దేశంలో ఒకోచోట ఒకోలా... కృష్ణాష్టమి!

  శ్రీకృష్ణుడు దేవకి కడుపున పుట్టి ఉండవచ్చు, యశోద ఇంట పెరిగి ఉండవచ్చు, ద్వారకని పాలిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొని ఉండవచ్చు. కానీ ఆయన ఏదో ఒక ఇంటికో, ప్రాంతానికో పరిమితం అయినవాడు కాదు. కోట్లమంది హిందువుల గుండెల నిండా కొలువైనవాడు. అందుకే భారతదేశం యావత్తు ఆయనని తమని తోచినరీతిలో ఆయన పుట్టినరోజుని జరుపుకొంటుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన సందర్భాలు ఇవిగో...   మహారాష్ట్ర కృష్ణాష్టమి వేడుకల గురించి ప్రస్తావన రాగానే మహారాష్ట్రే గుర్తుకువస్తుంది. అక్కడ జరిగే దహీహండీ (ఉట్టి) కార్యక్రమం అంత ప్రసిద్ధి మరి! అయితే ఇవి సాదాసీదాగా సాగవు. కృష్ణాష్టమికి కొన్ని వారాల ముందు నుంచే ప్రతి పేటలోని కుర్రాళ్లు, ఉట్టి కొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేస్తారు. కృష్ణాష్టమి సమయానికి వీరంతా ఒక మండలిగా ఏర్పడి.. ఉట్టి కొట్టే పోటీని నిర్వహిస్తారు. ఈ పోటీలలో గెలుపొందిన జట్టుకి బహుమతులు కూడా భారీగానే అందుతాయి.   మణిపూర్ మణిపూర్‌ వాసులకు కృష్ణారాధన ఎక్కువే! దాంతో కృష్ణాష్టమి వచ్చిందంటే ఇంఫాల్‌ వంటి చోట్ల ఉన్న కృష్ణుని ఆలయాలు కిటకిటలాడిపోతాయి. ఆ రాష్ట్రానికే ప్రత్యేకమైన మణిపురి నృత్యంలో శ్రీకృష్ణుని రాసలీలలను ప్రదర్శిస్తారు.   పశ్చిమబెంగాల్‌ పశ్చిమబెంగాల్‌, ఒడిషాలలో భక్తి ఉద్యమం తర్వాత కృష్ణ భక్తి పరాకాష్టకు చేరుకుంది. చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ప్రభుపాదుల వరకు ఆ భక్తిని ప్రచారం చేసినవారెందరితోనో బెంగాల్‌ పునీతమైంది. ఆ ప్రభావం కృష్ణాష్టమి రోజున తప్పక కనిపిస్తుంది. చైతన్యమహాప్రభు జన్మస్థానమైన ‘నవ్‌దీప్‌’ వంటి ప్రదేశాలలో జన్మాష్టమిని ఘనంగా చేసుకుంటారు. కృష్ణుడు రాత్రివేళ పుట్టాడు కాబట్టి, జన్మాష్టమి అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఆ మర్నాడు నవమి రోజుని కూడా వీరు పండుగలానే జరుపుకొంటారు.   తమిళనాడు తమిళనాడులో కృష్ణాష్టమి వేడుకలు మన తెలుగువారినే పోలి ఉంటాయి. ఇంటింటా తప్పనిసరిగా కృష్ణపాదాలను పోలిన ముగ్గులు వేస్తారు. చిన్న పిల్లలను బాలకృష్ణునిలా అలంకరిస్తారు. ఇంటింటా ఉపవాసాలు, భాగవత పఠనాలు సాగుతాయి. గీతగోవిందంలోని భావాలకు భరతనాట్యంలో అభినయం చేసే వేడుకలూ కనిపిస్తాయి.   కశ్మీర్ జమ్మూకశ్మీర్లో ‘పతంగ్‌బాజీ’ పేరుతో కృష్ణాష్టమి సందర్భంగా గాలిపటాలు ఎగరేస్తారు. కృష్ణుడు పుట్టినందుకు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ సంబరాలు సాగుతాయి. ఈ పతంగ్‌బాజీ వేడుకలు ఈనాటికి కావని చెబుతారు. ఎప్పుడో మహాభారత కాలం నుంచే కశ్మీర్‌వాసులు ఈ వేడుకను నిర్వహిస్తున్నారట.   కృష్ణాష్టమి వేడుకలు కేవలం మన దేశంలోనే కాదు... ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ప్రాంతంలోనూ వేడుకగా సాగుతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 600కు పైగా ఉన్న ఇస్కాన్‌ ఆలయాలలో కృష్ణాష్టమి ఘనంగా జరుగుతుంది. - నిర్జర

స్నేహితులు కాస్తా శత్రువులుగా మారిపోతే!

  అన్ని బంధాలూ అన్నివేళలా సజావుగా ఉండవు. ఒకప్పుడు ఒకే కంచం ఒకే మంచం అన్న తీరున సాగిన స్నేహాలు, మనిషి కనపడితే మొహం చాటేదాకా వస్తాయి. మాటతూలడం వల్లనో, డబ్బు వ్యవహారాలు బెడిసికొట్టడం వల్లనో... కారణం ఏదైనా కావచ్చు- స్నేహమేరా జీవితం అని పాడుకున్నవారు కాస్తా శరణమా రణమా అంటూ యుద్ధమంత్రాలు వల్లిస్తారు. మరి ఇలాంటి పరిస్థితులని దాటేదెలా?   మాటలు ఆపవద్దు : పోయిన చనువు మళ్లీ తిరిగిరాకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ మాటలని మాత్రం ఆపే ప్రయత్నం చేయవద్దు. మర్యాద కోసమైనా బాగున్నారా? మీ అమ్మగారి ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి కర్టెసీ సంభాషణలని కొనసాగించే ప్రయత్నం చేయండి. అది కూడా సాధ్యపడదంటారా! కనీసం ఎదురుపడినప్పుడు ఓ చిరునవ్వు నవ్వి చూడండి. లేకపోతే వారి ఉనికి జీవితాతం ఒక పుండులా సలుపుతూనే ఉంటుంది.   ఇతరుల జోక్యం వద్దు: సాధారణంగా ఏదన్నా బంధం చెడిపోయిన తర్వాత... జరిగినదాని గురించి కనిపించినవారందరికీ పూసగుచ్చినట్లు వివరించడం చాలామందికి అలవాటు. దానివల్ల మన మనసుకి సాంత్వన కలుగుతుందేమో కానీ, విషయం మరింత ప్రచారం అవుతుంది. మీరన్న మాటలు అవతలివారికి చేరి తీరతాయి. అది మరిన్న గొడవలకు, అపార్థాలకు దారితీయడం వల్ల ఏ ఉపయోగమూ లేదు!   మనసుని మరల్చండి: ఆ బంధం కోల్పోవడం వల్ల మీకు తీరని నష్టమే జరిగి ఉండవచ్చు. కానీ జీవితం ముందుకు సాగాల్సిందే కదా! అందుకని గతం మీద కాకుండా వర్తమానం మీదా భవిష్యత్తు మీదా దృష్టి మరల్చే ప్రయత్నం చేయండి. లక్ష్యం మీద దృష్టి పెట్టడం, కొత్త స్నేహాలను అలవర్చుకోవడం, కొత్త అలవాట్లను అనుసరించడం... వంటి చర్యలతో వీగిపోయిన బంధం నుంచి మనసుని మరల్చే ప్రయత్నం చేయండి.   ఏం జరిగినట్లు: కేవలం అవతలి వ్యక్తి మూర్ఖత్వం వల్లనో, అహంకారం వల్లనో బంధం చెదిరిపోతే అది వేరే పరిస్థితి. కానీ చాలా సందర్భాలలో స్నేహం, శత్రుత్వంగా మారేందుకు ఇద్దరి బాధ్యతా ఉంటుంది. మీ వంతుగా ఏ పొరపాటు జరిగిందో విశ్లేషించుకోండి. అలాంటి విశ్లేషణ వల్ల ఒకోసారి మన వ్యక్తిత్వంలో ఉన్న తీవ్రమైన లోపాలు బయటపడవచ్చు. మున్ముందు అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు సాయపడవచ్చు.   ఏమీ జరగనట్లే ప్రవర్తించండి: అయిపోయిందేదో అయిపోయింది. ఆ గొడవని పెద్దది చేయడం, అవతలివారిని రెచ్చగొట్టడం... వంటి చర్యలు వద్దే వద్దు. అహం దెబ్బతిన్నదనో, గౌరవం మంటగలిసిందనో... మరిన్ని తప్పులకు దారితీయవద్దు. అవసరమైతే కొద్ది రోజుల సమయం తీసుకునైనా సరే ఆ గొడవ నుంచి పూర్తిగా బయటపడండి. - నిర్జర.    

ఒక్క పదం... శక్తి అపారం...

  థాంక్యూ... ఈ ఒక్క చిన్న మాటకి ఎంత శక్తి వుందో తెలుసా? మోడువారిన బంధం చిగురించేంత. ఒకరి సాయం పొందగానే కృతజ్ఞత తెలుపుతూ థాంక్స్ అంటాం. అయితే ఆ పదాన్ని ఇంటి బయట రోజుకి ఎన్నోసార్లు వాడే మనం మన ఇంట్లోవాళ్ళతో మాత్రం చాలా తక్కువ వాడతామట. అందులోనూ భార్యాభర్తల మధ్య ఆ పదం చాలా తక్కువగా దొర్లుతుందిట. ఒకరిమీద ఒకరికి వుండే అసంతృప్తితో ‘థాంక్స్’ చెప్పరనేది కూడా ఈ మధ్య నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.   థాంక్స్ అన్న పదం వినగానే ఎదుటి మనిషి మనసు తేలికపడటం, అందులోనుంచి సానుకూలం భావం ఏర్పడటం జరుగుతుంది. ఇద్దరిమధ్య బంధం బలపడటం మొదలవుతుంది అంటున్నారు అధ్యయనకర్తలు. చిన్నమాటే... కానీ దాని ప్రభావం మాత్రం ఎక్కువ. కాబట్టి వీలయినప్పుడల్లా ‘థాంక్స్’ అని మనస్పూర్తిగా చెప్పండి. ఎదుటి మనిషికి, మనసుకి దగ్గరవ్వండి. అన్నట్టు... ఓపిగ్గా చదివినందుకు మీక్కూడా థాంక్స్. -రమ

ఏది ముఖ్యం?

