పోలవరం ఫైల్స్ దహనం కేసు.. ఇదీ అసలు కథ!

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ  హయాంలో పలు శాఖల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది.  వైసీపీ నేతలు అధికారుల సహకారంతో అందిన కాడికి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాల వ్యవహారంపై దృష్టిసారించింది. ఫలితంగా ఒక్కొక్కరి అవినీతి బండారం వెలుగులోకి వస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కమిటీలు వేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నారు. విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారోనన్న ఆందోళన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్టు కాగా.. జోగి రమేశ్ చుట్టూ  ఉచ్చు బిగిసింది. అయితే, పలు ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న క్రమంలోనే ఫైల్స్ మాయం లేదా దగ్ధం అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఫైల్స్ దగ్దం వెనుక అసలు కథ ఏమిటో వెలికి తీస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన చోటు చేసుకుంది.  పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చినరాముడును నియమించారు. విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలుత అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని సీనియర్‌ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె.కళాజ్యోతి, ఆఫీసు సబార్డినేట్‌ కె.రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న డిప్యూటీ తహశీల్దార్లు ఎం.కుమారి, ఎ.సత్యదేవికి నోటీసులు జారీ చేశారు.   వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మార్చేశారు. ఆ పార్టీ నాయకులు భూ పరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు అండగా నిలవడంతో నకిలీ భూ పట్టాలు పెట్టి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో పోలవరం భూ పరిహారం చెల్లింపుల్లో అక్రమాలను మాయం చేయాలని భావించి ఫైళ్ల దహనానికి పాల్పడ్డారు.  ఫైళ్ల దహనం వెనుక పలువురు వైసీపీ నేతలు, అధికారుల హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల్లో పరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూ సేకరణలో కొండ పోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి కోట్లలో పరిహారాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో పలువురు వైసీపీ నేతలు, రెవెన్యూ, ప్రాజెక్టు భూ సేకరణ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్స్ ను పరిశీలించకుండా కొందరు అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అర్హులకు అందాల్సిన పరిహారాన్ని కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండటం, మరి కొందరు అందుబాటులో లేకపోవటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను దహనం చేశారన్న వాదన  బలంగా వినిపిస్తోంది. ఫైళ్ల దహనంపై అధికారులు విచారణ జరిపి కాలినవన్నీ సంతకాలు లేని జిరాక్స్ పేపర్లు, అవి పనికిరానివని అధికారులు చెప్పడం వెనక ఏదో మతలబు ఉందన్న చర్చ జోరుగా జరుగుతుంది. అధికారుల విచారణ తీరుపై మంత్రి కందుల దుర్గేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారు? ఎవర్నయినా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫైళ్ల దగ్దం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో భూ పరిహారం అక్రమాల్లో చక్రంతిప్పిన కొందరు దళారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ తమకు పరిహారం అందలేదని, ఇప్పుడు ఫైళ్లు దహనం చేయడంతో మాకు పరిహారం అందించామని అధికారులు చెబితే మేము ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దగ్దమైన ఫైళ్లు చిత్తు కాగితాలే అని అధికారులు విచారణలో తేల్చినా.. అసలు కథ వేరే ఉందన్న వాదన స్థానికంగా బలంగా వినిపిస్తోంది. నకిలీ డీ ఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు పరిహారం సొమ్మును దోచుకున్నారని, ప్రస్తుతం ఆ వివరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఫైళ్లను దహనం చేశారని, ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ముంపు గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు.

ఏసీఏకు కొత్త టీం.. వైసీపీ హ‌యాంలో అవినీతిపై కొరడా?!

