డబ్బు పట్ల నిజాయితీగా ఉండటం అంటే ఏంటి.. మీరెలా ఉంటారు?

డబ్బు పట్ల నిజాయితీ అంటే తీసుకుంటున్న డబ్బుకు సరిపడ పని చేస్తున్నామా అని! పిండి కొద్ది రొట్టి అన్నమాట. కాని మనం చాలా ఎక్కువ సందర్భాలలో డబ్బు పట్ల నిజాయితీని ప్రకటించం. తీసుకుంటున్న జీతానికి తగ్గ పనిచేయం. పైగా ఇంతకంటే ఎక్కువ ఎవడు చేస్తాడు? అని ప్రశ్నిస్తాం.  ఎపుడూ ఎర్న్ లీవులు, క్యాజువల్ లీవులు, మెడికల్ లీవులు పెట్టేస్తుంటాం. మనం తీసుకునే జీతానికి బాస్ ని ఒప్పించడానికి లేదా బాస్ని ఆనందపర్చడానికి మాత్రమే చూస్తాం తప్ప, చేతికి వచ్చిన డబ్బుకి తగ్గ పనిని చేస్తున్నామా అని ప్రశ్నించుకోం. దీనివలన నష్టం ఏమిటంటే, ఆ వ్యక్తులు జీవితంలో పెద్దగా ఎదగలేరు. జీవితంలో ఎదుగుదల అంటే ఎంతసేపూ ఓ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లేదా ఎక్కువ డబ్బు రావడం కాదు. జీవితాన్ని నిత్య నూతనంగా గడపడమే.  ఎప్పుడూ ఓ తెలియని చిరాకు, గుబులు, భయం ఇలాంటి ఆలోచన గల వారి  జీవితాల్లో చోటు చేసుకుంటాయి.  ఓ సిటీ బస్ కండక్టర్ బస్సు ఎక్కే పాసింజర్లకు మర్యాద ఇవ్వడు. చిల్లర ఇవ్వకుండా అల్లరి పెడుతుంటాడు. ఆ కండక్టర్ చెప్పే కారణాలు నిజమైనప్పటికీ తనకు 'జీతం' ఇస్తున్నది ఓ ప్రయాణికుడన్న విషయం మరచిపోతాడు. తనకు ఆర్.టి.సి. జీతం ఇస్తోందనుకుంటాడు. సరియైన దృక్పథం లేకుండా ఉద్యోగం చేస్తుంటాడు. ఓ పోలీసు ఇన్స్పెక్టర్ తన పవర్ ప్రజల మీద చూపెడుతుంటాడు. తన బాస్ లకు సలాం కొడుతుంటాడు. అందుకనే “నువ్వు పోలీస్  ఇన్స్పెక్టర్గా తీసుకునే జీతంలో కనీసం ఓ రూపాయికైనా న్యాయం చెయ్" అన్న సినిమా డైలాగుకి మనం తెలియకుండానే జోహార్లు అర్పిస్తాం. మనందరం ఎదుగుదల లేని జీవితం గడపడానికి కారణం డబ్బు పట్ల నిజాయితీ ప్రకటించకపోవడమే. అంత వరకు ఎందుకు "నేను ఆర్.టి.సి. డిపో మేనేజర్ అయితే ఈ బస్సులన్నీ సమయానికి వచ్చేటట్లు చేయగలను" అని మనం ఎన్ని సార్లు అనుకోలేదు? పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ చైర్మన్ అయితే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటానా? కమీషనర్ ఆఫ్ పోలీస్ అయితే ఈ ట్రాఫిక్ సిస్టమ్న ఒక్క రోజులో బాగు చేయనూ! ముఖ్యమంత్రినయితే కరెంట్, నీటి సమస్యలను వెంటనే తీర్చనూ! ఇలా ప్రతి విషయంలో మనం ప్రకటించే దృక్పధం తీసుకుంటున్న డబ్బుపట్ల నిజాయితీ, మనం చేస్తున్న ఉద్యోగాలలో లేదా వ్యాపారాలలో చూపెడుతున్నామో అని ప్రశ్నించుకోవాలి. నేర్చుకోవడానికి పని చెయ్యాలి కానీ డబ్బు గురించి పని చేయకూడదు. నాకేంటిట లాభం అని ప్రశ్నించుకుని పని చేస్తామో, అప్పుడు డబ్బుకి సరిపడ పని చేయలేము. అసలు నిజమైన పని కూడా చేయలేము.                                  ◆నిశ్శబ్ద.

దేవుడున్నాడని చిన్నతనంలోనే తర్కంతో వాదించిన శాస్త్రవేత్త!

ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులతో, "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడా? అని అడిగారు. "అవును ఆయనే సృష్టించాడు” అని ఒక విద్యార్థి సమాధానమిచ్చాడు. "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు. అలాగే చెడును కూడా సృష్టించాడు. కాబట్టి భగవంతుడు చెడ్డవాడు" అని అన్నాడు ప్రొఫెసర్ తీర్మానిస్తూ. “భగవంతునిపై నమ్మకం" అనేది భ్రమ అని వాదించాడు. "సార్! నేనో ప్రశ్న అడగవచ్చా?”. అంటూ ఓ విద్యార్థి లేచాడు. అడగమన్నాడు ప్రొఫెసర్. "సార్! చల్లదనం ఉందాండీ" అని అడిగాడు. విద్యార్థి. “అదేం ప్రశ్న! చల్లదనం ఉంటుంది కదా! నీకెప్పుడూ అది అనుభవంలోకి రాలేదా?" అన్నాడు ప్రొఫెసర్. అప్పుడు ఆ విద్యార్థి "భౌతికశాస్త్రం ప్రకారం చల్లదనం అనేది ప్రత్యేకంగా లేదు కదా సార్. ఉష్ణోగ్రత లేకపోవడాన్నే చల్లదనమని అనుకుంటున్నాం. వస్తువులో ఉష్ణోగ్రత  లేదు గనుక, వేడిగా లేదని చెప్పడానికే మనం అనే చల్లదనం అనే పదాన్ని ఉపయోగిస్తాం” అన్నాడు. అవును నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ప్రొఫెసర్. అయితే మరొక ప్రశ్న సార్.. “చీకటి ఉందా?” అని మళ్ళీ ప్రశ్న వేశాడు విద్యార్థి.   "అవును, ఉంది కదా” అన్నాడు ప్రొఫెసర్. "మళ్లీ మీరు పొరబడ్డారు!" అంటూ ఆ విద్యార్థి ఇలా చెప్పాడు.  “సార్, చీకటి అనేదే లేదు. వెలుతురు లేకపోవడాన్నే మనం చీకటి అంటున్నాం. వెలుతురును అధ్యయనం చేయగలం గానీ, చీకటిని అధ్యయనం చేయలేము. అని అన్నాడు. ఆ మాట విని ప్రొఫెసర్ చాలా నిశ్శబ్దం అయిపోయాడు.  సార్ ఇంకొక ప్రశ్న.. చివరి ప్రశ్న ఇదే..  "మరి చెడు ఉందాండీ?" అని చివరి ప్రశ్న సంధించాడా విద్యార్థి.  "అవును ఉంది. నేను మొదటే చెప్పానుగా, ఈ లోకంలో ఘోరాలు, హత్యలు. అన్నీ చెడే కదా" అన్నాడు ఆవేశంగా ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి "సార్.. మనిషి హృదయంలో చెడు అనేదే లేదు, మంచి లేకపోవడమే చెడు అంటున్నాం.  అంటే భగవంతుడు లేకపోవడాన్నే పాపం అనే పదంతో నిర్వచిస్తున్నాం"  అని జవాబిచ్చాడు. ఆ తర్కానికి కంగుతిన్నాడు ప్రొఫెసర్. తాను ఓడి పోయానని అంగీకరిస్తూ ఏమీ వాదించలేక తల దించుకున్నాడు. అంతటి ప్రొఫెసర్ని కూడా తర్కంతో భగవంతుడు ఉన్నాడని ఒప్పించిన ఆ విద్యార్థి ఎవరో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.                                  ◆నిశ్శబ్ద.

జీవితానికి పట్టుదల ఎందుకు అవసరమో తెలిపే విషయాలు...

మనిషికి జీవితంలో పట్టుదల అనేది ఎంతో ముఖ్యం. ఈ పట్టుదల అనేది కేవలం మనిషికే కాదు సకల పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. దానికి ఒక మంచి ఉదాహరణ… టిట్టభ అనే పక్షి కథ..  టిట్టభ అనే పక్షి జంట ఒకటి సముద్రతీరంలో గూడు కట్టుకుని ఉండేది. ఆడపక్షి గుడ్లు పెట్టినప్పుడల్లా, సముద్రరాజు అలలతో వాటిని ముంచెత్తి, మింగేసేవాడు. సముద్రుని దురాగతాన్ని గమనించిన మగపక్షి, 'సముద్రాన్నే ఎండగట్టి, నా గుడ్లను స్వాధీనపరచుకొంటాను' అంది. ఆ పిట్ట తన ముక్కుతో, రెక్కలతో నిరంతరాయంగా సముద్ర జలాలను భూమిపైకి వేయసాగింది. ఇతర పక్షులు, ఆ మగ టిట్టిభ పక్షి విషయం తెలుసుకొని, తాము కూడా ఈ మహత్తర కృషిలో పాలుపంచుకున్నాయి. పక్షిజాతులన్నీ సమైక్యంగా చేస్తున్న పనిని గమనించి, గద్దలు, రాబందులు మొదలైన పక్షిజాతులన్నీ క్రమంగా ఆ పనికి పూనుకున్నాయి. ఈ సంగతి విన్న పక్షిరాజు గరుత్మంతుడు కూడా వైకుంఠం వదలి వచ్చి, పక్షి సమూహాలతో చేయి కలిపాడు. వాహనం లేక కష్టపడుతున్న విష్ణువు స్వయంగా సముద్ర తీరం చేరాడు. గరుత్మంతుడు పక్షిజాతుల దైన్యాన్ని తన స్వామికి నివేదించాడు. కరుణామయుడైన శ్రీమహావిష్ణువు సముద్రరాజుకు నచ్చజెప్పి, ఆ తీతువు పక్షి జంటకు గుడ్లను తిరిగి అప్పగించేటట్లు చేశాడు. 'హితోపదేశం'లోని ఈ కథ పట్టుదల ఫలితాన్ని చెబుతుంది. శ్రమశీలికి అపజయం ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇది ఒక పక్షి కథనం మాత్రమే.. మన చరిత్రలో దీనికి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన అబ్రహామ్ లింకన్ 1816 నుంచి 1860 వరకు అనుభవించిన కష్టనష్టాలు, జయాప జయాలు అంతులేనివి. ఆయన ఎనిమిదిసార్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మూడుమార్లు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. రెండుసార్లు  వ్యాపారంలో దివాలా తీశాడు. ఆరు నెలల పాటు తీవ్ర మనస్తాపంతో కుమిలిపోయాడు. పదిహేడేళ్ళ పాటు ఋణగ్రస్తుడిగా గడిపాడు. చివరకు  1860 ఎన్నికలలో గెలిచి, అమెరికా అధ్యక్షుడయ్యాడు. బానిస వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి చరిత్రకెక్కాడు. ఆయన అంత సాధించడానికి ప్రధాన కారణం పట్టుదల, అచంచల దీక్ష. దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా సంకల్ప సిద్ధి కలుగుతుంది. నెపోలియన్ చక్రవర్తి ఆకారంలో చాలా పొట్టి. అలాంటి వాడు ప్రపంచాన్నే జయించాడు. అందుకు కారణం - ఉక్కు లాంటి చెక్కు చెదరని అతని మనసే!  గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్న డెమస్తనీస్ కు నిజానికి మహా నత్తి. ఆయన నాలుక కింద గులకరాళ్ళు ఉంచుకొని, సాగర తీరంలో కేకలు వేసి, తనకున్న నత్తిని పోగొట్టుకొన్నాడు. మహావక్తగా నివాళులందుకొన్నాడు. సహనం, పట్టుదల వల్లనే ఆయన ఆ స్థాయికి ఎదగగలిగాడు.  ప్రజల ఎగతాళినీ, నిందలనూ లెక్కచేయకుండా బీదవాడైన బెంజిమిన్ డిజ్రేలీ ఇంగ్లండు ప్రధాని కావడానికి కారణం అతని పట్టుదలే. రోమన్  సామ్రాజ్య ఉత్థాన పతనాలు రాయడానికి గిబ్బన్ 20 ఏళ్ళు కష్టపడ్డాడు. వంద కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగు వేయడంతోనే ప్రారంభమవుతుంది. 'ఉద్యమేన హి సిద్ధ్యంతి' అనడంలోని పరమార్థం అదే. అసాధ్యం సాధ్యం కాగలదు. కాబట్టి మనిషి తనలో ఉన్న పట్టుదలను పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరికో సాధ్యం కాలేదు మనకేం సాధ్యమవుతుందిలే.. వంటి నిరాశా వాదాలు వదిలిపెట్టాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.                                ◆నిశ్శబ్ద.  

