పక్కవారి కోసం గొంతు విప్పండి

జీవితం చాలా కఠినంగా మారిపోయింది. కాదనలేం! ఎవడి బతుకు వాడు చూసుకోవడానికే తీరక చాలడం లేదు. తన పొట్ట నింపుకునేందుకే నానాపాట్లూ పడాల్సి వస్తోంది. అందుకనే వేరొకరి గురించి పట్టించుకునేందుకు మనసు రావడం లేదు. సమస్య తనదాకా వస్తే కానీ దానిని నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ విషయాన్ని గ్రహించినట్లుంది. అందుకే ఏటా డిసెంబరు 10న జరుపుకొనే ‘మానవహక్కుల దినోత్సవం’లో ఈసారి ఇతరుల హక్కుల కోసం కూడా ఆలోచించమంటూ పిలుపునిస్తోంది.   మనిషి మనిషిగా తలెత్తుకుని జీవించగలగడమే మానవహక్కు! రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఓ వ్యక్తి ఇతరులతో సమానంగా జీవించే అవకాశమే మానవహక్కు. ఇలాంటి మానవహక్కుల గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1946లోనే ఒక కమీషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్‌ 1948లో Universal Declaration of Human Rights అనే పత్రాన్ని రూపొందించింది. బైబిల్‌ తరువాత ప్రపంచంలో అత్యధిక భాషలలోకి అనువదించబడిన పుస్తకం ఇదే! దీని ఆధారంగానే 1950 నుంచి ఏటా డిసెంబరు 10న మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ప్రతి ఏడూ మానవహక్కులకి సంబంధించి ఏదో ఒక అంశం మీద ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తోంది. అలా ఈ ఏడు ఇతరుల హక్కుల కోసం నిలబడమంటోంది.   ఇతరుల హక్కుల కోసం ఇలా గొంతు విప్పవచ్చు... - వికలాంగులు, వృద్ధులు, రోగులు... వీరికి ఎక్కడికక్కడ ప్రత్యేక సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తుంటుంది ప్రభుత్వం. ఈ సౌకర్యం అందుబాటులో లేకున్నా, లేదా మన కళ్ల ముందే దుర్వినియోగం అవుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. మన పక్కన ఉన్న అలాంటి నిస్సహాయుల కోసం ఒక మాట వాడటంలో తప్పులేదు.   - స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల పట్ల సమాజపు దృక్పధం చాలా విభిన్నంగా ఉంటుంది. వీరి పట్ల మన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ... వారు కూడా సమాజంలోనే భాగమని గుర్తించి, తగిన గౌరవం ఇవ్వడం అవసరం.   - మన చుట్టూ స్త్రీ పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా... అది వారి వ్యక్తిగత విషయం అనుకుని నిస్తేజంగా సాగిపోవడం మానవత్వం అనిపించుకోదు.   - దళితులు, మైనారటీలు, ఆదిమజాతివారు... ఇలా సమాజంలో అణగారిన వర్గాలకి కూడా ఈ భూమ్మీద మనతోపాటు సమానమైన హక్కులు ఉన్నాయి. మనం వారి అభ్యున్నతి కోసం పోరాడలేకపోయినా, వారి జాతి ఆధారంగా అవమానం జరిగినప్పుడు మాత్రం గొంతు విప్పడం సహేతుకం.   - పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందనీ, పెద్దలతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తామో... అంతకంటే జాగ్రత్తగా పిల్లలతో వ్యవహరించాలన్న విషయాన్ని చాలామంది గ్రహించరు. అందుకే పిల్లలు నిష్కారణంగా ఎవరో ఒకరి దౌర్జన్యానికి తలవంచాల్సి వస్తుంటుంది. మన కళ్ల ముందర ఇలాంటి సంఘటన జరిగితే అడ్డుకుని తీరాల్సిందే!   - ఉన్నవాడిని లేనివాడిని వేర్వేరుగా చూస్తుంది సమాజం. దానికి మనమేం చేయలేం. కానీ ఆ పక్షపాతంతో పేదవాడు మనిషే కాదన్నట్లు ఎవరన్నా ప్రవర్తిస్తే వారిని సరిదిద్దాల్సిందే!   ఏవో చెప్పుకోవాలి కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్పుకొన్నామే కానీ... ఇతరుల హక్కుల కోసం పోరాడేందుకు చాలా సందర్భాలే కనిపిస్తాయి. పోరాడటం అంటే కేవలం భౌతికమైన అర్థం మాత్రమే రాదు. ఒక మాట అడ్డువేయడం, కళ్ల ముందు జరుగుతున్న పక్షపాతాన్ని పరిష్కరించేందుకు ఒక అడుగు ముందుకి వేయడం, అవతలివారికి నచ్చచెప్పడం, మనలోని ఆలోచనను నలుగురితో పంచుకోవడం, శాంతియుతంగా మన నిరసనని తెలియచేయడం కూడా పోరాటం కిందకే వస్తాయి. అదీఇదీ కాదంటే మన కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సోషల్‌ మీడియా ఎలాగూ ఉండేనే ఉంది!   - నిర్జర.

మెదడుతోనే వీడియోగేమ్

  సాంకేతికత రోజురోజుకీ తెగ అభివృద్ధి చెందుతోంది. దాంతో ఒకప్పుడు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలలోనే సాధ్యమనుకునే విషయాలు కళ్ల ముందే సాకారం అవుతున్నాయి. వాటిలో ఒకటి- కేవలం ఆలోచనలతోనే వీడియోగేమ్‌ను అడగలిగే శక్తి! వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఆ శక్తిని సాకారం చేసే దిశగా కొన్ని విజయాలు సాధించారు.   ఇదీ విధానం కళ్ల ముందు కదిలిపోయే సన్నివేశాలలో మనం కూడా భాగంగా కనిపించే వర్చువల్‌ ఆటలకి (Virtual games) కొదవలేదు. కానీ ఓ మనిషి మెదడులో మెదిలే ఆలోచనల సాయంతో అతని ఆటతీరు సాగే అవకాశం ఉందేమో అని శోధించే ప్రయత్నం చేశారు. అంటే ఇందులో ఆటగాడిలో ఎలాంటి శరీర కదలికా ఉండదన్నమాట. అతని తలకి కొన్ని పరికరాలు చుట్టి ఉంటాయన్నమాట.   ఇదీ ఆట ఆటలో భాగంగా తెరమీద 21 చతురస్రాలు కనిపిస్తాయి. వాటిని పైకి కానీ కిందకి కానీ జరుపుతూ ఆటని కొనసాగించాలి. అది ఎటువెళ్లాలో ఆటగాడు నిర్ణయించుకున్నప్పుడు అతని మెదడులోని ‘ప్రాస్పేన్’ అనే భాగంలో స్పందనలు కలుగుతాయట. ఈ ‘ప్రాస్పేన్‌’ను కాంతిసంకేతాలుగా మార్చి వాటి ద్వారా వీడియోగేమ్‌ ఆడించే ప్రయత్నం చేశారు. శరీరం నుంచి నామమాత్రమైనా సహకారం లేకుండా, కనీసం కంటిచూపుని కూడా అనుసరించకుండా చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుందో అని పరిశోధకులు కూడా అనుమానపడ్డారు. కానీ 92 శాతం సందర్భాలలో ఆటగాళ్ల మెదడు ఏ తీరులో అయితే స్పందించిందో, దానికి అనుగుణంగా ఆట కదలడం చూసి సంబరపడిపోయారు.     ఆట కోసం మాత్రమే కాదు వీడియోగేమ్‌ విజయవంతం అయ్యింది కదా అని ఈ పరిశోధన కేవలం ఆటలకే పరిమితం అనుకోవడానికి లేదు. మెదడులో ఆజ్ఞని అందించడం అనేది మన నిజజీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపుతుందంటున్నారు పరిశోధకులు. కారు తోలడం దగ్గర్నుంచీ కృత్రిమ అవయవాలని నియంత్రించడం వరకూ మెదడుతోనే పనికానిచ్చేయవచ్చు అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ కొత్త ఆవిష్కరణ మనకి ఆరో ఇంద్రియాన్ని ప్రసాదిస్తోందంటున్నారు.   ఇప్పటివరకూ మెదడు మీద జరిగిన ప్రయోగాలన్నీ అందులో ఉన్న సమాచారాన్ని ఎలా క్రోడీకరించాలి? అన్న దిశగానే సాగాయి. కానీ ఈ కొత్త ప్రయోగం ద్వారా మెదడుకి సమాచారాన్ని నేరుగా ఎలా అందించాలి? సమాచారాన్ని అందుకున్న తరువాత మెదడులో జరిగే ప్రతిస్పందనలకు ఎలా రూపం కల్పించాలి? అన్న తరహా పరిశోధనలకు దారితీసినట్లయ్యింది. మరి ఈ తొలి అడుగు మరెన్ని విజయాలకు దారితీస్తుందో!   - నిర్జర.  

