ప్రేమకు నిర్వచనాలు ఏవి?

ప్రేమ అనగానే అందరికీ ఎక్కడలేని హుషారు పుడుతుంది. జీవితంలో తోడుగా అన్ని రకాల ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక తోడు అనేది ప్రేమికుడు లేదా ప్రేమికురాలి ద్వారా దొరుకుతుంది. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలకు నిజమైన అర్థం నిజం, నిజాయితీ, నమ్మకం, ధైర్యం, విజయం. ఈ అయిదు ప్రేమకు నిజమైన అర్థాలు...! ఈనాటి సమాజంలో వున్న యువకుల ఆలోచనలు ఎక్కువగా ప్రేమవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో కళ్ళలో కళ్లు పెట్టుకుని చూసుకుని నవ్వుకోవడం, సైగలు చేసుకోవడం, ప్రేమికుడు లేదా ప్రియురాలి కోసం ఏమైనా కొనివ్వడం సినిమాలకు తీసుకెళ్ళడం, ప్రియురాలు ఏదైనా అడిగితే ప్రేమికుడు ప్రియురాలు కోసం తన తాహతుకు మించకపోయినా ప్రియురాలు అడిగినదాని కోసం తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేయడం ప్రియురాలి కోరికలు తీర్చడం వంటివి చేస్తున్నారు. చివరికి తల్లి దండ్రులకు అప్పుల బాధను మిగిల్చి, వాళ్ళు వారి సరదాలను కోరికలను తీర్చుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ప్రేమికురాలికి న్యాయం చేయడమా, లేక తల్లిదండ్రులకు న్యాయం చేయడమా మీరే ఆలోచించండి.  నిజమైన ప్రేమికుడు లేక ప్రియురాలుకు ముందు ప్రేమ పట్ల మంచి అవగాహన వుండాలి. ప్రేమను ఆరాధించాలి, అలాగే తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి. వయసులో ఉన్నవారు ప్రేమించడం సహజం. ప్రేమించడం తప్పేమీ కాదు. ప్రేమికులు ఇద్దరు మీకు ఉన్నదాంట్లో మీ కుటుంబానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి. మీరు మీ ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులను అప్పుల బాధకు గురి చేయకూడదు. ప్రేమికుడికి, ప్రేమికురాలు ఇవ్వవలసిన నిజమైన ఆనందం, ప్రేమికుడికి తల్లి దండ్రుల దగ్గర మంచిగౌరవం వుండేలా సమాజంలో మంచి గుర్తింపు ఉండేలా చేయడం. ఇది నిజమైన ప్రేమికురాలు ప్రేమికుడికి ఇచ్చే నిజమైన ఆనందం. ప్రేమ మోజులో పడిపోయి మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు. అలాగే అబ్బాయిలు అమ్మాయిల విషయంలో  ఒక పరిధిలో ఉండాలి. చాలామంది ప్రేమ అనగానే ఇక మొత్తం ఒకరికొకరు ఏకమైపోవాలి అనుకుంటారు. శారీరకంగా కలవడానికి ఒత్తిడి చేస్తుంటారు. దానివల్ల జీవితాలు పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాయి. ప్రేమంటే మనుషుల్ని అర్థం చేసుకుని ఆరాధించి తరువాత ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. అంతే తప్ప ముందే అన్ని అయిపోవాలని లేకపోతే ప్రేమ లేదు అని మాటలు చెప్పడం కాదు.  మీరు ఒకవేళ ప్రేమ మోజులో పడితే నిజాయితీగా వుండి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని ఒక సరైన లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యంపై నమ్మకాన్ని పెంచుకోవాలి. అలా నమ్మకం ఏర్పడితే జీవితంలో భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే ధీమా వస్తుంది.  ఏర్పరుచుకున్న ఆ లక్ష్యంలో ఏవైన సమస్యలు వస్తే కృంగిపోకుండా ధైర్యంగా వుండాలి. ఆ సమస్యను ఇద్దరు ధైర్యంతో పరిష్కరించుకోవాలి. ఇద్దరూ నిర్ణయంలోనూ, సమస్యలొనూ, పరిష్కారంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంత ఇబ్బందులు అయినా అధిగమించగలుగుతారు.  ఇలా లక్ష్యాన్ని ఏర్పరుచుకొని విజయాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి మీ ప్రేమకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి మంచి గుర్తింపు వుండేలా చేసుకోవాలి. మీ ప్రేమను ఇతర ప్రేమికులు ఆదర్శంగా తీసుకునేలా మీరు గొప్పగా ఉండాలి అనుకోవాలి. ఇద్దరి మధ్యన ప్రేమ స్నేహభావంగా వుండాలి. ఇది మాత్రమే కాదు ప్రేమకు కావలసింది ఓర్పు, సహనం, ఇవి రెండూ కూడా చాలా అవసరం. అదే విషయాన్ని ఆలోచించాలి.  ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులకు కడుపు కోతను కన్నీటిని మిగిల్చి పారిపోయి పెళ్ళి చేసుకోవడం న్యాయమా? లేక మీ ప్రేమకు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మీ ప్రేమ పట్ల మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు కలిగేటట్లుగా వ్యవహరించడం న్యాయమా? ప్రేమకు నిర్వచనాలను ఎవరికి వారు ఇచ్చుకుంటూ నిజమైన నిర్వచనాన్ని నవ్వులపాలు చేయకూడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.                                           ◆నిశ్శబ్ద.

టెడ్డి బేర్ చరిత్ర తెలుసా?

విస్తృతమవుతున్న ప్రపంచంలో పిల్లలు ఆడుకోవడానికి టెడ్డి బేర్ ని తీసివ్వమని అడుగుతుంటారు. పిల్లల తరువాత ఈ టెడ్డి బేర్ ను ఇష్టపడేది అమ్మాయిలు. మరీ ముఖ్యంగా టీనేజ్ గాళ్స్ కు టెడ్డిలంటే భలే ఇష్టం. ఆ తరువాత ఈ ఇష్టం టీనేజ్ అమ్మాయిల నుండి ఇన్ఫినిటీ… గా మారుతుంది. అంటే  అధిక శాతం మంది వయసుతో సంబంధం లేకుండా ఈ టెడ్డీలను ఇష్టపడతారు.  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న, వాలెంటైన్ వీక్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డేని జరుపుకుంటారు.  మీరు మీ ప్రియమైన వారికి టెడ్డీని అందించడం ద్వారా మీ ప్రేమను తెలియజేయవచ్చు.  ఆడవాళ్ళే కాదు, కొంతమంది మగవారు కూడా టెడ్డీని కౌగిలించుకోవడానికి ఇష్టపడతారు, కాబట్టి అమ్మాయిలూ.. టెడ్డీ బేర్‌ని మీరు ప్రేమిస్తున్న అబ్బాయిలకు కూడా వారికి ఇవ్వండి, తద్వారా వారు మిమ్మల్ని మిస్ అయినప్పుడల్లా టెడ్డీని కౌగిలించుకోవచ్చు. టెడ్డిని కేవలం ప్రేమికులు మాత్రమే ఇచ్చిపుచ్చుకుంటారని అనుకుంటే పొరపాటే..  మీరు ఇష్టపడే పిల్లలకు లేదా మీ ఇంట్లోని పెద్దలకు కూడా ఇవ్వవచ్చు. అయితే ఈ టెడ్డి వెనక ఓ కథ ఉంది.. ఓ చరిత్ర ఉంది. ఇంతకూ ఆ కథ, ఆ చరిత్ర ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ ముద్దుపేరు టెడ్డీ. , 1902 సంవత్సరం నవంబర్ 14న అతను మిస్సిస్సిప్పిలోని ఒక అడవిలో వేటకు వెళ్ళాడు, అతని సహాయకుడు హోల్ట్ కొల్లియర్ కూడా అతనితో పాటు వెళ్ళాడు.  కోలియర్ గాయపడిన టెడ్డీ బేర్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేశాడు.  దీని తరువాత వేటలో భాగంగా ఆ సహాయకుడు ఎలుగుబంటిని కాల్చడానికి అధ్యక్షుడి అనుమతి కోరాడు.  కానీ, గాయపడిన స్థితిలో ఉన్న ఎలుగుబంటిని చూసి, అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ వేట మీద ఉన్న ఆసక్తిని, ఇష్టాన్ని పక్కన పెట్టి ఆ జంతువును చంపడానికి నిరాకరించాడు. ఇది కార్టూనిస్ట్ క్లిఫోర్డ్ బెర్రీమాన్ రూపొందించిన వాషింగ్టన్ పోస్ట్.   ఈ సంఘటన తర్వాత, అతని పేరు మీద, టెడ్డీ బేర్ కనుగొనబడింది.  దీనిని ఓ వ్యాపార దంపతులు రూపొందించారు.   వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే జరుపుకోవడానికి ముఖ్యంగా అమ్మాయిలే కారణం.  చాలా మంది అమ్మాయిలు ఈ స్టఫ్డ్ బొమ్మలను ఇష్టపడతారు, ఇవి వెచ్చని ఆత్మీయ కౌగిలిని అందించే ఆత్మీయులలాగా అనిపిస్తాయి. కోపం, బాధ, ప్రేమ వ్యక్తం చేసుకోవడానికి తోడుగా ఉంటాయి. అందుకే అబ్బాయిలు టెడ్డీ బేర్‌లను బహుమతిగా ఇవ్వడం ద్వారా అమ్మాయిలను ఆకట్టుకుంటారు.  ఈ టెడ్డీ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఇలా ఇది వాలెంటైన్ వీక్ లో భాగమయ్యింది.                                     ◆నిశ్శబ్ద.  

చాక్లెట్ చెమ్మక్ లో కరిగిపోండిక!

దేన్నైనా మన అనుకోవడం మన ఇండియన్స్ కి చాలా గొప్ప అలవాటు. అలాగే ఎక్కడి నుండో వచ్చిన వాలెంటైన్స్ డే ని మనదే మనదే అంటూ మనతో కలిపేసుకున్నాం.  ఫిబ్రవరి 2nd వీక్ మొత్తం వాలెంటైన్స్ డే సందడి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతతో వాలెంటైన్స్ డే జపం చేస్తూ జుయ్.. జుయ్.. అంటూ ఫెరారీ కారులో తిరిగినట్టు యువత యమ స్పీడుగా, మరింత ఉత్సాహంతో తిరిగేస్తుంటారు.  వాలెంటైన్స్ డే మూడవ రోజు తియ్యతియ్యని చాక్లెట్ డే.. చిన్నా పెద్దా తేడాల్లేకుండా చాక్లెట్లను చప్పరించేసే వారున్నారు. ఈకాలంలో ఈ షుగర్ అనే జబ్బు లేకుంటే చాక్లెట్ ల వ్యాపారం ఇంకెంత శుభ్రంగా ఉండేదో అనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వస్తే.. ముచ్చటగా మూడవ రోజు చాక్లెట్ డే రోజు.. ప్రేమికులు చాక్లెట్ లను ఇచ్చి పుచ్చుకుని మనసులో దాగున్న ప్రేమను చాక్లెట్ అంత తియ్యగా వ్యక్తం చేసి మధురానుభూతిని పొందుతారు.  సాధారణంగానే ప్రియురాలిని కలిసే ప్రియుడు చాక్లెట్ లేకుండా అస్సలు వెళ్ళడు. ఒకవేళ తొందరలో.. కిందామీద పడుతూ చాక్లెట్ లేకుండా వెళితే మాత్రం.. ఆ ప్రియురాలి ముఖం క్యారమిల్ లో ముంచి తీసినట్టు కన్నీళ్లు కారుతూ కనిపిస్తుంది.  అంతేనా.. ఎండలో నిలబడిన డైరీ మిల్క్ లాగా దిగులుపడిపోతుంది. ఇకపోతే కమ్మగా కరిగిపోయే చాక్లెట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అవేంటంటే… చర్మానికి మేలు చేస్తుంది  చాక్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇందులో కోకో ఉంటుంది, ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.  ఈ చాక్లెట్ డే రోజు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న డార్క్ చాక్లెట్‌ మిమ్మల్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది.  యాంటీ ఆక్సిడెంట్  యాంటీ ఆక్సిడెంట్ అయిన పాలీఫెనాల్ వంటి ఫైటోకెమికల్, వాటి లక్షణాల కారణంగా చాక్లెట్ ఘూఢమైన  సువాసనను కలిగి ఉంటుంది.  ఇది వాలెరిక్ యాసిడ్ వంటి ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది, ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. బెస్ట్ స్ట్రెస్ బస్టర్  ఈ కాలంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్య అయిపోయింది. మీరు గనుక దానితో ఎక్కువగా టచ్ లో ఉన్నట్లయితే.. మీరు ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ ను  తినాలి, ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, నీరసంగా, బద్ధకంగా  ఉన్నపుడు డార్క్ చాక్లెట్ తిన్నారంటే మీలో కనిపించే మార్పును మీరే స్పష్టంగా చూడగలరు. మధుమేహం ఛాన్సెస్ తక్కువ..  వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం. సహజంగా స్వీట్స్ అంటే ఇష్టపడేవారు ఇప్పటి కాలానికి తగ్గట్టు నచ్చినన్ని స్వీట్స్ తినాలంటే భయపడతారు. షుగర్ ఎక్కడ వస్తుందోనని వారి భయం. అయితే, డార్క్ చాక్లెట్‌ లో ఉండే ఫ్లేవనాయిడ్‌ లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ అని భయపడేవారు తీపి తినాలని అనిపించినా, షుగర్ వస్తుందేమో అనే భయంతో తీపికి దూరం ఉండాలని అనుకున్నా ఆ భయాలు పక్కన పెట్టి హాయిగా డార్క్ చాక్లెట్ ని చప్పరించేయండి. చూశారా??  కేవలం ప్రియురాలిని, ప్రియుడిని కూల్ చేయడమే కాదు, ఆరోగ్యాన్ని చక్కబెట్టగలదు మన చాక్లెట్.  చాక్లెట్ డే పేరు చెప్పుకుని ఇంకాస్త ఎక్కువ డోస్ వేసేయండి ఈరోజు..                                     ◆నిశ్శబ్ద.