చాక్లెట్స్ తో మొటిమలకి చెక్!

  చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే. తీయ్యటి చాక్లెట్స్ తినటానికి ఓ కారణం దొరకాలే కాని తినకుండా ఉండగలమా ? ఏ పుట్టినరోజుకో, పండగకో, కాదు ఇప్పడిక రోజు చాక్లెట్స్ తినడానికి ఓ తియ్యటి కారణం దొరికింది. అదే మొటిమ అవునండీ! అందమైన ముఖానికి ఓ చిన్ని మొటిమైన పెద్ద మచ్చ కిందే లెక్క అందులోనూ టీనేజ్ అమ్మాయికి మొటిమలతో పెద్ద పేచినే. ఇలా మొటిమలతో వేగలేని వారికీ ఓ తియ్యటి మందు కనిపెట్టిందో అమెరికా కంపెనీ విటమిన్లు, మినరల్స్తో నింపే ఓ చాక్లెట్ను తయారుచేశారు. వాటిని రోజుకు 2 నుంచి 5 దాకా తింటే చలట. రెండు మూడు వారాల్లోనే మొటిమలు తగ్గిపోవటం గ్యారెంటి అంటున్నారు. ఈ చాక్లెట్ లో వాడే విటమిన్లు, మినరల్స్ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనా తగ్గుతాయట. అలాగే చర్మం లోపలకి చేరే జిడ్డుని కూడా తొలగిస్తాయట. దాంతో క్రమంగా మొటిమలు కూడా తగ్గుతాయట కాబట్టి మొటిమల కోసం క్రీములు, పైపూతలు వేసుకునే కష్టం లేదిక అందుకోసం గంటలు, గంటలు సమయం వృదా చేయక్కర్లేదు. హాయిగా ఓ తియ్యటి చాక్లెట్ నోట్లో వేసుకోవటమే. ఇంతకి ఆ చాక్లెట్ పేరు చెప్పలేదు కదు ' ఫ్రూటెల్స్' పేరుతో దొరికే ఈ చాక్లెట్ కీ ఇప్పుడు విదేశాలలో బోల్డంత డిమాండ్. కాదా మరి టీనేజ్ అమ్మాయిల్నే కాదు అబ్బాయిల్ని దడదడల లాడించే మొటిమలా మజాకానా! ....రమ

మనిషి జీవితం ఈ రెండు విషయాల మీదే ఆధారపడి ఉంటుంది!

అతి సర్వత్రా వర్జయేత్.. అని పెద్దలు అన్నారు. ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు అని దీని అర్ధం. అతి భాష మతి హాని, మిత భాష ఎంతో హాయి.. అని కూడా అంటారు. అతిగా మాట్లాడితే బుర్ర పాడవుతుంది, అదే తక్కువగా మాట్లాడితే అన్నిటికి మంచిది అని అర్థం. అన్ని వేళలా 'అతి'ని విసర్జించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, మాట్లాడడం ఇలా అవసరాన్ని మించి చేసే ఏ పనైనాసరే ప్రమాదకరం అని గ్రహించాలి. మహాత్ములంతా మౌనంతోనే మహత్కార్యా లను సాధించారు. మనం ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే 'నోటిని' అదుపులో పెట్టడం నేర్చుకోవాలి. అనవసరంగా మాట్లాడడం కట్టిపెట్టాలి. నోటిని అదుపులో ఉంచుకొంటే మనసును స్వాధీనంలో ఉంచుకున్నట్లే! అతిగా మాట్లాడడం వలన మనలో ఉన్న శక్తి వృథా అవుతుంది. కాబట్టి శక్తిని సమకూర్చుకోవాలి  అంటే ఎక్కువ మాట్లాడటం తగ్గించాలి.   అతిగా మాట్లాడడం చాలామంది బలహీనత ఖ్నే విషయం తెలిస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. కానీ దానివల్ల కలిగే అనర్థాన్ని గ్రహించినా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిలో కొందరుంటారు. అతిగా మాట్లాడటం వల్ల కలిగే  నష్టాన్ని గ్రహించి దాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తే అప్పుడు కొన్ని విషయాలు అందరికీ సహాయపడతాయి.  బలహీనులు 'అదృష్టాన్ని' నమ్ముకుంటారు. బలవంతులు 'ప్రయత్నాన్ని' నమ్ముకుంటారు. మరి మీరు ఈ రెండింటిలో దేన్ని నమ్ముకుంటారో మీరే నిర్ణయించుకోండి. అతిగా మాట్లాడటమే మీ బలహీనత అయితే అప్పుడు మీరు ఏ విషయంలోనూ సరైన ప్రయత్నం చేయలేరు.  నోటిని, మాటను అదుపులోపెట్టుకుంటే మనసును కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు..  అయితే.. మనసును నియంత్రించడం మానవులకే కాదు. దేవతలకు కూడా ఒక పెద్ద సమస్యే! శ్రీరాముడు కూడా మనసుని నియంత్రించడం ఎలాగో తెలుపమని వశిష్ఠులవారిని ప్రార్ధించాడు. 'నీరు' పల్లానికి పారడం ఎంత సహజమో, 'మనసు' విషయ వస్తువుల వైపు పరుగులు తీయడం అంతే సహజం. నీటిలో తడవకుండా ఈత నేర్చుకోలేం. చెడు ఆలోచనలు రాకుండా మనోనిగ్రహాన్ని సాధించలేం. కాబట్టి మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన పడకుండా ఈ క్రింది సూచనలు పాటించాలి.  మనసు తలుపును తలపులు తట్టినప్పుడు ఒక్కసారి ఆలోచించి తలుపు తెరవడం నేర్చుకోండి. అంటే ఏదైనా అనిపించగానే దాన్ని వెంటనే ఆ పని చేయడం, ఆ మాటను విశ్వసించడం చేయకూడదు. ముందు వెనుకా ఆలోచన చేయాలి.  చెడు తలపులు తెచ్చే తంటాలను ఒక్కసారి ఇమేజిన్ చేసుకోవాలి. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో.. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఊహించుకోవాలి. మంచి ఆలోచన ఎప్పుడూ ఆరోగ్యకరమైన మనసుకు దోహదం చేస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి.    మనసుని ప్రలోభపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. చెడు సావాసం, చెడు మాట, చెడు దారి జీవితంలో వైఫల్యానికి కారణాలు.                                  ◆నిశ్శబ్ద.

కార్మికుల గొంతుకు ఫలితం వచ్చిన రోజిది!

'నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..' అంటాడు శ్రీశ్రీ. మనుష్య జాతి చరిత్ర మొత్తం పక్కవాడిని పీడించుకుని, దోచుకుని తినడంతోనే నిండిపోయిందని అంటాడు. సమాజంలో ఉన్న మనుషులు వర్గాలుగా చీల్చబడి, అది కూడా ఆర్థిక అసమానతలతో వేరు చేయబడి, దోపిడీ సమాజం దర్జాగా బతుకుతున్న కాలమిది. కష్టానికి తగిన ఫలితం లేక శ్రమను పరిధికి మించి ధారపోస్తున్న దీనమైన శ్రామికుల ప్రపంచమిది. ఎటు చూసినా బలహీనుడు దారుణంగా దగాకు గురవుతున్న ప్రపంచమిది. ఈ దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా.. తమకూ హక్కులున్నాయని.. వాటిని  సాధించుకోవడం తమ లక్ష్యమని భావించి, పోరాడిన ఫలితంగా మే డే అవిర్భవించించి.  శ్రామికుల దినోత్సవమన్నా.. కార్మికుల దినోత్సవమన్నా.. లేబర్ డే అన్నా.. అదంతా బలహీనుల పక్షాన నిలబడేదే..  ప్రతి సంవత్సరం మే 1 తేదీని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారని అందరికీ తెలుసు. కార్మికులు సాధించిన విజయాలను గౌరవించడం, వారి హక్కులను వారిని గుర్తుచేయడం, ఆ దిశగా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.  ఈ కార్మిక దినోత్సవమే ప్రపంచ వ్యాప్తంగా 'మే డే'గా ప్రసిద్ధి చెందింది, ఇది 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్‌లో కార్మిక సంఘాల ఉద్యమంతో ఆవిర్భవించింది. వారి డిమాండ్స్ లో  ఎనిమిది గంటల పని ఓ ఉద్యమంగా సాగింది. అప్పటి వరకు కార్మికుల చేత 14 నుండి 15 గంటల పని చేయించేవారు.  కార్మికుల పోరాట ఫలితంగా కార్మిక దినోత్సవ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం న్యూయార్క్ అయితే, ఫిబ్రవరి 21, 1887న ఒరెగాన్ దానిపై ఒక చట్టాన్ని ఆమోదించింది. తరువాత 1889లో, మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ గొప్ప అంతర్జాతీయ ప్రదర్శన కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదని కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా నిర్ణయించారు.  భారతదేశంలో కార్మిక దినోత్సవం మే 1, 1923న చెన్నైలో జరుపుకోవడం ప్రారంభించారు. దీనిని 'కమ్‌గర్ దివాస్', 'కామ్‌గర్ దిన్', 'అంత్రరాష్ట్రీయ శ్రామిక్ దివస్' అని కూడా పిలుస్తారు. ఈ రోజును లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మొదటిసారిగా పాటించింది. కార్మికుల దినోత్సవాన్ని ఎన్నో దేశాలలో జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. అమెరికా యూరప్ లలో కార్మిక దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు.                                     ◆నిశ్శబ్ద.  

