నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో...భోరున ఏడ్చేసిన బర్రెలక్క

నిరుద్యోగ సమస్య మీద బిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన బర్రెలక్క మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కర్నె శిరీష అంటే గుర్తు ప‌ట్ట‌డం కొంచెం క‌ష్టంగానీ, అదే బర్రెలక్క అంటే అంద‌రూ చాలా ఈజీగా గుర్తు ప‌డ‌తారు. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీగా మారిపోయారామె. ఇక ఇటీవ‌ల‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆమె గురించి చాలా మందికి తెలిసింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు చాలా మంది మద్దతిచ్చారు కూడా. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే, తాజాగా ఆమె తాలూకు ఓ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. అందులో బ‌ర్రెల‌క్క క‌న్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేద‌ని, అత‌నెవ‌రో కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం వీడియోలో క‌నిపించింది.  కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్‌ బర్రెలక్క.. తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసింద‌ని వార్తలను ప్రసారం చేసింది. ఆ వార్త‌ల‌లో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించింది. పైగా బాధితుడు కూడా తనను ఆమె మోసం చేసిందని చెప్పడం గ‌మ‌నార్హం.  దాంతో ఇప్పుడీ వార్త నెట్టింట బాగా వైర‌ల్‌గా మారింది. చివ‌రికి బర్రెలక్క దృష్టికి కూడా వచ్చింది. దాంతో షాక్ అవ్వ‌డం ఆమె వంతైంది. ఇలా త‌న‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు వార్త హ‌ల్‌చల్ చేయ‌డంపై ఆమె స్పందించింది. ఇదంతా ఫేక్‌ అని, ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ క‌న్నీటిప‌ర్యంత‌మైంది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోను బ‌ర్రెల‌క్క పోస్ట్‌ చేసింది. ‘‘ఇప్పుడే ఓ వార్త‌ చూశాను. ఇది ఏ ఛానెలో కూడా నాకు తెలియదు. ఏదో కన్నడ ఛానెల్‌ అని తెలుస్తుంది. ఇలాంటి త‌ప్పుడు వార్త‌ను ఎందుకు స్ప్రెడ్‌ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఫేస్‌బుక్‌లో చాట్‌ చేసి డబ్బులు దోచుకుందని వార్తలు వేస్తున్నారు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావ‌డం లేదు. ఆయ‌నెవ‌రో ముస‌లాయ‌న‌.. అత‌నెవరో కూడా నాకు తెలియదు. కొందరు కావాలనే ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు. నా పేరు మీద ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా న‌కిలీ ఖాతాలు ఉన్నాయి. అందులో ఎవరు ఇలాంటి పని చేశారో నాకు తెలియదు. నేనేం తప్పు చేయలేదు’’ అని బోరున ఏడ్చేసిందామె. ఇక ఈ త‌ప్పుడు వార్త‌ల‌ను ప్రచారం చేస్తున్న ఛానెల్‌పై ఆమె అక్క‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు, వారితో మాట్లాడిన ఆడియోను కూడా వినిపించింది. 

జగన్ కు ఝలక్.. ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు!

వైసీపీ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికలలో అవమానకర ఓటమి తరువాత ఏదో మేరకు వైసీపీలో ఆనందం నింపే వార్త ఇది. అయితే ఆ ఆనందం వైసీపీ అధినేతకు మిగిలేటట్లు కనిపించడం లేదు. ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబావుటా ఎగురవేయడానికి రెడీ అయిపోయారు. జగన్ పిలుపునకు కూడా వారు స్పందించడం లేదంటున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స కూడా ఎమ్మెల్యేల తిరుగుబాటుపై అడిగిన ప్రశ్నకు ఔననీ అనకుండా, కాదనీ ఖండించకుండా సమాధానం ఇచ్చారు. రాజకీయాలలో ఏదైనా జరగొచ్చు. ఏం జరుగుతుందో ముందే చెప్పేయడానికి తానేమీ జ్యోతిష్కుడిని బదులివ్వడం ద్వారా ఎమ్మెల్యేల తిరుగుబాటు వార్తలు అవాస్తవాలు కాదని చెప్పకనే చెప్పేశారు. ఆ ఏడుగురూ ఎవరన్నది వెంటనే తెలియరాలేదు. అయితే పార్టీలో రోజురోజుకూ పెరుగుతున్న ఫస్ట్రేషన్, జగన్ తాడేపల్లిలో పార్టీ నేతలు, శ్రేణులకు అందుబాటులో ఉండకుండా తరచూ బెంగళూరు చెక్కేస్తుండటంతో  అసంతృప్తికి లోనైన ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్ ఇచ్చేందుకే రెడీ అయ్యారని అంటున్నారు. పార్టీకి రాజీనామా చేసే కంటే జగన్ పై తిరుగుబావుటా ఎగురవేసి అసెంబ్లీకి హాజరు కావాలని వారు భావిస్తున్నారు.  వేరే పార్టీలోకి వెళ్లే కంటే జగన్ ను ధిక్కరించి అసెంబ్లీకి వెళ్లడమే మేలని వారు బావిస్తున్నారు. అయితే జగన్ పార్టీని, పార్టీ భవిష్యత్ ను పట్టించుకోకుండా కేవలం తనకు విపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీకి గైర్హాజరు కావడం, ఎమ్మెల్యేలనూ వెళ్లొదన్ని ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ వారీ నిర్ణయానికి వచ్చి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

దళపతి అడుగు.. తమిళ పాలిటిక్స్ లో పిడుగు!