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ)ను వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న జేబు సంస్థ‌లా మార్చేసుకున్నారు. అధ్య‌క్షుడు స‌హా, మిగిలిన ప‌ద‌వుల‌న్నీ త‌న బంధుగ‌ణం, అనుచ‌రుల‌తో నింపేశారు. ఈ క్ర‌మంలో ఏసీఏలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జ‌రిగింది. కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయి. ఒక్క‌ మాట‌లో చెప్పాలంటే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏసీఏను వైసీపీ హ‌యాంలో విజ‌య‌సాయిరెడ్డి భ్రష్టుప‌ట్టించారు. జ‌గ‌న్ మెప్పుకోసం నిధుల‌ను సంస్థ‌కు సంబంధంలేని ప‌నుల‌ కోసం దారి మ‌ళ్లించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ఏసీఏపై గురి పెట్టింది. అక్క‌డ పెద్ద ఎత్తున నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని గుర్తించింది. ఏసీఏను స‌క్ర‌మ మార్గంలోకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏసీఏ పగ్గాలు కొత్త పాలక వర్గం చేతుల్లోకి వ‌చ్చాయి. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్‌)తో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి. వెంకట ప్రశాంత్‌, కార్యదర్శిగా సాన సతీష్, సంయుక్త కార్యదర్శిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్, కౌన్సిల‌ర్ గా డి. గౌరు విష్ణుతేజ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఫలితాలను అధికారికంగా వచ్చే నెల 8న ప్రకటించనున్నారు. అంత‌కు ముందు వైసీపీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి బంధువ‌ర్గంమే ఏసీఏ ప‌ద‌వుల్లో కొన‌సాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నాలుగు నెల‌ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అర‌బిందో డైరెక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్రారెడ్డి ఏసీఏ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఉపాధ్య‌క్షుడిగా రోహిత్ రెడ్డి, కార్య‌ద‌ర్శిగా గోపీనాథ్ రెడ్డి ఎన్నిక‌య్యారు. 2022 న‌వంబ‌ర్ జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఒక్కో పోస్టుకు ఒక్క‌రే నామినేష‌న్ వేయ‌డంతో మ‌ళ్లీ వారే ప‌దువుల్లో కొన‌సాగారు. ఏసీఏకు శ‌ర‌త్‌చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి పేరుకే అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్షులు.. వ్య‌వ‌హారాలన్ని మొత్తం విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. విజ‌య‌వాడ కేంద్రంగా ఏసీఏ ప‌నిచేస్తుండ‌గా..విజయ సాయిరెడ్డి మ‌నుషుల‌ చేతుల్లో వెళ్లిన త‌రువాత ఏసీఏ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని విశాఖ‌ప‌ట్ట‌ణంకు మార్చేశారు.  2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయంపాలై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఏసీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏసీఏ కార్యవర్గం రాజీనామా చేసింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికై బాధ్యతలు చేపట్టనున్న నూతన కార్యవర్గం మందు కీల‌క బాధ్య‌త‌లు ఉన్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏసీఏకి చెడ్డ‌పేరు వ‌చ్చింది. ఇష్టారీతిలో నిధుల దుర్వ‌నియోగం జ‌రిగింది. లీగ్‌ల పేరుతో పెద్దెత్తున దోచుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. బీసీసీఐ ప్ర‌తీయేటా ఏసీఏకి సుమారు రూ. 100 కోట్లు కేటాయిస్తుంది. వాటిని ఇష్టానుసారంగా ఖ‌ర్చు పెట్టారు. దీంతో నిధుల దుర్వినియోగంపై కేసులు ప‌ట‌డంతో.. అవి తేలేవ‌ర‌కు నిధుల‌ను ఉద్యోగుల జీతాలు, మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌కు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. విశాఖ‌లోని క్రికెట్ స్టేడియంలో టీ20, వ‌న్డే అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగిన స‌మ‌యంలో టికెట్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యించి క‌మిటీ స‌భ్యులు కోట్లు దండుకున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి నిధులు దోచుకునేందుకే  ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్‌, ఉమెన్ ప్రీమియ‌ర్ లీగ్ ప్ర‌వేశ‌పెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తానికి వైసీపీ ఎంపీ విజ‌యాసాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఏసీఏలో గ‌త ఐదేళ్ల‌లో  నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయ‌న్న విమర్శలు బ‌లంగా ఉంది.  వైసీపీ హ‌యాంలో ఏసీఏలో జ‌రిగిన అవినీతిపై నూత‌నంగా ఎన్నికైన క‌మిటీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ముఖ్యంగా గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఎన్ని నిధులు వ‌చ్చాయి. ఎన్ని నిధులు ఖ‌ర్చు చేశారు. ఎందు కోసం ఖ‌ర్చు చేశారు అనే విష‌యాల‌పై దృష్టి సారిస్తే  శ‌ర‌త్‌చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిలు క‌ట‌క‌టాల పాలుకావ‌డం ఖాయ‌ం అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వ‌ర్యంలో నూత‌న క‌మిటీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దిశగా చర్యలు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. 

మంత్రి ఆనం శృంగేరి శారదాపీఠ సందర్శన!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. మొదట జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. తదనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటగా దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించి రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలకు జగద్గురువుల మార్గదర్శకాలను, ఆశీరనుగ్రహాన్ని పొందటానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రార్థనాసందేశాన్ని కుడా విన్నవించటానికి తాము వచ్చినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు స్వామివారికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు మార్గదర్శకత్వము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, ధర్మ బద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా సత్పరిపాలన అందించటానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. 2018వ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయయాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడు కుడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తమను సందర్శించినట్టు, తరువాత ముఖ్యమంత్రి గారిని ఆయన నివాసంలో తాము కుడా సందర్శించి ఆశీర్వదించినట్టు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ ఐఏఎస్, శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు, తిరుమల వేదపాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, శ్రీశైలం దేవస్థాన వేదపండితులు గంటి రాధాకృష్ణమూర్తి తదితరులు ఈ సందర్భంగా జగద్గురువులను సందర్శించుకున్నారు.