ప్రేమను వ్యక్తం చేస్తున్నారా?

◆ప్రపోజ్ డే◆  ఈ ప్రపంచంలో ప్రేమ చాలా గొప్పది. మనిషిని అనుభూతి చెందించడంలో కూడా ప్రేమ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఫిబ్రవరి మాసం వచ్చిందంటే ప్రేమికుల మనసులకు మరింత ఉత్తేజం కలుగుతుంది. వాలెంటైన్ వీక్ గా పిలువబడే వారంలో రెండవరోజును ప్రపోజ్ డే గా చెబుతారు. తాము ప్రేమిస్తున్నవారికి తమ మనసులో మాట చెప్పడం, తాము ఆల్రెడీ ప్రేమిస్తున్నవారి మీద మనసులో ఎంత ప్రేమ ఉందొ తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఎక్కడ చూసినా  ప్రేమ జంటలు ప్రేమపావురాల్లా సందడి చేస్తుంటాయి.  ఇష్టమైన వారిని బయటకు తీసుకెళ్లడం తమ మనసులో మాట చెప్పడంలో ఒక్కొక్కరు ఒకో విధమైన మార్గాన్ని అనుసరిస్తారు. కొందరు పువ్వులు ఇస్తే, మరికొందరు బహుమతులు, ఇంకొందరు చాక్లెట్లు ఇస్తూ మనసును బయట పెడతారు. అయితే ప్రపోజ్ డే రోజు ప్రేమికులు అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి, అవి తప్పక తెలుసుకుని తీరాలి.. అవేంటంటే.. ఒకే.. నాట్ ఒకే.. ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు  తాము ప్రేమించే వారికి మనసులో మాట చెబుతారు. కొందరు ఆ మాట చెప్పడానికి భయపడతారు. అయితే అవతలివారు ఒకే చెబుతారా లేదా నో చెబుతారా అనేది వారి వ్యక్తిగత విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించడం మీ వ్యక్తిగత ఇష్టం అయినప్పుడు ఒకే చెప్పాలా లేదా అనేది వారి వ్యక్తిగత విషయం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం అర్ధం చేసుకుంటే ఎదుటి వారు నో చెప్పినా సరే పాజిటివ్ మైండ్ ఉంటుంది. లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఉన్న వైరాగ్యం అంతా మీలోకి వచ్చి దేవదాసునో.. లేక పార్వతినో చేస్తాయి. పాజిటివ్.. నెగిటివ్… ప్రేమ ఒప్పుకోకపోతే ఇక అవతలి వాళ్లకి పొగరు, వాళ్ళు మిమ్మల్ని అవమానం చేస్తున్నారు వంటి నెగిటివ్ ఆలోచనలు మానుకోవాలి. ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిల స్నేహం సాధారణం. అబ్బాయిల అయినా అమ్మాయిలు అయినా స్నేహితుల్లానే ఉండండి. ప్రవర్తనలో స్నేహితులకు బదులు ప్రేమికుల రేంజ్ లో కేరింగ్, ప్రేమ, అఫెక్షన్ చూపించి ఆ తరువాత నాది ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే, నువ్ ఇలా లవ్ యాంగిల్ లో చూస్తావని అనుకోలేదు లాంటి డైలాగ్స్ కొట్టకండి. ఒకవేళ మీ స్నేహితులు మీకు ప్రపోజ్ చేసినా మీకు ఇష్టం లేకపోతే సర్ది చెప్పండి, వారు మిమ్మల్ని అర్థం చేసుకునేవరకు  సమయం ఇవ్వండి. అంతేకానీ స్నేహం అనుకుంటే లవ్ చేస్తావా అని గొడవలకు పోకండి. అలాగని మరీ పూసుకుని రాసుకుని కేర్ టేకార్ గా ఉండకండి. అవసరాలు తీర్చవచ్చు కానీ అన్నిటికీ మీరే అవసరం అనేలా మారకండి. అప్పుడే ప్రేమకు, స్నేహానికి వ్యత్యాసం ఎంతో కొంతం అర్థమవుతుంది. ప్రపోసల్ స్పెషల్.. నచ్చినవారికి మనసులో మాయా చెప్పడమే కాదు, ఇంప్రెస్ చేయడం కూడా ముఖ్యమే. ప్రేమను ఎంత విభిన్నంగా ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వారు అంతగా ఇంప్రెస్ అవుతారు. నచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేదం అదేదో యుద్ధం అనుకోవద్దు. నిజాయితీగా మనసులో మాటను చెబితే అవతలి వారు అర్థం చేసుకుంటారు. ఓవర్ ఏక్షన్ చేసి బొక్కబోర్లా పడితే తరువాత ప్రేమ కాస్త వెక్కిరించినట్టు అవుతుంది. జస్ట్ మూవ్ ఆన్.. ప్రేమిస్తున్నవారు నో చెప్పారా?? నో ప్రాబ్లెమ్ వారికి వేరొక జీవితం ముడిపడి ఉంది అని మనసుకు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం కష్టమే. కానీ బలవంతం చేసి ఇష్టం లేని వారి జీవితంలోకి వెళ్లి అశాంతిగా బ్రతకడం కంటే అవతలి వారి నిర్ణయాన్ని గౌరవించి మీరు కదిలిపోవడం మంచిది. రెండు చేతులు కలిస్తేనే  చప్పట్లు అన్నట్టు రెండు మనసులు కలిస్తేనే సంపూర్ణమైన ప్రేమ సాధ్యం. కాబట్టి ప్రేమ రిజెక్ట్ అయితే జైస్ట్ మూవ్ ఆన్ అంతే… చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే.. ప్రేమ అనేది కేవలం ఓ అమ్మాయికో అబ్బాయికో ఆకర్షణతో చెప్పేది , ఆరాధనతో వ్యక్తం చేసేది అనుకుంటే పొరపాటు. పంచడానికి ఈ ప్రపంచంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత  లేనివారు ఎందరో ఉన్నారు. వారికి మీ ప్రేమను అందివ్వవచ్చు మనస్ఫూర్తిగా..                                           ◆నిశ్శబ్ద.

'జననాంగ వికృతీకరణ' సృష్టికి మూలాన్ని సమాధి చేస్తున్నారు!

ఈ ప్రపంచం సంగతి ఏమిటో కానీ.. ఈ దేశంలో మాత్రం స్త్రీకి సంబంధించిన కొన్ని విషయాలను మాట్లాడటానికి ఎంతో సంకోచిస్తారు. అలాంటి వాటిలో సెక్స్,స్త్రీ-పురుష జననేంద్రియాలు, వాటికి సంబంధించిన సమస్యలు. మనుషులను ఉద్రేకపరిచే కోరికలు మొదలైనవి ఎంతో ముఖ్యమైనవి. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుండి స్త్రీ చాలా విషయాల్లో అణిచివేయబడుతోంది. ఈ సృష్టిలోకి ఓ మనిషి రావాలంటే స్త్రీ జననేంద్రియం దానికి కార్యక్షేత్రం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ప్రపంచం ఇన్ని మార్పులకు లోనైనా ఎన్నోచోట్ల ఇప్పటికీ స్త్రీల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాటిలో స్త్రీ జననేంద్రియం మీద అధికారం, అణిచివేత కూడా ముఖ్యమైనది.  స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న జీరో టాలరెన్స్ ఫిమేల్ జెనెటల్ మ్యుటిలేషన్ ను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు.  మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ, ఓ హింసాత్మక సంప్రదాయం ఇప్పటికీ ఉనికిలో ఉండటం చాలా కలవరపెడుతోంది.  ఆఫ్రికా మరియు తూర్పు ఐరోపా నుండి అరబ్ దేశాలు, ఆసియా, లాటిన్ అమెరికా వరకు  స్త్రీల జననేంద్రియాల పట్ల  జరుగుతున్నవి చాలా దారుణమైనవి.  బాహ్య స్త్రీ జననేంద్రియాలను తొలగించడం వేల సంవత్సరాల లింగ అసమానతలో ముఖ్యమైనదిగా ఉంది.   ఇతరులు స్త్రీ యొక్క లైంగికత మరియు ఆనందాన్ని నియంత్రించడానికి దీనిని పాటిస్తారు.  దీని గురించి ప్రపంచానికి సరైన అవగాహన  కల్పించేందుకు  ఫిబ్రవరి 6వ తేదీని స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు జీరో టాలరెన్స్ డేగా ప్రకటించింది. అసలు ఏమిటీ సమస్య.. ఎక్కడుంది ఈ ఆచారం?? స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అనేది స్త్రీ జననేంద్రియాలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించడం.  మహిళల యోని భాగంలో క్లిటోరిస్‌ను కుట్టడం, కత్తిరించడం చాలా దేశాలలో పాటించే అలవాటు. ఇది మహిళల పట్ల దారుణమైన చర్య కలిగి ఉంది.   ప్రపంచం  స్త్రీ జనాభా విషయంలో  విఫలమవుతూనే ఉంది, దాదాపు 200 మిలియన్ల మంది బాలికలు, మహిళలు ఇప్పటి వరకు జననేంద్రియ వికృతీకరణకు గురయ్యారు, ఈ సంఖ్య క్రమక్రమంగా  పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం.  అయితే.. ఇది ఎక్కడ ఉద్భవించిందనే దానిపై చరిత్రకారులు స్పష్టత ఇవ్వనప్పటికీ  ఇది చాలా కాలంగా ఉండటమే కాదు, ప్రపంచంలోని అనేక జాతి, తెగ ప్రజలు ఇప్పటికీ దీనిని పాటిస్తున్నారు.  ఉప-సహారా, అరబ్ దేశాలలో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ చేయడం చాలా సాధారణం. దీని వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి??  స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కేవలం స్త్రీలను అణిచివేస్తున్న ఒక మార్గం మాత్రమే కాదు. ఇది చాలా పెద్ద అనారోగ్య సమస్యలు దారి తీస్తున్న అంశం.  స్త్రీలలో, బాలికలలో  లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  జననేంద్రియ వికృతీకరణకు గురైన స్త్రీలు ప్రసవానంతర రక్తస్రావం, పిండం మరణం, ప్రసవానికి ఆటంకం మొదలైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇంకా మానసిక ప్రభావాలు చాలా దీర్ఘకాలం ఉంటాయి.  వాటి తాలూకూ గాయాలు పిల్లలలో ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుంది, మానసిక స్టైర్యాన్ని బలహీనపరిచి ఆందోళన, ఒత్తిడి పెరగడానికి కారణం అవుతాయి.   ఇన్నాళ్లు ఈ సమస్య ఇలా కొనసాగడానికి స్త్రీలలో భయమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయా విషయాలు  నోరు తెరచి మాట్లాడాలంటే స్త్రీలు  చాలా భయాందోళనకు గురవుతారు. సమాజం కూడా అలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదు అనే ఒకానొక కట్టుబాటును విధించారు. దీనివల్ల స్త్రీల సమస్యను పరిష్కరించడం కూడా సవాలుగా మారింది.  2012  ఫిబ్రవరి 6న స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. దీని గురించి అవగాహన కల్పించడం, స్త్రీలలో చైతన్యం తీసుకురావడం, స్త్రీలు ఈ సమస్య వల్ల పడుతున్న ఇబ్బందులను సమాజానికి వినిపించడం. మొత్తంగా స్త్రీలకు ఈ సమస్య నుండి విముక్తి కలిగించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం.                                        ◆నిశ్శబ్ద.

క్యాన్సర్ మీద యుద్ధానికి అస్త్రాలు ఇవే!