ఏడుపు వల్ల బోలెడు లాభాలట

మగపిల్లలు ఏడిస్తేనేమో ‘ఎందుకలా ఆడపిల్లలా ఏడుస్తావు?’ అని తిడతారు. ఆడపిల్లలు ఏడిస్తేనేమో ‘ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం. ఏడిస్తే దరిద్రం!’ అంటూ వారిస్తారు. కానీ మనసుకి బాధ కలిగితే తనివితీరా ఏడవాలని ఎవరికి మాత్రం అనిపించదు. ఇకమీదట అలాంటి సందర్భం వస్తే తృప్తిగా ఏడ్చేయమంటున్నారు నిపుణులు. అలా ఏడవడం వల్ల బోలెడు లాభాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేవిటంటే...   విషాలు బయటకు పోతాయి ఉద్వేగం వల్ల ఏడుపు వస్తుందన్న విషయం తెలిసిందే! అయితే ఈ ఉద్వేగాన్ని మనసులోనే అట్టిపెట్టేసుకుంటే... దాని వలన కార్టిసాల్, ఎన్‌కెఫలిన్ వంటి హానికారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. సుబ్బరంగా ఏడ్చేస్తే ఆ రసాయనాలన్నీ నిమ్మకుండిపోతాయి. అందుకనే ఏడ్చిన తరువాత మనసు మునుపటికంటే చాలా తేలికగా ఉండటాన్ని గమనించవచ్చు.   సృజనశక్తి పెరుగుతుంది త్వరగా కళ్లు చెమరుస్తున్నామంటే మనలో సున్నితమైన స్పందనలు ఇంకా మిగిలిఉన్నట్లు లెక్క. గుండెను రాయి చేసేసుకున్నవారి కళ్లలోకి తడి రాదు కదా! ఇలాంటి సున్నితత్వం ఉన్నవారు తమ స్పందనలకు చక్కటి రూపం ఇవ్వగలరని అంటున్నారు. ఒక బాధాకరమైన విషయాన్ని అక్షరబద్ధం చేయాలన్నా, ఒక ఆలోచనను చిత్రంగా మలచాలన్నా అప్పుడప్పుడూ కంటతడి పెట్టే అలవాటు ఉండాలంటున్నారు.   బ్యాక్టీరియాను చంపేస్తుంది తల్లిపాలు, లాలాజలం, వీర్యం వంటి అతికొద్ది పదార్థాలలో మాత్రమే కనిపించే ‘లైసోజైం’ అనే ప్రొటీన్‌ మన కన్నీరులో కూడా ఉంటుందట. ఇది మన శరీరంలోని బ్యాక్టీరియాను అతి సులువుగా చంపగలదని చెబుతారు. ప్రపంచాన్ని వణికించే ‘ఆంత్రాక్స్‌’ క్రిములను సైతం మన కంటినీరు నిర్వీర్యం చేయగలదట. హానికారక బ్యాక్టీరియా గోడలలోకి చొచ్చుకుపోవడంలో లైసోజైం తీరే వేరంటున్నారు.   బంధాలను నిలుపుతుంది ఇతరులతో మనకు ఉండే ప్రతిస్పందనలకు ఏడుపుని పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఒక కష్టాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు, ఇతరుల బాధని చేతల్లో మాన్పలేనప్పుడు... ఎదుటివారి భుజం మీద తల పెట్టి భోరున ఏడ్చేస్తే చాలు. మనకి వాళ్లు, వాళ్లకి మనం ఉన్నామన్న భరోసా ఏర్పడుతుంది. ఓ నాలుగు కన్నీటి చుక్కలు ఒకోసారి తెగిపోయిన బంధానికి కూడా చిగురునిస్తాయి.   ముందుకు సాగే ధైర్యం కష్టసుఖాలు ద్వంద్వాలు. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేకుండా జీవితం సాగడం అసంభవం. ఆ విషయాన్ని గ్రహించి కష్టంలో నిబ్బరంగానూ, సుఖంలో నేలమీదా నిలబడినవాడే ముందుకు సాగిపోగలడు. కష్టం వచ్చినప్పుడు ఓ ఏడ్పు ఏడ్చేస్తే, ముందుకు పోయేందుకు సాంత్వన లభిస్తుంది. ఎడతెగని బాద నుంచి తేరుకోవాలన్నా, మనసుని మళ్లీ కుదుటపరచుకోవాలన్నా అది ఏడుపుతోనే సాధ్యం. లేకపోతే ఆ కష్టం మనసులోనే తిష్ట వేసుకుని జీవితాన్ని అటకాయిస్తుంది. అందుకని జీవితం ప్రవహించాలంటే, ఒకోసారి కన్నీరు కూడా ప్రవహించాల్సిందే!   ఏడుపు వల్ల అటు ఆరోగ్యంగానూ, ఇటు మానసికంగానూ ఉన్న ఇలాంటి లాభాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద జాబితానే తయారవుతుంది. ఏడుపులో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే జపానులో ‘rui-katsu’ పేరుతో బలవంతంగా ఏడ్చే సంఘాలు ఏర్పడుతున్నాయి. ఏడుపు వల్ల నానారకాల సమస్యలూ తీరిపోతాయని ఈ సంఘపు సభ్యులు నమ్ముతారు. అలా మరీ బలవంతంగా ఏడవక్కర్లేదు కానీ, సందర్భం వచ్చినప్పుడు కన్నీటిని దాచుకోకుండా ఉంటే చాలేమో!   - నిర్జర.

పసిపిల్లలు కోపాన్ని పసిగట్టేస్తారు

పసిపిల్లల ముందు కోపంగా ఏదన్నా ఒక మాట అంటే... వారు ఒక్క క్షణం బిత్తరపోవడాన్ని గమనించవచ్చు. ఇంకా పారాడే పసిపిల్లలే కదా! వారికి మన మాటల్లోని కోపం, ఉద్రిక్తత, చిరాకు, సంతోషం, ప్రేమ... వంటి అనుభూతులు ఎలా తెలుస్తాయి? అనుకోవడానికి వీల్లేదు. పసిపిల్లలకు ఇంకా భాష రాకపోయినా భావం తెలిసిపోతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. భాష - భావం మనం ఏ భావంతో మాట్లాడుతున్నామన్న విషయాన్ని పిల్లలు ఎంతవరకు గ్రహించగలుగుతారు అనే అనుమానంతో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఒక ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు ఒకే తరహా వాక్యాన్ని వేర్వేరు ఉద్వేగాలతో పిల్లల ముందు పలికి చూశారు. అలా ఒకే వాక్యాన్ని వేర్వేరు రకాలుగా పలికినప్పుడు, పిల్లల మెదడులో ఎలాంటి ప్రతిస్పందనలు ఏర్పడుతున్నాయో గమనించేందుకు వారి మెదడుని స్కానింగ్ చేశారు. పట్టేశారు ఆశ్చర్యకరంగా వాక్యంలోని పదాలు మారకపోయినా... ఆ వాక్యాన్ని ఉచ్ఛరించిన తీరు ద్వారా పిల్లలు, ఆ మాట వెనుక ఉన్న ఉద్వేగాన్ని గమనిస్తున్నట్లు తేలింది. ఇది ఏమంత తేలికైన ప్రక్రియ కాదంటున్నారు పరిశోధకులు. ఎంత అధునాతనమైన రోబో అయినా కూడా తను వినే మాట వెనుక ఉన్న భావాన్ని గ్రహించడం కష్టమని అంటున్నారు. అలాంటి ఏడాది అయినా నిండని పసిపిల్లలు ఇలాంటి నేర్పు సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారీ పరిశోధనలకు మూలం పిల్లలు తాము వినే స్వరాల వెనుక దాగిన ఉద్వేగాలను గ్రహిస్తారన్న విషయం తేలిపోయింది సరే! మరి ఆ నేర్పు వారికి ఎలా అలవడుతుంది? ఏ లక్షణాల ఆధారంగా వారు శబ్దాలను విశ్లేషించగలుగుతున్నారు? అన్న విషయాల మీద ఇక పరిశోధన జరగవలసి ఉందట. దీని వలన భాషకు సంబంధించి, పిల్లల మెదడు ఎదిగే విధానానికి సంబంధించి, మనం ఉద్వేగాలను గ్రహించే తీరుని గురించి కొత్త విషయాలు తెలుస్తాయని ఆశిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త! పిల్లలోని ఈ నేర్పు వెనుక కారణాలు, దాని వలన ఉపయోగాలు గురించి శాస్త్రవేత్తలు మరిన్ని విషయాలు పరిశోధించేలోపల మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. పసిపిల్లలే కదా! వారికేం తెలుస్తుందిలే అని వారి ముందు ఎడాపెడా ప్రవర్తించడానికి వీల్లేదు. వారు నిస్సహాయులు కాబట్టి తిరిగి మనల్ని ఏమీ అనలేరు అని విరుచుకుపడటం భావ్యం కాదు. ఏమో వాళ్లేం గ్రహిస్తున్నారో ఎవరికి తెలుసు? వారి మనసులో ఎలాంటి అభిప్రాయాలు రూపొందుతున్నాయో మనమెలా ఊహించగలం? అందుకే, పిల్లల ముందు కూడా తస్మాత్ జాగ్రత్త! - నిర్జర.    

భక్తిలో మెదడు మారిపోతుంది

ఈ రోజుల్లో మన మెదడులో మెదిలే ప్రతి భావాన్నీ పసిగట్టే అవకాశం ఉంది. అత్యాధునిక స్కానింగ్‌ పరికరాల ద్వారా శాస్త్రవేత్తలు మన మెదడు లోతుల్లో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భక్తిలో మునిగితేలే వారి మెదడులో ఎలాంటి చర్యలు ఏర్పడుతూ ఉండవచ్చు? అన్న ప్రశ్న వచ్చింది కొందరు పరిశోధకులకి. వచ్చిందే తడువుగా క్రైస్తవంలో ‘Mormon’ అనే శాఖకి చెందిన కొందరు భక్తుల మీద ఓ ప్రయోగాన్ని చేశారు. ఆ ప్రయోగం తీరు ఇలా సాగింది...   భక్తిని రేకెత్తించారు ప్రయోగంలో భాగంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే ఒక 19 మంది భక్తులను ఎన్నుకొన్నారు. వీరిలో 12 మంది మగవారు, ఏడుగరు ఆడవారు ఉన్నవారు. ఒక గంటపాటు వీరి మెదడుని పరీక్షించే ప్రయత్నం చేశారు. ఈ గంటలో కొంతసేపు వారి చర్చి గురించిన విశేషాలు చెప్పారు, కాసేపు ప్రపంచ ప్రసిద్ధ గురువుల మాటలు వినిపించారు, కొన్ని నిమిషాలు బైబిల్‌ నుంచి కొన్ని సన్నివేశాలు చూపించారు, ఇంకొంతసేపు తమ ప్రార్థనా పుస్తకం నుంచి సూక్తులు చదివారు... ఇలా రకరకాలుగా వారిలో భక్తిభావనలు రేకెత్తే ప్రయత్నం చేశారు.   పరిశుద్ధాత్మను గమనించారా! అభ్యర్దులలోని భక్తిని ఒక స్థాయికి రేకెత్తించిన తరువాత - మీకోసం వచ్చే రక్షకుడి గురించీ, మీ కుటుంబాల గురించీ, మీరు చేరుకోబోయే స్వర్గం గురించీ ఊహించుకుంటూ... భక్తి పారవశ్యంలో మునిగిపొమ్మంటూ సూచించారు. ఇలాంటి ప్రతీ సందర్భం తరువాత ‘మీకు పరిశుద్ధాత్మ చేరువలో ఉన్నట్లు భావిస్తున్నారా?’ అంటూ వారిని అడిగి చూశారు. చేరువలో ఉన్నట్లు భావిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతోందో తెలియచేయమన్నారు.   స్పందనలను గమనించారు చర్చిలో జరిగే ప్రార్థనా సమావేశంలో చాలాసేపు పాల్గొన్న తరువాత భక్తులు ఎలాంటి అనుభూతికి లోనవుతారో... ఈ ప్రయోగం తరువాత ఇంచుమించుగా అదే తరహా మనఃస్థితికి చేరుకున్నారు. మనసులో ప్రశాంతతని అనుభవించడం, కంటి నుండి నీరు ధారలు కట్టడం వంటి భక్తి పారవశ్యపు స్థితికి అనుభవించారు. ఈ సందర్భంగా వారి శరీరంలోనూ, మెదడులోనూ అనేక మార్పులు జరగడాన్ని గమనించారు పరిశోధకులు. శ్వాస మరింత గాఢంగా మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి భౌతిక మార్పులు కనిపించాయి. ఇక మెదడులో అయితే nucleus accumbens, medial prefrontal cortex అనే భాగాలలో స్పష్టమైన స్పందనలు కనిపించాయి. ఇందులో nucleus accumbens భాగాన్ని ఉత్తేజానికి కేంద్రంగా భావించవచ్చు. సంగీతాన్ని వింటున్నప్పుడు, ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు... మనుషులు ఉద్వేగానికి లోనవడానికి కారణం ఈ కేంద్రమేనట. ఇక medial prefrontal cortex అయితే విచక్షణ, విశ్లేషణ, నిర్ణయాధికారం వంటి లక్షణాలను ప్రభావితం చేస్తాయి.   అదీ విషయం! మంచో చెడో మనలోని ఆలోచనల తీరు, విచక్షణా శక్తి... భక్తి వల్ల ప్రభావితం అవుతాయని తేలిపోయింది. అయితే ఒకో మతంలోని ఆచారాన్ని బట్టి ఈ తీరు మారే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ఉదాహరణకు హిందు, బౌద్ధ మతాలలో ప్రార్థనా రీతులు వేరుగా ఉంటాయి. ఏదైతేనేం... భక్తిభావం అనేది మన మెదడు మీద ప్రభావం చూపుతుందన్న విషయం మాత్రం సుస్పష్టం!              - నిర్జర.  

