ఈ రక్షాబంధనం.. ఈ ఇద్దరికీ శిక్షాబంధనం!
సోమవారం నాడు దేశమంతటా రక్షాబంధన వేడుకలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. సోదర, సోదరి ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతలకు తార్కాణంగా నిలిచే ఈ రక్షాబంధనం రోజున సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టడం, సోదరులు బహుమతులు ఇచ్చి వారిని సంతోషపరచడం సంప్రదాయం. అసలు రక్షాబంధనం అంటే, సోదరుడి చేతికి రక్ష కట్టే సోదరికి, ఆ సోదరుడు రక్షగా నిలుస్తాడు అనే సందేశాన్ని ఇవ్వడం. ఈరోజు దేశంలో చాలామందికి రక్షాబంధనం.. కానీ ముఖ్యంగా ఇద్దరికి మాత్రం ఈరోజు ‘శిక్షాబంధనం’. ఆ ఇద్దరు ఎవరో కాదు... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.
జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ప్రతి ఏడాదీ తమ అన్నలకు రాఖీలు కట్టేవారు. ఆ ఫొటోలను మీడియాకి విడుదల చేసేవారు. ఆ ఫొటోల్లో అన్నాచెల్లెళ్ళ అనుబంధం చూసి అందరికీ కడుపు నిండిపోయేది. ‘‘ఒక కొమ్మకు పూచిన పువ్వులం.. అనురాగం మనదేలే! ఒక గూటికి చెందిన గువ్వలం మమకారం మనదేలే... అన్నయ్యా.. చెల్లెమ్మా...’’ అనే పాట అందరి చెవుల్లోనూ మార్మోగేది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ రెండు కాంపౌండ్లలో అలాంటి సందడి ఏమీ వినిపించని పరిస్థితి.
ఈ ఏడాది షర్మిల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెబుతారు. జగన్మోహన్‌డ్డి రాష్ట్రంలో మహిళలందర్నీ నా అక్కచెల్లెళ్ళు అంటారుగానీ, సొంత చెల్లి చేత మాత్రం ఛీ కొట్టించుకున్నారు. మొన్నటి ఎన్నికలలో జగన్ ఓడిపోవడానికి గల అనేక కారణాలలో చెల్లెమ్మ షర్మిలమ్మ ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఆస్తి గొడవలు, బాబాయ్ హత్య, రాజకీయంగా ఎంతో ఉపయోగపడిన షర్మిలను పక్కన పెట్టడం.. ఇవన్నీ అన్నాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని తెంచేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందరికంటే పెద్ద శత్రువులైన అన్నాచెల్లెళ్ళు ఎవరయ్యా అంటే వినిపించే పేర్లు జగన్, షర్మిల.
ముఖ్యమంత్రిగా వున్నంతకాలం చెల్లెలి విలువ తెలియని జగన్ ఆమెని ఎంతమాత్రం లెక్కచేయలేదు. ఓడిపోయిన తర్వాత మాత్రం చెల్లెలి మీద జగన్‌కి ఆప్యాయత, అనురాగాలు ముంచుకొచ్చాయి. షర్మిల తనకు దూరంగా వుంటే వచ్చే ఎన్నికలలో కూడా డేంజరేనని అర్థం చేసుకున్న జగన్, ఆమెతో అనుబంధాన్ని మళ్ళీ పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ, షర్మిల జగన్‌ని ఎంతమాత్రం నమ్మడం లేదు. అన్నయ్యకి దగ్గరయ్యే ఆలోచన చేయడం లేదు. గతంలో ఎన్నోసార్లు షర్మిలతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన జగన్, రాఖీ పండుగ సందర్భంగా మరోసారి తన తల్లి విజయమ్మతో రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. చెల్లి ఈసారి తనకు రాఖీ కడితే, మళ్ళీ గతంలో లాగా వుందాం. ఆమె డిమాండ్లను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అంటూ విజయమ్మతో షర్మిలమ్మకి జగన్ రాయబారం పంపినట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి కూడా షర్మిల రాజీ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. రక్షాబంధనాన్ని తిరస్కరించడం ద్వారా షర్మిల జగన్‌కి తగిన శిక్ష విధించిందని భావించవచ్చు.
ఇక మరో అన్నాచెల్లెళ్ళు కేటీఆర్, కల్వకుంట్ల కవిత. పాపం ఈ ఏడాది కవితకు ‘రక్షాబంధన’ కాకుండా ‘శిక్షాబంధన్’ అయి కూర్చుంది. ఆమె ఈ ఏడాది పుట్టినరోజు చేసుకున్న మర్నాడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైల్లో వేశారు. ఆమె ప్రతిసారీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం.. అది రిజెక్టు కావడం టీవీ సీరియల్ తరహాలో కొనసాగుతోంది. తీహార్ జైల్లో అంతులేని ఆవేదనలో వున్న కవిత ఈసారి రాఖీ పండుగ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ని రాఖీ పండుగ కోసం జైలుకు రావొద్దని కూడా చెప్పినట్టు సమాచారం. కవిత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జైల్లో వున్నానన్న బాధతోపాటు, తనను త్వరగా విడుదల చేయించడం కోసం తన అన్న కేటీఆర్ పెద్దగా కృషి చేయడం లేదన్న ఆవేదన కూడా కారణమని తెలుస్తోంది.