బాబు చేతుల్లో మోడీ భవితవ్యం.. తెరవెనుక మొదలైన రాజకీయం!
posted on Jun 4, 2024 @ 5:12PM
400 సీట్లు గెలిచి, మళ్ళీ అధికారంలోకి వస్తామని లోక్ సభ ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ చెబుతూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350 సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్డీయే కూటమి 300 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయకుండా ఉండటానికి తెరవెనుక తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272. ఎన్డీయే కూటమి 290 పైగా సీట్లతో మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటున్నప్పటికీ.. మోడీ పీఎం అవుతారా లేదా? అనే దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎన్డీయేకి గట్టి పోటీ ఇచ్చి.. 230 పైగా స్థానాల్లో సత్తా చాటింది. ఈ స్థాయి పోటీ.. బీజేపీ అసలు ఊహించలేదు. కూటమితో సంబంధం లేకుండానే ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దాటుతామని నిన్నటివరకు బీజేపీ ధీమాగా ఉంది. కానీ ఇప్పుడు కూటమితోనే బొటాబొటిగా మార్క్ ని దాటింది. 'చావు తప్పి కన్ను లొట్టబోయింది' అన్నట్టుగా చివరికి అంతోయింతో హ్యాపీగా ఉన్న బీజేపీకి.. ఇప్పుడు కాంగ్రెస్ ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతోందట. అందులో ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి.
తమకి మద్దతు ఇస్తే విభజన హామీలు నెరవేర్చడంతో పాటు..ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చంద్రబాబుకి కాంగ్రెస్ రాయబారం పంపుతోందట. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మాట మార్చింది. కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హోదా ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడదే అస్త్రాన్ని చంద్రబాబుపై ప్రయోగిస్తోందట. ఏపీ కాంగ్రెస్ నాయకులు రఘువీరా రెడ్డి వంటి వారు ఇదే విషయాన్ని బహిరంగంగా కూడా చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
ఇక కేంద్రంలో జేడీయూ పార్టీకి కీలక బాధ్యతలు ఇవ్వడంతో పాటు, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక వరాలు కురిపిస్తాయని కాంగ్రెస్ నేతలు నితీష్ కుమార్ కి రాయబారం పంపుతున్నారట. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు చాలా సీనియర్ నాయకులు. పైగా ఇప్పుడు వారి చేతిలో 30 సీట్లు ఉన్నాయి. ఎన్డీయే కూటమిలో ఇప్పుడు ఈ ఇద్దరే కీలకం. వారు మద్దతు ఇవ్వకుంటే.. మోడీ మళ్ళీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ తెలివిగా ఈ ఇద్దరు నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందట.