పాతికేళ్ల నెగెటివ్ సెంటిమెంట్ కి బ్రేక్.. పయ్యావుల ఫుల్ హ్యాపీ!
posted on Jun 4, 2024 @ 7:04PM
రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. పార్టీ అధికారంలోకి వస్తే వారు ఎమ్మెల్యేగా ఓడిపోతారు లేదా వారు ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుంది. రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ ది అదే పరిస్థితి. 1999 నుంచి ఉరవకొండలో ఆయన, రాష్ట్రంలో టీడీపీ ఒకేసారి గెలవలేదు. కానీ ఎట్టకేళకు ఇన్నాళ్లకు ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది.
1994లో మొదటిసారి ఉరవకొండ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు పయ్యావుల కేశవ్. అప్పుడు రాష్ట్రంలో కూడా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత నుంచి పయ్యావులను నెగెటివ్ సెంటిమెంట్ వెంటాడింది. 1999లో పయ్యావుల ఓడిపోగా, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 లలో పయ్యావుల గెలవగా, తెలుగుదేశం ప్రతిపక్షానికి పరిమితమైంది.
రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే సెంటిమెంట్ కొనసాగింది. 2014 లో పయ్యావుల ఓడిపోగా, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 లో పయ్యావుల గెలవగా.. రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయింది. దీంతో పయ్యావుల ఎమ్మెల్యేగా గెలవడం, టీడీపీ అధికారంలోకి రావడం.. రెండూ ఒకేసారి జరగడం కష్టమనే నెగటివ్ సెంటిమెంట్ ఏర్పడింది. అయితే ఆ సెంటిమెంట్ కి ఈ 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఉరవకొండ నుంచి పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే టీడీపీ కూటమి ఏకంగా 160 పైగా సీట్లతో అధికారంలోకి వచ్చింది.