తేనెటీగలూ నేర్పుతాయి తియ్యటి పాఠాలు

తేనెటీగలు అనగానే శ్రమ గుర్తుకువస్తుంది. చిటికెడు తేనె కోసం వందలాది తేనెటీగలు పడే కష్టం గుర్తుకువస్తుంది. కానీ తేనెటీగలు అంతకు మించిన పాఠాలెన్నింటినో నేర్పుతాయంటున్నారు. జీవితానికి ఉపయోగపడే సూచనలు ఎన్నింటినో ఇస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్ని...   కలిసికట్టుగా శ్రమ విభజన గురించి చెప్పుకోవాలంటే తేనెటీగల గురించే చెప్పుకోవాలి. తేనెపట్టుని నిర్మించడం దగ్గర నుంచీ, అందులో భద్రపరచిన తేనెని రక్షించుకోవడం వరకూ... ప్రతీ తేనెటీగా తనదైన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అని తేనెటీగలు చూసుకోవు. తాము ఉన్న జట్టుకి మేలు జరగడమే వాటి ఆశయంగా ఉంటుంది.   పరిస్థితులకు అనుకూలంగా తేనెటీగల పని తేనెని సేకరించి భద్రపరచుకోవడమే కావచ్చు. అలాగని అవి కేవలం దట్టమైన అడవులలో మాత్రమే నివాసాన్ని ఏర్పరుచుకోవు. ఫలానా పూల దగ్గర తేనె ఎక్కువగా దొరుకుతుంది కదా అని అక్కడే తచ్చాడవు. ఏదో ఒక చోట తేనెపట్టుని ఏర్పరుచుకోవడం. అందులోకి తేనెని నింపేందుకు దూరదూరాల వరకూ తిరిగిరావడం... ఇదే వాటి పనిగా ఉంటుంది!   ప్రకృతికి సాయం తేనెటీగలు తేనెని తీసుకోవడమే కాదు... అవి వాలిన పువ్వుల మీద ఉన్న పుప్పొడిని మరో మొక్క దగ్గరకు చేరవేస్తాయి. అలా పరాగసంపర్కానికి (pollination) దోహదపడతాయి. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు ఇలా pollination వల్లనే ఉత్పత్తి జరుగుతుందన్న విషయం మీకు తెలుసా! అలా తను ప్రకృతి మీద ఆధారపడుతూ, తిరిగి ఆ ప్రకృతికి ఎంతో కొంత ఉపకారం చేస్తూ జీవించేస్తుంటాయి తేనెటీగలు.   జ్ఞానాన్ని సంపాదించడం తేనెటీగలు తేనె కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఓ రెండు చుక్కల కోసం ఎన్ని పూలనైనా చేరుకుంటాయి. జ్ఞానం కోసం తపించే వ్యక్తి కూడా జ్ఞానం ఉంటే అక్కడికి చేరుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కాకుండా అహంకారంతో మంకుపట్టు పట్టి నాలుగు గోడల మధ్యే ఉండిపోతే జీవితం నూతిలో కప్పలాగా నిరర్థకమైపోతుంది.   ఆత్మరక్షణకు సాటిలేదు తేనెటీగలు వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లి దాడి చేయవు. కానీ తేనెపట్టుని కదిపితే మాత్రం వాటిని ఎదుర్కోవడం మానవుడి తరం కూడా కాదు. మరీ తేనెటీగలలాగా వేటాడి వెంటాడి దాడి చేయనవసరం లేదు కానీ, అనవసరంగా తమ జోలికి రావద్దన్న హెచ్చరికను మాత్రం శత్రువులకు అందించాల్సి ఉంటుంది. - నిర్జర.  

ప్రతిభను పెంచే - Pygmalion effect

ఓ పిల్లవాడు తరగతిలో అందరికంటే వెనకబడిపోయి ఉంటాడు. ఒకో తరగతీ దాటే కొద్దీ అతను మొద్దుగా పేరు తెచ్చేసుకుంటాడు. ఇక అతన్ని బాగు చేయడం ఎవరి తరమూ కాదని అంతా నిశ్చయించుకుంటారు. ఇంతలో ఒక ఉపాధ్యాయుడి దృష్టి ఆ పిల్లవాడి మీద పడుతుంది. కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లవాడు ఓ ఆణిముత్యంగా మారతాడన్న ఆశ ఉపాధ్యాయుడికి ఏర్పడుతుంది. అంతే! అక్కడి నుంచి ఆ పిల్లవాడి జీవితమే మారిపోతుంది. ఎందుకూ పనికిరానివాడు కాస్తా... అద్భుతమైన ఫలితాలు సాధించడం మొదలుపెడతాడు.   వినడానికి ఇదంతా ఏదో సినిమాకథలాగా తోస్తోంది కదా! కానీ నిజజీవితంలో ఇది నూటికి నూరుపాళ్లూ సాధ్యమే అంటున్నారు. ఈ ప్రభావానికి ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ అన్న పేరు కూడా పెట్టారు. పిగ్మేలియన్ ఒక గ్రీకు పురాణ పాత్ర పేరు. అతను ఓ గొప్ప శిల్పకారుడట. ఏ అమ్మాయి వంకా కన్నెత్తయినా చూడని, చూసినా ఆకర్షింపబడని ప్రవరాఖ్యుడట. అలాంటి పిగ్మేలియన్‌ ఓ అందమైన అమ్మాయి శిల్పాన్ని చెక్కుతాడు. తాను చెక్కిన శిల్పాన్ని చూసి తనే మనసు పారేసుకుంటాడు. చివరికి దేవుడి కరుణతో ఆ శిల్పానికి ప్రాణం వస్తుంది. అలా ప్రాణం వచ్చిన శిల్పాన్ని పిగ్మేలియన్ వివాహం చేసుకోవడంతో అతని కథ సుఖాంతం అవుతుంది. మన ఆశలకు అనుగుణంగా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం అన్న ఆలోచనతో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ అన్న పేరు పెట్టారన్నమాట!   రోసెంతాల్‌, జాకబ్‌సన్‌ అనే ఇద్దరు పరిశోధకులు 1968లో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ ప్రతిపాదన చేశారు. తమ ప్రతిపాదనని నిరూపించడం కోసం వారు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలని ఎంచుకొన్నారు. ఆ పాఠశాలలో పిల్లలందరి ఐక్యూలని నమోదు చేశారు. ఆ తర్వాత వారి ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి వారిలో కొందరు పిల్లలు ఐక్యూ చాలా అద్భుతంగా ఉందనీ... ఆ పిల్లలు ఎప్పటికైనా మంచి ఫలితాలు సాధిస్తారనీ చెప్పారు. నిజానికి వాళ్లు సేకరించిన వివరాలు వేరు, ఉపాధ్యాయులకు చెప్పిన వివరాలు వేరు. కానీ పరిశోధకులు చెప్పిన వివరాలను నమ్మిన ఉపాధ్యాయులు, తమ నమ్మకానికి అనుగుణంగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. తెలిసో, తెలియకో అద్భుతాలు సాధించగలరు అనే పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఉపాధ్యాయులు దృష్టి పెట్టిన పిల్లలు నిజంగానే మంచి ప్రతిభను కనబరిచారు.   ఈ పిగ్మేలియన్‌ ఎఫెక్ట్‌ కేవలం బడిలోనే కాదు- ఆఫీసులో, ఇంట్లో, రాజకీయాల్లో... ఇలా మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సత్ఫలితాలను సాధిస్తుందని చెబుతున్నారు. ఎదుటివ్యక్తి పనికిమాలినవాడు అన్న భావనతో ఉంటే, అతనితో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. అలా కాకుండా అతనేదో సాధించగలడు అన్న నమ్మకంతో ఉంటే, అతని పట్ల మన ప్రవర్తించే తీరు మారిపోతుంది. మన ఆకాంక్షలు అతని మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు, అవతలివ్యక్తి కూడా ఓ నాలుగడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తాడు. పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం కాదు. ఒకోసారి మనమీద మనం నమ్మకాన్ని ఏర్పరుచుకున్నప్పుడు కూడా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం. దీన్నే self-fulfilling prophecy అంటారు.   పిగ్మేలియన్‌ ఎఫెక్ట్‌ ఏ మేరకు పనిచేస్తుంది? అది అనవసరమైన ఆకాంక్షలకు కారణం అవుతుందా! ఎదుటివ్యక్తి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తుందేమో! లాంటి సందేహాలు లేకపోలేదు. అయితే జీవితంలో ఏమీ సాధించలేము అని నిరాశ చెందే సందర్భాలలోనూ, అవతలి వ్యక్తి ఎందుకూ పనికిరాడన్న అభిప్రాయానికి వచ్చేసినప్పుడూ ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ని కాస్త పరీక్షిస్తే తప్పకుండా భిన్నమైన ఫలితం వచ్చి తీరుతుందంటున్నారు.   - నిర్జర

