పెన్సిలూ - మ‌నిషి!

  ఒక అజ్ఞాత వ్య‌క్తి పేర ప్ర‌చారంలో ఉన్న‌ నీతి క‌థ ఆధారంగా అల్లిన‌ క‌థ ఇది... ఒక ఫ్యాక్టిరీలో వేలాది పెన్సిళ్లు త‌యార‌వుతున్నాయ‌ట‌. ఆ హ‌డావుడిని చూసిన ఒక స‌న్న‌టి పెన్సిల్ త‌నను పెట్టెలో స‌ర్దుతున్న ఓ వ్య‌క్తితో ఇలా మాట‌లు క‌లిపింది. `ప్ర‌పంచంలో ఇన్ని ల‌క్ష‌ల పెన్సిళ్లు ఉన్నాయి క‌దా. వాటితో పోలిస్తే నేను ఎందుకూ ప‌నికిరానేమో అని భ‌యంగా ఉంది. ఒక పెన్సిల్‌గా నా ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డం క‌ష్ట‌మేమో అని భ‌యం వేస్తోంది. నాకేద‌న్నా ఉపాయం చెప్ప‌రాదా!` అని అడిగింది. దానికా వ్య‌క్తి చిరున‌వ్వుతో `అదెంత భాగ్యం! నేను చెప్పే ఒక అయిదు విష‌యాలు గుర్తుపెట్టుకో చాలు! నీ జీవితం సార్థ‌క‌మవుతుంది` అంటూ ఇలా చెప్పాడు... ఒక‌టి:  నువ్వు నీ జీవితంలో చాలా అధ్బుతాల‌ను చేస్తావు. కానీ అందుకోసం వేరొక‌రి చేతిలో ఒదిగి ఉండ‌వ‌ల‌సి ఉంటుంది. రెండు:  నీతో చ‌క్క‌గా రాయించేందుకు ఎప్ప‌టిక‌ప్ప‌డు నిన్ను చెక్క‌వ‌ల‌సి ఉంటుంది. ఆ అనుభ‌వం చాలా బాధాక‌రంగా ఉంటుంది. బాధ‌ప‌డాల్సి వ‌స్తుంది క‌దా అని నువ్వు వెనుక‌డుగు వేశావో. ముందు మొద్దుబారి ఆ త‌రువాత ఎందుకూ ప‌నికిరాకుండా పోతావు. మూడు:  నువ్వు చేసిన పొర‌పాట్లు ఏవ‌న్నా ఉంటే దాన్ని చ‌క్క‌దిద్దుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. వాటిని శుభ్రంగా వినియోగించి, తిరిగి నేర్ప‌గా రాయి. నాలుగు:  నీ లోప‌ల ఉండేదే నీ విలువ‌కు నిజ‌మైన కొల‌మానంగా ఉంటుంది. అయిదు:  గ‌రుకైన గోడ‌ల నుంచి నున్న‌టి కాగితం వ‌ర‌కూ.... నువ్వు నానార‌కాల ప‌దార్థాల మీద రాయ‌వ‌ల‌సి ఉంటుంది. దేనిమీద రాస్తున్నామ‌న్న‌ది మ‌ర్చిపో. ప్ర‌తి సంద‌ర్భంలోనూ నీదైన ముద్ర వేసేందుకు మాత్ర‌మే ప్ర‌య‌త్నించు.   - ఈ అయిదు సూచ‌న‌లూ చేసి ఆ వ్య‌క్తి, పెన్సిల్‌ను ఈ లోకంలోకి పంపించాడ‌ట‌. ఇప్ప‌డు పెన్సిల్ స్థానంలో మ‌న‌ల్ని ఊహించుకుంటే ఈ సూచ‌న‌లు అర్ధ‌వంతంగానే తోస్తాయి. ఒక‌టి: ఒక ప‌క్క మ‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే, విధి చేతిలో నిమిత్త‌మాత్రులం అన్న విష‌యాన్ని గుర్తించాలి. మ‌న ద్వారా జ‌రుగుతున్న అద్భుతాల‌న్నింటికీ మ‌న‌మే బాధ్య‌లం అన్న అహంకారంతో ఉండ‌కూడ‌దు. రెండు:  ఎన్నో బాధాక‌ర‌మైన అనుభ‌వాల ద్వారా జీవితం మ‌న‌కు కొత్త కొత్త పాఠాల‌ను నేర్పుతుంది. అవేమీ నాకు వ‌ద్దు అనుకుంటే లోకంలో అమాయ‌కంగానే ఉండిపోతాం. అనామ‌కంగా మాత్ర‌మే మిగిలిపోతాం. మూడు:  కాలం ముందుకు సాగుతూ ఉంటుంది. దాంతో పాటుగా మ‌నం చేసిన పొర‌పాట్లూ మ‌న జీవితంలో న‌మోదు అయిపోతాయి. వాటిని వెన‌క్కితోసుకోలేక‌పోవ‌చ్చు. కానీ స‌రిదిద్దుకునే అవ‌కాశం మాత్రం జీవితం ఎప్ప‌టిక‌ప్ప‌డు మ‌న‌కి అందిస్తూనే ఉంటుంది. కొన్ని క్ష‌మాప‌ణ‌లు, కొద్దిపాటి క‌ష్టంతో పాటు... పెద్ద మ‌న‌సు, స‌రైన వివేచ‌న ఉంటే వాటిని స‌రిదిద్దుకోవ‌డం సాధ్యం కావ‌చ్చు. నాలుగు:  పైపై మెరుగులు మ‌న‌కి తాత్కాలికంగానే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌న లోప‌ల ఉండే సంస్కార‌మే మ‌న జీవితానికి, విజ‌యానికీ కొల‌మానంగా నిలుస్తుంది. మ‌న చేత‌ల‌కు విలువ‌నిస్తుంది. సంస్కారం లేనివాడు... ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎన్ని ఆడంబరాల‌ల‌ను చుట్టుకున్నా నిరుప‌యోగంగానే ఉండిపోతాడు. అయిదు:  జీవితంలోని ప్ర‌తి మ‌లుపులోనూ, ప్ర‌తి మ‌జిలీలోనూ, ప్ర‌తి మాట‌లోనూ, ప్ర‌తి మ‌మ‌త‌లోనూ... మ‌న‌దైన ముద్రంటూ ఒక‌టి ఉండాలి. వ్య‌క్తిత్వం ప‌ట్ల పూర్తి నిబ‌ద్ధ‌త ఉన్న‌ప్పుడే అది సాధ్య‌ప‌డుతుంది. - నిర్జ‌ర‌.