  అది ఓ పేరుపొందిన విశ్వవిద్యాలయం. అందులో సైకాలజీ తరగతి. తరగతిలో విద్యార్థులు అంతా కొత్త ప్రొఫెసర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూస్తూ చూస్తుండగా ఓ పెద్దాయన గదిలోకి వచ్చాడు. వచ్చినవాడు ఖాళీ చేతులతో రాలేదు. ఓ గాజు సీసా ఒకటి చేత్తో పట్టుకువచ్చాడు.   విద్యార్థులు అంతా ఆసక్తిగా చూస్తూ ఉండగా ఆ గాజు సీసా నిండుగా రాళ్లని నింపాడు. ‘ఈ గాజు సీసాలో ఇప్పుడు కాస్తన్నా ఖాళీ ఉందంటారా?’ అంటూ ఆ ప్రొఫెసర్ విద్యార్థుల వంక చూశాడు. ‘ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏముంది. ఆ గాజు సీసా మొత్తం రాళ్లతో నిండిపోయింది కదా!’ అని బదులిచ్చాడు ఓ విద్యార్థి. ‘చూద్దాం! మీ జవాబు ఎంతవరకూ నిజమవుతుందో!’ అంటూ కొన్ని గులకరాళ్లని తీసుకుని ఆ సీసాలోకి కుమ్మరించాడు. గాజు సీసాను కాస్త కదపగానే ఆ గులకరాళ్లన్నీ పెద్ద రాళ్లకి మధ్య ఉన్న సందుల్లోకి సర్దుకున్నాయి.   ‘చూశారా మీ జవాబు తప్పయింది! ఈసారి చెప్పండి. ఈ సీసాలో ఇంకా ఖాళీ ఉందంటారా?’ అని అడిగాడు కొంటెగా. ‘అబ్బే ఉన్న కాస్త ఖాళీనీ మీరు నింపేశారు కదా!’ అని బదులిచ్చారు విద్యార్థులు. కానీ వారి మనసులో ఏదో అనుమానం. ఈసారి కూడా ప్రొఫెసర్ ఏదో మాయ చేసేట్లే ఉన్నాడు అనుకున్నారు. విద్యార్థులు అనుకున్నట్లే ప్రొఫెసర్‌ కాస్త ఇసుకని తీసుకుని గాజు సీసాలోకి కుమ్మరించాడు. ఓ నాలుగు కుదుపులు కుదపగానే, ఇసుక కాస్తా సీసాలోని మూలమూలలకీ చేరిపోయింది. ‘మీ తెలివి బాగానే ఉంది. కానీ మీ ప్రయోగానికీ చదువుకీ ఏంటి సంబంధం?’ అంటూ విసుగ్గా అడిగాడు ఓ విద్యార్థి. ‘జీవితం గురించి తెలుసుకోవడమే అసలైన చదువు. మన జీవితం కూడా ఈ గాజు సీసాలాంటిదే! కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిత్వం… ఈ మూడూ మనం మొదట సీసాలో ఉంచి పెద్దరాళ్లు లాంటివి. డబ్బు, హోదా, సౌకర్యాలు… ఈ మూడూ మనం సీసాలో నింపిన గులకరాళ్లులాంటివి.   ఇక విలాసాలు, వినోదాలు, వివాదాలు వంటి చిల్లర విషయాలన్నీ ఇసుకలాంటివి.’ అన్నాడు చిరునవ్వుతో! ‘పోలికైతే బాగుంది. కానీ విషయం ఏంటి’ అన్నారు విద్యార్థులు మరింత చిరాగ్గా. ‘మరేం లేదు! మీరు కనుక మీ ఆరోగ్యానికీ, కుటుంబానికీ, వ్యక్తిత్వానికీ ప్రాధాన్యతని ఇస్తేనే డబ్బు, హోదా, సౌకర్యాలు ఉపయోగపడతాయి. ఆ తరువాత విలాసాల గురించి ఆలోచించవచ్చు. అలా కాకుండా ముందే ఆ గాజు సీసాను ఇసుకతో నింపేస్తే ఇక వేరే వేటికీ చోటు ఉండదు. మన జీవితమే చిల్లర విషయాలతో నిండిపోతుంది.’ అంటూ తన జీవిత పాఠాన్ని ముగించాడు. విద్యార్థులకి నోట మాట రాలేదు!

సిరిమల్లె పువ్వల్లే నవ్వు...

  "నవ్వు నాలుగు విధాలుగా చేటు" అనేది పాత సామెత. "నవ్వు అనేక విధాలుగా మేలు" అనేది నేడు నిరూపించబడ్డ సత్యం. అయితే ఆ నవ్వుకే మనం దూరమైపోతున్నాం రోజు రోజుకి. రెండు నెలల పసిపాపగా ఉన్నప్పుడు రోజుకి ౩౦౦ సార్లకి పైగా నవ్వుతాం మనం. కానీ పెరిగే కొద్దీ ఆ నవ్వుల సంఖ్య కొంచం కొంచం తగ్గి పెళ్ళి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతలలో పడ్డాక రోజుకి ఒక్కసారి మనస్పూర్తిగా నవ్వటం కూడా కష్టంగా మారిపోతుంది. దీంతో మనకి మనమే నష్టం చేకూర్చుకున్న వాళ్ళం అవుతున్నాం. ఎందుకంటే నవ్వటం వల్ల శరీరమంతా విశ్రాంతి పొందుతుంది. ఒకసారి మనసారా నవ్వితే కండరాలన్నీసడలి, మానసిక ఒత్తిడి శారీరక టెన్షన్ తగ్గుతాయి. ఒక్క నిమిషం మనసారా నవ్వినా చాలు దాని ప్రభావం సుమారు 45 నిమిషాలదాకా మన శరీరం పై నిలుస్తుందిట. మరిప్పుడు చెప్పండి. నవ్వు తప్పనిసరా కాదా?   ఓ చిన్న ప్రశ్న. మీరు బాగా నవ్వి  ఎన్నిరోజులయ్యింది? పోనీ, కాస్త నవ్వి  ఎన్నిరోజులయ్యింది. గుర్తుకు రావటం లేదు కదూ! మీరే కాదు. నన్ను ఆ ప్రశ్న అడిగినా నేనూ ఆలోచించాల్సిందే. ఎందుకంటే చాలు మనందరం మన మన బాధ్యతల నిర్వహణలో బిజీగా మారిపోయి ఆ నవ్వుని ఎక్కడో జారవిడుచుకున్నాం. అమూల్యమైన ఆ సంపద మన దగ్గరుంటే చాలు ప్రపంచంలో దేనినైనా స్వంతం చేసుకోగలం మనం. కానీ దానినే జారవిడుచుకుని, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా నిజమైన ఆనందం కలగటం లేదని వాపోతున్నాం. నిజానికి నవ్వుల్లో తేలిపోయే వ్యక్తి మనస్సు, శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతాయి. కష్టాలు, అసంతృప్తి వంటివి ఎదురయినప్పుడు కూడా స్థిరంగా ఉండగలం. జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగి వుంటాం. ఇదంతా కేవలం నవ్వు వల్ల సాధ్యమయ్యే అద్భుతాలు. నవ్వును మరిచిపోయి జీవించటమే రోగాలకు మూలమంటున్నారు. మానసిక విశ్లేషకులు. ఎందుకంటే నవ్వటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి కలిగించే హర్మోన్లు తగ్గిపోతాయి. అలాగే నవ్వినప్పుడు ఆనందానికి కారణమయిన సహజసిద్ధమయిన రసాయనాలు, ఎండార్ఫిన్స్ చక్కగా విడుదల అవుతాయి. అప్పుడు శారీరం, మనస్సు తేలికయి సంతోషం కలుగుతుంది. అందుకే చూడండి కడుపారా నవ్వాకా అప్పటి వరకు ఉన్న బరువేదో దిగిపోయినట్టు అనిపిస్తుంది. సంతోషం ఉరకలు వేస్తుంది. అప్పటి వరకు మనల్ని చిరాకు పెట్టిన విషయాలు కూడా చిన్నవిగా తోస్తాయి. కోపం, విచారం దూరమవుతాయి. ఇదంతా కేవలం ఒక్క నవ్వు వల్లే సాధ్యం. మీకు తెలుసా... వ్యాయామం చేసినా, హాయిగా నవ్వినా కలిగే ప్రభావం,ప్రయోజనం ఒకటేనట. మనస్పూర్తిగా నవ్వినప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది. ముఖంలో, శరీరమంతటా కండరాలు బాగా కదులుతాయి. నాడీ స్పందనలు అధికమవుతాయి. రక్తప్రసరణ వేగవంతమవుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగి కణజాలానికి ఎక్కువగా ఆక్సిజన్ అందుతుందిట. శరీరం అంతా ఆ నవ్వు ప్రభావం ఉంటుంది. ఒకసారి నవ్వితే పదినిమిషాలు జాగింగ్ చేసిన దాంతో సమానం అని తేలింది ఓ పరిశోధనలో. ఈ నవ్వుపై పరిశోధనలు చేసిన మేరిలాండ్ యూనివర్సిటి పరిశోధకులు "నవ్వు ఉత్తమ ఔషధం అన్న మాట నిజమేనని అది గుండెను పదిలంగా ఉంచుతుందని" చెబుతున్నారు. "లాఫింగ్ థెరపి" అంటే "నవ్వు చికిత్స" తనని భయంకరమైన క్యాన్సర్ వ్యాధి బారి నుంచి కాపాడిందని చెప్పారు న్యూయార్క్ టైమ్స్ మాజీ సంపాదకులు నార్మన్ కుజిన్స్. కాబట్టి నవ్వు నాలుగు విధాల కాదు నాలుగు వేల రకాలుగా మంచిదని నమ్మితీరాలి. నవ్వటం మొదలుపెట్టాలి. మరి నవ్వటం మొదలు పెడతారు కదూ! నవ్వటం కష్టమనకండి. ఆ కష్టం కరగాలంటే నవ్వాలి మరి. సో మీ మనసుని, మెదడుని నవ్వుకి ట్యూన్ చేసేయ్యండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. సరేనా. మరి ఏదీ నా కోసం ఒక్క చిరునవ్వు? అదీ... అలా కంటిన్యూ అయిపోండి. -రమ ఇరగవరపు

Celebrate The Bond With Your Sibling !

