లెఫ్ట్ హ్యాండెర్స్ ఏ బెస్ట్ అచీవర్స్ అంట!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్….. అంటాడు ఓ కవి. ఓడిపోవడం మాట అటుంచితే ఈ కుడి ఎడమ అయినందుకు అదృష్టమే ఎడమచేతిలో వచ్చి పడ్డట్టు అనిపిస్తుంది వివరాలు అన్నీ తెలిస్తే.  సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా పని చేయాలన్నా ఇతర ఏ విషయాలలో అయినా కుడిచేయి వాడటం సహజం. కనీసం ఎదుటివారు పలకరించినపుడు ఆప్యాయంగా అందుకునే షేక్ హాండ్ అయినా సరే కుడిచేత్తో ఇవ్వడం ఒక సంస్కారం, ఇంకా చెప్పాలంటే అదొక గౌరవం కూడా. భోజనం, పూజలు పునస్కారాలు, దైవకార్యాలు, బట్టలు వేసుకునేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి అనే సెంటిమెంట్ చాలా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు అక్షరాలు దిద్దడానికి బలపాన్ని కుడిచేత్తో కాక ఎడమచేత్తో పట్టుకున్నప్పుడు, అక్షరాలు ఎడమచేత్తో దిద్దుతున్నప్పుడు పిల్లలను చాలా వారిస్తారు. వారితో ఎడమచేతి అలవాటు మాన్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.  కానీ అందరూ తెలుసుకోవలసినది ఏమిటంటే ఎడమచేతి వాటం తప్పేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదొక గొప్ప ప్రత్యేకత, అదొక అదృష్టం అంటున్నారు ప్రపంచ విశ్లేషకులు.  ప్రతి సంవత్సరం ఆగస్ట్ 13 న ఎడమచేతివాటం ప్రజల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు మొదలైన విషయాల మీద చర్చించాల్సిన అవసరం ఉంటుంది. బడిలో పిల్లలు పక్కపక్క కూర్చుని రాసుకునేటప్పుడు కుడి, ఎడమ చేతివాటం కలవారు పక్కపక్కనే ఉంటే చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది. సాధారణంగా ఈ ప్రపంచం మొత్తం మీద 90% మంది కుడిచేతివాటం కలవారు అయితే 10% మంది ఎడమచేతివాటం ఉంటారు. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమచేతి వాటం వారుంటారని సర్వేలు తెలుపుతున్నాయి. కానీ కుడిచేతివాటం అనేది సాధారణం కాబట్టి, ఎడమచేతివాటం వారికి అక్కడక్కడా అవమానాలు, విమర్శలు ఎదురవుతుంటాయి.  అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎడమచేతివాటం వారే భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరుతారని ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద ప్రముఖులుగా గుర్తింపబడిన వారిలో ఎడమచేతి వాటం వారు ఎక్కువగా ఉన్నారని చెబుతారు. దాదాపు 10 నుండి 12 శాతం మంది ఎడమచేతివాటం ప్రముఖులు ఉన్నారట. ప్రత్యేకతలు!! ఎడమచేతివాటం వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవే వారిని ఉన్నతమైన వారిగా మలుస్తాయని చెబుతారు.  వీరిలో స్వతంత్ర్యభావాలు ఎక్కువ, జ్ఞాపకశక్తి, ఏదైనా సాధించాలనే పట్టుదల, ముఖ్యంగా గొప్ప సృజనాత్మకత వీరిలో ఉంటుంది. గొప్ప లక్ష్యాలను ఏర్పరుచుకోవడమే కాదు, ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు కూడా ఎంతో పట్టుదలతో చేస్తారు. ఇంకా చెప్పాలంటే కలలు కనడం వాటిని సాకారం చేసుకోవడం వీరిలో ఉన్న గుణం. వీరు బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులను చేయగల సత్తా వీరిలో ఉంటుంది.  కళలు, భాష, సంగీతం వంటి రంగాలలో వీరు ఎక్కువ నైపుణ్యం కలిగిఉంటారట. పైన చెప్పుకున్నవన్నీ వీరిలో ప్రత్యేకలు అయితే వీరు బొమ్మలు గీయడంలో ఎడమవైపు వంపులున్న చిత్రాలు బానే గీస్తారట, కానీ కుడివైపు వంపులున్నవి గీయడానికి కష్టపడతారట. ఎడమచేతివాటం వారిలో మెదడు సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకా వీరు మానసిక రుగ్మతలతో ఎక్కువగా ఇబ్బంది పడుతారట.   వారికున్న మరొక సమస్య ఏదైనా శుభకార్యాలు పండుగలప్పుడు వారు తొందరగా ఎడమచెయ్యి వాడేస్తుంటారు. అందరూ దాన్నేదో అపశకునంగా  భావిస్తారు. ఇదే వారికి పెద్ద సమస్య.  కుడిచేతివాటం వారి కోసం తయారుచేయబడుతున్న ఎన్నో వస్తువులు ఎడమచేతివాటం వార సరిగా ఉపయోగించలేరు. ఈ కారణం వల్ల ప్రతి సంవత్సరం 2500 మంది ఎడమచేతి వాటం వారు మరణిస్తున్నారట.  ఇవీ వీరి ప్రత్యేకతలు వీరు పడే అగచాట్లు. ఇకపోతే ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు.  రాణీ లక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.  అందుకే మరి కుడి ఎడమ అయితే ఖంగారు వద్దు. పిల్లలు ఎడమచేతి వాటంగా తయారయ్యారని బెంగ వద్దు. కుదిరితే వాళ్లకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిపెట్టండి. ఏమో మీ పిల్లల పేరు ఏ ప్రముఖుల మధ్యనో చేర్చబడచ్చు.                                      ◆నిశ్శబ్ద.

ఈ మంచి అలవాట్లు మహిళలను విజయతీరాలవైపు నడిపిస్తాయి..!!

నేటికాలం మహిళలు ఇంటితోపాటు వృత్తిపరమైన పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇళ్లు, ఉద్యోగం రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో రాణిస్తున్నారు. అలాంటి ప్రతిభావంతులైన మహిళలు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మరోవైపు  వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వరిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి జీవితాల్లో విజయాలతోపాటు అపజయాలు కూడా ఎదురైనా...వాటిని ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. వారు పెట్టుకున్న లక్ష్యంలో విజయం సాధిస్తున్నారు. నేటి మహిళ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒక మహిళ విజయం సాధించిందంటే ఆమెలో ఖచ్చితంగా ఈ పది మంచి అలవాట్లు ఉంటాయి. అవేంటో చూద్దాం. 1. విజయవంతమైన మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దీని కారణంగా, వారి మనస్సు,మెదడు మధ్య సామరస్యం ఉంటుంది. దీని కోసం, అటువంటి మహిళలు తమ లక్ష్యాల నుండి తప్పుకోరు. 2.విజయవంతమైన మహిళలు సమయపాలన పాటిస్తారు. ప్రతి పనిని సమయానికి చేస్తారు. అలాగే ఆమె రోజూ ఉదయాన్నే నిద్రలేస్తారు.  విజయవంతమైన ప్రతి వ్యక్తి ఉదయాన్నే మేల్కొనే అలవాటు ఉంటుంది.  ఇది సమయాన్ని నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది. 3. విజయవంతమైన స్త్రీకి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఎలా సరిగ్గా నిర్వహించాలో తెలుసు . దీని కోసం మహిళలు తమ కుటుంబానికి పనితో పాటు సమయాన్ని కేటాయిస్తారు. అలాంటి స్త్రీలు తమ జీవితంలో ఉన్నత స్థితిని సాధిస్తారు. 4. జీవితంలో విజయం అకస్మాత్తుగా రాదు. దీని కోసం చాలాసార్లు విఫలం కావాల్సి వస్తుంది. చాలా మంది విఫలమైనప్పుడు తమ దిశను మార్చుకుంటారు. అయితే, విజయం సాధించిన మహిళలు విఫలమైనా తమ నిర్ణయాలను మార్చుకోరు. దీని కోసం, అలాంటి మహిళలు కూడా వారి జీవితంలో విజయం సాధిస్తారు. 5. విజయవంతమైన మహిళలు తమ జీవితంలో అన్ని సమయాలలో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తెలివిగా కూడా పని చేయగలరు . 6. విజయవంతమైన మహిళలు కూడా పిల్లల మాదిరిగానే ఎప్పటికప్పుడు ప్రశ్నలు అడుగుతారు. ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి ఆమె మనస్సులో ఏదైనా ప్రశ్న ఉంటే, ఆమె ఖచ్చితంగా అడుగుతుంది. అలాంటి మహిళల పాదాలను విజయం ముద్దాడుతుంది.   7.  విజయవంతమైన మహిళలు జట్టుకృషిని విశ్వసిస్తారు. దీని కోసం ఆమె ప్రజలతో మమేకమవుతుంది. టీమ్‌తో కలిసి పని చేయడం వల్ల త్వరగా విజయం సాధిస్తారు. అదనంగా, పని కూడా సులభం అవుతుంది. 8. విజయవంతమైన లేదా తెలివైన మహిళలు సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహిళలు పట్టు వదలరు. అలాగే, ఆమె రిస్క్ తీసుకోవడానికి భయపడదు. 9. తెలివైన మహిళలు దూరదృష్టి గలవారు. వారు ఎక్కువగా ఆలోచిస్తారు. దీని కోసం మహిళలు యోగా, ధ్యానం యొక్క సహాయం తీసుకుంటారు. దార్శనిక ఆలోచనలు జీవితంలో ముందుకు సాగడానికి వారిని ప్రేరేపిస్తాయి. 10. విజయవంతమైన మహిళలు కష్ట సమయాలను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. జీవితంలో సానుకూలంగా ఉండే వ్యక్తులతో కూడా ఉండేందుకు ఇష్టపడుతుంది. ఇది వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది

గూగుల్ మొదటి అడుగుకు 27వసంతాలు పూర్తీ!