క్యాన్సర్ ప్రపంచంలో అధికశాతం మందిని బలి తీసుకుంటున్న అనారోగ్య సమస్య. ఈ క్యాన్సర్ తొలినాళ్లలో బయటపడకుండా చివరివరకు మనిషిలో దాక్కుని మనిషిని మరణానికి చేరువగా నెట్టి నరకాన్ని చూపిస్తుంది. అందుకే క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు గానూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన జరుపుకుంటూ వస్తున్నారు. ఇంతకూ ఈ క్యాన్సర్ డే ఎలా ఆవిర్భవించింది. ఆరోజున చేసే పనులు ఏమిటి?? క్యాన్సర్ అధిగమించడం ఎలా?? వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అందరికోసం… ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ క్యాన్సర్ దినోత్సవం 2008 లో  ప్రకటించబడింది. క్యాన్సర్ సమస్య చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మనిషిని మరణానికి చేరువగా తీసుకెళ్లేవరకు బయటపడదు. ఈ కారణంగా క్యాన్సర్ మీద అందరికీ అవగాహన కల్పించాలని, క్యాన్సర్ ను మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, క్యాన్సర్ గురించి అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రపంఫమ్ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) 1993లో జెనీవాలో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలనకు, వైద్య పరిశోధనలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సభ్యత్వ-ఆధారిత సంఘం.  దాని ఆధ్వర్యంలో, అదే సంవత్సరంలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మొదటి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు.  అనేక ప్రసిద్ధ సంస్థలు, క్యాన్సర్ సంఘాలు, చికిత్సా కేంద్రాలు ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చాయి.  2000లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రపంచ సదస్సులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అధికారికంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పారిస్‌లో జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ సంస్థల సభ్యులు, ప్రముఖ ప్రభుత్వ నాయకులు ఈ సదస్సుకు  హాజరయ్యారు.  క్యాన్సర్ రోగుల జీవితం బాధాకరంగా మారకుండా, వారి జీవితం మెరుగ్గా గడిచిపోయేందుకు ప్రపంచం నిర్వర్తించాల్సిన బాధ్యతను వివరిస్తూ, 10 కథనాలతో కూడిన 'చార్టర్ ఆఫ్ ప్యారిస్ ఎగైనెస్ట్ క్యాన్సర్' పేరుతో ఒక పత్రంపై సంతకం చేయబడింది.  క్యాన్సర్‌ గురించి పరిశోధించడం, నివారించడం, దానికి చికిత్స చేయడంలో పురోగతి సాధించడం. పరిశోధనల కోసం పెట్టుబడి వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి.   ఈ చార్టర్‌లోని ఆర్టికల్ ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది.  క్యాన్సర్ అనేక రకాలను కలిగి ఉంది, కాబట్టి నిర్దిష్ట రకం క్యాన్సర్‌ను గుర్తించడానికి మరియు దానితో పోరాడడాన్ని ప్రోత్సహించడానికి వివిధ రంగులు మరియు చిహ్నాలు ఉపయోగించబడతాయి.  ఉదాహరణకు, ఆరెంజ్ రిబ్బన్ అనేది పిల్లల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం, పింక్ రిబ్బన్ ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనతో ముడిపడి ఉంది.  ప్రాణాలతో బయటపడిన వారి ఆశకు చిహ్నంగా, డాఫోడిల్ పువ్వును  ఉపయోగిస్తారు.  క్యాన్సర్ డే రోజు ఏమి చేయవచ్చు??  ఈ రోజున, ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యాపారాలు, మార్కెట్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఉద్యానవనాలు మొదలైన వాటిలో వ్యక్తులు, సంఘాలు, సంస్థలను ఒకచోట చేర్చి ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి, ఈవెంట్స్ ను నిర్వహిస్తారు. దీనికోసం విరాళాల సేకరణ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది.  క్యాన్సర్ బారిన పడిన వారు ఒంటరి కాదు, ఈ ప్రపంచం వారికి అండగా నిలబడుతుంది అనే భరోసా ఇవ్వడమే ఈ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ ను మందులతోనే కాదు ప్రేమ, ఆప్యాయత, సహకారంతో కూడా తరిమికొట్టండి. అలాగే ప్రేమను, ఆప్యాయతను క్యాన్సర్ బాధితులకు మనఃపూర్వకంగా పంచండి.                              ◆నిశ్శబ్ద.       

సి.పి బ్రౌన్ పుట్టింది మన దేశంలోనే అని మీకు తెలుసా?

భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా భారతీయుల పరిస్థితులను, ముఖ్యంగా తెలుగువారి పరిస్థితులను అర్థం చేసుకుని తెలుగువారి జీవితాలకు కొత్త దారి చూపించిన ఆంగ్లేయ అధికారులు నలుగురున్నారు. సర్ థామస్ మన్రో. కాలిన్స్ మెకెంజీ. సర్ ఆర్థర్ కాటన్. సి.పి. బ్రౌన్. ఆ నలుగురూ. తెలుగువారు ఈ నలుగురిని ఎప్పటికీ మరచిపోరు. ముఖ్యంగా తెలుగు భాష విషయంలో సి.పి. బ్రౌన్ కృషి మరువలేనిది. అయితే సి.పి. బ్రౌన్ ఆంగ్లేయ అధికారిగా ఇక్కడికి వచ్చినా ఆయన పుట్టింది మాత్రం భారతదేశంలోనే.. చాలా ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. సి.పి. బ్రౌన్ తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడిగా 1786లో కలకత్తా వచ్చాడు. హిందూ మతాచారాలను అవగతం చేసుకొనే లక్ష్యంతో భారతీయ భాషలను నేర్చుకున్నారు. ప్రాచ్యభాషా సంస్కృతులపట్ల ఆదరాభిమానాలు కలవాడు డేవిడ్ బ్రౌన్. ఈ క్రమంలోనే సి.పి.బ్రౌన్ రెండవ కొడుకుగా కలకత్తాలో జన్మించాడు. ఆ తరువాత తండ్రి చనిపోయిన తరువాత వీరు ఇంగ్లాండ్ కు వెళ్లిపోయారు. అయితే ఈస్టిండియా కంపెనీ కోసం బ్రౌన్ లండన్ (హెర్ట్ఫోర్డ్ లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్పించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతం లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 'బంగారుపతకాలు' యిచ్చేవారు. ఆ పతకం అంచు చుట్టూ"తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం" అన్న సంస్కృత సూక్తి ఒకవైపు, మరోవైపు 'శ్రీవిద్యా వరాహ' అని చెక్కబడి వుండేది. ఆవిధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారు పతకం పొందాడు. బ్రౌన్ భారతదేశానికి వచ్చినప్పటికీ ఆయన వయసు 19 ఏళ్ళు. తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకొన్నాడు. పదహారు నెలల్లో తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. థామస్ మన్రో ప్రభావం, ఆయన 'కాన్వోకేషన్' ఉపన్యాసంలో తెలుగులో  చేసిన ప్రసంగం బ్రౌన్ మనసులో గాఢంగా పాతుకుపోయింది. ఈయన మొదటగా కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పాడు. ఆయన పలు చోట్ల పని చేసినా ఎక్కడా స్థిరాస్తి సంపాదించలేదు. కడపలో పెద్ద బంగళా, తోట కొన్నారు. అప్పట్లో అతని వేతనం 5-6 వందలకు మించదు. బంగాళాలో పెద్ద గ్రంథాలయం నెలకొల్పాడు. సొంత డబ్బుతో పండితులను నియమించాడు. బంగళాను 'సాహిత్య కర్మాగారం'గా రూపొందించాడు. అవిద్య ఆకాండతాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా వున్న కాలమది. 1821లో కడపలో రెండు బళ్ళు పెట్టాడు. ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించాడు. ఆ బళ్ళలో దేశీయ ఉపాధ్యాయులను నియమించాడు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు. "హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్"పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది. వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. మచిలీపట్నం కోర్టు పండితుడు తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, వర్యం అద్వైత బ్రహ్మ శాస్త్రి, ఆ దశలో సాహిత్య విద్యా గురువులయ్యారు. వేమన పద్యాలకు అర్థతాత్పర్యాలు బోధించారు. తెలుగు వ్యాకరణ, ఛందస్సూత్రాలు నేర్చుకొన్నాడు బ్రౌన్. దాదాపు 2 వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 633 పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అచ్చు వేయించాడు. అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విస్తృత ప్రచారం కావించాడు.                                    ◆నిశ్శబ్ద.

ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం మనదగ్గరే ఉంది!

ఈ ప్రపంచంలో మనిషికి కావలసిన తప్పనిసరి అవసరాల్లో ఆహారం ఒకటి. దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ప్రాణి ఏదైనా ఆహారం లేకుండా బతకడం కష్టం. అందుకే ఆహారం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషి తనకు సరిపడిన ఆహారం పొందడం అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించబడింది కూడా. అయితే ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి పదిమందిలో ఒక్కరు దీర్ఘకాలిక ఆకలితో అలమటిస్తున్నారు. 1945 సంవత్సరం నాటికి ఐక్యరాజ్యసమితి ప్రతి మనిషి ఆహారం పొందడాన్ని హక్కుగా గుర్తించలేదు. అయితే 1979, అక్టోబర్ 16 న ఆహారం పొందడం కూడా ఒక హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించడంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ప్రపంచంలో ఆహార భద్రత ఉన్న దేశాల్లో భారతదేశం ప్రస్తుతం 68వ స్థానంలో ఉంది.  కొన్ని దేశాలలో కనీసం రొట్టె ముక్కకు నోచుకోని జీవితాలు ఉన్నాయి. ఆహారం కోసం తుపాకులు పట్టుకుంటున్న వాళ్ళు, దొంగలుగా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొందరు బానిసత్వంలో మునిగిపోతున్నారు. భారతదేశం ఆహార భద్రత దృష్ట్యా 68 వ స్థానంలో ఉన్నా ఎంతో మందికి ఆహారం దొరకడం లేదు. అధిక జనాభా గల భారతదేశంలో సగటు పౌరుడు అన్నిరకాల అవసరాలకు పోరాటం చేయాల్సిందే.  అంతే కాదు మహా నగరాలుగా పిలవబడే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలలో స్లమ్ ఏరియాలలో, ఫుట్ పాత్ ల మీద ఎంతోమంది ఆహారం సరిగా లేక బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంటారు. ఇలాంటి వారికోసం ఆహార రక్షణ కల్పించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత.  ఏమి చేయచ్చు!! ప్రతి పౌరుడు ప్రపంచం మొత్తం ఆకలి మంటలు చల్లార్చలేకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి ఆకలి తీర్చగలడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరిస్తే తప్పకుండా ఆహారం అందరికీ అందుతుంది.  సామాజిక స్పృహ కలిగిన కొంతమంది కలసి ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయవచ్చు. ఆహారాన్ని సేకరించడం, అవసరమైన వారికి అందించడం ఈ పనిలో భాగం. దీనివల్ల కొందరికైనా ఆహార భద్రత కల్పించినవారు అవుతాము. భారతీయ ఫంక్షన్ లు, పెళ్ళిళ్ళ్ళు, ఇతర శుభకార్యాలలో చాలా ఆహారం మిగిలిపోతూ ఉంటుంది అలాంటి ఆహారాన్ని సదరు కార్యక్రమాలు జరుపుతున్న యజమానులతో మాట్లాడి ఆరోగ్యకరమైన రీతుల్లో సేకరించి ఎంతోమంది ఆకలి తీర్చవచ్చు.  ఆహార భద్రత పెరగాలి అంటే చేయాల్సిన మరొక పని, చిన్న రైతులను ప్రోత్సహించడం. ఆహార ధాన్యాలను వారి నుండి కొనుగోలు చేస్తే వారికి పంట అమ్మకం మీద భరోసా వస్తుంది. వారు పంటలు పండించగలరు. ఆహార భద్రత కోసం విరాళాలు సేకరించడం కూడా ఎంతో మంచి పని. దేశ వ్యాప్తంగా ఎన్నో స్వచ్చంధ సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి కూడా. ప్రతి గ్రామంలో బాధ్యతాయుతమైన యువత సమూహంగా ఏర్పడి విరాళాలు సేకరించి ఆయా గ్రామాల్లో ఉన్న వారికి ఆకలి తీర్చడానికి ప్రత్యామ్నాయాలు కనుగొనగలిగితే ప్రతి గ్రామం నుండి మొదలై దేశ వ్యాప్తమవుతుంది ఈ గొప్ప అడుగు.  ఇకపోతే ఈ ఆహార దినోత్సవం ఎందుకు అంత ముఖ్యమైనది?? దీని గురించి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తూ చర్చించుకోవాలి అనే విషయంలోకి వెళితే. ప్రపంచంలో ఆకలి వల్ల మనుషుల ప్రవర్తనలు, ప్రవృత్తులు మారిపోతాయి. మనుషులు తమ తమ కౄరత్వాన్ని పెంచుకోవడానికి ఆహారం ముఖ్య కారణం అవుతుంది. ఆహార లభ్యత ఏర్పడితే మనుషులలో ఈరకమైన ప్రవృత్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్టు ఆహారం పొందడం ప్రతి మనిషి హక్కు అయినప్పుడు దాన్ని పొందడం అనేది మనిషి బాధ్యత కూడా. అందుకే ఆహారాన్ని వృధా చేయద్దు, అలా చేస్తే ఇతరుల ఆహారాన్ని వారి నోటి నుండి లాక్కున్నట్టే. ఇతరుల ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం ఏదైనా ఉందంటే అది మనదగ్గరే ఉంది, ఆహారాన్ని వృధా చేయకపోవడమే ఆ గొప్ప ఆయుధం. ఈ విషయం మరిచిపోకండి.                                         ◆నిశ్శబ్ద.

మీరూ జుట్టు పిచ్చోళ్లేనా?