  Raksha Bandhan is a festival that celebrates the bond between a man and his sister. The sacred thread tied on his wrist, compels him to protect his sister and be there for her, whenever she needs him. The festival celebrated on Shravan Purnima every year, has undergone a lot of change over many years. To start with, no one realized how and when the name Raksha Bandhan changed to Rakhi. Earlier there were many rituals associated with the festival. With time lot of them faded away owing to the ever changing circumstances.   Having said that we must acknowledge the fact that although the method of celebration may have changed, the essence of the festival still remains the same. Tying hand-made Rakhis was the original ritual. But today, beautiful designs have become easily available and you have a wide verity to choose from.   Same is the case with the gifts exchanged on Raksha Bandhan. The traditional gifts like a sari or jewelry are no longer given. These have been replaced by modern gifts like mobile phones, gift vouchers and other things.   The home-made sweets that used to be part of this festival are now replaced by chocolates and other desserts. It can also be observed that the celebration of this unique bond has now become virtual. Sisters send the rikhi online and receive a gift from their brothers in the same way. This shows how physical distances do not matter anymore. Though we observe so many changes in the celebration of Raksha Bandhan, brothers and sisters still eagerly wait for this day to express unconditional love for each other. - Kruti Beesam  

ఆనందం చిరునామా ఇదిగో...

  ‘‘ఆనందం. ఒక మానసిక స్థితి అది. జీవితంలో కోరుకున్నవన్నీ దక్కినా అది స్వంతం అవుతుందన్న గ్యారంటీ ఏం లేదు’’ అంటున్నారు పరిశోధకులు. ‘‘సానుకూల మనస్తత్వం’’ మీద శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ‘‘కావల్సినవన్నీ ఉన్నా ఆనందంగా లేము’’ అని బాధపడేవారికి మేం చెప్పేది ఒక్కటే - ఆనందాన్ని అందించేవి, నిలబెట్టేవి వక్తుల అలవాట్లు, ఆహారం, ప్రవర్తనలే. ఎందుకంటే ఈ అంశాలే మెదడులో ఆనందానికి సంబంధించిన సంకేతాలిచ్చే ‘‘ఉత్ప్రేరకాల’’ స్థాయిని పెంచుతాయి అని గట్టిగా చెబుతున్నారు ఆ పరిశోధకులు. ఇంతకీ ఏమిటా అలవాట్లు అంటే... ‘‘ఆటలు చిన్నపిల్లలకి చాలా ఇష్టం. ఓ గంట ఆడనిస్తే చాలు హుషారుగా మనం చెప్పినట్టు వింటారు. పెరిగినకొద్దీ ఆ ఆటలకి దూరమవుతూ... ఆ ఆనందాన్ని, హుషారుని కూడా దూరం చేసుకుంటున్నామన్నమాట. ‘‘నేను ఆనందంగా వుండాలి’’ అని కోరుకునే ప్రతి ఒక్కరూ హాయిగా ఆడుకోండి చాలు’’ అంటున్నారు సిడ్నీలోని హ్యాపీనెస్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు. ఆటలన్నారు కదా అని వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ ఆడితే సరిపోతుందని అనుకోకండి. రన్నింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, క్రికెట్... ఇలా ఒళ్ళు అలిసేలా ఆడే ఆటలు ఆడాలి. అప్పుడు మెదడులో ‘‘ఎండార్ఫిన్’’ అనే హార్మోన్ ప్రేరేపించబడుతుంది. ఈ హార్మోను నొప్పులు తెలియకుండా చేస్తుంది. ఆనందాన్నిస్తుంది. కాబట్టి ఆటలు ఆనందానికి చిరునామాలు. వ్యాయామం ఒంటికి మంచిదేగా... ‘‘వ్యాయామం - మీకు నచ్చిందే చేయండి. కానీ, రోజూ తప్పకుండా చేయండి. దానివల్ల గుండె నుంచి రక్తప్రసరణ మెరుగుపడి ఉల్లాసం కలుగుతుంది’’ అంటున్నారు స్విన్‌బర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. మానసిక ఆందోళనతో బాధపడేవారిలో మెదడు ముందు భాగానికి సరైన రక్తప్రసరణ ఉండటం లేదని వీరి పరిశోధనల్లో తేలిందట. అందే వ్యాయామం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరిగి, ఒత్తిడి తగ్గి ఉత్సాహం,  స్థైర్యం పెరుగుతాయట. సో.. రోజూ వ్యాయామం ఒంటికి మంచిది. మనసుకీ మంచిది. ఆనందానికి ఆహారమూ ముఖ్యమే... పౌష్టికాహారం తీసుకోకపోతే అలసిపోవడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అవి నేరుగా మనిషి ఆనందం మీద ప్రభావం చూపిస్తాయి. అలాగే కొన్ని ఆహార పదార్ధాలు నేరుగా ఆనందాన్ని కలిగించే ‘‘సెరోటానిన్’’ అనే ఉత్ప్రేరకం స్థాయిని పెంచుతాయి. ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఆహారాన్ని తీసుకునేవారిలో ఈ ‘‘సెరోటానిన్’’  స్థాయులు తక్కువగా వుంటాయిట. పిండి పదార్ధాలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ట్రైప్టోఫాన్ అనే రసాయనం ప్రేరేపితమవుతుంది. అదే సెరోటెనిన్‌గా మారుతుంది. చాక్లెట్, హెర్బల్ టీ వంటివి కూడా ఆనందాన్ని కలిగించే ఆహారాలే అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. ధ్యానం.. ఆనంద యోగం... టిబెట్ బౌద్ధ సన్యాసులలో సెరోటానిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు పరిశోధకులు. ధ్యానం వల్ల మెదడులో ఆనందాన్ని కలిగించే భాగం ప్రేరేపితమవుతున్నట్టు, అలా ధ్యానం చేసే వ్యక్తులు ఉత్సాహంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటున్నట్టు తేలింది వీరి పరిశోధనల్లో. రోజూ ఓ ఐదు నిమిషాలపాటు మనసుని, మెదడుని నియంత్రిస్తూ ఏకాగ్రతతో ధ్యానం చేయగలిగితే చాలు.. అమితానందం మీ స్వంతం. అందుకు మేము హామీ అంటున్నారు వీరు. ఆ నలుగురు... ఆనందాన్నిస్తారు... ఇక ఆఖరుది.. ముఖ్యమైనది.. ‘‘నలుగురు మనుషులు’’. రోజూ ఓ నలుగురు వ్యక్తులతో మనసువిప్పి మాట్లాడితే చాలు ‘‘ఆక్సిటోసిన్’’ అనే రసాయనం స్థాయులు పెరుగుతాయి. దానివల్ల మనసులో ప్రేమాభిమానాలు పొంగుతాయి. అనుబంధాలు బలపడతాయి. అంతులేని ఆనందం స్వంతమవుతుంది. ఒంటరితనం ఒత్తిడిని, నిరుత్సాహాన్ని పెంచుతుంది. అందుకే ఆనందంగా ఉండాలి అనుకుంటే నలుగురిలో కలవండి. మాట్లాడండి. సంతోషాన్ని పొందండి, పంచండి. ఇదే విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ఉవాచ. ఆనందం అడ్రస్ తెలిసిందిగా.. మరి ఆనందాన్ని పట్టుకుని మన జీవితాలలో నింపుకోవడమే మిగిలింది. అన్నీ చిన్నవే. ఆచరించడం కూడా కష్టమేం కాదు. ఎటొచ్చీ ఆనందం వాటిల్లో దాగుందని మనకి తెలియదు అంతే. దీర్ఘకాలం పరిశోధనల తర్వాత పరిశోధకులు తేల్చిచెప్పిన ఆ సత్యాలు మనకి మార్గ నిర్దేశం చేస్తున్నాయి. ఆలోచించండి. ఆటలు, వ్యాయామం, ఆహారం, ధ్యానం, నలుగురిలో కలవటం... ఇవి చాలు అవధులు లేని ఆనందాన్ని అందుకోవటానికి. -రమ ఇరగవరపు

కంప్యూటర్‌లో కనిపించేదంతా నిజమేనా!