జీవితమే ఒక ఆట అయితే

ఆటలు జీవితంలో ఒక భాగం కావచ్చు. శారీరక వ్యాయామానికో, మనసు సంతోషంగా ఉండటానికో వాటిని మనం ఆడుతూ ఉండవచ్చు. కానీ ఆ ఆటని కనుక నిశితంగా గమనిస్తే, అందులోంచి నేర్చుకునేందుకు ఎంతో కొంత ఉంది అనిపిస్తుంది.   స్పష్టమైన లక్ష్యం - ప్రతి ఆటగాడికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. బౌలర్ అయితే వీలైనంత త్వరగా వికెట్ తీయాలనుకుంటాడు. బ్యాట్స్మెన్ అయితే వీలైనన్ని పరుగులు చేయాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటగాడైతే గోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే గోల్ కీపర్ అయితే... ఇలా ప్రతి ఒక్కరికీ తనదైన లక్ష్యం ఉంటుంది. లేకపోతే ఆట వృధాగా మారిపోతుంది. జీవితం కూడా అంతే! ఏ లక్ష్యమూ లేని మనిషి, మైదానంలో అయోమయంగా తిరిగే ఆటగాడితో సమానం.   సమస్యని ఎదుర్కోవాల్సిందే - బరిలోకి దిగాక మన సత్తువనంతా ప్రదర్శించాల్సిందే! సమ ఉజ్జీలాంటి సమస్య ఎదురుపడినప్పుడు మన శాయశక్తులా పోరాడితేనే ఫలితం దక్కేది. కళ్లు మూసుకుని అది దాటిపోతుందిలే అనుకుంటే విలువైన అవకాశం కాస్తా చేజారిపోతుంది.   పైపై మెరుగులు పనికిరావు - ఆటలోకి దిగాక డాంబికాలతో ఫలితాలు రావు. ఏదో కాసేపు పని జరుగుతుందేమో కానీ ఆఖరు విజయం మాత్రం అర్హుడికే దక్కుతుంది.   గెలుపు ఓటములను స్వీకరించాలి - ఆడే ప్రతి ఆటలోనూ గెలుపు సాధ్యం కాదు. గెలిచేవాడుంటే ఓడిపోయేవాడు కూడా ఉండి తీరాల్సిందే. ఓడిపోయాను కదా అని క్రుంగిపోతే ఇక ఎప్పటికీ అతని మనసు గెలుపు మీద లగ్నం కాలేదు. గెలిచానని విర్రవీగినా అతనికి విలువ ఉండదు. ఓడినప్పుడు మరోసారి కసిగా ఆడేందుకు ప్రయత్నించాలి. గెలిస్తే వినయంతో దాన్ని స్వీకరించాలి.   జట్టు గురించి ఆలోచించాలి - తానొక్కడినే గెలవాలి అన్న స్వార్థం చివరికి వేదననే మిగులుస్తుంది. జట్టుతో కలిసి ఆడితేనే అసలైన విజయం లభిస్తుంది. Live and Let Live అన్న సూత్రంతోనే జీవితానికైనా, ఆటకైనా అర్థం ఉంటుంది.   లోపాలను జయించాలి - ఎంతటి ఆటగాడైనా కానీ ఓ చిన్నపాటి లోపం ఉంటే చాలు, అతనిలోని నైపుణ్యాలన్నీ పనికిరాకుండా పోతాయి. స్వీయవిశ్లేషణతో ఆ లోపాలను గ్రహించి, వాటిని అధిగమించినప్పుడే విజేతగా నిలవగలడు.   క్రమశిక్షణ - సచిన్, వినోద్ కాంబ్లి ఇద్దరూ సరిసమానమైన ఆటగాళ్లే. కానీ కాంబ్లి వెనకబడిపోవడానికి కారణం అతనిలోని క్రమశిక్షణాల లేమి అంటారు. ఆటైనా, జీవితమైనా తగిన క్రమపద్ధతిలో లేకుండా అరాచకంగా సాగిపోతే ఎదుగుదలలో ఎదురుదెబ్బలు తప్పవు. - నిర్జర.

మాటే మంత్రం

అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఓసారి పెద్ద ఆపద వచ్చింది. శత్రుదేశం వారు తమ రాజుని బంధించి తీసుకుపోయారు. ఆ శత్రుదేశపు కోటలోకి అడుగుపెట్టి, రాజుగారిని విడిపించుకుంటే కానీ... తమ రాజ్యానికి భవిష్యత్తు ఉండదు. కానీ ఎలా ఆ శత్రుదేశం సాధారణమైనది కాదు. ఆ దేశానికి ఉన్న కోటగోడలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కోటగోడలను దూకి ఎలాగైనా లోపలకి ప్రవేశించేందుకు ఓ వందమంది యోధులు బయల్దేరారు. అంత పెద్ద కోట గోడని ఎవ్వరూ ఎక్కి రాలేరులే అన్న ధీమాతో శత్రుసైనికులు కోట లోపలే ఏదో పండుగ సంబరాలలో మునిగిపోయి ఉన్నారు. కోటగోడను చేరుకున్న తర్వాత తల పైకెత్తి చూసిన యోధులకు కళ్లు తిరిగిపోయాయి. ‘అబ్బే ఈ గోడని ఎక్కడం మన వల్ల కాదెహే!’ అంటూ ఓ యోధుడు ముందుగానే కూలబడిపోయాడు. మరికొందరు ఓ నాలుగడుగులు పైకెక్కి.... ‘అబ్బే ఈ గోడ నున్నగా జారిపోతోంది. దీన్ని ఎక్కడం అసాధ్యం,’ అంటూ చెట్ల కిందకి చేరుకున్నారు. అలా ఒకొక్కరే కోటగోడను ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకోసాగారు. పైగా ఎక్కుతున్నవారితో కూడా ‘ఆ కోటని ఎక్కడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఇంత ఎత్తైన కోట గోడల వల్లే, ఈ రాజ్యం ఇంత గొప్పదయ్యింది,’ అని అరుస్తూ నిరుత్సాహపరచసాగారు.   ఒకవేళ ఆ మాటలు వినిపించుకోకుండా ఎవరన్నా మరికాస్త పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే- ‘చెబుతోంది నీకే! బతికుంటే మరో రాజుని ఎన్నుకోవచ్చు. అనవసరంగా ఈ గోడని ఎక్కి నీ ప్రాణాలు కోల్పోవద్దు,’ అంటూ అరిచి గీపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకి వినిపించే మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా క్రమంగా పైకి ఎక్కసాగాడు. అలా ఎక్కే ప్రయత్నంలో, నాలుగడుగులు పైకి ఎక్కితే పది అడుగులు కిందకి జారిపోతున్నాడు. కాళ్లూ చేతులూ దోక్కుపోయి రక్తం ఓడుతున్నాడు. అయినా పట్టువిడవకుండా గోడ ఎక్కుతూనే ఉన్నాడు. అతను మూర్ఖుడనీ, చావుకి సిద్ధపడుతున్నాడనీ కింద ఉన్నవాళ్లు అరుస్తూనే ఉన్నారు. ఎట్టకేళకు ఓ అయిదు గంటలు గడిచిన తర్వాత... ఆ వ్యక్తి కోట గోడను చేరుకున్నాడు. శత్రువుల కంట పడకుండా కోట తలుపులు తీసి తన తోటివారిని లోపలకి తీసుకువెళ్లాడు.   వందమంది యోధులూ కలిసి శత్రుసైనికులను తుదముట్టించారు. తమ రాజుగారిని విడిపించుకుని విజయంతో తమ రాజ్యానికి చేరుకున్నారు. ‘ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా కూడా ఇతగాడు వెనక్కి తగ్గలేదు ప్రభూ! కోట గోడని ఎక్కేదాకి తన ప్రయత్నాన్ని విరమించలేదు,’ అంటూ ఆ ఒక్క వీరుడినీ రాజుగారికి పరిచయం చేశాడు సేనాధిపతి. తన ముందు నిలబడిన ఆ వీరుని చూసిన రాజుగారు తెగ ఆశ్చర్యపోయారు. కారణం... అతను చెవిటివాడు. ‘ఒకోసారి మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెవిన పడకపోవడమే మంచిది మహారాజా! కోటగోడను ఎవ్వరూ ఎక్కలేరంటూ తోటివారంతా అరిచిన అరుపులు ఇతనికి వినపడకపోవడం వల్లే, తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. ఒకోసారి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చెవిటివాడిలాగా ఇతరుల మాటలను వినిపించుకోకపోవడమే మంచిదేమో!’ అన్నాడు సేనాధిపతి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

అప్పటికప్పుడు టెన్షన్ తగ్గాలంటే!