ఒత్తిడిని గుర్తించండి.. ఒదిలించండి

    ఒత్తిడి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అబ్బే లేదే నేనేం ఒత్తిడిలో లేను అని చాలామంది కొట్టి పారేస్తారు. కానీ ఒత్తిడిని గుర్తించటంలో మనం పొరపాటు పడినా, దాని ప్రభావాన్ని చూపించటంలో అది ఏమాత్రం జాలి పడదు. మన మనసు పైనే కాదు, శరీరం మీద కూడా దాని ప్రభావం చాలా వుంటుంది అంటున్నారు నిపుణులు. నమ్మకం కలగటం లేదా.. అయతే వివరంగా వివరాలు చెబుతాను .. 1. ఎప్పుడయినా మెడ దగ్గర విపరీతమైన నొప్పిగా అనిపించిందా? అలా అయతే మీ కంటే ముందే మీ కండరాలు మీలోని ఒత్తిడిని గుర్తించాయి అని తెలుసుకుని రిలాక్స్ అవ్వండి వెంటనే. ఒత్తిడి మనసు మీదే కాదు కండరాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది, దాంతో అవి పట్టేసినట్టు అవుతాయి.. బ్రీతింగ్ కు సంబంధించిన వ్యాయామాలు ఆ సమయం లో ఒత్తిడిని, కండరాల ఇబ్బందిని తగ్గిస్తాయి. 2. కళ్ళు అదరటం, మంటగా అనిపించటం వంటివి కళ్ళు ఒత్తిడికి గురయ్యాయని సూచిస్తాయి. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ఓ పది నిముషాలు రిలాక్స్ అవ్వటం మంచిది. కాదని మొండిగా పనిచేస్తే ఆ ఒత్తిడి మనసుని చేరుతుంది. 3. గోళ్ళు కోరుకుతున్నారా? అయతే ఏదో విషయంలో మీరు ఒత్తిడికి గురయ్యారని అర్ధం. ఈ విషయం అని ఆలోచనలో పడకండి.. తెలీకుండా గోళ్ళు కొరుకుతుంటే... చక్కగా ఓ మంచి పాట వినండి, వేడి వేడి, టీ తాగండి... మనసు తేలిక పడుతుంది. 4. ఒకోసారి ఎందుకో తెలియదు.. అస్సలు నిద్ర పట్టడం లేదు అంటారు చాలామంది. ఆ ఎందుకో వెనక ఒత్తిడి దాగుందని తెలుసుకోరు. నిజానికి ఏదో ఆందోళన మనసులో నిండి వుంటే అది హార్మోన్ల మీద ప్రభావాన్ని చూపించి నిద్రని దూరం చేస్తుంది. బాగా ఒత్తిడిలో వుంటే కంటి నిండా నిద్ర కరువే. అందుకు పరిష్కారం రోజు రాత్రి పడుకునే ముందు ఓ పది నిముషాలు ధ్యానం వంటిది చేయటం. మంచి మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవటం. నిద్ర వచ్చేదాకా ఇంటర్నెట్ ముందో, టీవీ ముందో గడిపితే అది ఒత్తిడిని మంరింత పెంచుతుంది కాని తగ్గించదు. నచ్చిన పుస్తకం చదవటం కూడా మనసుని రిలాక్స్ చేస్తుంది. 5. అన్నీ మరచిపోతున్నా ఈ మధ్య.... అనిపిస్తే... కచ్చితంగా ఒత్తిడిలో ఉన్నట్టే. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువగా వుంటే ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. దాంతో చాలా విషయాలు మర్చి పోతుంటాం. ఆ మార్చి పోవటం మళ్ళీ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సర్కిల్ ని బ్రేక్ చేయాలంటే ఒత్తిడికి చెక్ చెప్పటం ఒక్కటే పరిష్కారం. రోజూ కొంత సేపు వ్యాయామం చేయటం, మెడిటేషన్ వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఒత్తిడి ఎప్పుడు, ఎందుకు వస్తుందో తెలియదు. ఒకోసారి చిన్న విషయాలు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకు అని తీవ్రంగా ఆలోచించే కంటే... ఒత్తిడి దరిచేరకుండా మనం ఏం చేయగలం అన్నది తెలుసుకుని, అది పాటించటం మంచిది. ఇందుకు నిపుణులు చెప్పేది ఒక్కటే... మీ మనసుకు నచ్చే పనుల కోసం రోజూ కొంత సమయం కేటాయించండి. రోజు వారి ఒత్తిడులకి ఇదే మంచి పరిష్కారం అని. సో మీకు ఇష్టం అయినది ఏంటో అది చేయండి.. ఒత్తిడికి దూరంగా వుండండి. మనలని అన్నివిధాలా ఇబ్బంది పెట్టె ఒత్తిడిని సకాలంలో గుర్తించి... అందులోనుంచి బయట పడటం అన్నివిధాలా ఏంతో ముఖ్యం. 