పవిత్ర మాసం రంజాన్!!

పండుగ అంటే ఒక పెద్ద సంబరం. పండుగలో కళ ఉంటుంది, సంతోషం ఉంటుంది, వీటితో పాటూ ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది హిందువులు అయినా, ముస్లింలు అయినా, క్రైస్తవులు అయినా పండుగ జరుపుకోవడం అంటే తాము నమ్మిన సిద్దాంతంలో ఉన్న సందేశాన్ని అందరికీ తెలియజేయడమే. ముస్లిం మతస్థులకు పండుగలు చాలా కొద్దిగా ఉంటాయి. వాటిలో ఎంతో ప్రాముఖ్యమైంది రంజాన్. ముస్లిం మతస్తులు అనుసరించే చంద్రమాస క్యాలెండర్ ప్రకారం వారి సంవత్సరంలో తొమ్మిదవ నెలే ఈ రంజాన్. ఇది ఎంతో పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు. ఎందుకూ అంటే వారి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ఈ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది. పరమార్థం!! ఒక వేడుకలో ఉండే అర్థాన్ని పరమార్థం అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న రంజాన్ కూడా అలాంటి పరమార్థాన్ని దాచుకున్నదే. ముఖ్యంగా రంజాన్ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అందులో ఉన్న విశిష్టతను చెబుతుంది. ఇక ఇందులో ముస్లిం మతం యావత్ ప్రాశస్త్యం ఇమిడిపోయి ఉంటుంది.  ఉపవాసం ప్రాధాన్యత!! హిందువులకు ఉపవాసం, మాఘమాసం, కార్తీకం, ఇంకా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఎంతటి భక్తి ఉంటుందో, రంజాన్ మాసంలో ముస్లిం మతస్థులకు అంతే భక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.  ప్రతిరోజు సూర్యోదయంకు ముందే నిద్రలేచి వంట చేసుకుని భోజనం చేసి సూర్యుడు ఉదయించి తరువాత ఇక పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠోర ఉపవాసదీక్ష చేపట్టడం వీళ్ళ భక్తికి, క్రమశిక్షణకు తార్కాణం. ఈ ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. నెల మొత్తం నిష్ఠగా రోజా ఉండే వాళ్ళు చాలామందే ఉంటారు. వీళ్ళలో రోజూ ఖురాన్ గ్రంధాన్ని పఠించడం, విధిగా నమాజ్ చేయడం తప్పనిసరిగా చేస్తారు.  ఇఫ్తార్!! ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ గా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఇఫ్తార్ విందులు చాలా ఫెమస్ అయిపోయాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఓ రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఖర్జూరానికి స్థానమిచ్చారు. ఉపవాసం ముగియగానే మొదటగా ఖర్జూరం తిన్న తరువాత మిగిలిన ఆహారం తీసుకుంటారు. అయితే సాధారణ రోజా ఉండేవాళ్ళు ఉపవాస దీక్ష ముగియగానే తాము తెచ్చిన ఆహారాన్ని అందరికీ పంచుతారు. ఇలా ఒకరికి ఇవ్వడంలో గొప్పదనాన్ని తమ మతంతో చాటి చెబుతారు. జకాత్!! ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంతమొత్తాన్ని దానధర్మాల కోసం ఉపయోగించాలి. జాకాత్ అందుకే ఉద్దేశించబడింది. ఇవ్వడం అంటే ఇవ్వాలి కాబట్టి తమవారికి ఇచ్చుకోవడం కాదు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యడం. ముఖ్యంగా పండుగ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు అవసరమైనవి సమకూర్చడం. ఇలా పండుగలో ఇవ్వడమనే గొప్ప విషయాన్ని మేళవించారు. పవిత్ర ఖురాన్!! హిందువులకు భగవద్గీత ఎలాంటిదో ముస్లిం మతస్తులకు ఖురాన్ అలాంటిది. నిజానికి ఖురాన్ లో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ప్రతి మాత గ్రంధం కాలానుగుణంగా మారే మతపెద్దలు ఆలోచనలను నింపుకుంటూ మెల్లిగా స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. అలా అవి మారుతూ ఉండటం వల్లనే ప్రస్తుతం అన్నిరకాల మత గ్రంధాలు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాయి. అందుకే ఎందులో అయినా మంచిని తీసుకోవడంకు మించిన గొప్ప పని మరొకటి ఉండదు. నెలవంక నియమం. ప్రతిరోజూ ఆకాశంలో నెలవంకను చూసి దాని ప్రకారం ఉపవాస దీక్షను అంచనా వేసుకోవడం వీరి ప్రత్యేకత. హిందువులు ఎలాగైతే సూర్యుడి ఉషోదయ, అస్తమయాలను లెక్కలోకి తీసుకుంటారో, వీళ్ళు అలాగే చంద్రుడిని తీసుకుంటారు.  ఇలా నియమాలు, దానధర్మాలు, సహాయాలు కలగలిసి ఎంతో ఉదార హృదయాలను, ఉపవాస దీక్షలతో సహనాన్ని, నమాజ్ లతో క్రమశిక్షణను పెంచే రంజాన్ అందరికీ సందేశాన్ని ఇచ్చే పండుగ.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.  

రంజాన్ మాసం-చివరి శుక్రవారం!!

మహమ్మదీయ మిత్రులు ఎంతో ముఖ్యమైనదిగా భావించే రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని జుమాతుల్ విదా అని అంటారు. సాధారణంగా శుక్రవారాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించే ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని  అని శుక్రవారాల కంటే ప్రత్యేకంగా చూస్తారు. అరబ్బీ భాషలో జుమా అంటే శుక్రవారం. అల్ విదా అంటే వీడ్కోలు. జుమాతుల్ విదా అంటే చివరి శుక్రవారానికి వీడ్కోలు పలకడం అని అర్థం. అంటే రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చిందని, ముస్లిం మిత్రులు ఎంతో భక్తిగా ఆచరిస్తున్న ఉపవాసాలకు కూడ వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేస్తోందని అర్థం. రంజాన్ మాసం మొదలును ఈద్-అల్-ఫితర్ గా చెప్పుకుంటామని అందరికీ తెలిసినదే.  నెలవంక దర్శనంతో ఇది ప్రారంభమవుతుంది, ఇది ఇస్లామిక్ ప్రపంచానికి చాలా పవిత్రమైన రోజు.  వ్యక్తులు పవిత్ర ఖురాన్‌ను పఠించాలని, ఒకరికొకరు తమ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని నియంగా ఉంటుంది. కావాలంటే ప్రతిచోటా ఇద్దరు ముస్లిం సోదరులు ఎదురుపడితే ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం చూడవచ్చు.  ఈ మాసంలో  పేదలకు దానాలు చేయడం ద్వారా ఇవ్వడంలో ఉన్న గొప్పదనాన్ని తెలుపుతారు    జుమాతుల్ విదా చరిత్ర  వారంలో ప్రతి శుక్రవారం ఇస్లామిక్ సంప్రదాయాలు మరియు సంస్కృతి ప్రకారం ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రార్థనలు చేయడం వల్ల ముస్లిం సోదరులు  తమకు ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంకా రంజాన్ మాసంలోనే ఖురాన్ ఆవిర్భవించింది కాబట్టి ఖురాన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు.  ఈ సందర్భంగా  ఖురాన్‌ను తప్పనిసరిగా పఠిస్తారు, దేవుని ఆశీర్వాదాలను పొందడం కోసం నిరాశ్రయులకు మరియు నిస్సహాయంగా ఉన్నవారికి ఆహారం అందించడం, సహాయాలు చేయడం వంటి ఇతర ధార్మిక చర్యలను పాటిస్తారు.   ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, దేవుని దూత ఈ నిర్దిష్ట రోజున (శుక్రవారం ప్రార్థన) మసీదును సందర్శించి, ఇమామ్‌ను వింటాడు.  ఆ సమయంలో అక్కడ ఉండటం వల్ల దేవుడి కృపకు పాత్రులు అవ్వగలమనే నమ్మకంతో ఉదయాన్నే ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం  ఏమిటంటే రంజాన్ మాసంలో వచ్చే ఈ చివరి శుక్రవారం రోజున నమాజ్ చేయడం వల్ల, తాము ఏదైనా తప్పులు చేసి ఉంటే అల్లాహ్ వారిని క్షమిస్తాడని  ప్రవక్త మహమ్మద్ తన బోధనలలో తెలిపారు.  చివరి శుక్రవారం రోజున అన్ని ప్రాంతాలలో  మసీదు వెలుపల షామియానాలు ఏర్పాటు చేస్తారు. ప్రార్థనలు కోసం వచ్చే భక్తుల రద్దీ కారణంగా, అందరూ ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ భగణ ఖురాన్ పఠించడానికి కేటాయిస్తారు.  స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం భవిష్యత్తులో పుణ్యాన్ని పొందుతుందని నమ్ముతారు అదే విషయాన్ని తమ పిల్లలకు కూడా చెబుతారు. సమాజ్ సందడి!! ముస్లిం సోదరులు తమ జీవితంలో నమాజ్ ను కూడా భాగంగా చేసుకుని ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మాత్రం నమాజ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సాధారణంగా కొందరు రోజులో రెండు లేదా మూడు సార్లు నమాజ్ చేసుకుంటారు కానీ రంజాన్ మాసంలో మాత్రం అయిదు సార్లకు తగ్గకుండా నమాజ్ చేయడం తప్పనిసరి. నమాజ్ కు ముందు వజూ చేయడం పరిపాటి. వజూ అంటే ముఖం, కాళ్ళు, చేతులు మూడుసార్లు నీటితో శుద్దిచేసుకోవడం.  ఇందుకోసం మసీదు లలో ప్రత్యేకంగా చిన్న చిన్న నీటి సరస్సులు, ఏర్పాటు చేయబడి ఉంటాయి కూడా. సుర్మా….. సొగసు!! నిజానికి సుర్మా అనేది ముస్లిం సోదరులు జీవితంలో ఒక అలంకరణ అంశంగా మాత్రమే కాకుండా అదొక భక్తి భావనగా కూడా చూస్తారు. నమాజ్ చేసుకోవడానికి ముందు వజూ చేసి, కళ్ళకు  సుర్మా పెట్టుకోవడం తప్పనిసరిగా రంజాన్ మాసంలో చేస్తారు. కళ్ళకు కాటుక లాగా పౌడర్ రూపంలో ఉండే నల్లని సుర్మా ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముస్లిం సోదరులు అవధూతగా భావించే మహమ్మద్ ప్రవక్త సుర్మాను ఎప్పుడూ పెట్టుకునేవారని, అందుకే రంజాన్ మాసంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతారు. ఇంటికి వచ్చిన అతిథులకు అందమైన భరణి లలో సుర్మాను, అత్తరును బహుమతిగా ఇవ్వడం ముస్లిం సోదరులు ఆచారం కూడా. చివరి శుక్రవారం మీతోటి ముస్లిం సోదరులకు సహకరించండి మరి. పండుగ, సంబరం, సందేశం అందరివీ మరి.                             ◆వెంకటేష్ పువ్వాడ.

వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే ఈ రెండూ దూరం పెట్టాలి!

మనిషిని గొప్పగా నిలబెట్టేది వారి వ్యక్తిత్వమే.. కానీ ఈ కాలంలో మనుషుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారి వ్యక్తిత్వపు విలువను తగ్గించేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కింది రెండు మనిషిని ఎంత నీచంగా తయారు చేయాలో.. అంత నీచంగా చేస్తాయి. వీటిని దూరంగా  ఉంచడం మంచి వ్యక్తిత్వానికి అవసరం..  ఓర్వలేనితనం.. ఒకరిని చూసి మనం ఓర్వలేకపోతున్నామంటే, మనల్ని మనం హీనపరచు కుంటున్నామని అర్థం. అది పూర్తిగా మన ఆత్మన్యూనతా భావానికి (Inferiority complex) చిహ్నం. ఈ అసూయ పొడ చూపిన క్షణం నుంచి మనలో మానసిక అలజడి మొదలవు తుంది. అది క్రమంగా మన ప్రశాంతతను హరించి వేసి మన శక్తులన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన విచక్షణను కూడా కోల్పోయేలా చేస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు శత్రువన్న భ్రమను కల్పించి, ప్రతీకార జ్వాలల్ని రగిలిస్తుంది. నలుగురితో కలసి ఆహ్లాదంగా ఉండలేని పరిస్థితిని సృష్టిస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు 'Jealousy is the bane of our national character, natural to slaves. Three men can not act in concert together in India for five minutes!' నిజమే, అసూయ బానిసల స్వభావం. అది జాతి స్వభావాన్నే విషపూరితం చేసి, నిర్వీర్యపరుస్తూ ఉంది. భారత దేశంలో ముగ్గురు వ్యక్తులు కలసికట్టుగా అయిదు నిమిషాలైనా పనిచేయలేరు. ఒక కళాకారుడు, మరో కళాకారుడిని మన స్ఫూర్తిగా అభినందించలేడు. ఒక రచయిత మరో రచయిత పుస్తకాన్ని ఆసక్తిగా చదవలేడు. ఒక సంగీత విద్వాంసుడు మరో సంగీతజ్ఞుడి గానాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేడు! ఇలా, ఇక ఎంత విద్వత్తు ఉంటే ఏం లాభం?. చాలా సభాకార్యక్రమాలకు చాలా మంది కళాకారులు ఒకరిని పిలిస్తే, మరొకరు మేము రామని నిరాకరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కుళ్ళుకుంటే కుమిలిపోతాం..  అసూయ యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. నిజానికి ఎవరి ప్రతిభ వారిదే! ఎవరి ప్రాధాన్యం వారిదే! మనం కుళ్ళుకొని కుమిలిపోయినంత మాత్రాన ఒకరిది మన సొంతం కాదు. పైగా మానసిక అనారోగ్యానికి గురిచేస్తుంది. ఎదుటివారిని చూసి ఉడుక్కునే కన్నా, వారు ఆ స్థాయికి చేరుకోవటానికి పడిన శ్రమను గుర్తించి, అనుసరించాలి. తన వైభవాన్ని చూసి ఓర్వలేక, తరచూ అవమానపరిచే మామ దక్షుడి మానసిక స్థితిని విశ్లేషిస్తూ, తన సతీదేవి పార్వతితో శ్రీమద్భాగవత సప్తమస్కంధంలో పరమశివుడు అంటాడు 'అహంకారమూ, దోషములు లేనివారు కావడం చేత సజ్జనులకు ఘనకీర్తి లభిస్తుంది. అలాంటి కీర్తి, తమకూ దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ వారు అసమర్థులు కావడం వల్ల వారికి కీర్తి రాదు. అందుచేత మనస్సులో కుతకుత ఉడికిపోతారు'.  ఈ రెండింటిని మనిషి తనకు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. అదే మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

మీకూ ప్రపంచంలో చెడు కనబడుతోందా?? కారణమిదే..

మన మనోస్థితే మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిని నిర్ణయిస్తుంది. మనోస్థితి మారితే, ప్రపంచ స్థితి కూడా విధిగా మారితీరుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమిటంటే… మిమ్మల్ని మీరు పవిత్రీకరించుకోవాలి. అలా చేస్తే గనుక  ప్రపంచం కూడా తప్పక పరిశుద్ధమౌతుంది. ఈ విషయాన్నిపూర్వం నుండి భోధిస్తూనే ఉన్నారు. అయితే దాన్ని పూర్వంకంటే ఇప్పుడు ఎక్కువగా బోధించాల్సి ఉంది. సందుకంటే.. ఇరుగుపొరుగు వారి విషయాలలో మన ఆసక్తి పెరిగిపోతోంది. సొంత విషయాలలో ఆసక్తి తగ్గిపోతోంది. మనం మార్పు చెందితే ప్రపంచం కూడా మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే, లోకం కూడా పరిశుద్ధమౌతుంది.  ప్రతి ఒక్కరూ ఒక ప్రహన వేసుకోవాలి.  ఇతరులలోని చెడును నేనెందుకు చూడాలనేదే ఆ ప్రశ్న. నేను చెడిపోయి ఉంటేనే గాని ఇతరులలోని చెడును చూడలేను. నాలో బలహీనత లేకపోతే నాకు దుఃఖం కలుగదు. నేను పసివాడిగా ఉన్నప్పుడు నాకు దుఃఖాన్ని కలుగించినవి. నన్నిప్పుడు దుఃఖపెట్టలేవు. మనస్సు మారింది కాబట్టి, ప్రపంచం కూడ తప్పక మారుతుందని వేదాంతం వక్కాణిస్తుంది. ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనది ఏదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇకపై కూడా ఎలాంటి బంధం ఉండదు. అతడు స్వాతంత్ర్య మనస్కుడు అవుతాడు. అలాంటివాడే ప్రపంచంలో చక్కగా జీవించగలిగిన సమర్థుడు అవుతాడు.  లోకాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ప్రపంచం ఎంత ఘోరం! ఎంత దుష్ట అని అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది! అద్భుతమైనది! అని అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది లేదా మంచిచెడుల  మేళవింపు గానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. అప్పుడు మనకు ప్రపంచంలో ఏదీ మంచిగాగాని చెడుగా గాని అనిపించదు. అన్నీ సర్వం సరైన స్థానంలో ఉన్నట్లు అదంతా సమంజసమే అన్నట్టు అగపడుతుంది. ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ మనలో ఎంత పెంపొందితే బయట వున్న ప్రేమాసౌజన్య పాపనత్వాలను మనం అంతగా చూడగలం. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. పిండాండాన్ని నువ్వు చక్కబరుచుకొన్నావా (ఇది నువ్వు చేయగల పనే), బ్రహ్మాండం తనంతట తానే నీకు అనువుగా మారుతుంది. ఆదర్శ ద్రవాన్ని అది ఎంత కొద్ది పరిమాణంలో ఉన్నా దానికంటే ఎక్కువ పరిమాణంగల ద్రవంతో సరితూగేటట్లు చేయవచ్చుననే సూత్రంలా ఒక నీటిబిందువు విశ్వంతో సరితూగగలదు. మనలో ఏది లేదో అది మనకు వెలుపల కూడా కనబడదు. చిన్న ఇంజనుకు పెద్ద ఇంజను ఎలాంటిదో విశ్వం మనకు అలాంటిది. చిన్నదాన్లో కనిపించే దోషం పెద్దదాన్లో ఏర్పడే చిక్కును ఊహింపజేస్తుంది. లోకంలో సాధింపబడ్డ ప్రతియత్నమూ నిజానికి ప్రేమచేత సాధింపబడిందే. తప్పులు ఎన్నటం వల్ల ఎన్నడూ ఏ మేలూ ఒనగూరదు. వేలకొద్ది సంవత్సరాలుగా విమర్శనా మార్గాన్ని అనుసరించి చూడటమైంది. నిందల వలన దేనినీ సాధించలేము.  అంటే మనిషి తనలో చెడును, చెడు భావనలను పెంచుకుంటే…  ఈ ప్రపంచంలో కూడా చెడు ఉన్నట్టు, తన చుట్టూ చెడు భావనలు ఉన్నట్టూ అతనికి అనిపిస్తుంది  ఇందులో వింత ఏమి లేదు. చూసే చూపును బట్టి విషయం అర్థమవ్వడం మాములే కదా…                                 ◆ నిశ్శబ్ద.

రాజ్యాంగ శిల్పి జయంతి!!