ఒకప్పుడు రైళ్లు గంటకి పది మైళ్ల వేగంతో పరుగులు పెట్టేవి. ఇప్పుడో! గంటకి వంద మైళ్ల వేగం కూడా తక్కువగానే అనిపిస్తోంది. జీవితమూ అంతే... ఒకప్పుడు నిదానంగా సాగిన మన జీవితాలు ఇప్పుడు కుబుసాలు కదిలిపోయేంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇంత వేగంలో ఒత్తిడి కూడా సహజమే. మరి ఆ ఒత్తిడిని చిటికెలో తప్పించేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...   - ఒత్తిడితో కూడిన మనసు మీద శబ్దం చూపే ప్రభావం అపారం. మీకు ఇష్టమైన పాటని హమ్ చేయడమో, ప్రకృతిని తలపించే శబ్దాలను వినడమో (ఉదా॥ కెరటాలు) చేస్తే ఒత్తిడి తేలిపోతుంది. గది మధ్యలో చైనీస్ చిరుగంటలని తగిలించి, వాటి మీద మనసుని లగ్నం చేయడం కూడా కొందరికి ఉపశమనంగా ఉంటుంది.   - కాసేపు అలా వాహ్యాళికి వెళ్లడం వల్ల కూడా మనసులోని ఒత్తిడి నిదానంగా కరిగిపోతుంది. ఒత్తిడిని కలిగించే ఆలోచనలను పక్కన పెట్టి, శ్వాస మీద దృష్టిపెడుతూ నడకని సాగిస్తుంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. సమస్య గురించి కాకుండా దానికి పరిష్కారాల గురించీ, జీవితంలో అంతకంటే విలువైన విషయాల గురించీ ఆలోచించే అవకాశం దక్కుతుంది.   - ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిల్చోవాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకొని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. బయటకి వదిలే ప్రతి ఊపిరితోనూ మీలోని ఉద్వేగం తగ్గిపోతున్నట్లుగానూ, లోపలకి తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసు తేలికపడుతున్నట్లు భావించాలి.   - ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని కాసేపు గమనించండి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏదీ కుదరకపోతే కళ్లు మూసుకుని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని (ఉదా॥ జలపాతం) ఊహించుకోండి.   - ఉద్వేగం ఓ విషవలయం. ఉద్వేగంతో మన కండరాలన్నీ బిగుసుకుంటాయి. బిగుసుకుపోయిన కండరాలు మరింత ఉద్వేగానికి దారితీస్తాయి. కాబట్టి మనసు ఉద్వేగంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ఒక్కసారి మన శరీరం మీద ధ్యాస ఉంచాలి. నుదురు, పిడికిళ్లు బిగదీసి లేకుండా చూసుకోవాలి.   - ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వుని మించిన దివ్యౌషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, అలా నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు.   - శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో (ఉదా॥ టెడ్డీ బేర్), రబ్బర్ బాల్ని చేతితో నొక్కడమో, వేడి నీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పకుండా దూరం చేస్తాయి.                     - నిర్జర.

చీమలు నేర్పే జీవితపాఠాలు

గ్రహించే మనసు ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అణువణువూ ఓ జీవితపాఠాన్ని నేర్పుతుందంటారు పెద్దలు. ఇందుకు చీమలనే ఓ ఉదాహరణగా తీసుకోవచ్చునేమో. విశ్లేషించడం అంటూ మొదలుపెడితే, చీమల నుంచి ఎన్నో విలువైన పాఠాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని...   పూర్తిస్థాయి సామర్థ్యం: తాము అల్పంగా ఉన్నాం కదా అని చీమలు వెనకడుగు వేయవు. ఎంతబరువు మోయగలవో అంత బరువునీ మోసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకేనే చీమలు తమ బరువుకంటే దాదాపు 5000 రెట్లు అధికబరువుని మోయగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంటాయని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. కానీ మనుషులు అలా కాదు! ఎన్నో ఆలోచనలు చేయగల సామర్థ్యం, వాటిని అమలుపరిచే సత్తా ఉన్నా లేనిపోని పరిమితులను ఊహించుకుని గిరగీసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటివారికి చీమలు ఓ గొప్ప గుణపాఠం కదా!   వెనకడుగు వేసేది లేదు: ఆహారం కోసం బారులుగా బయల్దేరిన చీమలకి దారిలో ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి... అవి వెనక్కి వెళ్లడం జరగదు. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం ఏముంటుందా అని అన్వేషిస్తాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ ఎలాగొలా గమ్యానికి చేరుకుంటాయి. ఒకటి రెండు అడ్డంకులకు బెంబేలెత్తిపోయి చేతులెత్తేసే మనకి ఇలా నిరంతరం లక్ష్యం వైపుగా సాగిపోవడమే ధ్యాసగా ఉన్న చీమలు గొప్ప స్ఫూర్తి కదా!   కలసికట్టుగా: బలవంతమైన సర్పము/ చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! అంటాడు శతకకారుడు. చీమలు గొప్ప సంఘజీవులు అన్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. అవి తాము సేకరించిన ఆహారాన్ని మిగతా చీమలన్నింటితోనూ పంచుకునేందుకే ఇష్టపడతాయి. ప్రతి చీమా తనకు ఎదురుపడిన చీమతో దారుల గురించీ, ఆహారం గురించీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని తేలింది. తన ఆకలి తీరడమే కాదు, తన తోటివారి కడుపు నిండినప్పుడే నిజమైన తృప్తి లభిస్తుందని చీమలు బోధిస్తున్నాయి.   దూరదృష్టి: చీమల దూరదృష్టి గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే అవి పుట్టలను నిర్మించుకుంటాయనీ, ఆహారాన్ని పోగేసుకుంటాయని అంటారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందో కానీ దీర్ఘకాలం తిండికీ గూడుకీ ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా అవి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయనే విషయంలో ఏ అనుమానమూ లేదు. ఒంట్లో సత్తువ ఉండగా శ్రమించడమే కాదు, అది లేని రోజు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచనని చీమలు కలిగిస్తున్నాయి.   లక్ష్యం ఉంటుంది: చీమల్ని చూస్తే అవి నిరంతరం ఏదో వెతుకులాటలో ఉన్నట్లే కనిపిస్తాయి. ఆహారాన్ని వెతుక్కొంటూనో, దొరికిన ఆహారాన్ని మోసుకువెళ్తూనో, సాటి చీమలతో సమాచారాన్ని పంచుకుంటూనో వడివడిగా సాగుతుంటాయి. మనసుకి ఆలోచించే దమ్ము, ఒంట్లో పనిచేసే సత్తా ఉన్నంతవరకూ విశ్రమించవద్దంటూ మనకి సూచిస్తూ ఉంటాయి.   - నిర్జర.

ఉపనిషత్తులో చెప్పిన ప్రేమ

ప్రేమ ఎప్పుడూ మోహానికీ, దుఃఖానికీ కారణం అవుతుందంటారు. కానీ ప్రేమలో స్వార్థం నిండినప్పుడే అలా జరుగుతుందేమో! ఎందుకంటే నిజమైన ప్రేమ ఎదుటి మనిషికి నమ్మకం అనే రెక్కలనిస్తుందే కానీ, మోహం అనే సంకెళ్లతో తన ఎదుట బంధించుకోదు. నిజమైన ప్రేమ ఇవ్వగలిగినది ఇస్తుందే కానీ, ఫలితాన్ని ఆశించి బంధాన్ని వ్యాపారంగా మార్చేయదు. అలాంటప్పుడు ప్రేమ మోహానికీ, దుఃఖానికీ కారణం ఎలా అవుతుంది. కాదు గాక కాదు. పైగా తన ప్రేమతో ప్రతి జీవితాన్నీ వెలిగిస్తుంది. అలా వెలిగిన జీవితాలలో తన సార్థకతను చూసుకుంటుంది. ఇది ఎవరో ఒకరు చెప్పింది కాదు. ఏదో ఒక చోట అనుకునే గాలివాటు మాటా కాదు. ఆలోచన ఉన్న ప్రతి మనిషికీ తట్టిన భావం. కావాలంటే ఈ ఉపనిషత్తు మంత్రాన్ని చూడండి... యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః అని చెబుతోంది ఈశావాస్యోపనిషత్తులోని ఒక మంత్రం. ఆత్మానుభూతిని పొందినవాడికి ఈ ప్రపంచంలోని జీవులన్నీ కూడా తనలోని భాగమే అనిపిస్తుందట. ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ తానున్నానన్న భావన కలుగుతుందట. అలాంటప్పుడు ఇక తారతమ్యాలు ఎలా కలుగుతాయి? అందుకనే ఈ భావనతో ఉన్నవారికి దేనిపట్లా మోహం కానీ, దుఃఖం కానీ కలుగవు అని ఈ మంత్రం చెబుతున్న అర్థం. అదీ సంగతి! ఉపనిషత్కారులు ప్రేమని మరో మెట్టుని పైకి తీసుకువెళ్లారు. వారి దృష్టిలో ప్రేమ అంటే విశ్వజనీనమైనది. ప్రేమ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు భౌతికమైనది కాదు. మోహంతో బంధించేది, దక్కకపోతే దుఃఖించేది కాదు. ఈ లోకంలో ‘నేను’ అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ‘నువ్వు’ అన్న మాటకి అంతే అర్థం ఉందని గుర్తించడం. నువ్వు, నేను కలిస్తేనే ఈ లోకం అని భావించడం. ఆ భావనతోనే ప్రతి జీవినీ గౌరవించడం. అలాంటప్పుడు యాసిడ్‌ దాడులుండవు. అడ్డుగోడలుండవు. నేను గొప్ప, నువ్వు తక్కువ అన్న తారతమ్యాలు అసలే ఉండవు. ఇలాంటి ప్రేమ మన మనసులో నిండితే ప్రతిరోజూ ప్రేమకి పండుగే కదా! - నిర్జర.