వీరికి హెచ్.ఐ.వి ఉంది. కానీ...

తెలియక చేసిన పొరపాటు కావచ్చు, అనుకోకుండా దక్కిన శాపం కావచ్చు... హెచ్‌.ఐ.వి ఎవరి జీవితంలోకి అయినా ప్రవేశించవచ్చు. అయితే ఆ వైరస్‌ ప్రవేశించడంతోనే జీవితం అంతం కాదనీ, ఇక మృత్యువే ఏకైక మార్గం కాదనీ గ్రహించి తీరడం అవసరం. హెచ్‌.ఐ.వికి మందు లేకపోవచ్చు. కానీ హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ మనుషులు కూడా ఇతరులలాగానే బిడ్డల్ని కనేందుకు, సుదీర్ఘకాలం జీవించేందుకు తగిన చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే హెచ్‌.ఐ.వి పాజిటివ్‌ ఉన్నవారు తమలోని రోగనిరోధక శక్తి క్షీణించకుండా గమనించుకోవడం ఎంత అవసరమో, ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకోవడమూ అంతే అవసరం! మహా మహా సెలబ్రెటీలు సైతం హెచ్.ఐ.వితో జీవిస్తున్నారని తెలిస్తే... సామాన్యులలో కూడా ఆశకి రెక్కలు రావడం ఖాయం.   ఛార్లెస్ షీన్‌   హాలీవుడ్‌కి చెందిన ప్రసిద్ధ నటులలో ఛార్లెస్‌ షీన్‌ ఒకరు. Wall Street, Two and a Half Men, The Three Musketeers వంటి చిత్రాలతో పాటుగా అనేక టెలివిజన్ సిరీస్‌ ద్వారా షీన్‌ ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమే! అలాంటిది గత ఏడాది తనకు హెచ్.ఐ.వి ఉందని బహిరంగంగా ఒప్పుకోవడం ద్వారా షీన్‌ వార్తల్లోకి ఎక్కాడు. తాను నాలుగు సంవత్సరాలుగా హెచ్.ఐ.వితో బాధపడుతున్నాననీ, ఇప్పుడు దానిని బహిరంగంగా ఒప్పుకోవడంతో తన మనసులోని బాధ తీరిపోయిందనీ షీన్‌ చెప్పుకొచ్చాడు. ఇతరులు కూడా తాము హెచ్.ఐ.వి పాజిటివ్‌ అన్న విషయాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకోవాలని పిలుపునిచ్చాడు.   మేజిక్‌ జాన్సన్‌   బాస్కెట్‌బాల్‌ చరిత్రలోనే మేజిక్‌ జాన్సన్‌ది ఒక ప్రత్యేక అధ్యాయం. 12 సార్లు NBA విజేతగా, ఒలంపిక్‌లో స్వర్ణ పతకాన్ని సైతం సాధించిన ప్రతిభావంతునిగా జాన్సన్‌ క్రీడాలోకానికి పరిచయం. అయితే 15 ఏళ్ల క్రితమే జాన్సన్‌ తనకు హెచ్.ఐ.వి సోకిందన్న విషయాన్ని ప్రపంచానికి వెల్లడించాడు. వెల్లడించడమే కాదు, హెచ్.ఐ.వి గురించి ప్రజలలో అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. Magic Johnson Foundation పేరుతో హెచ్.ఐ.వి మీద ఒక యుద్ధాన్నే చేస్తున్నాడు. మరోపక్క దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకి కూడా జన్మనిచ్చాడు.   జెర్రీ హెర్మన్‌   హెచ్.ఐ.వి సోకిన వ్యక్తులు ఎక్కువ రోజులు బతకరు అనే అపోహ ఒకటి ఉంది. దీనిని పటాపంచలు చేయాలంటే హెర్మన్‌ గురించి చెప్పుకోవాల్సిందే. అమెరికాలో అటు నాటకాలకీ, ఇటు సినిమాలకీ ఎడాపెడా సంగీతాన్ని సమకూర్చడంతో హెర్మన్‌ దిట్ట. అందుకుగాను ఆయనకు లభించిన పురస్కారాలకి లెక్కలేదు. అలాంటి హెర్మన్ 1984లో తనకు హెచ్.ఐ.వి సోకిందని తెలియగానే హతాశుడయ్యాడు. ఇక ఎంతో కాలం బతకనంటూ స్నేహితులకు వీడ్కోలు సైతం ఇచ్చేశాడు. కానీ పోరాడిచూద్దాం అనే ఆలోచన ఆయన జీవితాన్ని నిలిపింది. 1990ల్లో హెచ్.ఐ.వి తీవ్రతను తగ్గించే మందులు రావడంతో ఇప్పటికీ హెర్మన్‌ హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు – 85 ఏళ్లు మాత్రమే!   క్రిస్‌ స్మిత్‌   క్రిస్‌ స్మిత్‌ నటుడు కాదు, క్రీడాకారుడు కాదు, సంగీతకారుడు అంతకంటే కాదు. ఆయనో పక్కా రాజకీయనేత. ఇంగ్లండులోని లేబర్ పార్టీ తరఫున అద్భుతాలు సృష్టించిన నాయకుడు. తాను హెచ్.ఐ.వితో బాధపడుతున్నానంటూ బహిరంగంగా ఒప్పుకొన్న తొలి బ్రిటన్‌ పార్లమెంటేరియన్‌. 1987 నుంచీ హెచ్.ఐ.వితో సతమతమవుతున్నా, దానిని మీద పైచేయి సాధిస్తూనే ఉన్నారు. హెచ్.ఐ.వి కోసం విరాళాలను సేకరించే సంస్థకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. వీరంతా గతం తాలూకు జ్ఞాపకాలు కాదు. వర్తమానంలో మనతో పాటుగా జీవిస్తున్నవారే! హెచ్.ఐ.వి అనే మహమ్మారితో నిశ్శబ్దంగా పోరాటం చేస్తున్నవారే! మరి వారి జీవితాలు ఇతరులు గెలుపు గుర్రాలని ఎక్కేందుకు స్ఫూర్తిగా ఎందుకు మారకూడదు!   - నిర్జర.

ఇవ్వడంలో ఉన్న తృప్తి

అది మధ్యాహ్నం సమయం. ఓ పెద్దాయన ఏవో సరుకులు తీసుకుందామని సూపర్‌మార్కెట్‌లో తిరుగుతున్నాడు. అదే సమయంలో ఓ ఆరేళ్ల చిన్నపిల్లవాడు షాపు యజమానితో ఏదో బతిమాలుతూ కనిపించాడు. ఆ పిల్లవాడిలో కనిపించిన దైన్యం చూసి పెద్దాయనకి జాలి వేసింది. వెంటనే పిల్లవాడి దగ్గరకు వెళ్లి ‘ఏంటి విషయం?’ అంటూ అడిగాడు. ‘మా చెల్లికి ఈ బొమ్మంటే చాలా ఇష్టం. అందుకే తన పుట్టినరోజుకి ఈ బొమ్మని బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ నా దగ్గర ఉన్న డబ్బులు అందుకు సరిపోవంటున్నారు,’ అన్నాడు పిల్లవాడు దీనంగా.‘ఓ మీ చెల్లిని నీతోపాటు తీసుకురాలేదా!’ అని అడిగాడు పెద్దాయన.   ‘లేదు ఇప్పుడు మా చెల్లి మాతో పాటు ఉండటం లేదు,’ అంటూ ఒక్క నిమిషం ఆగాడు పిల్లవాడు. ఆ తరువాత బాధగా... ‘మా చెల్లి దేవుడి దగ్గరకు వెళ్లిపోయిందట. మా అమ్మ కూడా తొందరలో దేవుడి దగ్గరకు వెళ్లిపోతుందట. అందుకనే ఈ బొమ్మని మా అమ్మకి ఇచ్చి చెల్లి దగ్గరకి పంపుదామని అనుకుంటున్నాను,’ అన్నాడు పిల్లవాడు. ఒకపక్క పిల్లవాడు ఆ విషయాన్ని చెబుతుండగానే అతని చెక్కలి మీదగా కన్నీరు ధారకట్టింది.   పిల్లవాడి మాటలు విని పెద్దాయన మనసు బద్దలైపోయింది. ‘ఏదీ నీ దగ్గర ఉన్న డబ్బుని ఇలా ఇవ్వు. దాంతో బొమ్మ వస్తుందేమో ఇంకోసారి అడిగి చూద్దాము,’ అంటూ అతని చేతిలో డబ్బుని తీసుకున్నాడు పెద్దాయన. ఆ పిల్లవాడు చూడకుండా తన జేబులో ఉన్న నోట్లని అందులో కలిపి షాపు యజమానికి అందించాడు. ‘అరే ఇందాక సరిగ్గా చూసుకున్నట్లు లేదు. నీ దగ్గర ఉన్న డబ్బులు బొమ్మ కొనేందుకు సరిపోతాయట. పైగా ఇంకో పదిరూపాయలు కూడా మిగిలింది,’ అంటూ మిగిలిన చిల్లరను పిల్లవాడి చేతిలో పెట్టాడు పెద్దాయన.   ఆ బొమ్మనీ, చేతిలో ఉన్న పదిరూపాయలనీ తృప్తి చూసుకున్నాడు పిల్లవాడు. ‘మా అమ్మకి తెల్లగులాబీలంటే చాలా ఇష్టం. ఈ పదిరూపాయలతో ఆమెకి తెల్లగులాబీలు తీసుకువెళ్తాను. అదిగో ఆ వీధి చివరగా కనిపిస్తున్న ఇల్లే మాది. మీరు ఎప్పుడు కావాలనుకున్నా మా ఇంటికి రావచ్చు,’ అంటూ తుర్రుమన్నాడు.   పిల్లవాడు పరుగులుతీసిన వైపే పెద్దాయన చూస్తూ ఉండిపోయాడు. ఆయనకి హఠాత్తుగా మొన్న పేపర్లో చదివిన ఓ వార్త గుర్తుకువచ్చింది. ఒక తల్లీకూతురూ రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఓ లారీ వాళ్లని గుద్దేసిందనీ... కూతురు అక్కడికక్కడే చనిపోగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందనీ. ‘బహుశా తను చదివిన వార్త ఈ కుటుంబానిదేనేమో’ అనిపించింది పెద్దాయనకి. ఒక మనిషి నిర్లక్ష్యంతో మరో కుటుంబం ఎలా చిన్నాభిన్నమైపోతుందో కదా! అనిపించి ఆయన కళ్లు చెమర్చాయి.   మర్నాడు ఆ పెద్దాయని ఎందుకో ఆ ఇంటికి వెళ్లి చూడాలనిపించింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో, తడబడే అడుగులతో ఆ ఇంటిని చేరుకున్నాడు పెద్దాయన. ఆ ఇంటి ముందు గుమికూడిన జనాన్ని చూసి ఆయన మనసు కీడు శంకించింది. ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పెద్దాయనకు అక్కడ ఓ శవపేటిక కనిపించింది. అందులో ఒక అందమైన యువతి. ఆ యువతి చేతిలో ఓ తెల్లగులాబీ, పక్కనే నిన్న తాను కొనిపెట్టిన బొమ్మా కనిపించాయి. ఇంతలో నిన్న కనిపించిన పిల్లవాడు పరుగులెత్తుకుంటూ ఆ పెద్దాయన దగ్గరకి వచ్చాడు.   ‘మా అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లేలోపే ఆమెకి ఇష్టమైన తెల్లగులాబీలు ఇచ్చాను. దేవుడి దగ్గర చెల్లి కనిపిస్తే బొమ్మని ఇవ్వమని కూడా చెప్పాను. అమ్మ కూడా దేవుడి దగ్గరికి వెళ్లిపొతుందంటే చాలా బాధగా ఉంది. కానీ పాపం చెల్లి నాకంటే చిన్నది కదా! అందుకని అమ్మ చెల్లి దగ్గర ఉండటమే కరెక్ట్‌,’ అని గబగబా చెబుతున్నాడు పిల్లవాడు.   పిల్లవాడి మాటలకి పెద్దాయన కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆ పిల్లవాడిది చావుని అర్థం చేసుకునే వయసు కాదు! కానీ ఇవ్వడంలో ఉన్న తృప్తిని మాత్రం తెలుసుకున్నాడు. పిల్లవాడి మనసు ఇక్కడితో ఆగిపోతే బాగుండు అనిపించింది పెద్దాయనకి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.  