రాజ్యాంగం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కర్. అందరికీ డా. బి.ఆర్ అంబేద్కర్ గా తెలిసిన ఈయన అసలు పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 వ తేదీన పుట్టిన ఈయన భారతీయ చరిత్రలో ఓ సంచలనం. అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి నిరక్షరాస్యతే కారణమని తను ఎంతో ఉన్నత విద్యావంతుడవ్వడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచాడు. భారతదేశ రాజ్యాంగానికి రూపునిచ్చి బడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషిచేసిన మహనీయుడు ఈయన. అంటరాని బాల్యం!!  నిజంగా మనిషికి డబ్బున్న కూడా గౌరవం లేని కాలంలో అంబేద్కర్ పుట్టాడు. ఈయన తండ్రి బ్రిటిష్ వారి దగ్గర సుబేదారుగా పనిచేసేవాడు. ఆర్థికంగా మరీ అంత కష్టాలు ఏమీ ఉండేవి కాదు. కానీ చుట్టూ ఉన్న అగ్రవర్ణాల వారి నుండి సమస్యలు ఎదుర్కునేవాళ్ళు. ఎవరూ ముట్టుకునేవాళ్ళు కాదు, అందరూ ఉపయోగించే వస్తువులు ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు.  దానికోక చిన్న ఉదాహరణ:- బడిలో నీళ్లు తాగాలి అంటే చెత్త ఊడ్చే అతను ప్రత్యేకంగా వీళ్లకు ఇచ్చేవాడు. అందరితో కలిసి ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు.  అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే "ఈరోజు చెత్త ఊడ్చే అతను లేడు. అందుకే తాగడానికి నీళ్లు లేవు" బాల్యంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న అంబేద్కర్ మహాశక్తిగా ఎదగడం వెనుక ఉన్నది కేవలం అక్షరాస్యత అంటే ఆశ్చర్యం వేస్తుంది. విద్య మనిషిని ఎంత గొప్పగా తయారుచేస్తుందో అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న విద్యాధికుల పేర్లు రాయాల్సి వస్తే అంబేద్కర్ పేరు ఎంతో గర్వంగా రాయచ్చు.  ఎంతో గొప్ప విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకుని గొప్ప న్యాయవాదిగా మారినవాడు అంబేద్కర్. దళిత మహాసభతో మలుపు!! 1927 సంవత్సరంలో జరిగిన దళిత మహాసభ ఓ గొప్ప మలుపు అనుకోవాలి. చెరువులో నీటిని ముట్టుకునే అనుమతి కూడా లేని సందర్భంలో ప్రజలలో చైతన్యం నింపి ఆ చెరువు నీటిని అందరూ స్వీకరించేలా చేశారు ఈయన. ఆ తరువాత బహిష్కృత భారతి అనే పత్రిక స్థాపించాడు. ఆ పత్రికలోనే ఒక వ్యాసంలో అంబేద్కర్ ఇలా పేర్కొన్నారు. "తిలక్ గనుక అంటారానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని కాకుండా అస్పృశ్యతా నివారణ నా ద్యేయం, అదే నా జన్మహక్కు అని నినదించి ఉండేవాడేమో" అని. ఆ మాటలు చూస్తే అంబేద్కర్ తన జీవితంలో కులవివక్షత వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే బడుగు వర్గాల వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని ఈయన విశ్వసించాడు. భారతజాతీయ కాంగ్రెస్ లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు తీసుకురావడం కోసం ఎంతో పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. రాజ్యాంగ రూపకల్పన!! నిజానికి రాజ్యంగం రూపొందించడానికి ఏడు మంది సభ్యులను నియమిస్తే అంబేద్కర్ తప్ప మిగిలిన అందరూ వివిధ కారణాల వల్ల రాజ్యాంగ పరిషత్తుకు దూరమయ్యారు. అందువల్ల అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి నడుం బిగించాడు. ఈయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అవ్వడం వల్ల రాజ్యాంగంలో బడుగు వర్గాల వారు బలపడేందుకు రిజర్వేషన్లను  పొందుపరిచారు.  ఎంతోమంది రిజర్వేషన్ల మూలంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యారు. అందుకే ఈయన బడుగు వర్గాల వారి పాలిట దేవుడయ్యాడు. మతమార్పిడి మరణం!! అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రిస్టియానిటిలో చేరారని ఆయన క్రైస్తవం పుచ్చుకోవడం వల్ల ఎంతోమంది దళితులు క్రైస్తవం వైపు దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రైస్తవం లోకి వెళ్ళలేదు అనేది నిజం. ఆయన ఎంతో ప్రాచీనమైనది, హిందూ మతానికి దగ్గరగా ఉన్నది అయిన భౌద్ధ మతంలోకి మారారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. భారతదేశానికి ఈయన అందించిన సేవలకు భారతరత్న ప్రకటించి విశ్వాసం నిలుపుకుంది భారతప్రభుత్వం. ప్రభావం!! భారత రాజకీయాలపై, విద్యార్ధులపై, దిగువ తరగతి వర్గాల వారిపై మాత్రమే కాకుండా విద్యావంతులపై కూడా అంబేద్కర్ ప్రభావం ఎంతో ఉంది. ఫలితంగా ఆయన ఎన్నో విధాలుగా అందరినీ ప్రభావం చేశారు. అది పరిస్థితులను అధిగమించి విద్యావంతుడుగా మారడం కావచ్చు, బడుగు జీవితాల కోసం శ్రమించడం కావచ్చు, రాజ్యాంగ కర్తగా కావచ్చు. ఏది ఏమైనా భారత రాజ్యాంగం నిలిచి ఉన్నంతవరకు దాన్ని లిఖించిన అంబేద్కర్ కూడా భారతావనిలో నిలిచే ఉంటాడు. ఓ ప్రభావితుడుగా…... ఓ ఆర్థిక వ్యూహకర్తగా…… ఈయన రచించిన పలు గ్రంథాలే వాటికి నిదర్శనాలు మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

అధికారికి ఉండవలసిన గొప్ప లక్షణం ఇదే...

కరోతు కరటశ్శబ్దమ్ సర్వదా ప్రాంగణే వసన్, శశృణోతి బుధః ప్రీత్యా శృణోతి పిక భాషితమ్ । కాకులు ఎప్పుడూ అరుస్తూంటాయి. అందరూ వాటిని చూసి విసుక్కుంటారు. కాకి గోల అని కొట్టేస్తారు. అదే కోయిల ఒక్కసారి కూయగానే, ఆనందిస్తారు. కోకిల స్వరం కోసం చెవులు రిక్కిస్తారు. ఆఫీసులలోనూ, ఇతర సంస్థలలోనూ ప్రతి చిన్న విషయానికీ చిటపటలాడే అధికారి పరిస్థితి 'కాకి' పరిస్థితి అవుతుంది. అతడి మాటలను పట్టించుకోవటం మానేస్తారు. అతడు ఎప్పుడూ అరుస్తూ ఉంటే అతని కింద పనిచేసేవారు ఒకానొక నిర్లక్ష్య భావనలోకి జారిపోతారు. అది ఎలా ఉంటుంది అంటే…  'ఆ ఏదో అరుస్తాడులే' అని కూరలో కరివేపాకులా అతని మాటలను తీసిపారేస్తారు. అంటే, ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమంటే… ఏ గౌరవం ఆశించి సదరు అధికారి తన ఆ అధికారాన్ని ప్రయోగిస్తాడో, ఆ గౌరవమే అధికారికి లభించటం లేదన్నమాట. ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో దీనికి సంబంధించి  మరో విషయం ప్రస్తావించుకోవాలి. ఎప్పుడైతే వ్యక్తిలో అర్హత లేకున్నా, తాను ఉన్నతస్థానం ఆక్రమించాడన్న భావన కలుగుతుందో, అప్పుడు ఆ వ్యక్తిలో న్యూనతాభావం కలుగుతుంది. అందరూ తనని తక్కువగా చూస్తున్నారన్న ఆలోచన కలుగుతుంది. అందరూ తన గురించి మాట్లాడతున్నారని, హేళన చేస్తున్నారన్న భయం కలుగుతుంది. అంటే తనలో ఎలాంటి ప్రతిభ, తనున్న స్థానానికి తగిన అర్హత లేదని విషయం అతనికే స్వయంగా తెలుసు. అదృష్టమో… ఇతరుల రికమెండేషన్ తోనో.. లేదా తనకు వారసత్వంగా వచ్చిన స్థానంలోనో అతడు కూర్చుంటున్నాడు కానీ దానికి తనిఖీ అర్హత అతనికి ఉండదు. ఆ విషయం అతనికి అర్థమైతే… అటువంటప్పుడే అధికారి తన అధికారాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తాడు. కానీ తన కింద పనిచేసేవారు ఆ ధికారాన్ని నిర్లక్ష్యం చేస్తే అతడు భంగపడతాడు. అధికారిలోని ఈ ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని కిందివారు సులభంగా అర్థం చేసుకుంటారు. దాన్ని మరింత ఎగదోస్తారు. ఇంకొందరు ఈ ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని తమకు అనువుగా ఉపయోగించుకుంటారు. అతడిని పొగడుతూ, అతడి ఆశ్రయం సంపాదిస్తారు. పబ్బం గడుపుకుంటారు. కాబట్టి, అందరూ అన్ని విషయాల్లో నిష్ణాతులు కాలేరన్న విషయం అధికారి గ్రహించాలి. తన స్థానాన్ని, ఆ స్థానం ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించే విచక్షణ ప్రదర్శించాలి. అప్పుడు అతడి అనర్హత కూడా అర్హతగా మారిపోతుంది. అతడికి అర్హత లేదని చులకనగా చూసేవారే, అతడి విచక్షణకు దాసోహం అంటారు.  అహంకారంతో, అధికార ప్రయోగంతో సాధించ లేనిదాన్ని విచక్షణతో, వినయంతో సాధించవచ్చు. గమనిస్తే, పూర్వకాలంలో రాజులు అవసరమైతే, అట్టడుగున ఉన్నవారి ముందు మోకరిల్లి విజ్ఞానాన్ని గ్రహించిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. భృగుమహర్షి తన వక్షస్థలం మీద తన్నినా దాన్ని విష్ణుమూర్తి చిరునవ్వుతో స్వీకరించటం మనకు తెలుసు. తన శక్తిని అవగాహన చేసుకున్న వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుంది. అందుకే అధికారి అన్నవాడు 'అర్హత' గురించి ఆలోచించటమూ, విచక్షణతో, వినయంతో 'నేర్చుకోవటమూ' నేర్చుకోవాలి. మంచి ఎక్కడ ఉన్నా గౌరవించటం నేర్చుకోవాలి.                                          ◆నిశ్శబ్ద.

ఉత్తమ విద్యార్థులు కావాలంటే...!