పిల్లల్ని పెంచే తీరు ఇది కాదు

విజ్ఞానం పెరిగిపోతోంది. విద్యావంతుల సంఖ్యా పెరిగిపోతోంది. పిల్లలకి ఏం పెట్టాలి? వారిని ఎలా పెంచాలి? అనే విషయాల మీద ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అవి సరైనవనా! మనం పిల్లల్ని పెంచుతున్న తీరులో ఏవన్నా తీవ్రమైన లోపాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు పరిశోధకులు.   తీరు మారింది.. అమెరికాలోని ‘నోట్ర డాం’ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు ఒక పరిశోధనను చేపట్టారు. ఓ 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి పిల్లల్ని పెంచే తీరులో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పులు వారి వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అని తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం. ఈ పరిశీలనలో గమనించిన కొన్ని ముఖ్యమైన మార్పులు ఇవీ...   - పిల్లల్ని ఎత్తుకుని కాకుండా ఏదో ఒక చోట వారిని ఒంటరిగా వదిలివేయడం జరుగుతోంది. ఊయలలోనో, కారుసీట్ల మీదో, స్ట్రాలీల (strolley) మీదో పిల్లల్ని గంటల తరబడి ఉంచేస్తున్నారు. ఒకవేళ తమతో పాటు తీసుకువెళ్లినా కూడా ‘బేబీ కేరియర్ల’ సాయంతో వారిని కట్టేసి తీసుకువెళ్తున్నారు.   - అమెరికాలో కేవలం 15 శాతం తల్లులు మాత్రమే తమ పిల్లలకి ఏడాది వచ్చేవరకూ పాలు పట్టిస్తున్నారు. మిగతా వారంతా ‘infant formula’ పేరుతో కృత్రిమమైన ఆహారానికే ప్రాధాన్యతని ఇస్తున్నారు.   - 1970ల కాలంతో పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.   - పిల్లలు ఏడ్చిన వెంటనే వారిని బుజ్జగించడం అంత మంచిది కాదన్న అభిప్రాయం బలపడిపోయింది.   అన్నీ పొరపాట్లే.. పైన పేర్కొన్న విధానాలన్నీ కూడా పొరపాటే అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లలకు పెద్దల స్పర్శ తగులుతూ ఉండటం, తల్లిపాలను అందించడం, నలుగురైదురు చేతుల్లో పెరగడం, వారు ఏడ్చిన వెంటనే ఎత్తుకుని లాలించడం... వంటి చర్యలన్నీ కూడా వారి మానసిక, శారీరిక వికాసానికి అవసరం అంటున్నారు. పిల్లలు ఏడుస్తున్న వెంటనే వారిని లాలించడం అనేది వారి వివేకం మీద ప్రభావం చూపుతుందట. స్పర్శ, లాలనల వల్ల వారిలో ఒత్తిడి తగ్గి, భావోద్వేగాలను నియంత్రించుకునే నేర్పు అలవడుతుందట. ఇక బందీగా ఉంచకుండా స్వేచ్ఛగా మెలసనివ్వడం వల్ల చొరవ, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని చెబుతున్నారు. నలుగురి చేతుల్లో పెరగడం వల్ల విచక్షణ, వినయం, సహానుభూతి ఏర్పడతాయట.   ఫలితాలు అనుభవిస్తున్నాం.. పిల్లల పెంపకంలో ఇలాంటి మానవీయ కోణాలు చెదిరిపోవడం వల్ల ఇప్పటి తరం దూకుడుగా, క్రూరంగా, ఆత్మసాక్షి లేకుండా, జాలిదయ వంటి లక్షణాలను అతీతంగా పెరుగుతున్నారని వాపోతున్నారు. పైగా చిన్నవయసులోనే ఉద్వేగం, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. మనలోని సహానుభూతి, విచక్షణ, స్వీయనియంత్రణ వంటి లక్షణాలను కుడివైపు ఉన్న మెదడు నియంత్రిస్తుందనీ... అది నిరంతరం మారుతూనే ఉంటుందనీ చెబుతున్నారు. కాబట్టి జీవితంలో ఏ క్షణంలో అయినా సరే తల్లిదండ్రులు తమ పెంపకంలోని లోటుని గమనించి వారితో అనుబంఢాన్ని దృఢపరచుకునే ప్రయత్నం చేస్తే పిల్లవాడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని సూచిస్తున్నారు. - నిర్జర.  

అర్థం చేసుకునే మనసు

ఒక పిల్లవాడు కుక్కపిల్లలను అమ్మే షాపులోకి వచ్చాడు. ‘అంకుల్! నేను కుక్కపిల్లను కొనాలనుకుంటున్నాను. ఓ కుక్కపిల్లను కొనుక్కోవాలంటే ఎంత కావాలి?’ అని అడిగాడు. ‘కుక్కపిల్లను బట్టి 300 నుంచి 500 దాకా ఖర్చవుతుంది’ అని జవాబిచ్చాడు షాపు యజమాని.   ‘ప్రస్తుతానికి నా దగ్గర ఓ వంద రూపాయలే ఉన్నాయి కానీ, ఓసారి మీ దగ్గర ఉన్న కుక్కపిల్లను చూడవచ్చా!’ అని అడిగాడు పిల్లవాడు.   దానికి షాపు యజమాని పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్లి, అక్కడ ఓ గదిలో ఆడుకుంటున్న కుక్కపిల్లలను చూపించాడు. వాటిలో ఒక కుక్కపిల్ల కదలకుండా అలాగే కూర్చుని ఉంది.   ‘ఆ కుక్కపిల్లకి ఏమైంది? ఏమన్నా జబ్బు చేసిందా!’ అని ఆందోళనగా అడిగాడు పిల్లవాడు. ‘జబ్బు కాదూ పాడూ కాదు! దానికి ఓ కాలు పనిచేయదు. కుంటుకుంటూ నడుస్తుంది’ అని చిరాగ్గా బదులిచ్చాడు యజమాని.   ‘అంకుల్! నాకు ఆ కుక్కపిల్లే కావాలి. దాని కోసం ఈ వంద రూపాయలు తీసుకోండి’ అన్నాడు పిల్లవాడు. ‘చవగ్గా వస్తుందని ఆ కుక్కపిల్ల కావాలనుకుంటున్నావేమో! అదెందుకూ పనికిరాదు. కావాలంటే ఉచితంగానే దాన్ని తీసుకుపో!’ అని కసురుకున్నాడు యజమాని.   ‘అబ్బే చవగ్గానో ఉచితంగానో వస్తుందని కాదు. దాన్ని నేను డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. ఇప్పుడు ఇచ్చే వంద రూపాయలే కాకుండా మళ్లీ వచ్చి మిగతా డబ్బులు కూడా ఇస్తాను’ అన్నాడు పిల్లవాడు.   పిల్లవాడి మాటలతో యజమానికి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ‘నీకేమన్నా పిచ్చా! ఆ కుక్కపిల్లనే కొనుక్కుంటానని అంటావేంటి? అది మిగతా కుక్కపిల్లల్లాగా పరుగులెత్తలేదు, గంతులు వేయలేదు... కనీసం చురుగ్గా నడవలేదు’ అని కోప్పడ్డాడు యజమాని.   యజమాని మాటలకి పిల్లవాడు ఒక నిమిషం పాటు ఏం మాట్లాడలేదు. ఆ తరువాత నిదానంగా తన ప్యాంటుని పైకి ఎత్తి చూపించాడు. అతని మోకాలి నుంచి అరికాలి వరకూ లోహపు పట్టీలు వేసి ఉన్నాయి. అప్పటిదాకా పిల్లవాడి అవిటితనాన్ని యజమాని గమనించనేలేదు. ‘శరీరంలో ఒక భాగం లేనంత మాత్రాన ఆ కుక్కపిల్ల విలువ తగ్గిపోవడం నాకిష్టం లేదు. పైగా అది కూడా నాలా పెద్దగా పరుగులెత్తలేదు కాబట్టి నాకు తోడుగా ఉంటుంది. నా బాధని తనన్నా అర్థం చేసుకుంటుంది’ అన్నాడు పిల్లవాడు కన్నీళ్లని ఆపుకుంటూ!   కష్టంలో ఉన్న జీవికి కావల్సింది ఓదార్పు, ప్రోత్సాహం.... అన్నింటికీ మించి ఆ కష్టాన్ని అర్థం చేసుకునే మనసు అని తెలిసొచ్చింది యజమానికి. ..Nirjara

ఏసీ కావాలా బాబూ... ఈ స్టిక్కర్ అంటించండి చాలు!