బూమ్ బూమ్ వాసుదేవరెడ్డి అరెస్టు

ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వాసుదేవరెడ్డి ప్రస్తుతం సీఐడీ అదుపులో వున్నారు. జగన్ రాక్షస పాలనలో భారీ స్థాయిలో జరిగిన మద్యం కుంభకోణంలో వాసుదేవ రెడ్డి కీలక పాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ఒక అజ్ఞాత ప్రాంతంలో వాసుదేవ రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జే’ బ్రాండ్ మద్యం ప్రవాహానికి ముఖ్య కారకుడు వాసుదేవరెడ్డి. ఈ స్కామ్‌లో వాసుదేవరెడ్డి మీద భారీ స్థాయిలో అభియోగాలు వచ్చాయి. జగన్ అధికారంలోకి రాగానే డిప్యూటేషన్‌పై వాసుదేవ రెడ్డిని రప్పించిన జగన్ ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ ఎండీ బాధ్యతలు తద్వారా మద్యం సేల్స్ బాధ్యతలు అప్పగించారు. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై వాసుదేవ రెడ్డిదే అజమాయిషీ. జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. వైసీపీ దోపిడీకి కర్త, కర్మ, క్రియ వాసుదేవరెడ్డి. కేసులు వెంటాడడంతో 2 నెలలకుపైగా వాసుదేవరెడ్డి పరారీలో వున్నారు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. వాసుదేవరెడ్డి ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించిన సీఐడీ పోలీసులకు అనేక కీలక ఆధారాలు దొరికాయి.

తెలంగాణ బీజేపీ.. ఈటల వర్సెస్ బండి!

తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నా.. వర్గ పోరు కారణంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు అన్న చందంగానే తయారైంది. ముఖ్యంగా పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు అధిష్ఠానాన్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతవారిని సముదాయించలేక, కొత్తవారిని నియంత్రించలేక కమలం అధిష్ఠానం తలలు పట్టుకుంటోంది. ఆ కారణంగానే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి రెండు నెలలు దాటినా ఇంత వరకూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమౌతోంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ, రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టం అనీ, రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామనీ బీజేపీ హైకమాండ్ చెప్పిన మాట ఇప్పటికీ ఆచరణలోకి రాకపోవడానికి పార్టీలో అంతర్గత విభేదాలే కారణం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ముందున్న ఈటల రాజేందర్ కు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడు తున్నారని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. ఈటల రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని ఒక్క బండి సంజ య్ మాత్రమే కాదు.. బీజేపీలోని కోర్ హిందూవాదులు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లాంటి సంస్థలు కూడా వ్యతి రేకిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సరిగ్గా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అనూహ్యంగా బండి సంజయ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి కారణం ఈటల రాజేందర అన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇదే విషయాన్ని బండి సంజయ్ సహా తొలి నుంచీ బీజేపీలో ఉన్న నేతలు నమ్ముతున్నారు.  బండి అభిమానులు,   బీజేపీ కార్యకర్తలు, రాష్ట్రంలోని హిందూ వాదులు కూడా ఈటల కారణంగానే బండిని పార్టీ హైకమాండ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిందని భావిస్తున్నాయి. అప్పట్లో బండి వారసుడు ఈటలే అన్న వార్తలు కూడా గట్టిగా వినిపించినా బీజేపీ అధిష్ఠానం మధ్యే మార్గంగా కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. దీంతో ఇప్పుడు ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్  సంజయ్  అడ్డంపడుతున్నట్టు తెలుస్తోంది. ఈటలకు రివెంజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు బండి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఈ ఇరువురి మధ్యా సయోధ్య కుదిర్చి ఈటలకు పదవి కట్టబెట్టడం ఎలా అని హైకమాండ్ తల పట్టుకుంటోంది. పరిస్థితి కరవమంటే కప్పకు కోపం... వదల మంటే పాముకు కోసం అన్నట్లుగా మారింది. ఈటలకు పదవి ఇస్తే బండి నొచ్చుకుంటాడు.. ఆయనతో పాటు కార్యకర్తలూ కాడె వదిలేస్తారు.  ఈటలను పక్కన పెడతామంటే ఆయన బీజేపీనే వదిలేస్తారని పార్టీ హైకమాండ్ భయపడుతోంది.  ఎందుకంటే ఈటల సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేత.. ఆయన అలిగి పార్టీ మారితే ఒక్కడిగా కాకుండా కొందరు తన వర్గం ఎమ్మెల్యేలనూ కూడా తన వెంట తీసుకుపోయే అవకాశం ఉంది. అలా ఈటల తనవర్గంతో కాంగ్రెస్ గూటికి చేరితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆ భయం తోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో   బీజేపీ హైకమాండ్  ఎటూ తేల్చుకోలేక పోతోంది.   ఈటల రాజేందర్, బండి సంజయ్ ఈ ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు.అంతే కాదు ఇద్దరిదీ భిన్నమైన రాజకీయ నేపథ్యం.   బండి సంజయ్ ది హిందుత్వ అజెండా. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ లలో చురుకుగా పని చేసిన నాయకుడు.  బీజేపీ కి క్రమశిక్షణ గల కార్యకర్త. బండికి ఉన్న ఫాలోయింగ్ ఓ జిల్లాకో, నియోజకవర్గానికో పరిమితం కాదు.   ఈటల విషయానికి వస్తే ఆయన రాజకీయ నేపథ్యం పూర్తిగా భిన్నమైనది. బీజేపీని గట్టిగా వ్యతిరేకించి, ఆ పార్టీ సిద్ధాంతాలను ఇసుమంతైనా నమ్మని కమ్యూనిస్టు భావజాలం ఈటలది. వాస్తవానికి  ఈటల రాజేందర్‌‌ బీఆర్ఎస్ ను వీడిన సమయంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరుతారనే అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆ కారణంగానే ఆయనకు రాష్ట్ర బీజేపీ కోర్ లీడర్స్ తో అంతగా పొసగడం లేదు.   తొలి నుంచీ బీజేపీలో ఉన్న పాతతరం నాయకులెవరూ ఈటలకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించవద్దనే అధిష్ఠానానికి చెబుతున్నారు. ఆయన నాయకత్వాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంగా చెబుతున్నారు.  ఈటలకు పార్టీ పగ్గాలు ఇస్తే రాజకీయంగా బీజేపీకి జరిగే మేలు కంటే పార్టీ సిద్ధాంతానికి జరిగే నష్టమే ఎక్కువ అని అంటున్నారు.  ఈ కారణంతోనే బండి సంజయ్ ద్వారా ఢిల్లీ స్థాయిలో ఈటలకు పదవి దక్కకుండా లాబియింగ్ చేస్తున్నారు. ఈ ఒత్తిడికి లొంగి బీజేపీ హై కమాండ్  ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీ వీడటం ఖాయం. అదే జరిగితే బలమైన సామాజిక వర్గం బీజేపీకి దూరం అవుతుంది. తెలంగాణలో మరింత బలోపేతమై భవిష్యత్ లో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ లక్ష్యానికి గండి పడుతుంది. పోనీ ఈటలకు అధ్యక్ష పదవి ఇద్దామా అంటే సొంత పార్టీలోనే అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటుంది. ఈ కారణంగానే బీజేపీ అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పును వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. 