గూగుల్ మనిషి రోజువారీ ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. హిస్టరీ గురించి వెతకాలా?  గూగుల్ లో సెర్చ్ చేస్తే వికీపీడియా వొస్తుంది. సినిమా సమాచారం కావాలా? గూగుల్ లో సెర్చ్ చేస్తే బోలెడు అప్డేట్స్ ఉంటాయి. అనారోగ్యానికి ఏవైనా చిట్కాలు కావాలా? గూగుల్ తల్లి మంచి మందులేవో చక్కగా చూపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, సినిమా, జోకులు, ప్రత్యేక దినాలు, చరిత్ర, చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు, గొప్ప వ్యక్తులు.. ఆఖరికి ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలి?  వంటి ప్రశ్నల నుండి.. ఎలా చచ్చిపోవాలి అనే పిచ్చి సమాధానాల వరకు అన్ని గూగులమ్మ చెబుతుంది. అయితే ఈ రోజు ప్రజలు ఇంతగా గూగులమ్మ మీద ఆధారపడటం అనేది ఒక ఏడాది, ఒక ప్రయత్నంతో జరిగింది కాదు. గూగులమ్మ ఇప్పుడు 27ఏళ్లు పూర్తీ చేసుకుంది. అసలు గూగుల్ ప్రయాణం ఏంటి? ఇది ఎలా మొదలైంది? వివరంగా తెలుసుకుంటే.. Google.com దినోత్సవం సెప్టెంబర్ 15న జరుపుకుంటారు.  గూగుల్ డాట్ కామ్ ను   ప్రారంభించిన మాతృ సంస్థ గురించి తెలుసుకుంటే గూగుల్ ప్రయాణం బాగా అర్థమవుతుంది.  గూగుల్ ప్రజల జీవితంలో పెద్ద భాగం. మొదట్లో ఇది  కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందించే బహుళజాతి సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందింది. 'గూగుల్' అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. గూగుల్ డాట్ కామ్ జనవరి 1996లో ప్రారంభమైంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని Ph.D విద్యార్థులైన  లారీ పేజ్,  సెర్గీ బ్రిన్ మెరుగైన సెర్చ్  ఇంజిన్‌ను రూపొందించడానికి పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వారు వెబ్‌సైట్‌ల మధ్య సంబంధాలను విశ్లేషించే పేజ్‌ర్యాంక్ అనే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇతర సైట్‌లకు లింక్‌ల సంఖ్య ఆధారంగా వాటి ఔచిత్యాన్ని నిర్ణయించింది. సెర్చ్  ఇంజిన్ మొదట డవలప్  చేయబడినప్పుడు దాని పేరు  “బ్యాక్‌రబ్”. ఈ పేరు ఆ తరువాత  Google గా మార్చబడింది, నిజానికి గూగుల్ అనేది  'గూగోల్' అనే పదాన్ని అక్షరదోషంలో పలకడం ద్వారా ఆవిష్కారమైంది.   గూగోల్ అనేది అతిపెద్ద సంఖ్య. ఒకటి తరువాత   100 సున్నాలను రాస్తే అది గూగోల్ అవుతుంది. ఇక Google చాలా సమాచారాన్ని అందిస్తుంది, ప్రస్తుతం   ఇంటర్నెట్‌లోని సమాచారం అంతులేనిదని. సెప్టెంబర్ 15, 1997న, పేజ్,  బ్రిన్ “ google.com ” డొమైన్‌ను నమోదు చేసుకున్నారు . 1998లో, పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించిన తర్వాత పేజ్,  బ్రిన్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని స్నేహితుని గ్యారేజీకి అనుబంధంగా ఉన్న గదిలో అధికారికంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. డిసెంబరు 1999 నాటికి Google బీటా మోడ్‌లో ఉంది.  రోజుకు దాదాపు 10,000 సెర్చింగ్  ప్రశ్నలకు సమాధానాలు లభించేవి.  2003లో, గూగుల్ తన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడు గూగుల్‌ప్లెక్స్ అని పిలవబడే చోటుకు మార్చబడింది. వాస్తవానికి ఇది కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో 40 ఎకరాల క్యాంపస్. కాలక్రమేణా వారు సైట్‌లో అనేక భవనాలను కొనుగోలు చేశారు,  వాటికి అనధికారిక పేర్లను ఇచ్చారు. క్యాంపస్‌లో క్యూబికల్స్ లేకుండా ఓపెన్ కాన్సెప్ట్ ఉంది,  ఇక్కడ  బంతులను కుర్చీలుగా ఉపయోగించారు. మెరియం-వెబ్‌స్టర్ 2006లో దాని కాలేజియేట్ డిక్షనరీకి 'గూగుల్' అనే పదాన్ని జోడించారు.  "ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందడానికి Google సెర్చ్  ఇంజిన్‌ను ఉపయోగించడం." అని ఈ డిక్షనరీలో ప్రస్థావించారు.  కంపెనీ సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందిస్తుంది. 2015లో కంపెనీ పునర్నిర్మించబడింది.  ఆల్ఫాబెట్ ఇంక్.గా మారింది.  గూగుల్ దాని అతిపెద్ద అనుబంధ సంస్థగా మారింది. ఇదీ గూగుల్ తల్లి చరిత్ర.                                                      *నిశ్శబ్ద.

డబ్బు సంపాదించే ఉపాయం చెప్పిన చాణక్యుడు..!!

చాణక్యుడి పేర్కొన్న అనేక అంశాల్లో డబ్బు ఒకటి. మన జీవితంలో డబ్బు ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు. చాణక్యుడి విధానంలో, 'ధనమే మతాన్ని అనుసరించేవాడు'. ఎవరైతే డబ్బును సరైన మార్గంలో వినియోగిస్తారో...వారు మతాన్ని కూడా మంచి మార్గంలో అనుస్తారిస్తారని తెలిపారు. చాణక్యుడు చెప్పినట్లుగా మనం డబ్బును ఎలా ఉపయోగించాలి? సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం పొందగలము. ధనం జనం పరిత్రయ: మనం సరైన మార్గంలో ధనాన్ని ఉపయోగించినప్పుడే..అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినట్లు అర్థం. తప్పుడు పనులు చేయడానికి లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి మాత్రమే ఇబ్బంది లేదు. దీనితో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మంచి మార్గంలో సంపాదించడం: మనం మంచి మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. చెడు లేదా హింసాత్మక మార్గాల ద్వారా సంపాదించిన లేదా సంపాదించిన డబ్బు మనకు సంతోషాన్ని లేదా సంతృప్తిని ఇవ్వదు. మీరు స్వచ్ఛమైన మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించాలి. కష్టపడి సంపాదించాలి: మనం ఎప్పుడూ కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించిన లేదా కష్టపడి సంపాదించిన డబ్బుతో మనం ఏ పని చేసినా, దాని నుండి మనకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి డబ్బు మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు తప్పుడు మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ, ఇది ఈరోజు కాదు రేపు మీకు సమస్య తీసుకురావడం ఖాయం. ధనభావానాం అపి స్వధర్మ నాశః మితిమీరిన కోరికలు, సంపాద...మీ స్వధర్మాన్ని నాశనం చేస్తుంది. డబ్బు సంపాదించాలన్న మితిమీరిన కోరిక అధర్మం వైపు నడిపిస్తుంది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలు తప్పవు. కాబట్టి.., డబ్బు సంపాదించాలనే మితిమీరిన కోరికను వదిలివేయడం మంచిది. ధనాని పూజ్య నరః వంటిది: అంటే ధనవంతులకు సమాజంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. డబ్బు లేదా సంపద ఉన్నవారిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తులు చాలా సులభంగా గౌరవం మరియు కీర్తి పొందుతారు. దానేన విత్తం వినీతం: వినయంతో డబ్బు సంపాదించండి. తెలివిగా ఉపయోగించుకోండి. ఇలా డబ్బును వినియోగించినప్పుడే దానికి అర్థం ఉంటుంది.  ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయడం మానేయండి.

పాజిటివ్ థింకింగ్ పవర్ ఇదే..