  ఎండలు ముదిరిపోతున్నాయి.. బయట అడుగుపెడితే సూరిబాబు ఎలాగూ వేపుకు తినేస్తాడు. కనీసం ఇంటి పట్టున ఉన్నప్పుడన్నా కాస్త కనికరం చూపుతాడంటే అదీ లేదు. ఈ వేడిని భరించాలంటే ఇంటికో ఏసీ బిగించాల్సిందే! ఆ ఏసీని పోషించేందుకు కరెంటు బిల్లులు కట్టాల్సిందే! కానీ మరికొద్ది ఏళ్లలో ఈ తీరు మారిపోనుంది. అదెలాగంటే...   ఓ స్టిక్కర్ చాలు   కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు వేడిని ఎదుర్కొనే ఓ పదార్థాన్ని రూపొందించారు. ఇది మన పుస్తకాలకి వేసుకునే అట్టంత పల్చగా ఉంటుంది. కానీ ఏ వస్తువుకైనా, ఇంటి పైకప్పుకైనా దీనిని అంటిస్తే అద్భుతం చేస్తుంది. సాధారణంగా ఇప్పటివరకూ వేడిని ఎదుర్కొనేందుకు రూపొందించిన పదార్థాలన్నీ కూడా ఒకే తీరున పనిచేసేవి. అయితే సదరు వస్తువులోంచి వేడి తగ్గేలా చేయడం లేదా బయట నుంచి వచ్చే కాంతిని ఎదుర్కోవడం. కానీ కొలరాడో పరిశోధకులు రూపొందించిన పొర ఈ రెండు విధాలుగానూ పనిచేస్తుంది. వస్తువులో ఉన్న వేడిని బయటకు పంపేందుకు, సన్నటి గాజుపలకలతో కూడిన పొరని తయారుచేశారు. ఇక బయట నుంచి వచ్చే కాంతిని తిప్పికొట్టేందుకు ఆ పొర వెనక వెండిరంగు పూత పూశారు.   లెక్కలేనన్ని ఉపయోగాలు   ఈ కొత్తరకం పొర సాయంతో వేడిని ఎదుర్కొనేందుకు ఎలాంటి విద్యుత్తు కానీ నీళ్లు కానీ అవసరం లేదు. ఇలా తెచ్చుకుని ఇలా అంటించుకుంటే చాలు. ఒక ఇరవై మీటర్ల పొరని తెచ్చుకుని ఇంటి పైకప్పుకి అంటిస్తే, నిండువేసవి కాస్తా పండువెన్నెలని తలపిస్తుందంటున్నారు. అలాగని ఈ ఆవిష్కరణ మన సుఖాన్ని పెంచేందుకే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పవర్ప్లాంట్, నూక్లియర్ ప్లాంట్ వంటి పరిశ్రమలలో విపరీతమైన వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ వేడిని అదుపు చేయాలంటే లెక్కలేనంత నీరు, శీతలీకరణ యంత్రాలూ అవసరం అవుతాయి. కానీ ఈ పొరని కనుక వాటికి కప్పితే ఎలాంటి వనరులూ వృధా కాకుండా చల్లగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అరిజోనాలో ఉన్న 110 మెగావాట్ల పవర్ ప్లాంట్లకి అంటించి మరీ చూశారు. ఇక వ్యవసాయం దగ్గర నుంచీ అంతరిక్ష పరిశోధనల వరకూ విపరీతమైన వేడిని ఎదుర్కోవాల్సిన ప్రతి సందర్భంలోనూ ఇది ఉపయోగపడి తీరుతుంది.   సాధారణంగా మనం పరిశోధనల్లో చదివే విషయాలు వాస్తవరూపంలోకి రావడానికి చాలాకాలం పడుతుంది. కొన్నాళ్లకి ప్రపంచమంతా ఆ పరిశోధనని మర్చిపోతుంది కూడా! కానీ ఈ వేడిని తగ్గించే పొర మాత్రం ఇప్పుడు తుదిదశలో ఉంది. దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరఫు నుంచి భారీ నజరానా కూడా అందింది. తమ ప్రయోగాన్ని పూర్తిస్థాయి ఉత్పత్తి రూపంలోకి తీసుకువచ్చేందుకు సదరు శాస్త్రవేత్తలు ఇప్పటికే పేటెంటు కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరో రెండు మూడు వేసవికాలాలు గడిచేసరికి ఈ పదార్థం మనకి కూడా అందుబాటులోకి వచ్చేస్తుందని ఆశిద్దాం. - నిర్జర.

పరీక్షలే జీవితం కాదు... జీవితమే అసలైన పరీక్ష

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. మొన్నామధ్య ఏపీలో, ఇప్పుడేమో తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల గురించే చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలిసిన వాళ్ల ఇళ్లలో ఇంటర్ చదివే పిల్లలు ఎవరున్నారా అంటూ ఆసక్తిగా అందరూ ఫోన్లు చేస్తున్నారు. మార్కులు బాగా వస్తే అందరికీ సంతోషమే! కానీ తక్కువ వస్తేనో, లేక తప్పిపోతేనో అసలు సమస్య మొదలవుతుంది. పిల్లలు దిగాలు పడిపోవడం, డిప్రెషన్లోకి కూరుకుపోవడం, ఒకోసారి ఆత్మహత్యకి సైతం పాల్పడం జరుగుతూ ఉంటుంది. పరీక్షల్లో తప్పారన్న కారణంతో పిల్లలు తమ ఉసురుని తీసుకునే వార్తలు ఉసూరుమనిపిస్తాయి. పిల్లలు ఇలాంటి విపరీత మనస్తత్వంలోకి కూరుకుపోయినప్పుడు వారిని తిరిగి మామూలు మనుషులను చేసే సత్తా, బాధ్యతా తల్లిదండ్రుల మీద తప్పకుండా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే...     - పరీక్షా ఫలితాల తరువాత పిల్లవాడు డీలాగా కనిపిస్తుంటే అతనితో కాసేపు సమయాన్ని గడపండి. ఒకవేళ అతని దిగాలుకి ఫలితాలే కారణమైతే, అతనిలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించండి. పిల్లవాడు క్రుంగుబాటుకి లోనైన ఈ కొద్ది రోజులలో అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ కాలాన్ని కనుక వాళ్లు దాటేయగలిగితే, ఆత్మహత్య వంటి ఆలోచనలు కూడా దాటిపోతాయి. అందుకని పిల్లవాడు తిరిగి మామూలు స్థితికి వచ్చేదాకా అతన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోసేలా మీరు అతని ఫలితాల పట్ల నిరాశ చెందిన విషయాన్ని ప్రస్తావించవద్దు.     - ఇంటికి వచ్చినవారంతా పిల్లవాడి ఫలితాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి ప్రస్తావనని వీలైనంత త్వరగా ముగించేయండి. ‘కష్టపడ్డాడు కానీ...’, ‘మళ్లీ అందుకుంటాడు...’ లాంటి సానుకూలమైన వాక్యాలతోనే అతని ఫలితాల గురించి తెలియచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కళ్ల ముందే వేరొకరు, మీ పిల్లవాడిని మందలించే అవకాశం ఇవ్వవద్దు. అతిథులతో ఫలితాలకు సంబంధించిన చర్చలను కూడా వీలైనంత క్లుప్తంగా ముగించేయండి.   -  తమ పిల్లవాడి తప్పాడన్న విషయం కంటే ఇతరుల పిల్లలు పాస్‌ అయ్యారన్న బాధే చాలామందికి ఉంటుంది. ఇది మానవసహజమే! కానీ ఇలాంటి సమయాలలో పోలికలు కొంప ముంచుతాయని గుర్తుంచుకోండి. ఫలానా సుబ్బారావుగారి పిల్లవాడి సంగతి మనకి అనవసరం. అలాగే మన పిల్లవాడి స్నేహితుల ఫలితాలూ ప్రస్తుతానికి అసందర్భం. పోలికలంటూ తెస్తే పరాజయాలనూ తీసుకురండి. ఫలానా ఎడిసన్ కూడా చిన్నప్పుడు ఫెయిల్‌ అయ్యాడనో, మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి పరాజయాలను ఎదుర్కొన్నారనో చెప్పి పిల్లలను ఊరడించండి.   - పరీక్ష ఫలితాన్ని ఎలాగూ మార్చలేము. కాబట్టి అసలు ఇలాంటి ఫలితం రావడానికి కారణం ఏంటో కనుక్కొనేందుకు ప్రయత్నించండి. ఇల్లు, కళాశాల, స్నేహాలు, ఏకాగ్రత, అనారోగ్యం... ఇలా ఏ సమస్య పిల్లవాడి చదువుకి అడ్డం పడుతోందో విశ్లేషించండి. పిల్లవాడు భవిష్యత్తులో తిరిగి ఓడిపోకుండా ఆ కారణానికి తగిన పరిష్కారాన్ని కూడా సాధించండి. ఆ పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికను ఏర్పరిచేందుకు ప్రయత్నించండి. ఈ విశ్లేషణలో మీ పిల్లవాడిని కూడా భాగస్వామిగా చేసుకోవడం మర్చిపోవద్దు.   - పిల్లవాడని మరీ సుకుమారంగా పెంచడంతో ఒకోసారి వారు పరాజయాలను తట్టుకునే స్థితిలో ఉండరు. కాబట్టి ముందుగా మీ దృక్పథాలను కూడా ఓసారి సరిచూసుకోండి. పిల్లవాడికి నిరంతరం చదువే లోకంగా మారిపోతోందా? అతనిలో శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత లోపిస్తున్నాయా? అన్నది ఒక్కసారి గమనించుకోండి. ఈ విషయంలో అవసరమైతే సైకాలజిస్టుల వంటి నిపుణుల సలహాలను తీసుకోవడంలో తప్పేమీ లేదు.   ఒకరకంగా చెప్పాలంటే పరీక్షలలో బాగా తక్కువ ఫలితాలు రావడం అన్నది ఓ హెచ్చరికలాంటిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్న సూచన మాత్రమే! ఆ హెచ్చరికను గ్రహిస్తే పిల్లవాడు భవిష్యత్తులో మరిన్ని పరాజయాలు ఎదుర్కోకుండా రక్షించనవారమవుతాం. లేకపోతే వాడి జీవితాన్ని మన ఆశలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నించి భంగపడతాం!   - నిర్జర.