రాజకీయ, సినిమా రంగాలకు విడదీయరాని అనుబంధం ఉంది. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో సినీ నటులు రాజకీయ నేతలుగా ఘన విజయాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అయితే సినీరంగం ద్వారా విశేష ప్రజాభిమానాన్ని సంపాదించుకుని ఆ తరువాత రాజకీయ రంగంలో ప్రవేశించి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. తమిళనాడులో ఎంజీ రామచంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో  ఎన్టీరామారావు అటు సినీమా, ఇటు రాజకీయాలలో రాణించారు.  ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం తొమ్మది నెలల వ్యవధిలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అంత వరకూ రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించగలిగారు. ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించారు. సినీ స్టార్ గా కంటే రాజకీయ నాయకుడిగా మరింత ఎక్కువగా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. నాలుగు దశాబ్దాల తరువాత కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సిద్ధాంతాలనే అనుసరిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.   మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాలలో రాణించాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే ఆయన తమ్ముడు మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని  ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై గణనీయమైన విజయాన్ని సాధించారు. ఇటీవలి ఎన్నికలలో  జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానంలో విజయం సాధించి దేశ రాజకీయాలలోనే వంద శాతం ఫలితాన్ని సాధించిన ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది. తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.  అలాగే  తమిళనాట అయితే ఎంజీరామచంద్రన్ ఎడిఎంకే  (ఇప్పుడు ఆ పార్టీయే ఏఐఏడిఎంకె) ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తరువాత ఆయన వారసత్వాన్ని   జయలలిత అందిపుచ్చుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వీరే కాకుండా  మక్కల్ నీధి మయియామ్ (ఎమ్ఎన్ఎమ్) పార్టీని ఏర్పాటు చేసిన విజయకాంత్, ఇంకా భాగ్యరాజ్, శరత్ కుమార్ లు కూడా రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ ఎంజీఆర్, జయలలిత స్థాయిని అందుకోలేకపోయారు. వీరిలో విజయకాంత్ మాత్రమే తన ప్రభావాన్ని చాటుకోగలిగారు. అలాగే అశేష అభిమానుల బలం ఉన్న కమల్ హసన్ రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ రాణించలేకపోయారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రాజకీయ అరంగేట్రం ప్రయత్నాలను మొదలు పెట్టి వెనుకడుగు వేశారు.  ఇప్పుడు తాజాగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగంపేరిట పార్టీ ఏర్పాటు చేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. సినీ హీరోగా ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కు తోడు ఆయన రాజకీయ ప్రవేశం చేసిన సమయాన్ని బట్టి పొలిటికల్ గా విజయ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా విజయ్ కు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కారణంగా చూపుతున్నారు. జయలలిత మరణం తరువాత ఏఐఏ డీఎంకే ఉనికి మాత్రంగా మిగిలిపోవడం, అధికార డీఎంకే కు గట్టి ప్రత్యర్థి లేకపోవడం కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. ఇదే కాకుండా ఇంకా పలు అంశాలు విజయ్ కు అనుకూలంగా మారాయని అంటున్నారు. వ జయలలిత మరణం తరువాత ఏఐఏడీఎంకే బలహీనం కావడంతో ఎమ్ కే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు సరైన ప్రత్యర్థి పార్టీ లేకుండా పోయింది. అలాగే ఏఐఏడీఎంకే పార్టీలోని అంతర్గత విభేదాలు ఆ పార్టీని చీలికలు పేలికలుగా మార్చేశాయి. దీంతో ఏఐఏడీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో నేతలు రానున్న రోజులలో విజయ్ పంచన చేరే అవకాశాలు ఉన్నాయి.  అన్నిటికీ మించి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులలో విజయ్ కు ఉన్న పాపులారిటీ ఆ పార్టీకి పెద్ద ఎటు బ్యాంకుగా మారనుంది. విజయ్ బీజేపీ విధానాలను గట్టిగా వ్యతిరేకించడం, స్వయంగా ఎస్సీ కావడం కూడా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో దళపతి విజయ్ కు ప్లస్ కానుంది. ముఖ్యంగా రాష్ట్రంలో డీఎంకేకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్న వారంతా విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తమిళ రాజకీయాలలో దళపతి విజయ్ ఎంట్రీ అందుకే సంచలనంగా మారింది. సరైన సమయంలో విజయ్ రాజకీయ ప్రవేశం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి దళపతి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  

తీవ్ర గాయాలకు 50 లక్షలు.. స్వల్ప గాయాలకు 25 లక్షలు..

అచ్యుతాపురం సెజ్ ఆస్పత్రి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విశాఖలోని మెడికవర్ ఆస్పత్రికి వెళ్ళిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. చంద్రబాబు ఈ సందర్భంగా ప్రమాద వివరాలను ప్రత్యక్ష సాక్షులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు ఎక్స్.గ్రేషియాగా అందించనున్నట్టు చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. మృతుల కుటుంబాల వారికి కోటి రూపాయల ఆర్థిక సహాయం అందనున్న విషయం తెలిసిందే. గాయపడిన వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అందరికీ ప్రభుత్వం అండగా వుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరికీ వైద్యం చేయించడం మాత్రమే కాకుండా.. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా ప్రభుత్వం చేయిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

కవితకు అస్వస్థత.. ఎయిమ్స్ కు తరలింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత గురువారం (ఆగస్టు 22) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. కాగా గత ఐదు నెలలుగా జైలులో ఉంటున్న కవిత పలుమార్లు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తాజాగా ఆమె బెయిలు పిటిషన్  విచారణను దేశ సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.  కాగా గత నెలలో కూడా కవిత అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. అప్పుడు కవితనున జైలు అధికారులు దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు.  ఇప్పుడు తాజాగా మరో మారు అస్వస్థతకు గురైన కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 

అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం!

అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో 18 మంది మరణించారు. పోయినవారిని ఎలాగూ తిరిగి తీసుకురాలేని పరిస్థితి. అయితే మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మృతుల కుటుంబాలకు కోటి  వరకు పరిహారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, 2 లక్షల రూపాయల పరిహారాన్ని మోడీ ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఈ ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వరకు పరిహారం అందే అవకాశం వుందని ఆయన తెలిపారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా వుంటుందని కలెక్టర్ తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దుర్ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి గురువారం నాడు విశాఖ వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి వారి వారి గాయాలను బట్టి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు.  అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్‌ పూర్తి అయ్యింది. శిథిలాల తొలగింపును రెస్క్యూ టీమ్‌ పూర్తి చేసింది. 33 మందిని జెయింట్‌ ఫైరింజిన్‌తో సిబ్బంది కాపాడింది. 18 మంది మృతులలో 17 మంది కంపెనీ సిబ్బంది. మరో వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు.  అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో అతిపెద్ద ప్రమాద ఘటన ఇదే. అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 

విజయ్ పార్టీ జెండా ఆవిష్కరణ!

పవన్ కళ్యాణ్‌కి, తమిళ హీరో విజయ్‌కి కొన్ని విషయాలో పోలికలు వున్నాయి. విజయ్ నటించిన సినిమాలని పవన్ కళ్యాణ్ తెలుగులో రీమేక్ చేస్తూ నటించారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన తెలుగు సినిమాల తమిళ రీమేక్‌లలో కూడా విజయ్ నటించారు. అలా ఒకరి బాటలో మరొకరు పయనిస్తూ ఇద్దరూ సక్సెస్‌ఫుల్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా పవన్ కళ్యాణ్‌ని విజయ్ ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించిన తర్వాత కొన్నేళ్ళకు విజయ్ కూడా రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన ప్రకటన చేశారు. ‘తమిళగ వెట్రి కళగం’ అనే తన పార్టీ పేరును కూడా ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సక్సెస్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇది విజయ్‌లో ఉత్సాహాన్ని పెంచినట్టుంది. తాజాగా ఆయన తన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ పతాక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. విజయ్ పార్టీ జెండా ఎరుపు, పుసుపు రంగుల కలయికతో వుంది. జెండాపై రెండు ఏనుగులు వున్నాయి. ఈ సందర్భంగా విజయ్ తన పార్టీ కార్యకర్తలతో కలసి ప్రతిజ్ఞ చేశారు. ‘‘మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక యోధులను మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. కులం, మతం, ప్రాంతం, లింగం పేరుతో వున్న వివక్షను మనం తొలగిస్తాం. ప్రజలకు అవగాహన కల్పించి అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం కృషి చేస్తాం. సమానత్వం అనే   సూత్రాన్ని బలంగా సమర్థిస్తాం’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. 2026లో జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో విజయ్ పార్టీ పోటీ చేయబోతోంది.

కోరికలుంటే మా వద్దకు రమ్మన్నసెక్స్ వర్కర్ ...వైరల్ అవుతోన్న వీడియో

కోల్కతా వైద్యురాలిపై రేప్ సంఘటన యావత్ దేశాన్ని కదిలించింది. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. కానీ కోల్ కతా లో ని ఒక సెక్స్ వర్కర్ సమాజాన్ని ఆలోచింపజేసింది.  సోనాగచ్చి.. కోల్‌కతా పరిచయం ఉన్న వారికి ఈ పేరు సుపరిచితం. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలనే ఇది కూడా బాగా పేరుమోసింది. నిజానికి ఇలాంటి ప్రాంతాలపై పోలీసులు తరచూ దాడులు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల పేరు ఎత్తడానికి కొందరు జంకితే.. మరికొందరు అటువైపు వెళ్లలేకుండా ఉండలేని స్థితిలో ఉంటారు. కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత సోనాగచ్చికి చెందిన ఓ సెక్స్ వర్కర్ చేసిన వ్యాఖ్యలు సమాజంలోని పోకడలకు అద్దం పడుతున్నాయి. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎందుకు ఉండాలో చెప్పిన ఆమె వ్యాఖ్యల వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.  ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ‘‘మీ కోరికను తృప్తిపరుచుకోవాలంటే సోనాగచ్చి రండి. ఇలా చదువుకున్న అమ్మాయిలు, పనిచేసుకుంటున్న మహిళలపై దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? 20, 30 రూపాయలు ఇచ్చినా పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ల వెంటపడి ఉసురు తీస్తారు ఎందుకు?’’ అని ప్రశ్నించింది. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఉండగా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుండడాన్ని ఆమె వ్యాఖ్యలు ఎత్తిచూపాయి. నిజానికి సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎప్పటికీ వివాదాస్పదమే. ఇవి సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాయి. ఇలాంటివి లేకపోతే సమాజంలో జరిగే అరాచకాలను ఊహించుకోలేరని ఆమె వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. రెడ్‌లైట్ ఏరియాలు అక్కడక్కడా ఉండడం వల్లే మహిళలకు కొంతైనా భద్రత లభిస్తోందన్న భావన ఆమె మాటల్లో వ్యక్తమైంది. కామవాంఛ గల పురుషుల నుంచి ఇలాంటి ప్రాంతాలు మహిళలను రక్షిస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. నిజానికి సోనాగచ్చి లాంటి వాటిని చెడుగా చూస్తారు. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న ప్రభుత్వాలు ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాయన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. పురుషులకు రెడ్‌లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది. ఆమె వ్యాఖ్యలతో ఆయా రాష్ట్రాల్లో పాలకులు రెడ్ లైట్ ఏరియాలకు అనుమతులిస్తారని అనే వాదన వినిపిస్తోంది. 

