రుషికొండ భవనాలపై తెలుగుదేశం జెండాల రెపరెపలు
posted on Jun 4, 2024 @ 5:50PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 160 స్థానాలలో తెలుగుదేశం కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముందునుంచీ తెలుగువన్ చెబుతున్నట్లుగానే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఫలితాల సరళిని బట్టి స్పష్టమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. తెలుగుదేశం కూటమి పార్టీల కార్యాలయాలు కళకళలాడుతుంటే.. వైసీపీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. అటువైపు చూసే నాథుడు కూడా లేకుండా పోయాడు. నిబంధనలన్నీ తుంగలోకి తొక్కి వందల కోట్ల రూపాయలతో రుషికొండపై జగన్ ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన భవనాలపై తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండాలు ఎగురవేశారు. ఇంత కాలం రుషికొండ పరిసరాలలోకి అన్యుల ప్రవేశం నిషిద్ధం. జనసేనాని పవన్ కల్యాన్ గతంలో రుషికొండ పరిశీలనకు వెడితే జగన్ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వచ్చిన పరిశీలకులకూ అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనం ఖరారైన తరువాత పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకోలేదు. వారు పార్టీ జెండాలతో రుషికొండపై జగన్ చేత జగన్ కోసం జగనే ప్రభుత్వ సొమ్ముతో నిర్మించుకున్న విలాసవంతమైన భవనాలకు చేరుకుని ప తెలుగుదేశం జెండాలు ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే జగన్ సర్కార్ ఏకపక్షంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలలో జగన్ సర్కార్ పతనం ఖారరైన వెంటనే తెలుగుదేశం శ్రేణులు ఆ వర్సిటీ వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ అక్షరాలను తొలగించి ఎన్టీఆర్ అక్షరాలు అమర్చారు. దీంతో వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ కాస్తా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. జగన్ అడ్డగోలు నిర్ణయాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చట్ట ప్రకారం ఎలాగూ మార్చేస్తారు. హెల్త్ వర్సిటీకి అధికారం చేపట్టిన తరువాత ఎన్టీఆర్ పేరునే పెడతామని చంద్రబాబు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జనం మాత్రం ఆ మార్పు ఎలాగూ జరుగుతుంది. అంత వరకూ మేం ఆగడం ఎందుకు అని తామే మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.