మానవత్వ పరిమళం

ఇది చిన్న పిల్లల కథే... కానీ మనం కూడా అందులో నుంచి నేర్చుకునేది ఎంతో కొంత ఉందనిపించింది. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి నలుగురు కొడుకులు. నలుగురూ అన్ని విద్యల్లో ఆరితేరిన వారే. తెలివైన వారు కూడా. అయితే ఓ రాజుగా రాజ్యభారాన్ని తీసుకునే వారికి తెలివితేటలు, సకల విద్యలే కాదు ధర్మం, న్యాయం వంటి వాటిపైనా కూడా అవగాహన ఉండి తీరాలని నమ్మిన ఆ రాజు తన నలుగురు కొడుకులని పిలిచి ఇలా చెప్పాడు. మీ నలుగురు రాజ్యంలో తిరగండి. మీకు ఎవరు అందరికంటే నిజమైన ధర్మాత్ముడని అనిపిస్తాడో అతనిని నా దగ్గరకి తీసుకురండి అంటాడు. అలా ఎవరైతే నిజమైన  ధర్మాత్ముడిని గుర్తించి తెస్తారో వాళ్ళనే రాజుగా నియమిస్తాను అంటాడు. రాజు చెప్పిన మాటలు విన్న అతని నలుగురు కొడుకులు గుర్రాలెక్కి రాజ్య సంచారానికి బయలుదేరుతారు. కొన్నాళ్ళు గడిచాయి. ఇంతలో రాజుగారి పెద్దకొడుకు ఓ శేఠ్‌ను వెంటపెట్టుకు వస్తాడు. అతని గురించి సభలో చెప్పమంటాడు  రాజు. ఈ శేఠ్‌ నిత్యం ఎన్నో దానధర్మాలు చేస్తుంటాడు. పూజలు, వ్రతాలు చేస్తుంటాడు. ఇతనిని మించిన ధర్మాత్ముడు నాకెవరూ కనిపించలేదు అంటాడు రాజు పెద్దకొడుకు. అది విన్న రాజుగారు "నిజంగా ధర్మాత్ముడే" సంతోషం అంటూ ఆ శేఠ్‌ను సత్కరించి పంపిస్తాడు.  ఆ తర్వాత రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువస్తాడు. ఆ బ్రాహ్మణుడు అన్ని తీర్థయాత్రలు కాలినడకన చేసాడని, అసత్యం పలకడని, కోపం లేనివాడని చెపుతాడు. రాజుగారి రెండవ కొడుకు తీసుకువచ్చిన బ్రాహ్మణుడి గురించి విన్న రాజుగారు సంతోషించి అతనికి కానుకలిచ్చి, సత్కరించి పంపిస్తాడు.  ఆ తర్వాత మూడో కుమారుడు ఓ బాబాజీని వెంట పెట్టుకువస్తాడు. ఆ బాబాజీ ఎంతో నిష్టతో తపస్సు చేస్తుంటాడని, నీరు తప్ప మరేది తీసుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతాడు. బక్కచిక్కిన శరీరంతో, తేజస్సు నిండిన కళ్ళతో ఉన్న ఆ బాబాజీకి నమస్కరించిన రాజు. ఇతను కూడా ధర్మాత్ముడేనని చెబుతాడు. ఇలా ముగ్గురు కొడుకులు తీసుకువచ్చిన వ్యక్తులని సత్కరించి పంపిన రాజు తన నాలుగో కొడుకు కోసం ఎదురుచూస్తుంటాడు.  కొన్నాళ్ళకి నాలుగో కొడుకు ఓ బక్కచిక్కిన, మాసిన బట్టలు వేసుకున్న ఓ రైతుని వెంటబెట్టుకువస్తాడు. అతనిని చూసి సభలో అందరూ నవ్వుతారు. పొట్ట కూటికోసం మన్నులో పనిచేసే ఇతను ధర్మాత్ముడా! అని హేళన చేస్తారు. రాజుగారు అందరిని ఆగమని ఇతను ధర్మాత్ముడు అని ఎలా గ్రహించావు అని కొడుకుని అడుగుతాడు. అందుకు అతను ఈ రైతు గాయం తగిలిన కుక్కని చేరదిసి దాని బాగోగులు చూస్తున్నాడు. అలాగే తను తినే నాలుగు మెతుకులలోనే కొంత పశుపక్ష్యాదులకి, నిస్సహాయులకి ఇస్తున్నాడు. అందరికంటే ఇతనే ధర్మాత్ముడనిపించి తీసుకు వచ్చాను అని చెబుతాడు.  రాజుగారు ఆ రైతుని సత్కరించి కానుకలు ఇచ్చి అందరికంటే ఇతనే గొప్ప ధర్మాత్ముడని ప్రశంసిస్తాడు. పూజలు, వ్రతాలు, దానధర్మాలు, తపస్సు ఇవన్నీ గొప్ప ధర్మాలే. కానీ అన్నిటికంటే గొప్ప ధర్మం నిస్సహాయ స్థితిలో ఉండి, అర్థించటం కూడా రాని ప్రాణిని ఆదుకోవటం, అలాగే ఉన్నదానిలోనే నలుగురికి పెట్టడం. ఇతరులకి సహాయపడే ఇతని ధర్మమే నిజమైన ధర్మం అంటూ నాలుగో కొడుకుని తన తరువాత రాజుగా ప్రకటిస్తాడు రాజు. ఇది కథ మనం గ్రహించాల్సిన అంశామేదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు కదా.  -రమ ఇరగవరపు

