన్నా కఠినమైన జీవితాన్ని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉన్నారని నాకు తెలుసు. అయితే మన సంకల్పం గొప్పగా ఉండి నిజాయితీగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది సాదించగలం. గీతలో చెప్పినట్లు "కర్మ కియే జా ఫాల్ కి చింతా నా కర్” దేవుడు ముందుగానే  మనకోసం మంచి జీవిత ప్రణాళికలను అనుకుంటాడు. నా ప్రయాణంలో సహకరించి స్ఫూర్తిదాయకమైన మాటలతో నన్ను ముందుకు నడిపిన బబ్బర్ బయ్యాకి మరియు ఉద్యోగంలో చేరిన మొదటి రోజుని గుర్తుండిపోయేలా చేసిన శ్రీజన ఉపాధ్యాయ, యస్ రతి వైశాలి, ధనుంజయ్ సర్ కి నా కృతజ్ఞతలు. ఇలా "భవేష్ లోహార్" తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు.  ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆనందానికి మార్గాలివే!

జీవితమనే ప్రయాణాన్ని ఆనందంగా సాగించాలని ఎవరికి మాత్రం అనిపించదు. కానీ ఏం చేస్తాం. నిరంతరం బోలెడు సమస్యలు. నిత్యం బోలెడు స్పర్థలు. ఆరోగ్యంగానూ, ఆర్థికంగానూ అంతా సవ్యంగానే ఉన్నా మనసులో ఏదో తెలియని వేదన. అదిగో అలాంటివారి కోసమే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇవి పాటస్తే మీ మనసు ఆనందంతో వెల్లివిరియడం ఖాయమంటున్నారు. ఆనందాన్ని నటించండి- ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, మనసు ఏదో తెలియన బాధతో నిండిపోయినప్పుడు... ఆ బాధ స్థానంలో ఆనందాన్ని నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఆవేశం, ఆక్రోశంతో చిరాకుగా ఉన్న మనసుని సంతోషంతో నింపేందుకు ప్రయత్నిస్తే మనలోని ప్రతికూలమైన అనుభూతులు తగ్గిపోతాయన్నది చాలామందికి అనుభవమైన విషయమే! ప్రకృతికి దగ్గరగా ఉండండి- మనిషికీ, ప్రకృతికీ మధ్య ఓ అవినాభావ సంబంధం ఉంది. అది ఫలానా అని చెప్పలేం కానీ ప్రకృతికి సంబంధించిన ఏ లక్షణాన్ని చూసినా మనసు ఆనందంతో నిండిపోతుందన్నది విజ్ఞానశాస్త్రం కూడా ఒప్పుకున్న విషయం. కాసేపు నీలాకాశాన్ని చూసినా, వెన్నెలలో గడిపినా, ఎగిరే పక్షుల గుంపుని గమనించినా, చెట్లని తడిమి చూసినా... మనసులో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకోవడాన్ని గమనించగలం. వర్తమానంలో జీవించండి- మనిషికి ఉండే అదృష్టమూ, దురదృష్టమూ అతని మెదడే! అది ఎంతగా విశ్లేషించగలదో అంతగా విచారించగలదు కూడా! అలాంటి మెదడుని గతం తాలూకు బాధాతప్తమైన జ్ఞాపకాలలోనో, భవిష్యత్తులో ఏం జరగనుందో అన్న భయాలతోనో కాకుండా... వర్తమానంలో నిలిపి ఉంచగలిగితే చాలావరకు వేదన తగ్గుతుంది. మనం ఎంత కాదనుకున్నా గతం అనుభవాల రూపంలోనూ, భవిష్యత్తు ప్రణాళికల రూపంలో ఎలాగూ మనలో సుడులు తిరుగుతుంటాయి. అంతకుమించి వాటిని పట్టుకు వేళ్లాడితే మిగిలేది వేదనే! జీవితం పట్ల స్పష్టత- జీవితం పట్ల చాలామందికి తమదంటూ ఓ అభిప్రాయం ఉండదు. ఏదో గాలికి సాగిపోయే నావలాగా అలాంటి జీవితాలు గడిచిపోతుంటాయి. సమాజం దృష్టిలో గొప్పవారనిపించుకోవడమో, తమ అహంకారాన్ని చల్లార్చుకోవడమో... వారి ప్రాధాన్యతలుగా ఉంటాయి. అంతేకానీ తన ప్రత్యేకత ఏమిటి? ఏం సాధిస్తే తన జీవితపు చివరిక్షణంలో తృప్తిగా శ్వాసని విడువగలం? అన్న ఆలోచన ఉండదు. కానీ అలాంటి ప్రశ్నలు మొదలైన తరువాత జీవితంలోని ప్రతిక్షణమూ విలువైనదిగా కనిపిస్తుంది. అలాంటి జీవితాన్ని గడుపుతూ, తన లక్ష్యం వైపుగా ఒకో అడుగూ వేస్తున్నప్పుడు తృప్తితో కూడిన ఆనందం లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి- ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటను పదే పదే ఒప్పచెబుతూ ఉంటాము. కానీ పీకలమీదకు వచ్చేదాకా దాని గురించి పెద్దగా పట్టించుకోం. రొజూ కాసేపు వ్యాయామానికి కేటాయించడం కాలయాపన కాదు. అది మన జీవితకాలాన్ని పెంచుకుంటూ కాలయముడికి దూరంగా ఉండటమే! అనారోగ్యంగా ఉన్న శరీరంతో మనసు కూడా చిన్నబోతుంది. అందుకని వ్యాయామం, శరీర శ్రమ, పోషకాహారం పట్ల ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు. బంధాలను నిలుపుకోండి- మన దగ్గర డబ్బు ఉండవచ్చు. ఏదన్నా అవసరం వస్తే ఆ డబ్బుతో పని జరగవచ్చు. కానీ మనకోసం బాధపడే  ఓ నలుగురు మనుషులు లేనప్పుడు ఎంత డబ్బున్నా ఉపయోగం ఉండదు. డబ్బు లేకుండా ఈ లోకంలో పని జరగవచ్చు కానీ మనుషుల తోడు లేకుండా జరిగే పనిలో జీవం ఉండదు. టీవీ ముందు ఓ గంట గడిపేబదులు ఇంట్లోవారితే గడపితే ఉండే తృప్తి వేరు. పాతకాలపు మిత్రులని, బంధువులని అప్పుడప్పుడూ పరామర్శిస్తే మిగిలే అనుభూతి వేరు. ఆనందం ఫలానా లక్షణంలో ఉంది. ఫలానా పనిచేస్తే వస్తుంది అని ఐదారు కారణాలు చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఆనందం మన మనసులో ఉంది. మరి ఏం చేస్తే అది వెలికివస్తుందో తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందుకనే ఆనందానికి సంబంధించి ప్రతి ఒక్కరికీ తమదైన ఓ జాబితా ఉంటుంది. మరి మీ జాబితా ఏమిటో శోధించి చూసుకోండి.   - నిర్జర.