అంతర్జాతీయ పరిశోధనారంగంలో అగ్రగామిగా..
posted on Dec 2, 2020 @ 9:30AM
అందుబాటు ధరల్లో వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో భారత్ బయోటెక్
వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి తమ దేశం రావాలన్న సుదీర్ఘ లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు వారిద్దరు. వారి ఆలోచనతో 1996లో బ్యాంకు రుణాలతో ప్రారంభమైంది భారత్ బయోటెక్ - ఈనాడు అంతర్జాతీయ వ్యాక్సిన్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. కోవిడ్ లాంటి భయంకరమైన వైరస్ నుంచి రక్షణ కల్పించే కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉంది. ఈ రోజు దేశప్రధాని నరేంద్ర మోడి స్వయంగా వచ్చి ఈ సంస్థ చేస్తున్న పరిశోధనలను అభినందించడం వెనుక దాదాపు పాతికేళ్ల శ్రమ ఉంది. ఇద్దరు దంపతుల ఆశయం ఉంది. ఒకరు పరిశోధనలపై దృష్టి పెడితే మరొకరు మార్కెటింగ్ పై పట్టు సాధించారు. వారే భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా. ఇప్పుడు భారతదేశంలో హైపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన ప్రతిబిడ్డకు ఇస్తున్నాం అంటే అందుకు కారణం ఈ సంస్థే. అంతేకాదు ప్రపంచంలో 1 వ వైద్యపరంగా నిరూపితమైన కంజుగేట్ టైఫాయిడ్ వ్యాక్సిన్, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, రోటవైరస్ వ్యాక్సిన్, జికా వ్యాక్సిన్ ఇలా అనేక వ్యాక్సిన్ లను అందించిన ఘనత భారత్ బయోటెక్ సొంతం. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రజాజీవనాన్ని స్తంభింపచేసిన కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ అతి తర్వలో అందుబాటు ధరలో తీసుకువచ్చే ప్రయత్నం విజయానికి చేరవలో ఉంది. మరి ఇదంతా సాధించడం వెనుక సుచిత్ర ఎల్లా అకుంఠిత దీక్ష ఉంది. డిగ్రీ చేతపట్టుకుని అమెరికా వెళ్ళిన సుచిత్ర మార్కెటింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. గృహ ణిగా.. ఉద్యోగినిగా.. పారిశ్రామికవేత్తగా మారిన సుచిత్ర ఎల్లా ప్రస్థానం ...
బి.ఎస్. దేవరాజులు, కాంచనమాల దంపతుల రెండో సంతానం సుచిత్ర. దేవరాజులు నైవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్లో మైనింగ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. కాంచనమాల గృహిణి. వారికి ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మసైర్యం కోల్పోవద్దని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నారు. మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఎల్లా కృష్ణతో వివాహం జరిగింది. వారి పెళ్లినాటికి కృష్ణ ఎల్లా మాలిక్యూలర్ బయాలజీలో పరిశోధన చేస్తున్నారు. పెళ్లి తర్వాత వారు అమెరికా వెళ్లారు. వారికి ఇద్దరు పిల్లలు. అక్కడ వచ్చే స్టైఫండ్ తో బతకడం కష్టం కావడంతో సుచిత్ర ఉద్యోగంలో చేరారు. చంటిపిల్లలను చూసుకోవడం కోసం ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీసు వెళ్లేవాళ్లు. శని, ఆదివారాలు కృష్ణ రిసెర్చ్ కు సెలవు కావడంతో ఆ రెండురోజులు సుచిత్ర డే షిప్టులకు వెళ్లేవారు. అలా షిఫ్ట్ ల ప్రకారం ఉద్యోగాలు చేస్తూ ఇంటిబాధ్యతలు పంచుకునేవారు. ఒక వైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి బాధ్యతలు చూస్తూనే బిజినెస్ మార్కెటింగ్ లో పీజీ పూర్తిచేశారు సుచిత్ర.
సుదూర లక్ష్యంతో స్వదేశానికి...
కృష్ణ ఎల్లా పరిశోధన పూరైయిన తరువాత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. అదే సమయంలో ఇండియా విదేశాల నుంచి వాక్సిన్లను దిగుమతి చేసుకోవడం, అనేక చిన్నదేశాలకు వాక్సిన్స్ ఉత్పత్తికి అవసరమైన నిధులు సమకూర్చుకునే శక్తి లేక పోవడం గమనించి వారిద్దరూ బాధ పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. తన పరిశోధనానుభవాన్ని స్వదేశం కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇండియాకు తిరిగి రావాలనుకున్న వారి నిర్ణయం విని స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. బంధువులు కూడా ఇక్కడకు వచ్చి ఎం చేస్తారు.. అంటూ నిష్టూరంగా మాట్లాడారు. అయినా వారు వెనుకడుగు వేయలేదు. తమ విజ్ఞానం స్వదేశానికి ఉపయోగపడాలి. స్వంతంగా వ్యాక్సిన్స్ తయారుచేసుకునే స్తోమత ఇండియాకు రావాలి. చిన్న చిన్న దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయాలి అన్న లక్ష్యం తో స్వదేశానికి పయనమయ్యారు.