డబ్బెవరికి చేదు టైపులో జుట్టెవరికి చేదు చెప్పండి. జుట్టేమైనా తింటామా చేదు, తీపి, కారం అనడానికి అని డౌట్ వస్తే దాన్ని అవతలికి తరిమేయ్యండి. ఒకప్పుడు నాగుపాము జడలు, జులపాల జుట్టులు, గాలికి ఎగిరెగిరి పదే హెయిర్ క్రాఫులు అబ్బో ఆ కాలమే వేరబ్బా!! మరిప్పుడో….. హెయిర్ ఫాల్ అనే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్న జుట్టుపోకుంటే చాలు దేవుడా అని కోటి నమస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువున్నారు. చెబితే నమ్మరు కానీ అమ్మయిలలో కూడా బట్టతల సమస్య కనబడుతూ ఉంటుందనే మాట వింటే విచిత్రంగానే ఉంటుంది. అవన్నీ వొద్దులే కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి, తెలిసిన విషయం గురించి కాసింత మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ ఆలోచించాలి, ఆలోచించి ఇంకేం చేస్తాం మనం అలా చెయ్యకుండా ఉండాలి. ఎలా చెయ్యకుండా ఉండాలి? జుట్టెవరికీ చేదు కాదు. మళ్లీ అదేమాట ఎందుకంటారా?? సరే జుట్టు అంటే అందరికీ ఇష్టమే. కొంతమందికి అదృష్టవశాత్తు బాగానే ఉంటుంది. జుట్టు లేకపోవడం రాలిపోవడం, క్రమేణా దాని వాల్యూమ్ తగ్గిపోవడం వీటికి కారణాలు బోలెడు ఉంటాయి.  వాటిలో మొదటిది డిప్రెషన్. ఈకాలంలో ఈ మాట సహజం అయిపోయింది. అందుకే జుట్టు తక్కువున్నోళ్లు కూడా ఎక్కువైపోయారు. బట్టతలలు, ఎలుక తోకలు కామన్ అయిపోయాయి. ఏదో ఈకాలం లో ఫాషన్ పుణ్యమా అని కాస్త జుట్టు లూజుగా వదుల్తారు కాబట్టి ఎలుక తోక కూడా చిన్న కాలువలాగా కళకళలాడుతూ ఊగుతూ ఉంటుంది. రెండవ కారణం డిఎన్ఏ. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఫ్యామిలీస్ లో బట్టతల వంశపార్యపరంగా వస్తున్నవాళ్ళు పాపం బోలెడు ఉంటున్నారు. జుట్టు పలుచగా ఉండటం, బట్టతల రావడం మాత్రమే కాకుండా అతిగా జుట్టు పెరగడం కూడా డిఎన్ఏ మాజిక్కే. మూడవ కారణం లైఫ్ స్టైల్. ఆహారంలో biotin పుష్కలంగా ఉండాలి. జుట్టు, గోర్లు, చర్మం మొదలైనవి ఆరోగ్యంగా పెరగాలంటే ఈ పోషకం అవసరం. అలాగే శరీరానికి కావలసినంత విటమిన్ డి, చర్మానికి విటమిన్ ఈ కూడా అవసరం. మొత్తంగా చెప్పాలంటే విటమిన్, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దాంతో పాటు జుట్టు సంరక్షణ ముఖ్యం. ప్రస్తుత కాలంలో పొల్యూషన్, జంక్ ఫుడ్ వంటివి మనిషి భౌతిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. అదే అదే భౌతిక స్వరూపమంటే బాడీ షేప్ అన్నమాట. ఇలా ఇన్ని సమస్యలు మనిషి చుట్టూరా ఉన్నప్పుడు ఆ జుట్టును కోల్పోయేవాళ్ళు కూడా  లోలోపల బాధపడుతూనే ఉంటారు. కానీ ఆ బాధ కంటే కూడా బయటి వాళ్ళు వేలెత్తి చూపించి వెకిలిగా నవ్వుతూ జోక్స్ వేస్తుంటే మాత్రం ఇంకా ఇంకా కుమిలిపోవడం జరుగుతుంది. లేనిదాన్ని ఎక్కడి నుండి తెస్తారు? అదే లేని జుట్టును ఎక్కడి నుండి తెస్తారూ అని ఎవరైనా ఆలోచిస్తారా?? ఎంతసేపూ నీ పిలక, నీ బట్టతల అని ఏకసెక్కాలే కానీ జట్టులో ఏముందిలే మనిషి స్వభావం మంచిది అని ఎవరైనా అనుకుంటారా?? లేదే ఇతరుల్ని ఇన్సల్ట్ చేయడం అదొక రాచకార్యం అయిపోయింది అందరికీ.  ఇవన్నీ తెలిసాక ఇంకొక విషయం. ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ లో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్లిలో పెళ్లి కొడుకు పాపం కళ్ళు తిరిగి పడిపోయాడు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెళ్లి కొడుకు ముఖం మీద నీళ్లు జల్లి పైకి లేపుతున్నపుడు అతడి టైమ్ బాగలేక పెట్టుకున్న విగ్గు జారిపోయింది, అప్పటివరకు పెళ్లి కొడుక్కు స్టైల్ హెయిర్ స్టయిల్ అనుకున్న అమ్మాయి డిజప్పాయింట్ అయిపోయింది. ఇంకేముంది సినిమాటిక్ గా ఈ పెళ్లి క్యాన్సిల్ డైలాగ్ కూడా చెప్పేసింది. చెప్పేసాక ఇక ఏమవుతుంది ?? పెళ్లి ఆగిపోయింది. ఇలా ఇలా అన్నీ బాగున్నా కేవలం జుట్టు కారణంగా మనుషుల మధ్య ముఖ్యంగా ఆడ, మగ రిలేషన్స్ మధ్య ఈ జుట్టు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతోంది.  అందుకే జుట్టు విషయంలో పిచ్చిగా ఉండకండి. లైట్ తీసుకోండి.                              ◆వెంకటేష్ పువ్వాడ.

పసిపిల్లలను పని పిల్లలుగా చేయొద్దు!

చట్టాల ప్రకారం బడి వయసు పిల్లలు బడిలో ఉండాలి. వాళ్ళు బయట పనులు చేయకూడదు. అందరికీ విద్యలో భాగంగా ప్రభుత్వాలు అన్ని వర్గాల వారికీ ఉచిత విద్యను ప్రవేశ పెట్టాయి. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. ఆఖరికి పాఠశాలలోనే భోజనము పెడుతూ పిల్లలను విద్యాధికులుగా మార్చి ఈ దేశానికి బంగారు బాటలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ పిల్లలందరూ చదువుకోవడం లేదేందుకు? పేదరికం! పసిపిల్లల జీవితాలు పనిపిల్లల వర్గంలో పడిపోవడానికి కారణం పేదరికం అనేది నమ్మాల్సిన నిజం. పేదరికం ఉంటే ఏంటి ప్రభుత్వాలు ఉచిత విద్య అందిస్తున్నాయి కదా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ సమస్య కేవలం పసిపిల్లలదే అయితే పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ  సమస్య ఆ పసిపిల్లల కుటుంబాలది. చిన్నతనంలోనే కుటుంబాన్ని మోయాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తులు చనిపోవడం వల్ల ఇంటి భారాన్ని భుజాలకు ఎత్తుకుని పనిపిల్లలుగా మారుతున్నవాళ్ళు అధికం.  బాలకార్మికులు! ఈ కాలంలో ప్రతిరోజూ ప్రతి వీధిలో కనీసం ఒక్కరైనా బడిలో ఉండాల్సిన పిల్లలు పనులు చేస్తూ కనిపిస్తారు. ఇంటి పనులు చేస్తూ, బిల్డింగ్ వర్క్ లు, షాప్ లలోనూ ఆఫీసులలోనూ ఫ్లోర్ తుడుస్తూ, ఇంకా వీధుల్లో ఆహారపదార్థాలు అమ్ముతూ, ట్రైన్ లలోనూ, బస్టాండ్ లలోనూ, ఫ్లాట్ ఫామ్ ల మీద ఎక్కడ చూసినా లేత చేతులు, కాళ్ళు మోయలేని బరువులతో ఆగని నడకలతో సాగుతూనే ఉంటారు. వీళ్ళందరూ తమ బాల్యాన్ని సంతోషంగా గడపలేకపోయినా చెప్పలేనంత భారంతో జీవిత బండ్లు లాగుతున్నవాళ్ళు. సమాజం వీళ్ళను బలకార్మికులు అంటోంది. సుమారు 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ బాలకార్మికులలో భాగంగా ఉన్నారు. కారణాలు! పైన చెప్పుకున్నట్టు పేదరికం బాలకార్మికులు తయారవ్వడానికి మూలకారణం. అది మాత్రమే కాకుండా అనాథ పిల్లలు ఈ వర్గంలోకి అర్థాంతరంగా వచ్చి పడుతున్నారు. పిల్లల బరువు మోయలేమనే కారణంతో కొందరు పిల్లలను ఎక్కడంటే అక్కడ వదిలేసి బరువు దించేసుకుంటారు. అలాంటి పిల్లలు బ్రతకడానికి  ఎన్నో మార్గాలు వెతుకుతూ పనివాళ్లుగా మారిపోతున్నారు.  ఆర్థిక భరోసా లేని జీవితాల వల్ల పిల్లలకు ఎలాంటి రక్షణ ఉండదు. పెద్దవాళ్ళ లాగా పనికి తగ్గ పలితాన్ని డిమాండ్ చేసే ఆలోచన, ధైర్యం వాళ్లకు ఉండవు. జీవితం గురించి ఒకానొక భయం వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. కేవలం కడుపు నింపుకోవడానికి అడ్డమైన చాకిరీ చేస్తుంటారు. యజమానులు కూడా కఠినంగా ఉంటూ పిల్లల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని శ్రమదోపిడి చేస్తారు.  తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండే పిల్లలు ఈ వర్గంలోకి రావడం చాలా అరుదు. ఎటొచ్చి అయినవాళ్ళు లేకుండా వీధినపడ్డ వాళ్ళు ఎక్కువ. ఇంకా పేదరికంలో ఉండే కుటుంబాలలో బాధ్యత లేని తండ్రుల వల్ల బాలకార్మికులుగా మారుతున్నవాళ్ళు ఎక్కువ.  ముంబయ్, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా వంటి రాజధాని ప్రాంతాలలో స్లమ్స్ ఏరియాలలో ఇలాంటి బాలకార్మిక పసి కుసుమాలు ఎక్కువ. పరిష్కారాలు! ఈ బాలకార్మికులకు నివాసం, రక్షణ అనేది పెద్ద ప్రశ్నలుగా ఉంటాయి. ప్రస్తుత భారతదేశంలో పిల్లలకు ఉచిత విద్య అందించినా సరైన రక్షణ లేక, ఒక మంచి మార్గనిర్దేశకం చేసేవాళ్ళు లేక చాలా అయోమయంలో పడిపోతున్నారు. నిజానికి సమాజంలో ఉన్న అందరూ సంకల్పం చేసుకుంటే బాలకార్మిక వ్యవస్థను చాలా వరకు నిర్మూలించవచ్చు. ప్రస్తుత కాలంలో పిల్లలకు మేమున్నామనే ధైర్యం ఇస్తూ ఉంటే ఎంచక్కా చక్కగా చదువుకుంటారు. వాళ్ళ ప్రతిభను అనుసరించి ఎన్నో ఫౌండేషన్ లు డొనేషన్ లు విద్యార్థులను ఆదుకుంటున్నాయి. ఆలోచించుకోలేని వయసులో కాసింత ఆవాసం ఇస్తే బాలకార్మికులు కాస్తా బావిభారత పౌరులు అవుతారు. ◆వెంకటేష్ పువ్వాడ.

ఈ స్వేచ్ఛకు మూలం ఇదే!

దేశం యావత్తూ భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రం గురించి గొప్పగా పొంగిపోతుంది. స్వాతంత్య్రం సిద్దించినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న నాయకుల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమయ్యిందని నినదిస్తుంది. స్వాతంత్య్రం నుండి గణతంత్ర్యం వరకు ఇదే తీరు పెఅతి చోటా కనిపిస్తుంది. కానీ భారతదేశ స్వేచ్చా పోరాటాలు ముందుకు సాగడానికి ప్రాణాలను ఎంతో సునాయాసంగా చేతుల్లో నుండి జారవిడిచిన వీరుల ప్రేరణా ఫలితమే ఈ స్వాతంత్ర్య భారతం. అటువంటి వారిలో భగత్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. అతిచిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయ యువత గుండె ఉప్పొంగుతుంది. భారతీయులలో ఉత్తేసిజం కలుగుతుంది.   భారత స్వాతంత్ర్య విప్లవజ్యోతి సర్దార్ భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడుతుందని ముందే తెలుసు. అందుకే తనతోపాటు శిక్ష పడుతున్న తన స్నేహితులు రాజగురు దత్తులకు, లియోనాయిడ్ ఆండ్రీన్ రాసిన  'సెవెన్ దట్ వర్ హ్యాంగ్' అనే  నవలను చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆ నవలలో ఒక పాత్రకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఆ పాత్ర “నన్ను ఉరి తీయకండి”, “నన్ను ఉరితీయకండి" అంటూ ఉంటుంది. చివరకు ఉరి తీయడానికి ఉరి కంబం వద్దకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా “నన్ను ఉరి తీయకూడదు" అంటూనే ఉంటుంది. భగత్ సింగ్ ఆ ఘట్టం వర్ణించేప్పుడు అతని కళ్ళు వర్షించేవి. అది చూసిన సదరు స్నేహితులు మృత్యువంటే రమ్మని సవాల్ చేసే తమ కామ్రేడ్, మరణభయంతో వణికే ఒక నవలా పాత్ర కోసం కన్నీరు కార్చే దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ కు  ఉరిశిక్ష అమలు జరుపుతున్నా సమయంలో భగత్ సింగ్ ఉరి కంబం దగ్గరకు వెళ్ళాడు. అక్కడే ఉన్న మేజిస్ట్రేట్ తో.. "మేజిస్ట్రేట్ సాబ్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక భారతీయ విప్లవకారుడు, తన మహత్తర లక్ష్యసాధన కోసం నవ్వుతూ ప్రాణాలర్పించడానికి ఉరి కంబం ఎలా ఎక్కుతాడో చూసే అవకాశం మీకు దొరికింది” అని చెప్పి చిరునవ్వుతో ఉరి కంబపు ఉరి తాడు మెడకు తగిలించుకున్నాడు.  "నా జీవనజ్యోతి ఉదయపు వెలుగులా ఆరిపోయినా, మా ఆదర్శం, మా భావాలు విద్యుల్లతల్లా ప్రపంచాన్నంతా జాగృతం చేస్తాయి. నా పిడికెడు బూడిద నశించిపోతే ప్రపంచానికి నష్టమేమిటి?” అన్నాడు. కేవలం ఇది మాత్రమే కాదు. భగత్ సింగ్ కు ఉరిశిక్ష అని తెలిసిన తరువాత ఆయన తాంత్రి తన కొడుకును ఆ శిక్ష నుండి తప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసాడు. అప్పుడు భగత్ సింగ్ తన తండ్రి కోసం ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరాన్ని చదివితే ప్రతి భారతీయుడు దేశానికి ఎంతో గౌరవం ఇస్తాడు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది... పూజ్యులైన తండ్రిగారికి, నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో, కానీ ఈ దేశపౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను. కానీ మీ కన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా? నేను బ్రిటిషర్లపై చేసిన దాడిని నేరంగా భావించటం లేదు. అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషినని నిరూపించుకునేందుకు, కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు. నాన్నా... నా జీవితం మనదేశం కన్నా విలువైందేమీ కాదు. కేవలం నా జీవితమే కాదు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణం చేయాలని నమ్ముతాను. అందుకు ఎన్ని ప్రతిఘటనలనైనా ఎదుర్కోవాలి. అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా కాలం తీరిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి. నాకు తెలుసు నా మెడకు ఉరితాడు బిగించడమే జీవితంలో ఆఖరిక్షణం అవుతుంది. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కాని దయనీయం కాదు. ఎలాంటి స్వార్ధం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశస్వాతంత్య్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. మానవాళికి సేవచేయటానికి, పీడితులకు విముక్తిని కల్పించటానికి యువతరం ముందుకొచ్చినప్పుడే నవయుగానికి నాంది సాధ్యమవుతుంది.  నాన్నా... నా మరణం తరువాత  ముందు తరాలకు త్యాగమనే సుగుణం తీగలా వ్యాపించేలా చూడండి. ఎలాంటి పరీక్షాసమయంలోనైనా మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీకుండా చూసుకొమ్మని ప్రోత్సహించండి... ఇక సెలవు…                         ఇట్లు                మీ ప్రియ పుత్రుడు                   భగత్ సింగ్. ఓసారి ఇలాంటి విప్లవ వీరుల మాటలు, వారి అంతరంగం విన్నా, వారి నాటి స్థితిగతులు తెలుసుకున్నా దేశానికి తగిన మార్గం ఈ భారతీయ పౌరులకే అర్థమవుతుంది.                                    ◆నిశ్శబ్ద.

