అయోధ్యకు బీజేపీ రాంరాం!
posted on Jun 11, 2024 @ 12:35PM
సార్వత్రిక ఎన్నికలలో విజయానికి సోపానంగా దోహదం చేస్తుందన్న ఆశతో అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఎన్నికలకు ముందే అంటే ఈ ఏడాది జనవరిలో అట్టహాసంగా ప్రారంభించి ఆ ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ చేసింది మోడీ ప్రభుత్వం. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. హిందువుల ఐక్యత, దశాబ్దాల కల సాకారం అయ్యిందని బీజేపీ సంబరపడిపోయింది. అదొక ఎన్నికల అంశంగా తమ ఘన విజయానికి దోహదపడుతుందని ఆశించింది. కట్ చేస్తే తాజాగా జరిగిన ఎన్నికలలో బీజేపీకి రామమందిర నిర్మాణం, బాలరాముడి ప్రతిష్ట అంశం పెద్దగా ఉపయోగపడలేదు. అయోధ్య రామంందిర నిర్మాణాన్ని ఎన్నికల అంశంగా జనం అస్సలు భావించలేదు. గుర్తించ లేదు. పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే అన్నట్లుగా రామ మందిర నిర్మాణం రామమందిర నిర్మాణమే. ఎన్నికలు ఎన్నికలే అన్నట్లుగా జనం స్పందన ఉంది.
రామమందిర నిర్మాణం కారణంగా బీజేపీకి గంపగుత్తగా హిందువుల ఓట్లన్నీ పడిపోతాయని ఆశించిన బీజేపీకి నిరాశే మిగిలింది. 2014, 2019 ఎన్నికలలో ఘన విజయాలు నమోదు చేసిన బీజేపీకి ఈ సారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని జనం ఇవ్వలేదు. నియంత్రణ, చెక్ ఉండాల్సిందే అన్నట్లుగా భాగస్వామ్య పక్షాల దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రభుత్వ మనుగడ కష్టం అయ్యేలా తీర్పు ఇచ్చారు. రామమందిరం నిర్మించిన అయోధ్యలోనే బీజేపీని ఓడించారు. అయితే బీజేపీ మాత్రం అయోధ్యపై కక్ష కట్టింది. అయోధ్య ప్రజలు ద్రోహం చేశారని భావిస్తోంది. వారికి కృతజ్ణత లేదని కోపం పెంచేసుకుంది. అయోధ్య ప్రాంత అభివృద్ధికి గత పదేళ్లుగా బీజేపీ సర్కార్ చేసిన కృషి, యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించేలా నిర్మించిన రామమందిరం , విమానాశ్రయ నిర్మాణం ద్వారా ఒక ఆధునిక పర్యాటక కేంద్రంగా అయోధ్య రూపురేకలను మారిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు బీజేపీ అభ్యర్థిని ఓడించడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది.
బీజేపీ సామాజిక మాధ్యమంలో బాయ్ కాట్ అయోధ్య అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అతివాద బీజేపీ నేతలు అయోధ్యలోని హిందువులను ద్రోహులుగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు. దరిమిలా ఎన్నికల ఫలితాలకు ముందు వరకూ సగటున లక్ష నుంచి లక్షన్నర వరకూ అయోధ్య సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దీంతో అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎన్నికల ఫలితాల ముందు వరకూ అయోధ్యలో ఈ రిక్షావాలాల సంపాదన రోజులు ఏడెనిమిది వందలుగా ఉండేది. ఇప్పడది 250 రూపాయలకు పడిపోయింది. దీనిని బట్టే అయ్యోధ్య సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎంతగా తగ్గిపోయిందో అర్ధమౌతుంది. అంతే కాకుండా బీజేపీ మద్దతుదారులు అయోధ్య ఆర్థిక ప్రగతిని దెబ్బకొట్టే విధంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. రామమందిర సందర్శనకు వచ్చే పర్యాటకులకు అయోధ్యలో స్థానిక వ్యాపారుల వద్ద నుంచి ఏమీ కొనవద్దని పిలుపునిస్తున్నారు. అయోధ్యలో బీజేపీని ఓడించిన అయోధ్య వాసులు అభివృద్ధి ఫలాలను అందుకోవడానికి అనర్హులని అంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తీరు అయోధ్య ఆధ్యాత్మిక వాతావరణం, ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.