సానుకూలంగా ఆలోచించడం చాలామందికి చేతకాదు. ఎంతోమంది పనులు మొదలు పెట్టడం నుండి ఒకటే అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే సానుకూలంగా ఉండటం లేదా పాజిటివ్ ఆలోచనలతో ఉండటం అనేది మనిషిని కొత్తగా ఆవిష్కరిస్తుంది. కౌరవుల సైన్యం చాలా పెద్దది మేము అస్సలు యుద్దం చెయ్యము అని పాండవులు వెనకడుగు వేసి ఉంటే మహాభారత యుద్దమనేది జరిగి ఉండేది కాదు.  నాకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి, ఇక నేను ఏమీ చెయ్యలేను అనుకుని ఉంటే అంతరిక్షంలో రహస్యంగా ఉన్న కృష్ణబిళాల గురించి స్టీఫెన్ హకింగ్ పరిశోధనలు చేసేవాడు కాదు. ఇలా చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు అనుమానాలతో, సందేహాలతో  అలా గొప్పగా మారలేదు. దీని వెనుక సానుకూల ఆలోచన అని చెప్పబడే పాజిటివ్ థింకింగ్ చాలా ఉంది. పాజిటివ్ థింకింగ్ గురించి, దాని గొప్పదనం గురించి, అది మనుషుల జీవితాల్లో కలిగించే మార్పుల గురించి తెలియజెప్పే ఉద్దేశంతో ప్రతి యేడు సెప్టెంబర్ 13న పాజిటివ్ థింకింగ్  డే జరుపుకుంటారు. ఈ రోజున ఏం చేయవచ్చో, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, దీని వల్ల  కలిగే లాభాలేంటో  పూర్తీగా తెలుసుకుంటే.. పాజిటివ్ థింకింగ్.. పాజిటివ్ థింకింగ్ అనే పేరులోనే ఒకానొక సానుకూల భావన ఉంది. ఇది మనిషికి ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను కలిగించదు. చేసేపని ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించి చేస్తే ఆ ఆలోచనతోనే సగం విజయం సాధించినట్టు. పాజిటివ్ గా ఆలోచిస్తూ మనిషి చేసే ప్రయత్నాలలో మనిషి పనితీరు పరిపూర్ణంగా ఉంటుంది. వ్యక్తి తన పూర్తీ సామర్థ్యాన్ని  పనిని పూర్తీ చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి చేసేపనులలో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. అయితే ఎవరో చెప్పారని కొందరు, ఆ పని వల్ల లాభం  ఉంటుంది కాబట్టి చేయడం మంచిదని మరికొందరు,  గొప్పలు చెప్పుకోవడానికి అయిష్టంగానే మరికొందరు  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనసులో ఏ మూలో ఇష్ఠం ఉండదు కాబట్టి ఆ పనిని అంత సమర్థవంతంగా పూర్తీ చెయ్యలేరు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందు ఎలాంటి ప్రభావానికి, మరేవిధమైనా ప్రలోభాలకు లోను కాకుండా చూసుకోవాలి. మానసిక ఆరోగ్యం.. పాజిటివ్ ఆలోచన అనేది గొప్ప ఔషదమే అనుకోవచ్చు. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవారు కూడా పాజిటివ్ థింకింగ్ కారణంగా  వాటిని చాలా సులువుగా జయించగలుగుతారు. ఎంతో మంది  మృత్యు ఒడి దాకా వెళ్లి తిరిగి బయటపడుతున్నారు అంటే అది వారి సానుకూల ఆలోచన ప్రభావమే.  మనిషిని మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా దృఢంగా ఉండేలా చేయడంలో సానుకూల ఆలోచన ఎంతో గొప్పది. పాజిటివ్ గా ఉంటూ మంచినీరు తీసుకున్నా అది గొప్ప ఔషదంలా పనిచేస్తుంది. గొప్ప ఔషదాన్ని అయినా చాలా నెగిటివ్ గా తీసుకుంటే అది అస్సలు శరీరం మీద ప్రభావం చూపించదు. ఇదీ పాజిటివ్ ఆలోచనలో ఉన్న గొప్పదనం. సానుకూలమే విజయానికి  సోపానం.. ఎంత బాగా చదివినా సరే చాలామంది పరీక్ష హాలులో వెళ్లేసరికి అన్నీ మరచిపోయాం అంటుంటారు. మరికొంతమంది నేను చదివినవే వచ్చాయి కానీ అక్కడ సమాధానాలు గుర్తురాలేదు అంటారు. వీటన్నింటికి కారణం ఒకటే.. అదే పరీక్షలలో నేను చదివినవి రావేమో అనే నెగిటివ్ ఆలోచన. మనిషి మెదడు పదే పదే ఏ విషయాన్ని అయినా పదిసార్లు మననం చేసుకుంటే ఆ వలయంలో పడిపోతుంది. పరీక్షలు రాసేవారు ఎంత చదివినా, ఎంతబాగా సన్నద్దం అయినా మనసులో ఏ మూలో  నేను చదివినవి రావేమో నా అదృష్ణం ఎలాగుందో అనుకుంటే చివరికి ఆ అదృష్టం ప్రశ్నార్థకమే అవుతుంది. ఇది కేవలం పరీక్షలకు మాత్రమే కాదు. ఉద్యోగం కోసమయినా, బంధాలలో అయినా, సమాజ పరమైన విషయాలు అయినా పాజిటివ్ గా ఉన్నప్పుడే సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి.                                                         *నిశ్శబ్ద.

ప్రోత్సాహానికి కేరాఫ్ అడ్రస్ మీరే కావచ్చు…

అరేయ్ నువ్వు చేయగలవురా నీ వల్ల అవుతుంది. నీ గురించి నీకు అర్థం కావడం లేదు, హనుమంతుడికి తన బలం తనకే తెలియనట్టు.. నువ్వు కూడా ఇంతే.. ఊరికే ఎలాంటి అనుమానాలు, భయాలు పెట్టుకోకుండా నువ్వు అనుకున్నది చెయ్యి.. నీ వెంట నేనుంటా కదా… ఇలాంటి మాటలు ప్రతి మనిషి జీవితంలో ఉంటే బహుశా ఓటమి  ఎదురవ్వడం అనే సందర్భం రాదేమో.  ఓ మనిషిని ప్రోత్సహించాలన్నా, వెనక్కు లాగాలన్నా అదంతా ఇంకొక మనిషి చేతిలో ఉంటుంది. ప్రతిభ ఉండి, ఆత్మవిశ్వాసం ఉండి కూడా ఒక్కో సందర్భంలో ఇతరులు నిరాశ పరచడం ద్వారా విఫలం అయ్యేవారు చాలామందే ఉంటారు. అందుకే ప్రోత్సాహం గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.  బద్దకస్తుడిని కూడా పరుగులు పెట్టిస్తుంది. ప్రోత్సాహంలో ఉన్న గొప్పదనాన్ని, ప్రోత్సాహం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఏడు సెప్టెంబర్ 12 ను నేషనల్ ఎంకరేజ్మెంట్ డే ని జరుపుకుంటారు. దీన్ని జాతీయ ప్రోత్సాహ దినోత్సవం అని తెలుగులో పిలుస్తారు. ఈరోజు ఏం చేయవచ్చంటే.. పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం.. ప్రతి మనిషి మొదట తన ఇంటిని బాగు చేసుకుంటే ఆ తరువాత సమాజాన్ని బాగు చేయడానికి అర్హుడు అవుతాడు అని అంటారు. దానికి అనుగుణంగానే… కుటుంబ సభ్యులు, పిల్లలు, తోడబుట్టిన వారు, పెద్దలు ఇలా ప్రతి ఒక్కరూ ఏవైనా పనులలో కానీ, మరేదైనా విషయంలో కానీ జంకుతున్నా, సందిగ్ధంలో ఉన్నా వారికి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చెయ్యాలి.  దీనివల్ల వారికి ఎక్కడలేని ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. కుటుంబ సభ్యులు విజేతలు అయినా, ఎదైనా సాధించినా పరోక్షంగా అధి ఆ ఇంటి విజయం అవుతుంది. కాబట్టి పిల్లలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి. పేదవారిని, స్నేహితులను వదలొద్దు.. పేదరికం కారణంగా ప్రతిభ ఉన్నా మరుగున ఉంటున్న పిల్లలు, యువత ఎంతోమంది ఉన్నారు. అందరినీ భుజాన వేసుకోకపోయినా వారికి కాస్త ఆర్థిక సాయం, మరికాస్త ధైర్యం చెబితే ఊహించని విధంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే  తల్లిదండ్రులలో కూడా చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహితులను వైఫల్యం బాటలో వదిలేయకుండా వారిని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ముందు తోయాలి. అప్పుడు వారి విజయంలో మీరు భాగమవుతారు. కళాకారులు,  ప్రతిభ గలవారిని ప్రోత్సహించాలి.. కళను తమలో నింపుకున్నవారు కళాకారులు. కానీ చాలావరకు కళలు కడుపు నింపవు అనే మాట వాస్తవ చిత్రంగా అందరికీ కళ్లెదుటే కనిపిస్తుంటుంది. ప్రతిభ కలిగిన కళాకారులను ఎంకరేజ్ చెయ్యాలి. ఏ వర్గంలో అయినా ప్రతిభ ఉంటే వారిని చేతనైన విధంగా మాటలతోనూ, ఆర్థికంగానూ సహాయం అందించాలి.  

సనాతన హిందూమతం ఎప్పుడు ఉద్భవించిందో తెలుసా...