The benefits of Jigsaw Puzzle

Who doesn’t love to play with a Jigsaw Puzzle? But have we ever thought that these puzzles are not just a sort of fun or a form of recreation! For centuries together, they have been an exercise to our mind. Let’s watch out for some of the benefits that come together along with a Jigsaw Puzzle.   Simplest In this world of digital mess, Jigsaw puzzles offer an inexpensive and long lasting entertainment. No screen, no battery, no plastic and no mechanism! That’s what a Jigsaw puzzle is all about. That is the reason why the popularity of Jigsaw puzzle reached new heights during the times of Great Depression.  If you want to keep your children from all versions of Idiot boxes, Jigsaw could be the perfect answer.   Food for mind Every corner of the mind gets activated while solving a Jigsaw puzzle. It allows the kids to recognise different shapes. It encourages them to tackle the problem and make a judgement. Their thought process gets matured. On a whole- solving a Jigsaw puzzle is like an exercise to our mind. It would enhance the memory and problem solving capacity of the grey matter.   Co-ordination Hand- eye coordination of a kid is an important aspect in his development. And Jigsaw puzzles could perfectly assist him in achieving such maturity. It’s not just the Hand- eye coordination that gets better with Jigsaw puzzle, motor skills such as the right movement of fingers would also gets enhanced while solving a Jigsaw.   Tranquillity Concentrating on a Jigsaw puzzle could be the best way to calm down a mind. A mind distracted over various problems could be assigned with a single task of solving the Jigsaw. This would not only improve our concentration, but would also strengthen our levels of patience. People who often play Jigsaw puzzles could be those who can face any task with tranquillity.   Game for everyone Every game has its own age restrictions. But Jigsaw could be a game for any generation. Depending on the number of pieces and the complexity of the picture... it could be anyone’s game. Which means that the members of a family could get together to solve a Jigsaw... and that could be a perfect occasion for them to spend their time together.   Some people say that Jigsaw encourages our creativity and some others suggest that it enhances our visual perception; some even argue that solving a Jigsaw puzzle would increase our goal setting abilities and management skills. Whatever might be the reason... no one can ever ignore that a Jigsaw puzzle is one of the best forms of entertainment that man has ever invented.     - Nirjara.

ఆడుకునే బొమ్మలు కూడా మెదడుని మార్చేస్తాయి

  అలా సూపర్‌మార్కెట్టులో సరుకులు కొనుక్కుంటూ తిరిగే సమయంలో మనకి అకస్మాత్తుగా ఎవరో తారసపడతారు. అతని మొహం ఎక్కడో చూసినట్లుందే అని అనిపిస్తుంది. అనిపిస్తుందే కానీ సదరు మొహం ఎవరిదో, దానిని ఇంతకుముందు ఎప్పుడు చూశామో గుర్తుకురాదు. ఈ సమస్య అందరిదీనూ! కానీ మొహాలను గుర్తుంచుకోవడం అనే కళలో ఆడవారికీ మగవారికీ మధ్య తేడాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు.   ఇప్పటివరకూ మగవారు ఆడవారికంటే ఎక్కువకాలం పరిచయస్థుల మొహాలను గుర్తుంచుకుంటారు అని నమ్మేవారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తేల్చుకోవాలనుకున్నారు. అందుకోసం ఓ 295 మంది అభ్యర్థుల మీద ఓ పరీక్షని నిర్వహించారు. వీరిలో 161 మంది మగవారు కాగా 134 మంది స్త్రీలు. వీరందరికీ ఆరు చిత్రాలని చూపించారు. ఈ చిత్రాలలో మగవారి మొహాలు, ఆడవారి మొహాలే కాదు... బార్బీ డాల్‌ మొహాలు, ట్రాన్స్‌పార్మర్ బొమ్మల మొహాలు కూడా ఉన్నాయి. వీటికి తోడు రకరకాల కార్ల బొమ్మలని కూడా చూపించారు.   ఇలా ఆరు చిత్రాలను చూపించిన తరువాత, వారికి ఓ మూడు చిత్రాలు చూపించారు. ఈ మూడింటిలో రెండు కొత్తవి, ఒకటి మాత్రం ఇంతకుముందు చూసిన ఆరు చిత్రాలలో ఒకటి ఉండేట్లుగా అమర్చారు. ఈ ప్రయోగంలో తేలిందేమిటంటే... కార్లని గుర్తుపట్టడంలో మగవారు ఆడవారికంటే ఎక్కువ చురుగ్గా కనిపించారు. కానీ వ్యక్తుల మొహాలని గుర్తుపట్టడంలో మాత్రం ఇద్దరికీ సరిసమానంగా మార్కులు పడ్డాయి. కాకపోతే ఇందులో ఒక తిరకాసు ఉంది. బార్బీ బొమ్మలనీ, వాటిని పోలిన మొహాలనీ గుర్తుపట్టడంలో ఆడవారిది పైచేయిగా ఉంటే... ట్రాన్స్‌ఫార్మర్‌ బొమ్మలనీ, వాటిని పోలిన ముఖాలను గుర్తుపట్టడంలో మగవారిది పైచేయి అయ్యింది.   మొహాలను గుర్తుపట్టడంలో ఆడవారికీ, మగవారికీ మధ్య ఉన్న వ్యత్యాసానికి కారణం ఏమిటా అని పరిశోధించిన శాస్త్రవేత్తలకు ఊహించని జవాబు దొరికింది. చిన్నప్పుడు ఆడపిల్లలు బార్బీ బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వారి మెదడులో అలాంటి రూపాలని త్వరగా నిక్షిప్తం చేసుకునే వ్యవస్థ ఏర్పడుతుందనీ... మగపిల్లలు కార్లు, ట్రాన్సఫార్మర్ బొమ్మలతో ఆడుకుంటారు కాబట్టి వారి జ్ఞాపకాలు అలాంటి మొహాల చుట్టూ పెనవేసుకుని ఉంటాయనీ తేలింది.   మన దేశంలోని పిల్లలు బార్బీ డాల్స్‌తోనూ, ట్రాన్సఫార్మర్‌ బొమ్మలతోనూ ఆడుకోకపోవచ్చు. కానీ ఏవో ఒక బొమ్మలతో ఆడుకోవడం అయితే ఉంటుంది కదా! అవి ఎలాంటివైనా కూడా వారి మనస్తత్వం మీదా మానసిక ఎదుగుదల మీదా ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనతో తేలిపోయింది. ‘పిల్లవాడు గ్రహాంతరవాసుల గురించి తీసిన ఒక సైన్స్‌ ఫిక్షన్‌ ధారావాహికను చూసినా కూడా, అది ‘మొహాలని గుర్తుపెట్టుకోవడం’ అనే అతని నైపుణ్యం మీద ప్రభావం చూపుతుంది,’ అంటున్నారు ఈ పరిశోధనను నిర్వహించిన శాస్త్రవేత్తలు. కాబట్టి పిల్లలు వేటితో ఆడుతున్నారో, ఏమేం చూస్తున్నారో కూడా మనం గమనించుకోవాలన్నమాట!   - నిర్జర. 

ఇలాంటి మాటలెందుకు!