ఘనమైన గణతంత్ర్యానికి వెనుక ఏమి జరిగింది?

భారతదేశం సువిశాల సంపన్న దేశం. నాటి నుండి నేటి వరకు భారతదేశ గొప్పదనం ఈ ప్రపంచ వ్యాప్తంగా తెలియనిది కాదు. అయితే భారతదేశం బానిసత్వంలో చిక్కుకుని ఆ తరువాత స్వేచ్ఛ కోసం పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జరుపుకునే గణతంత్ర్య దినోత్సవం 74వది.  దేశం మొత్తం గణతంత్ర్య దినోత్సవం నాడు ఎంతో సందడి నెలకొంటుంది. అయితే స్వాతంత్య్రానికి గణతంత్ర్య దినోత్సవానికి తేడా ఏమిటనేది చాలా కొద్దిమందికే తెలుసు. గణతంత్ర్య దినోత్సవం భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం జరుపుకుంటారు.  1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమ గణతంత్ర్య రాజ్యాంగ భారతదేశం అవతరించింది. 1946 డిసెంబర్ 9 వ తేదీన మొదటి సారి రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. ఆ తరువాత 1949 నవంబర్ 26 వ తేదీన చివరి సమావేశం జరిగింది. ఆ తరువాత సంవత్సరం ఈ రాజ్యాంగం ఆమోదించబడింది. రాజ్యంగ ముసాయిదా కమిటీకి డా.బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వం వహించారు. ఈ రోజునే గణతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1930 జనవరి 26 న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి పూర్ణ స్వరాజ్యాన్ని ప్రకటించింది.  భారత పౌరులు తమ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే శక్తిని కూడా గణతంత్ర దినోత్సవం గుర్తుచేస్తుంది.  రిపబ్లిక్ డే… భారత రిపబ్లిక్ డే లేదా గణతంత్ర్య దినోత్సవం రోజున జరిగే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. భారత రాష్ట్రపతి దేశంలోని ఎంపికైన పౌరులకు పద్మ అవార్డులను పంపిణీ చేస్తారు, వీరికి మాత్రమే కాకుండా దేశం కోసం తమ ధైర్యసాహసాలు చాటిన వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర మరియు వీర చక్ర ప్రదానం చేస్తారు. ఇక  రిపబ్లిక్ డే పరేడ్ లో భాగంగా ఎన్నో రకాల విన్యాసాలు జరుగుతాయి. దేశం మొత్తం తమకు లభించిన స్వేచ్ఛను, తమకు రాజ్యాంగ పూర్వకంగా లభించిన హక్కులను చాటి చెబుతూ రిపబ్లిక్ డే ను ఎంతో ఘనంగా జరుపుకుంటుంది.                                     ◆నిశ్శబ్ద.

సేవకు అద్భుతమైన నిర్వచనం!

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ, అభిమానం. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దాయనకు వివాహమైంది, పిల్లలు కూడా! కానీ చిన్నతను పెళ్ళి చేసుకోలేదు బ్రహ్మచారిగానే జీవిస్తూ ఉన్నాడు. వారిద్దరికీ ఉమ్మడిగా కొంత పొలం ఉంది. అది సారవంతమైంది కావటంతో ఏటా ఇబ్బడిముబ్బడిగా దిగుబడి వచ్చేది. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లాభాన్ని ఇద్దరూ చెరిసగం పంచు కునేవారు. ఇలా కొన్నేళ్ళు గడిచాక, ఒకరోజు అర్ధరాత్రి, ఆ అన్నయ్య నిద్దరలోంచి మేల్కొని ఆలోచించడం మొదలుపెట్టాడు. 'అరే! నా తమ్ముడి విషయంలో ఎందుకో అన్యాయం జరుగుతోందని అనిపిస్తోంది. నాకు పెళ్ళయింది పిల్లలున్నారు. భవిష్యత్తులో నా బాగోగులు చూసుకోవడానికి నాకు వాళ్ళున్నారు. కానీ, తమ్ముడిని ఎవరు చూసుకుంటారు! వాడికి ఏదో ఒకటి చేయాలి వచ్చిన లాభాల్లో వాడికి ఎక్కువ ముట్టజెబితే భవిష్యత్తులో భద్రతగా ఉంటుంది' అనుకొని ఒక నిర్ణయాని కొచ్చాడు.  వెంటనే మంచం దిగి, పొలానికి వెళ్ళి, కొంత ధాన్యాన్ని తీసుకొని తమ్ముడి ధాన్యంలో కలిపాడు. మరోవైపు తమ్ముడు కూడా అన్న విషయమై ఆలోచించసాగాడు. 'నేను ఒక్కడిని, లాభాల్లో సగం వాటా తీసుకొని ఏం చేసుకుంటాను అన్నయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయనకు నా కన్నా ఎక్కువ అవసరాలుంటాయి. ఎలాగైనా, అన్నయ్యకు ఎక్కువ వాటా అందాలి' అనుకొని హుటాహుటిన వెళ్ళి, తన ధాన్యంలో కొంత ధాన్యాన్ని అన్నయ్య ధాన్యంలో కలిపాడు. ఇలా వీలున్నంత వరకు ఒకరికి తెలీకుండా, మరొకరు ప్రతి సంవత్సరం ఒకరికొకరు లాభపడేలా చూసుకునేవారు.  ఇలా ఒక రోజు అర్ధరాత్రి ఆ అన్నదమ్ములు ఒకరి ధాన్యంలో మరొకరు ధాన్యాన్ని కలిపివస్తూ ఒక దగ్గర కలుసుకోవడం ఆ ఊరిపెద్ద గమనించాడు. వారి ప్రేమాభిమానాలకు చలించిపోయాడు. వారి త్యాగగుణాన్ని ఊరంతా ప్రచారం చేశాడు. కొన్నేళ్ళకు ఆదర్శవంతమైన ఆ అన్నదమ్ములు గతించిపోయారు. ఒకానొక సందర్భంలో ఆ ఊరిలో గ్రామస్థులు ఆలయాన్ని కట్టించాలని అనుకున్నారు. దేవాలయ నిర్మాణానికి ఏది సరైన స్థలమనే చర్చ రాగా, గతంలో ఆ రాత్రి అన్నదమ్ములు కలుసుకున్న చోటే అనువైనదని తేల్చిచెప్పారు. నిస్వార్థం, త్యాగం నిండిన ఆ ఇద్దరి ఆదర్శం ఆలయరూపంలో తరతరాలకు ప్రసరింపచేయాలని నిర్ణయించారు. కానీ ఈ రోజుల్లో 'సేవ',''త్యాగం' అన్న పదాలకు అర్థాలే మారిపోతున్నాయి. సమాజంలో ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. వంటి ఉన్నతోన్నత ఉద్యోగాల ద్వారానే సేవ చేయ వచ్చనుకుంటున్నారు. పదానికున్న ప్రాధాన్యమే మారిపోయింది. ముఖ్యంగా నేటితరం నిత్యజీవితంలో త్యాగం, ఉదారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ఏదో ప్రత్యేక సందర్భంలో పళ్ళో, మిఠాయిలో పంచితే సరిపోతుందని  అనుకుంటోంది. కానీ  'సేవ'కు మహోన్నతమైన స్థానం ఉంది. ఒకప్పుడు ఈ సేవ స్ఫూర్తితో వందలాది మంది తమ జీవితంలో సేవకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఇతరుల మంచిని కాంక్షిస్తూ సేవచేస్తే పరోక్షంగా అది మన మంచికే ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. దీని వలన వ్యక్తిగా మన మూర్తిమత్వం వేయింతలవుతుంది, ప్రకాశిత మవుతుంది. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే 'సేవలు పొందే వ్యక్తి కన్నా, సేవించే వ్యక్తే ధన్యుడు. సేవించుకునే అవకాశం కలిగించినందుకు ఎదుటివారికే మనం ఋణపడి ఉంటాం. ఆ భగవంతుడు తనను పూజించుకునే భాగ్యాన్ని, పరోపకారం రూపంలో ఇచ్చాడని తెలుసుకోండి. ఆరాధనగా భావించి 'సేవ' చేయటం అలవాటుగా చేసుకోండి'.అంటారు. కాబట్టి సేవ అనేది మనిషికి జీవితంలో ఎంతో ముఖ్యం.                                      ◆నిశ్శబ్ద.

భావి భారతం ఎక్కడ ?