కేసీఆర్‌కి తీవ్ర అస్వస్థత..!

కేసీఆర్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్, గత 12 రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని ఫామ్‌హౌస్‌లోనే వున్నారు. యశోద హాస్పిటల్ బృందం ఫామ్‌హౌస్‌లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్‌ నెలకొల్పి కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్‌కి అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు నాలుగు రోజుల క్రితం ప్రత్యేక అంబులెన్స్.లో ఫాంహౌస్‌కి తీసుకువచ్చారు. తనని ఆస్పత్రిలో చేర్చితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకుంటుందని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులను కేసీఆర్ వారించినట్టు సమాచారం. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోకసభలో సున్నా స్థానాలు రావడం, ఐదు నెలలుగా కూతురు కవిత తీహార్ జైల్లో ఉండడం, కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనలతో కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందారని తెలుస్తోంది. పార్టీని నడిపించే శక్తి లేని కేటీఆర్, తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు...  దాంతో పార్టీనీ నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో వున్నాయి. కేసీఆర్ అస్వస్థత విషయం ముఖ్యంగా ఎమ్మెల్యేలకి విషయం తెలియకూడదని, తెలిస్తే వాళ్ళు పార్టీ మారిపోయే ప్రమాదం వుందని ఎమ్మెల్యేలని విదేశీ పర్యటనకి తీసుకువెళ్లారని సమాచారం. కేసీఆర్ తీవ్ర అస్వస్థత విషయం తెలిసిన కొందరు నాయకులు , హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కోల్‌కతా దారుణం.. నారా లోకేష్ ఖండన!

కోల్‌కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఈ దారుణం తలుచుకుంటే మాటలు రావడం లేదని ఎమోషనల్ అయ్యారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఆ న్యాయం వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు. భారత మహిళల భద్రత, గౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉందాం. ఇది అందరి పోరాటం అని సోషల్ మీడియా వేదికగా లోకేష్ పిలుపునిచ్చారు. కాగా, కోల్‌కతాలో  వైద్యురాలిపై అమానుషంగా సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హత్యచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా అందరూ స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను నిలదీయండి: స్పీకర్ అయ్యన్న 