అందరూ జీవితం గురించి, సమస్యల గురించి, పరిష్కారాల గురించి, ఇంకా రేపటి గురించి, ఎన్నో రకాల భవిష్యత్ కార్యాచరణల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ విద్యార్థుల గురించి చెప్పేవారు, మాట్లాడేవారు చాలా తక్కువ. విద్యార్థులకు చక్కని మార్గాలు, మెళకువలు అందించేవారు తక్కువ. అయితే విద్యార్థుల కోసం కొన్ని ఆచరించదగ్గ చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో, కలిగే ఫలితాలలో మార్పులను స్పష్టంగా గమనించగలుగుతారు.  అప్పుడు వారు ఉత్తమ విద్యార్థులూ అవుతారు. అయితే ఉత్తమ విద్యార్థులు కావడం కోసం కొన్ని చిట్కాలు... రాయడానికి కానీ, చదవడానికి కానీ కూర్చున్నవారు తమ శరీరాన్ని అనవసరంగా కదిలించకూడదు. చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి అపసవ్యమైన భంగిమల్లో కూర్చుంటూ ఉంటారు. ఇక కొందరుంటారు. ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయినవాళ్ళలా ఏదో ఒకదాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. మరికొందరు చదువుకొనేటప్పుడు పెన్నులు, పెన్సిళ్ళు నోటిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి  అలవాట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏకాగ్రతను భంగం కలిగించేవే! కదులుతున్న పాత్ర తనలోని నీటిని సైతం కదిలించినట్లే, శరీరం తన భంగిమను మార్చినప్పుడల్లా మనస్సు చలిస్తూ ఉంటుంది. కాబట్టి, చదువుకొనేటప్పుడు హుందాతో కూడిన స్థిరమైన భంగిమలో కూర్చోవడం ముఖ్యం. నిర్ణీత సమయంలో ఏదో ఒకే అంశాన్ని తీసుకొని, దానినే అధ్యయనం చేయాలనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అయితే, ఒక అంశాన్ని ఎంచుకొన్నప్పుడు ఇక కనీసం ఓ గంట పాటు పూర్తిగా ఆ అంశంలోనే మనస్సును లీనం చేయాలి. కేవలం పుస్తకాన్ని చదువుకొంటూ వెళ్ళినంత మాత్రాన ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినట్లు కాదు. పుస్తకాన్ని పట్టి చదవడానికీ, పూర్తిగా అధ్యయనం చేయడానికీ మధ్య ఉన్న తేడాను మొదట తెలుసుకోవాలి. కానీ, ఒక్క విషయం. పుస్తకాన్ని చదవడానికైనా, అధ్యయనం చేయడానికైనా  రెండిటికీ ఏకాగ్రత కావాల్సిందే! పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని పైపైన చదవడం వల్ల దానిలోని సారాంశమేమిటో పాఠకుడికి తెలియవచ్చు. కానీ, పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవడం వల్ల మనస్సు దానిలోని అంశాల లోతుల్లోకి వెళుతుంది. వాటి అంతరార్థాన్ని తెలుసుకొంటుంది. తరచుగా అందులో దాగున్న సారాన్నీ గ్రహిస్తుంది. దీనివల్ల సంబంధిత అంశం మీద గట్టి పట్టు వస్తుంది. మరింత చదవడానికి తోడ్పడుతుంది. చదువుకోవడానికి ఓ అంశాన్ని ఎంచుకొని. చదువుకొనే బల్ల దగ్గరకు వచ్చాక పైన చెప్పినట్లుగా పూర్తిగా ఓ గంట సేపు దాని మీదనే ఏకాగ్రత  కొనసాగించాలి. అది చాలా ముఖ్యం. సాధారణంగా, ఓ కొత్త అంశాన్ని వెంటనే గ్రహించి, అర్థం చేసుకోవడానికి మనస్సు సిద్ధంగా ఉండదు. రోజు పొడుగూతా మనం చేసిన రకరకాల పనులు కానీ, మిత్రులతోనూ, ఇతరులతోనూ జరిపిన సంభాషణలు కానీ, చదువుకోవడానికి కూర్చొనేందుకు సరిగ్గా ముందే మన మనస్సుల్లో నిండిన ఆలోచనలు కానీ మనలో ఇంకా అలాగే ఉంటాయి. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి, ప్రస్తుతం చదువుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనస్సు సిద్ధం కావడానికి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా సమయం పట్టవచ్చు. మనస్సును సిద్ధం చేసి, చదువుకోవడం  ప్రారంభించాక అది క్రమంగా చదువుతున్న అంశం లోతుల్లోకి వెళుతుంటుంది. సరిగ్గా అప్పుడు ఉన్నట్టుండి చదవడం ఆపేస్తే, ఏకాగ్రత పోతుంది. చదువు దెబ్బతింటుంది.  కాబట్టి, చదవడం మొదలుపెట్టిన కొద్ది నిమిషాల తరువాత మనస్సు ఏకాగ్రత అయ్యాక, మరింత లోతుగా వెళ్ళి, గాఢంగా చదవడానికి  ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రకంగా నిరంతరాయంగా కనీసం ఓ గంట పాటు అధ్యయనం సాగించడానికి మనస్సును వినియోగించాలి.  ఇలా మనం చదువుకొనే సమయంలో కుటుంబ సభ్యులెవరైనా పిలిచి, ఏదైనా పని చెప్పవచ్చు. కాబట్టి, "ఓ గంట సేపు నన్నెవరూ దయచేసి పిలవకండి" అని ఇంట్లోని వాళ్ళందరికీ ముందుగానే చెప్పేయాలి. ఎందుకంటే, ఎవరూ పిలవకపోయినా,  ఎవరైనా మధ్యలో పిలిచి, అంతరాయం కలిగిస్తారేమోనన్న ఆలోచన మనస్సు లోలోపల ఉన్నా చాలు, చదువు మీద మనస్సును పూర్తిగా లగ్నం చేయలేం. వస్తారేమో… పిలుస్తారేమో అనే ఆలోచన వల్ల మనసు కుదురుగా చదువు మీద నిలువదు. అందుకే చదువుకునే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ముందే ఎవరూ పిలవకండి అని చెప్పాలి. ఇలా చదువుకునే పిల్లలు పై చిట్కాలు ఫాలో అయితే ఉత్తమ విద్యార్థులు అవుతారు.                                ◆నిశ్శబ్ద.  

సలహాలు ఇవ్వడం ఎంతవరకు మంచిది?

'సలహా ఇచ్చేవాడు బుద్ధిహీనుడు' అంటారు శ్రీ జిడ్డుకృష్ణమూర్తిగారు. అంటే ఆయన ఉద్దేశం ఎవరైనా ' మీ అనుభవంలో షేవ్ చేసుకోవడానికి ఏ బ్లేడు మంచిదంటారు?' అని అడిగినప్పుడు ఏమీ చెప్పకుండా ఉండాలని కాదు, అలాగే ఒక చోటినుండి మరో చోటికి వెళ్ళడానికి ఏ రూటు బస్సుల్లో ఏదెక్కి వెళ్తే త్వరగా చేరే అవకాశముంటుంది అని అడిగినప్పుడు సలహా చెప్పకూడదని కాదు, జీవితంలో ముఖ్యమైన సమస్యలు అనగా వివాహం చేసుకోవాలా, చేసుకోవడం మానేయాలా లేక ప్రొఫెసర్ ఉద్యోగానికి వెళ్ళమంటారా అని ఎవరైనా సలహా అడిగితే ఇలాంటి సమస్యలకు ఎవరికి వారే సరిగా ఆలోచించుకొని సరైన నిర్ణయం చేసుకోవాలని వారి అభిప్రాయం. ఈ విషయాల్లో సలహాలివ్వాలనుకున్నవాడు చివరకు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఇలాంటి వాటిలో ఎవరైనా వచ్చి అడిగినప్పుడే సలహా ఇవ్వడం మంచిది. కాదని అనుకున్నప్పుడు ఇక అడగక ముందే సలహా ఇవ్వజూడడం మరీ అధ్వాన్నమని వేరే చెప్పనక్కరలేదు. ఒకాయనకు "ఫలాని సినిమా చూచి రావోయ్ చాలా బాగుంది" అని సలహా ఇచ్చాడు అతడి మిత్రుడు. అతడి ఆర్థిక ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండా ఈ సలహా తొందరపడి ఇచ్చాడని చెబుతున్నట్టుగా అతను  ఎగాదిగా చూసి "ఈ సారి ఇలాంటి సలహాలిచ్చేప్పుడు, సలహాతోబాటు నాకూ నా ఫామిలీకి టిక్కెట్లకు సరిపడే డబ్బుకు ఒక చెక్కు రాసి పంపించు" అన్నాడు. ఆ మాటలు ఆ సలహా ఇచ్చిన సదరు స్నేహితుడి నసాళానికి అంటటంతో ఇలా ఇతరులకు ఉచిత సలహాలివ్వకూడదు అని అప్పటి నుండి సలహాలు ఇవ్వడం ఆపేసాడు.  పిచ్చుక గూడు కట్టుకునప్పుడు దాని ద్వారాన్ని క్రిందివైపుగా ఉంచుతుంది. అందువల్ల వర్షం పడినా ఒక్క చుక్క కూడా ఆ గూట్లోకి వెళ్ళకుండా ఆ గూడెప్పుడూ చక్కగా పొడిగా వుంటుంది. బోరున వర్షం కురిసిన ఒకనాడు ఒక పిచ్చుక తన గూటిలో తలదాచుకొని, వర్షం వెలసిన తర్వాత తిన్నగా బయటికి వచ్చి ఒక ఇంటి కప్పుమీద వాలింది. పక్కనే ఒక చెట్టుకొమ్మమీద ఒక కోతి కనిపించింది. కోతికి గూడు నిర్మించుకునే ఆనవాయితీ లేనందువల్ల, వర్షం పడేప్పుడు కూడా అది ఏ చెట్ల కొమ్మలమధ్యో కూచొని అలాగే తడుస్తూ వుంటుంది. చప్పగా తడిసి విచారగ్రస్తమైన మొహంతో కూచున్న కోతిని చూచి ఆ పిచ్చుక దానిస్థితికి జాలిపడి "మిత్రమా నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. నాకుండేదల్లా ఈ ముక్కొక్కటే, అయినప్పటికీ నేనా ముక్కు సహాయంతోనే ఇంత చక్కటి గూడు కట్టుకున్నాను. నీకు చూస్తేనా, మనిషికుండే చేతులూ కాళ్ళూ అనే నాలుగంగాలు ఉండటమే కాక తోక కూడా ఒకటుంది. వీటన్నిటి సహాయంతో నీవో చిన్న నివాసం సులభంగా ఏర్పరుచుకోవచ్చు. అప్పుడు నువ్వీ విధంగా ముద్దగా తడిసిపోవలసిన అవసరముండదు కదా” అన్నది. సద్బుద్ధితో పిచ్చుక ఇచ్చిన ఈ సలహాను కోతి అపార్థం చేసుకున్నది. తనని ఆటలు పట్టించి ఏడ్పించడానికే ఈ పిచ్చుక ఇలా మాట్లాడుతున్నది అని భావించింది. “నీకు మంచి గూడున్నదనీ అందువల్ల నీవు తడవలేదనీ నీకు మహా మిడిసిపాటుగా వున్నట్లుంది. నేను వర్షంలో తడిశానని నన్ను వెక్కిరించడానికి ఆ గూటిలో నుండి ఈ ఇంటి కప్పుమీదికి ఎగిరి వచ్చావన్న మాట. మహా ఎగిరి పడుతున్నావ్, నీ గర్వమణుస్తాను ఆగు" అని అంటూ ఒక్క దుముకు దుమికి ఆ పిచ్చుక గూడును చిందరవందర చేసి నాలుగు వైపులా పారేసింది. "పైసారి వర్షం వచ్చినప్పుడు నాతో బాటు నువ్వూ తడుద్దుగాని” అని హూంకరిస్తూ వెళ్ళిపోయింది. "మనుష్యుల్లో కూడా ఈ కోతి మనస్తత్వం చాలా మందిలో కనిపిస్తుంది” అంటారు స్వామి సచ్చిదానంద. “అలాంటి వారెవరితోనైనా “పోనీ ఇట్లా చేస్తే...”. అని మనం అనే లోగానే వారికి మనమీద చెప్పరాని ఆగ్రహం కలుగుతుంది. అందుచేత వారి గతికి వారిని వదిలివేయడమే శ్రేయస్కరం. అయాచితంగా వారికి సలహాలివ్వవద్దు. వారంతట వారు వచ్చి అడిగేంతవరకూ ఏమీ చెప్పద్దు. చిరునవ్వుతో ముందరికి సాగిపోతూవుండటమే మంచిది.”                                     ◆నిశ్శబ్ద.