  మనిషికి మాటే పరికరం. ఒక మనిషితో కలవాలన్నా, ఓ మనిషి మనసు విరవాలన్నా మాటతోనే సాధ్యమవుతుంది. అందుకే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు. విల్లు నుంచి వచ్చిన బాణం, నోటి నుంచి వెలువడిన మాట వెనక్కి రావడం కష్టం కాబట్టి... ఆ జాగ్రత్త ముందే ఉండాలంటారు. ఎవరు ఎలా మాట్లాడతారు అనేది వారి నేర్పుని బట్టీ, వ్యక్తిత్వాన్ని బట్టీ ఆధారపడి ఉండవచ్చు. కానీ సంభాషణల్లో కొన్ని రకాల మాటలు లేకపోవడమే సంస్కారం అనిపించుకుంటుంది.   పరోక్షపు ఎత్తిపొడుపులు కొంతమందికి కోపం వస్తే దానిని నేరుగా వ్యక్తీకరించి విషయాన్ని తేల్చుకోరు. పరోక్షంగా సూటీపోటీ మాటలు అంటూ ఉంటారు. పిల్లి మీదా కుక్క మీదా పెట్టి దెప్పి పొడుస్తూ ఉంటారు. తమ మాటలు తగలాల్సినవారికి గుచ్చుకున్నాయి కదా అని వీరు సంబరపడిపోవచ్చుగాక. కానీ ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించినవారి మనసు మాత్రం తీవ్రంగా నొచ్చుకుంటుంది. నేరుగా అనే మాటలకంటే ఇలాంటి మాటలే ఎక్కువగా నొప్పిస్తాయి. ఆ మాటలు అన్న మనిషి పట్ల మనసులో ఓ చెడు అభిప్రాయాన్ని కలగచేస్తాయి.   వ్యక్తిగత వివరాలు అదేమిటో గానీ.. కొంతమంది పరిచయం అయిన కొద్దిసేపట్లోనే మీ జీతం ఎంత? మీ కులం ఏమిటి? వంటి వ్యక్తిగత వివరాలను అడిగేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే హద్దులు దాటుకుని ఇంట్లోని వివరాలను సైతం రాబట్టేందుకు ఆబగా ప్రయత్నిస్తారు. అవతలివారితో మనకు ఎంతవరకు చనువు ఉంది! వారి వ్యక్తిగత విషయాలలో మన జోక్యం ఎంతవరకు ఉండాలి! అన్న ఆలోచన లేకపోతే ఎంతటి పెద్దవారి మీదైనా ప్రతికూల అభిప్రాయమే ఏర్పడుతుంది.   ఉచిత సలహాలు విచక్షణ ఉన్న ప్రతివారికీ తన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అన్న అవగాహన ఉంటుంది. మరీ అవసరం అనుకుంటే అవతలివారిని సలహా అడుగుతాడు. అలాంటి సమయంలో మనకి తోచిన సలహాని ఇవ్వడంలో తప్పులేదు కానీ... అవతలి మనిషి జీవితం ఎలా నడవాలో మనమే సలహా ఇచ్చేందుకు ప్రయత్నిస్తే భంగపడక తప్పదు. ‘మీ నాన్నాగారిని మీతో ఉంచుకోకుండా పంపేయవచ్చుగా!’, ‘మీ కొడుకు ఇంజినీరింగ్ కాకుండా డాక్టరు చదివించవచ్చుగా!’, ‘మీరు ఉద్యోగం మానేసి వ్యాపారం పెట్టుకోవచ్చుగా!’ అంటూ ఇచ్చే సలహాల దగ్గర్నుంచీ పంటి నొప్పికి ఏం వాడాలి, పొట్ట తగ్గడానికి ఏం చేయాలి వరకూ ఇచ్చే సవాలక్ష సలహాలు స్నేహ బంధాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. సలహా అనేది ఒక ఆయుధం. అది అవసరం అనుకున్నప్పుడే ప్రయోగించాలి. లేకపోతే దానివల్ల వినాశనం తప్పదు.   సోత్కర్ష ప్రతి ఒక్కరి జీవితమూ విలువైనదే! అందులో అనుమానమేమీ లేదు. కొందరు కాస్త ఎక్కువ శ్రమపడి పైకి రావచ్చు. ఇంకొందరు అడ్డూఅదుపూ లేకుండా డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు. ఇలాంటి వారందరికీ తమ జీవితాన్ని చూసుకున్నప్పుడు చాలా గర్వంగా ఉండటం సహజం. కొండొకచో మిగతా వారిని చూస్తే చులకనా సహజమే! కానీ నిరంతరం తమ ఆత్మకథ గురించి కథలు కథలుగా డప్పు కొట్టుకుంటూ ఉంటే వినేవారి చెవులు చిల్లులుపడక తప్పదు. మొహమాటం కోసం మొహం మీద చిరునవ్వు పులుముకున్నా.... ఇదెక్కడి ఖర్మరా బాబూ అని తిట్టుకోకా తప్పదు.   పుకార్లు మనకి రూఢి కాని విషయం, అందునా ఇంకొకరి గురించి చెడుగా చెప్పుకునే విషయం, పైగా ఇతరులు ఎవ్వరికీ ఉపయోగం లేని విషయం... ఓ పనికిమాలిన పుకారు కాక మరేమవుతుంది. ఇలాంటివాటి వల్ల ఇసుమంతైనా ఉపయోగం లేకపోగా పనికిమాలిన చెత్తని పంచిన మకిలి మాత్రం మనకి అంటుకుపోతుంది. పైగా ఇలాంటి పుకారు వల్ల ఒకోసారి సదరు మనిషి జీవితమే చిక్కుల్లో పడిపోతుంది. మనమూ వివాదాల్లోకి ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడుతుంది.   ఇవే కాదు! గొప్ప కోసం అబద్ధాలు చెప్పడం, ఇతరులతో పోల్చి చూడటం, వెకిలి పదాలు ప్రయోగించడం, తాత్కాలికంగా పైచేయి సాధించేందుకు అవతలి మనిషిని ఎగతాళి చేయడం వంటి లక్షణాలని మన సంభాషణల నుంచి దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే అరగంటలో ముగిసిపోయే సంభాషణ కంటే కలకాలం నిలిచిపోయే బంధమే ముఖ్యం కదా! తాత్కాలికంగా తృప్తి పడే అహంకారంకన్నా, చెదిరిపోని సంస్కారం విలువైనది కదా!     - నిర్జర.  

ఒక్క గది కోసం!

  తన తోటి కుర్రవాళ్లందరిలాగానే సమీర్ కూడా అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. తన కలలను నిజం చేసుకునేందుకు ఎంతగానో శ్రమించాడు. రాయాల్సిన పరీక్షలన్నీ రాశాడు. చేసుకోవాల్సిన దరఖాస్తులన్నీ నింపాడు. చివరికి తను అనుకున్నది సాధించాడు. తన కలల ప్రపంచం అయిన అమెరికాలో అడుగుపెట్టాడు. ‘నా తండ్రి తన జీవితకాలమంతా కష్టపడి ఒక సింగిల్‌ బెడ్రూం ఫ్లాట్‌ను మాత్రమే సంపాదించగలిగాడు. మరి నేనో! ఇక మీదట ఏ లోటు రానంత సంపదను మిగుల్చుకుంటాను,’ అనుకున్నాడు.   సమీర్‌కు అమెరికాలో మంచి ఉద్యోగమే దొరికింది. కానీ అక్కడి వ్యయానికి జీతం బొటాబొటీగా సరిపోయేది. అయినా వీలైనంత పొదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఒకో డాలర్‌నీ దాచుకోవడం మొదలుపెట్టాడు. ఓ రెండేళ్లు గడిచాయి. మనసు మాటిమాటికీ మాతృదేశం మీదకి గాలిమళ్లేది. కానీ వెనక్కి వెళ్లిపోతే ఎలా? ఇప్పుడిప్పుడే తను ఉద్యోగంలో నిలదొక్కుకుంటున్నాడు. పైగా ఆర్థికపరిస్థితులు మున్ముందు ఉన్నంత సుముఖంగా లేవు. తనకీ ఒక తోడు దొరికితే ఇంత ఒంటరితనం ఉండదు కదా! అనుకున్నాడు. వెంటనే తల్లిందండ్రులకు కబురుపెట్టాడు. ‘నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకో మంచి సంబంధం వెతికి పెట్టండి’ అని. కొడుకు మాటలు విని తల్లిదండ్రులు సంబరపడ్డారు. తమ కొడుకుకి అంగరంగవైభవంగా పెళ్లిచేయాలని కలలు కన్నారు. వెంటనే అతని కోసం పెళ్లికూతురిని వెతకడం మొదలుపెట్టారు. చివరికి సమీర్‌కీ అతని తల్లిదండ్రులకీ నచ్చేలా ఓ సంబంధం దొరికింది.   ‘పెళ్లి చకచకా జరిగిపోవాలి. నాకట్టే సెలవలు దొరకడం కష్టం! ఒక వారంలో తతంగం అంతా ముగిసిపోవాలి,’ అంటూ మరో సందేశం పంపాడు సమీర్‌. దాంతో పెళ్లి కారణంగా అయినా కొన్నాళ్లపాటు కొడుకు తమతో పాటుగా ఉంటాడని ఆశించిన తల్లిదండ్రులు భంగపడ్డారు. అయినా ‘పెళ్లయితే జరుగుతోందిగా, తన కొడుకు ఒక ఇంటివాడు అవుతున్నాడు కదా!’ అనుకుని మురిసిపోయారు. వాళ్లు అలా మురిసిపోతుండగానే కొడుకు ఇలా వచ్చి పెళ్లి చేసుకుని అలా వెళ్లిపోయాడు. అంతా ఓ కలలా జరిగిపోయింది.   సమీర్‌తో పాటుగా అమెరికాలో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురుకి ఆ దేశం తెగ నచ్చేసింది. కానీ ఓ ఆర్నెళ్లు తిరిగేసరికి ఆమెకి కూడా పుట్టింటి మీదకి గాలి మళ్లింది. కానీ ఏం చేస్తుంది? రానూపోనూ ప్రయాణం ఖర్చులంటే మాటలా! అసలే ఒకరికిద్దరిని పోషించేందుకు సమీర్‌ జీతం సరిగ్గా సరిపోతోంది. భార్యలో రోజురోజుకీ పెరిగిపోతున్న దిగాలుని చూసి సమీర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ‘పిల్లల్ని కంటే అంతా సర్దుకుంటుంది,’ అంటూ ఎవరో సలహా ఇచ్చారు. ఆ మాట నిజమే కదా అనిపించింది సమీర్‌కి. వెంటనే వారు పిల్లల్ని కనేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఓ మూడేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కన్నారు. పిల్లల్ని ఎలాగైనా తన దేశానికి తీసుకువెళ్లి తన తల్లిదండ్రులకు చూపిస్తే బాగుండు అనిపించింది సమీర్‌కి. కానీ ఏం చేస్తాడు! తనకా సెలవలు దొరకడం లేదు. పైగా పిల్లల రాకతో ఖర్చులూ పెరిగిపోయాయి. పోనీ భార్యనన్నా పంపిద్దామంటే, పెరిగిపోయిన సంసారానికి సాయపడేందుకు తను కూడా ఓ ఉద్యోగాన్ని వెతుక్కుందయ్యే!   కొన్నాళ్లకి సమీర్‌ తల్లిదండ్రులకి ఏదో ప్రమాదం జరిగిందన్న వార్త వచ్చింది. కానీ ఉన్నఫలంగా చేతిలోని పనిని వదిలి వెళ్లలేని పరిస్థితి. దాంతో తన భార్యాపిల్లలను ఇండియాకు పంపాడు. వాళ్లు కోలుకునే అవకాశం ఉంది కాబట్టి, తను నిదానంగా వెళ్లి పరామర్శించి రావచ్చు అనుకున్నాడు. కానీ అలా జరగలేదు! ప్రమాదం జరిగిన మర్నాటికే అతని తల్లిదండ్రులు చనిపోయారు. సమీర్‌ పిల్లల్ని చూడకుండానే వాళ్లు కళ్లుమూశారు. చుట్టాలంతా కలిసి వాళ్ల అంత్యక్రియలను పూర్తిచేయాల్సి వచ్చింది. ఆ సంఘటన తరువాత సమీర్‌కు జీవితం మీదే విరక్తి పుట్టింది. ‘తల్లిదండ్రుల అంత్యక్రియలకు వెళ్లలేకపోతే ఎంత సాధించీ ఏం ఉపయోగం,’ అనుకున్నాడు. ఆ బాధలో ఆ ఆరునెలలు తెగ తాగాడు. సైకాలజిస్టుల దగ్గరకి వెళ్లి కౌన్సిలింగులూ గట్రా చేయించుకున్నాడు. తిరిగి ఉద్యోగ బాధ్యతలలో పడిపోయాడు!   సమీర్‌కి ఇప్పుడు యాభై ఏళ్ల వయసు వచ్చింది. పిల్లల చదువు కోసం తను సంపాదించినదంతా ఖర్చుపెట్టేశాడు. పైగా భార్యకి ఏదో మొండి జబ్బు రావడంతో మిగిలిన డబ్బులు ఆమె వైద్యానికి సరిపోయాయి. ఇప్పుడు పిల్లలు తన దగ్గర ఉండటం లేదు. భార్యా తనకి దక్కలేదు. ఇక ఇప్పటికైనా తన దేశానికి తిరిగివెళ్లిపోతే బాగుండు అనిపించింది సమీర్‌కి. ఇప్పుడు అతన్ని ఆపేందుకు ఉద్యోగం లేదు, సంసారమూ లేదు. చేతిలో కాసిన డబ్బులు మాత్రమే ఉన్నాయి. వాటితో ఇండియాలో ఓ మంచి ఇల్లు తీసుకుని స్థిరపడదామనుకున్నాడు. తీరా స్వదేశానికి చేరుకున్నాక తెలిసింది. తను పుట్టి పెరిగిన ఊళ్లో ఇంటి ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని. దాంతో తను ఒకప్పుడు చవకగా అమ్మిపారేసిన నాన్నగారి సింగిల్ బెడ్రూం ఫ్లాట్‌ గుర్తుకి వచ్చి మనస్సు చివుక్కుమంది. ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బుని లెక్కవేస్తే ఒక డబల్ బెడ్రూం ఫ్లాట్‌ వస్తుందని తేలింది. దాంతో అలాంటి ఫ్లాట్‌ ఒకటి తీసుకుని మిగిలిన కాసిన డబ్బులూ బ్యాంకులో వేసుకుని జీవితాన్ని నెట్టుకురాసాగాడు. ఆ ఫ్లాట్ గృహప్రవేశం చాలా నిరాడంబరంగా జరిగింది. పిల్లలు శుభాకాంక్షల సందేశాలు పంపి ఊరుకున్నారు.   గృహప్రవేశం జరిగిన రాత్రి సమీర్ పడుకుని ఉండగా ఒక్కసారిగా అతని జీవితం మొత్తం కళ్లముందు తిరిగింది. తన తండ్రి జీవితం, తన అమెరికా ప్రయాణం, అక్కడ తను నిలదొక్కునేందుకు పడిన కష్టం, పిల్లల చదువులు, భార్య మరణం అన్నీ గుర్తుకువచ్చాయి. ఇక్కడ ఉంటే తను జీవించలేకపోయేవాడా? పెళ్లి అయ్యేది కాదా? పిల్లల్ని పెంచలేకపోయేవాడా?... ఇన్నాళ్లు తన దేశానికీ, తల్లిదండ్రులకీ దూరంగా ఉండి అమెరికాలో ఉండి సాధించింది ఏమిటి? ఇంతాచేసి మరో బెడ్రూం ఎక్కువ ఉన్న ఫ్లాట్ తీసుకోవడమే తను సాధించిన విజయమా? అన్న ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎందుకనో అతని గుండెలో పోటు! మరి ఈసారి అతని పిల్లలు సమీర్‌ని చూసేందుకు వస్తారో లేదో! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