పరిశోధనారంగంలో వ్యాక్సిన్ తయారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి వద్ద తగిన ఆర్థిక వనరులు లేవు. కృష్ణ పరిశోధనానుభవం, సుచిత్ర మార్కెట్ మెలకువలు, స్నేహితుల సహకారంతో బ్యాంక్ లో అప్పులు తీసుకుని 1996లో భారత్ బయోటెక్ ఏర్పాటు చేశారు. త్యాగాలకు సిద్ధపడి ఈ సంస్థను ఏర్పాటు చేసాం అంటారు సుచిత్ర. త్యాగాలు అని ఎందుకు అన్నానంటే ఆ రోజుల్లోనో.. నెలలగడువులోనోమా ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చేది కాదు. వ్యాక్సిన్ తయారి అనేది పరిశోధన.. ఆ పరిశోధన ఫలితాలు తెలియడానికి సంవ త్సరాలు.. కొన్నిసార్లు దశాబ్దాలు పడుతుంది. అయితే డాక్టర్లు వీటిని ప్రిఫర్ చేయాలి. మనపై ఎంతో నమ్మకం కుదరాలి. అన్నీ అనుకూలించాలంటే.. ఓపిక, పట్టుదల ఉండాలి.
పరిశోధనారంగంలో అంత పెట్టుబడి పెట్టి, ఫలితాలకోసం ఎదురుచూసేవారు చాలా తక్కువ. ప్రొడక్ట్ గురించి చెప్పడమే తప్ప .. ఫలితాలను వెంటనే చూపించలేం. మా లక్ష్యం ఎమిటో స్పష్టంగా ఉంది కాబట్టి, శాయ శక్తుల శతవిధాల ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి అనుమతి పొందాం. ప్రొడక్ట్ మార్కెట్లోకి రావడానికి, వచ్చిన తరువాత ఫలితాలు తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. మా ఉత్సాహాన్ని, పరిశోధనారంగంలో ఉన్న అనుభవాన్ని, మనదేశంలో వ్యాక్సిన్ తయారీకి ఉన్న కొరతను గమనించిన ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించింది. ఇప్పుడు ప్రభుత్వానికి హైపటైటిస్ - బి వ్యాక్సిన్, ఇతర వ్యాక్సిన్స్ లతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థకు దాదాపు 150 పేటెంట్స్ ఉన్నాయి.
దేశం పేరును అంతర్జాతీయంగా నిలపాలనే...
చారిత్రకంగా, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ముందు ఉంటుంది. ఇతర దేశాల మాదిరిగా బిలియన్ డాలర్లతో పరిశోధనలు చేసే ఆర్థిక స్థితి లేకపోయినా మేధోసంపత్తిని పెట్టుబడిగా పెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించి, ప్రపంచఖ్యాతి పొందిన దేశం మనది. అందుకే మా సంస్థకు మా పిల్లల పేర్లో, ఇతర పేర్లో పెట్టకుండా భారత్ బయోటెక్ అని నమోదు చేశాం. వ్యాక్సిన్ తయారిలోనూ మన దేశం అంతర్జాతీయంగా పేరు సాధించాల న్నది మా ఆకాంక్ష, వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి రావాలి అన్నదే తమ లక్ష్యం అంటారు సుచిత్ర ఎల్లా.
మహిళా సాధికారతే జాతీయ సంపద...
చాలామంది ఆడవారికి చదవు ఉంటే చాలు అనుకుంటారు. కాని, విజ్ఞానం. విషయపరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఖాళీగా ఉంటే దేశ సంపద నిరూపయోగంగా ఉన్నట్టే కదా.. సంపద అంటే ఆస్తులు, ధనమే కాదు..ఉత్పాదక శక్తి. ఆలోచన ఉన్న వ్యక్తి ఖాళీగా ఉండటం కూడా అభివృద్ధి నిరోధకమే అన్నది నా అభిప్రాయం. ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన మహిళలు కూడా వివాహం తరువాత, పిల్లలు పుట్టిన తరువాత ఉద్యోగాలు మానేస్తారు. అలా చేస్తే వారి కెరీర్ డెబ్బతింటుంది. కేవలం వారు ఎన్నుకున్న రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అవగాహన పెంచుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎంటర్ ప్రెన్యూర్ గా ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు. సంస్థను స్థాపించాలంటే చాలా విషయాలను త్యాగం చేయాలి. పాజిటివ్ థింకింగ్, కొత్తగా ఆలోచించగల నేర్పు, కష్టనష్టాలను ఎదుర్కోగల ఓర్పు కావాలి. మహిళల్లో ఈ గుణాలు ఎక్కువే. మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నప్పటికీ చాలా మంది 30 సంవత్సరాలు పై బడిన మహిళలు తమ ప్రొఫెషన్ కు దూరం అవుతు న్నారు. సామాజిక ఒత్తిడిని, వ్యక్తి గతజీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే విజయం సుసాధ్యమవుతుంది.
అందుబాటు ధరల్లో వ్యాక్సిన్స్...
కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో నేటి తరం అనేక వ్యాధులకు గురౌతున్నది. ఇక రేపటి తరం ఎలా ఉంటుందో అన్న ఆలోచనే భయంగా ఉంది. అందుకే చిన్నారులకు అనేక వ్యాధులు నుంచి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్లను మా సంస్థ తయారు చేస్తోంది. కిందిస్థాయి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తాం అంటున్నారు సుచిత్ర..