పవిత్ర హిందూ మతం ఎప్పుడు ఉద్భవించిందో నేటికీ చాలా మందికి తెలియదు. మీకూ తెలియకపోతే ఖచ్చితంగా ఈ కథనాన్ని చదవండి.. ప్రతి మతానికి దాని స్వంత మూలం ఉంది. కానీ హిందూ మతం మూలం లేదా ప్రారంభం గురించి ప్రజలలో చాలా తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సనాతన ధర్మం గురించి అనేక ప్రకటనలు చేస్తున్నారు. మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, నేటికీ, హిందూ మతం  మూలం ఎలా జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ నేప‌థ్యంలో స‌నాత‌న హిందూమ‌తం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. గురునానక్: సిక్కు మత స్థాపకుడు గురునానక్ 1469 ఏప్రిల్ 15న జన్మించారు. సెప్టెంబర్ 22, 1539 న ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. భారతదేశం, హిందూమతం గురు సంప్రదాయానికి చెందిన మొత్తం 10 మంది గురువులచే రక్షించాయి. గురునానక్ కాలాన్ని తీసుకుంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే హిందూ మతం ఉందని చెప్పవచ్చు. జులేలాల్: సింధ్ ప్రావిన్స్‌లోని హిందువులను రక్షించడానికి వరుండేవ్ జులేలాల్‌గా అవతరించాడు. పాకిస్థాన్‌లో జులేలాల్జీని జింద్ పీర్, లాల్షా అని పిలుస్తారు. ఇతడు క్రీ.శ.1007లో జన్మించాడు. ఈ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హిందూ మతానికి 1,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ సమయంలో పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో హిందువులు నివసించేవారు. చక్రవర్తి హర్షవర్ధన: 1,400 సంవత్సరాల క్రితం హిందూమతం: గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు 590 AD లో జన్మించాడు. 647 AD లో మరణించాడు. హర్షవర్ధన్ అరేబియాపై దాడి చేసినట్టు ప్రస్తావనలు ఉన్నాయి. కానీ అతను ఎడారి ప్రాంతంలో పట్టుబడ్డాడు. భైవపురాణంలో ప్రస్తావన ఉంది. హర్ష హయాంలో చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ వచ్చాడు. గురు గోరఖ్‌నాథ్: 1,100 సంవత్సరాల క్రితం హిందూ మతం: రాహుల్ సాంకృత్యాయన్ ప్రకారం, గొప్ప యోగి గురు గోరఖ్నాథ్ లేదా గోరఖ్నాథ్ 845 ADలో జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని గురు గోరఖ్‌నాథ్ ఆలయం 9వ శతాబ్దంలో పునరుద్ధరించబడిందని పేర్కొన్నారు. గోరఖ్‌నాథ్ చాలా కాలం జీవించాడు. అతను హిందూ మతంలోని శైవ శాఖకు చెందిన ముఖ్యమైన సాధువు. ఆదిశంకరాచార్య: 2531 సంవత్సరాల క్రితం హిందూమతం: ఆదిశంకరాచార్య హిందూమతాన్ని పునర్వ్యవస్థీకరించారు. క్రీ.శ.788లో జన్మించిన అతడు క్రీ.శ.820లో 32వ ఏట శరీరాన్ని విడిచిపెట్టాడు. కేరళలో జన్మించిన అతనిని కేదార్‌నాథ్‌లో ఖననం చేశారు. అతను హిందూ మతానికి చెందిన గొప్ప సాధువు. 2వ చంద్రగుప్తుడు : 1,650 సంవత్సరాల క్రితం హిందూమతం: చంద్రగుప్త II చక్రవర్తికి విక్రమాదిత్య అనే బిరుదు ఉంది. అతని పాలన 380 AD నుండి 412 AD వరకు కొనసాగింది. మహాకవి కాళిదాసు అతని ఆస్థాన కవి సలహాదారు.  

ఆత్మహత్యలు వద్దే వద్దు!

మనిషి ప్రాణం చాలా విలువైనది. జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించినప్పుడు, కష్టాలను, అడ్డంకులను ఎదుర్కొని విజేతలుగా నిలిచినప్పుడు మనిషిగా పుట్టినందుకు చాలా సంతోషపడతాం. కేవలం అవి మాత్రమే కాదు జీవితంలో ఎంతో సంతోషకరమైన క్షణాలలో ఉన్నప్పుడు ఫలానా వారికి పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉన్నామనో, ఈ జీవితం ఇలా సాగుతున్నందుకు మనం అదృష్టవంతులమనో అనుకుంటాం ఖచ్చితంగా. కానీ జీవితంలో చెప్పలేనంత విరక్తి వచ్చి చచ్చిపోవాలని నిర్ణయించుకుని, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే?? ఎంతో గొప్పగా జీవించాల్సిన వాళ్ళు అర్థాంతరంగా జీవితానికి ముగింపు ఇస్తే!! ప్రస్తుత సమాజాన్ని ఎంతో భయపెడుతున్న విషయం ఇదే!! ఏ విషయాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు. ఈ ఆత్మహత్యల మీద దృష్టి సారించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఆత్మహత్య చేసుకోవడం రాను రాను పెరుగుతున్న సమస్య. వీటి నమోదు సంఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమైన కథనాలు చెబుతాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రతి 40 సెకన్లకు ఒకరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.  ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 8,00,000(ఎనిమిది లక్షల) మంది ప్రజలు మరణిస్తున్నారు.  కొన్ని అంచనాల ప్రకారం ఆ సంఖ్య పది లక్షలకు దగ్గరగా ఉంది.   మరీ ముఖ్యంగా 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల వారి మరణానికి ఆత్మహత్య ప్రధాన కారణం అనే విషయం కలవరపెడుతోంది.  ప్రయత్నించే ప్రతి 40 మందిలో కనీసం ఒక్కరు అయినా చనిపోతున్నారు. మనిషి జీవించడానికి చాలా గొప్ప గొప్ప అవకాశాలు, మార్గాలు ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు. మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఎందుకు?? ఆత్మహత్యలకు ప్రధాన కారణం!! ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం ఒకటే. మందులతో బాగు చేయలేని, ఇదీ అని నిర్ధారించలేని సమస్య అది. ఏమిటా సమస్య అంటే?? మానసిక అనారోగ్యం. మానసిక ఇబ్బందులతో బాధపడేవారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరిలో అర్థం చేసుకునే ఆలోచనా స్థాయిలు తక్కువ. అతిగా ఆలోచించడం ఎక్కువ. ఈ కారణంగా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి.  ఏం చెయ్యాలి?? కౌన్సెలింగ్ ఇవ్వడం, సపోర్ట్ గా ఉండటం వల్ల  ఆత్మహత్యలను నివారించవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబంలోని వారితో ఎప్పుడూ దగ్గరగా ఉంటూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, వారికున్న సమస్యలను చెప్పుకునే స్నేహాభావాన్ని కలిగిస్తే దాదాపుగా ఆత్మహత్య అనే భావనను రానివ్వకుండా చేయచ్చు.   ఇతరులకు వారి జీవితాలకు బాధ్యత వహించడానికి, వారి జీవితానికి వారు ఇచ్చుకోవలసిన ప్రాధాన్యత, వారి మీద వారికి ఉండాల్సిన బాధ్యత మొదలైనవి గుర్తుచేయడం కూడా వారిలో ఆత్మహత్య ఆలోచనను రానివ్వకుండా చేయడానికి ఒక గొప్ప మార్గం. ఆత్మహత్య అనేది అన్ని వయసుల వారిని సమానంగా ప్రభావితం చేస్తుంది.  అందువల్ల మానసిక ఆరోగ్యం గురించి చర్చలు జరపడం చాలా ముఖ్యం, ఇతరులు వారు ఎదుర్కొంటున్న కష్ట సమయాల గురించి మాట్లాడటం వల్ల అవసరమైతే వృత్తిపరమైన లేదా మానసిక ఆలోచనలకు సంబంధించిన సహాయం పొందడం సులభం చేస్తుంది. 'టేక్ ఎ మినిట్, చేంజ్ ఎ లైఫ్' ఒక్క నిమిషం ఆగండి జీవితాన్ని మార్చుకోండి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేసిన ఒక గొప్ప వాక్యం. ఆత్మహత్యలు ఎప్పుడూ తొందరపాటుగా జరిగిపోతుంటాయి. అలాంటి సందర్భంలో ఒక్క నిమిషం ఆగి, జీవితం గురించి, భవిష్యత్తు గురించి, బ్రతకాల్సిన ఆవశ్యకత, జీవితానికి ముఖ్యమైన మార్గాలు వంటివి ఆలోచిస్తే జీవితం చెయ్యిజారిపోదనే విషయం అర్థమవుతుంది. ఆత్మహత్య నిరోధక దినోత్సవం సందర్భంగా ఈవెంట్‌లు, సమావేశాలు, సెమినార్‌లు చర్చా వేదికలను నిర్వహిస్తారు. ఆత్మహత్యల నివారణకు కొత్త విధానాలను రూపొందిస్తారు.  వ్యక్తులలో జీవితం పట్ల అవగాహనను కలిగించడానికి సాధనంగా మీడియాను ఉపయోగించవచ్చు.  మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కుటుంబం, డాక్టర్ల కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది.  సమాజ పౌరులుగా మన చుట్టూ ఉన్న వారికి మనవంతు సాయం చేయడం అనుసరించాల్సిన విషయమే!! కాబట్టి మీ వంతు మీరూ కృషి చేయండి. ఆత్మహత్యల నివారణకు తోడ్పాటు అందించండి.                                   ◆నిశ్శబ్ద.

అంకెలతో మాయాజాలం.. సుడోకు పుట్టుక,చరిత్ర తెలుసా..

ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  

శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు. ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి. మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు. గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి. కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు. శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.                                                 *నిశ్శబ్ద.

సర్వేపల్లి రాధాకృష్ణన్.. ఈ విలువైన ఆలోచనలు జీవితానికి సరైన మార్గాన్ని చూపుతాయి!

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. ఈ రోజు దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కి అంకితం చేయబడింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబరు 5, 1888న తమిళనాడులోని చిత్తూరు జిల్లాలోని తిరుటని గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నప్పటి నుంచి మతపరమైన ఆసక్తి ఉన్న వ్యక్తి. అతను మతపరమైన పనిలో లోతైన ఆసక్తిని కలిగి ఉన్నారు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి అత్యున్నత విద్యను అభ్యసించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్నతనం నుండి చదవడం, రాయడం పట్ల మక్కువ కలిగి ఉన్నారు. వివేకానంద ఆలోచనలచే బాగా ప్రభావితమయ్యారు. ఆయన పుట్టిన రోజున ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆయన ఆలోచనలు నేటికీ సంబంధించినవి. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆలోచనలను అనుసరించడం ద్వారా ఏ వ్యక్తి అయినా తన జీవితంలో విజయం సాధించగలడు. రండి, ఆయన అమూల్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. రాధాకృష్ణన్  విలువైన ఆలోచనలు: 1.కాలక్రమానుసారం వయస్సు లేదా యవ్వనంతో సంబంధం లేదు. మనం భావించేంత చిన్నవారం లేదా పెద్దవాళ్లం. మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ముఖ్యం. 2. ఒక మనిషి రాక్షసుడిగా మారితే అది అతని ఓటమి, ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయితే అది అతని అద్భుతం. మనిషి మనిషిగా మారితే అది అతని విజయం. 3. సనాతన ధర్మం కేవలం విశ్వాసం కాదు. ఇది తర్కం, అంతర్గత స్వరం కలయిక, ఇది కేవలం అనుభవించవచ్చు, నిర్వచించబడదు. 4. ఒక వ్యక్తి యొక్క చేతన శక్తుల వెనుక ఆత్మ ఎలా ఉంటుందో, అలాగే పరమాత్మ ఈ విశ్వం యొక్క అన్ని కార్యకలాపాల వెనుక అనంతమైన ఆధారం. 5.దేవుడు మనందరిలో జీవిస్తున్నాడు, అనుభూతి చెందుతాడు. కాలక్రమేణా అతని లక్షణాలు, జ్ఞానం, అందం, ప్రేమ మనలో ప్రతి ఒక్కరిలో వెల్లడవుతాయి. 6.పుస్తక పఠనం మనకు ఏకాంతాన్ని అలవాటు చేస్తుంది. నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. 7. విభిన్న సంస్కృతుల మధ్య వారధిని నిర్మించడానికి పుస్తకాలు సాధనం. 8. మీరు దేనిని విశ్వసిస్తారు. ప్రార్థిస్తారు. మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. 9. వ్యక్తి (విద్యార్థి) ఊహాత్మకంగా అలాగే ఆరోగ్యంగా, నమ్మకంగా ఉండాలి. ఇది అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. 10.జీవితాన్ని దుర్మార్గంగా చూడటం,  ప్రపంచాన్ని గందరగోళంగా చూడటం తప్పు.