వెంకట్రామరెడ్డి జగన్ భక్తికి ఫలితం దక్కుతోందిగా?

వైసీపీ ప్ర‌భుత్వంలో కొంద‌రు అధికారుల తీరు హ‌ద్దులు దాటిపోయింది.   కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి హార్డ్ కోర్ కార్య‌క‌ర్త‌ల్లా వ్యవహరించారు. త‌మ స్వ‌లాభం కోసం  ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్ర‌స‌న్నంకోసం కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు ఎంతకైనా  తెగించేశారు. పాతాళానికి దిగజారిపోయారు.  ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని పొగిడేందుకే మ‌నం ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తున్నాం అన్న‌ట్లుగా కొంద‌రు ఉద్యోగ సంఘాల నేత‌లు వ్య‌వ‌హ‌రించారు.  వారి తీరుపట్ల ఉద్యోగులే కాదు ప్ర‌జ‌లు కూడా విస్తుపోయారు.   ఆగ్రహంతో రగిలిపోయారు.  ప్ర‌భుత్వ ఉద్యోగిగా ఉన్నామ‌న్న సోయి  మ‌రిచి ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీకి కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రించిన వారిలో  సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ముందువరుసలో ఉన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా వెంకట్రామిరెడ్డి  2022 డిసెంబ‌ర్ నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తీరు వివాదాస్ప‌దంగానే ఉంది. ప్ర‌భుత్వ ఉద్యోగిలా కాకుండా వైసీపీ కార్య‌క‌ర్త‌లా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. సీఎం వ‌ద్ద‌కు, ప్ర‌భుత్వ పెద్ద‌ల వద్దకు  ఉద్యోగుల సమ‌స్య‌ల‌ను తీసుకెళ్లి వాటి ప‌రిష్కారంకోసం కృషి చేయాల్సిన   ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి స్వలాభంకోసం వైసీపీ కార్య‌క‌ర్త‌లా వ్య‌వ‌హ‌రించారు.   2014-19 మధ్య కాలంలో కూడా వెంకట్రామరెడ్డి జగన్ భక్త ఆంజనేయుడిగానే వ్యవహరించారు. జగన్ కు మద్దతుగా నిలవడం కోసం తన ఉద్యోగ ధర్మాన్ని కూడా ఉల్లంఘించారు. అప్పట్లో రహస్య పత్రాలను వైసీపీకి అందచేసి సస్పెన్షన్ కు గురయ్యారు. ఎలాగోలా మళ్లీ ఉద్యోగంలో చేరినా ఆయన తీరు మారలేదు. జగన్ రాజకీయ ప్రవేశం చేసిన క్షణం నుంచీ ఆయన ప్రభుత్వోద్యోగిగా కాకుండా వైసీపీ కార్యకర్తగా పని చేశారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జగన్ భక్తి ఉన్మాద స్థాయికి చేరింది. మరింతగా చెలరేగిపోయారు.  అయితే జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు తన గత పాపాలు, తప్పులకు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైంది. వెంకట్రామరెడ్డి సచివాలయ ఉద్యోగ నేతగా ఎన్నడూ పని చేసిన పాపాన పోలేదు. జగన్ పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు.   జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా పదవి కూడా వచ్చింది. అయితే ఆయన తన సేవలన్నీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా, జగన్ కు ఊడిగం చేయడం కోసమే వినియోగించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు.  చివరాఖరికి ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున పని చేయడంతో ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించి సస్పెన్షన్ వేటు వేసింది.  సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ిచన తరువాత ఆయనపై అభియోగాలు ఖరారు చేసి వివరణ ఇచ్చుకోవడానికి పక్షం రోజులు గడువు ఇస్తూ నోటీసు ఇచ్చింది.   ఆ విరణ తరువాత ఆయనపై చర్యలు తప్పవు. వెంకట్రామిరెడ్డిపై అభియోగాల తీవ్రతను బట్టి ఆయన ఉద్యోగానికి ఎసరు వచ్చినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. అది వాస్తవం కూడా.. ప్రభుత్వోద్యోగిగా, సచివాలయ ఉద్యోగ సంఘం నేతగా ఆయన చేసిన తప్పిదాలు, జగన్ భక్త ఉన్మాదంతో వ్యవహరించిన తీరు పరిగణనలోనికి తీసుకుంటే వెంకట్రామరెడ్డి డిస్మిస్ అవ్వడం ఖాయమని ఉద్యోగులే అంటున్నారు.  జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగ సంఘం నాయకుడిగా ఆయన ఉద్యోగులను నానా బాధలకూ గురి చేశారనీ, జగన్ ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలను సమర్ధించారని  వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీగా బొత్స.. ఉపయోగమేంటి?

విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. వైసీపీ సీనియర్ నాయకుడ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్ వేశారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో బొత్స ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం (ఆగస్టు21)న మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాదు మండలిలో ఆయననే విపక్ష నేతగా జగన్ నియమించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అది వేరే సంగతి. తన ప్రమాణ స్వీకారం అనంతరం బొత్స సత్యనారాయణ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు కృతజ్ణతలు తెలిపారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా, కూటమి ప్రభుత్వంపైనా వైసీపీ మార్కు విమర్శలు చేశారు. అంతే కాకుండా వైసీపీ ప్రతిష్టను మరింత దిగజార్చడానికి మాత్రమే ఉపయోగపడేలా వైసీపీ విధానం మూడు రాజధానులేనని కూడా ప్రకటించేశారు. అలాగే తెలుగుదశం కూటమి ప్రభుత్వం అక్రమంగా తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి వేధిస్తోందనీ, అయినా భయపడమని గంభీరంగా చెప్పారు. మండలిలో ప్రజా సమస్యలపై నిలదీస్తానని చెప్పుకున్నారు. ఎన్నికల హామీల అమలు కోసం తెలుగుదేశం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామనీ చెప్పుకున్నారు.  ఇంత వరకూ బాగానే ఉంది కానీ వాస్తవానికి అపార రాజకీయ అనుభవం, పలు మార్లు మంత్రిగా పదవులు వెలగబెట్టి, ఒక దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికకావడం గొప్ప విషయమేమీ కాదు, వాస్తవానికి ఎమ్మెల్సీగా బొత్స తనను తాను  దిగజార్చుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బొత్సకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మండలికి పంపడం ద్వారా ఆయనను విశాఖలో పార్టీ నేతలకు దూరం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయ పరాభవాన్ని ఎదుర్కొన్న వైసీపీ అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు. అదే విధంగా మండలి సమావేశాలకు కూడా వైసీపీ గైర్జాజర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఎందుకంటే ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ అసెంబ్లీకి హాజరు కాలేదు. జగన్ అయితే అసెంబ్లీకి వెళ్లి తాము చేసేదీ చేయగలిగేదీ ఏమీ లేదని కుండబద్దలు కొట్టేశారు. విపక్ష హోదా ఇస్తే తప్ప సభలో అడుగు పెట్టనని తేల్చేశారు. విపక్ష హోదా కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక మండలి సమావేశాలకు కూడా ఆ పార్టీ సభ్యులు హాజరు కాలేదు. ఏదో ఇద్దరు ఎమ్మెల్సీలు మినహా  మిగిలిన వారంతా జగన్ బాటలోనే నడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బొత్స ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినా మండలిలో అడుగు పెడతారా? జగన్ అడుగు పెట్టనిస్తారా? అన్న అనుమానాలు పార్టీ వర్గాలలోనే వ్యక్తం అవుతున్నాయి. 

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం.. 16 మంది మృతి!

అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో రియాక్టర్ పేలడం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో బుధవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అచ్యుతాపురం ఫార్మా జెస్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొని ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్‌లోని అగ్నిమాపక యంత్రం సహా చుట్టుపక్కల నుంచి మరో 11 యంత్రాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా, మొదటి అంతస్తు శ్లాబు కింద పడి ఏడుగురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఐదుగురు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండో షిఫ్టులోని దాదాపు 380 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిశ్రమలోని మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయిందని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు కార్మికులు చెబుతున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న కార్మికులను క్రేన్ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల తరలింపునకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ వాడాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారులను ఆదేశించారు. రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మికశాఖ మంత్రి సుభాష్ అన్నారు. భారీగా పొగవల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ఘటనాస్థలిలో కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని, మృతుల పూర్తి వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇప్పటి వరకు అందిన మృతుల వివరాలు... 1. వి. సన్యాసినాయుడు, ప్లాంట్ ఏజీఎం, 2. రామిరెడ్డి, ల్యాబ్ హెడ్, 3. హారిక, కెమిస్ట్, 4. పార్థసారథి, ప్రొడక్షన్ ఆపరేటర్, 5. వై. చిన్నారావు, ప్లాంట్ హెల్పర్, 6. పి.రాజశేఖర్, 7. మోహన్, ఆపరేటర్, 8. గణేష్, ఆపరేటర్, 9. హెచ్. ప్రశాంత్, 10. ఎం. నారాయణరావు.. మరో ఆరుగురి వివరాలు తెలియాల్సి ఉంది.

పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు.. హోంశాఖపై సమీక్షలో చంద్రబాబు