ప్రపంచంలో అద్భుత మంత్రం.. జీవితాలకు వెలుగు కెరటం ఇదే..

అన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఆశ ఒక్కటే మనల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. మనలో ఉన్న నిజమైన ధైర్యాన్ని, తెగువను, సమయస్ఫూర్తిని వెలికితీస్తుంది. అందుకే ఆశ గొప్ప ఆయుధం అవుతుంది మనిషి జీవితంలో.  జీవితంలో ఎంతోమంది విషయాల్లో ఆశ ముఖ్య పాత్ర పోషించినా పిల్లల జీవితానికి ఇది ఇంతో అవసరం.  ఈ ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు శారీరక, మానసిక, లైంగిక దాడికి బలైపోతున్నారు. ఇలాంటి పిల్లలు జీవిఘం మీద భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనే పెద్ద ప్రశ్న వీరిని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. కేవలం ఇలాంటి వేధింపులు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు కూడా కోకొల్లలు. వీరికి జీవితం మీద ఆశను కల్పించడం అందరి కర్తవ్యం. జీవితంలో ఎదురయ్యే బాధాకర పరిస్థితులను ఎదుర్కోవడానికి వీరికి తగినంత సపోర్ట్ అవసరం అవుతుంది. పెద్దలు కూడా ఇలాంటి పరిస్థితులలో ఉంటారు. ఇలా జీవితంలో ఎన్నో కోల్పోగున్న వారికి ఆశను కలిగించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదటి బుధవారంను వరల్డ్ హాప్ డే గా జరుపుకుంటారు.  నిర్లక్ష్యానికి, వేధింపులకు గురయ్యే ఎంతోమంది పిల్లలు పెద్దలు చివరికి చావు వైపు అడుగులేస్తున్నారనే విషయం ప్రపంచాన్ని కలవపరుస్తుంది.  ఆశ లేకపోతే.. హాప్ అంటే ఆశ. జీవితమంతా ఈ ఆశతోనే ముందుకు కదులుతుంది. కానీ ఎప్పుడైతే జీవితంలో గందరగోళ సంఘటనలు చోటు చేసుకుంటాయో.. అప్పుడే జీవితం మీద విరక్తి, వైరాగ్యం, నిస్సహాయత అన్నీ కమ్ముకుంటాయి. సమస్యలను అధిగమించలేని తనం మనిషిని ఆవరిస్తే.. చేతకాని వాళ్ళం అనుకుని ఆత్మన్యూనతా భావంలోకి జారిపోతారు. ఇదే ఆత్మహత్యలకు మూల హేతువు. ఇలాంటి సందర్భాలలో ఆశ ఉంటే జీవితంలో నడక ఆగదు. కానీ ఆశ లేకపోతే కాలం పరిగెట్టినా దాంతో మనం పరిగెట్టలేక స్తంభించిపోతాము. మనమింతే అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. హాప్ డే రోజు ఏమి చెయ్యాలి?? ఆశ జీవితానికి ఆయువు అయినప్పుడు దానిని పెంపోంచించడం అవసరం. ఓ మనిషి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ పెడితే ఎలాగైతే మెల్లిగా జీవశక్తితో ఉత్తేజం అవుతాడో.. అలాగే మనిషి కూడా ప్రతి కూల పరిస్థితులలో ఉన్నప్పుడు ఆశతో చైతన్యం అవుతాడు. అయితే ఆశ అనేది మనిషిలో పుట్టాలంటే దానికదే జరగదు. ఆత్మన్యూనతలో ఉన్నప్పుడు ఆశ పుట్టదు. అందుకే అలాంటి పరిస్థితులలో ఉన్నవారి జీవితానికి భరోసా ఇవ్వాలి. ఇలాంటి మార్గం ఒకటుందని ఆశను చూపించగలగాలి.  ఎంతోమంది మానసిక ఒత్తిడిలోనూ.. సమస్యలలోనూ చిక్కుకుపోయి ఉంటారు. వాటికి తగిన పరిష్కారాలు ఉన్నా దాన్ని తెలుసుకోలేనితనం వారిలో ఉంటుంది. అలాంటి వాళ్లకు మార్గం చూపిస్తే అదే ఆశ అవుతుంది. మానసికంగా ఉత్తేజం చేయడం, అయోమయంలో ఉన్నవారికి నిజమేంటో తెలియజెప్పడం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని మోటివేట్ చేయడం, ఇలా ఎన్నో విధాలుగా ఆశ పెంపొందించవచ్చు.  పిల్లలను సమస్య నుండి బయటకు తీసుకురావడం, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం, వారిలో ప్రతిభను తెలపడం, అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని, రక్షణను ఇవ్వడం చేస్తే పిల్లల భవిష్యత్తు అందంగా ఉంటుంది. ఇలా ప్రపంచంలో ఎంతో మందిని ఆశ అనే ఒకే ఒక్క అద్భుతం మంత్రం ముందు నడిపిస్తుంది. కొత్త శక్తిని పొగుచేస్తుంది. అందుకే అందరిలో ఆశ ఉండాలి. అది లేనివారికి ఆశను అందించే వారు మీరవ్వాలి..                                ◆నిశ్శబ్ద.

ప్రపంచానికి మహావీరుడు చెప్పిందేంటి?

జైన మతం చివరి ఆధ్యాత్మిక గురువు మహావీరుడు. ఈయన జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైన సంఘం మహావీరుడి జయంతిని జరుపుకుంటుంది. ఈ రోజున, మహావీరుడి విగ్రహం ఊరేగింపు నిర్వహించబడుతుంది, దీనిని రథయాత్ర అంటారు. భక్తులు జైన దేవాలయాలను సందర్శిస్తారు. మహావీరుడు జైనమతం ఆఖరి తీర్థంకరుడు.  తీర్థంకరుడు అంటే అర్థం తెలుసా? జైనమతంలో రక్షకుడు, ఆధ్యాత్మిక గురువును తీర్థంకరుడు అని అంటారు. జైన గ్రంధాల ప్రకారం ప్రతి సంవత్సరం మహావీర్ జయంతి తేదీ మారుతుంది. చైత్ర మాసంలో పాడ్యమి మొదలయ్యాక పదమూడు రోజులకు మహావీరుడి జయంతి వస్తుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల మధ్య వస్తుంది. మహావీరుడి జీవితం వాస్తవానికి మహావీరుని పేరు వర్ధమానుడు. అతను సుమారు 599 BC లో జన్మించాడు, చాలా మంది పండితులు ఈ తేదీని 100 సంవత్సరాల ముందుగానే నమ్ముతారు, అప్పుడు మహావీరుడు బహుశా బుద్ధుడు నివసించిన సమయంలోనే జీవించి ఉండవచ్చు, అతని సంప్రదాయ పుట్టిన తేదీ కూడా తిరిగి అంచనా వేయబడింది. మహావీరుడు ప్రపంచంలోని సత్యాన్ని కనుగొనడానికి తన ఇంటిని విడిచిపెట్టాడు. అతను సన్యాసి జీవితాన్ని గడిపాడు. ప్రపంచమంతా తిరుగుతూ, ఆహారం కోసం భిక్షాటన చేశాడు. విభిన్న సంస్కృతులు నేపథ్యాల నుండి అనేక మంది వ్యక్తులతో కలిసిన తర్వాత, అతను ప్రపంచంలోని బాధల గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత  ఉపవాసం ధ్యానంపై తన దృష్టి కేంద్రీకరించాడు. తత్ఫలితంగా జ్ఞానోదయం పొందాడు. జైన తత్వాన్ని బోధించడానికి దక్షిణాసియా అంతటా పర్యటించాడు. మహావీరుడి బోధనలు.. అహింసా (అహింస), సత్య (సత్యం), అస్తేయ (దొంగతనం), బ్రహ్మచర్యం (పవిత్రత), అపరిగ్రహ (అనుబంధం లేనిది) ప్రతిజ్ఞను పాటించడం జీవిత నాణ్యతను పెంచడానికి అవసరమని అతను బోధించాడు. మహావీరుడి బోధలను గౌతమ స్వామి (ముఖ్య శిష్యుడు) సంకలనం చేశాడు. ఇవి  జైన ఆగమాలుగా  పిలవబడ్డాయి.   మహావీరుని ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలో ఎనిమిది ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వాటిలో మూడు మెటాఫిజికల్ కాగా.. ఐదు నైతికమైనవి. అతను విశ్వం యొక్క బాహ్య ఉనికిని విశ్వసించాడు, అది సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. అతని ప్రకారం, విశ్వం అనేది ఆత్మలు, స్థలం, సమయం, భౌతిక అణువులు, చలన మాధ్యమం మరియు విశ్రాంతి మాధ్యమం అనే ఆరు శాశ్వత పదార్ధాలతో రూపొందించబడింది. మానవులు ఉనికిలో ఉన్న బహుముఖ వాస్తవికతను సృష్టించడానికి ఈ భాగాలు స్వతంత్రంగా మారుతాయి. అతను అనేకతత్వ ఉనికిని సూచించే అనేకాంతవాద (నిరంకుశత్వం యొక్క సూత్రం) తత్వశాస్త్రాన్ని కూడా పరిచయం చేశాడు. స్యాదవద్ లేదా సెవెన్ ఫోల్డ్ ప్రిడిక్షన్స్ సూత్రంతో బహుముఖ వాస్తవికత బాగా వివరించబడింది. మహావీరుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. మహావీరుడు పుట్టకముందే తీర్థంకరునిగా నిర్ణయించబడ్డాడనేది కొందరి నమ్మకం. మహావీరుడిని ఐదు రకాల పేర్లతో పిలుస్తారని చెబుతారు. మహావీరుడు దాదాపు 12 సంవత్సరాలు ధ్యానం చేశాడని చెబుతారు. ఈయన ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ఐదు సిద్ధాంతాలను అందించాడు.  ప్రస్తుత కాలచక్రాన్ని సూచించే అవసర్పిణి చివరి తీర్థంకరుడు. కల్ప స్త్రం ప్రకారం, మహావీరుడు తన జీవితంలో మొదటి 42 సంవత్సరాలు ఆస్తికగ్రామం, చంపాపురి, పృష్టిచంప, వైశాలి, వాణిజాగ్రామ, నలంద, మిథిల, భద్రిక, అలభిక, పణితభూమి, శ్రావస్తి మరియు పావపురిలలో నివసించాడు. జ్ఞానోదయం పొందిన తర్వాత, అతను ముప్పై సంవత్సరాలు భారతదేశం చుట్టూ తిరుగుతూ తన తత్వశాస్త్రంపై బోధించాడు, అతను తన అనుచరులను సన్యాసి (సాధు), సన్యాసిని (సాధ్వి), సామాన్యుడు (శ్రావకుడు) సామాన్య స్త్రీ (శ్రావిక) అనే నాలుగు రెట్లు క్రమంలో ఏర్పాటు చేశాడు. మహావీరుడుకి 14,000 మంది పురుష సన్యాసులు, 36,000 మంది స్త్రీ సన్యాసులతో పాటు, కల్ప సూత్రం ప్రకారం, 1,59,000 మంది సాధారణ అనుచరులు, 3,18,000 మంది మహిళా అనుచరులు ఉన్నారు. ప్రపంచ శాంతి, మెరుగైన పునర్జన్మ, చివరికి స్వేచ్ఛ కోసం ఇతను చెప్పిన విషయాలు.  వీటి ప్రధాన లక్ష్యం అతని బోధనలను వ్యాప్తి చేయడం ఒక వ్యక్తి జననం, జీవితం, నొప్పి, దుఃఖం, మరణం ఇవన్నీ ఒక చక్రంలో సాగుతాయి. వీటి నుండి సంపూర్ణ స్వేచ్ఛను ఎలా పొందవచ్చో తెలుసుకోవడం. అలాగే, ఒక వ్యక్తి శాశ్వతమైన ఆనందకర స్థితిని సాధించడం వీటి లక్ష్యం. దీనినే విముక్తి, మోక్షం, సంపూర్ణ స్వేచ్ఛ అని కూడా అంటారు.  ◆నిశ్శబ్ద.