ఆనందాలని అందిపుచ్చుకుందాం

  ఇప్పుడు అన్నీ స్లీక్ మోడల్సే. చక్కగా, చూడముచ్చటగా వుండే డిజైన్లదే హవా అంతా. మరి వాడే వస్తువులకే అది పరిమితమైతే ఎలా? మన జీవన విధానం కూడా స్లీక్‌గా, చూడముచ్చటగా వుండద్దూ! ఆనందంగా ఉండటానికి సింప్లిసిటీని మించిన సీక్రెట్ లేదుట. కాబట్టి అనవసరమైనవి వదిలించుకుంటూ, అవసరమైన వాటిని చేర్చుకుంటే మన జీవన విధానాన్ని చూడముచ్చటగా, పొందికగా రూపొందించుకోవడం మన చేతుల్లోనే వుంటుంది. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, పున్నమి నాటి చంద్రుణ్ణి హాయిగా చూస్తూ రిలాక్సయ్యి ఎన్ని రోజులైంది? ఈ మధ్యకాలంలో సాధ్యపడిందా? సమాధానం అవును అయితే పర్వాలేదు.  కానీ కాదంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇప్పటి హడావిడి, పని ఒత్తిడి చిన్న చిన్న ఆనందాలని సైతం కోల్పోయేలా చేస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటగా ఆ చిన్న ఆనందాలని అందిపుచ్చుకోవాలి. ఇప్పటి అలవాట్లలో అనవసరమైనవి, ఆనందాన్ని ఇవ్వనివి ఏవైనా వుంటే వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకోవాలి. ఇక ఆ తర్వాత ఆ స్థానంలో మనసుని గెలిచిన ఇష్టాల్ని అలవాట్లుగా మార్చుకోవటమే. కొంచెం కష్టమైనా ప్రయత్నిస్తే కొన్ని రోజులకి ఉషోదయాన్ని చూస్తూ కప్పు కాఫీ తాగడంలోని హాయిని రుచి చూడచ్చు.   -రమ

భయం ఎందుకు.. పదండి ముందుకు...