  చిదిమితే పాలుగారే వయస్సు వాళ్ళది, కొడితే ఎర్రగా కం దిపోయే శరీరం వాళ్ళది. బంగారు వర్ణం లో ఉండే ఆచిన్నారుల్ని అక్కున చేర్చు కునే  వారు  ఉన్నారా? అంటే ఉన్నారు అయితే సహజంగా ఆవయస్సులో పెడతా మంటే ఆశ ,  కొడతా మంటే  భయం . అలా అమాయకంగా, ఉంటున్న జీవితంలో ఏదో తెలియని నిస్సతువ, ఏదో  తెలియని  నిరుత్సాహం.  అందరిలాంటి పిల్లలే వీళ్ళు ఎప్పుడూ ఒంటరి తనం కోరుకుంటారు, కొన్ని సదర్భాలలో  ఉద్రేకా నికి లోనూ అవుతూ ఉంటారు. చిన్న పాటి నిర్లక్ష్యం, క్షణికావేశం వాళ్ళని నేరస్తులను చేస్తుంది. ఇవి సాదారణ అంశం కాదు భావితరం. ముందు ముందు దేశాన్ని నడిపించాల్సిన భావితరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవి. , అయితే పుడుతూనే దొంగలు కారు వీరు, ఖూనీ కొర్లు ఆగంతకులు కానే కారు వీళ్ళు, వారి వారి  సామాజిక ఆర్ధిక సమస్యలు వాళ్ళని ఈ పరి స్థితికి, తీసుకు వచ్చేందుకు  కారణమని కొందరు, కాదు కాదు  వాళ్ళు జీవిస్తున చుట్టు  పక్కల పరిస్థితులు వాళ్ళను నేరస్తులుగా నిరూపించా యని అంటున్నారు నిపుణులు. చిరు ప్రాయంలోనే బాల నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు. అందుకు కారణాలు,  అందరి జీవితల్లో నీకు యే జీవితం  ఇష్టం అని అడిగితే ఆడే పడే పసి వయస్సు పసి మొగ్గలాంటి చిన్నారులు అప్పుడే  మొగ్గ తొడిగిన ఆ చిరు  ప్రాయం లో అటు తల్లి తండ్రులు  ఇటు ఐన వాళ్ళను వదిలి బాల నేరస్తులుగా 3 నుంచి 7 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవస్తున్నారు ఆ చిన్నారులు.  అటువంటి చిన్నారుల జీవితం లో   కమ్ముకున్న అఛీ కట్లకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు చిన్నారులు చెప్పే సమాధానం ఏమిటి? అలాంటి బాల నేరస్తుల పట్ల ఎలా ప్రవర్తించాలి? అన్న అంశాలను జువనైల్ జస్టిస్ చట్టం 2015  ఏం  చెపుతోంది అనే అంశాన్ని తెలుసుకుందాం.                                                                       ప్రతి బాల బాలిక లోనూ శక్తి సామర్ధ్యలు ఉంటాయి. అందరూ శక్తి మంతులే, ఏదో సాధించాలి, తాను అందరిలా ఉన్నత స్థాయి లోకి ఎదగలన్న థ్హప త్రయం ఉంటుంది. భారత రాజ్యాంగం, బాల బాలికలకు అత్యంత ప్రాధాన్యత ను ఇచ్చింది అనడంలో ఏ మాత్రం  సందేహం లేదు  బాల బాలికల బధ్రత కోసం( జువానైల్ జూస్టిస్)చట్టం 2015 ప్రకారం బాల బాలికల సంరక్షణ, రక్షణ, వారి అభివృద్ధి, చికిత్స, సామాజిక బధ్రత, వివిధ సందర్భాలలో పిల్లలు ఎదుర్కుంటున్న సమస్యలపై వారి పట్ల  స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని కోరింది. పిల్లలు సహజంగా చాలా అమయంగానే పుడతారు. కొన్ని రాకల్ సమస్యల వల్ల వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్థూ ఉంటారని. అందులో కొన్ని సున్నిత మైనవిమరికొన్ని చట్టం తో ముడి పడ్డ ఆంశాలుగా విశదీక రింకారు.                                             పిల్లల్లో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది అంటే ఉద్రేక పూరితం గాను బయటి కి భావాన్ని వ్యర్థమ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు కన్నీటి పర్యంతం అవుతూ మరికొందరు కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. ఈ క్రమం లోనే చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడడం. దుర్భాష లాడడం. ఇతరుల పట్ల విచక్షణ కోల్పోడం.అనుచిత ప్రవర్తన, తరచుగా చిన్నప్పుడే అలవడడం  ఖద్దు. ఏ మైనప్పటికీ తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు ఇతరులు అంటే పిల్లల  సంరక్షణ బాధ్యతలు చూసే వారే  పిల్లలకి నయానో భయనో చెప్పి చూడాలే తప్ప వారిపట్ల ఖటినంగా వ్యవహరించడం కొట్టడం సరికాదని.                                                                            తెలిసి తెలిసి ఎవరు నేరం చేయరు అయితే అందుకు కారణమైన పరిస్థితులు పరిశీలించి. ఏ కరణాల వల్ల పరిస్థితుల వల్ల  నేరం  చేశారు. అక్కడ జరిగిన ఘటనలో  ఏ బాలుడు బాలిక నేరం చేశారని రుజువైందా? చిన్న చిన్న నేరాలు లేదా తీవ్ర  నేరాలు ఆరోపించ బడ్డ  బాలుర పట్ల ఎలా వ్యవహరించాలి? అన్న సమస్య కు జువనైల్ జస్టిస్ కొన్ని మార్గ దర్శకాలను సూచించింది. చైల్డ్  కన్ఫ్లిక్ట్ విత్ లా  అన్న అంశంలో జువానైల్ జస్టీస్ సెక్షన్ 2(13) ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాల బలికలు నేరం ఒప్పుకుంటే నేరం రుజువు ఐనా అతని నేరం ఆధారంగా శిక్షించవద్దని,  నేర తీవ్రత ఆధారంగా, ఉద్దేశ పూర్వకంగా నేరం చేయలేదని, నేర ప్రవృత్తి అతనికి లేదని,,  అందుకు  గల కారణాలను,  సామాజికి ఆర్ధిక, అంశాలు క్రోడీకలించాలని ఆ త్రువాతే   పరిమితులతో కూడిన  శిక్ష ,లేదా వ్యక్తి గత శిక్ష లేదా అతని ప్రవృత్తిలో మార్పు వచ్చేవిధంగా తగిన శిక్ష ను ఖరారు చేయాలని జువనైల్ జస్టిస్ సూచించింది. ఈ అంశాలపై అసలు సమస్యల పై చేసిన విశ్లేషణ, పరిశోదన  చూద్దాం.   2015 నాటికి జాతీయ స్థాయిలో  ఇతర నేరాలతో పోలిస్తే  బాలనేరస్తుల   గణాంకాల లో  జాతీయ  నేరాల పై  వచ్చిన రిపోర్ట్ ఏమి చెపుతోందో చూద్దాం.                                                                                                                                                           బాల బాలికలు జువనైల్ జస్టిస్  చట్టాన్ని వ్యతిరేకించడం  సరికాదని అభిప్రాయపడింది. బాల బాలికల సంరక్షణ, రక్షణ. అత్యవసరమని  జువనైల్ జస్టిస్  చట్టం  2015 లో పేర్కొంది. ముఖ్యంగా  18 సంవత్సరాలు నిండని బాల బాలికలు   ఏదైనా ఒక నేరం చేసినట్లు రుజు వైతే   జువనైల్ కమీషన్ వేసే నాటికి అతని లేదా ఆమె వయస్సు తక్కువ  అయినట్లు అయితే, ఆ నేరం చేసి నట్లు బాలురు ఒప్పుకుంటే. తనకు సరైన వాతావరణం లేని కరణంగా, లేదా  ఆ నేరం  చేసేందుకు మరో నేపధ్యం ఉన్నప్పుడు. అతనికి మరో కొత్త జీవి తాన్ని  ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కొన్ని నేరాలలో  నేర తీవ్రత ఆదారంగా , అందులో ఉద్దేశ పూర్వకంగా, నేరం చ్యలేదని, స్వత హా గా అతడు నేర ప్రవృత్తి గల మనస్తత్వం అతనిది లేదా ఆమెది కాదని, ఆ కేసు విషయం లో  నేరస్తులు గా చెప్పబడుతున్న వారి లో నేరం చేసే   తత్వం అందులో లేనప్పుడు,  అక్కడి వాతావరణం, పరిణామాలు అందుకు  గల కారణాలు, సరైనవి కానప్పుడు వీటిని చిన్న చిన్న నేరాలుగా  మాత్రమే పరిగ నించాలని జువనైల్ జస్టిస్ సూచించింది. అతని నేరం ఆధారంగా శిక్షించ  వద్దని తేల్చి చెప్పింది.  తప్పు చేసినా అతను లేదా ఆమె వారి విషయంలో వ్యక్తి గత శిక్ష, లేదా అతని ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా చర్యలు ఉండాలని సూచింది. వారి అవసరాలను గమనిస్తూ సామాజిక, మానసిక సంబంద మైన విషయా ల పట్ల కూడా నిశ్చింతగా  గమనించాల్సిన అవసరం ఉందని జువనైల్ జస్టిస్  నొక్కి చెప్పింది.                                                                        అసలు బాల బాలికలు ఎందుకు  బాల నేరస్తులుగా  మారుతున్నారు.జాతీయ స్తాయిలో  నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లో ఇప్పటికే 31, 396 మంది  బాల నేరస్తులు  ఉన్నట్లు నేషనల్ క్రైమ్  రిపోర్ట్ లో పేర్కొంది. ఇతర క్రైమ్ రిపోర్ట్  తో పోలిస్తే   2.1% మాత్రమే మెజారిటీ ఉందని ఆ రిపోర్ట్  లో పేర్కొన్నారు. అయితే ఇందులో ఉన్నవారు  చాలామంది  చిన్న చిన్న నేరాలు చేసిన వారే  అని రిపోర్ట్లో వివరించారు.  తల్లి తండ్రులు  ఆర్ధికంగా బల హీన పడిన వారు బలహీన వర్గాలకు చెందిన వారు 42.5% ఉన్నారని. మొత్తం మీద ఇందులో 11.5% మంది నిరక్ష రాస్యులే, ఉండడం గమనార్హం.  ఇతర  వర్గాల  వారు 43.4 %ఉన్నారని అందరూ ప్రాధమిక స్థాయిలో  చదువు కున్న వారని పరిశోధన లో తేల్చారు.  బాల నేరస్తులు చేసే రక రకా  ల   నేరాలను  ఏ విధంగా నిర్వచించిందో చూద్దాం.                                                                                        ఇక్కడ  బాలలే నేరస్తులు అసలు బాల నేర స్థులు  చేసే నేరాన్ని వివిధ రకాల నేరాలను నిర్వచించారు.                                                                                                                                                        వివిధ రకాల నేరాలకు పాల్పడినట్లు వివిధ రకాల నేరాలను జువనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం ఈ క్రింది విధంగా నిర్వచించారు.  చిన్న చిన్న నేరాలుతగాదాలు.... చిన్న చిన్న నేరాలకు భారతీయ శిక్ష స్మృతి లోని ఐ పి సి సెక్షన్ ప్రకారం 3 సంవత్సరల్ కారా గార శిక్ష తీవ్ర మైన నేరాలు... తీవ్రమైన నేరాలు చేసి నప్పుడు భారతీయ శిక్షా  స్మృతి లోని ఐ పి సి సెక్షన్ ప్రకారం తాత్కాలికంగా 3నుంచి 7 సంవత్సరాల కారాగార శిక్ష విదించాలని జువనైల్ జస్టిస్ సూచించింది.                                                                                                                                                 అతి తీవ్రమైన నేరాలు... అతి తీవ్రమైన  నేరం చేసిన వారికి భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 7 సంవత్స రాల ఖటిన కారా  గార శిక్ష విదించాలని సూచించింది.రకరకాల  వృత్తులు వ్యక్తి గత  సామాజిక వ్య్వస్థ ప్రభావం బట్టి వాళ్ళు  బంధీలు గా అంటే ఆ బందనాలలో ఉన్నందున  అలావ్యవహరిస్తున్నారని అభిప్రాయ పడ్డారు.                                                                                                                     వ్యక్తి గత సా మాజిక వ్యవస్థ పై ప్రభావం  ఉంటుంది.                                                                     ఇండివిడ్యువల్  డెలీ కుఎంసీ అంటే  వ్యక్తి  గత జప్తు.                                         మరొకరి ప్రోత్సాహం తో జప్తు.                            నిర్మాణాత్మక, లేదా ప్రేరేపిత జప్తు.                                                                          సందర్బోచిత జప్తు.                                   ఇన్ని రకాల  జప్తు లకు ఒక్కో దానికి ఒక్కో రకమైన సామాజిక మాధ్యమం దీని పై విశ్లేషించాలి. అలాగే ఈ  ఆంశాల పై చివరగా  వారికి ట్రీట్మెంట్. ఐ వ్వడం తప్పని సరి.                                            వ్యక్తి గత జప్తు... ఈ  విషయంలో ఒక్క వ్యక్తి పాల్గొన్నట్లు తెలుస్తోంది. జప్తు చట్టం ప్రకారం వ్యక్తి గత మైన జప్తు వ్వ్యవహారమ్ లో కేవలం వ్యక్తి గత పర మైనా మానసిక స్థితి, వారి వాదన కేవలం జప్తు  అంశం   మానసిక సం బంధమై సమస్య లే కారణమని  చెప్తున్నారు . బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పెరిగిన పెద్ద  సమస్య  గా మారి పెద్ద  లోపంగా పేర్కొన్నారు.అసలు వ్యక్తి గత జప్తు, ,వర్గ సహకారం తో జప్తు, నిర్మాణాత్మక జప్తు,  పరిస్థితులకు తల వంచే జప్తు , అన్న అంశాల ను  వివరంగా తెలుసుకుందాం.                                                                                                                            ఈ అంశాల పైన వివరంగా నిపుణులతో, మానసిక నిపుణుల తో  చర్చిద్దాం.....                                                                    పైన  చర్చించిన అంశాలను విశ్లేషించి నప్పుడు ఒకే విష్యం సహజంగా కనిపిస్తుంది.మన సిక శాస్త్ర వేత్తలు, నిపుణులు  విశ్లేషించిన అంశం లో వ్యక్తి గత జప్తు బలీయంగా నాటుకు పోయి నప్పుడు అది  అబద్దానికి దారి  తీస్తుంది.వ్యక్తి సమూహంలో ఉన్నప్పుడు అంటే కొంత మంది  ప్రోత్సహించడం, లేదా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్డ్ గా పద్దతి ప్రకారం వారితో నిర్బంధంగా చేయించడం,  ఆ ప్రక్రియలో సహజంగా  బాల బాలికలు అబద్దం ఆడడం చేస్తూ ఉంటారు. సామాజికంగా సరైన నిర్మాణం, లేకపోవడం , వివిధ వర్గా ల మధ్య సమతౌల్యం లేక పోవడం, వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం. ఆర్ధికంగా సామాజికంగా కంగా ఇతరులతో పోటీ పడలేని స్థితి, విజయం సాధించేందుకు చేసే ప్రయత్నం లో వేసే చిన్న్బ తప్పటడుగు బాల బాలికల జీవి  తానికి శాపంగా పరినమిస్తుంది  నేరం చేసి  బతకడం కష్టం బఠాకడమూ కష్టమే ఆకలివేసిన ఆరోగ్యం బాగోకున్న బతికేస్తున్న చిన్న చేతులు బాల నేరస్తులను ఆడుకునేది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోవిడ్ వచ్చినా మరే వ్యాధి వచ్చినా చెప్పుకోడానికి ఎవరు లేరు  వారి మాట ఎవరు వినరు మరి భావి భారాతం ఎక్కడ ?  .  

నటించేవారు ఎలా ఉంటారో తెలుసా?