కుక్కలకీ ఉంటాయి జ్ఞాపకాలు

  ఈ ప్రపంచంలోనే మనుషులకి విశ్వాసపాత్రమైన జీవి ఏదంటే కుక్కలే అంటారు. మరికొందరు ఇంకొంత దూరం వెళ్లి మనిషిని నమ్మడం కంటే కుక్కలని నమ్మడం మేలని తీర్మానించేస్తారు. విశ్వాసం ఉండటం వరకూ బాగానే ఉంది. కానీ మనతో ఉండే కుక్కలు నిరంతరం మనల్ని గమనిస్తూ, మన చర్యను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటాయా అంటే అవుననే సమాధానం చెబుతోంది ఓ పరిశోధన.   Epsiodic Memory పోయిన సంక్రాంతికి మీ ఊరికి వెళ్లినప్పుడు, అక్కడ ఎలా గడిచింది? క్రితంసారి మీ పుట్టినరోజు ఎలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు మన దగ్గర సుదీర్ఘమైన సమాధానం ఉండి తీరుతుంది. మనుషులలో ఉండే ఈ తరహా జ్ఞాపకాలని ‘Epsiodic memory’ అంటారు. అంటే ఒక జ్ఞాపకాన్ని అది జరిగిన సమయం, సందర్భం, ప్రదేశాలతో సహా గుర్తుంచుకోవడం అన్నమాట. ఇలాంటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకునేటప్పుడు, ఆ సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు? ఆ పరిస్థితిలో మనకు కలిగిన అనుభూతి ఏమిటి? వంటి విషయాలు కూడా స్ఫురిస్తాయి.     మనుషులకు మాత్రమే ప్రత్యేకం! ఇంతవరకూ ఈ తరహా Epsiodic Memory కేవలం కోతులు, మనుషులు వంటి ఉన్నతశ్రేణి జీవులలో మాత్రమే ఉందని నమ్మేవారు. కానీ కుక్కలలో ఈ తరహా జ్ఞాపకాలు ఎంతవరకు నిక్షిప్తం అయ్యే అవకాశం ఉందో పరిశీలించారు హంగేరీకి చెందిన శాస్త్రవేత్తలు. అందుకోసం ఓ 17 కుక్కలను ఎన్నుకొన్నారు. ఇవన్నీ వేర్వేరు జాతులకు చెందినవి. పైగా యజమాని ఆజ్ఞను అనుసరించేలా శిక్షణ ఇవ్వబడ్డవి. పరిశోధనలోని మొదటి దశలో వీటి ముందు యజమానులు కొన్ని పనులు చేసి, తమ చర్యను అనుకరించమని ‘Do it’ అంటూ ఆజ్ఞాపించారు. వెంటనే వారి కుక్కలు వారి ఆజ్ఞను తూ.చా. తప్పకుండా పాటించాయి.   చెప్పకుండానే చేయమన్నారు పరిశోధనలోని రెండో దశలో కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, యజమాని ఏదో పని చేస్తూ వాటికి కనిపించారు. గొడుగుని చేత్తో పట్టుకోవడం, కుర్చీ ఎక్కి నిల్చోవడం వంటి వింతపనులు చేశారు. ఆ తరువాత కాసేపటికి ‘Do it’ అంటూ ఆజ్ఞాపించారు. అలాంటి ఊహించని ఆజ్ఞ ఎదురైనప్పుడు కూడా కుక్కలు తన యజమాని అంతకు ముందు ఏం చేశాడో తిరిగి చేసిశాయి. అంటే ప్రత్యేకించి శిక్షణ లేని సమయంలో కూడా కుక్కలు తమ యజమాని చర్యలను గమనిస్తూ ఉన్నాయని రుజువైందన్నమాట. ఒక గంట గడిచిన తరువాత కూడా మూడో వంతు కుక్కలు తమ యజమాని అసంకల్పితంగా చేసిన చర్యని గుర్తుంచుకొని వాటిని అనుకరించడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.     ఉపయోగం ఇప్పటి వరకూ జ్ఞాపకశక్తి మీద జరిగిన పరిశోధనలు ఎక్కువగా మనిషి చుట్టూనే తిరిగాయి. కానీ ఈ పరిశోధనతో ఇతర జీవుల మెదడు సామర్థ్యం ఏమిటో కూడా తెలిసి వచ్చింది. పైగా మనిషిలో ‘నేను’ అనే స్పృహ ఉండటం వల్లే అతనిలో ‘Epsiodic Memory’ సాధ్యమంటున్నారు. మరి ఇతర జీవులలో కూడా ఇలాంటి స్పృహ ఉంటుందా? లేకపోతే వాటి మెదడు వేరే విధంగా పనిచేస్తోందా? వంటి సరికొత్త ప్రశ్నలకు ఈ పరిశోధన అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. మరి ఆ ప్రశ్నలకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో! అంతవరకూ మీ కుక్క మీ చర్యల్ని అతి జాగ్రత్తగా గమనిస్తోందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.                     - నిర్జర.

స్ఫూర్తిదాయకం బాలమురళి జీవితం

కర్ణాటక సంగీతంలో మరో అధ్యాయం ముగిసింది. త్యాజరాజులవారి శిష్యపరంపరలో మరో తరం గడిచింది. చాలాఏళ్లు అలిగి తెలుగువారికి దూరంగా ఉన్నా... మన గుండె లయల్లో ఒకటై సాగిన నాదం ఆగిపోయింది. బాలమురళిది 86 ఏళ్ల నిండైన జీవితమే! కాదనం! కానీ వందేళ్లు బతికినా కూడా ఆయన మనతోనే ఉండిపోతే బాగుండు అనుకునేంత ప్రభావం ఆయనది. సంగీత ప్రపంచమే విషాదరాగాన్ని ఆలపిస్తున్న ఈవేళ బాలమురిళి గురించి కొన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలు... బాల అనేది బిరుదు మాత్రమే   బాలమురళి పుట్టిన 15వ రోజుకే ఆయన తల్లిగారు చనిపోయారు. తనకి కొడుకు పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టాలనుకుంది ఆమె. దాంతో ఆయనకు అదే పేరు ఖాయమైంది. బాల అనేది బిరుదు మాత్రమే! పట్టుమని ఎనిమిదేళ్లయినా లేని వయసులో మురళీకృష్ణ విజయవాడలోని త్యాగరాజ ఆరాధన ఉత్పవాలలో పాల్గొన్నారు. అక్కడ ఏకబిగిన రెండున్నర గంటలు పాడిన మురళి విద్వత్తుకి మెచ్చుకొని... బాల అన్న బిరుదుని అందించారు. అయితే బాలుడిలాగా తాను నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్న విషయాన్ని ఆ బిరుదు గుర్తుచేస్తూ ఉంటుందని అంటారు బాలమురళి.   మ్యూజిక్‌ థెరపీతో కోమాలోంచి బయటకు ఈ సృష్టి అంతా నాదానుగుణంగానే సాగుతోందని హైందవుల నమ్మకం. ఆ వాదాన్ని మరింతగా విశ్వసిస్తారు బాలమురళి. లయబద్ధమైన సంగీతంతో ఎలాంటి మొండిరోగాన్నయినా నయం చేయవచ్చునంటారు. సంగీతంతో స్వస్థత అనే విషయం మీద బాలమురళి అనేక ప్రయోగాలు చేశారు. ఆయన అందించిన స్ఫూర్తితో రామ్‌భారతి వంటి శిష్యులు మ్యూజిక్‌ థెరపీ మీద మరింత విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. తన మ్యూజిక్‌ థెరపీతో మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జీ.రామచంద్రన్‌ను ఏకంగా కోమా నుంచే బయటకు తీసుకువచ్చానని చెబుతారు బాలమురళి.   అనురక్తితోనే అసలు విద్య బాలమురళి కుదురుగా ఎవరో ఒక గురువు దగ్గర సంగీతం నేర్చుకున్నది లేదు. చదువు కూడా అంతంతమాత్రమే! సాధన కూడా అంతగా చేయనంటారు బాలమురళి. కానీ ఏ స్వరాన్నయినా ఒకసారి వింటే ఇట్టే పట్టేయగలరు. ఏ భాషలో పాటనైనా, పది నిమిషాల్లో మెదడులో నిక్షిప్తం చేసుకోగలరు. ‘అదిగో భద్రాద్రీ’ అంటూ కీర్తనలను ఆలపించినా, ‘మౌనమె నీ భాష ఓ మూగమనసా’ అంటూ సినిమా పాటలను పాడినా, అన్నమయ్య కీర్తనలకు స్వరాన్ని సమకూర్చినా, ‘ఆది శంకరాచార్య’ వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించినా... సంగీతం పట్ల ఆయనకు ఉన్న అభినివేశమే దానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ బాలమురళి ముద్రని నిలిపింది.   అహంకారం కాదు ఆత్మవిశ్వాసం ఏమీ సాధించకుండానే కళాకారులు అహంకరించిపోతున్న రోజులివి. కాస్తంత సృజన ఉంటే చాలు ఎగిరెగిరి పడే సందర్భాలివి. ఇలాంటివారితో పోలిస్తే బాలమురళి ప్రతిభ వేయింతలు కావచ్చు. కానీ అంతటివాడికైనా అహంకారం ఎందుకన్న విమర్శలూ లేకపోలేదు. పైగా మహతి వంటి కొత్త రాగాలను ఆవిష్కరించడం, మాట పట్టింపు వస్తే వెనక్కి తిరిగి చూడకపోవడం, సంగీతంలో తనకు తిరుగులేదని బహిరంగంగానే చెప్పుకోవడంతో ఆయనకు అహంకారం అంటారు విమర్శకులు. కానీ తనది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం అంటారు బాలమురళి.   బాలమురళి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా శీర్షకలే పెట్టుకోవలసి వస్తుంది. చిన్నప్పుడే తల్లి నుంచి దూరమైనా సంగీత సరస్వతి ఒడిలో పెరిగిన ఈ బాలుడు రామదాసు కీర్తనలను ఆలపిస్తూనే ఆ రామయ్య పాదాల చెంతకి చేరుకోవడం ఆశ్చర్యమేమీ కాదు. మరో బాలమురళి జన్మించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సంగీత ప్రపంచం వైపుగా వేసే అడుగులెన్నో! ఆ స్ఫూర్తి ఉన్నంతవరకూ బాలమురళి సంగీతరవళి ఓంకారనాదంలా వినిపించీ వినిపించకుండా ప్రభవిస్తూనే ఉంటుంది.     - నిర్జర.