ఏపీ స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని కోరారు. ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే త‌ప్ప‌కుండా వారికి మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. ఇక జగన్‌ ప్రతిపక్ష హోదాపై చట్టపరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరించ‌డం జ‌రుగుతుంద‌ని ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్ తెలియజేశారు. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాజకీయ విలువలు, ప్రజా సేవ, సామాజిక బాధ్యతపై వారికి అవగాహన కల్పిస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్ర‌భుత్వం రావ‌డంతో తిరిగి మంచి రోజులు వచ్చాయన్నారు. గత ఐదేళ్ల పాల‌న‌లో రాష్ట్రం తీవ్రంగా న‌ష్టపోయింద‌ని, వ‌చ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్య‌న్నపాత్రుడు తెలిపారు.   సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సభ్యులు మాట్లాడాలన్నారు.అసెంబ్లీలో ప్రతి అంశంపై చర్చ జరగాలని..అప్పుడే ప్రజలకు అవగాహన వస్తుందని పేర్కొన్నారు. ఏ పార్టీకైనా నేను చెప్పదలుచుకున్న విషయం ఒక్కటే. అసెంబ్లీలో సభా సంప్రదాయాలను పాటించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలి అని అయ్యన్న పాత్రుడు కోరారు. 

వాడు నీవాడే.. కాదు నీవాడే..!

బీఆర్ఎస్ పార్టీకి ఇంత నీచ నికృష్టమైన రోజులు వస్తాయని కేసీఆర్ ఏనాడూ ఊహించి వుండరు. కేసీఆర్ వరకూ ఎందుకూ.. బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఊహించి వుండరు. ఎందుకంటే, బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోవడం కంటే ఇంకా ఎక్కువగానే నాశనమైపోయింది. ఎంతగా నాశనమైపోయిందంటే, కొనేవాళ్ళ కోసం ఎదురుచూస్తున్న అంగట్లో సరుకు మాదిరిగా అయిపోయింది. మార్కెట్లో వున్న ‘బీఆర్ఎస్’ అనే ఈ సరుకు నీదే.. కాదు నీదే అని కాంగ్రెస్, బీజేపీ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాయి. ‘దసరాబుల్లోడు’ సినిమాలో వాణిశ్రీ, చంద్రకళ ‘‘వాడు నీవాడే.. వాడు వాడు నీవాడే’’ అని పాడుకుంటుంటే, మధ్యలో ఏం చెప్పాలో అర్థంకాకుండా వున్న అక్కినేని నాగేశ్వరరావులా బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోయింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ‘బీఆర్ఎస్’ మీ పార్టీలోనే కలసిపోతోంది అని ఆరోపించుకుంటూ వుంటే, మధ్యలో వున్న బీఆర్ఎస్ నేను ఏ పార్టీలోనూ కలవను అని చెప్పలేక బిక్కముఖం వేసుకుని దిక్కులు చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా ఆయన మరింత లోతుగా సమాచారాన్ని ఇచ్చారు. ఆయన చెప్పినదాని ప్రకారం, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. ఆ సందర్భంగా బీజేపీ కొన్ని కానుకలు ఇవ్వబోతోంది. కేసీఆర్‌కి గవర్నర్ పదవి, కేటీఆర్‌కి కేంద్రమంత్రి పదవి ఇస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవితకు ఆ కేసు నుంచి విముక్తి కల్పించడంతోపాటు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారు. అలాగే హరీష్‌రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఇలా అకౌంట్ సెటిల్ చేస్తారు.  రేవంత్ రెడ్డి  చెబుతున్నది ఇలా వుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతున్న ఇన్ఫర్మేషన్ మరోలా వుంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం... బీఆర్ఎస్ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవబోతోంది. అప్పుడు కేసీఆర్‌కి ఏఐసీసీలో సభ్యత్వం ఇస్తారు. కేటీఆర్‌కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు. కవితకి ఎంపీ పదవి ఇస్తారు...  బీఆర్ఎస్‌ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఈ రకంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నా బీఆర్ఎస్ నాయకులు మాత్రం అవునూ, కాదూ అనడం లేదు. అంటే, బీఆర్ఎస్ ఏ పార్టీలో అయినా విలీనం కావడానికి సిద్ధంగా వుందనే సంకేతాలు వస్తున్నాయి. ఏ పార్టీ ఆఫర్ చేసే ప్యాకేజ్ బాగుంటే అందులోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్టు భావించాల్సివస్తోంది.

హిందుపురంలో తెలుగుదేశం జోరు.. మునిసిపాలిటీ వైసీపీ చేజారు!