రాష్ట్రంలో పోలీసు శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హోంశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. నేరం చేస్తే శిక్ష తప్పదన్న భావన కలిగేలా పోలీసు శాఖ పని చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో ఎవరైనా అరాచకాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని సీఎం అన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో, నేరాల విచారణ, నేరస్తులకు శిక్షల విషయంలో అధికారులు ఫలితాలు కనిపించేలా పనిచేయాలని సూచించారు.  హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారాకా తిరుమల రావుతో పాటు పోలీసు శాఖలోని ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.    ఈ సమీక్షా సమావేశంలో గత పదేళ్లలో పోలీసు శాఖలో నెల‌కొన్న‌ పరిస్థితులపై అధికారులు వివరించారు.  2014-19 పోల్చితే  2019-24లో  క్రైం రేట్ 46 శాతం పెరిగిందని అధికారులు వివరించారు.  2014-19 తో పోల్చుకుంటే 2019-23 మధ్యకాలంలో మహిళలపై నేరాలు 35.91 శాతం, మహిళల అదృశ్యం కేసులు 84.83 శాతం, సైబర్ నేరాలు 134.43 శాతం పెరిగాయని  తెలిపారు. అలాగే గంజాయి, డ్రగ్స్ కేసులు 107.89 శాతం, చిన్న పిల్లలపై నేరాలు 151.88 శాతం పెరిగాయని వెల్లడించారు.  గత ప్రభుత్వ తీరుతో పోలీసు శాఖ ఎలా నిర్వీర్య‌మైందో ప‌వ‌ర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పోలీసు శాఖలో ఆయా విభాగాలకు ఇవ్వాల్సిన చిన్న చిన్న ఆర్థిక మొత్తాలను కూడా చెల్లించకపోవడం వల్ల పోలీసులు, పోలీసు శాఖ ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా   ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.   పోలీసు శాఖ వద్ద 143 డ్రోన్లు  ఉంటే  అందులో కేవలం 88 మాత్రమే పని చేస్తున్నాయంటే పోలీసు శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురైందో అర్ధం చేసుకోవచ్చు. బాడీ వోర్న్ కెమేరాలు 1250 ఉంటే  444 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంలో 1180 కెమేరాలకు గాను కేవలం 317 మాత్రమే పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14,712 సీసీ కెమేరాల్లో 2371 కెమేరాలు పనిచేయడం లేదని వివరించారు. ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం కూడా పనిచేయడం లేదని తెలిపారు. వీటన్నింటినీ తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు అవ‌స‌ర‌మైన‌ రూ. 30 కోట్లు నిధులు  కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించకపోవడం వల్ల చాలా సేవలు అందుబాటులో లేకాండా పోయాయని....వీటి వల్ల నేర విచారణలో తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని తెలిపారు. పోలీసు విభాగంలో 2014-19 మధ్య  5215 వాహనాల కొనుగోలుకు రూ.221.8 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.67.3 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాలం చెల్లిన వాహనాలతో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోందని...ప్రస్తుతం 2812 వాహనాల కోసం రూ.281 కోట్లు బడ్జెట్ అవసరమ‌ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోలీసు శాఖను గాడిలో పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామన్న చంద్రబాబు నాయుడు దీక్షకాలంగా పెండింగ్ లో ఉన్న పది కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేస్తున్నట్లు చెప్పారు.  అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలీసు శాఖను మళ్లీ గాడిలో పెట్టేందుకు అవ‌స‌ర‌మైన‌ అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా వ్యవస్ధల్లో పరికరాల నిర్వహణ ఖర్చులకు ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రూ.10 కోట్లు  వెంటనే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే  సీసీ కెమేరాల ఏర్పాటులో పెండింగ్ లో ఉన్న రూ.11 కోట్ల  బిల్లులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.  పోలీస్ శాఖను ఆధునికీక‌రించే  కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాటాగా రూ.61 కోట్లు విడుద‌ల చేయ‌డానికి  కూడా సీఎం ఆమోదం తెలిపారు.  గత ప్రభుత్వం పోలీసులను క్షక్ష సాధింపులకు, ప్రజల, రాజకీయ పార్టీల అణిచివేతకు ఉపయోగించుకుందన్న చంద్రబాబు తమ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని విస్పష్టంగా చెప్పారు,  మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలి. ఆడబిడ్డల జొలికి వస్తే అదే చివరి రోజు అనేది నేరస్తులకు అర్థం కావాలి అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.  వచ్చే నెలలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాలనీ, ఆ  కార్య‌క్ర‌మంలో తాను కూడా పాల్గొంటానని చంద్రబాబు చెప్పారు. 

జన్వాడా  కూల్చివేత  కార్యక్రమానికి బ్రేక్ 

హైడ్రా కమిషనర్ రంగనాథ్  చేపట్టిన జన్వాడా  కూల్చివేతల కార్యక్రమానికి తాత్కలిక బ్రేక్ పడింది.  జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతను రేపటి వరకు చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం హైడ్రాను ఆదేశించింది. ఈ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చివేసే అవకాశముందని భావించిన బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం వరకు స్టే విధించింది. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. హైడ్రా లీగల్ స్టేటస్, విధివిధానాలను చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే... హైడ్రా ఏర్పాటు, కమిషనర్‌కు ఉన్న పరిధులను ప్రశ్నించింది. హైడ్రా... ఓఆర్ఆర్ పరిధిలో పని చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి అన్నారు. జీహెచ్ఎంసీతో కలిసి ఇది పని చేస్తుందన్నారు. హైడ్రా జీవో 111 పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.అయితే నిర్మాణాలకు ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తూ... మరో శాఖ కూల్చివేస్తుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్ల క్రితం నాటి నిర్మాణాలను హైడ్రా ఇప్పుడు కూలుస్తోందని హైకోర్టు పేర్కొంది

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ 

ఓటుకు నోటు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్​ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోడానికి ఎలాంటి అంశాలు లేవని స్పష్టం చేసింది. ఆళ్ల దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఈ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా సంచలనంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడులపై.. ఈ ఓటుకు నోటు కేసులో ఎప్పటి నుంచో ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై దాఖలు చేసిన రెండు పిటిషన్లను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. వైఎస్సార్‌సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి.. చంద్రబాబుపై వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది. ఓటుకు నోటు కేసులో నారా చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలోనే రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాజాగా సుప్రీంకోర్టు జడ్జిలు.. జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ ఓటుకు నోటు కేసులో ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయని.. అయితే ఈ పిటిషన్లపై జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల కోసం కోర్టులకు రావద్దని పిటిషనర్‌కు సూచించింది. అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఈ క్రమంలోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు లాయర్.. ఆ కేసుల జాబితాను కోర్టుకు సమర్పించారు. అయితే ఆ కేసులకు.. ప్రస్తుతం వాదనలు జరుగుతున్న కేసులకు ఎలాంటి సంబంధం లేదని లాయర్ సిద్ధార్థ లూథ్రా తెలిపారు. కేసుల జాబితా పరిశీలించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

