Read more!

కార్మికుల గొంతుకు ఫలితం వచ్చిన రోజిది!

'నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..' అంటాడు శ్రీశ్రీ. మనుష్య జాతి చరిత్ర మొత్తం పక్కవాడిని పీడించుకుని, దోచుకుని తినడంతోనే నిండిపోయిందని అంటాడు. సమాజంలో ఉన్న మనుషులు వర్గాలుగా చీల్చబడి, అది కూడా ఆర్థిక అసమానతలతో వేరు చేయబడి, దోపిడీ సమాజం దర్జాగా బతుకుతున్న కాలమిది. కష్టానికి తగిన ఫలితం లేక శ్రమను పరిధికి మించి ధారపోస్తున్న దీనమైన శ్రామికుల ప్రపంచమిది. ఎటు చూసినా బలహీనుడు దారుణంగా దగాకు గురవుతున్న ప్రపంచమిది. ఈ దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా.. తమకూ హక్కులున్నాయని.. వాటిని  సాధించుకోవడం తమ లక్ష్యమని భావించి, పోరాడిన ఫలితంగా మే డే అవిర్భవించించి. 

శ్రామికుల దినోత్సవమన్నా.. కార్మికుల దినోత్సవమన్నా.. లేబర్ డే అన్నా.. అదంతా బలహీనుల పక్షాన నిలబడేదే..  ప్రతి సంవత్సరం మే 1 తేదీని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారని అందరికీ తెలుసు. కార్మికులు సాధించిన విజయాలను గౌరవించడం, వారి హక్కులను వారిని గుర్తుచేయడం, ఆ దిశగా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.  ఈ కార్మిక దినోత్సవమే ప్రపంచ వ్యాప్తంగా 'మే డే'గా ప్రసిద్ధి చెందింది, ఇది 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్‌లో కార్మిక సంఘాల ఉద్యమంతో ఆవిర్భవించింది. వారి డిమాండ్స్ లో  ఎనిమిది గంటల పని ఓ ఉద్యమంగా సాగింది. అప్పటి వరకు కార్మికుల చేత 14 నుండి 15 గంటల పని చేయించేవారు. 

కార్మికుల పోరాట ఫలితంగా కార్మిక దినోత్సవ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం న్యూయార్క్ అయితే, ఫిబ్రవరి 21, 1887న ఒరెగాన్ దానిపై ఒక చట్టాన్ని ఆమోదించింది. తరువాత 1889లో, మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ గొప్ప అంతర్జాతీయ ప్రదర్శన కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదని కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా నిర్ణయించారు. 

భారతదేశంలో కార్మిక దినోత్సవం

మే 1, 1923న చెన్నైలో జరుపుకోవడం ప్రారంభించారు. దీనిని 'కమ్‌గర్ దివాస్', 'కామ్‌గర్ దిన్', 'అంత్రరాష్ట్రీయ శ్రామిక్ దివస్' అని కూడా పిలుస్తారు. ఈ రోజును లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మొదటిసారిగా పాటించింది. కార్మికుల దినోత్సవాన్ని ఎన్నో దేశాలలో జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. అమెరికా యూరప్ లలో కార్మిక దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు.

                                    ◆నిశ్శబ్ద.