అధికారం కోల్పోయిన తరువాత ఎక్కడికక్కడ వైసీపీ ఉనికి మాత్రంగా మిగులుతోంది. పార్టీ ఓటమి తరువాత ఒక్కరొక్కరుగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకొంత మంది జగన్ కు ఓ దండం, ఆయన పార్టీకి ఇంకో దండం అని చెప్పి రాజకీయాలకే దూరం అయ్యారు. అలాగే ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను కోల్పోయిన వైసీపీ రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలలో కూడా గట్టి ఎదురు దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కుప్పంలో బలం కోల్పోయిన జగన్ పార్టీ, మాచర్లలో కూడా మటాష్ అయిపోయింది.  తాజాగా అహిందుపురంలోనూ పట్టు కోల్పోయింది.   బాలకృష్ణ సొంత నియోజకవర్గం అయిన  హిందూపురంలో  వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. బాలకృష్ణ సమక్షంలో వీరంతా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.   హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ, ఎంఐఎం తరపున ఒక్కొక్కరు గెలుపొందారు. వీరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఇద్దరు వైసీపీ, ఒక ఎంఐఎం కౌన్సిలర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు మరో 9 మంది చేరడంతో హిందూపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం బలం 19కి చేరింది. మరో కౌన్సిలర్ కూడా వైసీపీ గోడ దూకేస్తే హిందుపురం మునిసిపాలిటీ తెలుగుశం వశం అవుతుంది. అలా గోడ దూకి తెలుగుదేశం గూటికి చేరడానికి ఇంకా పలువురు కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ పచ్చ జెండా ఊపిన మరు క్షణం వారంతా తెలుగుదేశంలో చేరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూసినా ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కూడా కలుపుకుంటే హిందుపురంలో తెలుగుదేశం పార్టీ బలం ఇప్పటికే 21కి చేరింది. దీంతో  హిందుపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరడం లాంఛనమే అని చెప్పొచ్చు. 

 హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ

సీజన్ కాని సీజన్ లోనే వర్షం తన ప్రతాపం చూపిస్తుంది. ఇక తనకంటూ రాసిపెట్టి ఉన్న సీజన్ ఇది. ఇక విజృభించడమే పనిగా పెట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.  హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.  శుక్రవారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  హైదరాబాద్ లోని సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, బోయినపల్లి, బేగంపేట, చిలకలగూడ, మారేడుమిల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి, మేడ్చల్, బాలానగర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో.. అలానే కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. సనత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్‌, షాపూర్‌, జగద్గిరిగుట్ట, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, సుచిత్ర ఏరియాల్లో భారీగా వాన కురుస్తోంది. కోఠి, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌, బషీర్‌ బాగ్‌, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్‌, హిమాయత్‌ నగర్‌, చిక్కడపల్లి, నారాయణ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు డ్రైనేజీలు పొంగుతున్నాయి. మురికి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఖాజాగూడ సిగ్నల్, బయోడైవర్సిటీ సిగ్నల్, ఐకియా సిగ్నల్, మల్కం చెరువు, గచ్చిబౌలి ప్రధాన రహదారుల మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అయితే  హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి కూడా కుండపోత వర్షం కురుస్తుందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వర్షాలు పడతాయని.. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాల కారణంగా ప్రమాదం సంభవిస్తే సహాయం కోసం 040 211 11 111 నంబర్ కి ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని గంటల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

యుపిలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ ప్రెస్ 

యూపీలో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్‌పై బండరాయి పెట్టడంతో గమనించని లోకో పైలెట్‌ రాయిని బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపునకు ఒరిగాయి. ఈ అనుకోని దుర్ఘటనలో చాలా మంది ప్రయాణికులకు స్వల్వగాయలైనట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని

ఆంధ్ర  క్రికెట్ అసోసియేషన్  కు వైసీపీ నుంచి, ఆ పార్టీ ఎంపీ విజయసాయి కబంధ హస్తాల నుంచీ పూర్తిగా విముక్తి లభించింది. గత ఐదేళ్లుగా   ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ వైసీపీ ప్రభుత్వ కనుసన్ననలో నడిచింది.  వైసీపీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి   కుటుంబ సభ్యులు ఏసీఏను చేజిక్కించుకుని ఐదేండ్ల పాటు ఇష్టారాజ్యంగా వ్యవహించారు.  అయితే ఇటీవలి ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఏసీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏసీఏ కార్యవర్గం రాజీనామా చేసింది. దీంతో సెప్టెంబర్ 8న ఏసీఏకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు విశాఖలో శుక్రవారం (ఆగస్టు 16) జరిగిన నామినేషన్ల పర్వంలో ఆంధ్రా క్రికెట్ సోసియేషన్ ఒక్కొ పదవికి ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. అయితే ఫలితాలను అధికారికంగా వచ్చే నెల 8న ప్రకటించనున్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి. వెంకట ప్రసాద్, కార్యదర్శిగా సాన సతీష్, సంయుక్త కార్యదర్శిగా విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా సమయం మార్పు 

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాన్ని మార్చినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. గతంలో నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందుగానే నిర్వహించనుంది.తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ తాజా మార్పు ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.రేపటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్స్‌తో పాటు శాంపిల్ ఆన్సర్ బుక్ లెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా... మెయిన్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 1 పరీక్షలకు నాలుగు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌కు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత నెలలో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 31 వేల మందికి పైగా అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు.