  ఓ చిన్న కథ చెప్పుకుందామా? అనగనగా అది ఒక ఊరు. ఆ ఊరు నుంచి పట్టణ ప్రాంతానికి వెళ్ళాలంటే ఓ కొండ దిగి అడవి దాటి వెళ్ళాలి. ప్రతీరోజు చాలామంది వ్యాపార పనుల మీద గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళిరావాల్సి వుంటుంది. ఒకరోజు కొంతమంది గ్రామస్థులు అలా ఆ కొండ దిగి అడవి దారి వెంబడి వెళుతుంటే ఎక్కడనుంచో గంట ఆగకుండా మోగుతూనే వుంది. చుట్టూ చూశారు వారి కాళ్ళకి ఏదో తగినట్టు అయ్యి చూస్తే  అక్కడ ఓ వ్యక్తి అస్థిపంజరం పడివుంది. దూరం నుంచి గంట మోత. ఒక్కసారిగా భయపడిపోయారు ఆ గ్రామస్థులు. ఒకటే పరుగు. గ్రామం చేరేదాకా ఆగలేదు. ఇలా గ్రామం చేరిన ఆ గ్రామస్థులు మిగతా వారితో వారు చూసినది, విన్నది చెప్పారు. వారు చెప్పింది విన్న మిగతా గ్రామస్థులు కూడా ఆ శబ్దం ఏమయివుంటుంది... ఎలా వస్తోంది అని తర్జనభర్జన పడ్డారు. రకరకాల ఊహాగానాలు... అది ఏమయివుంటుందా అని. చివరికి ఎవరో అన్నారు అది గంటల రాక్షసి అయ్యివుంటుంది అని. అవునవును అంటూ మరికొందరు వత్తాసు పలికారు. దాంతో అందరూ మరింత భయపడిపోయి  ఇక ఆ రోజు నుంచి ఆ అడవి వెంబడి వెళ్ళటం మానేశారు. కానీ అలా ఎన్నాళ్ళని? గంటల శబ్దం అయితే ఆగటం లేదు. భయంతో గ్రామస్తులందరూ ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్నీ ఊరిపెద్దకి చెప్పారు కూడా. అయితే ఉన్నపళంగా అందరూ ఊరు ఖాళీ చేయటమంటే పొలాలు, ఇళ్ళు, అస్తులు ఏమవ్వాలి? ఏదయినా దారి వెతుకుదాం కొంతకాలం ఓపిక పట్టమన్నాడు గ్రామస్థులని. అప్పుడు ప్రభావతి అనే గ్రామస్తురాలు ముందుకు వచ్చి నేను ఆ గంటల రాక్షసి సంగతి ఏంటో తెలుసుకుంటాను. అందరూ ఓపిక పట్టండని కొన్ని మామిడి పళ్ళు తీసుకుని అడవిదారి పట్టింది. అయితే గ్రామస్తులంతా హేళన చేశారు. నీవల్ల ఏం అవుతుంది అని. ప్రయత్నించటంలో తప్పులేదు కదా. ఆ రాక్షసి చంపితే నేను ఒక్కర్తినే చనిపోతాను. కానీ అది ఒట్టి భయమే అని తెలిస్తే అందరం బతుకుతాం అని ముందుకు కదిలింది ప్రభావతి. నిజానికి రాక్షసులు ఉండరని ప్రగాఢంగా నమ్మిన ప్రభావతి అసలు సంగతి తెలుసుకోవటానికి అడవి దారి పట్టింది. అలా అడవి వైపు వెళ్తూ ప్రభావతి ఆలోచించటం మొదలు పెట్టింది. ఆ గంట శబ్దం వినిపించినప్పటి నుంచి నిజానికి ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. అంటే ఆ గంట ఏ జంతువులో మోగిస్తుండాలి. ఆ గంట శబ్దం వస్తున్న చోటికి వెళ్ళి తన వెంట తెచ్చిన మామిడి పళ్ళని వెదజల్లి ఓ చెట్టు చాటున దాక్కుంది. కాసేపటికి ఆ మామిడి పండ్ల వాసనకి ఓ కోతుల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ కోతి చేతిలో గంట వుంది. ఆ కోతి గంట పక్కన పడేసి పళ్ళు తింటుంటే నెమ్మదిగా గంట తీసుకుని గ్రామానికి చేరింది ప్రభావతి. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు ప్రభావతి చెప్పింది విని. ఆ గంట తమ ఊరి చివర దేవాలయంలోనిదని గుర్తించారు. ఆ దేవాలయంలో గంట దొంగిలించిన దొంగ అడవి గుండా పారిపోతుండగా పులి అతన్ని చంపి తినింది. ఆ గంట కోతులకి దొరికింది. తమాషా శబ్దం రావటంతో కోతులు ఆ గంటతో ఆడుతున్నాయి. గంటల రాక్షసి లేదు అని తెలుసుకున్న గ్రామస్థులు హాయిగా ఊపిరి తీసుకున్నారు. ప్రభావతిని మెచ్చుకున్నారు. ఒకోసారి మనం కూడా ఏవో కొన్ని భయాలతో అడుగు ముందుకు వేయటానికి సందేహిస్తాం. అయితే ఆ ఒక్క అడుగు వేయగలిగితే చాలు ఇక అడుగుల వడి ఆగదని తెల్సినా ఆ ఒక్క అడుగే వెయ్యలేకపోతాం. కానీ చిన్న లాజిక్ ఆలోచిస్తే చాలు భయాలని ఈజీగా వదిలించుకోవచ్చు. -రమ ఇరగవరపు

మినీ డిజిటల్ ఫోటో కీరింగ్..