స్పీడ్ తగ్గించిన హైడ్రా... రంగనాథ్ చుట్టూ బిగుస్తున్న రాజకీయ ఉచ్చు

హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఉన్న ఫామ్ హౌజ్ ల  హైడ్రా కూల్చివేయనున్నట్లు వస్తున్న వార్తలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. కెటీఆర్ ఫామ్ హౌజ్ కూల్చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కెటీఆర్ రియాక్ట్ అయ్యారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌజ్ లేదని కెటీఆర్ చెప్పుకొచ్చారు. కాని తన మిత్రుడి ఫామ్ హైజ్ లీజుకు తీసుకున్నానని కెటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ఆ ఫామ్ హౌజ్ కూల్చాలనుకుంటే కూల్చండి. కానీ తనతో పాటు హైడ్రా బృందం రావాలని కాంగ్రెస్ నేతల ఫామ్ హౌజ్ లు కూల్చేయాలని కండిషన్ పెట్టారు.  హైదరాబాద్‌లో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కొరడా ఝుళిపిస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో దానిని కూల్చివేసే అవకాశం ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్‌ను కూల్చకుండా చూడాలని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కూల్చకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి కలెక్టర్, శంకర్‌పల్లి రెవిన్యూ అధికారి, చీఫ్ ఇంజనీర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. జన్వాడ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెందినదిగా ప్రచారంలో ఉంది. అలాగే, హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూడా కూల్చివేయాలని ఫిర్యాదులు వచ్చాయి. జన్వాడ ఫామ్ హౌస్, ఎన్ కన్వెన్షన్‌తో పాటు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఇతర ప్రముఖుల నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని హైడ్రా చెబుతోంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు చెరువులను ఈరోజు పరిశీలిస్తున్నారు. ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను కూడా పరిశీలించారు. జన్వాడ ఫామ్ హౌస్ కూల్చవద్దని ప్రవీణ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైడ్రాకు ఉన్న పరిమితుల గురించి చెప్పాలని ఏఏజీకి హైకోర్టు సూచించింది. ఇది స్వయంప్రతిపత్తిగల సంస్థ అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణం జరిగిన 15 - 20 ఏళ్ల తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలని కూల్చి వేయడమేమిటని హైకోర్టు ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ప్రవీణ్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణార్హమైనది కాదన్నారు. ఈ ఫామ్ హౌస్ జీవో 111లోకి వస్తుందని తెలిపారు. జీవో 111 పరిధిలోని భూములు, ఫామ్ హౌస్‌లను నీటి పారుదల శాఖ చూస్తోందన్నారు. వీటిని కూల్చివేసే హక్కు హైడ్రాకు మాత్రం లేదని ఏఏజీ తెలిపారు. అనంతరం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైకోర్టు అక్షింతల నేపథ్యంలో హైడ్రా స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారాలకు కాంగ్రెస్ కళ్లెం వేయనుంది.  దానం నాగేందర్ నేతృత్వంలో కొందరు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెంచుతున్నారు. 

వృద్ధుల ఇన్స్యూరెన్స్ లపైనా బాదుడేనా?

భారత్ లో విక్రయ పన్నును, సహా అన్ని పన్నులను జీఎస్టీ లో కలిపి విస్తృతంగా పన్ను చెల్లింపు దారుల ను  పెంచి ఆదాయం పెరిగేలా బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మకంగా కొత్త పన్ను విధానం తీసుకొచ్చింది. జీఎస్టీ పేర మోడీ సర్కార్ తీసుకువచ్చిన పన్ను విధానం ప్రజలకు మోయలేని భారంగా మారింది.  ప్రజల అవసరాలు, వారి శ్రేయస్సు దృష్ట్యా ఎప్పటికప్పుడు సవరణలు చేస్తామనీ, తరచూ రాష్ట్రప్రభఉత్వాలతో చర్చించి ప్రజల అభీష్టాలమేరకు మార్పులు చేస్తామని చెప్పిన మోడీ సర్కార్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.  హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలి లేదా పూర్తిగా ఎత్తివేయాలంటూ  స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  చేసిన ప్రతి పాదనను  కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అక్కడితో ఆగకుండా గడ్కరీ ప్రతిపాదనపై నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆయనను అవమానించేవిగా ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూళ్లలో హేతుబద్ధతకు తిలోదకాలిచ్చి, ప్రజల డిమాండ్లను పట్టించుకోవడం లేదు.  పన్నులు పెంచడం తన హక్కు.. వాటిని కట్టడం ప్రజల విధి అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పెట్రోల్ పై జిఎస్టీ విధించాలని ప్రజలు నుంచి వస్తున్న డిమాండ్లను పట్టించుకోవడంలేదు. సర్ చార్జీ, సుంకాలు పేరుతో అటు కేంద్రం,ఇటు రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా పన్నులు వేస్తున్నాయి.  అలాగే వంటగ్యాస్ సిలిండర్ల పై కూడా అదే ధోరణి కనిపిస్తోంది. ప్రజలు కడుతున్న పన్నులతో పాలకులు ప్రభుత్వాలు నడుపుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పన్ను రాబడిని వాడుకుంటున్నారు. ప్రజా ధనాన్ని పథకాలపేరుతో పందేరం చేస్తున్నారు. ఆహారం, దుస్తులు,ఇల్లు ప్రతివ్యక్తి సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు. కాని హోటల్ కు వెళితే జీఎస్టీ బాదుడు, దుస్తులు కొనాలంటే కనీస ధర రూ.500 నుంచి 1000 వరకూ కావాలి. అలాగే నగరాల్లో ఇల్లు కొనాలంటే పన్నులు రూపేణా లక్షల్లో బాదేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు.బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేటప్పుడు వడ్డీల పేర విపరీతంగా బాదేస్తున్నాయి.కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టేవారు బ్యాంకు రుణాలకు వెళ్లడం లేదు. బ్యాంకు రుణ వితరణ రేటు తగ్గుతున్నదని రిజర్వ్ బ్యాంక్ నివేదికలు చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం అధిగమించాలంటే రుణం విధానం సరళంగా ఉండాలి. ప్రభుత్వాలు  పరిశ్రమలకు ఉద్దీపనలు ఇవ్వాలేగాని రుణ మాఫీలు చేయడం సరికాదు.  జీఎస్టీని ప్రభుత్వాలు ఆదాయం వనరుగా చూస్తున్నాయే తప్ప అభివృద్ధికి దిక్సూచి గా పరిగణించడం లేదు. బంగారు ఆభరణాల మీద జీఎస్టీ 3శాతంకాగా వృద్ధుల ఆరోగ్య బీమా పై 18 శాతం జీఎస్టీ బాదడమే ఇందుకు నిదర్శనం.  బంగారం పై కేవలం మహిళా ఓట్ల కోసం జీఎస్టీ తగ్గించారు. అలాగే మూలధనం లాభం పన్నును ఇటీవల బడ్జెట్లో సవరించడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరిగింది. గతంలో మూలధనం పెట్టుబడి మీద వచ్చిన లాభం పై ద్రవ్యోల్బణ రేటు తగ్గించి పన్ను వేసేవారు. ఆదాయ పన్ను పరిధిలోకి ఇది వస్తుంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం పరిగణించక పన్ను రేటు పెంచి బాదేస్తున్నారు. ఫలితంగా మధ్యతరగతి,చిన్న పరిశ్రమలు, వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి సందేహిస్తున్నారు. అలాగే పన్నుచెల్లింపుదారుల ధనాన్ని సంక్షేమం పేరుతో ఓట్లు కోసం ప్రభుత్వాలు పంచుతున్నాయి. మొత్తానికి జీఎస్టీ అహేతుకత కారణంగా సామాన్యులు నలిగిపోతున్నారు. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను తదుపరి ఎన్నికలలో తమ విజయానికి పెట్టుబడులుగా సంక్షేమం రూపంలో పందేరం చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అక్రమమే, అవినీతే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జల కళ సరే సాగునీటికేదీ భరోసా?

