కేటీఆర్ వర్సెస్ హరీష్.. బీఆర్ఎస్ దారెటు?
posted on Aug 19, 2024 @ 11:36AM
అధికారం కోల్పోయినప్పటి నుంచీ బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఆ పార్టీ అధినేత కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా రెండవ శ్రేణి నాయకత్వం, క్యాడర్ మాజీ మంత్రి హరీష్ రావు వెనుక ర్యాలీ అవుతుంటే.. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని, ఆధిపత్యాన్నీ, నంబర్ 2 స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు.
దీంతో బీఆర్ఎస్ హరీష్, కేటీఆర్ వర్గాలుగా నిలువునా చీలిపోనుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చాపకింద నీరుగా బీఆర్ఎస్ లో అంతర్గత పోరు షురూ అయ్యి విస్తరిస్తోందని గత కొద్ది రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఉదహరిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా.. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు పెద్దగా మద్దతు లభించడం లేదు. సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లూ వెలిసినా, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపలేదు. మరీ ముఖ్యంగా కేటీఆర్ అసలు స్పందించ లేదు. దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు బీఆర్ఎస్ లో వర్గపోరు ఆరంభమైందనీ, ఇది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశాలు లేవనీ అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా కేటీఆర్ ను పెద్దగా పట్టించుకోకుండా హరీష్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడాన్ని చూస్తుంటే.. పార్టీ బలం కేటీఆర్ కాదు, హరీష్ రావే అని అధికార పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో గతంలో అంటే పార్టీ శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో బీఆర్ఎస్ విఫలం అయి4న సంగతిని గుర్తు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు హరీష్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. అన్నిటికీ మించి బీఆర్ఎస్ లో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా హరీష్ ను ఫోకస్ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హరీష్ రావుపై సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతల విమర్శలు, వ్యాఖ్యలపై కేటీఆర్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు.