Read more!

వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే ఈ రెండూ దూరం పెట్టాలి!

మనిషిని గొప్పగా నిలబెట్టేది వారి వ్యక్తిత్వమే.. కానీ ఈ కాలంలో మనుషుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారి వ్యక్తిత్వపు విలువను తగ్గించేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కింది రెండు మనిషిని ఎంత నీచంగా తయారు చేయాలో.. అంత నీచంగా చేస్తాయి. వీటిని దూరంగా  ఉంచడం మంచి వ్యక్తిత్వానికి అవసరం.. 

ఓర్వలేనితనం..

ఒకరిని చూసి మనం ఓర్వలేకపోతున్నామంటే, మనల్ని మనం హీనపరచు కుంటున్నామని అర్థం. అది పూర్తిగా మన ఆత్మన్యూనతా భావానికి (Inferiority complex) చిహ్నం. ఈ అసూయ పొడ చూపిన క్షణం నుంచి మనలో మానసిక అలజడి మొదలవు తుంది. అది క్రమంగా మన ప్రశాంతతను హరించి వేసి మన శక్తులన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన విచక్షణను కూడా కోల్పోయేలా చేస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు శత్రువన్న భ్రమను కల్పించి, ప్రతీకార జ్వాలల్ని రగిలిస్తుంది. నలుగురితో కలసి ఆహ్లాదంగా ఉండలేని పరిస్థితిని సృష్టిస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు 'Jealousy is the bane of our national character, natural to slaves. Three men can not act in concert together in India for five minutes!' నిజమే, అసూయ బానిసల స్వభావం. అది జాతి స్వభావాన్నే విషపూరితం చేసి, నిర్వీర్యపరుస్తూ ఉంది. భారత దేశంలో ముగ్గురు వ్యక్తులు కలసికట్టుగా అయిదు నిమిషాలైనా పనిచేయలేరు. ఒక కళాకారుడు, మరో కళాకారుడిని మన స్ఫూర్తిగా అభినందించలేడు. ఒక రచయిత మరో రచయిత పుస్తకాన్ని ఆసక్తిగా చదవలేడు. ఒక సంగీత విద్వాంసుడు మరో సంగీతజ్ఞుడి గానాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేడు! ఇలా, ఇక ఎంత విద్వత్తు ఉంటే ఏం లాభం?. చాలా సభాకార్యక్రమాలకు చాలా మంది కళాకారులు ఒకరిని పిలిస్తే, మరొకరు మేము రామని నిరాకరిస్తున్న సందర్భాలు కోకొల్లలు.

కుళ్ళుకుంటే కుమిలిపోతాం.. 

అసూయ యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. నిజానికి ఎవరి ప్రతిభ వారిదే! ఎవరి ప్రాధాన్యం వారిదే! మనం కుళ్ళుకొని కుమిలిపోయినంత మాత్రాన ఒకరిది మన సొంతం కాదు. పైగా మానసిక అనారోగ్యానికి గురిచేస్తుంది. ఎదుటివారిని చూసి ఉడుక్కునే కన్నా, వారు ఆ స్థాయికి చేరుకోవటానికి పడిన శ్రమను గుర్తించి, అనుసరించాలి. తన వైభవాన్ని చూసి ఓర్వలేక, తరచూ అవమానపరిచే మామ దక్షుడి మానసిక స్థితిని విశ్లేషిస్తూ, తన సతీదేవి పార్వతితో శ్రీమద్భాగవత సప్తమస్కంధంలో పరమశివుడు అంటాడు 'అహంకారమూ, దోషములు లేనివారు కావడం చేత సజ్జనులకు ఘనకీర్తి లభిస్తుంది. అలాంటి కీర్తి, తమకూ దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ వారు అసమర్థులు కావడం వల్ల వారికి కీర్తి రాదు. అందుచేత మనస్సులో కుతకుత ఉడికిపోతారు'. 

ఈ రెండింటిని మనిషి తనకు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. అదే మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తుంది.

                                   ◆నిశ్శబ్ద.