ఇది చదివాక మీరు నీటి సంరక్షణలో భాగమవుతారు!

ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ (A drop of water is a grain of gold) ఎడారి ప్రాంతమైన తుర్క్‌మెనిస్తాన్‌లో నీటిని ఇలా వర్ణిస్తారు. ఒక్క చుక్క నీరు బంగారాన్ని పండిస్తుంది  అనేది దీని అర్ధం. దీన్ని బట్టి వారు నీటికి ఎంత విలువ ఇస్తారు అనేది అర్థమవుతుంది. సహజంగా ఎక్కడైతే ఒక వనరు చాలా తక్కువగా ఉంటుందో.. అక్కడ ఆ వనరు విలువ గరిష్టమవుతుంది. దీన్ని బట్టే ఆ వనరుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తుర్క్‌మెనిస్తాన్‌లో నీటి కొరత చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అక్కడి ప్రజలు ఎన్నో అవసరాలను తగ్గించుకుని నీటిని పొదుపుచేస్తారు.  కేవలం ఎడారి దేశాల్లోనే కాకుండా మన భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాలు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా ముద్రవేయబడ్డాయి. ఆయా ప్రాంతాలలో తాగునీటికి కూడా సతమతమైపోతున్నవారు ఎందరో.. ఇళ్లలో కుళాయిలు తిప్పగానే హాయిగా నీటిధారను ఒడిసిపట్టుకునే ప్రజలు కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెల్లో నీటిని నింపుకుని వచ్చేవారి కష్టాన్ని, వారి ఇబ్బందులను ఒక్కసారైనా గుర్తుచేసుకోవాలి.  స్నానాల కోసం, ఇంటి అవసరాల కోసం బకెట్ల కొద్దీ నీటిని వృధా చేసేవారు నీటికోసం పడరాని పాట్లు పడుతున్న ప్రజల కోణంలో ఆలోచించాలి. పిల్లల నుండి పెద్దల వరకు నీటి విలువను గుర్తించాలి. హాయిగా మూడుపూటలా తింటున్నామంటే దానిక్కారణం రైతులు పండించే పంటలే.. సగటు రైతుకు పంట దిగుబడి బాగుండాలంటే.. నీటి సరఫరా అంతే బాగుండాలి. మనిషి శరీరంలో 60-70% శాతం నీరు ఉంటుంది. అలాగే భూమిలో కూడా అంతే మొత్తంలో నీరు ఉండాలి. కానీ మనిషి మాత్రం భూగర్భజలాలను దారుణంగా వాడేస్తున్నాడు.  ఇది కేవలం తుర్క్‌మెనిస్తాన్‌ ప్రజలు పాటించే రోజు అయినా ప్రతి దేశం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ప్రధాన దేశమైన భారతదేశంలో నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. భూగర్భజలాలను ప్రభావితం చేసే ప్రతి అంశం పట్లా అవగాహన పెంచుకోవాలిప్పుడు.  వాయుకాలుష్యం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నదీ జలాల సంరక్షణ, నీటి కాలుష్యం అరికట్టడం, నీటి పొదుపు, అదే విధంగా చెట్ల పెంపకం, అడవుల సంరక్షణ ద్వారా నీటి వనరులు పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇవి పాటిస్తే.. మన నీటి వనరులు దేశంలో బంగారు సిరులు పండిస్తాయి.                                    ◆నిశ్శబ్ద.

ఆటిజం సమస్యపై అవగాహనా బాణం ఎక్కుపెట్టాలిప్పుడు!

ఆటిజం అనేది శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం ద్వారా ఎదురయ్యే సమస్య. న్యూరోడైవర్సిటీ వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే అనేది వాస్తవానికి 1990ల చివరలో ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త జూడీ సింగర్ కనిపెట్టిన పదం..డైస్ప్రాక్సియా, డైస్లెక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ మొదలైన న్యూరోమైనారిటీలలో ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ ఒకటి. ఆటిస్టిక్ వ్యక్తులు ఇతర ఇబ్బందులతో పాటు పక్షపాతాన్ని అనుభవిస్తారు.  ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే 2023 థీమ్.. ప్రతి సంవత్సరం ఒకో థీమ్ నిర్ణయించబడి దాని ప్రకారం ప్రణాళికలు, ఆలోచనలు, కార్యక్రమాల నిర్వహణ, టార్గెట్లు జరుగుతాయి. ఈ సంవత్సరం "Transforming the narrative: Contributions at home, at work, in the arts and in policymaking"(  " కథనాన్ని మార్చడం: ఇంట్లో, పనిలో, కళలలో మరియు విధాన రూపకల్పనలో సహకారం" ). అనే థీమ్ తో ప్రజల్లోకి వెళ్లనున్నారు.  ఆటిజం గురించి అవగాహనను తీసుకురావడానికి పిలుపునివ్వడం ద్వారా సమాజంలో, పనిలో ఆటిస్టిక్ వ్యక్తులను అంగీకరించడం, వారికి మద్దతు ఇవ్వడం. ఆటిజం గురించిన అవగాహన పెంచడం,  పనిలో, కళలలో ఆటిజం ఉన్నవారికి స్నేహపూర్వక విధానంతో హామీ ఇవ్వడం ద్వారా వీరికి ప్రపంచ దేశాల నుండి సమాజం వరకు సహకారాన్ని పెంచడమనే టాస్క్ తో ఈ థీమ్ నడుస్తుంది. ఈ సంవత్సరం, ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడతాయి. ఆటిజం ను జయించినవారు, దీని గురించి అవగాహనకు కృషి చేసేవారు, ఆటిజం నియంత్రణకు పాటు పడేవారు ఇందులో పాల్గొంటారు.  చరిత్ర డిసెంబర్ 18, 2007న నిర్వహించిన 76వ ప్లీనరీ సమావేశంలో, ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 2వ తేదీని ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డేగా ప్రకటించింది, దీనిని 2008 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు.  ఎవరిలో ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయంటే.. ఆటిజం  సమస్యలో  జన్యుశాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒకేలాంటి కవలలలో, ఒక బిడ్డకు ఆటిజం ఉంటే, మరొకరికి ఆటిజం వచ్చే అవకాశం 36-95% ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి.  ఆటిజం ఉన్న పిల్లల తోబుట్టువులకు కూడా ఈ రుగ్మత వచ్చే ప్రమాదం 2-8% ఉంటుంది.  మానసిక రుగ్మతలు ఉన్న వారికి, ప్రత్యేకించి స్కిజోఫ్రెనియా  వంటి ప్రభావిత రుగ్మతలు ఉన్నవారు ఆటిజం సమస్యతో  ఉన్న పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.  నెలలు నిండకుండానే (2500 గ్రాములు) జన్మించిన పిల్లలలో ఆటిజం ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది.   క్లోరిపైరిఫాస్ వంటి పురుగుమందులకు పిండం గురికావడం వల్ల కూడా ఆటిజం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది  గర్భిణీ తల్లులు, ముఖ్యంగా 1వ లేదా 2వ నెలలో, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లకు గురికావడం, వారి పిల్లలలో ఆటిజంతో సహా న్యూరోసైకియాట్రిక్ వ్యాధుల ప్రమాదాన్ని 13% పెంచుతుంది.                                          ◆నిశ్శబ్ద.

చెడు స్నేహాలు..... పర్యవసానాలు!

జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు. తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా. తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు.  "తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని.  వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు?? పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి. తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.                                       ◆నిశ్శబ్ద.