  ఓ ఇరవై ఏళ్ల నాటి సంగతి. ఇంటర్నెట్ ‌అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఒకవేళ ఏ నెట్‌ సెంటర్లోకన్నా వెళ్తే... అక్కడా ఏమంత సౌకర్యం కనిపించేది కాదు. మెయిల్‌ ఓపెన్‌ కావడానికి కూడా ఓ పావుగంట పట్టేది. దానికీ ఓ నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పటి పరిస్థితి అలా కాదు. అరచేతిలో వైకుంఠంలా... ఓ సెల్‌ఫోన్‌ ఉంటే చాలు, నట్టింట్లోనే నెట్‌ చూసేయవచ్చు. అది కూడా కొద్దిపాటి ఖర్చుతోనే. కానీ మీరు ఓ విషయం గమనించారా!   ఇంటర్నెట్‌లో ఏదన్నా వార్త వచ్చిందనుకోండి... అది దావానలంలా వ్యాపిచేస్తుంది. ఆ వార్త నిజమా కాదా అని ఆగి ఆలోచించేంత ఓపిక ఎవ్వరికీ కనిపించదు. వినేందుకు కాస్త సంచలనంలాగా కనిపిస్తే చాలు, వార్తకి వీక్షకులు పెరిగిపోవడం ఖాయం. ఇక దాన్ని వీడియో రూపంలో మార్చేయడం, ప్రోమోలు రూపొందించేయడం మామూలే! అసలైన నిజం తెలిసేసరికి తాము నెట్‌లో చూసిందే నిజం అన్నంత భ్రమలో జనం ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆకర్షణీయమైన అబద్ధాలను గ్రహించేందుకే జనం సిద్ధంగా ఉన్నారు.   కేవలం వార్తలు మాత్రమే కాదు, ఇంటర్నెట్‌లో ఎలాంటి సమాచారం దొరికినా కూడా, ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. దీనికే ‘1% rule’ అని పేరు పెట్టారు. అంటే ఒక శాతం మంది మాత్రమే కంటెంట్‌ సృష్టిస్తే,  దాన్ని అనుసరించేవారు 99% మంది ఉంటారన్నమాట. ఉదాహరణకు వికీపీడియానే తీసుకోండి. ఒక అంచనా ప్రకారం వికీపీడియాలో మూడొంతులకు పైగా వ్యాసాలని, దాన్ని చూసేవారిలో కేవలం రెండు శాతం మంది మాత్రమే రాస్తూ ఉంటారు.   కొంతమందే తమకి తోచింది రాయడం, వెనకా ముందూ చూడకుండా ఇతరులు దాన్ని అనుసరించడం ఏమంత సమర్థనీయం కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెటిజన్ల మనసులో విషాన్ని నింపడం చాలా తేలికని హెచ్చరిస్తున్నారు. దీనికి ఉదాహరణగా కొన్ని జిహాద్‌ గ్రూపుల వెబ్‌సైట్లనే చూపిస్తున్నారు. వాటిలో తరచూ పోస్టింగులు పెట్టేవారి సంఖ్య ఒకశాతాన్ని మించడం లేదని తేలింది. అంటే మిగతా 99 శాతం మందీ ఆ పోస్టులని చూసి, ఎలాంటి చర్చా సాగించకుండానే తమలో ద్వేషాన్ని నింపుకుంటున్నారన్నమాట.   ఈ తరహా అసమానత participation inequality అనే సమస్యకి దారితీస్తుందట. భయంతోనో, జంకుతోనో ఎలాంటి మార్పులోనూ పాలుపంచుకోకపోవడమే ఈ participation inequality. దానివల్ల అబద్ధానిదే పైచేయిగా మారిపోతుంది. ఇందుకోసం ‘yahoo groups’ని సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడంటే వీటి జోరు తగ్గింది కానీ, ఒకప్పుడు yahoo groupsతో జనం తెగ కాలక్షేపం చేసేవారు. తమ భావాలను పంచుకుంటూ, చర్చలు చేయడానికి వీటిని గొప్ప వేదికగా భావించేవారు. ఈ yahoo groupsని పరిశీలించినవారికి కూడా మనం పైన చెప్పుకొన్న గణాంకాలే కనిపించాయి. నూటికి ఒక్కరు ఏదో ఒక గ్రూప్‌ని మొదలుపెడతారు. అందులో ఓ పదిమంది పాల్గొంటారు. ఇంకో 90 మంది సభ్యులు సరదాగా వేడుక చూస్తారు.   మన జీవితాల్లో ఇంటర్నెట్‌ ప్రభావాన్ని ఏమాత్రం కాదనలేం. కానీ నెట్‌లో కనిపించేదంతా వేదం కాదని ఈ ‘1% rule’ గుర్తుచేస్తోంది. ప్రశ్నించకుండా, చర్చించకుండా దేన్నీ అంగీకరించకూడదని హెచ్చరిస్తోంది. - నిర్జర.  

ఆలోచన పరిధులు పెంచుకుందాం...

మీ జీవితాన్ని ఒక్కసారి తర్కించుకు చూసుకోండి.. మీ పట్ల, మీ చుట్టూ వున్న వ్యక్తుల పట్లా మీ నమ్మకాలూ, అభిప్రాయాలూ ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఇప్పటి ఈ నమ్మకాలకి, అభిప్రాయాలకి మీ చిన్నప్పటి నమ్మకాలకి, అభిప్రాయాలకి ఏమన్నా పోలికలు కనిపిస్తున్నాయా? అలా పోలికలు కనిపించాయి అంటే మీ ఎదుగుదల ఆగిపోయినట్టే. మన చిన్నప్పుడు చుట్టూ వున్న పరిసరాలు, పెద్దల మాటలు నుంచి బోలెడు నేర్చుకుంటాం. అప్పుడు నేర్చుకున్న వాటినే తిరుగులేని సత్యాలుగా జీవితాంతం నమ్ముతాం. ఇదే  మన చుట్టూ వున్న వారితోనూ, చివరికి  మనతో మనకి సంఘర్షణ కలగటానికి కారణం అని గట్టిగా చెబుతున్నారు పరిశోధకులు.             చిన్నతనపు నమ్మకాలు వ్యక్తుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయి అన్న విషయం మీద ఓ అద్యయనం నిర్వహించారు యూనివర్సిటీ అఫ్ కెనడా పరిశోధకులు. ఆ పరిశోదనలో ఎన్నో విస్మయపరిచే అంశాలు బయటపడ్డాయి.' చిన్నప్పుడు అమ్మ చెప్పింది', ' మా ఇంట్లో ఇలా చేసేవాళ్ళం.' ఇలాంటి మాటలు ఎందరో వాడటం చూసారు. ఓ విషయాన్ని ఎందుకు మీరు అలా చేస్తారు అంటే .." నాకది అలా చేయటం చిన్నప్పటి నుంచి అలవాటు." అని చెప్పిన వారు ఎందరోనట. ఇంతకీ అలా చిన్నప్పటి నుంచి నమ్మిన విషయాల పట్ల అంత ఆలోచన ఎందుకు? అంత పరిశోధన ఎందుకు అంటే, పరిశోధకులు ఏం చెబుతున్నారో తెలుసా ?               చిన్నప్పుడు ఒక క్లాసు పాస్ అయ్యి మరో క్లాసు కి వెళ్ళాక, అంతకు ముందు క్లాసు లో నేర్చుకున్న పాఠాల కే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటూ వచ్చాం. అంటే మన జ్ఞాన సముపార్జనలో వయసుతో పాటు ఎదుగుదల వుంది. కాని ఈ నమ్మకాలు లో  , వ్యక్తుల పట్ల, ఎదురయ్యే సమస్యల పట్ల  వున్న మన దృక్పధం లో మాత్రం ఎదుగుదల ఏ మాత్రం  లేదన్నమాట. దీని వలన ఏంటి నష్టం అంటే వారు ఏం చెబుతున్నారో తెలుసా" జీవితాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలనే విషయంలో తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు చిన్న తనం నుంచి ఎన్నో హితబోధలు చేస్తారు. ఆ క్రమం లోనే వారి ఆలోచనలకున్న పరిమితులను మనకూ నేర్పిస్తారు. వేగంగా మారిపోతున్న సమాజంలో, దశాబ్దాల క్రితం నాటి పద్దతులను నమ్ముతూ ఇప్పటికీ ఆచరిస్తూ, వాటినే సత్యాలుగా తిరిగి మన పిల్లలకు నేర్పించటం  ఎంతవరకు సమంజసం?" ఒక్కసారి ఆలోచించండ. అంటున్నారు.              అలా మన శక్తి సామర్ధ్యాల పట్ల, సమాజంలో అనుసరించాల్సిన విధి విధానాల పట్ల మన ఆలోచనల పరిధులు ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ వుండక పోతే కాలం తెచ్చిపెట్టే అవకాశాలను గుర్తించలేము . జీవితంలో ఉన్నతం గా ఎదిగిన వ్యక్తులు మొదట ఈ ఆటంకాన్నే అధిగమిస్తారు. విజేతలు ఎప్పుడూ గతంలో ఉండిపోరు. ఆ అనుభవాలని దృష్టి  లో పెట్టుకుని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా  ఎప్పటి కప్పుడు తమ ఆలోచనలని  ఓ మెట్టు ఎక్కిస్తూ వెళతారు. అందుకే కొందరు మాత్రమే రేపటిని ఈ రోజే దర్శించే దార్సినికులు అవుతారు. మరి మీరు నిన్నటి లోనే ఆగిపోతారా ?  రేపటికి స్వేచ్చగా స్వాగతం చెబుతారా ..ఆలోచించండి ..ఈ సారి నాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు వంటి పదాలు వాడినప్పుడు ఆలోచించండి...ఇప్పుడు మనం చిన్న పిల్లలం కాదు కాబట్టి, అప్పుడు తెలిసి, తెలియని వయసులో నమ్మినదాన్నే ఇప్పటికి పరమ సత్యం గా నమ్మటం ఎంతవరకు కరెక్ట్ అని.  -రమ

Let us salute them - Soldiers in society!

(Independence day special)   ENVIRONMENT If you are visiting Khammam, don't be surprised to find a man with crown on his head with a slogan `Vriksho rakshtai rakshita`. It's not just the slogan he wears, it's the goal for which he lives. This is Daripalli Ramaiah who has planted almost one crore trees in his life of 70 years. Ramaiah feels divinity in the greenery. He has filled the surroundings of khammam with such greenery. Popularly known as Chetla Ramaiah, he would not just plant a sapling, but would take utmost care to raise it to become a tree. Ramaiah gives much importance to trees like kanuga which can produce bio diesel, and trees like neem which are of medicinal value. Let's salute to Ramaiah. A soldier destined to save the environment.     INFRASTRUCTURE Gangadhara Tilak Katnam is 67 years old. He is a retired employee from railways who is supposed to lead his retired life peacefully. Once, while he was on such jolly trip, Gandadhara witnessed an accident. It all happened due to a pothole on the road. Where most of us just curse such situations, he indeed sprung up to dent the potholes all over the city. Everyday Gangadhara carries the concrete mix material to repair the potholes. With the back seat in his car filled with the bags of building material and his tank filled to survey the roads over and over... Gangadhara carries his mission successfully. More than 1000 potholes were set straight by him till date. Let's salute to Gangadhara. A soldier destined to save the infrastructure.     HEALTH Have you ever wondered, how much, the medicines we often throw away could help the poor. While many just keep wondering, Omkarnath sharma has set to deliver those medicines to the deprived. Omkarnath has once witnessed a trauma when a bridge in East Delhi has collapsed. It has left many injured. Though they were provided first aid by the government hospital, they couldn't afford the therapeutic drugs thereafter. This moved Omkarnath to voluntarily collect unused medicines. At the age of 75, crippled by an accident... Omkarnath still travels more than 6 kilometres a day to collect medicines. He then records their generic names and distributes them to the needy through hospitals. Omkarnath thus rightly called as `Medicine baba`. Let's salute to the Medicine baba. A soldier destined to save our health.     CHILDREN India is known for the street children. We've shown them in our films and got awards. But Sindhutai Sapkal of pune has owned hundreds of them. Born on 14th november, sharing the birthday of Jawaharlal Nehru... her date of birth is now celebrated fondly by the thousands who have inspired by her. Sindhutai was born to a cowherd and married to a cowherd. She was thrown out of her house by her husband when she was 9 months pregnant. Sindhutai was left to feed herself and her kin by begging alms. While begging on railway platforms for a few leftover grains, she realised that there are thousands like her, who has to spend the rest on their lives on those alms. Sindhutai felt to make a difference in their lives. She took them under her shelter, vigorously begged for their education and well being. Now there are hundreds of `settled` professionals - rejoicing the grace showered by Sindhutai on their lives.  Let's salute to Sindhutai. A soldier destined to save the children of the country.     TECHNOLOGY We've been talking about the senior generation working for the cause of society. We've been chatting about the people which stood against the odds. But what about the younger ones, and what about the service in the technology sector. We probably need not worry as long as we hear about people like `Mukund BS` Bengaluru. Mukund has everything for a great professional life... MBA from IIM Calcutta, prosperous job in ITC ! Still he felt something else to be. While seeing tonnes of waste scattered among the garbage. He found a solution for it. They would collect stale computers from the corporates, separate the components that can be reused, repair them... and would bring life to the computer. Thousands of such computers were now adding spice to the government schools and middle class study tables. Let's salute to Mukund BS. A soldier destined to save the Technology of the country.     -nirjara

ఫుడ్‌ రుచిగా ఉండాలంటే... ఇలా ట్రై చేయండి !! 

