ఇక దేశ నిర్మాణంపై దృష్టి: ఆర్ఎస్ఎస్
posted on Jun 11, 2024 @ 11:19AM
ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చ టగా మూడోసారి ప్రధాని కావడం ఆర్ఎస్ఎస్ లో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశంలో పని చేసే బిజెపి మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగడానికి చేపట్టాల్సిన కార్యాచరణను సిద్దం చేసింది.
లోక్‌సభ ఎన్నికలు, పార్లమెంట్ నిర్వహణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ తొలిసారి స్పందించారు. ఎన్నికలు ముగిసిపోయాయని, ఇక దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు యుద్ధం కాదని, పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియ అని అన్నారు. పార్లమెంటుకు రెండు పార్శ్వాలు ఉంటాయని, కాబట్టి ఏ ప్రశ్ననైనా రెండు కోణాల్లో పరిగణించ వచ్చునని సూచించారు. ప్రతి సమస్యకు రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే.. ప్రతిపక్ష పార్టీ మరొక కోణాన్ని ప్రస్తావించాలని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మాత్రమే సరైన నిర్ణయానికి చేరుకోగలమని భగవత్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఈ మేరకు నూతన ప్రభుత్వం, ప్రతిపక్షాలకు ఆయన సలహాలు ఇచ్చారు.
ప్రతి ఐదేళ్లకోసారి ప్రజాతీర్పు వస్తుందని, అయితే ఈ ప్రజా నిర్ణయం ఎందుకు వస్తుంది? కారణాలు ఏంటి? అనే అంశాలు ఆర్ఎస్ఎస్‌కు సంబంధించినవి కావని భగవత్ వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి ఎన్నికలలో ప్రజాభిప్రాయాన్ని మెరుగైన రీతిలో అర్థం చేసుకోవడానికి సంఘ్ పని చేస్తుంది. ఈసారి కూడా అదే పని చేసింది. ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనే ఆగిపోలేదు. నేతలను ఎందుకు ఎన్నుకుంటారు? వివిధ అంశాలపై ఏకాభిప్రాయంతో పార్లమెంట్‌కు వెళ్లడానికి ఎన్నుకుంటారు. ఏకాభిప్రాయం మన సంప్రదాయం. ఆ దిశగా పురోగతి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదు.. పోటీ మాత్రమే’’ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.