పెద్దనోట్ల రద్దులో జీవితపాఠాలు

  పెద్దనోట్లని తక్షణం రద్దుచేయడం సరైన చర్యా కాదా? దానికి తగినంత సన్నద్ధత ఉందా లేదా? అన్న చర్చలే ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ పెద్ద నోట్ల రద్దుతో ఎంతో కొంత ప్రభావితం అయినవారే. ఎవరేమనుకున్నా ఓ ఆరు నెలలు గడిచిన తరువాత మధ్యతరగతి ప్రజల జీవితం మళ్లీ గాడిలోకి పడవచ్చు. కానీ ఈలోగా పెద్దనోట్లు నేర్పే పాఠాలు వారికి జీవితాంతం గుర్తుండిపోతాయేమో...   ఈజీమనీ- పాలించే అధికారం చేతిలో ఉండటం వల్లనో, అనుమతులిచ్చే ఉద్యోగం చేయడం వల్లనో కొందరికి ఎంతకావాలనుకుంటే అంత డబ్బు ప్రవాహంలా వచ్చిపడుతూ ఉంటుంది. ఇకమీదట ప్రజలు అలాంటి ఈజీమనీ జోలికి పోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. నల్లధనానికి అవకాశాలు తగ్గిపోవడంతో.... ఇంత డబ్బునీ ఏం చేసేది? ఎలా దాచేది? అంటూ ప్రశ్నలు తలెత్తుతాయి. ఇచ్చేవారి దగ్గరా అంత డబ్బు ఉండకపోవచ్చు. పుచ్చుకునేవారికీ అంత ధైర్యం రాకపోవచ్చు.   పన్నులు చెల్లింపులు- ఒకప్పుడు ఎంత సంపాదించినా లెక్కలు చూపాల్సిన అవసరం లేదన్న భరోసా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడికక్కడ లెక్కలు సరిపోలాల్సిన పరిస్థితి. ప్రభుత్వ కనుసన్నల్లలోనే ప్రతి ఆర్థిక లావాదేవీ నడిచే కాలం రానుంది. ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటే పన్నులను సక్రమంగా కట్టేస్తే సరి.   పొదుపు- ఒకప్పుడు చేతిలో పదివేలు ఉన్నా పదిరోజులలో ఇట్టే ఖర్చయిపోయేవి. సూపర్‌ మార్కెట్లో తెగ షాపింగ్‌ చేశాక ఇంటికి వచ్చి చూసుకుంటే అందులో సగానికి సగం పనికిరాని ఖర్చుగానే తేలేది. ప్రతి వంద రూపాయల నోటునీ పొదుపుగా పొదివి పట్టుకుంటే అది చాలాకాలం వస్తుందన్న విషయం ఈ పదిరోజులలోనే అనుభవం అయిపోయింది.   ఆన్‌లైన్‌ లావాదేవీలు- ఒకప్పుడు ఆన్‌లైన్ చెల్లింపులంటే సాంకేతికత తెలిసినవారు చేసే పని అనుకునేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాస్తోకూస్తో అక్షరజ్ఞానం ఉన్న ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌కు అలవాటు పడాల్సిన అగత్యం వచ్చేసింది. దీని వలన కాలం, శ్రమా ఎలాగూ పొదుపవుతాయి. ఇక ప్రతి లావాదేవీకీ రుజువు ఉంటుంది. ప్రతి ఖర్చుకీ లెక్క ఉంటుంది. నగదు లేని రోజు కోసం సమాజం సిద్ధపడుతుంది.   తత్వమసి- 500 రూపాయల నోటుని చూస్తే జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తేలిపోతోందని సోషల్‌ మీడియలో జోకులు పేల్తున్నాయి. నిజమే కదా! వాళ్ల నోళ్లు కొట్టీ, వీళ్ల నోళ్లు కొట్టీ... కట్టలు కట్టిన నోట్లన్నీ ఇప్పుడు చెల్లకుండా పోయాయి. బడాబాబుల బాధ అలా ఉంటే మధ్యతరగతి వ్యధ ఇంకోలా ఉంది. జీవితంలో ఏ ఉపద్రవం ఎప్పుడు ముంచుకువస్తుందో, ఎప్పుడు ఏ అధ్యాయం ముగిసిపోతుందో తెలీదన్న తత్వాన్ని నోట్ల రద్దు తెలియచేసింది. అందుకనే అతిగా సంపదల మీద మమకారం పెంచుకోకుండా, భగవంతుడు ఇచ్చిన కాస్త జీవితాన్నీ హాయిగా గడిపేయమనీ... పెద్ద నోట్లు ఘోషపెడుతున్నాయి.     - నిర్జర.

అందమైన ఇల్లు

సుజిత్‌ ఓ పదేళ్ల పిల్లవాడు. అతని ఇల్లు ఓ కొండ పైన ఉండేది. ఆ ఇంటి వెనుక ఉన్న దొడ్లో బోలెడు చెట్లు, ఓ పది మేకలు ఉండేవి. రోజూ ఆ చెట్లకి నీళ్లు పోయడం, మేకల్ని మేపుకుని రావడం అతని దినచర్య. ఇక అప్పుడప్పుడు కొండ దిగువనే ఉండే సెలయేటి దగ్గర ఉన్న బడికి కూడా వెళ్తూండేవాడు. చూడ్డానికి సుజిత్ జీవితం సజావుగా సాగిపోతున్నట్లే అనిపించేది. అతన్ని ప్రేమగా చేసుకునే తల్లిదండ్రులు, అతను కనిపిస్తే చాలు కేరింతలు కొట్టే చిట్టి చెల్లెలు... అంతా బాగానే ఉంది కానీ సుజిత్‌ మనసులో ఒకటే వేదన.   సుజిత్ ఉదయం లేచిన వెంటనే తన మంచం పక్కన ఉన్న కిటికిలోంచి చూస్తాడా... అక్కడ అతనికి ఓ అందమైన ఇల్లు కనిపించేది. అవతలి కొండ శిఖరం మీద ఉన్న ఆ ఇంటిని చూడగానే, సుజిత్‌కి ఎక్కడలేని అసూయగా ఉండేది. ఆ ఇంటితో పోల్చుకుంటే తనదీ ఒక ఇల్లేనా అనిపించేది. ఎప్పుడెప్పుడు ఆ అందమైన ఇంటిని చేరుకుని, ఒక్కసారన్నా దానిని తనివితీరా చూద్దామన్న ఆశ కలిగేది.   ఇక లాభం లేదనుకున్నాడు సుజిత్‌. ఒక రోజు తను బడికి వెళ్తున్నానని తల్లితో అబద్ధం చెప్పి, నిదానంగా ఆ కొండ శిఖరం వైపుగా అడుగులు వేశాడు. శిఖరం అంటే మాటలా! ఒకో అడుగూ వేసేకొద్దీ పాపం సుజిత్‌ అలసిపోయాడు. అయినా ఆ ఇంటిని చూడాలన్న పట్టుదల అతడిని నిలువనీయలేదు. ఎలాగొలా ఆయాసపడుతూ ఒకో అడుగే పైకి ఎక్కసాగాడు. అలా శిఖరం చేరుకున్న సుజిత్‌కి, తను రోజూ చూడాలని కలలుగన్న ఇల్లు కనిపించింది. కానీ ఆ దృశ్యం అతనికి సంతోషాన్ని కలిగించలేదు సరికదా! ఒక్కసారిగా గుండెని బద్దలు చేసింది. కారణం...   ఆ ఇంట్లో ఎవరూ లేరు! పాడుబడిన పెరడు, బీటలువారిన గోడలు, తుప్పు పట్టేసిన కిటికీలు అతన్ని వెక్కిరించాయి. దూరం నుంచి రాజమహల్‌లాగా ఉన్న ఆ ఇల్లు దగ్గరకి వెళ్తే దయ్యాల కొంపలాగా దర్శనమిచ్చింది. ఎలాగూ అక్కడిదాకా వచ్చాను కదా అని మనసుని చిక్కబెట్టుకుని ఆ ఇంటివైపుగా అడుగులు వేశాడు సుజిత్. దగ్గరకి వెళ్లిన కొద్దీ ఆ ఇల్లు మరింత భయంకరంగా కనిపించసాగింది. అడ్డదిడ్డంగా మొలిచిన పిచ్చిమొక్కలు, నిర్భయంగా తిరుగుతున్న కాళ్లజెర్రులూ చూసి సుజిత్‌ ఒక్కమాటు భయంతో వెనక్కి తిరిగాడు. అప్పుడు కనిపించింది అతనికి... తన ఇల్లు!   ఈ శిఖరం మీద నుంచి చూస్తే అవతలి కొండ మీద ఉన్న తన ఇల్లు ఎంత ముచ్చటగా ఉందో! అస్పష్టంగా అయినా అది అందమైన చిత్రంలా ఉంది. పైన అనంతమైన ఆకాశం దాని కింద ఓ కొండ మీద తన ఇల్లు, ఆ ఇంటికి దగ్గరలో సెలయేరు... ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం! అన్నింటికీ మించి ఏ రాజమహలూకీ లేని ప్రత్యేకత తన ఇంటికి ఉందనిపించింది సుజిత్‌కి. అదే... తన కుటుంబం. ఆ కుటుంబం చెల్లాచెదురైపోతే తన ఇల్లు కూడా ఇక్కడి ఇంటిలాగే జీవం లేకుండా మిగిలిపోతుందనిపించింది. ‘అందంగా ఉండే ఇంటికీ, ఆనందంగా ఉండే ఇంటికీ మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో కదా!’ అనుకుంటూ సుజిత్‌ కొండ దిగడం మొదలుపెట్టాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)     - నిర్జర.

చిన్పప్పుడు నిద్రపోకపోతే..?