పారిపోండిరోయ్‌.. రెడ్‌బుక్ ఓపెనవుతోంది !

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏపీలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌జ‌లు, వ్యాపారులు ధైర్యంగా త‌మ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు. బెదిరింపులు, అక్ర‌మ అరెస్టులు, పోలీసుల అర్ధరాత్రి దాడులు, గోడలు దూకి, తలుపులు పగులగొట్టి తీసుకువెళ్లడాలు  క‌నుమ‌రుగ‌య్యాయి. పాల‌నా ప‌రంగా అపార అనుభ‌వం క‌లిగిన సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ఏపీ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది.  రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఊపందుకోనున్నాయి. మ‌రోవైపు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ అమ‌లు పైనా ప్ర‌భుత్వం దృష్టిసారించింది. ఇప్ప‌టికే కొన్ని ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోన్న ప్ర‌భుత్వం..  తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించింది. ఒక‌ ప‌క్క రాష్ట్ర  అభివృద్ధిపై దృష్టిపెడుతూనే.. మ‌రోప‌క్క గ‌త వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ు, దౌర్జ‌న్యాలు, భూక‌బ్జాల‌కు పాల్ప‌డిన వైసీపీ నేత‌లు, వారికి స‌హ‌క‌రించిన అధికారుల‌పై చంద్ర‌బాబు కొర‌డా ఝుళిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు అయ్యాయి,  అరెస్టులు కూడా జ‌రిగాయి. త్వ‌ర‌లో మంత్రి నారా లోకేశ్ కూడా రంగంలోకి దిగ‌నున్నట్లు తెలుస్తోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న రెడ్ బుక్ లో చ‌ట్టం ప‌రిధి దాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, అధికారుల పేర్ల‌ను న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం లోకేశ్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయ‌బోన్నారు‌. దీంతో వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లు, కొంద‌రు అధికారులు విదేశాల‌కు పారిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.   రెడ్‌ బుక్ పేరు వింటే వైసీపీ నేత‌లు, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంలో తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై పెద్ద ఎత్తున వైసీపీ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌లు ప్రాంతాల్లో తెలుగుదేశం జెండా క‌ట్టిన నేత‌ల‌ను హ‌త్య‌లు సైతం చేశారు. పోలీసుల‌కు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. దీంతో ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో తెలుగుదేశం జెండా ప‌ట్టుకునేందుకు ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి తోడు పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల భూముల‌ను ఆక్ర‌మించ‌డం, ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం వంటి దారుణాలు జగన్ హ‌యాంలో నిత్య‌కృత్యంగా కొన‌సాగాయి. దీంతో ప్ర‌జలు సైతం వైసీపీ నేత‌ల‌కు ఎదురు నిల‌బ‌డే సాహ‌సం చేయ‌లేక పోయారు. అప్ప‌ట్లో నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌నూ అడ్డుకునేందుకు జగన్ ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది. ప్ర‌భుత్వ  కుట్ర‌ల‌ను ఎదుర్కొని లోకేశ్ పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ఈ పాద‌యాత్ర ప్రారంభం నుంచే వైసీపీ ప్ర‌భుత్వంలో చ‌ట్టానికి విరుద్దంగా న‌డుచుకున్న నేత‌లు, అధికారుల పేర్ల‌ను లోకేశ్ రెడ్‌బుక్‌లో రాయ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల్లో చివ‌రి ప్ర‌చార స‌భ వ‌ర‌కు లోకేశ్‌ రెడ్ బుక్ మెయింటెన్ చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత రెడ్ బుక్ లో పేర్లు ఉన్న   వైసీపీ నేత‌లు, అధికారుల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని, చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని లోకేశ్ ప్ర‌తీ స‌భ‌లో చెబుతూ వ‌చ్చారు. అప్పట్లో లోకేశ్ రెడ్ బుక్ ను లైట్ గా తీసుకున్నవారు.. ఇప్పుడు రెడ్ బుక్ అంటేనే వ‌ణికిపోతున్నారు.  కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రం అభివృద్ధిప‌థంలో దూసుకెళ్తున్నది. మ‌రోవైపు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు, భూక‌బ్జాల‌కు, చ‌ట్టం ప‌రిధిదాటి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌ల‌పైనా, వారికి స‌హ‌క‌రించిన అధికారుల‌పైనా కొర‌ఢా ఝుళిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అవినీతిపై విచార‌ణ  సాగుతోంది. మాజీ మంత్రి ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రేష‌న్ బియ్యం దందాపైనా విచార‌ణ జ‌రుగుతోంది. అంతేకాదు.. దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, ర‌ఘురాం త‌దిత‌రులపై తెలుగుదేశం ప్ర‌ధాన కార్యాల‌యంపై దాడికి సంబంధించి కేసులు న‌మోదు కాగా.. బెయిల్ కోసం కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. అగ్రిగోల్ట్ భూముల వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి జోగి ర‌మేశ్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్టు అయ్యారు. అదే కేసులో జోగి ర‌మేశ్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పులివ‌ర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కుమారుడిపై విచార‌ణ జ‌రుగుతుంది. ఇలా చాలా మందిపై కేసులు ఉన్నాయి. అయితే, ప్ర‌తీకేసు క‌క్ష‌ సాధింపు అంటూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌గ్గోలు పెడుతున్నారు. లోకేశ్‌ రెడ్ బుక్ ప్ర‌కార‌మే ఇదంతా జ‌రుగుతుందంటూ ఢిల్లీ ధ‌ర్నాలోనూ గ‌గ్గోలు పెట్టారు. కానీ, రెడ్ బుక్ ఇంకా తెరుచుకోలేద‌ని లోకేశ్, టీడీపీ నేత‌లు ప‌లు సంద‌ర్భాల్లో చెబుతూ వ‌చ్చారు.  రెడ్ బుక్‌పై తాజాగా మంత్రి లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుంటూరు జిల్లాలో అన్న క్యాంటిన్ ప్రారంభం త‌రువాత లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ గురించి ప్ర‌స్తావించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఊళ్లో రెడ్‌ బుక్‌ మీద ప్రజలకు తాను హామీ ఇచ్చానని అన్నారు. ప్రజలకు ఎర్ర బుక్ చూపించి ప్రతి తప్పుపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చానని, ఆ మాటల్ని ఎన్నికల్లో ప్రజలు నమ్మారని, రెడ్‌ బుక్‌ మ్యాండేట్ ఖచ్చితంగా అమలు చేస్తామని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో త్వ‌ర‌లో రెడ్ బుక్ తెరుచుకోబోతుంద‌ని లోకేశ్ చెప్ప‌క‌నే చెప్పారు. లోకేశ్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ హ‌యాంలో చ‌ట్టానికి విరుద్దంగా వ్య‌వ‌హ‌రించిన వైసీపీ నేత‌లు, అధికారులు వ‌ణికిపోతున్నారు‌. దీంతో రెడ్ బుక్ తెరుచుకోక ముందే దేశం వ‌దిలి పారిపోయేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు, అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