అన్నిటికంటే ప్రమాదకరం

అనగనగా ఓ దెయ్యం! ఆ దెయ్యం పనిచేసీ పనిచేసీ అలసిపోయింది. ఇక మనుషులని పాడు చేయడం అనే వృత్తి నుంచి విరమించుకుని ప్రశాంత జీవితాన్ని గడుపుదామనుకుంది. అందుకోసం తన దగ్గర ఎప్పటి నుంచో పోగేసుకున్న ఆయుధాలన్నింటినీ అమ్మకానికి పెట్టింది.   వృద్ధ దెయ్యం అమ్మకానికి పెట్టిన ఆయుధాలను కొనుక్కొనేందుకు పిల్లదెయ్యాలన్నీ ఎగబడ్డాయి. ఆ ఆయుధాలలో చాలా రకాలు ఉన్నాయి. మనిషి మీద మనిషిలో అసూయని పుట్టించే ఆయుధం, కోపం కట్టలు తెంచుకునేలా చేసే ఆయుధం, ద్వేషం ఎగిసేలా చేసే ఆయుధం... ఇలా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. కామం, క్రోధం, మోహం, లోభం... ఇలా అరషడ్వర్గాలనీ ఎగదోసే ఆయుధాలు వాటిలో ఉన్నాయి. కానీ ఒక మూలన ఉన్న ఆయుధమేమిటో పిల్లదెయ్యాలకి అర్థం కాలేదు. అది తరచూ వాడినదానిలా బాగా అరిగిపోయి ఉంది. కానీ దాని ధర చూస్తేనేమో మిగతా ఆయుధాలకంటే రెట్టింపు ఉంది. ‘‘అదేం ఆయుధం పెద్దాయనా! చూస్తేనేమో బాగా అరిగిపోయి ఉంది. ఖరీదేమో అంతేసి చెబుతున్నావు. అంత ఖర్చుపెట్టి సొంతం చేసుకునేందుకు దానిలో ప్రత్యేకత ఏంటి?’’ అని అడిగిందో ఔత్సాహిక దెయ్యం.   ‘‘ఆ ఆయుధం పేరు ‘నిరుత్సాహం’ నాయనా! మనిషిని నాశనం చేయడానికి మిగతా ఆయుధాలు ఉపయోగపడకపోవచ్చు. కానీ నిరుత్సాహం మాత్రం బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. దానిని ఉపయోగించి నేను నిదానంగా మనిషి మనసుని తెరుస్తాను. ఆపై క్రమంగా అతని మెదడుని ఆక్రమించుకుంటాను. ఆ నిరుత్సాహంతో మనిషి క్రుంగిపోతాడు. ఎంతటి శక్తిమంతుడైనా ఎందుకూ పనికిరాకుండా పోతాడు. విశేషం ఏమిటంటే... ఇంత జరుగుతున్నా కూడా నిరుత్సాహం అనే అస్త్రం ద్వారా నేను అతనిలో తిష్ట వేసుకున్నట్లు మనిషి గ్రహించనేలేడు. అలా తెలియకుండానే తన జీవితాన్ని వృధా చేసేసుకుంటాడు.’’ అంటూ చెప్పుకొచ్చింది వృద్ధ దెయ్యం. వృద్ధ దెయ్యం మాటలు పూర్తికాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఎంత ఖరీదైనా సరే ఆ ఆయుధం నాకు కావాలంటే నాకు కావాలంటూ పిల్లదెయ్యాలన్నీ ఎగబడ్డాయి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

మాటే మంత్రం కావాలంటే

ఏ సందర్భంలో అయినా గడగడా మాట్లాడేసినంత మాత్రాన మనకి వాక్చాతుర్యం ఉందని మురిసిపోవడానికి లేదు. ఎవరి ముందైనా కూడా జంకు లేకుండా ఉపన్యాసం దంచేసినంత మాత్రాన మనం గొప్ప వక్తలం అనుకోవడానికీ లేదు. మనం చెప్పే మాట అవతలివారికి వినపడాలి. అది స్పష్టంగా అర్థమవ్వాలి. స్వరం కూడా వినసొంపుగా ఉండాలి. అప్పుడే మనం పలికే పదానికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఉత్త కంఠశోష మాత్రమే మిగులుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు.   సరైన శ్వాస: ఆరోగ్యంగా ఉండాలంటే గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని అందరూ చెప్పే విషయమే! ఇలా ఊపిరితిత్తుల లోతుల నుంచి ఊపిరి పీల్చుకునే అలవాటు వల్ల మన మాటలో కూడా మార్పు వస్తుంది. మాటని బలంగా చెప్పగలుగుతాం. కావాలంటే గట్టిగా ఊపిరి తీసుకుని మాట్లాడి చూడండి... మీ మాటల్లోని మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిదానంగా: భయంతోనో, మనసులో మాటని త్వరత్వరగా చెప్పాలన్న ఉద్విగ్నతతోనో మనం హడావుడిగా మాట్లాడతాం. భాష మీద పట్టుంటే త్వరగా మాట్లాడగటం అన్న అపోహ కూడా చాలా మంది ఉంది. అందుకనే భారతీయులు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు హడావుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల అసలుకే ఎసరు తప్పదు. తప్పులుతడకలుగా మాట్లాడటమో, తడబడటమో, మన మాట అవతలివారికి అర్థం కాకపోవడమో జరుగుతుంది. ఉపన్యాస కళ మీద మంచి పట్టు ఏర్పడే వరకు కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడటమే మంచిది.   రికార్డు చేసుకుని: ఎవరి మాటలు వారి చెవులకు అద్భుతంగానే తోస్తాయి. కానీ మన మాటలు అవతలివారికి ఎలా వినిపిస్తుందో గ్రహించం. అందుకోసం ఒక్కసారి మన మాటల్ని మనమే రికార్డు చేసుకుని వింటే మన శ్రావ్యమైన గొంతు మీద మనకి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతో ఎలాగైనా సరే మనం మాట్లాడే తీరుని మార్చుకోవాలన్న పట్టుదల ఏర్పడుతుంది.   గొంతు తెరచి: చాలామంది మాట్లాడుతుంటే ఊరికనే పెదాలని ఆడిస్తున్నట్లు కనిపిస్తుందే కానీ స్పష్టత ఉండదు. నోరు పూర్తిగా తెరిచి మాట్లాడకపోతే మన మాటలు గొణుగుతున్నట్లుగానే వినిపిస్తాయి. నోరు పూర్తిగా తెరుకుని మాట్లాడినప్పుడు పెదాలు కూడా విచ్చుకుంటాయి. నాలుకా, కింద దవడలు కూడా కదులుతూ ఉన్నప్పుడు పదాలను స్పష్టంగా, దృఢంగా పలకగలుగుతాం.   వ్యాయామం: సంగీత స్వరాల మీద పట్టు సాధించేందుకు మన పెద్దలు చన్నీళ్లలో గొంతు వరకూ మునిగి సాధన చేసేవారట. అంత కష్టం మనవల్ల కాదు కానీ స్వరం మెరుగుపడేందుకు చాలా వ్యాయామాలే ఉన్నాయి. ఉదాహరణకు Cicely Berry వ్యాయామం పేరుతో ఇంటర్నెట్లో శోధిస్తే కొన్ని పదాలు కనిపిస్తాయి. వీటిని కనుక పలుకుతూ ఉంటే మన ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సంస్కృత శ్లోకాలని చదవడం, Tongue twistersని అభ్యసించడం వల్ల కూడా ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతారు. - నిర్జర.  