ఉపాధ్యాయ దినోత్సవం.. జ్ఞానప్రదాతకు నీరాజనం..

ఉపాధ్యాయుడు  జ్ఞాన జ్యోతిని వెలిగించి మూర్ఖత్వపు పొరను తొలగిస్తాడు.  నేటికాలం పాఠశాలలో ఉపాధ్యాయులు అయినా, ఒకప్పుడు గురుకులాలలో విధ్యను బోధించే గురువులు అయినా, మంచి చెడులు చెప్పే తల్లిదండ్లులు, అవ్వతాతలు, ఆత్మీయులు, ఆప్తులు అందరూ గురుసమానులే.  అయితే పాఠశాలలో విద్యను బోధించిన ఉపాద్యాయుల గౌరవార్థం ఉపాద్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జరుపుకుంటారు.  ఇదే రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  జన్మదినం కూడా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన కృషికి, ఆయన సాధించిన  విజయాలకు గుర్తుగా  ప్రతి సంవత్సరం భారతదేశమంతటా  జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోబడుతుంది. సెప్టెంబరు 5, 1888న జన్మించిన డాక్టర్ రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా పనిచేశారు.  ఈయన స్వయానా  పండితుడు, తత్వవేత్త,  భారతరత్న అవార్డు గ్రహీత కూడా.  నిరుపేద తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణన్ తన విద్యాభ్యాసమంతా స్కాలర్‌షిప్‌ల ద్వారానే పూర్తి చేశారు.  తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని సాధించాడు. 1917లో 'ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్' అనే పుస్తకాన్ని రచించాడు.  1931 నుండి 1936 వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్‌గా,  1939లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) వైస్-ఛాన్సలర్‌గా కూడా పనిచేశాడు. అసలు  ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు? మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయన  సమకాలీన భారతదేశంలోని ప్రముఖ రచయితలలో ఒకరు.  సైద్ధాంతిక, వేదాంత, నైతిక, బోధనాత్మక, మతపరమైన, జ్ఞానోదయం కలిగించే విషయాల నుండి ప్రారంభించి విభిన్న విషయాలపై గణనీయమైన కృషి చేసాడు. ఆయన ఎన్నో ప్రాముఖ్యత కలిగిన,  గుర్తింపు పొందిన పత్రికలలో లెక్కలేనన్ని వ్యాసాలను వ్రాసాడు. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5, 1962న ఆయన 77వ జన్మదినమైన రోజున జరుపుకున్నారు.  ఈయన  ఎడిఫికేషన్  న్యాయవాది,  విశిష్ట దూత, విద్యావేత్త  అన్నింటికంటే గొప్ప ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ 1962లో భారత రాష్ట్రపతి అయ్యాడు. ఆయన  స్నేహితులు,  విద్యార్థులు కొందరు ఆయనను సంప్రదించి  సెప్టెంబర్ 5న తన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. దీనికి ఆయన స్పందిస్తూ, "నా పుట్టినరోజును నిష్కపటంగా పాటించే బదులు, సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా పరిశీలిస్తే అది నాకు గర్వకారణం." అని చెప్పారు. దీంతో సెప్టెంబర్  5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. రాధాకృష్ణన్ గారి అభ్యర్థన  ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న  ఆప్యాయతను, ఆ వృత్తి మీద ఆయనకున్న అంకితభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అప్పటి నుండి భారతదేశం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఒక దేశం  భవిష్యత్తు  ఆ దేశంలో పిల్లల చేతుల్లో ఉంటుంది. అలాంటి పిల్లలను  మార్గదర్శకులుగా భారతదేశ విధిని రూపొందించే భవిష్యత్తు నాయకులుగా ఉపాధ్యాయులు మాత్రమే తయారుచేయగలరు . జీవితంలో ఉపాధ్యాయులు పోషించే సవాళ్లు, కష్టాలు,  ప్రత్యేక పాత్రలను గుర్తించడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ప్రైమరీ స్కూల్స్, మిడిల్ స్కూల్స్,  సెకండరీ స్కూల్స్‌లో పనిచేస్తున్న ఉత్తమ  ఉపాధ్యాయులకు  ఈ అవార్డులు అందించబడతాయి.  ఇక వివిధ పాఠశాలలో కూడా ఉపాద్యాయుల  గౌరవార్థం సభలు, సన్మానాలు, విద్యార్థులు చెప్పే కృతజ్ఞతల వేడుకలతో  ప్రతి పాఠశాల ప్రతి కళాశాల  కళకళలాడిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కోసం జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుకు  కృతజ్ఞతలు చెప్పడం వారి కనీస కర్తవ్యంగా భావించాలి.                                                           *నిశ్శబ్ద.

భయాల స్వరూపాన్ని తెలిపే విశ్లేషణ!!

మనిషిని పిరికివాడిగా చేసేది, లక్ష్యాలకు దూరం చేసేది భయమే. మన భయాలు అర్థరహితం అని చెప్పేందుకు ఓ ప్రయోగం ఉంది. ఓ తరగతిలో టీచర్ చేసిన ప్రయోగం అది. కుర్చీల్లో కూర్చున్న విద్యార్థులను అందరినీ లేచి ఓ వైపు వచ్చి నిలబడమన్నాడు. ఆపై అందరినీ మరో వైపు కు పొమ్మన్నాడు. అడ్డుగా ఉన్న కుర్చీలను దాటుకుంటూ, ఆ వైపు చేరారు విద్యార్థులు. మళ్లీ ఈ వైపు రమ్మన్నాడు టీచర్. అయితే ఈ సారి విద్యార్థుల కళ్లకు గంతలు కట్టాడు. ఆపై నిశ్శబ్దంగా, గదిలో ఉన్న కుర్చీలు తీయించేశాడు. ఇప్పుడు మరో వైపు రమ్మన్నాడు. ఒక్క విద్యార్థి కూడా కదలలేదు. "దారిలో కుర్చీలు, బల్లలు అడ్డుగా ఉన్నాయి. కళ్లకు గంతలు కట్టారు. వాటిని దాటుతూ ఆ వైపు రావటం కష్టం" అన్నారు. చివరికి ఓ విద్యార్థి ధైర్యంగా ముందుకు వచ్చాడు. తడబడుతూ, లేని టేబిళ్ల కోసం వెతుకుతూ అడుగులు వేయటం ఆరంభించాడు. అతడి వల్ల మరి కొందరు ముందుకు వచ్చారు. అయితే, చేతికి ఏమీ తగలకపోవటంతో సందిగ్ధంలో పడి సగంలో ఆగిపోయారు. అన్ని సందిగ్ధాలను మించి, లేని అడ్డంకులను దాటుకుంటూ, అడ్డేమీ లేదని నిర్ధారించుకుంటూ ఒక విద్యార్థి గమ్యం చేరాడు. ఇదీ మనలో నాటుకుపోయిన భయాల స్వరూపం! అక్కడెమీ లేకున్నా లేని అనుమానాలతో ఏదో ఉందని తమని తాము మభ్యపెట్టుకునే వారు చాలామంది. మనం ఏదైనా పని సాధించాలనుకోగానే ముందుగా సందేహాలు ముసురు కుంటాయి. ఆపై అడ్డంకులు గుర్తుకు వస్తాయి. దారిలోని అవరోధాలను స్మరిస్తాం. దాంతో అడుగు ముందుకు వేయం. ఆలోచన ఉంటుంది కానీ అది ఆచరణలోకి రాదు. ఒకవేళ ఆచరణ ఆరంభించినా, మొదటి ప్రతి బంధకంలోనే వెనక్కు తిరుగుతాం. ఎవరైతే ఆలోచనను ఆచరణలో పెట్టటమే కాదు, ప్రతిబంధకాలన్నీ ఊహాత్మకమైనవే తప్ప నిజమైనవి కావు అని గ్రహించి గమ్యం వైపు సాగిపోతారో, వారు తమ గమ్యం చేరుతారు లక్ష్యాన్ని సాధిస్తారు. అందుకే మన పూర్వికులు మనుషులను మూడు రకాలుగా వర్గీకరించారు. 'ఆరంభించరు నీచమానవులు' అన్నారు.. ఎవరైతే ఏదైనా పని చేయాలనుకోగానే, రకరకాల అవరోధాలను ఊహించి, అడ్డంకులను చూసి భయపడుతూ పని ఆరంభించనే ఆరంభించరో వారు అధమస్థాయి మానవులు. ప్రగల్భాలు పలుకుతూ, తాము చేయగల పనులు సాధించగల గొప్ప లక్ష్యాల గురించి మాటలు మాట్లాడతారు తప్ప చేతల దగ్గరకు వచ్చేసరికి అడుగు ముందుకు పడదు. తాము అడుగు ముందుకు వేయకపోవటమే కాదు ఇతరులనూ అడుగు ముందుకు వేయనీయరు వీరు. అందుకే వీరు నీచమానవులయ్యారు. ఇక్కడ 'నీచం' అంటే 'చెడు' అని కాదు. 'నీచులు' అంటే నేరస్థులు, హంతకులు, మోసగాళ్లు కారు. వారి కన్నా తక్కువస్థాయి వారు వీరు. ఎందుకంటే ప్రతివ్యక్తికీ కర్తవ్యపాలన తప్పని సరిగా పాటించవలసిన ధర్మం అని భగవంతుడు నిర్దేశించాడు. అది సాధించదగ్గదా, అందుబాటులో ఉన్నదా అన్నది కాదు ముఖ్యం. కర్తవ్య నిర్వహణ ముఖ్యం. అటువంటి కర్తవ్యనిర్వహణను విస్మరించే వారంతా నీచులే. వారు ధనవంతులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు. నాయకులు కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. స్వధర్మాన్ని పాటించకుండా, కర్తవ్యనిర్వహణను విస్మరిస్తే వారు నీచులే అవుతారు. ఇలా మనుషుల్లో మొదటి రకం వారు నీచులుగా గుర్తించబడ్డారు.                                     ◆నిశ్శబ్ద.

