17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
posted on Jun 11, 2024 @ 11:39AM
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల అరాచక పాలన తరువాత ప్రజా ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బుధవారం (జూన్ 12) న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ కూర్పు మంత్రులకు శాఖల కేటాయింపుపై ప్రస్తుతం చంద్రబాబు దృష్టి సారించారు.
ఆ వెంటనే అంటే ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అంతకు ముందు కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే మెగా డీఎస్పీపై చంద్రబాబు సంతకం చేస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాలలో చెప్పారు. ఇక రెండో సంతకం కచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్ పైనేనని తెలుగుదేశం కూటమి వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 17 నుంచి నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. తొలి రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మిగిలిన రెండు రోజులూ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.