కొందరు మనుష్యులు అందరితోనూ ఇట్టే ఏకీభవిస్తూ తిరుగుతూ వుంటారు. పలుకుబడీ, అధికార హోదా కలిగున్న వారితో అయితే మరీ వేగంగా ఏకీభవిస్తారు. అటువంటివారి మాటను వీరు ఏనాడూ కాదనరు. విభిన్న అభిప్రాయాలున్న ఇద్దరు వ్యక్తులు ఒకచోట చేరినా, ఇద్దరితోనూ ఏకీభవిస్తున్నట్లుగా, మధ్యమధ్యలో తల వంచుకుంటూ, తల పక్కకి తిప్పుతూ, విననట్లుగా నటిస్తూ, వినినా అర్థం కాలేదన్నట్లు ముఖం వేళ్ళాడేస్తూ, ఆ ఇరుకూ ఇబ్బందిలోనుండి ఎలాగోలా బయటపడతారు. అటు తర్వాత అలా వివాద పడినవారిలో ఒకరు “అతడేమన్నాడో చూశావా?" అని ఈ తటస్థుణ్ణి ఉద్రేకంగా అడిగినప్పుడు కూడా "అలా అన్నాడా? నేను వినలేదు సుమా!” అని ఆశ్చర్యపు పోజు పెడతాడు. “అక్కడే వుంటివి కదయ్యా? నీకేమి చెవుడొచ్చింది? విననే లేదంటావేమిటి?” అని విసుక్కుంటే, "విన్నానేమోకానీ, ఆ సమయానికి మీరు ఇప్పుడు చెప్పే అర్థం స్ఫురించలేదండీ" అని మరో అబద్ధమాడి అమాయకంగా చూస్తాడు. "వీడొక మందమతి” అని అవతలి మనిషి అభిప్రాయపడ్డా ఈ నటించే మనిషికి అభ్యంతరం లేదు కానీ, తాను మాత్రం ఇదమిద్దంగా ఎవరి పక్షమూ వహించడు.  ఈ స్వప్రయోజన పరుడు ఏ సందర్భంలోనూ న్యాయం వైపూ, ధర్మం వైపూ నిలుస్తాడని ఎవరూ అనుకునే వీలులేదు. ఇద్దరితోనూ అవసరం పడుతుంటుంది కాబట్టి, ఇద్దరిదీ “రైటే” అన్నట్లుగా తిరుగుతూ తనపని చక్కబెట్టుకుంటుంటాడు. ఇదో తరహా వ్యవహారం. కొందరికి స్వయంగా ఆలోచించే లక్షణమే వుండదు కాబట్టి ఎవరేది చెప్తే అదే “రైట్” అని తోస్తుంది. వీరికి స్వప్రయోజనం సాధించుకోవాలని వున్నా లేకపోయినా, అవతలివారన్నది సబబుగానే కనిపిస్తుంది. ఒక ధనికురాలికి నాలుగు రోజుల బట్టి కాస్తున్న జ్వరం తగ్గలేదు. ఎందుకైనా మంచిదని ఇద్దరు స్పెషలిస్టులను పిలిపించాడు. భర్త. ఒక స్పెషలిస్టు పరీక్షించి “ఇది టైఫాయిడ్ కేసు, సందేహం లేదు" అని తేల్చాడు. “కరెక్ట్" అన్నది ఆవిడ, తన కొచ్చిన కొద్దిపాటి ఇంగ్లీషుతో. రెండో స్పెషలిస్టు కూడా పరీక్షించి చూచాడు. తన ప్రత్యేకత నిలబెట్టుకోటానికా అన్నట్లు, “నిస్సంశయంగా ఇది ఒక రకమైన మలేరియా జ్వరం. కాదంటే చెవి తెగ్గోయించుకుంటాను” అని ప్రకటించాడు. “కరెక్టూ" అనేసింది రోగి అతడి వంకకు తిరుగుతూ. అదిరిపడిన భర్త, “ఇద్దరి డయాగ్నోసిస్ కరెక్టేలా అవుతుంది” అని తల గోక్కోవడం మొదలెట్టాడు. మంచం మీద పడుకోనున్న భార్య భర్తవంకకు తిరిగి “కరెక్ట్” అన్నది. మూర్ఖులు వాదించుకోడం ప్రారంభించినపుడు వారి వాదనలో చిక్కుకోకుండా వుండడం మంచిది. తలాతోకా లేకుండా, తమ అధిక్యత నిరూపించుకోడానికే వాదించే వారి మధ్య చిక్కుకున్నప్పుడు “తప్పించుకు తిరిగే వాడే ధన్యుడు”. జాతకకథల్లో ఇద్దరు మూఢుల మధ్య వివాదం గురించిన ప్రస్తావన ఒకటుంది. పౌర్ణమి తర్వాత పదిహేను రోజులపాటు మహాచలిగా వుంటుందని ఒకరూ, అమావాస్య తరువాత పక్షం రోజులే ఎక్కువ చలిగా వుంటుందని రెండోవాడూ, ఒకరితో ఒకరు తీవ్రంగా వివాదపడ్డారు. వాదన ఎటూ తెమలకపోయే సరికి, ఇద్దరూ కలిసి ఒక జ్ఞానివద్దకు వెళ్ళారు. "మా వాదనల్లో ఎవరిది సరియైనదో తేల్చి చెప్పండి” అని విషయం వివరించారు. జ్ఞాని కాసేపు తేరిపార జూచి, “మూర్ఖ ప్రజాపతులారా పౌర్ణమి తర్వాత పక్షమైతేనేమి అమావాస్య నిశీధి తర్వాతి రోజులైతే నేమి చలి చంద్రుడితో ఎలా ముడిపడి వుంటుంది? చలిగాలులవల్ల, గాలిలో తేమ అధికమైనందువల్ల చలి ఏర్పడుతుంది. కార్యకారణ సంబంధంలేని మీ ఇద్దరి వాదనా సమంజసమేనని, మీకు తగినట్లే వుందని నా తీర్పు” అన్నాడా జ్ఞాని. మూర్ఖులిద్దరూ తమ వాదన సరియైనదేనాని అనుకుంటూ సంతోషించి వెళ్ళిపోయారు. ఇలా తాము తమ అవసరార్థం ఎవరి వైపు నిలబడకుండా అటు ఇటు కూడా ఇబ్బంది కలిగించకుండా వెళ్ళేవాళ్ళు కొందరుంటారు. ప్రస్తుతకాలంలో  గొప్ప నటులు, మహా మేధావులు అనబడతారు వీళ్ళు.                                      ◆నిశ్శబ్ద.

పౌరులకు, వ్యక్తులకు మధ్య బేదం ఇదే..

ప్రతి సంవత్సరం జనవరి 12 న యువజన దినోత్సవం జరుపుకుంటారు. ఈ దేశానికి యువత అవసరాన్ని, భారతీయ హిందూ ధర్మ విశిష్టతను, విదేశాలలో సైతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన స్వామి వివేకానంద పుట్టిన రోజును ఇలా యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద భారతదేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, భారత పౌరుల గురించి తన మాటల్లో ఇలా చెప్పారు.. స్వామి వివేకానంద నిద్రాణమై ఉన్న భారత జాతిని 'లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగవద్దు!' అని మేల్కొలిపారు. సుమారు వెయ్యి సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తూ, కొన ఊపిరితో ఉన్న భారతజాతిని 'సమస్త శక్తి మీలోనే ఉంది. మీరేమైనా సాధించగలరు!' అని జాగృతం చేసారు.  దేశ భవిష్యత్తు గురించి చెబుతూ భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకంటే అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. స్వామీజీ 1897 జనవరి 25న రామనాథపురంలో తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించారు....ఇక తెల్లవారదనుకున్న రాత్రి మెల్లమెల్లగా గడిచిపోతున్నట్లుంది. భరించరాని తీవ్ర వేదన ఉపశమిస్తున్నట్లనిపిస్తుంది.... భారతమాత దీర్ఘనిద్ర నుండి మేల్కొంటోంది.... ఇంక ఆమెనెవరూ ఆపజాలరు! ఇక ఆమె నిద్రపోదు". స్వామీజీ చెప్పిన భవిష్యవాణి నిజం కావాలంటే మనం ఏం చెయ్యాలి? వ్యక్తులు పౌరులుగా మారాలి నేటి యువత విదేశాలు భోగభాగ్యాలకు ఆకర్షితులవుతున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని వదులుకోలేక, అటు విదేశీ సంస్కృతిని కాదనలేక సందిగ్ధంలో పడుతోంది. బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం చాలా గొప్పదన్న విషయం మనమంతా తెలుసు కోవాలి. విదేశాలలో వేదాంతభేరిని మ్రోగించి, భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని "ఇక్కడి భోగభాగ్యాలను చూసిన తరువాత భారతదేశంపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. సమాధానంగా స్వామీజీ, "భారతదేశం నుండి వచ్చేముందు నా దేశాన్ని ప్రేమించాను. ఇప్పుడు నా దేశపు దుమ్ము, ధూళి, గాలి సర్వస్వం నాకు పవిత్రమైనవిగా భాసిస్తున్నాయి" అన్నారు. నేడు మన దేశస్థులు తమ దేశానికి సేవ చేయడం మాట అటుంచి భారతమాతను విమర్శించడంలోనే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి భారతీయుడు తమ దేశ గొప్పతనాన్ని తెలుసుకొని భారత పౌరునిగా మారడానికి ప్రయత్నించాలి. ఒకసారి ప్రముఖ భారత న్యాయవాది నానీ ఫల్కీవాలా జపాన్ వెళ్ళినప్పుడు ఆ దేశమంత్రిని ఇలా ప్రశ్నించారు. "భారతదేశంలో కావలసిన సంపదలున్నాయి. భారతీయులు తెలివైనవారు. అయినప్పటికీ భారతదేశం జపాన్లాగా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది?" అని.  సమాధానంగా జపాన్ మంత్రి “జపాన్లో ఒక మిలియన్ పౌరులున్నారు. భారతదేశంలో ఆరువందల మిలియన్ల వ్యక్తులున్నారు" అని తన అభిప్రాయాన్ని చెప్పారు.  'దేశం మనకు ఏమి చేసింది' అని తలచేవారు వ్యక్తులు, 'దేశానికి మనం ఏం చేసాం' అని ప్రశ్నించుకునేవారు పౌరులు. తమ స్వార్థం కోసం ఆలోచించేవారు, తమ ప్రయోజనాల కోసం జీవించేవారు వ్యక్తులు. ఇతరుల కోసం ఆలోచించేవారు, ఇతరులకు సేవ చేసేవారు పౌరులు. ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తి నుంచి పౌరునిగా మారాలి. యువశక్తి జాగృతం కావాలి నేడు భారతీయులు అందరికంటే తెలివైనవారని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అయితే మనం అక్కడితో ఆగిపోకుండా ప్రతిభావంతులంగా మారాలి. దీనికోసం నేటి యువత విద్యతో పాటు విలువలను అలవరచుకోవాలి, మనోబలాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానంతో పాటు హృదయాన్ని విశాలం చేసుకోవాలి. స్వామీజీకి యువశక్తిపై అత్యంత విశ్వాసం ఉంది. యువత తమ అంత రంగంలో ఉన్న అనంత శక్తిని జాగృతం చేసి భారతమాతను ముందుకు తీసుకుపోవాలి.. ప్రతి ఒక్క భారతీయుడు భారత పౌరునిగా మారి, తమ శక్తిని జాగృతం చేస్తే, కొద్ది రోజులలోనే భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటుంది. వివేకానందుని భవిష్యవాణి సత్యమవుతుంది. ఇది మనందరి చేతులలోనే ఉంది.                                  ◆నిశ్శబ్ద. 

ప్రవాస భారతీయులు దేశ ప్రగతికి కీలకం!

ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకంటూ ప్రత్యేకత ఉంటుంది. భారతీయతను తాము వెళ్లిన చోటుకు వ్యాప్తి చేయడం,  భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాలలో కూడా పాటించడం, అందులో ఉన్న గొప్పదనాన్ని అందరికీ తెలియజేయడం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో ఎన్నో అభివృద్ధి మార్గాలలో భారతీయుల విజ్ఞానం కూడా భాగమవుతుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం.  విదేశాలకు వెళ్లిన భారతీయులు చదువులు, ఉద్యోగాల నిమిత్తం అక్కడ ఉంటూ భారతీయులను ఒకే తాటిపై ఉంచేందుకు, వారు భారతీయతను మరచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు దివాస్ ను జరుపుకుంటూ వస్తున్నారు. దీని వెనుక ఉన్న  మరొక విషయం ఏమిటంటే ఈ ప్రవాస భారతీయ దివాస్ ను మన జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ తన విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన సందర్భంగా  జనవరి 7 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు జరుపుకుంటారు.  భారతదేశ ప్రతిష్ట, గౌరవం ఇనుమడించడంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంటుంది. వీరందరూ తమ ప్రతిభతో విదేశాలలో గొప్ప అవకాశాలు పొందడమే కాకుండా  భారతదేశ ఉనికిని పలుచోట్లకు తీసుకెళ్తున్నారు. మొదట ఈ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2003 సంవత్సరం జనవరి 7 నుండి 9 వరకు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. అయితే 2015 సంవత్సరం దీనికి సవరణలు చేసి ప్రతి సంవత్సరం కాకుండా రెండేళ్లకు ఒకసారి దీన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించబడుతుంది.  ఈ సంవత్సరం జనవరి 7 వ తేదీన మొదలయ్యే ప్రవాస భారతీయ దినోత్సవం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరగనుంది. విదేశాలకు వెళ్లే భారతీయులు భారతదేశం గర్వపడేలా చేయాలన్నది కూడా ఈ దినోత్సవంలో చర్చించే ఓ ముఖ్యమైన అంశం. ప్రవాస భారతీయ దినోత్సవ వేడుక సందర్భంగా ఎంతో మంది అతిథులు, విదేశాలలో ఉన్న భారతీయ కమ్యూనిటీకి చెందినవారు పాల్గొంటారు. స్వదేశీ-విదేశీ సంబంధాలను మెరుగుపరడంలో కూడా విదేశాలకు వెళ్లే భారతీయుల పాత్ర ఉంటుంది. భారతదేశం వివిధ రసంగాలలో అభివృద్ధి చెందడానికి గొప్పగా సహకరించిన విదేశాలకు వెళ్లిన భారతీయులకు ఈ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్ ను వీరికి అందజేస్తారు. అలాగే ఈరోజు జరుపుకోవడం వల్ల భారతీయులు, ఇక్కడ ప్రభుత్వాలు, అధికారులు భారతీయుల పట్ల బాధ్యతను, సహకారాన్ని అందించేందుకు ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో నివసించే భారతీయులకు అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్వదేశీ అధికారుల మద్దతు, అక్కడి వారు ఇక్కడికి తిరిగిరావడానికి దేశ అధికారులతో మాట్లాడటం వంటి కీలక అంశాలు మెరుగుపడతాయి.  భారతదేశానికి మాత్రమే కాకుండా వివిధ దేశాలకు కూడా ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పడాలంటే స్వదేశం నుండి ఇగ్గర దేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఎప్పుడూ దేశ ప్రగతిలో తాము కూడా కీలకమనే విషయాన్ని మరచిపోకండి. అలాగే దేశం మీకోసం ఎప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని మరవకండి.                                    ◆నిశ్శబ్ద.