ఈ రెండు తప్పులు చేస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు!

ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. 1. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. 2. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు  లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు. 

మనుషుల్లో దేవుడు కావాలంటే.. మీరు ఇలా ఉండాలి..

కొన్ని సార్లు ముఖ పరిచయం కూడా లేనివారు మనకి సహాయం చేస్తే ఆ సమయంలో దేవుడిలా వచ్చి సాయం చేసారు అంటాం. వాళ్ళు చేసేది చిన్నదే అయినా ఆ సందర్భంలో చాలా ఊరట ఇస్తుంది.   బస్ లో అవసరమైన చిల్లర ఇవ్వడం కూడా కావచ్చు,  వృద్ధురాలిని రోడ్డు దాటించడం, ఇంటర్వ్యూకి లేటవుతుందని కంగారుపడుతున్న వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో రోజువారి జీవితంలో చిన్నవి అనుకుని ఒకరు చేస్తే అది ఆ సమయంలో  ఎదుటివారి  జీవితంలో సంతోషాన్ని నింపవచ్చు. ఏమీ ఆశించకుండా  ఇలా సాయం చేసేవాళ్ళను దేవుడితో సమానంగా పోలుస్తాం.  మనుషుల్లో దేవుడని స్తుతిస్తాం. కేవలం ఇలా  అనుకోవడమే కాకుండా ఇలా మనుషుల్లో కనిపించే దేవుళ్లను తలచుకుంటూ, వారికి కృతజ్ఞతలు  చెప్పుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజును విదేశీయులు ఏర్పాటు చేసుకున్నారు. మంచి ఎవరు చెప్పినా వినాలి అన్న చందాన, మనుషులలో దేవుళ్లను స్మరించుకోవడానికి ఏ దేశాల వారైనా అర్హులే. ఇది కేవలం ఇతరులను తాము తలచుకోవడమే కాదు, తమ మంచితనంతో, మానవత్వపు హృదయంతో అందరూ తమ గురించి గొప్పగా చెప్పుకునే దిశగా ప్రతి ఒక్కరూ జీవించవచ్చు.    ప్రతి సంవత్సరం ఆగస్టు 22వ తేదీని "బీ యాన్ ఏంజెల్ డే " గా జరుపుకుంటారు. వేరొకరికి మంచి చేయాలనే పాజిటివ్ థింకింగ్ పెంచడమే ఈ రోజు ఉద్దేశం. ఇతరులకు మంచి చేయాలని సంకల్పించే ఈ రోజుకి ఒక చరిత్ర కూడా ఉంది. ఏ దేశమయినా, ఏ మతమైనా దేవుడు తప్పనిసరి. ప్రతి మతంలోనూ కొందరు శక్తివంతమైన వ్యక్తులుంటారు. వీరు స్వయానా ఆ దేవుడి ఆశీర్వాదం పొందినవారిగా గుర్తింపబడతారు. వీరిని దైవాంశ సంభూతులుగానూ, దేవదూతలుగానూ సంభోధిస్తారు.  దేవుడి ఆదేశాల మేరకు మనుషులకి సహాయం చేయడానికి మానవ జన్మ ఎత్తారని చెబుతుంటారు.  విదేశీయుల నమ్మిక ప్రకారం రెక్కలతో ఆకాశంలో ఎగురుతున్న దేవదూత వారికి ఎంతో మంచి చేస్తుందని నమ్ముతారు.  మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లతో పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ ఫ్రెంచ్ దళాలు అక్కడ దేవదూతల్ని చూసినట్టు చెప్పేవారు.   రెవరెండ్ జేన్ హోవర్డ్ ఫెల్డ్ మెన్ అనే మహిళ దేవదూతలు ఉన్నారని చాలా బలంగా నమ్మేది. దేవదూతలు తనను ప్రభావితం చేశారని ఆమె స్వయంగా చెప్పింది.  ఇందుకోసమే ఆమె 27 సంవత్సరాల క్రితం ప్రజలు చేసే చిన్న చిన్న సహాయాలను  ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరూ దేవదూతలుగా మారవచ్చనే అర్థం ప్రపంచానికి చాటి చెబుతూ ఈ రోజును మొదలుపెట్టింది. ఇన్నాళ్లు దీనికి పెద్ద ప్రాముఖ్యం లేదు కానీ  సోషల్ మీడియా ప్రభావం కారణంగా దీని గురించి ప్రజలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎంతోమంది ఈ రోజుకు ప్రాముఖ్యం ఇస్తున్నారు.   కొన్ని సమయాల్లో మనం చేసే చిన్న సాయం ఎదుటివారి మూడ్ ని మార్చేయవచ్చు. వాళ్ళకి మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంది అనే నమ్మకాన్ని కలిగించవచ్చు. ఒక్కోసారి డబ్బు సాయం చేయలేకపోయినా కష్టాల్లో ఉన్న వారికి చిన్న ఓదార్పు,  మనస్ఫూర్తిగా ఒక నవ్వు కూడా ఎంతో ధైర్యం ఇస్తుంది. మనం చేస్తే తిరిగి వాళ్ళు చేస్తారని ఆశించకుండా చేసే సహాయం  మనిషి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ రోజు ఏం చేయొచ్చంటే.. ఈరోజు వేరొకరికి సహాయం చేయడమే కాదు. చాలా రోజులుగా వేరొకరి మీద ఉన్న కోపాన్ని మరిచిపోవడం, వాళ్లు చేసిన తప్పులను క్షమించేయడం కూడా చేయొచ్చు.  అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. అలాగే మనకి రోజువారి పనుల్లో సహాయం చేసే ఎంతోమందికి ఒక చిన్న థాంక్స్ చెప్పొచ్చు. అది వాళ్ళలో మీ పట్ల మంచి అభిప్రాయాన్ని పెంచడంతో పాటు, వాళ్ళు మీ కోసం చేసే పనులు మరింత ప్రేమగా చేస్తారు. కేవలం బయటివారికే కాదు.. ఇంట్లో  పిల్లలకి హోంవర్క్ లో హెల్ప్ చేయడం,  లేదా భాగస్వామికి నవ్వుతూ ఒక గులాబీ పువ్వు ఇవ్వడం ఇద్దరి మద్యా ఉన్న చిన్న చిన్న అపార్థాలను కూడా తొలగిస్తుంది. ఇరుగు పొరుగు వారి విషయంలో ఇగోకు పోవడం, గొడవ పడటం ఆపి  వారిని మనసారా పలకరించవచ్చు. మీకు సమయం ఉంటే దగ్గరలో ఉన్న అనాధాశ్రమంలో ఉన్న పిల్లల్ని కలిసి కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. ఇవన్నీ చేయలేకపోయినా కనీసం ఒక మొక్కని నాటొచ్చు. మీరు నాటే మొక్క ఎప్పుడూ మీకు అనుబంధమై ఉంటుంది. సరిగ్గా గమనిస్తే అది కూడా మీతో సంభాషిస్తున్నట్టే ఉంటుంది.  ఇది చాలు కదా. ఒక మనిషిని మనిషిగా ఉంచడానికి. వేరొకరి దృష్టిలో  గొప్ప వ్యక్తిగా ఉంచడానికి.

మీరు విజయవంతమైన వ్యక్తి కావాలంటే ఈ లక్షణాలు మీలో ఉండాలి!