అలవాటులో పొరపాటు

ఫేస్‌బుక్‌లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది... కొందరు శాస్త్రవేత్తలు ఐదు కోతులను ఒకే గదిలో పెట్టారట. ఆ గది మధ్యలో ఓ పెద్ద బల్లని ఉంచారు శాస్త్రవేత్తలు. ఆ బల్ల మీద వాళ్లు రోజూ ఒక తాజా అరటిపండుని ఉంచేవారట. గదిలో ఉన్న కోతుల్లో ఒకటి ఆ అరటిపండు కోసం బల్ల ఎక్కేందుకు ప్రయత్నించగానే... కింద ఉన్న మిగతా కోతుల మీద చల్లటి నీళ్లను కుమ్మరించేవారు శాస్త్రవేత్తలు. అంటే అరటిపండు కోసం పైకి వెళ్లే కోతి వల్ల కింద ఉన్న కోతులకి శిక్షపడేదన్నమాట. దాంతో కొన్నాళ్లకి ఆ కోతులు పైకి ఎక్కేందుకు సాహసించడం మానేశాయి. ఒకవేళ ఏదన్నా కోతికి నోరూరి బల్లని ఎక్కేందుకు ప్రయత్నించగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని లాగిపారేసేవి.   కొద్ది రోజుల తరువాత ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఓ చిన్న మార్పుని తీసుకువచ్చారు. ఆ అయిదు కోతుల్లో ఒకదాన్ని బయటకు తీసుకువెళ్లిపోయి, దాని స్థానంలో ఒక కొత్త కోతిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త కోతి అరటిపండుని చూడగానే గభాలున బల్లని ఎక్కేందుకు సిద్ధపడిపోయింది. కానీ వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన మిగతా కోతులు, దాన్ని దబదబా కిందకి లాగేశాయి. ఇలా రెండు మూడుసార్లు తన్నులు తిన్న తరువాత, కొత్త కోతి కూడా మిగతా కోతులలాగానే నిమ్మళంగా ఉండిపోయిది. ఒకో వారం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఒకో పాత కోతికి బదులుగా మరో కొత్త కోతిని గదిలో ఉంచసాగారు. కొంతకాలం గడిచేసరికి కొత్త కోతులు అక్కడి వాతావరణానికి, మిగతా కోతుల స్వభావానికి అలవాటుపడిపోయాయి, తాము కూడా అందుకు అనుగుణంగానే ప్రవర్తించడం నేర్చుకునేవి. కొన్నాళ్లకి ఆ గదిలో పాత కోతులేవీ లేకుండా పోయాయి. కొత్త కోతులకి చన్నీళ్లతో విధించే శిక్ష అసలేమాత్రం అనుభవం లేదు. అయినా కూడా ఎప్పుడన్నా ఓ కోతి ఆదమరచి అరటిపండు కోసం బల్ల దగ్గరకు చేరుకోగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని కరిచి పారేయడం మానలేదు!!!   కొందరు మనుషులు కూడా బహుశా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారేమో! ఒక పనిని తాము ఎందుకు చేస్తున్నామో చాలా మంది ఆలోచించరు. దాని వల్ల తనకు ఎలాగూ నష్టం కలుగుతుంది. ఇతరులకు కూడా తన చర్య వల్ల నష్టం కలుగుతున్నా, వీళ్లు తమ తీరుని మార్చుకోరు. ఒక్కసారి మన మొండివైఖరిని పక్కకి పెట్టి విచక్షణకు పదును పెడితే, జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ కథ చెబుతోంది. ఆ పరిష్కారం వల్ల మనం ముందుకు సాగడమే కాదు, ఇతరులను కూడా విజయం వైపుగా నడిపించేందుకు దోహదపడిన వారమవుతాం. లేకపోతే...   ..Nirjara

జంతువులూ మనిషి సాయాన్ని కోరతాయి

మనిషికి ప్రకృతి మీద చాలా ఆధిపత్యమే ఉండి ఉండవచ్చు. కానీ తన మనుగడ కోసం అతను ఇతర జంతువులు మీద ఆధరపడక తప్పలేదు. ఇప్పుడంటే అన్ని రకాల పనులకీ, అన్ని రకాల యంత్రాలు వచ్చేశాయి. కానీ ఒకప్పుడు కుక్కలు, గుర్రాలు, ఆవు లాంటి జీవుల సాయం లేకుండా మనిషి జీవితం గడిచేది కాదు. మనిషి ఎలాగైతే ఇతర జీవుల మీద ఆధారపడ్డాడో, మనిషి మచ్చికకు అలవాటు పడిన జీవులు కూడా అతని మీద ఆధారపడ్డాయని శాస్త్రవేత్తల వాదన. పైగా అతని చర్యలని అర్థం చేసుకోవడాన్ని అవి అలవాటు చేసుకున్నాయనీ వారి నమ్మకం. అందుకు అనుగుణంగానే కుక్కల మీద చేసిన కొన్ని పరిశోధనలలో, అవి తమ యజమానుల హావభావలను అద్భుతంగా అర్థం చేసుకోగలవని తెలిసింది. అలా తమ యజమాని మనసు ఎరిగి మసులుకోవడం వల్లే కుక్కలు మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువుగా నిలిచిపోయాయట.   కుక్కల సంగతి సరే! మరి జంతువుల మాటేంటి! అన్న అనుమానం వచ్చింది జపానుకి చెందిన కొందరు పరిశోధకులకి. ఎందుకంటే దాదాపు ఆరువేల సంవత్సరాలుగా మనిషి గుర్రాలను మచ్చిక చేసుకుంటూనే ఉన్నాడు. ఇన్నేళ్లలో వారిమధ్య ఏదో ఒక బంధం ఏర్పడకపోదు కదా! అందుకనేనేమో గుర్రపు స్వారీ చేస్తూ ఉండటం వల్ల మనిషి మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంగా ఉంటాడని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మరి గుర్రాలు మనిషిని ఏమేరకు అర్థం చేసుకోగలుగుతున్నాయి! అన్న ఆలోచనతో ఒక ప్రయోగాన్ని నిర్వహించారు.   పరిశోధకులు ఒక గుర్రపుశాలలోని ఓ బకెట్‌లో కొంత ఆహారాన్ని ఉంచారు. ఆహారం ఎక్కడ ఉంది అన్న విషయం గుర్రానికి తప్ప దాని సంరక్షకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఎప్పుడైతే సంరక్షకుడు ఆ గుర్రాన్ని చేరుకున్నాడో, గుర్రం అతడిని ఫలానా చోట ఆహారం ఉంది... అది నాకు అందించు అన్నట్లుగా అతడిని ఆహారం దిశగా తోస్తూ అనేక హావభావాలను ప్రదర్శించింది.   ఆ తరువాత ఇదే ప్రయోగాన్ని మరోవిధంగా చేశారు. ఈసారి ఆహారం ఎక్కడ ఉందో సంరక్షకుడికి కూడా తెలిసేలా జాగ్రత్తపడ్డారు. అప్పుడు కూడా గుర్రం తనకి ఆహారం అందించమంటూ సంజ్ఞలు చేసింది కానీ... ఆ సంజ్ఞలలో మునుపటి తీవ్రత లేదు. అంటే తన సంరక్షకుడిని నిశితంగా గమనించడం ద్వారా అతనికి ఆహారం గురించి తెలుసో లేదో అన్న విషయాన్ని కూడా గుర్రాలు గ్రహించగలుగుతున్నాయన్నమాట. జీవి మనుగడ సాగించేందుకు ఈ నేర్పు చాలా అవసరం అంటున్నారు పరిశోధకులు. చింపాంజీల వంటి ఉన్నతశ్రేణి జీవులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. తన ఎదురుగా ఉన్న జీవి హావభావాలను బట్టి, అతను చూసే చూపుని బట్టి... అతనికి ఒక విషయం తెలుసా లేదా! అతను ఏదన్నా ప్రమాదాన్ని పసిగడుతున్నాడా అన్న విషయాన్ని అవి గ్రహించగలుగుతాయి.    ఇంతకీ పోయిపోయి గుర్రాల మీద ఈస్థాయి పరిశోధనలు చేయడం వల్ల ఉపయోగం ఉందా అంటే లేకం అంటున్నారు పరిశోధకులు! మనిషికి దగ్గరగా ఉండటం వల్ల పెంపుడు జంతువుల గ్రహణశక్తిలోనూ, ప్రవర్తనలోనూ ఎలాంటి మార్పులు వచ్చాయో గ్రహించడం వల్ల మనిషికీ, అతను మచ్చిక చేసుకున్న జంతువులకి మధ్య సంబంధాన్ని గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చునని అంటున్నారు.   - నిర్జర.