  ఫుడ్‌ని ఎంజాయ్‌ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ ఎప్పుడూ అదే ఫుడ్‌ అంటే బోర్‌ కొట్టక మానదు. అలాగని ప్రతిసారీ కొత్తరకం ఫుడ్‌ని ట్రై చేయలేం కదా! అందుకనే ఓ చిట్కా కనిపెట్టారు పరిశోధకులు. తినే ఆహారాన్ని మార్చలేకపోవచ్చు. కానీ ఆ ఆహారాన్ని తినే పద్ధతిని మారిస్తే ఎలా ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఆ పరిశోధన ఇదిగో...   అమెరికాలోని ఒహియో స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ ఎక్స్‌పరిమెంట్‌ చేశారు. దీనికోసం వాళ్లు ఓ 68 మందిని ఎంచుకున్నారు. వాళ్లలో సగం మందిని ఎప్పటిలాగే చేతుల్తో పాప్‌కార్న్ తినమని చెప్పారు. మరికొందరినేమో వెరైటీగా chop sticksతో తినమని సూచించారు. ఇలా తిన్నవారు పాప్‌కార్న్‌ ఎప్పుడూ లేనంత రుచిగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.   ఈ ఎక్స్‌పరిమెంట్‌ ఎంతవరకు నిజమో తెలుసుకునేందుకు, ఈసారి 300 మందికి ఆన్‌లైన్లో ఒక పని అప్పచెప్పారుట పరిశోధకులు. ‘మీరు కాస్త వెరైటీగా నీళ్లు తాగి చూడమని వాళ్లకి చెప్పార’ట. దాంతో జనం రకరకాలుగా ఈ ప్రయోగాన్ని ట్రై చేశారు. కొంతమంది మందు గ్లాసులో నీళ్లు పోసుకుని తాగితే, కొంతమంది నాలుకతో చప్పరించారు. ఇలా చేసినవాళ్లంతా కూడా నీళ్లు ఎప్పుడూ లేనంత రుచిగా ఉన్నాయని చెప్పారు.   ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసా! మనం ఏదన్నా ఆహారాన్ని వెరైటీగా ట్రై చేసినప్పుడు, దాన్ని మొదటిసారి తింటున్న ఫీలింగ్‌ కలుగుతుందట. అందుకనే మనం దాని టేస్ట్‌ని ఎంజాయ్‌ చేయగలుగుతాం. పిల్లలతో వాళ్లకి ఇష్టం లేని ఫుడ్‌ తినిపించడానికైనా, మనం తినే ఫుడ్‌ని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలన్నా ఈ చిట్కా పాటించి చూడమంటున్నారు పరిశోధకులు. - Nirjara  

లక్ష్యాన్ని చేరుకునే చిట్కా

  మనిషన్నాక రకరకాల లక్ష్యాలు ఉంటాయి. కానీ కొంతమంది మాత్రమే తాము ఏర్పరుచుకున్న గోల్స్‌ని చేరుకుంటారు. వాళ్లే విజేతలుగా నిలుస్తారు. మిగతావారంతా తమకి దొరికన దాంతో సంతృప్తి పడిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే అనుమానం వచ్చింది కొంతమంది పరిశోధకులకి. అంతే! వెంటనే ఓ పరిశోధన మొదలుపెట్టేశారు. అందులో తేలిన విషయాలు మనందరికీ ఉపయోగమే. ఇంతకీ ఆ పరిశోధన ఏమిటంటే.... మనలో చాలామంది లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ‘రేపటి నుంచి రోజూ పొద్దునే లేవాలి’ అనే గోల్‌ సెట్ చేసుకునే ఉంటారు. కానీ అదేం చిత్రమో కానీ ఎప్పుడు అలా అనుకున్నా ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. మొదటి రోజు రాత్రి పడుకోవడం లేట్‌ అవుతుంది, రెండోరోజు ఎవరో చుట్టాలు ఇంటికి వస్తారు, మూడో రోజు రాత్రి అసలు నిద్రే పట్టదు... ఇలాంటి కారణాలతో ఏ రోజుకి ఆ రోజు పొద్దున లేవడం కుదరనే కుదరదు. దాంతో ఇక ఆ గోల్‌ని పక్కన పెట్టేస్తారు. ఇలా గోల్‌ సెట్‌ చేసుకున్న తర్వాత వరుసపెట్టి ఇబ్బందులు తలెత్తడాన్ని ACTION CRISIS అని పిలుస్తారట. ఈ యాక్షన్‌ క్రైసిస్‌లో ఏం జరుగుతుంది. దాన్ని overcome చేయడం ఎలా అనే దిశగా పరిశోధకులు ఆలోచించారు. ఈ పరిశోధన కోసం వాళ్లు కొంతమంది వ్యక్తులకు వేర్వేరు గోల్స్ ఇచ్చారు. వాటిని సాధించే క్రమంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్లకి ఎలాంటి ఆలోచనలు ఏర్పడ్డాయో చెప్పమన్నారు. ఆశ్చర్యంగా గోల్‌ ఏదైనా కూడా, అందులో ఇబ్బందులు తలెత్తినప్పుడు ఒకే తరహా ఆలోచనలు వచ్చాయట. ‘అసలు ఈ గోల్‌ చేరుకోవాల్సిన ఉపయోగం ఉందా?’ అన్న అనుమానం మొదలైంది. అప్పటివరకూ గోల్‌కి ఉన్న లాభాల గురించి ఆలోచించినవాళ్లంతా, దానికి సంబంధించిన నష్టాల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకటికి రెండు ఇబ్బందులు రాగానే తాము లక్ష్యం చేరుకోగలమనే నమ్మకాన్ని కోల్పోయారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంకా ఏం చేయాలని ఆలోచించడం బదులు, దాన్ని ఎలా వదిలించుకునే మార్గాలు వెతకడం మొదలుపెట్టారు. దాంతో ఇక లక్ష్యం నిదానంగా కరిగిపోతుంది. ACTION CRISIS ఏర్పడినప్పుడు నిబ్బరంగా ఉండగిలిగితేనే లక్ష్యాన్ని సాధించగలం అని పరిశోధకులు తేల్చారు. ఆ కాస్త సమయంలో లక్ష్యాన్ని దూరం చేసుకోవడం కంటే, దాన్ని ఎలాగైనా సాధించేందుకు ఉపాయాన్ని ఆలోచించగలిగితే గోల్‌ రీచ్ అవ్వగలం. ఇందులో లక్ష్యాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తితో పాటు... అతని చుట్టుపక్కల ఉండే స్నేహితులు, టీచర్లు, కుటుంబం పాత్ర కూడా చాలా ఉందట. వాళ్ల ప్రోత్సాహం, సహాయం ఉంటే కనుక నమ్మకం చెదిరిపోకుండా ఉంటుందట. - నిర్జర.  

కోపం... ఎందుకు, ఏమిటి, ఎలా?