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతి సలహా మానవ జీవితానికి ఉపయోగపడుతుంది. జీవితంలో విజయం సాధించాలనుకునేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవద్గీత ప్రకారం విజయం సాధించాలంటే ఏయే విషయాలను గుర్తుంచుకోవాలి..? శ్రీమద్ భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటి. ఈ గీతలో శ్రీకృష్ణుని బోధనలు వివరించాయి. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన కొన్ని ఉపదేశాలను భగవద్గీతలో ప్రస్తావించారు. గీతలో ఇవ్వబడిన బోధనలు నేటికీ ఉన్నాయి. భగవద్గీతలో పేర్కొన్న సూత్రాలను మన జీవితంలో అలవర్చుకున్నట్లయితే ఎంతో పురోగతిని సాధించవచ్చు. శ్రీమద్ భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు విజయం సాధించేందుకు  అనేక మార్గాలను పేర్కొన్నాడు. భగవద్గీత ప్రకారం, మనం కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా అందులో విజయం సాధించవచ్చు. ఆ భగవద్గీత బోధనలు చూద్దాం.. పని మీద నమ్మకం ఉండాలి: శ్రీమద్ భగవద్గీత ప్రకారం, ఫలాన్ని ఆశించకుండా పని చేసేవాడు జీవితంలో విజయం సాధిస్తాడు.  ఉద్యోగంలో విజయం సాధించాలంటే, మీ పనులపై దృష్టి పెట్టాలి. తన మనస్సులో తన చర్యలతో పాటు ఇతర ఆలోచనలను తెచ్చేవాడు తన లక్ష్యాలను ఎప్పటికీ సాధించలేడు. పనిలో ఎటువంటి సందేహం ఉండకూడదు: భగవద్గీత ప్రకారం, ఒక వ్యక్తి తన చర్యలను ఎప్పుడూ అనుమానించకూడదు. ఈవిధంగా చేయడం వల్ల ఆ వ్యక్తి తన నాశనాన్ని తానే కోరుకుంటాడు. మీరు విజయం సాధించాలనుకుంటే,మీరు చేపట్టిన పనిని ఎలాంటి సందేహం లేకుండా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయండి. అప్పుడే మీరు విజయపథంలో మందుకు దూసుకెళ్లుతారు. మనసు అదుపులో ఉండనివ్వండి: ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే మనసుపై నియంత్రణ చాలా ముఖ్యం అని భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. పని చేస్తున్నప్పుడు, మీ మనస్సు ప్రశాంతంగా  ఉండాలి. కోపం తెలివిని నాశనం చేస్తుంది. అది పనిని పాడు చేస్తుంది. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అతిగా అనుబంధం ఉండకూడదు: భగవద్గీత ప్రకారం, ఒక మనిషి తన ఆస్తిలో దేనితోనూ అతిగా అనుబంధించకూడదు. ఈ అనుబంధమే మనిషి కష్టాలకు, వైఫల్యాలకు దారి తీస్తుంది. మితిమీరిన అనుబంధం ఒక వ్యక్తిలో కోపం, విచారం యొక్క భావాలను సృష్టిస్తుంది. ఈ కారణంతో వారు తమ పనిపై  మనస్సును కేంద్రీకరించలేరు. అందుకే మనిషి మితిమీరిన అనుబంధానికి దూరంగా ఉండాలి. భయాన్ని వదిలించుకోండి: శ్రీ కృష్ణుడి ప్రకారం, ఏదైనా పనిలో విజయం సాధించాలంటే, ముందుగా మనలోని భయాన్ని పోగొట్టుకోవాలి. ఈ పాఠాన్ని చెబుతూ, శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో భయం లేకుండా పోరాడమని చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి గురించి ఇలా చెప్పాడు. ఓ అర్జునా... యుద్ధంలో మరణిస్తే స్వర్గం, గెలిస్తే భూరాజ్యం  లభిస్తుంది. కాబట్టి మీ మనసులోని భయాన్ని వదిలించుకుని ముందుకు సాగుతే విజయం మీదే అవుతుంది.

పెద్దలంటే భారం కాదు బాధ్యతని చాటి చెప్పే సీనియర్ సిటిజన్స్ డే!

వృద్ధాప్యం.. ప్రతి మనిషికి తప్పని దశ.  మనిషికి అంతిమ దశ కూడా ఇదే.. ఇక జీవితం ముగింపుకు వచ్చిందని, వృద్దులు కాటికి కాళ్ళు చాపుకున్నవారని చాలామంది అర్థం చేసుకుంటూ ఉంటారు.  బాల్యం, కౌమరం, యవ్వనం, నడివయసు ఎలాంటివో వృద్ధాప్యం కూడా అలాంటిదే. కానీ వృద్ధులను చాలామంది చిన్న చూపు చూస్తుంటారు, శక్తి కోల్పోయి, బిడ్డల మీద ఆధారపడే  నిస్సహాయులుగా ఎంతోమంది వృద్దులు ఈ సమాజంలో బ్రతుకు  వెళ్లదీస్తున్నారు. తమ జీవితాన్ని త్యాగం చేసి బిడ్డలకు జీవితాన్నిచ్చిన వృద్ధుల గురించి ఈ సమాజం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి  పెద్దవారి కోసం, వారి బాగోగుల గురించి చర్చించేందుకు ఒక ప్రత్యేక రోజు ఉండటం నిజంగా సంతోషించాల్సిన విషయం.    ప్రపంచ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ డే ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదీన జరుపుకుంటారు. ఈ సీనియర్ సిటిజన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక చరిత్ర ఏంటి  తెలుసుకుంటే.. వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే ని మొదటి సారి 1988లో జరుపుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఆగస్టు  21ని  సీనియర్ సిటిజన్స్ డే గా అధికారికంగా ప్రకటించారు.  జీవితాంతం తన వారి కోసం జీవించి, చివరి దశలో కూడా తమ అనుభవాలు,  జ్ఞానంతో మంచి భవిష్యత్తును ముందు తరాలకు  అందించే వృద్ధులు సురక్షితంగా, గౌరవంగా బ్రతకడానికి కావలసిన పరిస్థితులు ఉండాలని రోనాల్డ్ రీగన్ కోరుకున్నారు.  కానీ జీవితంలో పసిబిడ్డగా మొదలుపెట్టి కౌమారం, యవ్వనం, నడివయసు నుండి పండిపోయిన వయసులో నిండైన అనుభవాలు, జ్ఞానం సంపాదించిన ప్రతి మనిషి తన జీవితంలో ఉద్యోగ బాధ్యతల నుండి రిటైర్మెంట్ అయితే తీసుకోగలుగుతున్నాడు.  కానీ  ఆ అవసాన దశలో ఆ వ్యక్తి జీవితం నిజంగానే విశ్రాంతిగా ఉంటోందా? ఈ ప్రశ్న వేసుకుంటే చుట్టూ ఎంతో మంది వృద్ధుల జీవితాలు సమాధానాలుగా కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా మంది పెద్దవారు రిటైర్మెంట్ తర్వాత  మనవళ్ళను , మనవరాళ్ళను చూసుకోవడంలోనూ, లేదా ఉద్యోగస్థులైన పిల్లల బాగోగులు చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇక ఆడవారైతే ఉద్యోగం నుండి విశ్రాంతి లభించినా ఇంటి పనులతో క్షణం విశ్రాంతి లేకుండా జీవిస్తున్నారు. మరికొందరు పిల్లల ప్రేమాభిమానాలు దొరకక ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకొందరు పెద్దవారు తమ పిల్లలు పట్టించుకోక వదిలేస్తే, పొట్టకూటి కోసం  శక్తికి మించిన పనులు చేసుకుంటూ బ్రతుకు వెళ్లదీస్తున్నారు. దగ్గరగా ఉన్నప్పుడు చాలామందికి పెద్దల విలువ తెలియదు. వారు చేజారిపొక ముందే పిల్లలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు, తమ పిల్లల కోసం చేసే పనుల్ని భారంగా కాక బాధ్యతలా పంచుకుంటారు. మరి పిల్లలు వారికి అవసరమైన సమయంలో నిజంగానే  చేతిని అందిస్తున్నారా?. అని ప్రశ్నించుకోవలసిన సమయమిది. వృద్ధాప్యం తెచ్చిన నిస్సహాయత వాళ్ళని మన దృష్టిలో నిరుపయోగంగా మార్చేస్తుంది. వారి పనులు కష్టంగా మారిపోతుంటాయి. కానీ వృద్ధులు, పిల్లలు ఒకలాంటి వారేనని అంటారు.  చిన్నతనంలో  అమ్మానాన్న పిల్లలకు చేసే పనుల్లో ఎక్కడా విసుగు ఉండదు. పైగా ఆ పనులు చేయడంలో సంతృప్తిని అనుభవిస్తారు. అదేవిధంగా పెద్దలకోసం ఏదైనా పని చేస్తే అది పిల్లల బాధ్యత అనే విషయం గుర్తించాలి.   చాలమంది పెద్దలు పిల్లల దగ్గర   సహాయం తీసుకోవడానికి మొహమాటపడుతుంటారు. ఇక పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన కూతురు నుండి తమ కష్టం చెప్పడానికి కూడా ధైర్యం చేయరు. కానీ కూతుళ్ళు అయినా, కొడుకులు అయినా తల్లిదండ్రుల గురించి, అలాగే అత్తమామల గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ  "మేమున్నాం. మీకేం కాదు" అనే భరోసా ఇవ్వగలగాలి.  కనీసం ఒక్కరోజు లేదా కనీసం ఒక్క గంట వాళ్ళతో మనసారా నవ్వుతూ మాట్లాడాలి. అది  తల్లితండ్రులు కావచ్చు. లేదా దగ్గర వ్యక్తులు అయిన తాతా, బామ్మలు కావచ్చు. ఖాళీ సమయంలో నెలకి ఒక్కసారయినా వాళ్ళతో మనసు పంచుకోవడం అలవాటు చేసుకోవాలి.  వాళ్ళు కుటుంబ బాధ్యతల్లో పడి చేయలేకపోయిన పనులు చేయడానికి  సహాయం చెయ్యచ్చు. హాబీగా చేయాలనుకుని, నేర్చుకోవాలని కుదరక ఆగిపోయిన పనులు ఈ వృద్దాప్యంలో నేర్చుకోవడానికి సపోర్ట్ చెయ్యడం  వారి వృద్ధాప్య కాలం సజావుగా గడిచిపోవడానికి సహకరిస్తుంది.  అసలు ఈ సీనియర్ సిటిజన్స్ డే ఉద్దేశం  వృద్దులకు  ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగించడం. వారు తమ చివరి రోజుల్లో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి  ప్రభుత్వం ఇస్తున్న వనరులు గురించి తెలిసేలా చేయడం. పిల్లల కోసం జీవితంలో ఎన్నో వదులుకుని పిల్లల్ని పెద్ద చేసిన  తల్లితండ్రులు వృద్దాప్యంలో అదే పిల్లల కారణంగా బాధపడకుండా ఉండేలా చేయడం. ఈ విషయాలను వృద్దులకు తెలియజేయడమే కాదు, ప్రతి ఇంట్లో వృద్ధుల గురించి ఆ కుటుంబం వారు ఆలోచించి, వారిని సంతోషంగా ఉంచాలి. ఒకప్పుడు వారి సమయాన్ని లాక్కున్న పిల్లలు, తిరిగి వారికోసం సమయాన్ని కేటాయించాలి. అప్పుడే వృద్ధుల జీవితం భారంగా కాకుండా అనుభవాల ఫలాలను మోస్తున్న నిండు పండ్ల చెట్టులా అందరికీ ఫలాలను అందిస్తుంది.                                           *నిశ్శబ్ద.

విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు ఉండాలి..!

ఆచార్య చాణక్య ప్రముఖ దౌత్యవేత్త, విజయవంతమైన ఆర్థికవేత్త. తన జీవిత అనుభవాల నుంచి చాణక్యుడి విధానాన్ని రూపొందించాడు. దీనిలో మీకు మెరుగైన జీవితం, విజయాన్ని సాధించడానికి కొన్ని నియమాలు పేర్కొన్నారు. దీని వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి ఈ సూత్రాలను అనుసరించి ఎంతో మంది ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నేడు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా కొనసాగుతున్నారు.  మీరు కూడా విజయవంతమైన వ్యాపారవేత్త కావాలనుకుంటే, ఆచార్య చాణక్య చెప్పిన ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 1. విజయం కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాలి: ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, మీరు మీ వ్యాపారంలో విజయం సాధించాలంటే, మొదట మీరు రిస్క్ తీసుకునే ధైర్యం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు సర్వసాధారణం. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. 2. ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి: ఆచార్య చాణక్య  వ్యాపారాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం ఆధారంగా... వ్యాపారానికి సంబంధించిన కొన్ని లక్షణాలను ప్రజలకు నేర్పించే ప్రయత్నం చేశాడు. మంచి వ్యాపారవేత్త ప్రపంచంలోని ఏ మూలలోనైనా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పారు. అతను లొకేషన్ ఎంపికపై పని చేసే సాహసం చేయకూడదు. ఏ ప్రదేశమైనా పనిచేసి జయిస్తాడన్న ఆశ ఉండాలి. అలాంటి వ్యవస్థాపకులు తమ పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు. 3. ప్రవర్తన చాలా ముఖ్యం: వ్యాపారవేత్తకు ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి ఉంటే.. వ్యాపార రంగంలో త్వరగా విజయం సాధిస్తాడు. ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు మాటలు నియంత్రణలో ఉండాలి. ఎదుటివారు చెప్పేవిషయాలను అర్థం చేసుకోవాలి. అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోవాలి. విషయాలు విని అర్థం చేసుకున్న తర్వాత స్పందించే వ్యక్తి ఖచ్చితంగా తాను చేస్తున్న వ్యాపారంలో విజయం సాధిస్తాడు.  అందుకే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉండటానికి ప్రసంగంలో మధురంగా ఉండటం.. ప్రసంగాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉన్న ఏ వ్యవస్థాపకుడు లేదా వ్యాపారవేత్త తప్పనిసరిగా అతని పరిశ్రమ లేదా వ్యాపారంలో అభివృద్ధిని పొందుతారు. మీరు కూడా విజయవంతమైన వ్యవస్థాపకులు కావాలనుకుంటే, ఈ లక్షణాలన్నింటినీ మీలో నింపుకోండి.

భార్యాభర్తల బంధాన్ని బిందాస్ గా మార్చే బ్యూటిఫుల్ డే..

ప్రేమ మన తెలుగు సినిమాల్లో, కథల్లో ఎంతో అందంగా చిత్రించబడుతూ ఉంటుంది. ఆ ప్రేమకి సరైన భాష్యం ఇద్దరు వ్యక్తులు ఒక్కటిగా మారడం. మనకి  వాలెంటైన్స్ డే గురించి తెలుసు. ప్రేమికుల ఆరాటం కూడా తెలుసు. ఆ ప్రేమ ఘాడతను వర్ణించడానికి మాటలు చాలవు. కానీ ఈ ప్రేమ ఒకటైనా మనుషులు మాత్రం సమాజం దృష్టిలో వేరుగానే ఉంటారు. ఈ ఇద్దరూ ఒకటైతే ఆవిష్కారమయ్యేదే దాంపత్య బంధం. భార్యాభర్తలను కపుల్స్ అని పిలవడం పరిపాటి. భార్యాభర్తలకు పెళ్లిరోజు తప్ప ఇంకేమీ ఉండవా? ఎందుకుండవ్? భార్యాభర్తలకోసం ప్రతి యేడు ఒక ప్రత్యేకమైన రోజుంది. అదే కపుల్స్ డే. బహుశా దీని గురించి తెలిసినవారు చాలా తక్కువ.  అంతెందుకు  భాగస్వామి గురించి కూడా పూర్తిగా తెలియని వారున్నారంటే ఆశ్చర్యం లేదు. ఆగస్టు 18వ తేదీని నేషనల్ కపుల్ డేగా జరుపుకుంటారు.  చాలా సార్లు  భాగస్వామి పుట్టినరోజు కానీ, పెళ్ళిరోజు కానీ మర్చిపోయి ఉండొచ్చు. బహుశా అది వారికి అంతో ఇంతో బాధను కలిగించి ఉండొచ్చు. ఆ బాధ మొత్తం మాయం చేయడానికి కపుల్ డే బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్కసారికి ఈరోజుని మర్చిపోకుండా మీ భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వండి, మీరే ప్రపంచంగా జీవించే మీ భాగస్వామికి మర్చిపోలేని అనుభూతిని మిగల్చండి.  ఒకప్పటి కంటే భారతదేశంలో ఒకరినొకరు ఇష్టపడి చేసుకునే పెళ్ళిళ్ళు ఎక్కువయ్యాయి. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహాల్లో కూడా పెళ్ళి తర్వాత ఒకరి కోసం ఒకరు చేసుకునే అడ్జస్ట్మెంట్లు, బాధ్యతలు పంచుకోవడంతో బంధమే కాదు ఇద్దరి మధ్య ప్రేమ కూడా మరింత పటిష్టం అవుతుంది. మగవారు కూడా నేటి పరిస్థితులకి తగినట్టు మారుతూ ఉండడంతో చాలా జంటలు సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. మగవాడిని తల్లి తరువాత తల్లిగా చూసుకునే గొప్ప వ్యక్తి భార్యే.. కపుల్ డే రోజు భాగస్వామిని ఈరోజు బయటికి తీసుకెళ్ళి సంతోషపెట్టాలని ప్రతి భర్తకు ఉంటుంది. కానీ అది కదరచ్చు,  కుదరకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో  ఇంట్లోనే వారికోసం స్పెషల్ సర్ప్రైజ్ ఏర్పాటు చేయడం మగమహారాజుల చేతుల్లో పని. భార్యను సంతోషపెట్టడానికి ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడవారి సంతోషం ఎప్పుడూ చిన్న చిన్న విషయాలలోనే ఉంటుంది. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ తో మీరు, ఇంట్లో పనితో మీ భార్య బిజీగా ఉంటే తనకోసం ఈ ఒక్కరోజు వంట చేయండి. వంట చేయడం రాకపోతే కనీసం నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆమెకి వంటలో సహాయం చేయండి. ఇద్దరూ కలిసి వంటగదిలో చేసే వంట మంచి రొమాంటిక్ మీల్ గా మారిపోతుంది.  ఒక మంచి మూవీకి తీసుకువెళ్ళండి. కుదరకపోతే పిల్లలు పడుకున్నాక మీ భాగస్వామితో ఇంట్లోనే మంచి రొమాంటిక్ మూవీ చూడండి. అదీ కుదరకపోతే కనీసం తనతో కాసేపు సరదాగా కబుర్లు చెప్పండి. లేదా తన మాటల్ని శ్రద్ధగా వినండి. ఆ కొన్ని క్షణాల కబుర్లు చాలు. తన కలల ప్రపంచం మీ ముందుంటుంది. లేదా వారి ఆలోచనల లోతు తెలుస్తుంది.  ప్రేమ ఒక దివ్యౌషధంలాంటిది. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట ఇరువురిలోనూ ఒక రోజంతా ఉత్సాహంగా గడిపే శక్తిని ఇస్తుంది. ఒక చిన్న హగ్ శరీరంలో ఆక్సిటోసిన్ స్థాయిలు పెంచడంతో పాటు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పెళ్ళైన వ్యక్తులపై చేసిన ఒక పరిశోధనలో వాస్కులర్ వ్యాధి వచ్చే అవకాశం 12%తక్కువగా ఉంది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక పరిశోధనలో ప్రేమించిన వ్యక్తి కళ్ళలోకి చూస్తున్నప్పుడు ఇద్దరి హార్ట్ రేట్ ఒకే విధంగా ఉన్నట్టు తేలింది. ప్రేమించడం, ప్రేమను పంచుకోవడం వల్ల బంధం బలపడటమే కాదు, ఆరోగ్యం లాభాలు కూడా ఉన్నాయి మరి. ఇన్ని లాభాలు తెచ్చిన మీ భాగస్వామి తో ఈ కపుల్ డేని పైన చేపుకున్నట్టే కాదు, మీదైన శైలిలో, మీ కొత్త ఆలోచనలతో కూడా జరుపుకోవచ్చు. బంధాన్ని బిందాస్ గా మార్చుకోవచ్చు.                                             *నిశ్శబ్ద.