Read more!

ప్రపంచంలో అద్భుత మంత్రం.. జీవితాలకు వెలుగు కెరటం ఇదే..

అన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఆశ ఒక్కటే మనల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. మనలో ఉన్న నిజమైన ధైర్యాన్ని, తెగువను, సమయస్ఫూర్తిని వెలికితీస్తుంది. అందుకే ఆశ గొప్ప ఆయుధం అవుతుంది మనిషి జీవితంలో.  జీవితంలో ఎంతోమంది విషయాల్లో ఆశ ముఖ్య పాత్ర పోషించినా పిల్లల జీవితానికి ఇది ఇంతో అవసరం. 

ఈ ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు శారీరక, మానసిక, లైంగిక దాడికి బలైపోతున్నారు. ఇలాంటి పిల్లలు జీవిఘం మీద భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనే పెద్ద ప్రశ్న వీరిని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. కేవలం ఇలాంటి వేధింపులు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు కూడా కోకొల్లలు. వీరికి జీవితం మీద ఆశను కల్పించడం అందరి కర్తవ్యం. జీవితంలో ఎదురయ్యే బాధాకర పరిస్థితులను ఎదుర్కోవడానికి వీరికి తగినంత సపోర్ట్ అవసరం అవుతుంది. పెద్దలు కూడా ఇలాంటి పరిస్థితులలో ఉంటారు. ఇలా జీవితంలో ఎన్నో కోల్పోగున్న వారికి ఆశను కలిగించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదటి బుధవారంను వరల్డ్ హాప్ డే గా జరుపుకుంటారు.  నిర్లక్ష్యానికి, వేధింపులకు గురయ్యే ఎంతోమంది పిల్లలు పెద్దలు చివరికి చావు వైపు అడుగులేస్తున్నారనే విషయం ప్రపంచాన్ని కలవపరుస్తుంది. 

ఆశ లేకపోతే..

హాప్ అంటే ఆశ. జీవితమంతా ఈ ఆశతోనే ముందుకు కదులుతుంది. కానీ ఎప్పుడైతే జీవితంలో గందరగోళ సంఘటనలు చోటు చేసుకుంటాయో.. అప్పుడే జీవితం మీద విరక్తి, వైరాగ్యం, నిస్సహాయత అన్నీ కమ్ముకుంటాయి. సమస్యలను అధిగమించలేని తనం మనిషిని ఆవరిస్తే.. చేతకాని వాళ్ళం అనుకుని ఆత్మన్యూనతా భావంలోకి జారిపోతారు. ఇదే ఆత్మహత్యలకు మూల హేతువు. ఇలాంటి సందర్భాలలో ఆశ ఉంటే జీవితంలో నడక ఆగదు. కానీ ఆశ లేకపోతే కాలం పరిగెట్టినా దాంతో మనం పరిగెట్టలేక స్తంభించిపోతాము. మనమింతే అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం.

హాప్ డే రోజు ఏమి చెయ్యాలి??

ఆశ జీవితానికి ఆయువు అయినప్పుడు దానిని పెంపోంచించడం అవసరం. ఓ మనిషి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ పెడితే ఎలాగైతే మెల్లిగా జీవశక్తితో ఉత్తేజం అవుతాడో.. అలాగే మనిషి కూడా ప్రతి కూల పరిస్థితులలో ఉన్నప్పుడు ఆశతో చైతన్యం అవుతాడు. అయితే ఆశ అనేది మనిషిలో పుట్టాలంటే దానికదే జరగదు. ఆత్మన్యూనతలో ఉన్నప్పుడు ఆశ పుట్టదు. అందుకే అలాంటి పరిస్థితులలో ఉన్నవారి జీవితానికి భరోసా ఇవ్వాలి. ఇలాంటి మార్గం ఒకటుందని ఆశను చూపించగలగాలి. 

ఎంతోమంది మానసిక ఒత్తిడిలోనూ.. సమస్యలలోనూ చిక్కుకుపోయి ఉంటారు. వాటికి తగిన పరిష్కారాలు ఉన్నా దాన్ని తెలుసుకోలేనితనం వారిలో ఉంటుంది. అలాంటి వాళ్లకు మార్గం చూపిస్తే అదే ఆశ అవుతుంది. మానసికంగా ఉత్తేజం చేయడం, అయోమయంలో ఉన్నవారికి నిజమేంటో తెలియజెప్పడం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని మోటివేట్ చేయడం, ఇలా ఎన్నో విధాలుగా ఆశ పెంపొందించవచ్చు. 

పిల్లలను సమస్య నుండి బయటకు తీసుకురావడం, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం, వారిలో ప్రతిభను తెలపడం, అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని, రక్షణను ఇవ్వడం చేస్తే పిల్లల భవిష్యత్తు అందంగా ఉంటుంది.

ఇలా ప్రపంచంలో ఎంతో మందిని ఆశ అనే ఒకే ఒక్క అద్భుతం మంత్రం ముందు నడిపిస్తుంది. కొత్త శక్తిని పొగుచేస్తుంది. అందుకే అందరిలో ఆశ ఉండాలి. అది లేనివారికి ఆశను అందించే వారు మీరవ్వాలి..

                               ◆నిశ్శబ్ద.