  తన కోపమే తన శత్రువు అంటారు. నిజమే. కోపంలో తప్పొప్పులు గుర్తుకు రావు. చిన్నా, పెద్దా చూడం. ఫలితం ఏంటన్నది ఆలోచించం. ఒక్క మాటలో చెప్పాలంటే కోపం విచక్షణని దూరం చేస్తుంది. కోపం వల్ల నష్టాలు అంటూ ఎంత చెప్పుకున్నా కోపం రాకుండా మాత్రం వుండదు. కోపం ఎప్పుడొస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిమీద వస్తుంది అంటూ విశ్లేషణలు మొదలుపెట్టామంటే సమాధానాలు మాత్రం కచ్చితంగా ఒక్కలా మాత్రం వుండవు. ఉదాహరణకి మనకి ఎంతో కోపం తెప్పించిన సంఘటన వేరేవాళ్ళకి చాలా సాధారణమైన విషయంగా కనిపించవచ్చు. అలాగే వేరేవాళ్ళు ఆవేశంతో ఊగిపోయే విషయం మనకి అతి సామాన్యమైనదిగా అనిపించవచ్చు. అంతేకాదు, ఒకసారి మనకి ఎంతో కోపం తెప్పించిన విషయం మరోసారి మామూలు విషయంగా తోచవచ్చు. తేడా సంఘటనలోగానీ, ఆ పరిస్థితుల్లోగానీ, వ్యక్తుల్లోకానీ వుండదు. తేడా అంటూ వుంటే అది మనలోనే వుంటుంది. మన మానసిక స్థితిపై ఆధారపడే మనలో భావావేశాలు కలుగుతాయని మనందరికీ తెలిసిందే. కోపం గురించి ఇంత చెప్పుకున్నాం సరే. మరి ఆ కోపాన్ని వదలగలమా? పూర్తిగా అయితే సాధ్యం కాదు. మరి మార్గం ఏమిటి? మంచిదంటూ మచ్చిక చేసుకోవటమే! అది ఎలా?   కోపం నిజంగా మంచిది కాదంటారా? ఒకోసారి కోపం రావటం వల్ల మంచే జరిగింది అనుకుంటూ వుంటాం. కోపంలో పౌరుషంతో, పట్టుదలతో కష్టపడి మంచి ఫలితాలు సాధించవచ్చు అని వింటుంటాం. అదెలా? ఎలా అంటే కోపం అనేది నెగిటివ్ ఎమోషనే అయినా దానిని పాజిటివ్‌గా మార్చుకున్నప్పుడు కూడా మంచే చేస్తుంది. సరైన రీతిలో ఉపయోగించుకుంటే నిరంతరం ప్రేరణగా మారుతుంది. మనలోని మనకి తెలీని శక్తిని వెలికి తీస్తుంది. కోసం ఒకోసారి మనకి ఎక్కడలేని ధైర్యాన్ని కూడా ఇస్తుంది. నిజానికి కోపం కూడా అన్ని భావాలలాగే మనకు అత్యవసరమైన ఓ భావం. అయితే అది మంచిదా కాదా అన్నది దానిని మనం ఉపయోగించుకనే విధానంపై ఆధారపడి వుంటుంది. మనిషిలోని భావోద్వేగాలన్నిటిలోకి కోపం కీలకమైనది. కోపం వస్తే ఊగిపోవటం, ఎదుటివారిని తిట్టడం, శిక్షించడం వరకే మనకి తెలుసు. కానీ, కోపంతో తమకు తాము హాని చేసుకోవడం, అందరికీ దూరంగా వుండటం జరుగుతూ వుంటుంది. కొంతమంది ఒంటరిగా,  మూడీగా వుంటారు. ఎవరినీ ఏమీ అనరు. కానీ ఎవ్వరితోనూ మాట్లాడరు. కారణం బాధ అయి వుండొచ్చు అనుకుంటాం చాలాసార్లు. కానీ, ఒకోసారి తనమీద, పరిస్థితుల మీద, తన చుట్టూ వున్నవారిపైన కోపం, ఏమీ చేయలని అసహాయత మీద కోపం కొందరిని మౌనంగా మారుస్తుంది అంటున్నారు నిపుణులు. అంతెందుకు.. పిల్లలు కోపంతో మూతి ముడిచి దూరంగా కూర్చోవటం అమ్మలకి అనుభవమేగా. కోపాన్ని వ్యక్తీకరించేందుకు విధానం ఒక్కలా వుండదు. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ వుంటుంది. కోపాన్ని జయించలేకపోయినా అదుపులో పెట్టుకోవడం సులువే. కోపం ఎందుకు, ఎవరిమీద వచ్చిందో అన్న విషయం ఒకోసారి మనకి గుర్తు వుండదు. కానీ, ఆ కోపాన్ని ఎవరో ఒకరిపై మనకి తెలియకుండానే చూపిస్తాం. నాకు కోపం రాలేదు అనుకుంటాం కానీ, ఆ భావావేశం మన ప్రవర్తనపై ప్రభావం చూపిస్తుందని గుర్తించం. ఉదాహరణకి చూడండి..  ఏ పనమ్మాయో రాలేదు. చేతినిండా పని. చిరాకుగా వుంటుంది. సరే చేసేది ఏముందని పనిలో పడతాం. అప్పుడు కోపం ఏం లేదు. కానీ, చిన్నవాడు పొరపాటున ఓ గ్లాసుడు నీళ్ళు హాలులో ఒంపగానే కయ్యిమని అరుస్తాం. చిన్నవాడికి ఏం అర్థంకాదు. గ్లాసుడు నీళ్ళకి అమ్మ ఎందుకు అంత అరిచిందని. మనకీ అర్థంకాదు ఎందుకంత కోపం వచ్చిందో. నిజానికి కారణం పనమ్మాయి రాని చిరాకు ఎక్కడో మనలో మనల్ని తొలిచేస్తూ కోపం ఈ విధంగా బయటపడింది అంతే. ఇది చిన్న ఉదాహరణే. సాధారణంగా జరిగేదే. కానీ, చాలాసార్లు మనం వ్యక్తంచేసే కోపానికి మూలం అప్పటి సంఘటనో, వ్యక్తో కాదంటే నమ్మగలరా! కానీ, నిజంగా నిజం అదేనట. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగితే, ఎప్పటికప్పుడు మన కోపాన్ని చెక్ చేసుకుంటూ వుండొచ్చు. ఈమధ్య ఓ యూనివర్సిటీవారు నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటో తెలుసా? ఓ సగటు వ్యక్తి జీవితకాలంలో నిద్రకి కావలసిన సమయాన్ని తీసేస్తే మిగిలిన కాలంలో సగం కాలం కోపంతో గడుపుతాడట. ఆశ్చర్యంగా అనిపించినా నిజం అదే. ప్రతీ చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం ఈమధ్యకాలంలో సాధారణంగా మారిందని, ఆ ప్రభావం  ఆరోగ్యంపై, రిలేషన్స్‌పై ముఖ్యంగా పిల్లల వ్యక్తిత్వంపై చాలా ఉంటోందని చెబుతున్నారు ఆ అధ్యయనకర్తలు. ఆ కోపానికి కారణాలు వెతకడం మొదలుపెట్టగలిగితే లేదా ఆ కోపాన్ని నిర్మాణాత్మకంగా మార్చుకోవడం అలవాటు చేసుకోగలిగితే ఎన్నో సమస్యలకి దూరంగా వుండొచ్చు. -రమ

చేతిరాత జారనివ్వొద్దు

      నేను రాస్తే ముత్యాలు పేర్చినట్టు ఉండేది. ఇప్పుడు కోడి కెలికినట్టుంటోంది. పేజీలకు పేజీలు రాసేవాణ్ణి చెక్ బుక్ మీద సంతకం కూడా సరిగా రావడం లేదు. ' అమ్మో.. నాలుగు పేజీలా ఎప్పుడో కాలేజి డేస్ లో అంటే ఓకే ఇప్పుడు ఇంపాజిబుల్' ఇదీ ఇప్పుడు హ్యాండ్రైటింగ్ పరిస్థితి. అక్షరం.. అష్ట వంకర్లు పోతుంది. రాత.. గీత తప్పుతోంది చేతిరతకు చేటుకాలం.. ఇంకా చెప్పాలంటే ' పోయేకాలం ' దాపురించింది.    పాకే వయసు లో మొదలుపెడితే బలం నుంచి పెన్సిళ్ళు, పెన్నులు, కాగితాలు, పుస్తకాలు.. ఇలా అక్షారాలు ఆసీనులయ్యే ఆసనాలు, ఆవిష్కరించే సాధనాలు మారేకొద్దీ మన చేతిరాత మరింత మెరుగులు దిద్దుకుంటూ వచ్చింది. చేతివేళ్ళ నుంచి ఊపిరి  పోసుకున్న గీత తలరాతను సైతం దిద్దగలిగింది. అంత గొప్పదైన, అక్షరాభ్యాసం నాటి  నుంచి తోడైన అపురూప బందం మసకబారిపోయింది. ' మనదైన ' చేతిరాత మనల్ని వీడిపోతుంది.... ఎందుకలా.... పోగొట్టుకోవడం 'ఈ ' జీ:- కంప్యూటర్లు, మొబైల్స్,ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ ఇవన్నీ మన చేతిరాతకు కోరుతున్నాయి. ఇపుడంతా 'ఈ' జీ ఈ జీ టెక్నాలజి. టెక్నాలజీ పుణ్యమాని చేతిరాతకి పోయేకాలం వచ్చింది నిజానికి ఒకప్పటికన్నా ఇప్పుడే మనం ఎక్కువగా రాస్తున్నాం. అయితే కీబోర్డుతో పచారి సామాన్ల జాబితా నుంచి సమావేశంలో పాఠ్యంశాల దాకా పుట్టిన రోజు శుభాకాంక్షల నుంచి పోయిన రోజు సంతాపసందేశాల దాకా అన్నీ టెక్స్ట్ మెసేజ్ లో, మెయిళ్ళో.. మరొకటో దీంతో రాయాల్సిన అవసరం రోజురోజుకూ తగ్గిపోతుంది. సర్వేలేమంటున్నాయ్:- ఆధునికులలో సగటున ఓ వ్యక్తీ 41 రోజులకు గాని నాల్గులైన్లు రాయాల్సిన అవసరం రావడం  లేదని, అలాగే ప్రతి ముగ్గురిలో ఒకరికి 6  నెలల పాటు కలం పట్టే ఖర్మ పట్టడం లేదట. ఇక ప్రతి ఏడుగురులో ఒకరు తమ హ్యండ్రైటింగ్ మారిన తీరు తమకే అవమానకరంగా మారిందని వాపోతున్నారట. బ్రిటిష్ కంపెనీ డాక్మెయిల్ సర్వే తేల్చిన విషయమిది. గత కొంతకాలంగా తమ చేతిరాత పాడైపోయిందని ఈ సర్వేలో పాల్గొన్న సగం మంది చెప్పారు. "చేతిరాత అవసరం తగ్గుతున్నప్పటికి,టెక్నాలజీలతో సంబంధం లేకుండా కూడా కమ్యునికేట్ చేయగల సామర్ధ్యాలను ప్రజలు నిలబెట్టుకోవల్సిందే" అని డాక్మెయిల్ కంపెనీ డైరెక్టర్  బ్రాడ్వే ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.   ఇలా చేయండి:- * నిద్ర ముందు ప్రతి రోజు కాసేపైన డైరీ రాయడం అలవాటుగా మార్చుకోండి. * ఆలోచనలకు ఎప్పటికప్పుడు అక్షరరూపం ఇవ్వడానికి ప్రయత్నించండి. * చిన్న చిన్న కథలు, ఉత్తరాలు స్వయంగా రాయండి. * మీ లక్ష్యాలను, కలలను తరచుగా పేపర్ మీద పెడుతుండండి. * మీకు బాగా ఇష్టులైన వారికీ చేతి రాతతో శుభాకాంక్షలు పంపడం అలవాటు చేసుకోండి.  

కాళ్లూ చేతులూ లేవు, పట్టుదల మాత్రం ఉంది!