ఏపీలో వర్షాభావంతో నాట్లు ఆలస్యమవుతున్నాయి. గత ఏడాది లాగే ఈ ఏడాదీ తొలకరి లో వర్షాలు పడ్డాయి.ఖరీఫ్ పంటలకాలం ఆగస్టులో వర్షాలు మాయం. ముసురుపట్టాల్సిన సమయంలో వేసవిని తలపించేలా ఎండ తీవ్రత ఉంది. అయితే ఈ వాతావరణం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఓకేలా లేదు.  కొన్ని ప్రాంతాలలో అతివృష్టి, మరి కొన్ని ప్రాంతాలలో అనావృష్టి అన్నట్లుగా వాతావరణం ఉంది.  ముఖ్యంగా అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి కృష్ణా జిల్లా లో రైతులు వర్షాలు లేక కాలువలు రాక నారుమళ్లు పోయడానికి ఎంతో కష్టపడుతున్నారు. జులైలో విత్తనాలు భూమి మీద చల్లితే భారీ వర్షాలు పడి మొక్కలు మొలవలా. దాంతో ఇంజన్లు పెట్టి నారుమళ్లు పోసారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పట్టిసీమ ప్రారంభించి నీటి కొరత లేకుండా చేసారు. జగన్ అధికారంలోకి రావడంతో  పట్టిసీమను ఒట్టిసీమ చేసేశారు. దీంతో ఇంజన్లు తుప్పు పట్టాయి. కృష్ణా డెల్టా రైతులు నీరు అందక నానా బాధ పడ్డారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా గతంలో ఉన్న నీటి భరోసా ఇప్పుడు లేదు. కాలువల మొదట్లో నీరు వచ్చినా  కాలువ చివరి రైతులు నీరు రాక పంటలు వేయడం ఆలస్యమవుతున్నది. ఇది వరి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  ప్రభావం పడే అవకాశం ఉంది. ఆ తరువాత వేసే అపరాల పంట ఉత్పత్తి పై కూడా ఈ  ప్రభావం పడు తుంది. బంగాళాఖాతంలో అల్ప పీడనాల ప్రభావాలు అంతగా లేవు. నైరుతీ రుతుపవనాలు గతి తప్పడంతో కూడా వర్షాభావం ఏర్పడిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50 మండ లాలకు పైగా వర్షాభావ పరిస్థితి కనిపిస్తున్నది.ముఖ్యంగా కాలువలు పై నిఘా పెట్టి కాలువ చివరి భూములకునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలు ఉమ్మడి కృష్ణా జిల్లా భూములకు అందేలా కూడా చర్యలు తీసుకోవాలి.భూమి,సముద్రం,వాతావరణం మూడు వేడెక్కిపోవడమే ఈ వింత పరిస్థితికి కారణమని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.మామూలు పరిస్థితుల్లో భూమి వేడేక్కినప్పుడు సముద్రం చల్లగా ఉండి మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి.గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో రుతుపవనాలు కాలంలోనూ కొన్నిచోట్ల అతివృష్టి,మరోచోట అనావృష్టి ఏర్పడుతున్నది. భవిష్యత్తు లో ఇలాంటి వాతావరణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.మళ్లీ మనం పాత రోజులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది.చెరువులను,కుంటలను వర్షాలు పడినప్పుడు నింపుకుని అవసరాన్ని బట్టి వాడుకోవాలి.అందుకు మనకు ఉన్న భూమిలో కుంటలు తవ్వి వర్షపు నీరునిలువచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.లేదా గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని చెరువులు,కుంటలు నింపాలి.నీటి ప్రాజెక్టు లు,కాలువలద్వారా నీరు వర్షాలు పడితేనే క్రిందకు వస్తాయి. లేకపోతే ప్రాజెక్టుల్లోఎంత జలకళ ఉన్నా రైతుల పొలాల్లో మాత్రం పారే అవకాశం కష్టమే మరి.