ఫోన్‌ని బట్టి మనస్తత్వం

మొబైల్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేందుకు ఏముంది! ఒక దశాబ్ద కాలంలోనే మొబైల్‌ ఫోన్‌ మన జీవితంలో భాగంగా మారిపోయింది. అన్నింటికీ మొబైల్ ఫోన్లనే వాడుకోమంటూ ఏకంగా నగదుని కూడా రద్దు చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌ ఒక సమాచార సాధనం మాత్రమే కాదు.. ఏ పనిలో అయినా తోడుగా ఉండే ఓ నేస్తం. మన హోదాకి సైతం ఓ సంకేతం! అందుకనే కొత్త మొబైల్‌ను ఎన్నుకొనేటప్పుడు ఆచితూచి ఎన్నుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఎంపికలో మన మనస్తత్వం కూడా బయటపడుతుందా! అంటే అవుననే జవాబు వస్తోంది. ఇంగ్లండులోని లాంకెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఐఫోన్, ఆండ్రాయిడ్‌ ఫోన్లని వాడేవారి మనస్తత్వాల మధ్య తేడాలు ఏమన్నా ఉన్నాయేమోనని పరశీలించారు. అందులో...   ఆండ్రాయిడ్ ఫోనుని ఇష్టపడేవారిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించాయి- - మగవారు ఎక్కుగా ఈ ఫోనుని ఇష్టపడుతున్నారు. - అందులోనూ పెద్దలు ఆండ్రాయిడ్ ఫోన్లంటే ఆసక్తి చూపుతున్నారు. - ఆండ్రాయిడ్ వాడకందారులు సమాజానికి అనుగుణంగా నడుచుకునే మనస్తత్వం కలిగి ఉంటారట. - వ్యక్తిగత లబ్ది కోసం ఇతరులను ఇబ్బంది పెట్టనివారై ఉంటారు. - సంపద, హోదా వంటి తాపత్రయాల జోలికి పోరు. - నిజాయితీగా ఉండేందుకు అధిక ప్రాధాన్యతని ఇస్తారు.   ఐఫోను వాడకందారులలో ఈ స్వభవాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి- - యువకులు ఎక్కువగా ఫోనుని ఇష్టపడుతున్నట్లు తేలింది. - యాండ్రాయిడ్‌తో పోల్చుకుంటే ఆడవారి మనసు ఐఫోను మీదే లగ్నమవుతుందట. - ఒక వస్తువుని ఎంచుకునే విషయంలో వీరు ఇతరులతో రాజీపడరు. - వీరు ఫోనుని ఒక సాధనంగానే కాకుండా, తమ హోదాకు చిహ్నంగా భావిస్తుంటారు. - బహిర్ముఖ మనస్తత్వంతో (extrovert) అందరితో కలివిడిగా కలిసిపోయేలా ప్రవర్తిస్తుంటారు.   ఈ వివరాలన్నింటి ఆధారంగా పరిశోధకులు ఒక ప్రోగ్రాంను కూడా రూపొందించేశారట. దానికి మన మనస్తత్వానికి సంబంధించిన కొన్ని వివరాలను అందిస్తే, మనం ఏ ఫోనుని వాడుతున్నామో చెప్పేస్తుంది. మనం వాడుతున్న ఫోను మన జీవితంలో విడదీయరాని భాగం అయిపోయింది కాబట్టి... దానిని మన మనస్తత్వానికి ఒక డిజిటల్ రూపంగా భావించడంలో తప్పులేదంటున్నారు. అందుకనే మున్ముందు జనం డౌన్‌లోడ్‌ చేసుకునే అప్లికేషన్లని బట్టి కూడా వారి మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రయత్నం చేయవచ్చునని అంటున్నారు.   - Nirjara

ఆత్మవిశ్వాసాన్ని పెంచే చిట్కా

మనిషి సాధించే విజయాలలో ఆత్మవిశ్వాసానిదే ముఖ్య పాత్ర. ఆ ఆత్మవిశ్వాసమే లేకపోతే, ఎంత ప్రతిభ ఉన్న ఫలితం గుండుసున్నాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలన్నా, తోటివారిని దాటుకుని దూసుకుపోవాలన్నా ఆత్మవిశ్వాసమే కీలకమంటూ వ్యక్తిత్వ వికాస నిపుణులంతా తెగ ఊదరగొట్టేస్తుంటారు. అయితే అతి సులభంగా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరిచే చిట్కా ఒకదాన్ని పరిశోధకులు రూపొందించారు.   ఆత్మవిశ్వాసాన్ని కొలిచారు జపానులోని క్యోటో నగరానికి చెందిన పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వారు ఓ 17 మంది అభ్యర్ధులను ఎన్నుకొన్నారు. వీరితో చిన్నా చితకా పనులు చేయిస్తూ, ఆ సమయంలో వారి మెదడు పనితీరుని పరీక్షించారు. Decoded Neurofeedback అనే ఈ పరీక్ష ద్వారా వారు అభ్యర్థి మెదడులో ఆత్మవిశ్వాసపు స్థాయి ఏ తీరున ఉందో గమనించారు.   బహుమతులు అందించారు అభ్యర్థులు కొన్ని పనులు చేసేటప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నట్లు గమనించారు. అలాంటి సమయంలో వారికి కొన్ని బహుమతులు అందించారు. పరిశోధకులు తమకు బహుమతులు ఎందుకు ఇస్తున్నారో అభ్యర్థులకు తెలియలేదు. కానీ వారి మెదడు మాత్రం ఆ ప్రతిఫలం పట్ల మంచి ఉత్తేజాన్ని పొందింది. అలా అభ్యర్ధికి తెలియకుండానే అతనిలో ఆత్మవిశ్వాసపు స్థాయిని పెంచే ప్రయత్నం చేశారన్నమాట. ఆత్మవిశ్వాసపు స్థాయి హెచ్చుగా ఉన్నప్పుడల్లా వారికి ఏవో ఒక పారితోషికాన్ని అందచేయడం వల్ల... ఆత్మవిశ్వాసం బలపడినట్లు గ్రహించారు.   పెంచాలన్నా – తగ్గించాలన్నా ఇదే పద్ధతిని వ్యతిరేక దిశలో చేస్తే కనుక ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చునని అంటున్నారు పరిశోధకులు. అంటే మన మెదడులో ఆత్మవిశ్వాసం ఉండే స్థాయిని బట్టి, మనకి అందే ప్రతిఫలాలు దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయన్నమాట. ఈ పద్ధతిని ఉపయోగించి మున్ముందు మానసిక శాస్త్రవేత్తలు ఆత్మన్యూనతతో బాధపడేవారికి కొత్త జీవితాన్ని అందించవచ్చునని అంటున్నారు. డిప్రెషన్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవారికి కనుక ఈ తరహా చికిత్సని అందిస్తే... వారి జీవన విధానం మెరుగవుతుందని ఆశిస్తున్నారు.   ఈ పరిశోధన కేవలం నిపుణులకే పరిమితం అయినా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు లేకపోలేదు. ఆత్మన్యూనతతో బాధపడే వ్యక్తులకు వారి చిన్నచిన్న విజయాలలో తోడుగా నిలబడి ప్రోత్సాహాన్ని అందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పాదుకునే అవకాశం ఉంది. అలాగే బెరుకుగా, భయంగా ఉండే చిన్నపిల్లలకి ఏవో ఒక ప్రోత్సాహకాలు అందిస్తూ వారు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరనే నమ్మకాన్ని కలిగించగలిగితే...  వారి జీవితానికి ఓ భరోసాని అందించినవారమవుతాం.  - నిర్జర.