  మనిషి చాలా చిత్రమైనవాడు. అతనికి ఎన్ని కష్టాలు వస్తే.. అంతగా పోరాడతాడు. ఎన్ని సమస్యలు ఉంటే అంతగా సత్తా చూపిస్తాడు. అందుకు ఉదాహరణ కావాలా! అయితే నిక్ ఉజికిక్ (Nick Vujicic) గురించి ఓసారి తెలుసుకుంటే సరి!   నిక్ 1982లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జన్మించాడు. కానీ పుట్టుకతోనే అతన్ని దురదృష్టం వెంటాడింది. tetra-amelia syndrome అనే అరుదైన వ్యాధి వల్ల చేతులే లేకుండా పుట్టాడు. కాళ్లు కూడా అంతంతమాత్రమే! నిక్ పుట్టినవెంటనే అతన్ని చూసి భయంతో తండ్రి బయటకు పరుగుతీశాడట. తనకి పుట్టిన బిడ్డ గురించి విన్న తల్లి, నాలుగునెలల వరకూ అతన్ని చూసే ధైర్యమే చేయలేదు. కానీ ఎంతైనా కన్న మమకారం కదా! ఇదంతా తమ ఖర్మ అనుకుని అతన్ని దగ్గరకు తీసుకున్నారు. ఏ లోటూ రాకుండా పెంచే ప్రయత్నం చేశారు.   తల్లిదండ్రులు కాబట్టి నిక్లో ఎలాంటి లోపం ఉన్నా భరించారు. కానీ బయటవారు అలా ఉండరు కదా! నిరంతరం తోటిపిల్లలు ఎగతాళి చేస్తూ ఉండేవారు, దారినపోయేవారంతా విచిత్రంగా చూసేవారు. ఈ ఛీత్కారాలన్నీ భరించలేక తన పదవ ఏటనే నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్. అదృష్టవశాత్తూ ఆ ప్రయత్నం విఫలం అయ్యింది.   నిక్ జీవితం బహుశా ఇలాగే నిస్సారంగా గడిచిపోయేదేమో! కానీ అనుకోకుండా ఓ రోజు తనలాగే కాళ్లూచేతులూ లేని వ్యక్తి సాధిస్తున్న విజయాల గురించి పేపర్లో చదివాడు. అంతే! తనలోని నిరాశని పక్కకి పెట్టేశాడు. తోటివాళ్లతో పోటీపడుతూ చదువుకుని అకౌంట్స్లో డిగ్రీ సాధించాడు. తనంతట తానుగా ప్రతి పనినీ చేయగలగడం అలవాటు చేసుకున్నాడు. కాళ్లూ చేతులూ లేని తానే జీవితంలో స్థిరపడగలిగితే... ఇక మిగతావారు సాధించలేనిది ఏముంటుంది? అన్న ఆలోచనతో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోయాడు.   నిక్ ఇప్పటివరకూ 50కి పైగా దేశాలు తిరుగుతూ లక్షలాదిమందిలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అలాంటి ఓ సందర్భంలో నిక్ ఉపన్యాసం వినేందుకు వచ్చిన ఓ అందగత్తె అతని మీద మనసు పారేసుకుంది. వాళ్లిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నిక్కు ఇద్దరు పిల్లలు. కేవలం ఉపన్యాసాలే కాదు... తన జీవితానుభవాలతో ఆయన Life Without Limits లాంటి పుస్తకాలు కూడా రాశాడు. ఆ ఒక్క పుస్తకమే 30కి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది.  సాధారణంగా ఎవరికన్నా తీరని కష్టం వస్తే, వాళ్లు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ నిక్ అలా కాదు! భగవంతుని అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు.   నిక్కు కాళ్లూ చేతులూ లేవు కదా అని అతను ఏ పనీ చేయకుండా కూర్చుంటాడని అనుకోవద్దు. ఫుట్బాల్, గోల్ఫ్ లాంటి ఆటలు ఆడేస్తాడు; సముద్రపు లోతుల్లోకి వెళ్లి సర్ఫింగ్లో విన్యాసాలు చేస్తాడు. ‘మనం పనికిరానివారం అనుకోవడం ఒక పెద్ధ అబద్ధం’ అన్నది నిక్ మాట. ‘జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం,’ అన్నది అతని సూత్రం. ‘మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారీ లేచినిలబడగలిగితే విజయం దక్కితీరుతుంది,’ అన్నది అతని నమ్మకం! ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపిస్తోంది. లక్షలాదిమందిలో కొత్త ఆశలను నింపుతోంది. - నిర్జర.  

బరువా? బాధ్యతా?

నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఓ కుర్రవాడు బయల్దేరాడు. ఎడారి దేశంలో ఓ 40 రోజులపాటు తెగ తిరిగాడు. చివరికి సంతోషపు రహస్యం గురించి చెప్పగల ఒక పెద్దాయన గురించి విన్నాడు. ఆ పెద్దాయన ఫలానా పర్వతం మీద ఓ అందమైన భవంతిలో ఉంటాడని తెలిసింది. ఆ ఇంటిని వెతుక్కుంటూ పర్వతాన్ని ఎక్కాడు. నిజంగానే ఆ పర్వతం మీద కళ్లు చెదిరిపోయే ఒక భవనం కనిపించింది. తన గమ్యాన్ని చేరుకున్నానన్న సంతోషంలో ఆ కుర్రవాడు హడావుడిగా భవంతిలోకి అడుగుపెట్టాడు. అక్కడ వందలాది మంది రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. వారందరినీ దాటుకుని ఆ ఇంటి యజమాని దగ్గరకు చేరుకునేసరికి అతనికి చాలా సమయమే పట్టింది. ఆ పెద్దాయన దగ్గరకి వెళ్లిన కుర్రవాడు, తన బాధనంతా ఏకరవు పెట్టాడు. సంతోషపు రహస్యం ఎలాగైనా తనకు చెప్పితీరాలని పట్టుపట్టాడు. కుర్రవాడు చెప్పినదంతా పెద్దాయన శ్రద్ధగా విన్నాడు. ‘నా పని పూర్తయ్యాక నీకు సంతోషపు రహస్యాన్ని తప్పకుండా చెబుతాను. ఈలోగా నువ్వు నా భవంతిని చూసిరా. అయితే ఒక చిన్న షరతు. ఇదిగో ఈ చెంచా ఉంది చూశావు. అందులో రెండు చుక్కల నూనె ఉంది. ఆ చెంచాని పట్టుకుని నువ్వు తిరగాలి. తిరిగి వచ్చేసరికి అందులోని నూనె ఒలికిపోకూడదు. సరేనా!’ అన్నాడు పెద్దాయన. ‘ఓస్‌ అంతే కదా!’ అనుకున్నాడు కుర్రవాడు. ఆ చెంచాని పట్టుకుని భవంతి అంతా కలియతిరిగాడు. ఓ రెండు గంటలు ఇంట్లోని మూలమూలలా తిరిగిన తర్వాత పెద్దాయన దగ్గరకి చేరుకున్నాడు. ‘వచ్చేశావా! నా ఇల్లు ఎలా ఉంది చెప్పు. అక్కడ వంటింట్లో తగిలించి పర్షియా కర్టెన్లు చూశావా? నా తోటమాలి పదేళ్లపాటు శ్రమించి రూపొందించిన అందమైన తోటని గమనించావా? నా గ్రంథాలయంలో ఉన్న అరుదైన తాళపత్రాలను పరిశీలించావా?...’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. పెద్దాయన అడిగిన ప్రశ్నలకి కుర్రవాడు చిన్నబోయాడు. ‘భవనం అంతా తిరిగాను కానీ... వాటన్నింటినీ అంత దగ్గరగా పరిశీలించలేకపోయాను. నా చేతిలోని నూనె చుక్కలు ఎక్కడ జారిపోతాయో అన్న భయంతో నిరంతరం చెంచా వంక చూసుకోవడమే సరిపోయింది,’ అంటూ సంజాయిషీ చెప్పాడు. ‘అయ్యయ్యో! ఎంత పని జరిగిపోయింది. నా ఇంటినే సరిగా చూడలేనివాడివి ఇక జీవితాన్ని ఏం చూడాలనుకుంటున్నావు. మరోసారి భవంతి అంతా కలియతిరిగి రా!’ అన్నారు పెద్దాయన. ఈ మాటతో సంబరంగా మరోసారి ఇల్లు కలియతిరగడానికి బయల్దేరాడు కుర్రవాడు. ఈసారి ఇంట్లోని నలుమూలలూ క్షుణ్నంగా పరిశీలించాడు. అందులోని ప్రతి వస్తువులోనూ ఉన్న కళాత్మకతను ఆస్వాదించాడు. ఓ రెండుగంటల తర్వాత పెద్దాయన దగ్గరకి చిరునవ్వుతో వెళ్లి నిల్చొన్నాడు. ‘నీ వాలకం చూస్తే ఇంట్లోని ప్రతి అంగుళమూ చూసి వచ్చినట్లు ఉన్నావే!’ అన్నాడు పెద్దాయన. ‘అవునండీ!’ అంటూ ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడు కుర్రవాడు. ‘కానీ ఈసారి చెంచాలో నూనె అంతా ఒలికిపోయింది చూశావా? జీవితం కూడా ఇంతే! దాన్ని ఆస్వాదించాలి అన్న ధ్యాసలోనే ఉంటే నీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేవు. నీ బాధ్యతల హోరులో పడిపోతే..... నీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించలేవు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే నిజమైన సంతోషం ఉంది,’ అని చెప్పుకొచ్చాడు పెద్దాయన. (పాల్‌ కోయిలో రాసిన The Alchemist పుస్తకంలోది. ఇదే తరహా కథ మన పురాణాలలోనూ కనినిపిస్తుంది. విష్ణుమూర్తి, నారదుడికి ఇదే తరహా గుణపాఠాన్ని బోధించడం చూడవచ్చు)   - నిర్జర.