యుద్ధం ముగింపా? కాదు అదే మొదలు వీరి జీవిత పోరాటానికి!

"యుద్ధం" ప్రపంచ దేశాల నుండి సాధారణ పౌరుల వరకు ఉలిక్కిపడే విషయమిది. కేవలం ఒక చిన్న పదంలో ఎంతో భీభత్సం దాగుంది. ఎన్నో జీవితాల దైన్యం నిమిళితమై ఉంది, వందలు, వేలు, లక్షల కొద్దీ ప్రాణాలు ప్రశ్నార్థకమై నిలుచుంటాయి. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం నుండి నేడు ఇంకా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు, యుద్ధానికి ఫలితం ఏమిటి అనేది ప్రతి దశలో తెలుస్తూనే ఉంది అందరికీ. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాలలో జరిగిన నష్టం ఏమిటి?? కేవలం ప్రాణాలు, ఆస్తుల నష్టాలేనా??   యుద్దాల వల్ల సంభవించే మరొక భయంకరమైన పరిణామం ఉంది. అదే భవిష్యత్తరాలు అనాథలుగా మారడం. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాల వల్ల చిన్న పిల్లల జీవితాలు దుర్భరంగా మారతాయి.  యుద్ధాలలో మరణించే వారి పిల్లల బాధ్యత తీసుకునేవారు ఎవరూ ఉండరు. వారు శరణార్ధులుగా ఇతర దేశాలకు వలస పోయి అనాథలుగా బ్రతకాల్సి వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఐక్యరాజ్యసమితి యుద్ధ అనాథల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన జరుపుతూ వస్తోంది.  దీని ఉద్దేశం ఏమిటి??  యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం లక్ష్యం.  ఈ రోజు యుద్దాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల కష్టాలను, వారు పెరుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక, శారీరక పరిస్థితులను, వారి ఇబ్బందులను, వారి కనీస అవసరాల కోసం, భద్రత కోసం వారు చేసే పోరాటాన్ని అందరికీ తెలిసేలా చేయడం ముఖ్య ఉద్దేశం.   పరిస్థితులు ఎలా ఉన్నాయి?? యుద్దాలు పరిణమించడం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనాథలుగా మారుతున్న వారి లెక్కలను ఐక్యరాజ్యసమితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 మిలియన్ల మంది అనాథలు ఉన్నారు, ఇందులో ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో 10 మిలియన్లు, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో 7.3 మిలియన్లు ఉన్నారు. ఈ లెక్క లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మారారనే దానికి  సాక్ష్యంగా స్పష్టతను ఇస్తుంది.  చేదు నిజం ఏమిటంటే..  మొత్తం అనాథల్లో 95 శాతం మంది ఐదేళ్లకు పైబడిన వారే.  అంటే ఐదేళ్ల నుండే తమవారిని కోల్పోయి అగమ్యగోచరమైన పరిస్థితిలో పిల్లలున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో అనాథల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  కానీ, యుద్ధాలు, భయంకరమైన అంటువ్యాధులకు గురైన ప్రదేశాలలో, అనాథల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎదుర్కొంటున్న పరిణామాలు ఏమిటి?? దేశాల మధ్య రగిలే సమస్యలు కాస్తా ఇరుదేశాల్లోని ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి యుద్ధానికి దారితీసినప్పుడు లక్షలు, కోట్ల మంది ఎంతో సునాయాసంగా జీవితాలను జార్చుకుంటున్నారు. దేశాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ప్రజలకు లేకపోవడం వల్ల ఆ దేశాల చర్యలకు ప్రజలు బలిపశువులవుతున్నారు. యుద్ధాలలో పెద్దవారు, యువకులు మరణించగా దిక్కుతోచని స్థితిలో పసిపిల్లలు అనాథలవుతున్నారు. వీరు ఆహారం, ఆశ్రయం, భద్రత విషయంలో ప్రతి రోజునూ లెక్కపెట్టుకుంటూ జీవించాల్సి వస్తోంది. గత లెక్కల చిట్టా ఏమి చెబుతోంది?? ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అనాథల సంఖ్య 1990 నుండి 2001 వరకు పెరిగింది.  అయినప్పటికీ, 2001 నుండి,  ఈ సంఖ్య స్థిరంగా తగ్గుతూ వచ్చింది. ఆ కాలంలో సంవత్సరానికి 0.7% మాత్రమే నమోదు అయింది.   1990లో 146 మిలియన్లు, 1995లో 151 మిలియన్లు, 2000లో 155 మిలియన్లు,  2005లో 153 మిలియన్లు, 2010లో 146 మిలియన్లు  2015లో 140 మిలియన్లు గా నమోదయ్యాయి. ప్రస్తుతం ఏమి చేయొచ్చు?? ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.. రెండు దేశాల మధ్య సమస్యగా మొదలైన ఈ యుద్ధం కాస్తా మరింత దీర్ఘకాలం కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచం మొత్తం మీద కోట్ల కొద్దీ మరణాలు సంభవించడమే కాకుండా ఎంతో మంది పిల్లలు అనాథలుగా మారతారు. కాబట్టి దేశాల మధ్య సమస్యలకు యుద్దమే పరిష్కారం కాదనే విషయం మనకు తెలిసిన సగటు పౌరుడి చేతిలో దాన్ని అడ్డుకునే అస్త్రం లేకపోయినా అనాథలను ఆదుకునే మనసు, వారికి ఆశ్రయమిచ్చే తాహతు మనకున్నప్పుడు అలాగే చేయడం అందరి ధర్మం. యుద్ధం ముగింపు కాదు, కొన్ని కోట్లమంది పిల్లల జీవితాల పోరాటానికి అది మొదలవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

కొత్తబంగారు లోకం ఇదిగో ఇలా సొంతం!! 

కొత్తలోకం అంటే వేరే ఎక్కడో వేరే గ్రహం గురించి మాట్లాడటం లేదు. ప్రతిమనిషి జీవితంలో వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ఆశలు, కొన్ని ఆశయాలు, మరికొన్ని దుఃఖాలు, ఇంకొన్ని సమస్యలు ఉండనే ఉంటాయి. అయితే వటన్నిటీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  నేటి యువతకు రేపటి గురించి ఎంతో పెద్ద కలలు ఉండటం సహజం. అయితే ఆ కలను సాధించుకుంటున్నవాళ్ళు ఎంతమంది అని తరచి చూస్తే చాలా కొద్ది జీవితాలు మాత్రమే  విజయ తీరాలు చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ఐటీఏ ఆ కొన్ని జీవితాలు కూడా నిజంగా తాము కన్న కలను నిజం చేసుకున్నారా లేక సమాజాన్ని, కుటుంబాన్ని కాంప్రమైజ్ చేయడానికి వాటి దృష్టిలో ప్రాముఖ్యత ఉన్న దాన్ని సాధించి బతికేస్తున్నారా?? ప్రశ్న చిన్నదే కానీ దానిలో లోతు, దాని కారణాలు మాత్రం చర్చిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. చిన్నప్పటి నుండి కొన్ని విషయాలను బుర్రలో నూరిపోసి, బలవంతంగా కొన్ని, సమాజం కొన్ని ఎట్లా అయితేనేం కారణాలు ఎన్ని ఉన్నా మొత్తానికి తమకోసం తాము బతకడం అనే విషయాన్ని మాత్రం అందరి జీవితాల నుండి తొలగించారు మరియు తొలగించుకున్నారు మనుషులు. ఏదైనా గట్టిగా అడిగినా మంచి కోసమే అనే చెప్పేవాటిలో మంచి ఎంత ఉందో అర్థం చేసుకునే మానసిక పరిణితిని పెద్దలు తమ పిల్లల్లో పెంపొందించేందుకు కృషి చేస్తే చాలు కదా అనిపిస్తుంది. ఇక యువత ఆవేశం, తొందరపాటుతో చేసే ఎన్నో పనులు తమ లక్ష్యాలు దారితప్పడానికి కారణం అవుతున్నాయి. వాటిని పునర్విమర్శ చేసుకోకుండా ప్రపంచం పెద్దదంటూ పరిగేడితే లక్ష్యం చేరుకోగలరో లేదో కానీ అలసట మాత్రం తప్పకుండా వస్తుంది. అందుకే తాము వెల్లదల్చుకున్న దారి గురించి అనుభవం ఉన్నవాళ్ళతో చర్చించి సురక్షితంగా సరైన మార్గంలో వెళ్లడం సబబు. ఆశకు రెక్కలు ఇవ్వాలి!! ఆశించడం తప్పేమి కాదు. ఈ ప్రపంచంలో మనిషిని గొప్పగా ఎదిగేలా చేసేది ఆశనే. అందుకే రేపటి జీవితం గురించి ఆశ ఉండాలి. ప్రతి మనిషి నిన్నటి కంటే అంతో ఇంతో మెరుగవుతూ ఉండాలి. దానికి తగ్గట్టు తమ అనుభవాల ద్వారా జీవితానికి జ్ఞానాన్ని పొగుచేసుకోవాలి. వ్యక్తిత్వ పరంగానూ, ఆలోచనాపరంగానూ ఎదగాలి. అప్పుడు ఆశ కూడా జీవితానికి తగ్గట్టు కదులుతూ సంతోషాన్ని కలిగిస్తుంది.  ప్రాధాన్యత ప్రత్యేకత!! ప్రతి మనిషి ఎదుటి మనిషికంటే రూపంలోనూ, ఆలోచనల్లోనూ, వ్యక్తిత్వ పరంగా ఇంకా సామాజిక ఆర్థిక స్థాయిల పరంగా విభిన్నమైనవాడు. ఒకే కుటుంబంలో ఉన్న ఎవరూ ఒకే ఆలోచన కలిగి ఉండరు. అలాంటప్పుడు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలానే ఉందాం. వాళ్ళు అది సాధించారు మనం ఇది సాధిద్దాం అని ఎందుకు అనుకుంటారు. జీవితంలో ముఖ్యమైనది ఏది?? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి?? తమలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?? దాన్ని ఎలా పదును పెట్టుకుని తమకే గుర్తింపు తెచ్చేలా చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఆనందం ఎక్కడో లేదు మనసులోనే!! నిజమే ఆనందం మనసులోనే ఉంటుంది. దాన్ని తెలుసుకునావాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. వస్తువులలోనూ, ఎదుటి వాళ్ళ స్పందనలోనూ ఆనందాన్ని వెతుకునేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. వాళ్ళను అశాంతి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆనందానికి కీ ని మీదగ్గరే ఉంచుకోవాలి. అడ్డంకులూ అవరోధాలు హుష్ కాకి!! మనం వెళ్లాల్సిన ఊరికి ప్రయాణం చేసేటవుడు మధ్యలో దారి బాగోలేకపోయినా, వెహికల్ పాడైనా వేరే వెహికల్ లో, జాగ్రత్తగా వెళ్తాము అంతేకానీ ఆ ఊరికి వెళ్లడమే మనేస్తామా లేదు కదా!! ఇదీ అంతే. మనం అనుకున్న లక్ష్యంలో ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కరించుకుంటే పోతుంది. కానీ ఈకాలం వాళ్లకు తెగ్గొట్టడం వచ్చినంత బాగా తిరిగి అతికించడం, దానికోసం కష్టపడటం, ఓర్పుగా ఉండటం రావు. వాటిని అలవాటు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మంత్రం వెయ్యాలి!! దేనికైనా మనసుతో తృప్తిగా చేయడం ముఖ్యం. అందుకే మనిషి స్వచ్ఛంగా ఉండాలి. కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లాంటివి మనసులో అసలు ఉంచుకోకూడదు. ప్రేమించడం తెలిసిన మనిషి దాన్ని తిరిగి ఆశించకుండా కేవలం ఇవ్వడంతోనే సరిపెట్టుకుంటే ఎంతో గొప్ప ప్రశాంతత దొరుకుతుంది.  ఆశలు, లక్ష్యాలు, ఆశయాలు వీటన్నిటిని ఆశవహాదృక్పథంతో మనసు తలుపులు తెరిచి ముందుకు వెళ్తే కొత్తబంగారు లోకం సాక్షాత్కరిస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