‘మార్గదర్శి’పై నిందవేసిన ‘ముష్టి’ అరెస్ట్!

మార్గదర్శి లాంటి మచ్చలేని సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసిన లాయర్ ముష్టి శ్రీనివాసరావు ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నాడు. రామోజీరావును వేధించడం కోసం జగన్ విజయవాడకు చెందిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావును ఒక పావులా వాడుకున్నాడు. రామోజీరావు మీద, మార్గదర్శి మీద ఈ ‘ముష్టి’ కేసు పెట్టినప్పుడు ఇతనికి అప్పట్లో భారీ స్థాయిలో గౌరవ మర్యాదలు లభించాయి. లేటెస్ట్.గా ఆయన తన ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ రాక్షస ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాంతి రాణా టాటా ఈ ‘అ’న్యాయవాదికి అతి మర్యాదలు చేసేవారు. ఆయన వస్తుంటే.. లేచి నిలబడి మరీ వినయాన్ని ప్రదర్శించేవారు. మార్గదర్శి చిట్స్ మీద చేసిన తీవ్ర ఆరోపణల్లో ఈ న్యాయవాది కీరోల్ ప్లే చేసేవాడు. ప్రెస్‌మీట్లు పెట్టేవాడు. అది కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్‌తో కలిసి. అలాంటి లాయర్ తన ఇంట్లోనే పేకాట క్లబ్ ఏర్పాటు చేసుకోవడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ దాడిలో ‘ముష్టి’తోపాటు జూదం ఆడుతున్న మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొదట పారిపోయిన ముష్టి శ్రీనివాసరావు ఆ తర్వాత తానే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.  ముష్టి శ్రీనివాసరావు మార్గదర్శిలో చేరి, చిట్ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. చిట్ పాడుకున్న తర్వాత డబ్బు పొందడానికి అవసరమైన ష్యూరిటీలు సమర్పించలేదు. అందువల్ల మార్గదర్శి అతనికి డబ్బు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాను చిట్టీ పాడితే మార్గదర్శి డబ్బులు ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లైంట్ కాపీని పట్టుకొని మార్గదర్శి మీద కేసు నమోదు చేయడంతో పాటు.. అతడ్ని పక్కన పెట్టుకొని విజయవాడ సీపీ ప్రెస్ మీట్ పెట్టటమే కాదు.. అతను ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు లేచి నిలబడి.. సాదరంగా ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకున్న వైనాన్ని జనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రామోజీరావు లాంటి పెద్దమనిషి చికిత్స తీసుకుంటునప్పుడు పోలీసులు వేధించడానికి కారణమైన ఈ వ్యక్తికి ఇంకా శాస్తి జరగాల్సి వుందని అనుకుంటున్నారు.