      నచ్చిన వ్యక్తికీ మెచ్చే బహుమతి ఇవ్వాలనిపిస్తుంది. అదీ రొటీన్ గా కాకుండా ఏదైనా ప్రత్యేకంగా ఉండేదయితే బావుంటుందని కూడా అనిపిస్తుంది కదా....అలా ఈ సారి మీరు ఎవరికైనా ప్రత్యేకంగా ఏదన్నా బహుమతి ఇవాలి అనుకుంటే ఇది try చేయండి మీ స్నేహితులు కావాల్సిన వారు ఆ బహుమతిని ఇష్టపడతారు. అదే 'కీ చెయిన్'....   ఏంటి కీ చెయిన్ అని  తీసిపారెయ్యకండి నేను చెప్పేది మాములు కీ చెయిన్ గురించి కాదు. 'మినీ డిజిటల్ ఫోటో కీరింగ్ ' మినీ డిజిటల్ అనే పేరు వింటేనే అర్ధమైపోతుంది కదా అవును ఇందులో ఫోటోలు స్టోర్ చేయొచ్చు. సుమారు 60  ఫోటోలు దాకా స్టోర్ చేసుకునే అవకాశం వుంటుంది. అల అని ఇదేదో చాలా పెద్ద ఆకారంలో ఉంటుందనుకుంటున్నారా? లేదండి మనం వాడే మాములు కీ చెయిన్ లా అంతే వుంటుంది.  హృదయాకారంలో , ఎన్నెన్నో రంగుల్లో దొరికే ఈ కీ చెయిన్ లో నచ్చిన ఫోటోలని దాచుకోవచ్చు అప్పుడప్పుడు చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. ఆ చార్జర్ కూడా ఈ కీ చేయితో దొరుకుతుంది. సో ఈ సారి మీ స్నేహితులకి కావాల్సిన వారి ఫోటో లని చక్కగా ఇందులో స్టోర్ చేసి వాళ్ళకి బహుమతిగా ఇచ్చారనుకోండి థ్రిల్ అయిపోతారు. -రమ

ఇంటి అలంకరణలో ఫ్లవర్‌వాజ్‌ ప్రత్యేకత

  తాజా పూలతో ఫ్లవర్‌వాజ్‌ను అలంకరించి హాలులోని టేబుల్‌పై పెడితే ఇంటికి అందంగా ఉండడమే కాకుండా, మనసుకు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి అటువంటి అలంకరణలో ఎలాంటి పువ్వులు వాడాలి, వాటిని ఎలా అలంకరించాలో తెలుసుకుందామా!   - ఫ్లవర్‌వాజ్‌లో పువ్వులు అలంకరించేటప్పుడు, పువ్వులతో పాటు మధ్యమధ్యలో ఆకులు కూడా పెట్టాలి. ఆకులు నీళ్లలో మునగకూడదు. అదే పూల ఆకులు కాకుండా వేరు ఆకులతో అలంకరిస్తే ఫ్లవర్‌వాజ్‌ అందంగా ఉంటుంది. - బాగా వికసించిన ముదురురంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి.   - ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకేచోట కాకుండా మ్యాచింగ్‌ ఉండేలా చూడాలి. పువ్వుల రంగులు ఆ గది రంగుకి మ్యాచ్ అయ్యే విధంగా పెట్టాలి. అలాగని మనకు నచ్చని రంగుల పువ్వులను పెట్టడం కాదు. అలా పెట్టే పువ్వులు ముందుగా మనకు ఆహ్లదాన్ని కలిగించాలి. - ఫ్లవర్‌వాజ్‌ లోపల, బయట శుభ్రంగా కడిగి అందులో నీరు నింపాలి. నీళ్లల్లో కాస్తంత ఉప్పు కలిపితే పువ్వులు ఎక్కువ కాలం ఉంటాయి. - ఫ్లవర్‌వాజ్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నచోట పెట్టకుండా తాజా గాలి వచ్చే చోట పెట్టాలి. దీనివల్ల తాజాగా ఉంటాయి.   - ఇంట్లో ఇండోర్‌ ప్లాంట్స్‌, మనీప్లాంట్స్‌ కొన్ని రకాల క్రోటన్‌ మొక్కలు కుండీలో వేసి గదుల్లో డ్రాయింగ్‌రూంలో అలంకరించుకోవచ్చు. - ఫ్లవర్‌వాజ్‌ అనేది కేవలం పువ్వులు మాత్రమే బాగుంటే సరిపోదు. ఆ పువ్వులు పెట్టే ఫ్లవర్‌వాజ్‌ కూడా అందంగా, ఆకర్షనీయంగా ఉండేలా చూసుకోవాలి.

