రాజ్యాంగ శిల్పి జయంతి!!
posted on Apr 14, 2023 @ 9:30AM
రాజ్యాంగం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కర్. అందరికీ డా. బి.ఆర్ అంబేద్కర్ గా తెలిసిన ఈయన అసలు పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 వ తేదీన పుట్టిన ఈయన భారతీయ చరిత్రలో ఓ సంచలనం. అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి నిరక్షరాస్యతే కారణమని తను ఎంతో ఉన్నత విద్యావంతుడవ్వడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచాడు. భారతదేశ రాజ్యాంగానికి రూపునిచ్చి బడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషిచేసిన మహనీయుడు ఈయన.
అంటరాని బాల్యం!!
నిజంగా మనిషికి డబ్బున్న కూడా గౌరవం లేని కాలంలో అంబేద్కర్ పుట్టాడు. ఈయన తండ్రి బ్రిటిష్ వారి దగ్గర సుబేదారుగా పనిచేసేవాడు. ఆర్థికంగా మరీ అంత కష్టాలు ఏమీ ఉండేవి కాదు. కానీ చుట్టూ ఉన్న అగ్రవర్ణాల వారి నుండి సమస్యలు ఎదుర్కునేవాళ్ళు. ఎవరూ ముట్టుకునేవాళ్ళు కాదు, అందరూ ఉపయోగించే వస్తువులు ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు.
దానికోక చిన్న ఉదాహరణ:- బడిలో నీళ్లు తాగాలి అంటే చెత్త ఊడ్చే అతను ప్రత్యేకంగా వీళ్లకు ఇచ్చేవాడు. అందరితో కలిసి ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు.
అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే "ఈరోజు చెత్త ఊడ్చే అతను లేడు. అందుకే తాగడానికి నీళ్లు లేవు"
బాల్యంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న అంబేద్కర్ మహాశక్తిగా ఎదగడం వెనుక ఉన్నది కేవలం అక్షరాస్యత అంటే ఆశ్చర్యం వేస్తుంది. విద్య మనిషిని ఎంత గొప్పగా తయారుచేస్తుందో అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న విద్యాధికుల పేర్లు రాయాల్సి వస్తే అంబేద్కర్ పేరు ఎంతో గర్వంగా రాయచ్చు. ఎంతో గొప్ప విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకుని గొప్ప న్యాయవాదిగా మారినవాడు అంబేద్కర్.
దళిత మహాసభతో మలుపు!!
1927 సంవత్సరంలో జరిగిన దళిత మహాసభ ఓ గొప్ప మలుపు అనుకోవాలి. చెరువులో నీటిని ముట్టుకునే అనుమతి కూడా లేని సందర్భంలో ప్రజలలో చైతన్యం నింపి ఆ చెరువు నీటిని అందరూ స్వీకరించేలా చేశారు ఈయన. ఆ తరువాత బహిష్కృత భారతి అనే పత్రిక స్థాపించాడు. ఆ పత్రికలోనే ఒక వ్యాసంలో అంబేద్కర్ ఇలా పేర్కొన్నారు.
"తిలక్ గనుక అంటారానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని కాకుండా అస్పృశ్యతా నివారణ నా ద్యేయం, అదే నా జన్మహక్కు అని నినదించి ఉండేవాడేమో" అని. ఆ మాటలు చూస్తే అంబేద్కర్ తన జీవితంలో కులవివక్షత వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది.
ఈ క్రమంలోనే బడుగు వర్గాల వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని ఈయన విశ్వసించాడు. భారతజాతీయ కాంగ్రెస్ లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు తీసుకురావడం కోసం ఎంతో పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు.
రాజ్యాంగ రూపకల్పన!!
నిజానికి రాజ్యంగం రూపొందించడానికి ఏడు మంది సభ్యులను నియమిస్తే అంబేద్కర్ తప్ప మిగిలిన అందరూ వివిధ కారణాల వల్ల రాజ్యాంగ పరిషత్తుకు దూరమయ్యారు. అందువల్ల అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి నడుం బిగించాడు. ఈయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అవ్వడం వల్ల రాజ్యాంగంలో బడుగు వర్గాల వారు బలపడేందుకు రిజర్వేషన్లను పొందుపరిచారు. ఎంతోమంది రిజర్వేషన్ల మూలంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యారు. అందుకే ఈయన బడుగు వర్గాల వారి పాలిట దేవుడయ్యాడు.
మతమార్పిడి మరణం!!
అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రిస్టియానిటిలో చేరారని ఆయన క్రైస్తవం పుచ్చుకోవడం వల్ల ఎంతోమంది దళితులు క్రైస్తవం వైపు దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రైస్తవం లోకి వెళ్ళలేదు అనేది నిజం. ఆయన ఎంతో ప్రాచీనమైనది, హిందూ మతానికి దగ్గరగా ఉన్నది అయిన భౌద్ధ మతంలోకి మారారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు.
భారతదేశానికి ఈయన అందించిన సేవలకు భారతరత్న ప్రకటించి విశ్వాసం నిలుపుకుంది భారతప్రభుత్వం.
ప్రభావం!!
భారత రాజకీయాలపై, విద్యార్ధులపై, దిగువ తరగతి వర్గాల వారిపై మాత్రమే కాకుండా విద్యావంతులపై కూడా అంబేద్కర్ ప్రభావం ఎంతో ఉంది. ఫలితంగా ఆయన ఎన్నో విధాలుగా అందరినీ ప్రభావం చేశారు. అది పరిస్థితులను అధిగమించి విద్యావంతుడుగా మారడం కావచ్చు, బడుగు జీవితాల కోసం శ్రమించడం కావచ్చు, రాజ్యాంగ కర్తగా కావచ్చు.
ఏది ఏమైనా భారత రాజ్యాంగం నిలిచి ఉన్నంతవరకు దాన్ని లిఖించిన అంబేద్కర్ కూడా భారతావనిలో నిలిచే ఉంటాడు.
ఓ ప్రభావితుడుగా…...
ఓ ఆర్థిక వ్యూహకర్తగా…… ఈయన రచించిన పలు గ్రంథాలే వాటికి నిదర్శనాలు మరి.
◆వెంకటేష్ పువ్వాడ.