అయ్యబాబోయ్.. అయ్యబాంబోయ్!
posted on Aug 19, 2024 @ 3:24PM
ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ డౌన్ ప్రాంతంలో వున్న న్యూ టౌనార్డ్స్ పట్టణంలో ఒక పెద్దమనిషికి టౌన్ మధ్యలో ఒక స్థలం వుంది. ఆ స్థలంలో తన డ్రీమ్ హోమ్ నిర్మించుకోవాలని ఆ పెద్దమనిషి అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆ స్థలాన్ని భవన నిర్మాణం కోసం చదును చేయడం ప్రారంభించాడు. ఇంతలో భూమిలోనుంచి ఒక పెద్ద ఇనుప వస్తువు బయటపడింది. ఈ వస్తువు ఏంటా అని ఆ వ్యక్తి దాన్ని పగులగొట్టి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వుండగా, ఆ వస్తువుని మిలట్రీలో పనిచేసి రిటైరైన ఒక సీనియర్ సిటిజన్ చూసి కెవ్వుమని అరిచాడు. దాన్ని పగలగొట్టకండ్రా బాబూ అని అరిచాడు. ఆ తర్వాత అందరికీ అర్థమైన విషయం ఏమిటంటే, ఆ వస్తువు మరేదో కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా పేలకుండా భూమిలో మిగిలిపోయిన బాంబు.
పొరపాటున ఆ బాంబుని ఆ స్థలం ఓనర్ పగలగొట్టినట్టయితే ఆ టౌన్‌లో సగం భస్మీపటలం అయిపోయి వుండేది. స్థలం ఓనర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకి వచ్చారు. భూమిలోంచి బయటపడింది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలని బాంబు అని కన్ఫమ్ చేశారు. దానిని పగలగొట్టడం కాదు.. కదిల్చినా పేలిపోయే అవకాశం వుంది కాబట్టి, ముందుగా దాన్ని జాగ్రత్తగా నిర్వీర్యం చేసిన తర్వాతే అక్కడ నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీని కోసం ఆ బాబుకు చుట్టుపక్కల 4 వందల మీటర్ల చుట్టుకొలతలో వున్న ఇళ్ళన్నిటినీ ఖాళీ చేయించి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించారు. ఇళ్ళ ఓనర్లు కొంతమంది మా ఇల్లు వదిలిపెట్టి మేం వెళ్ళం అని భీష్మించుకుని కూర్చున్నారు. అప్పుడు పోలీసులు.. ‘‘మీ మొహాలు మండ.. బాంబుని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో వుండగా అది పేలిందంటే, మీ ఇళ్ళతోపాటు మీరూ పోతారు’’ అని చెప్పి వాళ్ళని నయానో భయానో ఒప్పించి తరలించారు. ఇంకా బాంబుని నిర్వీర్యం చేయలేదు. సేఫ్‌గా చేస్తారని ఆశిద్దాం.