నచ్చిన ముఖాలు ఎంచక్కా మనముందే..

ప్రపంచం వేగంగా పరిగెడుతుంటే, ఆ వేగానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు జరిగిపోతున్నాయి. కొన్ని మన జీవితాన్ని, జీవన విధానాన్ని సౌకర్యవంతంగా చేస్తే, మరికొన్ని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈమధ్య అందర్నీ విపరీతంగా ఆకర్షిస్తున్న మరో ప్రయోగం ఏమిటంటే, సాధారణంగా ఇష్టమైన వారి ఫొటోని మన హాలులో పెట్టుకుంటాం కదా. కానీ, వారి ముఖాన్నే ఎంచక్కా పెట్టుకోగలిగితే... ఆ ముఖంలో విలువైన వస్తువులను దాచుకునే ఏర్పాటువుంటే.. ఉంటే ఏంటి? ఆ అవకాశం వుంది ఇప్పుడు! ఎలా అంటే, మనం ఒక ఫొటో ఇచ్చామనుకోండి. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అచ్చం అలాంటి ముఖాన్నే తయారుచేసి ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు. లోపలంతా ఖాళీగా వుండే ఈ రబ్బరు ముఖాలకు డబ్బాల్లా పైన మూత తీసుకుని పెట్టుకునే వీలుంటుంది. ఇలా మనకిష్టమైన వాళ్ళని ఎవరినైనా మన కళ్ళముందు ఉంచుకోవచ్చు. .....రమ

చాకొలేట్ తో ఉత్సాహం..

  చాకొలేట్ తినాలని పదే పదే అనిపించడం వెనుక పోషక పదార్ధాల లోపం వుందంటున్నారు పరిశోధకులు. పిల్లలకు ప్రోటీన్లు సమృద్దిగా వుండే పదార్ధాలను పెడితే వారి మనసు చాకోలెట్స్ మీదకి మళ్ళదు అని కూడా చెబుతున్నారు వీరు. నిజానికి ఆహార పదార్దాల సమతుల్యత పాటిస్తూ భోజనం చేసే పిల్లలకు చాకోలేట్లు ఎటువంటి ఇబ్బంది కలిగించవట.  సాదారణ స్థాయి తీపి చాకోలేట్లను ప్రకృతి సహజమైన చక్కరతో తయారుచేస్తారు. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఏవిదమైన హాని కలిగించవు. పైగా డ్రై ఫ్రూట్స్ కలిగిన చాకోలెట్స్ ఆరోగ్యానికి మంచివని కూడా చెబుతున్నారు. చాకొలేట్ తిన్నప్పుడు మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేస్తుంది. ఇది మనిషికి మంచి ఉత్స్తాహం అందిస్తుంది. డిప్రెషన్ భావాన్ని పోగొడుతుంది. అలాగే చాకొలేట్లో ఫినోలిక్ మూలకాలు వుంటాయి.  ఇవి రక్త నాళాలతోకలసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు అంత త్వరగా రావు అంటున్నారు పరిశోధకులు. అలాగే చాకొలేట్ సహజమైన బాధనివారిని అరటి పండులో కన్నా అధికమైన ప్రోటీన్లు వుంటాయట. సో ఇప్పుడు చెప్పండి చాకొలేట్ ను తినడం మంచిదా కాదా ? పిల్లలతో పాటు మనము ఓ చాకొలేట్ ను నోట్లో వేసుకుందామా ? ఆలోచించండి... -రమ