నోబుల్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా ??
posted on Dec 15, 2021 @ 9:30AM
ప్రపంచ దేశాలు అన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బహుమతులలో నోబుల్ బహుమతి ఒకటి. ఈ నోబుల్ బహుమతి ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబుల్ గౌరవార్థం ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తారు. ముఖ్యంగా శాంతి బహుమతి పురస్కారం తప్ప మిగిలిన అయిదు రంగాలు అంటే భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలో కృషి చేసిన వారికి డిసెంబర్ 10 వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి రోజు ప్రదసనం చేస్తారు.
ఈయన కుల, మత, లింగ, జాతి వివక్షలు లేకుండా వారు సూచించిన రంగాలలో కృషి చేసిన వారికి ప్రోత్సాహకంగానూ మరియు ప్రతిభను గుర్తించే కోణంలోనూ ఈ బహుమానాన్ని ప్రధానం చేయవలసిందిగా తన వీలునామలో ప్రస్తావిస్తూ తన 90 లక్షల డాలర్లను బహుమతి ప్రధానం కోసం ఉపయోగించవలసిందిగా కూడా పేర్కొన్నాడు. 1901 సంవత్సరంలో ప్రారంభమైన ఈ బహుమతుల ప్రధాన పరంపర సాగుతూనే ఉంది.
వంద సంవత్సరాల పైన కాలంలో ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఎనిమిది మంది ఈ నోబుల్ పురస్కారాన్ని అందుకుంటే వీళ్ళలో కేవలం ఐదు మంది మాత్రమే పూర్తిగా భారతీయులు. మిగిలిన ముగ్గురు భారతదేశంలో నివసించినవారూ మరియు విదేశాలలో స్థిరపడిన భారత సంతతి వారు.
సాహిత్యానికి వన్నె తెచ్చి గీతాంజలి ద్వారా కవిత్వపు సొగసును ఖండాంతరాలు వ్యాపించేలా చేసిన రవీంద్రనాథ్ టాగూర్ నోబుల్ బహుమతిని 1913 సంవత్సరంలో అందుకున్న తొలి భారతీయుడు కాగా సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్ విదేశాల్లో స్థిరపడిన భారత సంతతిగా 2009 సంవత్సరంలో నోబుల్ పురస్కారం అందుకున్నారు. ఈయన జీవరసాయన శాస్త్రవేత్త.
ఈ విధంగా నోబుల్ బహుమతులు పరంపర సాగుతుండగా భారతదేశం నుండి దీన్ని అందుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోతోంది. కారణం గురించి ఆలోచిస్తే ఎందరికో అర్ధమయ్యే ఒక చేదు నిజం. ప్రతి రంగంలో ఎంతో విశేష కృషి జరుగుతున్నా అవన్నీ ఆర్థిక కోణంలో మరియు రాజకీయ లబ్ది కొరకు ఇంకా చెప్పాలి అంటే ప్రతి రంగాన్ని వ్యాపారదృక్పథంలో చూస్తూ అసలైన పరిశోధనలు, దీర్ఘకాలిక పరిశీలనలు జరగకపోవడమే కారణం అని చెప్పవచ్చు.
నోబుల్ బహుమతి ఆశిస్తూ దాదాపు యాభై సంవత్సరాల పాటు ఎదురు చూసిన వారున్నారు అంటే ఈ పురస్కారం ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వడపోతలో ఎంపికయ్యే ఈ బహుమతి విలువ కూడా అంతే ప్రాచుర్యం పొందిందని చెప్పచ్చు. సుమారు ఏడు కోట్లా, ఇరవై రెండు లక్షల (7,22,00,000) రూపాయల విలువ చేసే నగదు బహుమతి ఈ నోబుల్ ప్రైజ్ కింద ఇవ్వబడుతుంది.
ఇంతటి ప్రఖ్యాతి పొందిన నోబుల్ బహుమతి భవిష్యత్తు భారతదేశ ఖాతాలో ఎప్పుడు చేరుతుందో చూడాలి మరి.
◆ వెంకటేష్ పువ్వాడ