అద్భుతాలు సృష్టిస్తున్న 'Friendship Bench' ప్రాజెక్ట్

  జింబాంబ్వే- ఈ పేరు వినగానే దుర్భర దారిద్ర్యం గుర్తుకువస్తుంది. కొన్నాళ్ల నుంచి జింబాంబ్వేలో ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదు, రాజకీయ పరిస్థితులూ అంతంతమాత్రమే! ఇదంతా ఆ దేశవాసుల మనసు మీద ప్రభావం చూపుతోంది. అంతర్యుద్ధాలతోను, నిరుద్యోగంతోనూ వారి మనసు చెదిరిపోతోంది. ఈ సమస్యలకి HIV లాంటి సమస్యలూ తోడవుతున్నాయి. ఇన్ని కష్టాలతో చెదిరిపోయిన మనసులలో, ధైర్యాన్ని నింపేందుకు తలపెట్టిన ప్రాజెక్టే - 'Friendship Bench' కార్యక్రమం.   ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో సైతం డిప్రెషన్తో బాధపడేవారు వైద్యుల దగ్గరకి వెళ్లేందుకు జంకుతారు. అలాంటిది జింబాంబ్వే సంగతి చెప్పాలా! ఒకవైపు సంప్రదాయబద్ధమైన ఆలోచనా విధానం, మరోవైపు వైద్యుని దగ్గరకు వెళ్లాలన్నా కూడా డబ్బు లేని దుస్థితి. ఒకవేళ ఎలాగొలా ధైర్యం చేసి వైద్యుడి దగ్గరకు వెళ్లాలనుకున్నా, అక్కడ తగిన వైద్యులే లేరయ్యే! కోటిన్నరకు పైగా జనాభా ఉన్న జింబాంబ్వేలో కేవలం 13 మంది సైకాలజిస్టులు మాత్రమే ఉన్నారట! జింబాంబ్వేలో మానసిక వైద్యులు లేకపోవచ్చు, కానీ మానసిక రోగులకి మాత్రం కొదవలేదు. ఒక అంచనా ప్రకారం జింబాంబ్వేలో దాదాపు నాలుగో వంతు మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు లేదా జీవచ్ఛవాలుగా బతికేస్తున్నారు. దీనికి ఏదో ఒక పరిష్కరాన్ని కనుగొంది జింబాంబ్వే ప్రభుత్వం. అదే 'Friendship Bench' ప్రాజెక్ట్.   ఈ ప్రాజెక్టులో భాగంగా మానసిక సమస్యలతో ఆరోగ్య కేంద్రాల దగ్గరకు వెళ్లేవారికి కొన్ని ప్రశ్నలు ఉన్న పత్రం ఇస్తారు. దీన్ని Shona Symptom Questionnaire అంటారు. ‘మీకు సరిగా నిద్రపడుతోందా లేదా?’, ‘తరచూ ఆందోళనకు లోనవుతున్నారా?’ లాంటి ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ ప్రశ్నలకు రోగులు ఇచ్చే జవాబుల ఆధారంగా వారి మానసిక స్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సదరు రోగులలో తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నట్లు తేలితే వారిని వారిని 'Friendship Bench'కి పంపిస్తారు.   ఫ్రెండ్షిప్ బెంచ్ అంటే మరేమీ లేదు. ఆరోగ్యకేంద్రాల బయట కొందరు పెద్దలు ఓ బెంచి మీద కూర్చుని ఉంటారు. వీరికి సహజంగానే బోలెడు జీవితానుభవం ఉంటుంది. దానికి తోడుగా, మానసిక సమస్యలు ఉన్నవారితో ఎలా ప్రవర్తించాలి? అన్న అంశం మీద శిక్షణ కూడా ఉంటుంది. వీరు చేసే పనల్లా... తమ దగ్గరకు వచ్చిన రోగుల సమస్యలను శ్రద్ధగా ఆలకించడం. అలా రోగుల సమస్యలను వింటూ, వారితో మాట్లాడుతూ... తమ సమస్యలకు తామే పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహించడం. ఇలా ఒక ఆరు సెషన్లతోనే రోగులు తమ డిప్రెషన్ నుంచి కోలుకొంటున్నట్లు తేలింది.   వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా... 'Friendship Bench' ప్రాజెక్టు అద్భుతమైన విజయం సాధించిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుల విజయాల మీద ఇటీవలే ఒక పరిశోధన కూడా జరిగింది. ఒక్కసారి 'Friendship Bench'లో చేరిన వారిలో డిప్రెషన్ నామరూపాలు లేకుండా పోయినట్లు ఈ పరిశోధనలో బయటపడింది. మరో విచిత్రం ఏమిటంటే... తమ డిప్రెషన్కు వైద్యుల దగ్గర చికిత్స తీసుకున్నవారికంటే, ఇలా 'Friendship Bench' ద్వారా మనసుకి సాంత్వన పొందినవారే డిప్రెషన్ నుంచి త్వరగా దూరమయ్యారట. దీనిబట్టి స్నేహితులతోనూ, జీవితానుభవం ఉన్న పెద్దలతోను మన సమస్యలను పంచుకుంటే... మనసు ఎంతో తేలికపడుతుందని తెలిసిపోయింది కదా! (స్నేహితుల దినోత్సవం సందర్భంగా) - నిర్జర.    

టీకప్పు చెప్పే పాఠం

ఒక పెద్దాయనకి రకరకాల టీకప్పులని సేకరించే అలవాటు ఉండేది. అలా ఆయన వేర్వేరు ఆకారాలు, రంగులలో ఉండే వందలాది టీకప్పులని సేకరిస్తూ ఉండేవాడు. అలా ఓసారి ఆయన టీకప్పులని అమ్మే షాపుకి వెళ్లాడు. అక్కడ ఎదురుగుండా ఉన్న షోకేసులో ఓ ఎర్రటి టీకప్పు చూసి డంగైపోయాడు. తన జీవితంలో ఎన్నో రకాల కప్పులని చూశాడు. కానీ ఇంత అందమైన టీకప్పుని ఎన్నడూ చూసి ఎరుగడు. దాంతో వెంటనే ఆ షాపు యజమాని చెప్పిన ధరని చెల్లించి దాన్ని సొంతం చేసుకున్నాడు.   తన చేతికి సొంతమైన టీకప్పుని చేస్తూ పెద్దాయన- ‘ఈ టీ కప్పు ఇంత అందంగా ఎలా ఉందబ్బా!’ అని మురిసిపోవడం మొదలుపెట్టాడు.   ‘నాకు ఇంత అందం ఎలా వచ్చిందో తెలుసా!’ అని అడిగింది టీకప్పు. తను విన్నది నిజమే! టీకప్పు మాట్లాడుతోంది. ‘చెప్పు చెప్పు! నీకు ఇంత అందం ఎలా వచ్చింది,’ అని అడిగాడు పెద్దాయన. ‘నేను మొదట్లో మట్టిగానే ఉండేదాన్ని. నన్ను ఒకతను చేతిలోకి తీసుకుని ముద్దముద్దగా చేసిపారేశాడు. నన్ను నేలకేసి కొడుతూ, చేతులతో పిసుకుతూ నానా హింసలూ పెట్టాడు. చాలు బాబోయ్ చాలు అన్న వినిపించుకోలేదు. అప్పుడే కాదు అంటూ నన్ను చితక్కొట్టేశాడు.   ‘ఆ తర్వాత నన్ను ఒక చక్రం మీద పడేశాడు. దాని మీద పడేసి గిరగిరా తిప్పుతూ ఉంటే... నాకు కళ్లు తిరిగాయి. నా వల్ల కాదు బాబోయ్ నన్ను ఈ చక్రం మీద నుంచి దింపెయ్యి అని అడిగాను. అప్పుడే కాదు అంటూ నన్ను అటు లాగీ ఇటు లాగీ ఓ చిత్రమైన ఆకారం కిందకి మార్చాడు.   ‘ఏదో ఒక ఆకారం ఏర్పడింది కదా! ఇక నా బాధలు తీరిపోయాయి అనుకున్నాను. ఊహూ! నన్ను తీసుకువెళ్లి ఒక బట్టీలో (పొయ్యి) పడేశాడు. ఆ పొయ్యిలో వేడికి నేను సలసలా మరిగిపోయాను. నాలో నీరంతా ఎండిపోయింది. నా చర్మం కాలిపోయింది. నన్ను వదిలెయ్యి అంటూ ప్రాథేయపడ్డాను. అప్పుడే కాదంటూ అతను చిరునవ్వు నవ్వాడు.   ‘పోనీలే ఎలాగూ ఎండిపోయాను. ఇక నన్ను ఏమీ చేయలేడు అనుకున్నాను. కానీ నా మీద రకరకాల రంగులన్నీ పూసి వదిలిపెట్టాడు. నాకు ఊపిరాడటం లేదు బాబోయ్! నన్ను వదలిపెట్టు అంటూ అతన్ని వేడుకున్నాను. అప్పుడే కాదంటూ అతను కాసేపు అవతలికి వెళ్లిపోయాడు.   ‘నామీద ఉన్న రంగులన్నీ ఎండిపోయాక తిరిగి నన్ను ఇంకోసారి బట్టీలో పడేశాడు. మరోసారి ఆ వేడిని తట్టుకోవడం నా వల్ల కాలేదు. నన్ను వదిలెయ్యిరా నాయనా అంటూ ఎంతగా ప్రాథేయపడినా అతనిలో చలనం లేకపోయింది. ఇక నేను ఆ వేడికి బూడిదైపోతాను అనగా నన్ను బయటకు తీశాడు.   ‘బట్టీ నుంచి బయటకు వచ్చిన చాలాసేపటికి కానీ నేను చల్లారలేదు. నాలో వేడి ఉన్నంతసేపూ కూడా నేను నా కర్మని తిట్టుకుంటూనే ఉన్నాను. నాకే ఎందుకీ కష్టం! అని దేవుని నిందిస్తూనే ఉన్నాను. ఇంతలో అతను మళ్లీ వచ్చాడు. ఈసారి అతని చేతిలో ఒక అద్దం ఉంది. అ అద్దం నా ముందు పెట్టాడు. ఆశ్చర్యం. ఆ అద్దంలో మట్టి లేదు! ఒక అందమైన రంగురంగుల తళుకుబెళుకుల రూపం కనిపించింది. అది నాదే అని నమ్మలేకపోయాను.   ‘నొప్పిగా ఉంది కదా అని నన్ను మట్టిలాగే ఉంచేస్తే నేను అక్కడే మిగిలిపోయేదాన్ని. కళ్లు తిరుగుతున్నాయి కదా అని నన్ను ముద్దలా చేయకపోతే ఎండిపోయేదాన్ని. వేడిగా ఉంది కదా అని బట్టిలోంచి తీసేస్తే పగిలిపోయేదాన్ని. ఊపిరి సలపడం లేదు కదా అని రంగులు వేయడం మానేస్తే అసంపూర్ణంగా మిగిలిపోయేదాన్ని. మరోసారి నన్ను బట్టీలో వేయకపోతే ఈ మెరుపు వచ్చేదే కాదు. నా అందం వెనకాల ఇంత కష్టం ఉంది తెలుసా!’ అని చెప్పుకొచ్చింది టీకప్పు. టీకప్పు చెప్పిన మాటలు మన జీవితానికి కూడా అన్వయిస్తాయేమో!   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.