నిద్ర..పగలంతా కష్టపడే శరీరం తిరిగి రేపటి రోజున ఉత్సాహంగా పనిచేయడానికి ఉద్దేశించిన జీవక్రియ. నిద్రను జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ నిద్రే ఆరోగ్యాన్ని, చక్కగా కాపాడుతుంది. నిద్రకు ఉన్న బలం అదే. నిద్ర ద్వారా శరీరంలోని అవయవాలన్నీ రీఛార్జ్ అవుతాయి. రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి అనే దాన్ని నిర్థారించలేం. వయసు, ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని నిద్ర ముడిపడి ఉంటుంది. ఆరోగ్యవంతమైన మనుషుల్లో రోజుకి 7-8 గంటల పాటు నిద్ర అవసరం. పెద్ద వయస్సువారు, చిన్నారుల్లో ఎక్కువ సేపు నిద్ర అవసరమవుతుంది. ఎదుగుదలకు తోడ్పడే గ్రోత్ హర్మోన్ నిద్రతో ముడిపడి ఉంటుంది. అందుకే చిన్నారులు ఎక్కువసేపు నిద్రపోతారు.   దీని వలన వారిలో గ్రోత్ హర్మోన్ ఎక్కువగా స్రవించబడుతుంది. ఫలితంగా చిన్నారులు చక్కగా ఎదగగలుగుతారు. అప్పుడే పుట్టిన పసికందులు 15-18 గంటలపాటు నిద్రలోనే ఉంటారు. ఎదిగే కొద్దీ ఈ సమయం తగ్గుతూ వస్తుంది. బడికి వెళ్లే పిల్లలకు 10-12 గంటల పాటు నిద్ర అవసరం. మారుతున్న జీవనశైలి అన్ని రకాల వయసుల వారికి నిద్రను దూరం చేసినట్లే పసిపిల్లలకూ నిద్ర సమయాన్ని తగ్గించేసింది. మీ చిన్నారులు నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే మేల్కొండి ఎందుకంటే బాల్యంలో నిద్రలేమిని ఎదుర్కొనే చిన్నారులు భవిష్యత్తులో నిరాశ, నిస్పృహలకు గురయ్యే ప్రమాదముందని తాజా అధ్యయనంలో తేలింది.   వాటి తాలుకూ జాడలు చిన్నవయసులోనే కనిపించాయట..ఈ చిన్నారుల్లో నిద్రలేమితో పాటు ఒత్తిడికి సంబంధించిన సమస్యలు, ఉత్కంఠ, మితిమీరిన సిగ్గు, అనవసర భయాలు, భావాలను వెల్లడించలేకపోవటం వంటి వాటిని ఎదుర్కొంటారని పరిశోధకులు వెల్లడించారు. వీటి కారణంగా ఆ చిన్నారులు పెరిగి పెద్దయ్యాక తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతారని వారు తెలిపారు. కాబట్టి..మీ పిల్లలు  చిన్న వయస్సులోనే నిద్రలేమి, లేదా నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే పెద్దలు గుర్తించాలి. వెంటనే వైద్యుల సహాయంతో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తించటం వల్ల, మీ చిన్నారులు పెరిగి పెద్దయిన తరువాత వారి జీవితాన్ని నాశనం చేసుకోకుండా కాపాడినవారవుతారు.

Water bottle Workout for your arms

    A highly recommended workout for any season are the ones you can do anywhere with minimal equipment. It has to be something simple which you can do at home or in the park. And also make sure that these exercises are effective, challenging and easy to follow. While you may be wondering if the water bottles can’t be heavy enough to use as weights, then think again these simple 1- liter bottles can work wonders on your body. Try these simple exercises for toning your body and looking fabulous.   EXERCISE 1: CRUNCH EXERCISE Target: Entire abdominal region   Step 1: Lie on your back on an exercise mat or carpet. Bend your knees and place your feet on the floor. Hold a water bottle with both hands in front of your abdomen,. Look toward the ceiling to align your spine.   Step 2: Leading with your chest, raise your upper body toward your knees while keeping your hips stable. Extend the water bottle toward your knees. Lower and repeat for two sets of 10 repetitions. Do not rush this motion, especially on the downward phase.   EXERCISE 2:CHEST PUSH EXERCISE Target: Chest, shoulders, and triceps   Step 1: Lie on your back on an exercise mat or carpeting, with your feet flat on the floor and your knees bent. Holding a water bottle in each hand, bend your elbows at a 90-degree angle to the floor and your shoulders and upper arms flat along the floor.   Step 2: Slowly extend your arms straight up. Do not lock your elbow joints. Slowly return your elbows and upper arms to the floor. Continue the exercise for two sets of 10 repetitions. Tip: Your muscles need a full day to recover between workouts, so don’t work the same muscle group every day. Alternate muscle groups or try strength training one day and walking the next. EXERCISE 3: BICYCLE EXERCISE Target: The entire abdominal region   Step 1: Lie on your back with your legs elevated and knees bent. Hold a water bottle in both hands over your abdomen. Bring your left knee toward your chest while simultaneously rotating the right side of your upper body and the water bottle toward your left knee. At the same time, fully extend your right leg.   Step 2: Continue this motion, alternating sides for two sets of 10 repetitions. (If this hurts your neck, do not use the water bottle. Instead, place your hands behind your head for support.) Tip: Make sure you concentrate on keeping the motion fluid. Each time you extend your leg, it counts as a repetition.   EXERCISE 4: LATERAL RAISE EXERCISE Target: Shoulders, core, and improving balance Step 1: Stand tall with your feet firmly planted on the floor. Tighten your abdominal muscles and keep your chest lifted. Look straight ahead. Bend your knees slightly. With your arms at your sides and your elbows bent at 90-degree angles, hold a water bottle in each hand. Maintain perfect posture, spinal alignment, and a comfortable range of motion for your shoulder joints. Step 2: Raise your arms up as shown, to almost shoulder height. Maintain this angle at your elbow joints throughout the motions. Return to starting position and continue the exercise for two sets of 10 repetitions. Tip: For an added challenge to improve your balance, you can perform this exercise while balancing on one foot. Don’t forget to stretch after the work out. When you’re finished with the workout, just open one of the bottles and rehydrate!  

యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న 80 ఏళ్ల పెద్దాయన

  అరవై ఏళ్లు వస్తే చాలు, ఇక జీవితపు చరమాంకానికి చేరుకున్నామనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడిక హాయిగా విశ్రాంతి తీసుకోమంటూ సమాజం ప్రోత్సహిస్తుంది. ఒంట్లో సత్తువ ఉన్నా, శరీరానికి పని చెప్పడానికి మనసొప్పదు. విశ్రాంతికీ, నిస్తేజానికీ మధ్య ఉన్న సన్నటి పొరని గ్రహించలేని జీవితాలు మనవి. అలాంటివారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఒక 80 ఏళ్ల ముసలాయన.     క్యాట్‌ వాక్‌ చేసిన తాతయ్య 2015 మార్చి. చైనాలో ఫ్యాషన్‌ వీక్‌ జరుగుతోంది. అందులో అకస్మాత్తుగా ఒక 79 ఏళ్ల వృద్ధుడు ర్యాంప్ మీదకి నడుచుకుంటూ వచ్చాడు. అది కూడా దృఢంగా ఉన్న శరీరంతో! ఆ దెబ్బతో అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇంతకీ అతని పేరు డెషున్‌ వాంగ్. ఓ ముసలాయన ర్యాంప్‌ మీద నడవడం గొప్పేమీ కాకపోవచ్చు. 80 ఏళ్ల వయసులోనూ శరీరం దృఢంగా ఉండటమూ అసాధ్యం కాకపోవచ్చు. కానీ వీటి వెనుక ఉన్న అయన కథే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.     చిరుద్యోగం నుంచి చైనాలోని షెన్‌యాంగ్‌ అనే చిన్న ఊరిలో 1936లో పుట్టారు డెషున్. తొమ్మిదిమంది భారీ సంతానం ఉన్న సాధారణ కుటుంబంలో తనూ ఒకడు. ఒక మిలటరీ కర్మాగారంలో చిన్న ఉద్యోగం చేసేవాడు. అయితే నాటకాల మీద ఆసక్తితో రేడియోలలోనూ, సినిమాలలోనూ పనిచేసేవాడు. 1980ల నాటికి డెషున్‌కి ఫ్యాషన్ రంగం మీదకి దృష్టి మళ్లింది. అందుకు కారణం లేకపోలేదు. చైనాలో ఆపాటికి ఫ్యాషన్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఎలాపడితే అలా బట్టలు వేసుకుని తిరిగేవారు. ఇలాంటి పరిస్థితి చూసి ఫ్యాషన్‌కి మంచి భవిష్యత్తు ఉందని ఊహించారు డెషున్‌. ఫలితంగా 50 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌లో కొత్త పాఠాలు నేర్చుకొంటూ, తను గ్రహించినదాన్ని పదిమందికీ నేర్పుతూ జీవనం మొదలుపెట్టాడు. నిదానంగా చిన్నా చితకా ఫ్యాషన్‌ షోలు కూడా నిర్వహించసాగాడు. దీనికి తోడుగా శరీరం మీద రంగులు పులుముకొని స్థిరంగా నిలబడే ‘'living sculpture’ అనే ప్రక్రియను కూడా సాగించాడు.     అదంతా ఓ ఎత్తు ఫ్యాషన్‌ రంగంలో ఉన్నంత మాత్రాన దృఢంగా ఉండాలని లేదు. కానీ డెషున్‌ ఏ రోజునా తన ఆరోగ్యాన్ని ఆశ్రద్ధ చేయలేదు. ఇప్పటికీ ఆయన రోజుకి మూడుగంటల పాటు వ్యాయామం చేస్తాడు. ఈతకొడతాడు. మద్యం తీసుకోవడంలో మోతాదుని పాటిస్తాడు. అన్నింటికీ మించి తన దృక్పధమే తన దృఢత్వానికి కారణం అంటాడు. ‘వయసు అనేది ప్రకృతి నిర్ణయిస్తుందనీ, కానీ ఉత్సాహం అనేది మనసు నిర్ణయిస్తుందనీ’ అంటారు డెషున్‌. మానసికంగా దృఢంగా ఉంటే కనుక మన సత్తా ఏమిటన్నది మనకు తెలిసిపోతుందన్నది డెషున్‌ మాట.   నిత్య విద్యార్థి డెషున్‌ కేవలం మాటలు చెప్పే మనిషి కాదు. ఆయన జీవితాన్ని గమనిస్తే వయసుకీ, మనసుకీ మధ్య ఏమాత్రం సంబంధం లేదన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. 44 ఏళ్ల వయసులో డెషున్‌ ఆంగ్లం నేర్చుకున్నాడు, 50 ఏళ్లప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ప్రవేశించాడు, 65 ఏళ్ల వయసులో గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, 78 ఏళ్ల వయసులో మొదటిసారి మోటర్ సైకిల్ నడిపాడు. ఇక 79 ఏళ్ల వయసులో ర్యాంప్ మీద నడిచాడు. ఆయన తన జీవితంలో ఏ దశలోనూ వెనకబడలేదని చెప్పేందుకు ఇంతకంటే ఇంకేం లెక్కలు చెప్పగలం. ‘ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని మీకు మీరు చెప్పుకున్నారంటే... అది ఒక సాకు మాత్రమే. జీవితంలో ఎప్పటికీ ఏదీ ఆలస్యం కాదు. మనుషులు తమ జీవితాలను ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు,’ అన్న డెషున్‌ మాటలను వింటే చాలు... జీవితం మనకు సరికొత్తగా తోచడం ఖాయం1   - నిర్జర.